[dropcap]నే[/dropcap]ను నవలలు ఎలా రాస్తానో చెప్పడం కోసం ఓ నవల ‘అరణ్యపర్వం’ ఎలా రాశానో చెప్తాను.
మొదట ఈ కథాంశంతో నవల రాయాలన్న ఆలోచన ఎలా కలిగిందో చెప్పాలి. నేను నాగపూర్‌లో పని చేస్తున్న రోజుల్లో దినపత్రికల్లో అడవి జంతువులకు సంబంధించిన ఏదో ఒక వార్త తప్పకుండా కన్పించేది. నాగపూర్ చుట్టూ పెంచ్, తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, కల్మేశ్వర్ అడవితో పాటు మరికొన్ని అడవులున్నాయి. ముఖ్యంగా వార్తలు పోచర్లకు సంబంధించి ఉండేవి. అప్పుడే మొదటిసారి పార్థీ తెగ గురించి చదివాను.
మరాఠ్వాడా ప్రాంతంలో ఉండే సంచార జాతికి చెందిన పార్థీ తెగ ముఖ్య వృత్తి అడవి జంతువుల్ని చంపి, వాటి చర్మాల్ని, ఎముకల్ని అమ్మడం. ఆంగ్లేయులు పరిపాలించే రోజుల్లో ఈ తెగని క్రిమినల్ ట్రైబ్ చట్టం కింద చేర్చి, వాళ్ళమీద నేరస్థులుగా ముద్ర వేసి, జంతువుల్ని వేటాడినట్టు వేటాడటం వల్ల వాళ్ళ జనాభా సగానికి పైగా తగ్గిపోయింది.
ఆ తెగ గురించి తెల్సుకోవాలన్న ఆసక్తితో కొంత సమాచారం సేకరించాక, వాళ్ళ జీవనవిధానం గురించి, వాళ్ళ దుర్భరమైన జీవితాల గురించి నవల రాయాలన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది.
పార్థీ తెగలోని మగవాళ్ళకు అడవి జంతువుల్ని, ముఖ్యంగా పులుల్ని వేటాడి, వాటి చర్మాల్ని అమ్ముకోవటమే జీవనోపాధి కాబట్టి పులుల గురించి సమాచారం సేకరించాను.
బ్రిటీష్ వాళ్ళ హయాంలో మన దేశంలో పులుల సంఖ్య యాభైవేలకు పైనే ఉండేది. ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వేల కంటే తక్కువకు పడిపోవడానికి కారణం పోచర్లే. సంసార్ చంద్ అనే ఓ పేరుమోసిన పోచర్ నేపాల్, టిబెట్ దేశాల్లోని కేవలం నలుగురు కస్టమర్లకు 470 పులి చర్మాల్ని, 2130 చిరుత చర్మాల్ని అమ్మాడంటేనే పోచర్ల వల్ల జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థమైంది.
చైనాలో మందుల్ని తయారు చేయడంలో పులుల ఎముకల్ని వాడతారు. చివరికి పులుల విసర్జకాల్ని కూడా మందుల్లో వాడతారు. వాటి ఎముకల్తో ఓ రకమైన వైన్ తయారుచేస్తారు. దాన్ని సేవించడం వల్ల పులికున్నంత బలంతో పాటు మగతనం పెరుగుతుందన్న నమ్మకం వల్ల వేలం వెర్రిగా కొంటారు. అందుకే పులిచర్మం, దాని ఎముకలు, మాంసం బైటి మార్కెట్లో కొన్ని లక్షల ధర పలుకుతాయి.
పులికి మనిషి కన్నా జ్ఞాపక శక్తి ఎక్కువ. వేటాడటప్పుడు గొడ్ల మందలో ఒకేఒక గొడ్డుని ఎన్నుకొంటుంది పులి. ఆ గొడ్డు కోసమే ప్రయత్నిస్తుంది. అది తప్పించుకుని పోతే మరో గొడ్డు దానికి సమీపంగా ఉన్నా దాని జోలికి పోదు.
పులి మాంసం మేక మాంసంలానే రుచిగా ఉంటుంది. ఎటొచ్చీ దానికన్నా మృదువుగా ఉంటుంది. దాన్ని తింటే చాలా బలమొస్తుందని వాళ్ళ నమ్మకం. మొదట గుండెను తిన్నాక మిగతా మాంసం తింటే పులిలా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని వాళ్ళలో ఓ మూఢ నమ్మకం కూడా ప్రచారంలో ఉంది.
