[dropcap]ఉ[/dropcap]ద్యోగ విరమణ తరువాయి కాలం గడుస్తోంది. చాలా రోజుల తరువాత ఈ ప్రొద్దున ఏం చెయ్యాలో తోచక రేడియో గొంతు విప్పాను. ఘంటసాల గారి “గౌరమ్మా నీ మొగుడెవరమ్మా” అన్న పాట వినిపిస్తోంది. ఈ పాట వింటుంటే నాకింకో హిందీ పాట “గోరి తేరా గావ్ బడా ప్యారా” గుర్తొచ్చింది.
కొన్ని పాత పాటలు వింటుంటే, ఎన్నో గడచిన సంఘటనలు కళ్ళ ముందు మెదలి సమయం తెలియదు. ఉద్యోగ విరమణ తర్వాత బహుశా ఇదొక అదనపు ప్రయోజనంలా భావించాలేమో.
అంతే! అప్రయత్నంగానే గౌరి ఉరఫ్ గోరీబీ గురించిన జ్ఞాపకాల కొలనులో నా ఈత మొదలైంది.
అది జనవరి 2004వ సంవత్సరం. ఆ రోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటలవుతోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అనౌన్స్‌మెంట్ వస్తోంది. ఢిల్లీ నుంచి లాహోర్‌కి ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో వెళ్ళబోతున్న ప్రయాణీకులు చెక్ ఇన్ అవ్వచ్చని. దీనికోసమే లౌంజ్‌లో నిరీక్షిస్తున్న నేను, ఎరిక్ ఇంకా ప్రజాపతి మా బాగేజ్ తీసుకుని గేట్ నెంబర్ త్రీ ద్వారా ఎయిర్ బస్సులోకి ప్రవేశించాము. మమ్మల్నిఎయిర్ హోస్టెస్ ఎకానమీ ప్లస్ క్లాసులో త్రీ సీటర్ దగ్గరకు తీసుకెళ్లింది. కేబిన్లో మా బాగేజ్ సర్ది, ముగ్గురం మా సీట్లలో కూర్చున్నాము.
“హమ్మయ్య! ఢిల్లీ నుంచి లాహోర్‌కి చాలా కాలం తరువాత డైరెక్ట్ ఫ్లైట్ తిరిగి మొదలైంది. ఇది లేకపోతే శ్రీలంక ద్వారా లాహోర్‌కి వెళ్లాల్సి వచ్చి దాదాపు ఒక రోజు సమయం వృథా అయ్యేది. ఇప్పుడైతే కేవలం గంటన్నర ప్రయాణం చేసి లాహోర్ చేరబోతున్నాము. మనం అదృష్టవంతులం” అన్నాడు ఎరిక్.
“ఓహ్ యా! నిజంగానే” అన్నాను నేను.
“డాక్టర్ శ్రీమన్ ఇంతకు మునుపు మీరెప్పుడైనా పాకిస్థాన్ వెళ్ళారా” అన్నాడు ఎరిక్.
నేను నవ్వుతూ “ఔను ఎరిక్ కానీ కొన్నేళ్ల క్రితం ఇప్పటికీ మర్చిపోలేని ఒక కలలో” అన్నాను.
“యు మస్ట్ బి జోకింగ్” అన్నాడు ఎరిక్.
“లేదు ఎరిక్! వారం క్రితం ఈ టూర్ గురించి తెల్సినప్పుడే మీకీ కల గురించి చెబుదామనుకున్నాను” అన్నాను.
“ఇదేదో ఇంట్రెస్టింగా ఉందే! ఏంటా కల? ప్లీజ్ చెప్పండి” అన్నాడు నాకు మరో పక్క కూర్చున్న ప్రజాపతి.
“ఓ! తప్పకుండా ప్రజాపతి. ఇండియాలో మనకి పాకిస్థాన్ అంటేనే ఒక ఆసక్తి, ఇంకేదో తెలియని భావం” అని చెప్పడం ప్రారంభించాను నేను.
“కొన్నాళ్ల క్రితం నాకో వింత కల వచ్చింది. ఆ కలలో నేను పాకిస్థాన్ వెళ్లాను. అక్కడో పట్టణంలో చిన్న ఇరుకు సందులోని ఒక ఇంటికి వెళ్లాను. చూడటానికి ఆ ఇంట్లోని వాళ్ళు ముస్లింల లాగే ఉన్నారు. కానీ ఆశ్చర్యమేంటంటే, వాళ్ళు పాకిస్థాన్‌లో నాతో తెలుగులో మాట్లాడుతున్నారు!
వాళ్ళు నన్ను ఆ ఇంట్లో ఒక రహస్య గది లోపలికి తీసుకెళ్లారు. అగరుబత్తుల వాసనతో నిండిన ఆ గదిలో కొన్ని దీపాలు వెలుగుతున్నాయి. వాటి ముందు ఒక అస్పష్టమైన దేవుళ్ళ పటం ఉంది. నాతో పాటు వచ్చిన వాళ్ళు దీనంగా చెప్తున్నారు, తామొక రహస్య జీవితం గడుపుతున్నామని. వాళ్ళు సన్నటి స్వరంతో ఏడుస్తూ ఏదో చెప్తున్నది వింటుండగా, చటుక్కున నాకు మెలకువ వచ్చింది.
ఈ విచిత్రమైన కల గురించి నాకర్థం కాలేదు. అసలు వీళ్ళు ముస్లింలు కాని తెలుగు వాళ్లేంటి? పాకిస్థాన్‌లో రహస్యంగా జీవించడమేంటని ఆ రాత్రి నాకసలు నిద్ర పట్టలేదు. ఈ విచిత్రమైన కల నా జ్ఞాపకాలలో ఎప్పటికీ మర్చిపోలేనంతగా నిలిచిపోయింది”.
“శ్రీమన్ నువ్వేమన్నా కాందిశీకుల గురించిన నవలలు తెగ చదివేవాడివా అప్పుడు” అన్నాడు నవ్వుతూ ఎరిక్.
“అబ్బే అదేం లేదు ఎరిక్. నాక్కూడా అర్థం కాలేదు ఉన్నట్లుండి ఆ కల ఎందుకొచ్చిందో. వాస్తవం చెప్పాలంటే నాకు సందేహంగానే ఉంది మీరిది నమ్ముతారో లేదోనని” అన్నాను.
“కమాన్ శ్రీమన్! ఎందుకు నమ్మను. నాక్కూడా ఇంట్రెస్టింగా ఉంది ఇది వింటుంటే” అన్నాడు ఎరిక్.
మాటల మధ్యలో మా గంటన్నర విమాన ప్రయాణం తెలీకుండానే గడిచిపోయింది.
ఇప్పుడే పైలట్ అనౌన్స్ చేసాడు. కొన్ని క్షణాలలో మేము అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటున్నామని. త్వరలోనే చిన్నపాటి కుదుపుతో మా ఎయిర్ బస్సు లాహోర్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా దిగింది. మా లగేజ్ తీసుకుని ఎయిర్‌పోర్ట్ బయటకు వస్తుండగా నా వాచీలో సమయం 4.45 చూపిస్తోంది. కానీ లాహోర్ ఎయిర్ పోర్ట్ లోని గడియారంలో సమయం 4.15 చూసి, “గుడ్! మనం ఇంకో అరగంట కాలం ఆదా చేసాం” అని నవ్వాను.
ఎయిర్‌పోర్ట్ బయట మమ్మల్ని మా కంపెనీ పాకిస్తాన్ ప్రతినిధి రిసీవ్ చేసుకుని, తన కారులో లాహోర్ ఎయిర్‌పోర్టుకి దగ్గర్లోనే ఉన్న గ్రాండ్ ఎంక్లేవ్ అనే హోటల్‌కి తీసుకెళ్లాడు.
హోటల్ చక్కగా, సౌకర్యంగా ఉంది. రాత్రి డిన్నర్ చేసి త్వరగానే నిద్ర పోయాను. ప్రొద్దున ఐదు గంటలకి దగ్గర్లోని మసీదులోంచి అజాన్ వినిపించి మెలకువ వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకుని, హోటల్ బయటికొచ్చి కొంచెంసేపు నా మార్నింగ్ వాక్ చేసాను.
ఇండియాలో హైదరాబాద్ పాత నగరం అలవాటే ఐన నాకు లాహోర్ నగరం కొత్తగా ఏమీ అనిపించలేదు. తరువాత నా హోటల్ గదికి వచ్చి తయారై, ఎనిమిదిన్నరకల్లా హోటల్ డైనింగ్ గదికి వెళ్లాను. అక్కడ నాతో కలిసిన ఎరిక్, ప్రజాపతితో పాటు బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని, తొమ్మిది గంటలకల్లా మేము టాక్సీలో లాహోర్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనున్న కాలాషాకాకు పట్టణానికి బయలుదేరాము.
