చిలకలు వాలే చెట్టు

0
3

[dropcap]“పా[/dropcap]డు చిలకలు, పిట్టలు, ఉదయం, సాయంత్రం వాటి అరుపులతో నిద్ర పట్టడం లేదు. అదీగాక, ఈ రావిచెట్టొకటి, అస్తమానం ఆకుల్ని రాల్చడం, పెరడంతా ఈ చెత్తే, దీన్ని వూడ్చుకొనేందుకే రోజంతా సరిపోతూ వుంది” డెబ్బై ఏళ్ల ముసలి మీనాక్షమ్మ గట్టిగా చెబుతూ వుంటే వింటూ వున్నాడు రామనాథం.

మీనాక్షమ్మ పాతకాలపు ఇల్లు కొత్తవీధిలో వుంది. ఆ వీధి ఒకప్పుడు వూరి చివర కొత్తగా ఏర్పడింది. కానీ ఇప్పుడు వూరు అడ్డూ అదుపు లేకుండా విస్తరించడంతో ఆ వీధి పట్టణం నడిబొడ్డునే వున్నట్లు లెక్క. ఆ ఇల్లు చిన్నదేగాని, లంకంత పెరడు వుంది. మీనాక్షమ్మ భర్త పదేళ్ల క్రితమే పోయాడు. ఆమె కొడుకు ఢిల్లీలో వున్నాడు. కూతురు బెంగుళూరులో వుంది. మీనాక్షమ్మ వాళ్ల దగ్గరకు వెళ్లి వుండడానికి ఇష్టపడక తాను, తన భర్త చిరకాలం జీవించిన వూరిలోనే వుండాలన్న కోరికతో తన పాతకాలపు ఇంటిలోనే జీవిస్తూ వుంది.

ఇల్లు, పెరడు వూడ్చుకోవడం, పిట్టలను తరమడం, వంట చేసుకోవడం, ఇరుగు పొరుగుతో కబుర్లాడడం, తీరిక వేళల్లో భగవద్గీత చదవడంతోనే ఆమెకు కాలక్షేపమౌతూ వుంది.

రామనాథం ఇరవై ఏళ్లపాటు మీనాక్షమ్మ పొరుగింట్లోనే వున్నాడు. ఆమె భర్త సంజీవితో రామనాథానికి మంచి దోస్తీ వుంది. రామనాథం పిల్లలిద్దరూ కొత్తవీధి సమీపంలోని బజారువీధిలో చిల్లరకొట్టు నడుపుతూ వున్నారు. పొదుపుచేసిన డబ్బుతో ఆ ఉమ్మడి కుటుంబం వూరి చివర ఒక అపార్ట్‌మెంటు కొని అక్కడకు మారింది. కానీ రామనాథం కొడుకులకు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడానికి, ఏదైనా పని వున్నప్పుడు కొట్ల నుండి రావడానికి చాలా ఇబ్బందిగా వుంది. అందుకే కొడుకులు, కోడళ్ళు కూడబలుక్కుని రామనాథాన్ని ఒక పని మీద ముసలామె ఇంటికి పంపారు. రామనాథం చిన్నగా తాను వచ్చిన పని మీనాక్షమ్మతో ప్రస్తావించాడు.

“అక్కయ్యా, నీ బాధ నాకర్థమౌతూ వుంది. మేమూ వేరే ఇంటికి వెళ్లాము కానీ మా పిల్లలకు వ్యాపారాలు దూరమైపోయాయి. నువ్వు ఏమీ అనుకోనంటే నాదొక విన్నపం” అన్నాడు రామనాథం.

“ఏందో అది?” పెరడు వూడుస్తూనే అన్నది మీనాక్షమ్మ.

