[dropcap]‘రా[/dropcap]మకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.
***
సోదర ప్రేమ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేవారు దశరథ నందనులు. తండ్రి పినతల్లికి ఇచ్చిన మాట నిలబెట్టటం కోసం రాజ్యాధికారాన్ని, అంతఃపుర భోగాలను తృణప్రాయంగా వదిలేసి అడవులకు వెళ్ళాడు శ్రీరాముడు. అడవులకు వెళ్ళాలని కైక కోరింది రాముడిని మాత్రమే! లక్ష్మణుడికి అడవులలో కష్టాలు పడాల్సిన అవసరం లేదు. కానీ అన్న వెంటే వెళ్ళాడు. తండ్రికి సాపత్న్య దోషం (పెద్దవాడు ఉండగా చిన్నవాడికి రాజ్యాధికారం అప్పగించటం) అంటకుండా అన్న ప్రతినిధిగా రాజ్యం చేసాడు భరతుడు. జనావాసంలో ఉన్నా రాజ్యభోగాలు వద్దనుకుని జటావల్కలాలు ధరించి పద్నాలుగు ఏళ్ళు గడిపారు భరత శత్రుఘ్నులు. ఈ నలుగురి ధర్మపత్నులు కూడా భర్తలు నడిచిన దారిలోనే నడిచి, అందరూ మానవజాతికి ఆదర్శనీయులుగా నిలిచిపోయారు. కనుకనే వేల సంవత్సరాలు గడిచిపోయినా వారిని మనం ఇంకా తలచుకుంటూనే ఉన్నాం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే!
కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది వారి గురించి కాదు. ఆ స్థాయిలో కాకపోయినా ఉన్నతమైన భ్రాతృప్రేమ అనిపించే మరో ఇద్దరు సోదరుల గురించి. వారు సంపాతి, జటాయువులు, పక్షిరాజులు.
***
కశ్యప ప్రజాపతి భార్యలు కద్రువ, వినతలు. వినతకు ఇద్దరు కుమారులు అరుణుడు, గరుత్మంతుడు. అరుణుడు సూర్యుడికి రథసారథిగా ఉన్నాడు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువు వాహనంగా అయ్యాడు. అరుణుడికి ఇద్దరు కొడుకులు. వారు సంపాతి, జటాయువు.
ఒకసారి అన్నదమ్ములు సంపాతి, జటాయువులు ఇద్దరూ సూర్యుడు అస్తాద్రి చేరుకునే లోపు ఆయన దగ్గరకు వెళ్లి, తిరిగి రావాలని పందెం వేసుకున్నారు. ఇద్దరూ ఒకేసారి పైకి ఎగిరారు. భూమి పైన ఏడు మార్గాలు ఉన్నాయి. ధాన్యాలను తిని జీవించే పక్షులు పావురాలు వంటివి భూమికి కొంత ఎత్తు వరకే ఎగరగలవు. అది మొదటి మార్గం. కాకులు, ఇతర పండ్లను తినే పక్షులు మరికొంత ఎత్తు వరకు ఎగరగలవు. అది రెండవమార్గం. నీటి కాకులు, లకుముకి పిట్టలు, క్రౌంచ పక్షులు అంతకంటే ఎత్తున గల మూడవ మార్గం వరకు ఎగరగలవు.