కాలాషాకాకు ప్రాంతం రైస్ బౌల్ అఫ్ పాకిస్థాన్‌గా ప్రసిద్ధి. అక్కడే మేము చేరవలసిన పాకిస్థాన్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. మంచి బాస్మతి రైస్ వంగడాలు రూపొందించిన ప్రముఖ రైస్ బ్రీడింగ్ కేంద్రంగా, ఈ సంస్థకి ఆసియాలో మంచి పేరుంది.
ప్రస్తుతం మా పర్యటన కూడా ఈ బాస్మతి వరి వంగడాల గురించిన పరిశోధన కోసమే. హాలండ్‌కి చెందిన డాక్టర్ ఎరిక్ వరి హైబ్రిడ్ రకాల పరిశోధకుడు, ఇంకా మా టీం లీడ్ కూడా. అతనికి సహాయకులుగా మా కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ప్రజాపతి, ఇంకా ఫుడ్ బయోకెమిస్ట్రీ మరియు బయోటెక్నాలజీ స్పెషలిస్టుగా నేను వచ్చాము.
పాకిస్థాన్ గ్రామీణ వాతావరణంలో హాయిగా పంట పొలాల ద్వారా ప్రయాణిస్తూ, ముప్పావు గంటలో కాలాషాకాకు పట్టణం చేరిపోయాము.
మేము పాకిస్థాన్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేరగానే, మా రాక గురించి రిసెప్షనిస్ట్ ఇక్కడి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ అబ్దుల్ మజీద్ గారికి తెలియచేసాడు. డాక్టర్ అబ్దుల్ మజీద్ వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు.
ఆయనతో పాటు వచ్చిన సిబ్బందిలో ఒకతను, టాక్సీలో ఉన్న మాకవసరమైన ల్యాబ్ పరికరాలను కొంచెం హడావిడిగా తీయబోతున్నాడు. వెంటనే నేనతనితో ఉర్దూలో “హల్లూ! థోడా సంభాల్ కే ఉఠాయియేగా” అనేసరికి, అతనికి నా ‘హల్లూ’ అన్న మాట అర్థం కాక సంశయిస్తున్నాడు. ప్రక్కనే ఉన్న ఇంకొకతను నా వైపు ఆసక్తిగా చూసి, అతనితో “కొంచెం మెల్లగా” అంటూ మా యంత్రసామాగ్రిని జాగ్రత్తగా దింపాడు.
డాక్టర్ అబ్దుల్ మజీద్ నన్ను”డాక్టర్ షిరీమన్ ఇండియా మే ఆప్ కహాకే రహనే వాలే హై” అన్నాడు.
నేను “హైదరాబాద్” అనగానే, “ఓహ్!” అని నా ఉర్దూ గురించి తెలిసినట్లు నవ్వాడు.
డాక్టర్ మజీద్ మమ్మల్ని కాన్ఫరెన్స్ హాల్ తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే సమావేశమైన ఇంకొంతమంది శాస్త్రవేత్తలతో మా పరస్పర పరిచయం జరిగింది.
డాక్టర్ ఎరిక్ ఎక్కడికెళ్లినా తన దేశంనుంచి తీసుకొచ్చిన చాక్లెట్ బార్ పాకెట్స్ పంచుతుంటారు. ఇక్కడందరికీ ఈ చాక్లెట్ బార్ వెరైటీలు చాలా నచ్చి బాగా మెచ్చుకున్నారు.
“అవును! ఇవి యూరోప్ లోని మా ప్రాంత స్పెషాలిటీ. ఇటువంటివి వేరే ప్రాంతాలలో దొరకవు” అని ఒకింత గర్వంగా చెప్పాడు డాక్టర్ ఎరిక్.
“డాక్టర్ ఎరిక్ ఇది నిజమే. దీనికి ముఖ్య కారణం ఈ చాక్లెట్ తయారీకి కావలసిన శ్రేష్టమైన కోకో వెన్న, ఆఫ్రికాలోని ఘనా దేశంనుంచి లభించడమే కాకుండా, దాని విశిష్టమైన రుచి ఇంకా పరిమళానికి ఎంతో వన్నెలద్దిన మీ టెక్నాలజీ, నైపుణ్యం కూడా” అన్నాను నేను.
“డాక్టర్ శ్రీమన్ నేను మీతో ఏకీభవిస్తాను. ఈ చాకోలెట్స్ ఇంత బాగుండడానికి దీంట్లో మేము వాడే శ్రేష్టమైన కోకో బీన్స్ అందించిన ఘనా దేశపు నేల విశిష్టత ముఖ్య కారకమే” అన్నాడు డాక్టర్ ఎరిక్.
“డాక్టర్ ఎరిక్ అలాగే మీ టెక్నాలజీ లేకపోతే, ఈ కోకో ముడిసరుకు ప్రపంచవ్యాప్తంగా మెచ్చే అమోఘమైన చాక్లెట్‌గా తయారయ్యేది కాదు” అన్నాను నేను.
“డాక్టర్ మజీద్! ఇప్పుడు కూడా మన ఉపఖండపు నేలల్లో సాధ్యమయ్యే ప్రత్యేకమైన బాస్మతి వరి వంగడాలని, మన పరిశోధనల ద్వారా మంచి హైబ్రిడ్ వరి రకాలను రూపొందించి, ప్రపంచానికి అందించాలనేదే మన ప్రయత్నం” అన్నాను నేను.
“భలే చక్కగా చెప్పారు షిరిమన్. ఆప్ హర్ మిట్టీ కీ ఖుష్బూ జాన్తే హై” అన్నాడు డాక్టర్ మజీద్.
“మిట్టీ కీ ఖుష్బూ! నైస్” అన్నాడు డాక్టర్ ఎరిక్ తనకు కూడా అర్థమైనట్లుగా.
ఇలాంటి సానుకూల వాతావరణంలో డాక్టర్ మజీద్ టీంతో మా పరిశోధనకు సంబంధించిన చర్చల తరువాత, మేము చిన్న బృందాలుగా విడిపోయి, ఇక్కడి వరి పరిశోధన క్షేత్రంలో తిరిగాము.
ఒక చోట నేను ఒక్కణ్ణే ఉన్న సమయంలో, ప్రొద్దున నాతో కలిసిన ఒకతను నా దగ్గరకొచ్చి “నమస్తే సాబ్” అన్నాడు.
ఈ పిలుపుకి నేను ఆశ్చర్యపోయి చూస్తుండగా, అతను తన పేరు సాదిక్ అని, తను ఫీల్డ్ అసిస్టెంట్ అని పరిచయం చేసుకుని “మీరు ఇండియాలో హైదరాబాద్ నుండి వచ్చారా” అని అడిగాడు.
నేను ఔనని సమాధానమిచ్చి “అక్కడ నీకెవరైనా తెలుసా” అన్నాను.
దానికి సాదిక్ “సాబ్! మా నాన్న హైదరాబాద్ నుంచే వచ్చారు” అన్నాడు.
“ఓ! అలాగా!” అని నేను సాదిక్ తోటి ఇంకొంచెం సేపు మాట్లాడాను.
ఈ సమయంలో సాదిక్ ఉద్వేగంగా నాతో ఇంకేదో చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది. కొద్ది సమయంలోనే నాతో దగ్గరవ్వాలనుకుంటున్న తనని నేను “ఏంటి సాదిక్?” అని భుజం మీద నెమ్మదిగా తట్టాను.
“డాక్టర్ సాబ్ ఇవాళ సాయంత్రం మీ పనులన్నీ అయ్యాక, నేను మీతో కొంచెంసేపు కలవొచ్చా” అన్నాడు సాదిక్.
నేను “ఫరవాలేదు సాదిక్. రాత్రి ఏడున్నర గంటలకి గెస్ట్ హౌస్‌కి వచ్చి నన్ను కలవచ్చు” అన్నాను.
ఎంతో ఆనందంతో తబ్బిబ్బవుతూ “షుక్రియా సాబ్! నేను తప్పకుండా కలుస్తాను” అని సాదిక్ పక్కకెళ్లి పోయాడు.
నా ఫీల్డ్ విజిట్, ల్యాబ్ మీటింగ్ కూడా ముగించుకుని సాయంత్రం నాకు కేటాయించిన గెస్ట్ రూమ్ చేరుకున్నాను.
రాత్రి ఏడున్నర ప్రాంతంలో సాదిక్ నన్ను కలవడానికి వచ్చాడు. అతన్ని నా గదికి పిలిచి సోఫాలో కూర్చోమన్నాను.
బిడియపడ్డ సాదిక్ “ఫరవాలేదు సాబ్” అంటూ పక్కనే ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చుని “సాబ్ మీతో నా వ్యక్తిగత వివరాలు పంచుకుందామనుకుంటున్నాను. దయ చేసి మీతో కొంచెంసేపు మాట్లాడొచ్చా” అన్నాడు.
అతని వ్యక్తిగత వివరాలు నాకెందుకు చెప్పాలనుకుంటున్నాడు అనుకుంటూనే, నేను “ఫరవాలేదు సాదిక్. నాకింకో గంట సమయముంది డిన్నర్ కోసం వెళ్ళటానికి” అన్నాను.