“మా అపార్ట్‌మెంటు గ్రౌండ్ ఫ్లోర్ లోనే వుంది, మెట్లెక్కే పని లేదు. వాచ్‌మన్ వున్నాడు. బజారు నుండి సరుకులు తెచ్చిస్తాడు. పనిమనిషి వుంది. నీకు ఇల్లు వూడ్చి, గిన్నెలు తోమి వెళ్తుంది. నువ్వు ఎవ్వరికీ పైసా ఇవ్వవలసిన పనిలేదు. నువ్వు దయచేసి మా ఇంట్లోకి మారగలవా? మేము నువ్వు అనుమతిస్తే మీ ఇంట్లో వచ్చి అద్దెకి వుంటాం. నువ్వు మాకు అద్దె చెల్లించనవసరం లేదు. మేమూ నీకు ఏమీ ఇవ్వం. పనిమనిషికీ, వాచ్‌మన్‌కు మేమే డబ్బులు ఇచ్చుకుంటాం. నువ్వు దయచేసి మా కోరికను మన్నించు” చొరవ తీసుకొని అడిగాడు రామనాథం.

“ఏందేందీ, నేనీ ఇల్లు ఖాళీ చేసి మీ ఇంట్లో వుండాలా? నీకు పిచ్చా, కుదరదంతే” అన్నది ముసలావిడ కోపంగా.

రామనాథం ఎంత ప్రాధేయపడినా పెద్దామె మనసు మార్చుకోలేదు. వూసురోమని రామనాథం ఇల్లు చేరాడు.

ఆ సాయంత్రం పిట్టలు మళ్లీ వచ్చి పెరడంతా గలీజు చేసి వెళ్లాయి. చెట్లు వుండేసరికి కొన్ని కోతులు కూడా చేరి మీనాక్షమ్మను భయపెట్టసాగాయి. ఆలోచిస్తే ఆమెకు రామనాథం చేసిన ప్రతిపాదన బాగనే వుందనిపించింది.

***

మీనాక్షమ్మ అపార్ట్‌మెంట్లో చేరి వారం రోజులైంది. పనిమనిషి వచ్చి మరబొమ్మలా చక చకా ఇల్లు వూడ్చి, గిన్నెలు తోమి వెళ్తుంది. వాచ్‌మన్ డబ్బు తీసుకొని ఆమెకు పప్పులు, వుప్పులు, కూరా నారా తెచ్చిస్తున్నాడు. మీనాక్షమ్మకు ప్రాణం హాయిగానే వుంది.

కానీ పాత ఇంటిలో ఇరుగు పొరుగు వాళ్ళు కబుర్లు చెప్పేవారు. పిట్టలు, పక్షులు గోల చేసినా, సందడిగా వుండేది. ఇక్కడ పనిమనిషి ఎక్కువ మాట్లాడదు. వేరే ఇళ్లల్లో పని వుందని వెళ్లిపోతుంది, పక్క వాటాల వాళ్ళు హడావిడిగా పరుగెత్తుతూ వుంటారు. ఈవిడ పలకరించినా తమను కానట్లు ఉరుకుతూ వుంటారు. వారం రోజులకే మీనాక్షమ్మకు ఆ అపార్ట్‌మెంటు జీవితంపై మొహం మొత్తింది. రామనాథంకు ఫోన్ చేసి తాను తన ఇంటికి వచ్చెయ్యదల్చానని చెప్పింది.

రామనాథం కొడుకులిద్దరూ తమ దుకాణాలకు ఇల్లు దగ్గరగా వుండడంతో, మధ్యాహ్నం భోజనానికి, కాఫీకి, టిఫెన్‌కు ఇంటికి వచ్చి, చాలాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తుండడంతో పనివాళ్లు డబ్బు కొట్టేయడంతోపాటూ, వ్యాపారంలో నష్టం కూడా వస్తోంది. రామనాథం మామ్మగారు ఇంటికి వచ్చేస్తానంటే అందుకే వెంటనే ఒప్పేసుకున్నాడు.

మీనాక్షమ్మకు ఇప్పుడు పక్షులు చేసే శబ్దాలు చెవులకింపుగా వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here