కైంకర్యము-48

0
4

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[రాఘవ, ప్రసన్నలక్ష్మి శ్రీరంగం చేరుకుంటారు. అత్యద్భుతమైన రంగనాథుని కోవెలని దర్శించుకుంటారు. 21 గోపురాలతో  ఉండే ఆలయ విలక్షణతని గ్రహిస్తారు. శ్రీరంగంలో కొలువైన రంగనాథుని దర్శించాలని, రంగనాయికను అర్చించాలని చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక తీరింది ప్రసన్నలక్ష్మి. అంతర్మందిరంలోని మూల రంగనాథుడిని దర్శించి ఆమె భక్తి ప్రపత్తులతో కీర్తించింది. ‘ఏం కావాలని మొక్కుకున్నావ’ని భర్త అడిగితే, మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నానని భర్తతో అంటుంది. అక్కడ్నించి బయల్దేరి తమిళనాడులోని దివ్యదేశాలు దర్శిస్తారు. ఆ తరువాత కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించుకుంటారు. కేరళ నుండి ఢిల్లీ వెళ్ళి – ఉత్తర భారతదేశంలోని దివ్యదేశాలని చూడాలని అనుకున్నారు. ఇంటికి ఫోన్ చేసి పెద్దల అనుమతి తీసుకుంటారు. – ఇక చదవండి.]

[dropcap]ఢి[/dropcap]ల్లీలో నాలుగు రోజులున్నారు రాఘవ, ప్రసన్నలక్ష్మి.

రాఘవ వదిన, ఆ ఇంటి పెద్దకోడలు, ప్రసన్నలక్ష్మి కలవిడితనానికి ఎంతో ముచ్చటపడింది. పిల్లలకు చిన్నమ్మ తెగ నచ్చింది. ఉన్న నాలుగు రోజులు వాళ్ళు ఆమెను వదిలిపెట్టలేదు.

రాఘవ అన్న అతనిని జాబ్ గురించి పెద్దగా అడగలేదు.

కాని, “నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటిరా? ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు?” అని మాత్రం అడిగాడు.

అదే ప్రశ్న రాఘవకు మనస్సులో మెదులుతోంది.

అతను సమాధానమివ్వలేదు. తల ఊపాడు.

“నీవు లేదంటే ఇటు వచ్చేయి. ఎక్కడో అక్కడ చేరుదువు…”

“వద్దులే! అమ్మ ఇష్టపడదు నేను హైదరాబాద్ విడిచి వెళ్ళటానికి..”

“ఓ! అదోటి ఉందిగా… సరే. కానియి. నీవు నాన్న చెప్పినట్లుగా లాయర్ చేసి ఉంటే అసలు గొడవే ఉండేది కాదు…”

“అవునులే.. అదే జరుగుతుందేమోలే…”

ఆశ్చర్యపోయాడు అన్నగారు. ఇక రెట్టించక ఊరుకున్నాడు.  “అమ్మా నాన్న గారిని జాగ్రత్తగా చూసుకో. లక్ష్మి కూడ అమ్మను బాగా చూసుకుంటుందని నాన్న చెప్పారు…” అన్నాడు ఇక ఏమీ మాట్లాడలేక.

అక్కడ్నుంచి ఐదోనాడు బయలుదేరారు ఇద్దరు.

మధుర, బృందావనం, ప్రయాగ, నైమిశారణ్యం, అయోధ్య, వారణాశి దర్శించి అక్కడ్నుంచి దేవ భూమి వైపు సాగారు. వారి ప్రయాణంలో వారు ప్రతిక్షణం భారతదేశ భౌగోళిక సంపదను చూస్తూ మైమరిచారు. రాఘవ ఇంతకు మునుపు బయట తిరిగాడు. ఢిల్లీలో కొన్ని రోజులు ఉన్నాడు. కాని ప్రసన్నలక్ష్మికి అదే ప్రథమం. కాబట్టి ఆమెకు ప్రతిదీ ఆశ్చర్యమే. ప్రతిదీ వింతే.

ఆమె సంతోషం చూసి రాఘవ సంతోషపడ్డాడు.

‘ఈరకంగానైనా ఆమె సంతోషపడుతోంది’ అనుకున్నాడు.

ఋషీకేశ్ వరకు రైలులో ప్రయాణించి, అక్కడ్నుంచి దేవప్రయాగ మీదుగా బదిరికావనం వైపు సాగారు. దేవప్రయాగాలో నీలమేఘుడైన రాముని, పుండరీకవల్లిని దర్శించుకొని ముందుకు సాగారు.

రాఘవ హృదయంలో లోలోపల ఒక అగ్ని రాజుకుంటుంది.

ఢిల్లీలో అది పెరిగింది. అయినా పైకి సామాన్యంగా ఉండే యత్నమే చేశాడు.

బదిరి చేరే సరికే చిరు చీకట్లు పడుతున్నాయి.

చలిగా అనిపించి ప్రసన్నలక్ష్మి కొంగు తీసి తల మీదుగా కప్పుకుంది.

ఇద్దరు ఒక చిన్న లాడ్జ్‌లో దిగారు.

ఆ లాడ్జ్ ఎదురుగా అలకనంద అటు వైపు కోవెల కనపడుతోంది.

ఆనాడు దర్శనానికి వెళ్ళలేక ఉండిపోయారు.