ఇంటర్ కామ్ ఫోన్లో ప్రజాపతికి తనని, ఎరిక్‌ని ఎనిమిదిన్నర ప్రాంతంలో డైనింగ్ హాల్లో కలుస్తానని చెప్పేసాను.
సాదిక్ కొంచెంసేపు తన ఉద్యోగ వివరాలు గురించి చెప్పి, “డాక్టర్ సాబ్! మీరు తిరిగి ఇండియాకి వెళ్ళేలోగా దగ్గరలోనే ఉన్న మా ఇంటికి దయచేసి రాగలరా” అని ప్రాధేయ పడ్డాడు.
నేను ఆలోచిస్తుంటే “మీరు అన్యధా భావించవద్దు. మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నానో మా ఇంటికి వస్తే తెలుస్తుంది. మీకు నేను ఇబ్బంది కలిగించను” అన్నాడు సాదిక్. నేనతని అభ్యర్ధనని కాదనలేకపోయాను.
మర్నాడు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సాదిక్ తోటి వాళ్ళింటికి వెళ్లాను. సాదిక్ తన భార్యా, ఇద్దరు కొడుకులని నాకు పరిచయం చేసాడు. వాళ్ళు నాతో ఇండియా గురించి ఆదరంగా ముచ్చటించడం మొదలుపెట్టారు.
సాదిక్ భార్య నా కోసం ఒక పెద్ద ప్లేట్ లో బిస్కెట్స్, వేడి టీ తెచ్చి ఇచ్చింది. నేను “మీ అమ్మగారేరి సాదిక్” అని అడిగేసరికి, సాదిక్ వెంటనే “అమ్మీ!” అని పిలుస్తూ, లోపలికెళ్ళి డెబ్బై ఏళ్ళు పైబడిన ఒక ముసలావిడని హాల్లోకి తీసుకొచ్చాడు.
నేనావిడకు నమస్కారం చేస్తే, ఆవిడ “సల్లగుండు బిడ్డా” అనింది.
ఆశ్చర్యపడ్డ నేను తేరుకుని “అమ్మా! నా పేరు శ్రీమన్” అని చెప్పాను.
ఆవిడ నా చేయి పట్టుకు ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లింది. ఆ గదిలో గోడకున్న ఒక అలమర తలుపు తీసింది.
లోపల ఒక సీతారాముల చిత్రపటానికి దండం పెట్టింది! ఇది చూసి నేను దిగ్బ్రాంతి చెందాను.
“నా అసలు పేరు మర్చిపోయి యుగాలైంది బిడ్డా. గౌరిని కాస్తా గోరీబీ అయ్యి ఎన్నాళ్ళయ్యిందో నాకే యాది లేదు” అంటూ ఆవిడ కళ్ల నీళ్లు పెట్టుకుంది. అక్కడే ఉన్న ఒక స్టూల్ మీద నన్ను కూర్చోబెట్టి, కింద కూర్చుని గోరీబీ వెక్కి వెక్కి శోకాలు మొదలు పెట్టింది.
“నా ఊరు పాయే, నావోల్లు దూరమైరి. తల్లిదండ్రులు పాయె, మొగుడప్పుడే పాయె నేనెందుకున్న రాములా! ఓ రాములా”
ఇంతలో లోపలికొచ్చిన సాదిక్ భార్యా, పిల్లలు తమకు అర్థం కాని భాషలో ఏడుస్తున్న గోరీబీని చూసి, విస్తుపోయి నోట మాట రాక చూస్తున్నారు. చిన్నప్పుడు తన అమ్మీ, అబ్బా ఇంట్లో ఈ భాష మాట్లాడడం విన్న సాదిక్‌కి ఆవిడ చెప్పేది బాగానే అర్ధమౌతోంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న గోరీబీని సాదిక్ దగ్గరకు తీసుకుని “నహీ అమ్మీ” అని సముదాయించాడు.
ఊహించని ఈ సంఘటనతో ఏం చెయ్యాలో తోచని నాతో “డాక్టర్ సాబ్! మాఫ్ కర్నా” అంటూ సాదిక్ చేతులు జోడించాడు. “ఇందు కోసమే, ఈమె కోసమే, నేను మిమ్మల్ని మా ఇంటికి రమ్మని ప్రాధేయపడింది” అన్నాడు సాదిక్.
నేను ఫరవాలేదని చేయి ఊపుతూ, ఆ ముసలావిడను “ఊర్కో పెద్దమ్మా” అని అనునయించాను. కొంత సేపటికి తేరుకున్న గోరీబీ, నాతో తన కథ చెప్పటం మొదలు పెట్టింది.
“బిడ్డా! నా ఊరి వాళ్ళతో ఈ జన్మలో తిరిగి కలుస్తనని, మాట్లాడతనని ఆశ లేకుండే. బాయిలో ఊట లెక్క నాకు నా భాషల ఊసులుబికొస్తున్నయ్. నా సంతోషం చెప్పలేకున్న” అంటూ గోరీబీ తన గతాన్నంతా చేది నా మనస్సు నింపేసింది.
ఎంతో ఆర్తిగా ఆవిడ చెప్పిన సంగతులూ, సాదిక్ వివరణలూ నాకిప్పటికీ గుర్తున్నాయి.
అది 1948వ సంవత్సరం, సెప్టెంబర్ నెల.
నిజాం నవాబు తన సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయటానికి నిరాకరించడంతో, భారత ప్రభుత్వం సర్దార్ పటేల్ నేతృత్వంలో పోలీస్ చర్యలు మొదలు పెట్టిన కాలమది. హైదరాబాద్ నగరమెంతో అల్లర్లతో ఆందోళనగా ఉన్నది.
ఆ రోజు సెప్టెంబర్ 18వ తారీఖు. నిజాం ఎట్టకేలకు, గతి లేక భారత ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోవటానికి సిద్దమైన రోజు. హైదరాబాద్ పట్టణంలో మల్లేపల్లి ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద బంగళాలో, సాయంత్రం పూట ఇవేమీ తెలియని చిన్న పిల్లలు బయట ఆడుకుంటున్నారు.
ఆ బంగళా యజమాని పేరు సయ్యద్. నిజాం నవాబుకు బంధువే కాక అతని కొలువులో మంచి పదవిలో ఉన్నాడు.
ఈ పెద్ద బంగళా నిర్వహణకి, ఇంకా ఇంటి యజమాని కుటుంబ సభ్యుల కోసం, పది మంది దాకా నౌకర్లు ఇక్కడ పని చేస్తున్నారు.
నౌకరు సాధూ బంగళా లోపల యజమాని గారాల చిన్న కొడుకు మూడున్నరేళ్ల అనీస్ బాబాని ఆడిస్తున్నాడు. పుట్టినప్పటినుండీ అస్వస్థతగా ఉండటం వల్ల, ఆ పిల్లాడి పనులన్నీ చూసుకుంటూ సాధూ వాడికెంతో దగ్గరయ్యాడు. సాధూ లేకపోతే సయ్యద్ కుటుంబంలో ఎవ్వరికీ ఆ పిల్లవాణ్ణి సముదాయించటం సాధ్యపడేది కాదు.
ఇప్పుడే సయ్యద్ కారు బంగళాలో ప్రవేశించింది. కారు దిగిన వెంటనే సయ్యద్ పరుగున తన గదిలోకి వెళ్లి, తన బేగంని మిగతా దగ్గరి కుటుంబ సభ్యులని లోపలికి పిలిచి తలుపేసేసాడు. మెల్లని స్వరంలో “అందరూ జాగ్రత్తగా వినండి. ఏ మాత్రం హడావిడి చెయ్యకుండా, ఆందోళన చూపించకుండా, మనమంతా ఈ రాత్రికి తక్షణమే పాకిస్థాన్ వెళ్ళిపోవాలి. ఇది ఎవ్వరికీ తెలియకూడదు. బేగం! వెంటనే మన పనివాళ్ళందరినీ నగరంలో పరిస్థితి బాగా లేదని చెప్పి, వీళ్లందరినీ తిరిగి పిలిచినప్పుడు వెంటనే రావాలని చెప్పు. వాళ్లకు ఏ మాత్రం అనుమానం రాకూడదు” అన్నాడు సయ్యద్.
సయ్యద్ కుటుంబమంతా ఎంతో గుబులుగా “ఏమైంది? మనమంతా ఇంత హఠాత్తుగా అన్నీ వదిలేసి పాకిస్థాన్ వెళ్లిపోవాలా?” అన్నారు.
“మీకు ఇప్పటి పరిస్థితి ముందే వివరించి చెప్పా కదా! గత్యంతరం లేదు. ఇప్పుడు మనమంతా కట్టు బట్టలతో, ఇంట్లోని డబ్బూ, నగా నట్రాతో మాత్రమే ఈ రాత్రికి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళవలసి ఉంటుంది. మీ అందరికీ మళ్ళీ చెబుతున్నా. ఇది మన ప్రాణాల సమస్య. కాబట్టి ఎంతో జాగ్రత్తగా, రహస్యంగా వ్యవహరించండి” అని సయ్యద్ వాళ్ళకి ఇక ఏ మాత్రం తర్జన భర్జనలకి తావివ్వకుండా, తలుపు తీసేసి తక్షణ కార్యక్రమంలో మునిగిపోయాడు. పరిస్థితి అర్థం చేసుకున్న సయ్యద్ కుటుంబం వెంటనే ఆయన చెప్పినట్లు చక చకా సర్దుకోవడం మొదలు పెట్టారు.