పులి చాలా తెలివి గల జంతువు. దాని మెదడు మిగతా అన్ని జంతువుల మెదడు కన్నా పెద్దది. దాదాపు చింపాంజీలకుండేంత సైజు మెదడు. అది పోరాడేటప్పుడు కూడా తన ప్రత్యర్థిని బట్టి స్టయిల్ మార్చుకుంటుంది. జింకనో, అడవి పందినో వేటాడేటప్పుడు దాని మెడ దగ్గర రక్తం సరఫరా చేసే నరాల్ని కొరికి చంపేస్తుంది లేదా వాటి మెడ గట్టిగా పట్టుకుని అది గింజుకుంటున్నా విడవకుండా వూపిరాడకుండా చేసి చంపేస్తుంది. అదే ఎలుగుబంటితో తలపడినపుడు తన పంజా దెబ్బతో దాని తలని బద్దలు చేస్తుంది లేదా దాని వెన్నెముకని విరిచేస్తుంది. అది నీళ్ళలో ఈదేటపుడు ఎపుడైనా మొసలిని ఎదుర్కోవాల్సి వస్తే దాని తల మీద కొట్టదు. మొసలి తలంతా బలమైన పొలుసులతో కప్పబడి ఉంటుందని దానికి తెలుసు. అందుకే మొసలిని వెల్లకిలా తిప్పి మెత్తగా ఉండే దాని పొట్టని చీల్చేస్తుంది.
మనుషుల్ని వేటాడటం పులుల స్వాభావిక లక్షణం కాదు. మనుషుల రక్తం రుచిమరిగిన పులి మనుషుల్ని తప్ప జంతువుల్ని వేటాడంలో ఆసక్తి చూపదనే మాట కూడా అపోహ మాత్రమే.
రెండు సందర్భాలలో మాత్రమే పులి మేన్‌ఈటర్‌గా మారుతుంది. అది జంతువుని వేటాడాలంటే ఆ జంతువుకన్నా వేగంగా పరుగెత్తాల్సి వస్తుంది. దాంతో కలబడి దాని గొంతుని దొరకబుచ్చుకోవాల్సి వస్తుంది. దాన్ని చంపాక నోటితో పట్టుకుని ఈడ్చుకుపోవాల్సి వస్తుంది. ఈ చర్యలన్నిటికీ బలం అవసరం. పులి ముసలిదైపోయాక ఇవన్నీ చేయడానికి సరిపడా శక్తి ఉండదు. దంతాలు కూడా బలహీనపడి ఉంటాయి. అటువంటప్పుడు పులి మనుషుల్ని చంపడానికి అలవాటు పడ్తుంది. ఒంటరిగా ఉండే మనుషుల మీద దాడి చేస్తుంది. చాటున పొంచిఉండి ఒక్కసారిగా దాడి చేయడంవల్ల మనిషి సులభంగా దొరికిపోతాడు.
కొన్ని కారణాల వల్ల పులి గాయపడి వేటాడటానికి పనికిరాకుండా పోతుంది. ప్రమాదవశాత్తు దాని కోరలు విరిగిపోవచ్చు. దాని పంజాలకు గాయాలు కావొచ్చు. ముఖ్యంగా ముళ్ళపందితో తలపడినప్పుడు పులి నోట్లో, శరీరంలో దాని ముళ్ళు గుచ్చుకునిపోయి పుండ్లుగా మారటంవల్ల అది అశక్తురాలై మనుషులను వేటాడుతుంది. అంటే గత్యంతరంలేని పరిస్థితుల్లో మాత్రమే పులి మనిషి మీద దాడి చేస్తుంది తప్ప మనిషి మాంసం రుచిమరిగి కాదు.
పులి బాగా ధైర్యంగల జంతువు. చిరుతలా పిరికిది కాదు. అందుకే మాములుగా పగటి పూట కానీ సాయంత్రాల్లో గాని వేటాడుతుంది. దాని కనుగుడ్లు పిల్లి కనుగుడ్లలా చీలి ఉండవు. గుండ్రంగానే ఉంటాయి. ఐనా చీకట్లో అది మనిషికన్నా ఆరింతలు స్పష్టంగా చూడగలదు.