దానిపైన గలది నాలుగవ మార్గం. డేగలు వంటివి నాలుగవ మార్గం వరకు ఎగరగలవు. అంతకంటే ఎత్తున ఉన్న ఐదవ మార్గంలో గ్రద్దలు ఎగరగలవు. చక్కని రూపాలతో, యౌవనంతో విలసిల్లే హంసలు ఆపైన గల ఆరవ మార్గంలో ఎగరగలవు. వినతాసుతులైన గరుత్మంతుడు, అరుణుడు అంతకంటే ఎత్తున గల ఆకాశమార్గంలో (ఏడవమార్గంలో) సంచరించగలరు (తర్వాత కాలంలో శాస్త్రజ్ఞులు భూమి పైన ఉష్ణోగ్రతను బట్టి పరిశోధనలు చేసి ట్రోపో స్పియర్, స్ట్రాటో స్పియర్, మీసో స్పియర్, ధర్మో స్పియర్, ఎక్సో స్పియర్ అనే ఆరు మార్గాలు ఉంటాయని చెప్పారు. బహుశా సూర్య భగవానుడి ప్రచండ ఓజస్సు భరించే శక్తి మానవ నిర్మిత ఉపగ్రహాలకు లేదేమో ఏడో మార్గం గురించి చెప్పలేదు. కానీ వాల్మీకి వంటి మహర్షులు తమ తపోశక్తితో ఇవన్నీ ఏనాడో చెప్పారు).
కొంతదూరం ఎగిరిన తర్వాత సంపాతి కిందికి చూసాడు. భూమి మీద అడవులు అన్నీ పచ్చిక బయళ్ళ లాగా, కొండలన్నీ గులకరాళ్ల లాగా, నదులన్నీ సన్నటి తాళ్ళు లాగా కనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఇంకా పైకి ఎగిరాడు. అప్పటికి ఆరవ మార్గం వరకు వెళ్ళాడు. మధ్యాహ్న సమయం అయింది. సూర్యతాపానికి శరీరం చెమర్చినది. కళ్ళు బైర్లు కమ్మాయి. దిక్కులు తెలియలేదు. మనోదృష్టులను కేంద్రీకరించి సూర్యుడి వైపు చూసాడు. సూర్యుడు భూమండలం అంత ప్రమాణంలో కనిపించాడు.
జటాయువు ఎక్కడున్నాడా అన్నట్లు చుట్టూ చూసాడు సంపాతి. జటాయువు గింగిరాలు తిరుగుతూ భూమి మీదకు జారిపోవటం కనిపించింది. “అయ్యో! తన తమ్ముడు సూర్యతాపం భరించలేక పడిపోతున్నాడు. బాల్య చాపల్యం చేత పందెం కాశాడే అనుకో! తనెందుకు అంగీకరించాడు? తానే ఈ ఉష్ణం భరించలేక పోతున్నాడు. పాపం! పసివాడు ఎలా భరించగలడు?” సంపాతిలో భాతృప్రేమ పెల్లుబికింది. ఒక్క ఉదుటన కిందికి దిగి తమ్ముడి మీద ఎండ పడకుండా రెక్కలతో కప్పి వేశాడు. అప్పటికే అతడి శరీరం కూడా వశం తప్పి పోతుంది. రెక్కలు మాడిపోతున్నట్లుగా ఉన్నాయి. కళ్ళముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇద్దరూ భూమి మీద చెరొక పక్కన పడిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో సంపాతికి తెలియలేదు. స్పృహ కోల్పోయాడు.
***
గోదావరి నదీ తీరంలో గల పంచవటి ప్రదేశం. ఆ ప్రదేశంలో కందమూలాలు, ఫలాలు సమృద్ధిగా లభిస్తాయనీ, అక్కడ చెట్లు ఎల్లవేళలా పుష్ప శోభలతో విలసిల్లుతూ ఉంటాయనీ అక్కడ కుటీరం నిర్మించుకుని సుఖంగా ఉండవచ్చని అగస్త్య మహాముని శ్రీరాముడికి చెప్పాడు. ఆయన సూచన ప్రకారం సీతారామ లక్ష్మణులు పంచవటికి ప్రయాణమయ్యారు. ఆ ప్రదేశం సమీపిస్తుండగా ఒక పెద్ద వటవృక్షం మీద జటాయువు కుర్చుని ఉన్నాడు. అన్నతో పందెం వేసుకుని, ఆకాశానికి ఎగిరిన తర్వాత సూర్యతాపానికి కళ్ళు బైర్లు కమ్మి దండకారణ్యంలో పడిపోయాడు. అప్పటి నుంచీ ఇక్కడే ఉండిపోయాడు.