సయ్యద్ తన నౌకర్లలో పెద్దవాడిని పిలిచి, వాడి చేతిలో ఒక డబ్బు సంచీ పెట్టి “కరీం! బయట పరిస్థితి తెలుసు కదా. అందుకే మీరందరూ వెంటనే మీ ఇళ్లకో, ఊళ్లకో జాగ్రత్తగా వెళ్లిపోండి. మీ అందరికీ ఇవ్వాల్సినది ఇదిగో ఈ సంచీలో పెట్టాను. తిరిగి ఎంత త్వరగా వీలైతే అప్పుడు మిమ్మల్నందరినీ తప్పకుండా పిలుస్తాను. అంత వరకూ జాగ్రత్తగా ఉండండి. బయట మన పరిస్థితి అస్సలు బాలేదు కాబట్టి హడావిడి చెయ్యకుండా తక్షణమే వెళ్లిపోండి” అని చెప్పాడు.
కొద్ది సమయంలోనే నౌకర్లు అందరూ వెళ్లిపోయారని నిర్ధారించుకుంటున్న సమయంలో, సయ్యద్‌కి అనీస్ బాబాని ఎత్తుకుని సాధూరాం ఇంకా పక్కన అతని భార్య గౌరీ కనబడ్డారు.
సయ్యద్ “అరే! ఇన్ లోగ్ అభీ తక్ నహీ గయే క్యా?” అని తన బేగంని పిలిచాడు. ఆవిడ జంకుతూ చెప్పింది అనీస్ బాబా అస్సలు సాధూ చంక దిగకుండా ఏడుస్తున్నాడని.
సయ్యద్ వెంటనే గౌరితో “తుమ్ అభీ చలే జావ్. సాధూ థోడీ దేర్ మే ఆయేగా తుమ్హారా ఘర్” అని తనని అక్కణ్ణించి తరిమాడు. గౌరికి ఇదంతా చూసి చాలా ఆందోళన కలిగింది. ఏంటి నవాబ్ సాబ్ ఇలా ఏదో దాపరికంగా, తేడాగా వ్యవహరిస్తున్నాడు అనుకుంది. అయిష్టంగానే “సరే సాబ్ నేను వెళ్తున్నాను” అని పక్కకి తప్పుకుంది గౌరి.
ఇంతలో చప్పుడు చెయ్యకుండా సయ్యద్ ఇంటికి చేరుకున్న దగ్గరి బంధువులతో సహా, మూడు గంటల వ్యవధిలోనే నవాబ్ కుటుంబమంతా వాళ్లకు సంబంధించిన విలువైన నగా, డబ్బూ దస్కంతో తయారైపోయారు.
అప్పటికి రాత్రి పదకొండున్నర గంటలయ్యింది. బంగళాలో ఏ మాత్రం అలికిడి లేకుండా, అందరూ గుట్టు చప్పుడు కాకుండా వేచి చూస్తున్న సమయంలో, ఒక చిన్న బస్సు నెమ్మదిగా సయ్యద్ బంగళాలోకి వచ్చింది.
వెంటనే సయ్యద్ నవాబుకు నమ్మకస్థుడైన అతని మిత్రుడు జావేద్ ఇంటి గేటు మూసేసి, సయ్యద్ దగ్గరకొచ్చి “జనాబ్! జల్దీ చలియో. బాహర్ హిందుస్తానీ ఫౌజ్ గలీ గలీ ఛప్పా మార్ రహే హై” అన్నాడు.
సయ్యద్ పరుగున వెంటనే తన వాళ్లందరినీ ఆ చిన్న బస్సులో ఎక్కి కూర్చోమన్నాడు. గబ గబా అందరూ కుక్కినట్టు ఆ చిన్న బస్సులో సర్దుకున్నారు. చివరిగా సయ్యద్ భార్య అనీస్ బాబాని సాధూ చంక నుంచి తీసుకోబోతే, వాడు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. పిల్లవాడి పెద్ద ఏడుపుతో చుట్టు పక్కల తెలుస్తుందని కంగారు పడిన సయ్యద్, తను తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ వీలు కాలేదు.
ఇంతలో జావేద్ “జనాబ్ అబ్ బిల్కుల్ టైం నహీ హై, ఆప్ లోగా ఈసీ వక్త్ చల్నాహై” అని తొందర పెట్టాడు. ఏమీ పాలుబోని ఈ పరిస్థితిలో, సయ్యద్ వెంటనే అనీస్ బాబాని ఎత్తుకున్న సాధూరాంని కూడా బస్సులోకి తోసి, తను కూడా లోపలికెళ్ళి, బస్సు డ్రైవర్‌ని వెంటనే బయలుదేరమన్నాడు. జావేద్ పరుగెత్తుకుంటూ వెళ్లి బంగళా గేటు తెరిచాడు.
బస్సు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వైపు రివ్వున దూసుకెళ్లింది.
సాధూకి ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఇంకో వైపు గేటు బయట సాధూ కోసం ఎదురు చూస్తున్న గౌరి, బస్సు వెళ్లిపోయాక లోపలికెళ్ళి బంగళాలో సాధూ కోసం వెతికింది. అతను కనిపించకపోవటంతో ఏడుస్తూ, జావేద్‌తో “సాబ్ మా ఆయన ఏడీ?” అని ఆదుర్దాగా అడిగింది.
“గౌరీ నువ్వేమీ భయపడకు. కొద్దిసేపట్లో వచ్చేస్తాడులే సాధూ” అని చెప్పాడు జావేద్. దీనితో సమాధానపడని గౌరి ఆందోళనగా, సాధూని ఎక్కడకి తీసుకెళ్లారో చెప్పమని వేడుకుంది. ఐతే, అప్పటికే అక్కణ్ణించి తప్పించుకోడానికి తొందరపడుతున్న జావేద్, ఇంటి గేటు మూసివేసి “గౌరీ నువ్వు రేపు పొద్దున్నే రా చెప్తాను” అని కంగారుగా పరుగెత్తి వెళ్ళిపోయాడు.
సయ్యద్ కుటుంబంతో పరారవుతున్న బస్సు కిటికీలన్నీ పూర్తిగా పరదాలతో కప్పేశారు. సయ్యద్ అప్పుడప్పుడూ మెల్లగా కొంచెం పరదాని తొలగించి బయట చూస్తున్నాడు. బయట ఇండియన్ ఆర్మీ వాహనాలు ఎన్నో దూసుకెళ్ళటం కనపడుతోంది. ఎప్పుడెవరు తమ వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తారో అని సయ్యద్ గుండె దడ దడలాడుతోంది. అర్ధరాత్రి వేళ, సెప్టెంబర్ నెలలో కూడా బస్సులో ఉన్నవాళ్లందరూ చెమటలు పట్టి భయంతో వణికిపోతున్నారు.
ఏ అడ్డంకి రాకుండా త్వరగానే సయ్యద్ కుటుంబంతో ఉన్న బస్సు, వెనక దారి గుండా బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో విమానాలు నిలిపే చోటికి వచ్చి ఆగింది. సయ్యద్ నవాబుకు సహకారమందిస్తున్న కరాచీలోని అతని బంధువు ముకరం పంపిన కార్గో విమానమొకటి, చీకట్లో వీళ్ళ కోసం అక్కడ ఎదురు చూస్తోంది. ఏ మాత్రం జాప్యం చేయకుండా వీళ్లందరినీ ఎక్కించుకున్న కార్గో విమానం వెంటనే తన పయనం పాకిస్థాన్ లోని కరాచీ వైపు సాగించింది.
దాదాపు మూడు గంటల ప్రయాణం తరువాత, ఇంకా పూర్తిగా తెల్లవారని కరాచీ నగరంలోని ఎయిర్‌పోర్ట్‌లో, సయ్యద్ నవాబ్ సురక్షితంగా తన కుటుంబము, దగ్గర బంధువులతో సహా చేరుకున్నాడు. ఎంతో సాహసం చేసి పకడ్బందీగా ఇంతమంది ఇండియా నుంచి తప్పించుకుని పాకిస్థాన్ చేరుకోవటం ఒక పెద్ద సంఘటన.
కార్గో విమానంలోంచి దిగిన సయ్యద్ కుటుంబాన్ని చూసి, వీరి కోసమే కరాచీ ఎయిర్ పోర్టులో ఎంతో ఆదుర్దాగా వేచి చూస్తున్న ముకరం ఆనందానికి అవధుల్లేక పోయాయి. ఇక వీళ్ళందరూ హర్షాతిరేకంతో “పాకిస్థాన్ జిందాబాద్” అనే నినాదంతో హోరెత్తించారు.