పార్థీ తెగ గురించి, పులుల గురించి కొంత సమాచారం సేకరించాక, నవల్లో చెప్పాల్సిన కథ స్కెలిటన్ ఆలోచించుకున్నాను. గుంజన్ సింగ్ అనే ఓ పార్థీ యువకుడు ఈ నవల్లోని ముఖ్య పాత్ర. అతను నలభై నాలుగు పులుల్ని చంపి ఉంటాడు. అతను చంపిన నలభై ఐదో పులి ఆడపులి. దాని రెండు పులి పిల్లల కళ్ళ ఎదురుగానే ఆడపులిని చంపుతాడు. ఆ రెండు పులి పిల్లలు మగవి. అతను తర్వాత పులుల సంరక్షకుడిగా మారిపోతాడు. అలా మారడానికి బలమైన కారణం ఉండాలి కాబట్టి అతని కూతురు శ్రద్ధ పాత్రని సృష్టించాను. ఆ తెగలో చదువుకుంటున్న ఒకే ఒక వ్యక్తి శ్రద్ధ. ఆ రెండు పులి పిల్లలు పెద్దయ్యాక ఒక పులి చేతిలో గుంజన్ గాయపడి మరణిస్తాడు. ఇదీ నేను బేసిక్‌గా అనుకున్న కథ. ఇందులో పార్థీ తెగ జీవిన విధానం గురించి చెప్తూనే పులుల్ని సంరక్షించాల్సిన ఆవశ్యకత గురించి చెప్పాలనుకున్నాను.
నవల అడవికి, అడవిలోని పులుల్ని వేటాడటం గురించి కాబట్టి లంచాలకు లొంగిపోయే ఫారెస్ట్ చీఫ్ వార్డెన్ బాంగ్డియా పాత్రని, ఎప్పటికైనా అటవీశాఖ మంత్రి కావాలనుకుని కలలు కనే లోకల్ ఎం.ఎల్.ఏ. ధనుంజయ వంజారి పాత్రల్ని ప్రవేశపెట్టాను.
అడవి తల్లి కామధేనువులా కోరికలు తీరుస్తుందనీ, అక్షయపాత్రలా కాసుల వర్షం కురిపిస్తుందనీ అడవితో తనకున్న నలభై యేళ్ళ అనుబంధం ద్వారా తెలుసుకున్న జ్ఞాని వంజారి.
పదిహేనేళ్ళ వయసులో అడవిలోంచి మొదట వంట చెరకు దొంగిలించడంతో అడవితో తన సుదీర్ఘమైన సాహచర్యం మొదలైంది. పాతికేళ్ళు వచ్చేసరికి కలపని, జంతు చర్మాల్ని దొంగతనంగా రవాణా చేయటంలో సిద్ధహస్తుడైనాడు. ముప్పయ్ యేళ్ళు దాటాక కలప కాంట్రాక్టర్‌గా అవతారమెత్తి, ఆ ముసుగులో తన అసాంఘిక కార్యకలాపాల్ని యథేచ్ఛగా కొనసాగించాడు. నలభై యేళ్ళు వచ్చేసరికి కోట్లకు పడగ లెత్తాడు. ఆ డబ్బుని వెదజల్లి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశాడు. మొదటి ప్రయత్నంలో ఓడిపోయినా రెండో ప్రయత్నంలో ఎమ్మెలేగా గెలిచాడు. ఇప్పటికీ అతనికింద పని చేసే పోచర్ల ముఠాలున్నాయి. వాళ్ళ ద్వారా జంతు చర్మాల్ని సంపాయించి, వాటిని అధిక ధరలకు విదేశీయులకమ్ముతుంటాడు.
అడవికి సమీపంగా ఉన్న గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించి, పంటల్ని నాశనం చేయడం, జనావాసాల్లోకి ప్రవేశించి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలుగ చేసిన సంఘటన రాశాను. అలానే ఓ పులి మేన్‍ఈటర్‌గా మారి చుట్టుపక్కల గ్రామాల్లోని ఏడుగురిని చంపిన సంఘటనల్ని అల్లుకున్నాను.