రాముడిని చూడగానే కిందికి దిగివచ్చాడు. అతడిని పక్షి ఆకారం దాల్చిన రాక్షసుడేమో అనుకుని “ఎవరు నువ్వు?” అని అడిగాడు రాముడు.
జటాయువు మృదువైన స్వరంతో “నేను మీ తండ్రి దశరథ మాహారాజు ప్రియమిత్రుడిని.” అన్నాడు.
రాముడి మొహంలో కోపం స్థానంలో గౌరవం కనిపించింది. “మీరు మా తండ్రిగారి మిత్రులా? ఈమె నా భార్య సీత. ఇతడు నా సోదరుడు లక్ష్మణుడు. సోదర, సతీసమేతంగా నమస్కరిస్తున్నాను” అన్నాడు చేతులు మోడ్చి. సీతా లక్ష్మణులు కూడా నమస్కరించారు.
“మీ పేరు ఏమిటి? మీ వంశం ఏమిటి? మీరు ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి? దయచేసి తెలియజేయండి” అడిగాడు రాముడు.
“నా పేరు జటాయువు. మా అన్న అయిన సంపాతి, నేను వినతాత్మజుడైన అనూరుడి కుమారులము (ఊరువులు లేకుండా పుట్టటం వలన అరుణుడికి అనూరుడు అనే పేరు). మా తల్లి పేరు శ్యేని (అరుణుడి తాతగారైన కశ్యపుడి అరవై మంది భార్యలలో శ్యేని అనే ఆమె కూడా ఉన్నది. కానీ ఆమె వేరు, జటాయువు తల్లి శ్యేని వేరు). ఇది దట్టమైన కీకారణ్యం. క్రూర మృగాలు, క్రూర రాక్షసులు ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటారు. నీవు అంగీకరిస్తే మీరిద్దరూ కుటీరానికి దూరంగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షిస్తూ ఉంటాను.” అన్నాడు.
“అంతకన్నా మాకు కావలసింది ఏముంది?” అంటూ రాముడు జటాయువును కౌగలించుకున్నాడు.
అక్కడికి సమీపంలోనే లక్ష్మణుడు దృఢమైన వెదురు స్తంభాలతో, లేత జమ్మి ఆకులతో అందమైన కుటీరాన్ని తీర్చిదిద్దారు. రాముడు వాస్తుపూజలు, అభ్యుదయ శాంతికర్మలు యథావిధిగా జరిపి కుటీరంలోకి ప్రవేశించాడు. ఆ రమణీయ ప్రదేశంలో సీతారాములు ఆనందంగా కాలం గడపసాగారు. కొన్ని రోజులు గడిచిపోయాయి.
ఒకరోజు ఆశ్రమ ప్రాంతంలో ఒక లేడి కనిపించింది. దాని కొమ్ములు ఇంద్ర నీలాలలాగా మెరిసిపోతున్నాయి. దాని ఉదరం తెల్లటి కాంతులతో, పక్కలు నెమలి ఈకల రంగుతో మెరిసిపోతున్నాయి. పైకెత్తిన తోక ఇంద్రధనుస్సులా ఉంది. ఆ లేడి నిగనిగలు చూసి ముగ్ధురాలైన సీత భర్తకు చూపించి “అటు చూడండి. ఆ లేడిని మచ్చిక చేయ మనసైంది. దాన్ని తెచ్చిపెట్టండి. అరణ్యవాసం గుర్తుగా అత్తలకు చూపిస్తాను. ఒకవేళ అది చిక్కకపోతే దాన్ని చంపి చర్మమైనా తీసుకురండి” అన్నది.