పారిపోయి వచ్చిన సయ్యద్ బృందానికి పాకిస్థాన్లో ఆశ్రయం ఇంకా ఆ దేశపు పౌరసత్వానికి వీలు కల్పించడానికి, వీళ్లందరిదీ ఒక గ్రూప్ ఫోటో తీయించాడు ముకరం. మొత్తం అరవై మంది దాకా ఉన్న సయ్యద్ బృందం అంతా ఈ గ్రూప్ ఫొటోలో వుంది, ఒక్క సాధూరాం తప్ప.
భయంతో బిక్క చచ్చి, ఏమవుతోందో తెలీక ఏడుస్తున్న సాధూరాంని, సయ్యద్ నవాబ్ “ఏమీ భయపడకు నేనున్నానుగా” అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుండగా, ముకరం దగ్గరకొచ్చి “యే కౌన్ హై సయ్యద్ మియా?” అని ప్రశ్నించాడు. ముకరంకి ఎటువంటి పరిస్థితులలో తన నౌకరు సాధూని తీసుకు రావలసి వచ్చిందో వివరించి చెప్పాడు సయ్యద్. తన ముద్దుల కొడుకు అనీస్ బాబా పూర్తిగా కోలుకునే దాకా సాధూ తప్పనిసరిగా తన కుటుంబంతో పాటు ఉండాలని, అందుకోసం సాధూ కోసం కూడా ఏదైనా ఏర్పాటు చెయ్యాలని ముకరంని బ్రతిమాలాడు సయ్యద్.
ఒక హిందూ సేవకుడు సయ్యద్ నవాబ్ కుటుంబంతో ఇంతగా ముడిపడి ఉండడం ముకరంకి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా తెప్పించింది. అక్కడి పాకిస్థాన్ అధికారులకి ఇదంతా చెప్పి, అనవసర చిక్కుల్లో సయ్యద్ నవాబ్ పడకూడదని ఆలోచించిన ముకరం “యే ఠీక్ నహీ కియా సయ్యద్ మియా! క్యా కరే అబ్? కిసీ కో నహీ బతానా యే ముసల్మాన్ నహీ హై బోల్ కే” అని, సాధూ పేరుని సాదుల్లాగా మార్చి, సయ్యద్ కుటుంబంతో వచ్చిన అతని నౌకరుగా పాకిస్థాన్ అధికారులకి చెప్పి, అలాగే రికార్డు చేయించాడు. ఆ రోజు తన ప్రమేయం లేకుండానే విచిత్రమైన పరిస్థితులలో సాధూరాం కాస్తా సాదుల్లాగా మారిపోయాడు.
ముందునుంచీ సాధూగానే పిలవబడటం వల్ల కూడా ఈ పేరు మార్పుతో ఎవ్వరికీ ఇబ్బంది కాలేదు. పట్టరాని దుఃఖంతో సాధూ “సాబ్! ఇదేంటిలా జరిగింది. నా కుటుంబం లేకుండా నేను ఉండలేను. దయ చేసి నన్ను హైదరాబాద్ తిరిగి పంపించేయండి” అని సయ్యద్ కాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు.
“నువ్వేమీ దిగులు పడకు సాధూ. నువ్వు మా కుటుంబంతో అనీస్ బాబాని చూసుకుంటూ ఇక్కడే ఉండిపో. కొంచెం పరిస్థితులు చక్కబడగానే నీ భార్య గౌరిని కూడా ఇక్కడకి రప్పిస్తాను. ఇంతకంటే నేనిప్పుడేమీ చెయ్యలేను. ముందు నేను ఈ దేశంలో స్థిరపడే పనిలో ఉండాలి. అర్థం చేసుకో” అని నిక్కచ్చిగా చెప్పాడు సయ్యద్.
ఇక అందరూ కరాచీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి, అక్కణ్ణుంచి కొన్ని మైళ్ళ దూరంలోనున్న ముకరం జాగీరుకి చేరుకున్నారు.
చూస్తూ చూస్తూ రోజులు గడిచిపోతున్నాయి. ఇండియా నుంచి పరారై వచ్చిన సయ్యద్ నవాబ్ కుటుంబానికి శీఘ్ర ప్రాతిపదికన పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశ పౌరసత్వం ఇచ్చి, వ్యవసాయం చేసుకోవడానికి వీలున్న ఒక పెద్ద స్థలంతో బాటు పెద్ద ఇల్లు కూడా ఇచ్చింది. వీళ్ళతో పాటు సాధూరాం కూడా సాదుల్లాగా పాకిస్థాన్ పౌరుడయ్యాడు.
ఇంకో వైపు ఇండియాలో గౌరి కూడా పట్టు వదలకుండా సాధూ గురించి వాకబు చేస్తూ జావేద్‌ని బ్రతిమాలుతోంది. గౌరికి కొన్నాళ్ళకి జావేద్ చెప్పాడు ఇక సాధూరాం పాకిస్థాన్ నుండి తిరిగి రావడం అసాధ్యమని, అంతే కాకుండా సాధూ కాస్తా సాదుల్లాగా మారాడని.
ఇది విన్న గౌరికి నోట మాట పడిపోయింది. నిర్ఘాంతపోయిన గౌరి, జావేద్ కాళ్ళు పట్టుకు బ్రతిమాలింది తన భర్త సాధూ లేకుండా బ్రతకలేదని, తనని కూడా పాకిస్థాన్ పంపించేయమని. గౌరి పరిస్థితికి మనసు కరిగిన జావేద్ ఏడాది పాటు ప్రయత్నించి, గౌరి పేరు గోరీబీగా మార్చి, పాకిస్థాన్‌కు తరలి వెళ్తున్న సయ్యద్ చుట్టాలతో కలిపి కరాచీకి పంపించే ఏర్పాటు చేసాడు.
కొన్నాళ్ల క్రితమే గౌరి తల్లిదండ్రులు చనిపోయారు. ఇక తనకి మిగిలిన చెల్లెలు, తమ్ముడు గత్యంతరం లేని పరిస్థితిలో ఎంతో దుఃఖంతో గౌరిని పాకిస్థాన్ సాగనంపారు.
అలా 1950వ సంవత్సరంలో గోరీబీ ఉరఫ్ గౌరి తన యజమాని చుట్టాలతో బొంబాయికి రైల్లో వెళ్లి, అక్కణ్ణించి ద్వారక అనే పెద్ద నౌకలో మూడు రోజులు ప్రయాణించి పాకిస్థాన్ లోని కరాచీకి చేరుకుంది.
అక్కడ సాంప్రదాయ ముస్లిం వేషధారణతో గడ్డం పెంచుకుని ఉన్న సాదుల్లా ఉరఫ్ సాధూరాంని చూసిన గౌరికి నోట మాట రాలేదు. ఎంతోసేపు ఏడ్చిన గౌరి, కనీసం ఈ విధంగానైనా తన భర్తని చేరుకున్నందుకు కొంత ఊరట కల్గించుకుంది.
కరాచీకి దగ్గరలోనే ఉన్న ఒక ఊళ్ళో, సయ్యద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వమిచ్చిన భూమిని పొలంగా మార్చి సాయం చేస్తున్నాడు సాదుల్లా. అతని భార్య గోరీబీగా, గౌరి అక్కడి వాళ్లకు పరిచయం అయ్యింది. ఇప్పుడు సాధూరాం, గౌరి తమ కుటుంబాలతో దాదాపు శాశ్వతంగా దూరమయ్యారు. చదువులు లేకపోవటంతో వీళ్ళకి, వీళ్ళ బంధువులతో కనీసం ఉత్తరాలతోనైనా సంబంధం లేకుండా పోయింది.
మెల్లగా పాకిస్థాన్లోని పరిస్థితులను అలవాటు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీళ్లకు 1952లో కొడుకు పుట్టాడు.
సాధూరాం ఆ పిల్లవాడికి తన తండ్రి సిద్దయ్య గుర్తొచ్చేలా సాదిక్ అని పేరు పెట్టాడు.
సాధూరాం చిన్నప్పటినుండీ సయ్యద్ నవాబ్ ఇంట్లోనే పని చేయటం వలన, పాకిస్థాన్ వచ్చినా అతనికి పెద్దగా తేడా అనిపించలేదు. కానీ, గౌరి మాత్రం తన ఇంటివాళ్లను తలుచుకుంటూ చాలా బాధపడేది. రోజూ చాటుగా తనతో పాటు తెచ్చుకున్న సీతారాముల వారి ఫోటోని కొలుచుకుంటూ ఉండేది.
కొన్నాళ్ళకు వీళ్ళుంటున్న సింధ్ ప్రాంతంలోని స్థానికులకు, ఇంకా ముజాహిర్లుగా పిలవబడే ఇండియా నుంచి వలస వచ్చిన ముస్లింలతో గొడవలు మొదలయ్యాయి. ఇండియాలో ఎక్కణ్ణుంచో వచ్చిన సయ్యద్ ఇక్కడ బాగా కుదురుకుని ఆస్తులు సమకూర్చుకోవడం భరించలేని స్థానికులు, సయ్యద్ కుటుంబంతో తరచు ఘర్షణలకు దిగేవారు.