అసలు అడవి జంతువులు జనావాసాల్లోకి రావడానికి కారణం ఏమిటి? వాటికి ఆవాసమైన అడవుల్ని నరకడం, అటవీ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం ముఖ్య కారణం.
నాగపూర్‌లో పేలుడు పదార్థాలు తయారు చేసే ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీ సూర్యా ఇండస్ట్రీస్. గత పదేళ్ళుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి అవసరమైన పేలుడు పదార్థాలు తయారు చేసే కాంట్రాక్ట్ ఈ కంపెనీకే లభిస్తోంది. ప్రొడక్షన్ పెంచుకోవాల్సిన అగత్యం ఏర్పడటంతో కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పడానికి అవసరమైన స్థలం కోసం అన్వేషణ మొదలెట్టింది. దాదాపు రెండొందల ఇరవై ఎకరాల స్థలం కావాలి. బైట ఎక్కడా దొరకడంలేదు కాబట్టి అటవీ స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంది. దాని విషయంలోనే ఇంతకు ముందు వంజారి భారీ ముడుపులు అందుకుని, తన రికమండేషన్ ద్వారా ఆ పని సానుకూలపడేలా చేశాడు. అటవీశాఖ మంత్రికి కూడా భారీ ముడుపులు అందేలా ఏర్పాటు చేశాడు.
సూర్య ఇండస్ట్రీ వాళ్ళు రెండొందల ఇరవై ఎకరాల అడవిని చదును చేసే పనిలో నిమగ్నమైనారు. మొదట పెద్ద పెద్ద చెట్లను నరికించారు. కన్పించిన చిన్న చిన్న జంతువులను పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అక్కడ ఫ్యాక్టరీ భవనాన్ని కట్టడం ప్రారంభించారు. ఆరు నెలలుగా విన్పిస్తున్న ఆ శబ్దాలకు చాలా జంతువులు భయపడి అడవి మధ్యలోకి పారిపోయాయి. కొన్ని జంతువులు ఆహారం కోసం జనావాసాల్లోకి రావడం మొదలైంది.
రెండు వందల పై చిలుకు పేజీలున్న నవల చదవాలంటే పాఠకుణ్ణి నవల ప్రారంభంలోనే ఆకట్టుకోవాలి. మొదటి పేరా చదివిన పాఠకుడు అనాయాసంగానే మిగతా నవలంతా చదవడంలో లీనమైపోవాలంటే ప్రారంభంలోనే అతనిలో ఉత్సుకత కలిగించాలి. ‘అరణ్యపర్వం’ నవల ప్రారంభంలోనే గుంజన్ సింగ్ తన పదేళ్ళ వయసులో ఎంత నిర్దయగా, ఎంత క్రూరంగా బెంగాల్ టైగర్‌ని తన గొడ్డలితో నరికి చంపుతాడో రాశాను.
పులుల్ని చంపడానికి పోచర్లు రకరకాల పద్ధతులు పాటిస్తారు. వాటిని నవలలో సందర్భానుసారంగా వివరించాను. పులిని స్టీల్‌తో చేసిన ట్రాప్‌లో బంధించాక పొడవాటి పదునైన ఇనుప చువ్వల్తో నోట్లో గాయాలు చేస్తారు. అదింకా తన కోరల్తో గాయాలు చేయలేదు. బల్లేల్లాంటి ఆయుధాలో దూరంగా నిలబడి పులికందకుండా దానిమీద దాడి చేస్తారు లేదా బలంగా దాని మీదకి విసుర్తారు.
పులిని బంధించడానికి రకరకాల స్టీల్ ట్రాప్ లను వాడతారు. ఐదడుగుల పొడవున్న స్టీల్‌తో తయారు చేసిన గొలుసు చివర ఖైదీల కేసే సంకెళ్ళలాంటివి రెండుంటాయి. పులి కాళ్ళలో ఏదో ఒకటి ఆ రెండు సంకెళ్ళలో ఒకదాన్లో ఇరుక్కుంటే చాలు. అది గట్టిగా బిగుసుకు పోతుంది. పులి దాన్నుంచి విడిపించు కోడానికి గింజుకుంటూ ఉంటుంది. అప్పుడు దాన్ని చంపుతారు.