భార్య ముచ్చట చెల్లించటం కోసం రాముడు విల్లంబులు ధరించి వెళ్ళాడు. కొంతసేపైన తర్వాత దూరం నుంచీ “హా సీతా! హా లక్ష్మణా! రక్షమాం” అనే ఆక్రందన వినిపించింది. “మీ అన్నగారికి ఏదో ఆపద సంభవించింది. వెళ్లి రక్షించు” అన్నది సీత ఆందోళనతో.
“అసహాయశూరుడైన అన్నగారు అబలలాగా రక్షమాం అంటూ ఆక్రందన చేయరు. ఇదంతా రాక్షస మాయ” అంటూ సర్ది చెప్పబోయాడు లక్ష్మణుడు. సీత నమ్మలేదు. అనేక విధాలుగా అతడిని నిష్ఠూరాలు ఆడింది. ఆ నిష్ఠూరాలు భరించలేక “సరే! నీ ఇష్ట ప్రకారమే వెళతాను. ఇక ఈ వనదేవతే నీకు రక్ష” అని నమస్కరించి వెళ్ళాడు లక్ష్మణుడు.
అదే సమయానికి కాషాయ వస్త్రాలు, ఛత్రం, కమండలాలు ధరించిన ఒక యతి వేదమంత్రాలు పఠిస్తూ అక్కడికి వచ్చాడు. సాధువేషంలో ఉన్న అతడిని గౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసింది సీత. “పట్టు పీతాంబరం ధరించి బంగారు బొమ్మలా మెరిసిపోతున్న నువ్వెవరు? లక్ష్మివా? రంభవా? అప్సరసవా?” అని అడిగాడు.
అతడి మాట తీరుకోపం తెప్పించింది జానకికి. వచ్చిన వాడు బ్రహ్మణుడు, పైగా అతిథి. సమాధానం చెప్పకపోతే శపిస్తాడేమో అనుకుంటూ “నేను దశరథ మాహారాజు కోడలిని. శ్రీరాముడి ఇల్లాలిని. నువ్వెవరు? ఈ దండకారణ్యంలో ఒంటరిగా తిరగటానికి కారణం ఏమిటి?” అడిగింది.
“నేను రావణుడిని. లంకాధిపతిని” అంటూ నిజరూపం ధరించాడు. “నేను నీపై మరులు పెంచుకుని ఇలా వచ్చాను. మనవమాత్రుడైన రాముడు నా కాలిగోటికి కూడా సరిరాడు. నన్ను చేపట్టి సుఖించు” అన్నాడు.
సీత కళ్ళల్లో ఎర్రజీరలు తొంగి చూసాయి. “నక్క ఆడ సింహాన్ని కోరినట్లు నన్ను కోరుతున్నావు. నా వంటి దానిని అవమానించి అమృతం తాగినా మరణం నుంచీ తప్పించుకోలేవు” అన్నది.
“అనునయాలతో అనుకూలించని అతివకు బలాత్కారమే తగినది” అంటూ రావణుడు ఆమె జుట్టు పట్టుకున్నాడు. అంతవరకు రహస్యంగా ఉంచిన అతడి రథం బయటకు వచ్చింది. అది కోరుకున్నప్పుడు అంతర్దానమవటం, తలచుకున్నప్పుడు ప్రత్యక్షమవటం మొదలైన మాయా లక్షణాలు కలది. రావణుడు సీతను పట్టుకుని బలవంతంగా రథం మీద కూర్చో బెట్టుకున్నాడు. రథం ఆకాశంలోకి ఎగిరింది. “రామా! లక్ష్మణా! నన్ను కాపాడండి. ఈ వనం లోని పశుపక్ష్యాదులు ఏవీ నన్ను కాపాడలేవా?” అంటూ పెద్దగా ఏడ్చింది.
మర్రిచెట్టు మీద నిద్రపోతున్న జటాయువు సీత ఆక్రందన వినపడగానే తటాలున మేలుకొని తలెత్తి చూశాడు. అప్పటికే రావణుడి రథం వేగంగా వెళ్ళిపోతున్నది. జటాయువు రెక్కలు టపటప లాడించి ఒక్క ఉదుటన పైకి లేచాడు.