ఒకసారిలా జరిగిన తీవ్రమైన కొట్లాటలో, యజమాని సయ్యద్‌ని కాపాడబోయిన సాధూ తన ప్రాణాలు కోల్పోయాడు.
గౌరికి జీవితంలో ఇదొక కోలుకోలేని పెద్ద దెబ్బ. అప్పటికి సాదిక్ ఇంకా పదేళ్ల వాడే.
సింధీలతో ఘర్షణలు తట్టుకోలేని సయ్యద్ తన మకాం లాహోర్‌కి మార్చాడు. అతని కుటుంబంతోటే గోరీబీ ఇంకా సాదిక్ కూడా లాహోర్‌కి వచ్చేసారు. కొన్నేళ్ళకి, పదవ తరగతితో చదువు ఆపేసిన సాదిక్‌కి, కాలాషాకాకూలోని పాకిస్థాన్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా సయ్యద్ ఉద్యోగం ఇప్పించాడు.
ఉద్యోగంలో స్థిరపడ్డ సాదిక్‌కి, తనకి తెలిసిన హైదరాబాదుకు చెందిన ముజాహిర్ల అమ్మాయి సంబంధం చూసి, పెళ్లి జరిపించింది గోరీబీ. సాదిక్‌కి ఇద్దరబ్బాయిలు పుట్టారు. వాళ్ళ స్కూల్ చదువులు కూడా ఈ మధ్యే ముగిసాయి.
కాలం ఎంతో గడిచిపోయింది. గోరీబీకి వృద్ధాప్యం వచ్చినా ఇంకా తన పుట్టిన దేశం, తోబుట్టువుల గురించి దిగులు మానక పోవటంతో సాదిక్ చాలా బాధ పడేవాడు. తనకి ఉద్యోగం వచ్చిన తరువాత, అమ్మీ తరఫు కుటుంబం గూర్చి వాకబు చేయాలనుకున్నా, ఆవిడతో పాటు తన వాళ్ళెవ్వరూ చదువుకోకపోవటం వలన, సాదిక్ ఆమె కుటుంబం జాడ తెలుసుకోలేకపోయాడు.
ఇన్నాళ్ళకి, గోరీబీకి డెబ్బైఐదేళ్ళప్పుడు అనుకోకుండా హైదరాబాద్ నుంచి ఒక హిందూ వ్యక్తి, అది కూడా తెలుగు వాడి రూపంలో నన్ను చూసేసరికి సాదిక్ ఆనందానికి అంతు లేకపోయింది. అందుకే ఎంతో ఆతృతగా వాళ్ళమ్మ దగ్గరకు నన్ను ప్రాధేయపడి తీసుకెళ్లాడు సాదిక్.
ఈ రోజు నాతో గోరీబీ తన జీవిత కథ చెప్తుంటే విని, మొదటిసారి ఆవిడ గురించిన ఎన్నోవిషయాలు తెలిసిన సాదిక్ కుటుంబ సభ్యులు చలించిపోయారు.
నేను గోరీబీ భుజం మెల్లగా తట్టి “ఏడవకు గౌరమ్మా” అని ఓదార్చేసరికి, అంత దుఃఖంలో కూడా ఆమె “నన్ను గౌరమ్మా అని పిల్చినవా బిడ్డా!” అని ఎంతో ఆనంద పడింది.
అప్పటికే నేను సాదిక్ ఇంటికి వచ్చి మూడు గంటలయ్యింది. ఇక నేను తిరిగి వస్తానని బయలుదేరబోతుంటే, “లేదు బిడ్డా! నీవు ఈ రోజు మా ఇంట్లనే బువ్వ తినాలె” అనింది గౌరమ్మ. సాదిక్ మాత్రం సంశయిస్తుంటే, గౌరమ్మ “ఏమీ ఫరవాలేదు. మా ఊరి బిడ్డకు మనం తినేదే రొట్టెలు, కూర తినిపిద్దాం” అని కోడలికి వంట పురమాయించింది.
కొడుకు చేత వెంటనే ఇంకొక కప్పు టీ చేయించి నాకిచ్చి, నా పక్కనే కింద కూర్చుంది.
“బిడ్డా హైద్రాబాద్ లో మీదే బస్తీ” అనింది.
నేను “గౌరమ్మా! మాది సికింద్రాబాద్‌లో సైనిక్‌పురి” అన్నాను. “అదేడుంది బిడ్డా?” అనిందామె.
గౌరమ్మ అప్పుడున్న సమయంలోని ప్రాంతాలను ఆలోచించి “మా ఇంటికి దగ్గరలోనే అమ్ముగూడ, యాప్రాల ఉన్నాయి” అన్నాను నేను.
అంతే! గౌరమ్మ ఒక్కసారి ఎగిరి గెంతేసినంత పని చేసింది. ఎంతో సంబరంగా “బిడ్డా మా ఊరు కౌకూరు యాప్రాల పక్క పొంటే! నా పెళ్లి జరిగిందాకా నేను ఆడనే ఉన్నా” అనింది.
ఇప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. “ఔనా గౌరమ్మా! అయితే యాప్రాలలో కనకయ్య పంతులు నీకు తెలుసా” అని అడిగాను.
“అయ్యో! నాకు తెల్వకపోవుడేంది. కనకయ్య పంతులుకి యాప్రాలలో ఉన్న పొలంలోనే మా అయ్య పని చేసేటోడు. మా అమ్మ కూడా పంతులింట్ల పని చేసేది. నా చిన్నప్పుడు ఆ అయ్యింట్లనే నేనెక్కువ సమయం గడిపేది. కానీ, నీకు కనకయ్య ఎట్లా తెలుసు” అని సంభ్రమంగా అడిగింది గౌరమ్మ.
నేను చెప్పాను కనకయ్య పంతులు భార్య నారాయణమ్మ మా చుట్టాలని. పట్టరాని ఆనందంతో గౌరమ్మ నన్ను పట్టుకుని కుదిపేసి ఏడవడం మొదలు పెట్టింది.
“నా చిన్నతనంల గుర్తున్నప్పుడు పంతులుకు ముగ్గురాడ పిల్లలు ఉన్నరు. నా పెళ్లి సమయంల నారాయణమ్మకి మళ్ళీ ఆడబిడ్డ పుట్టింది. పాపం పంతులుకు కొడుకు పుట్టాలన్న కోరిక తీరెనో లేదో” అని గుర్తు చేసుకుంది గౌరమ్మ.
ఆవిడ జ్ఞాపక శక్తికి ఆశ్చర్య పోయాను నేను. “ఔను గౌరమ్మా! పంతులుగారికి ఇద్దరు కొడుకులు నాగేంద్ర, రాజు తరువాత పుట్టారు” అన్నాను.
వెంటనే గౌరమ్మ “ఔనా! చాల సంతోషమే. నా తమ్ముడు నర్సిమ్మ, చెల్లెలు స్వరూప వాళ్లకు తెల్సే ఉంటరేమో” అని ఆశగా అనింది.
నేను “ఔను గౌరమ్మా. బహుశా తెలిసే ఉంటారు. ఎందుకంటే వాళ్లింకా యాప్రాలలోనే ఉన్నారు” అన్నాను.
దీనితో గౌరమ్మ ఎంతో ఉత్సాహంతో “నా అయ్యవు! నీ కాల్మొక్త! నువ్వు ఊర్కి బోంగనే మీ వోల్లతోని అర్సుకుని మాకు జెప్పయ్య” అని వేడుకుంది.
నేను “తప్పకుండా గౌరమ్మా!” అని భరోసా ఇచ్చి, నా కెమెరాలో సాదిక్ కుటుంబంతో పాటు గౌరమ్మ ఫోటో తీసాను.
ఈ రోజు గౌరమ్మ జీవితంలో మర్చిపోలేని రోజు. ఇంత ఆనందంగా, ఉత్సాహంగా తమ దాదీని ఎప్పుడూ చూడని సాదిక్ పిల్లలు కూడా ఎంతో సంతోషపడ్డారు. అప్పటికే రాత్రి పదకొండు గంటలు దాటుతోంది. నేను సాదిక్‌తో “నేనిక బయలుదేరాలి. రేపటి ల్యాబ్ పనుల కోసం ప్రిపేర్ అవ్వాలి. అలాగే నా తిరుగు ప్రయాణానికి కేవలం రెండు రోజులే మిగిలింది కాబట్టి, బహుశా నేను మళ్ళీ గౌరమ్మని కలవలేనేమో” అని చెప్పాను.
గౌరమ్మ ఎంతో బాధ పడుతూ నాకు వీడ్కోలు చెప్పింది. అలాగే “బిడ్డా నీ ఋణం నేనెప్పటికీ తీర్చలేను” అన్నది.
తప్పకుండా గౌరమ్మ తోబుట్టువుల గూర్చి కనుక్కుని తెలియచేస్తానని నేను ఆమె దగ్గర సెలవు తీసుకున్నాను.