పాదానికి బిగుసుకునే సంకెల కాకుండా నేరుగా మెడకు చుట్టుకుని బిగుసుకుపోయి వూపిరాడకుండా చేసే ట్రాప్‌లు కూడా వాడతారు. పులి కాలు తగిలితే చాలు స్ప్రింగ్ పని చేసి రెండు లోహపు చేతుల్తో మెడని పట్టేసుకున్నట్టు దాని శరీరం కదలకుండా పట్టేసుకుంటుంది.
ఈ నవల చివర్లో ఓ ట్విస్ట్ పెట్టాను. గుంజన్ ఆడపులిని దాని రెండు పులి పిల్లల ఎదురుగానే చంపుతాడు. అప్పుడు అతనో విషయం గమనిస్తాడు. ఆ పులిపిల్లల చారలు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటాయి. మనిషి వేలిముద్రలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఎలా ఉంటాయో పులి చారలు కూడా ఒక్కో పులికి విభిన్నంగా ఉంటాయి. అటవీ సిబ్బంది పులుల్ని వాటి చారల ద్వారానే గుర్తుపడ్తుంటారు. ఆ పులి పిల్లల్లో ఒకదాని కుడి తొడమీద అంగుళం మందాన నల్లటి చార ఒకటుంటుంది. అదొక్కటే రెండింటికీ తేడా.
మేన్ఈటర్‌గా మారి, ఏడుగుర్ని చంపి, గుంజన్‌ని గాయపరిచి అతని చావుకి కారణమైన పులి కుడి తొడమీద నల్లటి చార ఉన్న పులే.
దాన్ని చంపడం కోసం అటవీ సిబ్బంది ఎంత ప్రయత్నించినా అది కంటికి కన్పించదు. ఒకరోజు కెమేరా ట్రాప్‌లో ఓ పులి కన్పిస్తుంది. అచ్చం అలాంటి చారలే ఉన్న పులి. కానీ దానీ కుడి తొడ మీద మచ్చ మాత్రం ఉండదు. ఆ పులి మేన్‌ఈటర్ పులి కాదని అటవీ సిబ్బందికి అర్థమౌతుంది.
కానీ వంజారి దాన్నే షూట్ చేసి ఆ పులే మేన్‍ఈటర్ పులి అని ప్రజల్ని నమ్మిద్దామని, చీఫ్ వార్డెన్ మీద వత్తిడి తీసుకు వస్తాడు. అతను చూపించిన ప్రలోభాలకు లొంగిపోయి చీఫ్ వార్డెన్ షూటింగ్ ఆర్డర్ మీద సంతకం పెడ్తాడు. ఆ పులిని కాల్చి చంపి, అదే మేన్‌ఈటర్ పులి అనీ, దాన్ని చంపేశామని ప్రజల్ని నమ్మిస్తారు. కానీ అడవిలోపల అసలైన మేన్ ఈటర్ పులి బతికే ఉంటుంది.
నవలలో పార్థీ తెగ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించాను. ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు మొదట పార్థీ తెగ మగవాళ్ళనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళని లాకప్‍లో వేసి, లాఠీలో కొట్టి, చేయని నేరాన్ని అంగీకరింప చేస్తారు. జంతువుల వేటతో పాటు చిన్న చిన్న దొంగతనాలు చేసి పొట్టపోసుకునే ఆ తెగలో ఓ నిజాయతీపరుడు కాలే. అతనికి దొంగతనాలు చేయడం ఇష్టం ఉండదు. కష్టపడే మనస్తత్వం. ఒకతను తన చెట్టుకున్న దానిమ్మ పళ్ళన్నీ ఎవరో దొంగతనం చేశారని కంప్లెయింట్ ఇస్తే పోలీసులు కాలేని స్టేషన్‌కి పిల్చుకెళ్ళి లాఠీలతో కుళ్ళబొడుస్తారు. ఎంత కొట్టినా అతను దొంగతనం చేయలేదనే చెప్తాడు. అతని చేత నేరం ఒప్పించే క్రమంలో అతను చచ్చిపోతాడు. లాకప్ లోంచి పారిపోతూ కిందపడి, తలకు దెబ్బతగిలి చచ్చిపోయాడని పోలీసులు కథ అల్లి చెప్తారు.