“రావణా! సీతని విడిచి పెట్టు. లేదా తొడిమ నుండీ రాలిన పండులా నిన్ను రథం నుంచీ కింద పడవేస్తాను” అంటూ వేగంగా రథాన్ని సమీపించాడు. రావణుడు భయంకరమైన బాణాలను అసంఖ్యాకంగా జటాయువు మీద కురిపించాడు. ఆ బాణాలు అన్నిటినీ జటాయువు తన ముక్కుతో తుంచేసాడు. వాడియైన తన గోళ్ళతో రక్కుతూ, ముక్కుతో పొడుస్తూ రాక్షసరాజు శరీరం నిండా గాయాలు చేసాడు. రెండు మేఘాల మధ్య సంఘర్షణలా ఇద్దరి మధ్యా తీవ్రమైన యుద్ధం జరిగింది.
జటాయువు విజృంభించి తన ముక్కుతో, బలమైన రెక్కలతో ధనస్సుని, బాణాలని తునాతునకలు చేసాడు. రథాశ్వాలను చంపేసాడు. రావణుడి కవచాన్ని ముక్కుతో ఛేదించాడు. రావణుడి రథం భగ్నం అయి నేలమీద పడ్డాడు. మరో విల్లు అందుకుని వేలకొద్దీ బాణాలను ప్రయోగించాడు. అవన్నీ జటాయువు శరీరంలో గుచ్చుకుని గూటిలోని పక్షిలా కనిపించాడు. అతడు వృద్ధుడు, అలసి ఉన్నాడు. పైగా బాణాలు గుచ్చుకుని గాయపడి ఉన్నాడు. అయినా అదను చూసుకుని తన ముక్కుతో రావణుడి పది చేతులూ తుంచేసాడు. పుట్టలోనుంచీ వచ్చే సర్పాలలాగ మళ్ళీ పది చేతులూ వచ్చేశాయి. రావణుడు కుపితుడై ఖడ్గం అందుకుని జటాయువు రెండు రెక్కలు ఖండించాడు. శరీరం అంతా రక్తం ఓడుతూ నేలమీద పడిపోయాడు ఆ పక్షిరాజు.
రావణుడు సీతను లాక్కుని వెళుతుంటే ఆమె అక్కడ చెట్టుని కౌగలించుకుని భయంతో పెనుగులాడింది. తలలో అలంకరించుకున్న పూలు, ఆభరణాలు ఆ ప్రదేశం అంతా చెల్లాచెదరుగా పడిపోయాయి. రావణుడు సీతను చంకలో ఇరికించుకుని ఆకాశానికి ఎగిరాడు. అతడు వేగంగా వెళుతుంటే గాలికి లేచిన సీత ఎర్రటి పైటకొంగు ఎగురుతూ అగ్ని జ్వాలలతో ఎగురుతున్న పర్వతంలా కనిపించాడు రావణుడు.
సీతను అన్వేషిస్తూ వస్తున్న రామలక్ష్మణులకు రెక్కలు తెగి మూలుగుతూ పడిఉన్న జటాయువు కనిపించాడు. వారిని చూడగానే రావణుడు సీతను అపహరించుకుపోతుండగా, తను ఎదుర్కోవటం, ఇద్దరి మధ్య జరిగిన విషయాలు అన్నీ చెప్పి ఆయాసంతో వగరుస్తూ ప్రాణాలు విడిచాడు పక్షిరాజు. కళ్ళు తేలవేసి కొండలాగా పడిఉన్న అతడిని చూస్తుంటే రాముడికి దుఃఖం పొంగుకువచ్చింది. సీతా వియోగంతో పరితపిస్తున్న రాముడు మరింత దుఖంతో అతడిని కౌగలించుకుని కన్నీరు కార్చాడు. తర్వాత లక్ష్మణుడు చుట్టు పక్కల నుంచీ కట్టెలు పోగుచేసుకుని రాగా అతడి శరీరానికి దహనసంస్కారాలు జరిపాడు.