మర్నాడు ఉదయం తెల్లావారు జామున నాలుగు గంటలకు రాఘవకు మెలుకువ వచ్చింది.

లేచి కిటికి నుంచి చూశాడు. ఎదురుగా మంచు పర్వతం. ఆ శ్వేత పర్వతం సొగసుకు తిమిరం పారిపోయింది.

తెల్లటి ఆ వెలుతురులో ఆ బదిరికావనం లోయ సుందరంగా తోచింది. గలగల మంటున్న అలకనందాదేవి నడక తప్ప మరో చప్పుడు లేదు.

అతనికి చాన్నాళ్ళ తరువాత ఏదో శాంతి తెలిసింది హృదయానికి.

లేచి శాలువా తీసుకొని చప్పుడు కాకుండా తలుపు తీశాడు.

“బావా!” పలవరిస్తోంది ప్రసన్నలక్ష్మి

నెమ్మదిగా బయటికొచ్చాడు. ఆ నదికేసి నడిచాడు.

చల్లిటి గాలి చెవులకు తాకింది. శాలువతో కప్పుకున్నాడు.

అలకనందను చూస్తూ దాని వెనక ఉన్న మంచు కొండను చూస్తూ ప్రగాఢశాంతిని అనుభవించాడు.

మంచుకొండ నెమ్మదిగా బంగారు రంగులోకి మారింది చూస్తుండగానే, ఆ సువర్ణవర్ణం శిఖరాలన్నింటికి ప్రాకింది. మరు నిమిషం సూర్యోదయం గుర్తుగా వెలుగుతో భళ్ళున తెల్లారింది.

రాఘవ నెమ్మదిగా లేచి తనున్న రూముకు వచ్చాడు. అతను వచ్చే సరికే ప్రసన్నలక్ష్మి స్నానం చేసి పసుపు పచ్చ కంచి చీర మడిసై కట్టుకొని, నామం దిద్దుకొని, పొడవైన కురులు దువ్వి కొప్పు పెట్టి ఎదురుచూస్తోంది.

అతనిని చూసి “ఎదురుచూస్తున్నాను మీకోసం బావా! తయారైతే కోవెలకెళ్ళవచ్చు…” అంది.

“వస్తున్నా…” రాఘవ చకచకా తయారైనాడు. అతని కుర్తా వేసుకొని వచ్చాడు. రాఘవకు పంచ అలవాటు తక్కువ. యాత్ర మొదలైనప్పటి నుంచి అతను ఆ కుర్తాలలో, పైజామాలలో తిరుగుతున్నాడు.

ఇద్దరు బద్రినాథుని దర్శనానికి వెళ్ళారు.

బద్రిలో మహావిష్ణువు పద్మాసనంలో ఉంటాడు. అక్కడే నరునకు నారాయణుడు అష్టాక్షరి ఉపదేశించాడు.

ఈ బద్రికావనంలోనే మహావిష్ణువు తొలుత నేల మోపాడు వైకుంఠం నుంచి.

ఆ బదిరికావనం సౌందర్యమే సౌందర్యము. అంతటి అద్భుత సౌందర్యం మనకు కనపడదు మరోటి ఆ పర్వతాలలో. చుట్టూరా హిమవత్పర్వతాలు, మధ్యలో ఆకుపచ్చని లోయ. గలగల పారుతున్న అలకనంద. ఆ నది ప్రక్కనే వెలసిన నారాయణుడు.

ఆ దేవాలయం పరమ పవిత్రమైనది. అక్కడ చేసుకునే మంత్ర సాధనలు వేయింతలు ఎక్కవ ఫలితాలు ఇస్తాయి. అక్కడే వసుధార జలపాతం. ఆ జలపాత బిందువు ఒక్కటి శిరస్సు పైన వేసుకున్న వారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. అంతటి మహోన్నతమైన వనమది.

రాఘవ, ప్రసన్నలక్ష్మి వడివడిగా నడిచి కోవెలలో ప్రవేశించారు. వారు దేవదేవున్ని దర్శించి తిరుగుతూ గంటాసురుని వద్ద ఆగారు. అక్కడ గంటాసురుడు అన్న పేరు చదివి, “ఇది అసురునిదా?” అన్నది ప్రసన్నలక్ష్మి.

“అవును. ఈయన ఈ క్షేత్రానికి పాలకుడు. ఈయన పర్మిషన్ లేకపోతే మనం బదిరిలోకి రాలేమని మా నానమ్మ చెప్పేది…” అన్నాడు.

“అత్తయ్య వాళ్ళను కూడ తీసుకురావలసింది…” అంది.

“వాళ్ళు చాలాసార్లు వచ్చారులే. మా చిన్నప్పుడు నానమ్మ, అమ్మ, నాన్న ప్రతిఏడు బదిరికి వచ్చేవారు…” అన్నాడు రాఘవ.

“చూశారా వారు…”

“ఆమె చెప్పిన కథలే ఈ ప్రదేశం గురించి. అప్పుడు నాకు తెలియదు. అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండె. ఇప్పుడు నీకు చూపించటానికి ఇలా వచ్చాను…”

“ఈ ఉదయం ఆ పర్వతం రంగులు భలే మారింది కదా..”

“చూశావా నీవు…”

“ఆ లేవగానే కనిపించింది బావా…” ఉత్సాహంగా చెప్పింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here