ఆ తరువాత రెండు రోజులు నేను ల్యాబ్‌లో చాలా బిజీగా గడపటంతో, సాదిక్‌తో ఇక మళ్ళీ మాట్లాడలేకపోయాను.
డాక్టర్ ఎరిక్ కూడా తన క్షేత్ర పరిశోధనలు ముగించుకుని, మేము తిరిగి ఢిల్లీకి బయలుదేరాల్సిన ముందు రోజు రాత్రి నన్ను కలిసాడు.
“ఏంటి శ్రీమన్ విశేషాలు! నీ పని పూర్తయ్యిందా? ఏమైనా చుట్టు పక్కల ప్రదేశాలు చూసావా” అని అడిగాడు.
నేను “డాక్టర్ ఎరిక్ నేను చుట్టు పక్కల విహార ప్రదేశాలు చూడలేదు కానీ, మీకొక నమ్మలేని సంఘటన గురించి చెప్తాను” అన్నాను.
“ఓహ్ రియల్లీ! ఏంటా విశేషం” అన్నాడు ఎరిక్.
“మీకు గుర్తుందా! మనం ఇక్కడకి ఫ్లైట్‌లో వస్తున్నప్పుడు నేను పాకిస్థాన్‌కు సంబంధించిన ఒక కల చెప్పాను కదా” అన్నాను ఎరిక్‌తో.
“యా! శ్రీమన్ నాకు గుర్తుంది. అయితే ఏంటి” అని కుతూహలంగా అడిగాడు ఎరిక్.
నేను సాదిక్ తోటి పరిచయం, అలాగే వాళ్ళమ్మ గారు గోరీబీతో కల్సిన తరువాత జరిగిన వివరాలను చెప్పేసరికి, ఎరిక్ “హే! దిస్ ఈస్ అన్ బిలీవబుల్!” అని నమ్మలేకపోయాడు.
“ఇటువంటి సంఘటనలు కధలలో, సినిమాల్లో చూస్తాము. అలాంటిది నీ కలే ఇలా నిజమవ్వడం, అలాగే నేను కూడా దానికి పరోక్షంగా కారకుడవ్వడం భలే థ్రిల్లింగా ఉంది” అని ఎరిక్ చాలా సంతోషించాడు.
నేను ఎరిక్‌తో “ఈ సంఘటన గురించి మీరు ఎవ్వరితో ఇక్కడ ప్రస్తావించకండి. దీనిని ఈ దేశంలో ఎలా స్వీకరిస్తారో నాకు తెలియదు. నాకు మాత్రం ఈ విషయంలో మీ నుంచి ఇంకో సాయం కావాలి. ప్లీజ్ నాకు సహకరిస్తారా” అని అభ్యర్ధించాను.
ఎరిక్ “ఓకే శ్రీమన్. ఇంతకీ నేనేం చేయాలో చెప్పు” అన్నాడు.
“ఎరిక్ త్వరలోనే ఇక్కడి నుంచి సైంటిస్ట్ ఇజాజ్ హైదరాబాద్‍కు వస్తున్నాడు కదా, అతనితో పాటు సాదిక్ కూడా సహాయకుడిగా వచ్చే ఏర్పాటు చేయగలరా” అన్నాను నేను.
ఎరిక్ దీని గురించి ఆలోచిస్తుండగా “అలాగే సాదిక్ వాళ్ళ అమ్మగారు విజిటర్స్ వీసా మీద హైదరాబాద్ వచ్చేటట్లు స్పాన్సర్ చేయాలి మనము” అన్నాను నేను. కొద్ది సేపు బాగా ఆలోచించి ఎరిక్ దీనికి ఒప్పుకున్నాడు.
మర్నాడు ఢిల్లీ ద్వారా మా టీం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసింది.
వచ్చిన మర్నాడే యాప్రాలలోని కనకయ్య పంతులుగారి ఇంటికి వెళ్లి, నాగేంద్రని కలిసాను. కాలానుగత మార్పుల వల్ల, ఈ సమయానికి తండ్రి కనకయ్యగారి భూములు చాలా వరకు అమ్మేసి, అన్నదమ్ములిద్దరూ ఉద్యోగాలలో కుదురుకున్నారు. నేను నాగేంద్ర ఇంకా రాజుకి, పాకిస్థాన్లో నాకు కలిగిన అనుభవం గురించి చెప్పేసరికి వాళ్ళెంతో ఆశ్చర్యపోయారు.
నేను వాళ్ళతో “మీ చిన్నప్పుడు మీ దగ్గర పని చేసిన గౌరి తోబుట్టువులు నర్సిమ్మ ఇంకా స్వరూప గుర్తున్నారా? వాళ్ళ ఆచూకీ కనుక్కోగలరా” అని అడిగాను. వాళ్ళు వెంటనే తమ పాత పనివాళ్లను పిలిచి వాకబు చేస్తే, అదృష్టవశాత్తు గౌరి తమ్ముడు నర్సిమ్మ ఇప్పటికీ కౌకూరులోనే ఉన్నాడని తెలిసింది. స్వరూప ములుగు అనే ఊర్లో ఉంది.
నాగేంద్ర, రాజు నన్ను నర్సిమ్మ ఇంటికి తీసుకువెళ్లారు. నర్సిమ్మ అప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. నర్సిమ్మకి డెబ్భై ఏళ్ళు వచ్చాయి. ఊత కర్ర సాయంతో నడుస్తున్నాడు. గౌరి గురించిన వివరాలు నర్సిమ్మకి తెలిపి, తన ఫోటో చూపేసరికి అతనితో పాటు చుట్టుపక్కల వాళ్లకి కూడా ఆనందంతో మాట రాలేదు.
తన చిన్ననాట దూరమైన అక్క ఫోటోని పోల్చుకున్న నర్సిమ్మ భోరుమని ఏడ్చాడు. గౌరి గురించి అన్ని వివరాలు చెప్పించుకుని ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. “అయ్యా! మా అక్క పాకిస్థాన్ వెళ్లిన తరువాత ఆమెతో పూర్తిగా సంబంధం తెగిపోయింది. చదువు సంధ్యలు తక్కువైన మాకు ఉత్తరాల సాయం కూడా లేకపాయె” అని నర్సిమ్మ బాధ పడ్డాడు.
ఆ సాయంత్రం నర్సిమ్మ కుటుంబం, అతని దగ్గరి బంధువుల హడావుడితో అతనింటి చుట్టూ కోలాహలంగా మారింది.
గౌరి గురించి కథలా వినడమే తప్ప, ఆమె గురించిన పాకిస్థాన్ వివరాలు ఏమీ తెలియని వీళ్లకు ఈ సంఘటనొక అద్భుతమే, దైవ ఘటనే. కొంచెం సేపు వాళ్లందరితో ముచ్చటించిన తరువాత, నర్సిమ్మతో మళ్ళీ వస్తానని చెప్పి, అతనింటి నుండి కష్టం మీద బయటపడ్డాను నేను.
ఆ రోజు రాత్రి వెంటనే సాదిక్‌కి ఈమెయిల్ పంపించి ఈ విషయాలన్నీ వివరించాను. ఎరిక్ సాయంతో నాలుగు నెలల్లోనే సాదిక్ తన తల్లి గోరీబీని తీసుకుని హైదరాబాద్ రాగలిగాడు. గౌరిని కలవటానికి నర్సిమ్మ బంధువులతో పెద్ద గుంపుగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాడు. ఆ సమయంలో, ఈ అక్కా తమ్ముళ్ల కలయికని చూట్టానికి వచ్చిన బంధువుల హడావిడి మిన్నంటింది.
గౌరి నర్సిమ్మని కావిలించుకొని ఏడుస్తుంటే చూసిన వాళ్ళందరి కళ్ళంబడి నీళ్లాగలేదు. సాదిక్‌కి తన మేనమామ నర్సిమ్మని పరిచయం చేసింది గౌరి. సాదిక్‌ని అక్కున చేర్చుకున్నాడు నర్సిమ్మ. చాలా సేపు బంధువుల కోలాహలం తరువాత ఎయిర్ పోర్ట్ నుంచి గౌరమ్మ, సాదిక్‌తో పాటు నర్సిమ్మ ఇంటికెళ్ళింది.
మర్నాటినుంచీ సాదిక్ నాతో పాటే మా కంపెనీకి వచ్చి తన సైంటిస్ట్‌కి సహాయం చేయటం మొదలుపెట్టాడు.
అలాగే సాయంత్రాలు తన అమ్మీ, అబ్బా వైపు చుట్టాలతో ఆప్యాయంగా కాలక్షేపం చేస్తూ, పదిహేను రోజులు త్వరగా గడిచిపోయాయి. ఇక అతనికి తన సైంటిస్ట్‌తో పాటు తిరిగి పాకిస్థాన్‌కు వెళ్ళవలసిన సమయం వచ్చేసింది.