***
ఆనాడు ఆకాశంలో నుంచీ జారిపోయిన సంపాతి రెక్కలు కాలిపోయి, శరీరం పుండ్లు పడి, వింధ్యపర్వతం మీద పడిపోయాడు. ఆరురోజుల వరకు స్పృహలేని స్థితిలో చేష్టలుడిగి అలాగే పడిఉన్నాడు. ఏడవనాటికి తెలివి వచ్చింది. చుట్టూ చూసాడు. కిలకిలారావాలు చేస్తున్న పక్షుల గుంపులు, విశాలమైన పర్వత గుహలు, ఎత్తైన శిఖరాలు గల పర్వతం కనిపించింది. అది వింధ్య పర్వతంగా గుర్తించాడు. ఇది తనకి కొత్తేమీ కాదు. అంతకు ముందు తమ్ముడితో కలసి అక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్న నిశాకర మహర్షిని దర్శించుకుని వెళుతూ ఉండేవాడు తను.
మెల్లగా లేచి కాళ్ళతో చిన్నగా నడుస్తూ మొనదేలిన రాళ్ళతో, ఎగుడు దిగుడుగా ఉన్న ఆ పర్వత పైభాగం నుంచీ కిందికి దిగివచ్చాడు సంపాతి. నిశాకర మహర్షి ఆశ్రమం సమీపిస్తుంటే చల్లటి గాలులు హాయిగా సోకాయి. సమీపంలోనే ఉన్న చెట్టుకిందకి చేరాడు. నిశాకర మహర్షి స్నానం ముగించుకుని ధ్యానం చేసుకోవటానికి కుర్చోబోతున్నాడు.
సంపాతిని చూసి “నాయనా! నీ రెక్కలు కాలిపోయి, శరీరం శిధిలం కావటానికి కారణం ఏమిటి? నిన్ను ఎవరు ఇలా హింసించారు?” అని అడిగాడు. సంపాతి జరిగిన విషయం అంతా చెప్పాడు. “స్వామీ! నా రెక్కలు కాలిపోయాయి. పరాక్రమం నశించింది. నా ప్రాణ సమానమైన సోదరుడు దూరం అయ్యాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈ కొండ మీదనుంచీ కిందకు దూకి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. చివరిసారిగా మీ దర్శనం చేసుకుందామని ఇలా వచ్చాను” అన్నాడు.
నిశాకర మహర్షి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దివ్యదృష్టితో చూసాడు. “కలవరపడకు నాయనా! నీ తమ్ముడు దండకారణ్యంలో క్షేమంగా ఉన్నాడు. నీకు కూడా మంచిరోజులు వస్తాయి. నీ రెక్కలు మళ్ళీ మొలుస్తాయి. నీ దృష్టి కూడా బాగు అవుతుంది. క్షీణించిన నీ శక్తి, బలపరాక్రమాలు తిరిగి పుంజుకుంటావు. అప్పటిదాకా నిరీక్షించు” అని చెప్పాడు.
కొంతకాలం గడిచిపోయింది. మహర్షి స్వర్గస్తుడయ్యాడు. సంపాతి మాత్రం అక్కడ దొరికిన ఆహారం తింటూ అక్కడే ఉండిపోయాడు. ఒకరోజు సూర్యోదయాన్నే కొండ సమీపంలో ఏవో మాటలు వినిపించాయి. ఇవతలకు వచ్చాడు సంపాతి. చాలామంది వానరులు కోలాహలంగా మాట్లాడుకుంటున్నారు. “ఆహా! ఈరోజు నేను లేచిన వేళ మంచిది. పుష్కలంగా ఆహారం లభించింది. ఈ వానరులు అందరినీ భక్షిస్తాను” అంటూ దగ్గరకు వచ్చాడు.