కాలే భార్య నమ్మదు. ఆమెకు తన భర్త ఎలాంటివాడో బాగా తెలుసు. కోర్టులో కేస్ వేస్తుంది. అతని లాకప్ డెత్‌కి కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్ళని, ఎస్సయిని సస్పెండ్ చేస్తారు. తన భర్తది పోలీసులు చేసిన హత్య కాబట్టి వాళ్ళకు శిక్ష పడాల్సిందేనని కాలే భార్య పోరాటం కొనసాగిస్తుంది. తమ పోలీసులు సస్పెండ్ కావడానికి కారణమైన కాలే భార్య మీద పోలీసులు కక్ష పెంచుకుని, ఆ కుటుంబాన్ని ఎలా హింసించారో రెండు సంఘటనలుగా రాశాను.
పార్థీ తెగలోని యువకుల్ని ఏదో ఓ నేరం మోపి పోలీస్ స్టేషన్‌కి పిల్చుకెళ్ళి, అతని బంధువుల్లోని ఆడవాళ్ళతో పోలీసులు ఎంత అసహ్యంగా ప్రవర్తస్తారో కూడా మరో సంఘటనలో రాశాను. ఇటువంటి ఘోరాలు పార్థీ తెగ ప్రజలు నిజంగా ఎదుర్కొన్నవే నా నవల్లో రాయడం జరిగింది.
నవల రాయడానికి మొదట కావాల్సింది ఓపిక. అది కథలా ఓ సిట్టింగ్ లో పూర్తయ్యే ప్రక్రియ కాదు. కొన్ని వారాలు, కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. నవలని ఛాప్టర్లుగా విడగొట్టి ఏ ఛాప్టర్లో ఏం రాయాలనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. సందర్భోచితంగా సంభాషణలు రాసుకోవాలి. ఏ ఉద్దేశంతో నవల రాస్తున్నామో దాన్నుంచి పక్కకు జరక్కుండా నవలను నడపడం ముఖ్యం.
నవల ప్రారంభం ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యం. ‘అరణ్యపర్వం’ నవల ముగింపు ఇలా రాశాను.
వేరే పులిని చంపి అదే మేఈటర్ పులి అని నమ్మించినందుకు కృతజ్ఞతగా, వంజారి తన యింట్లో చీఫ్ వార్డెన్‌కి నెమలి పిట్ట మాంసంతో విందు ఏర్పాటు చేశాడు. విందు పూర్తయ్యాక బాంగ్డియా వంజారితో చేయి కలుపుతూ “మనం పరస్పరం సహకరించుకుందాం” అన్నాడు.
ఇద్దరూ పెద్దగా నవ్వారు. ఆ నవ్వు ఎలా ఉందంటే అడవిలో ఉన్న పులుల కన్నా క్రూరమైన రెండు కాళ్ళ జంతువులు అడవుల్ని నమిలి మింగేయడానికి సమాయత్తమౌతూ చేసిన భయంకరమైన గాండ్రింపులా ఉంది.
ఆ శబ్దానికి అడవిలో ప్రశాంతంగా నిద్రపోతున్న పక్షులు జంతువులు పీడకల కన్నట్టు ఉలిక్కిపడి లేచాయి. ఆహారం కోసం సంచరిస్తున్న జంతువులు భయంతో రెండడుగులు వెనక్కి వేశాయి. మౌన మునుల్లా నిలబడి ఉన్న చెట్లు భూమి కంపించినట్లు తల్లడిల్లిపోయాయి. రాబోయే ఉపద్రవాల్ని తల్చుకుని అడవి అడవంతా పెనుతుఫానులో చిక్కుకున్న చిగురుటాకులా వణికిపోయింది.
ఇలా ముగించడంతో అడవిలోని పులులకన్నా రెండుకాళ్ళ జంతువులైన మనుషులే క్రూరమైన వాళ్ళని చెప్పాను. దాంతో పాటు వాళ్ళిద్దరూ కలవడం వల్ల భవిష్యత్తులో అడవి చాలా ఘోరాల్ని చవి చూడబోతోందన్న హెచ్చరికని చేశాను.
***
ఈ రచనని సలీం గారి స్వరంలో వినండి
https://youtu.be/QahDKy6JvEs