దీనికి ముందే నర్సిమ్మ, స్వరూపతో పాటు బంధువులందరూ గౌరమ్మకి ఇంకొన్ని నెలల వీసా గడువున్నందున, అప్పటిదాకా గౌరమ్మని ఇక్కడే ఉంచమని గొడవ చేశారు. ఇదెలా సాధ్యమని సాదిక్ మొహమాటపడుతుంటే, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఈ విషయంలో సాయం చేయమని ప్రాధేయపడ్డారు.
నేను “ఏం ఫరవాలేదు సాదిక్. మూణ్ణెల్ల తరువాత ఢిల్లీలో నేనే మీ అమ్మని ప్లేన్ ఎక్కిస్తాను” అని భరోసా ఇచ్చాను.
గౌరమ్మ ఆనందానికి అవధుల్లేక పోయాయి. సాదిక్ పాకిస్థాన్‌కు తిరిగి వెళ్ళిపోయాడు.
గౌరమ్మ తన చిన్న నాటి ప్రదేశాలు చూస్తూ, మల్లేపల్లిలో తన భర్త బంధువుల ఇళ్లకు కూడా వెళ్ళింది. తనకు గుర్తున్న హైదరాబాద్ ఇంకా లష్కర్ ఎంతో మారిపోయినా, తన పుట్టినింటి ప్రాంతంలో మాత్రం పెద్దగా మార్పులు లేకపోవటంతో గౌరమ్మకి హాయిగా ఉంది. యాప్రాలలో తనకెంతో ఇష్టమైన మల్లన్న గుడికి రోజూ వెళ్తోంది.
తోబుట్టువుల కుటుంబంతో, ఇరుగుపొరుగు వారితో కబుర్లు చెబుతూ గౌరమ్మ సంతోషంగా కాలం గడిపేస్తోంది.
ఒక రోజు మా ఇంటికి వచ్చిన గౌరమ్మతో నేను “గౌరమ్మా నీ వీసా గడువు ఇంకో పదిహేను రోజులలో ముగుస్తుంది. సాదిక్ కూడా మెసేజ్ పెట్టాడు నీ తిరుగు ప్రయాణం గురించి” అన్నాను.
ఈ మాట వినగానే గౌరమ్మకి దుఃఖం పొంగుకొచ్చింది. “బిడ్డా! నేనిప్పుడే లాహోర్ బోను” అన్నది.
నేను “అట్లా కుదరదు కదా గౌరమ్మా, ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు” అన్నాను.
గౌరమ్మ “అదేంది బిడ్డా! ఇది నా పుట్టిన ఊరు, నా దేశం. ఎందుకు కుదరదు?” అని ఆవేశంగా అనింది. నేనేమీ మాట్లాడకపోయేసరికి, పరిస్థితి అర్ధమై “బిడ్డా నన్ను తిరిగి పంపియ్యకు. ఇంకొన్ని దినాలు ఈడ్నే ఉంచి పుణ్యం కట్టుకో” అని ప్రాధేయపడింది.
నేను గౌరమ్మతో చెప్పాను ఇంకొన్నాళ్ళు ఆమె ఇండియాలో ఉండడానికి వీసా ఎక్స్టెన్షన్ దొరుకుతుందేమో ప్రయత్నిస్తానని. అలాగే చెప్పాను అది వచ్చినా, తర్వాత తాను ఖచ్చితంగా పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుందని.
ఇది విన్న తరువాత గౌరమ్మలో చాలా మార్పు వచ్చింది. ఇన్నాళ్లూ ఎంతో ఉత్సాహంగా తన వాళ్ళతో ఉన్న ఆమె ఎంతో దిగులు పడటం మొదలయ్యింది. అప్పటినుంచీ గౌరమ్మ ప్రతి రోజూ చాలా సమయం మల్లన్న గుడిలోనే రాత్రిదాకా గడిపేస్తోంది.
నర్సిమ్మ తన కొడుకు ద్వారా నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, గౌరమ్మ మౌనంగా ఉంటోందని, ఆహారం కూడా పట్టించుకోకుండా మల్లమ్మ గుడి ప్రాంగణంలోనే కాలం గడుపుతోందని.
గౌరమ్మ వీసా ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నిస్తుంటే సులభం కాదని నాకూ అనుభవమౌతోంది.
ఇంకొన్ని రోజులే వీసా గడువుండగా, గౌరమ్మ ఒక రోజు తెల్లవారు జామున మల్లన్న గుడిలోనే ప్రాణం విడిచింది.
ఇన్నాళ్లూ ఈమెయిల్స్‌తో ఆమె క్షేమ సమాచారం చేరవేస్తున్న నేను, ఆ రోజు సాదిక్‌కి ఫోన్ చేసి ఈ లోకం నుంచి గౌరమ్మ తుది ప్రయాణం గురించి చెప్పవలసి వచ్చింది.
సాదిక్ దుఃఖంతో “డాక్టర్ సాబ్ నేను వెంటనే ఇండియా రాలేను. మీరు దయచేసి మా మామయ్యతో అమ్మీ అంత్యక్రియలు ఆమెకి తగినట్లుగా కౌకూరులోనే జరిపించమని చెప్పండి. దీనికయ్యే ఖర్చు మొత్తం నేను త్వరలోనే మామయ్యకి అందజేస్తాను” అని చెప్పాడు.
“డాక్టర్ సాబ్ మా అమ్మీ ఎంతో అదృష్టవంతురాలు. దేవుడు మీ ద్వారా అమ్మీ తన వాళ్ళను కలుసుకుని, ఆమె కోరుకున్న ప్రదేశంలోనే మరణించేటట్లు అనుగ్రహించాడు” అన్నాడు సాదిక్.
“నాకొచ్చిన కల నిజమై గౌరి ఇండియా తిరిగి వచ్చిందో, లేక ఇక్కడ తన తుది ప్రయాణానికి నేను కారకుడయ్యానో, నాకర్థం కావట్లేదు సాదిక్” అన్నాను నేను.
దానికి సాదిక్ “డాక్టర్ సాబ్ మీరలా భావించవద్దు. మా అమ్మీ నిండు జీవితం గడిపి, తన తుది దశలో తృప్తిగా చనిపోయింది. నేనే దురదృష్టవంతుణ్ణి. నాకంటూ పాకిస్థాన్‌లో చుట్టాలెవ్వరూ లేరు. నా మతమేంటో? నేనెలా బ్రతకాలో, చావాలో కూడా తెలియదు” అని ఏడ్చాడు.
“లేదు సాదిక్. నువ్వు హైదరాబాద్ రావడం వల్ల నీ అమ్మీ, అబ్బా వైపు చుట్టాలు కూడా పరిచయమయ్యారు. సాదిక్! కాలం మారింది. మతము, సాంప్రదాయాల అర్థం గ్రహించకుండా చాలా మంది అవి కేవలం ఏదో వేడుక కోసమో, ఆర్భాటం కోసమో పాటిస్తున్నారు. ఏ మతం పాటించినా ఫరవాలేదు కానీ మానవత్వం మర్చిపోకుంటే చాలు” అన్నాను.
“ఔను డాక్టర్ సాబ్. నేను కూడా ఇండియా రావటంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. రాబోయే కాలం బాగుంటుందనే ఆశిస్తున్నాను. మీ దువా మా మీద ఉండాలి” అన్నాడు సాదిక్.
“సాదిక్ నాక్కూడా చాలా సంతోషంగా ఉంది పాకిస్థాన్‌లో నాకొక మిత్రుడు, అతని కుటుంబం ఉన్నారని. నీకెప్పుడు వీలైతే అప్పుడు నీ కుటుంబాన్ని హైద్రాబాదుకు తీసుకు రా” అన్నాను నేను.
“తప్పకుండా సాబ్. మీ ఋణం నేనెప్పటికీ తీర్చుకోలేను. మీరు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు పాకిస్థాన్ రావాలని కోరుకుంటున్నాను. బహుత్ షుక్రియా సాబ్” అని సాదిక్ తన మాటలు ముగించాడు.
ఈ సంఘటన తరువాత కొన్నాళ్లకే, నేను పని చేస్తున్నసంస్థ నుంచి ఉద్యోగం మారి విదేశాలకి వెళ్లి, ఈ మధ్యే ఇండియా తిరిగి రావడం జరిగింది.
సాదిక్ ఇంతవరకు తిరిగి హైదరాబాద్ రాలేకపోయాడు. కానీ, నాతో అప్పుడప్పుడూ ఈమెయిల్ ద్వారా క్షేమ సమాచారం తెలుపుతూనే ఉన్నాడు.
చాలా కాలం తరువాత, రేడియో పుణ్యమాని ఈ రోజు నాకు గౌరమ్మ తిరిగొచ్చిన నిజమైన కల గుర్తొచ్చింది.
రేడియోలో పాటలు ఇంకా వస్తూనే ఉన్నాయి.
“నీ దయ రాదా. రామా! నీ దయ రాదా” అని సుశీలమ్మ గారి పాట వస్తోంది. ఇంతలో వంటింట్లోంచి కుక్కర్ కూత వినిపించి, నిజమే ‘ఏది నీ దయా?’ అనుకుంటూ వడిగా అటువైపు అడుగులేసాను.