ఆ పక్షి మాటలు విన్న అంగదుడు హనుమంతుడితో “సుగ్రీవుడు పెట్టిన నెల రోజుల గడువు ముగిసిపోయింది. మనం ఎంత అన్వేషించినా సీత జాడ తెలియలేదు. అతడు చండశాసనుడు. సీతను కనుగొనలేక పోయినామని చెబితే మనల్ని వధించక మానడు. అంతకన్నా మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసి మరణించటమో లేదా ఈ పక్షిరాజుకి ఆహారం కావటమో మంచిది. రాముడికి మేలు చేసి జటాయువులా ప్రాణత్యాగం చేసే అదృష్టం మనకు లేదు. ఇలా అనామకంగా చచ్చిపోవాలని విధి రాశాడు కాబోలు!” దుఃఖంతో కన్నీరు కారుస్తూ అంటున్నాడు అంగదుడు.
అంగదుడు విచారంతో చెప్పిన మాటలు వినగానే సంపాతి నొచ్చుకున్నాడు. “నా సోదరుడైన జటాయువు గురించి చెప్పుకునే మీరు ఎవరు? అతడు నాకు ప్రాణంతో సమానం. అతడు చనిపోవటం ఎలా జరిగింది? నా మనసు ఆందోళనతో ఉన్నది. దయచేసి చెప్పండి” అన్నాడు.
రామలక్ష్మణులకు సుగ్రీవుడితో మైత్రి, రాముడి ద్వారా విన్న- రావణుడు సీతను ఎత్తుకు పోతుండగా జటాయువు అడ్డగించి పోరాడుతూ అతడి చేతిలో మరణించటం, సీతను వెతుకుతూ తామందరూ రావటం మొదలైన విషయాలు అన్నీ చెప్పాడు అంగదుడు.
అంగదుడు చెప్పిన విషయాలు విని సంపాతి “నా తమ్ముడు సద్గుణ సంపన్నుడు. ఏనాటికైనా ఇద్దరమూ కలుసుకోకపోతామా, ఆనందంగా జీవించకపోతామా అని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాను. నా ఆశ అడియాశ అయింది. వానరులారా! నేను ఇప్పుడు వృద్ధుడిని. పైగా రెక్కలు కాలిపోయి ఉన్నవాడిని. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను ఇక్కడి నుంచీ సముద్రతీరం దగ్గరకు తీసుకువెళ్ళండి. నా సోదరుడికి తర్పణాలు విడుస్తాను” అన్నాడు గద్గద స్వరంతో. అతడి కళ్ళనుంచీ కన్నీరు బొటబొట కారింది.
వానరులందరూ సంపాతిని సముద్ర తీరానికి మోసుకుని వెళ్ళారు. సంపాతి తమ్ముడికి జలతర్పణాలు సమర్పించిన తర్వాత తిరిగి యథాస్థానానికి తీసుకువచ్చారు. వానరులు అందరూ అతడి చుట్టూ కూర్చున్నారు. “పక్షిరాజా! నువ్వు జటాయువు సోదరుడివి కదా! నీకు రావణుడి నివాసం ఎక్కడో తెలిస్తే దయయుంచి చెప్పు. అతడు ఇక్కడ నుంచీ దగ్గరలో ఉన్నాడా? దూరంగా ఉన్నాడా?” అడిగాడు జాంబవంతుడు.
అందుకు సంపాతి ఇలా అన్నాడు. “ఇప్పటికి చాలాకాలం క్రితం నేను రెక్కలు మాడిపోయి ఈ వింధ్యపర్వతం మీద పడిపోయాను. జటాయువును వధించిన రావణుడిపై పగ సాధించాలని ఉన్నది. కానీ నా శక్తి క్షీణించింది. కనీసం మాట సహాయం అయినా చేస్తాను. కొంతకాలం క్రితం చక్కటి రూపం కలిగి, వివిధ ఆభరణాలను అలంకరించుకున్న ఒక స్త్రీని రావణుడు ఎత్తుకుని పోతుండగా నేను చూసాను. ఆమె “రామా! లక్ష్మణా!” అంటూ శోకిస్తూ ఉంది. పదేపదే రాముడిని తలచుకోవటం వలన ఆమే సీత అని నాకు అనిపిస్తున్నది.
రావణుడు విశ్రవసుడి పుత్రుడు. లంకానగరం అతడి నివాసం. ఇక్కడి నుంచీ వంద యోజనాల దూరంలో సముద్రానికి దక్షిణతీరంలో ఒక ద్వీపం ఉన్నది. అదే లంకానగరం. ఎలా చెబుతున్నానంటే కోళ్ళు వంటి పక్షులు కాళ్ళ దగ్గర ఉన్న ఆహారాన్ని మాత్రమే చూడగలవు. నేను, జటాయువు ఆహారబలం చేత, సహజమైన దివ్యశక్తి వల్ల చాలాదూరం వరకు చూడగలము. గరుత్మంతుడి వంశస్తులమైన మాకు అటువంటి నేత్రపాటవం ఉంది. నేను నూరు యోజనాల దూరం వరకు చక్కగా చూడగలను. కనుక ఇక్కడ నుంచే లంకానగరం చూసి చెబుతున్నాను.
లంకానగరాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అక్కడి గృహాలు అన్నీ సువర్ణంతో నిర్మించబడి ఉన్నాయి. నగరం చుట్టూ గల ప్రాకారాలు సూర్యకాంతితో తేజరిల్లుతూ ఉన్నాయి. రావణుడు సీతను అక్కడ ఉంచాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కావలిగా ఉన్నారు. వానర వీరులారా! వెంటనే మీ పరాక్రమం చూపిస్తూ సముద్రాన్ని లంఘించి లంకను చేరుకోండి. మీరు అక్కడ సీతను దర్శించి క్షేమంగా తిరిగి రాగలరు” అన్నాడు.
సంపాతి మాటలు వినగానే వానరులందరూ పరమానంద భరితులు అయ్యారు. అందరూ గంతులు వేశారు. అక్కడి చెట్లపైకి ఎక్కి ఒక కొమ్మ మీద నుంచీ మరో కొమ్మ మీదకు దూకారు. తోక ముద్దు పెట్టుకున్నారు. అనేక కోతి చేష్టలు చేసారు. ఇలా మాట్లాడుతూ ఉండగానే సంపాతికి హటాత్తుగా రెక్కలు మొలిచాయి. నిండుయవ్వనంలో ఉన్నప్పటిలా పరాక్రమం, బలపౌరుషాలు వచ్చేశాయి. ఎర్రటి తన రెక్కలు చూసుకుని సంపాతి పరమానందం చెందాడు.
“మిత్రులారా! సూర్యకిరణాల వేడిమి చేత కాలిపోయిన నా రెక్కలు మళ్ళీ వచ్చాయి. మీ కార్యం సిద్దించినట్లే! అందుకు నాకు రెక్కలు రావటమే తార్కాణం. నేను పైకి ఎగిరి నా రెక్కల బలం చూసుకోవాలను కుంటున్నాను. మీకు శుభం జరుగుగాక!” అంటూ రెక్కలు టపటప లాడించి పైకి లేచాడు సంపాతి.
“శ్రీరాముడికి చేసిన రవ్వంత సాయమైనా అనంతమైన ఫలాన్ని ఇస్తుంది అనటానికి సంపాతి, జటాయువుల ఉదంతాలే నిదర్శనం. జటాయువు శ్రీరాముడి చేతి మీదుగా దహన సంస్కారాలు జరుపబడి స్వర్గానికి వెళ్ళాడు. సంపాతికి కోల్పోయిన జవసత్వాలు తిరిగి లభించాయి. ఆ సోదరద్వయం ధన్యులు” అనుకుంటూ వానర శ్రేష్ఠులందరూ ధైర్యోత్సాహాలతో సీతాన్వేషణకు సంసిద్ధులయ్యారు.