కర్మయోగి-18

0
3

[సుజాత భర్త సత్యనారాయణకి ఫోన్ చేసి తన పొలం కాగితాలు తీసుకున్నతన్ని కూడా రమ్మన్నానని, కలుద్దామని అంటాడు. ముగ్గురు కలిసాక, వడ్డీ కాస్త తగ్గించేలా అతన్ని ఒప్పిస్తారు, సుజాత భర్త, సత్యనారాయణ. సత్యనారాయణకి తెలిసిన బ్రోకర్‌తో ఆ పొలాన్ని అమ్మించి అతని అప్పు తీర్చేస్తాడు సుజాత భర్త. ఇంకా తొమ్మిది లక్షలు మిగిలితే, ఆ డబ్బుని సత్యనారాయణని జమ వేసుకోమని, మరో స్థలం అమ్మి మిగతా డబ్బు కూడా ఇచ్చేసి అప్పు తీర్చేస్తాడు సుజాత భర్త. అప్పు వసూలైన సంగతి సుధారాణికి చెప్పి, ఇంకెప్పుడూ అలా చేయద్దని అంటాడు సత్యనారాయణ. సుధారాణి స్నేహితులలో కలిసి కేరళ ట్రిప్ వెళ్ళాలనుకుంటుంది. సత్యం వద్దంటాడు. పట్టుపడుతుంది సుధ. తను ఒక్కర్తే అయితే తల్లిదంద్రులు కూడా ఒప్పుకోరని వదినని కూడా బయల్దేరదీస్తుంది. తల్లికీ, పిల్లలకీ, తులసికి జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది. సుధ లేని ఈ సమయంలో సత్యం ప్రలోభపడి తులసితో తప్పు చేస్తాడు. మిల్ పని మీద చెన్నై వచ్చిన సత్యానికి తెలిసిన అతను కనబడతాడు. సత్యం వద్దన్నా అతను సాయంత్రం బారుకి తీసుకెళ్ళి సత్యానికి మద్యం అలవాటు చేస్తాడు. ఇంటికొచ్చిన సత్యం మద్యం కొనసాగిస్తాడు. ఊరు నుంచి వచ్చిన తరువాత సత్యం మందు తాగడం చూసిన సుధ అతన్ని మందలించడానికి ప్రయత్నిస్తే, హై క్లాసు వాళ్ళకి ఇవన్నీ మామూలే అంటాడు. ఇంకో రోజు రాత్రి తులసి గదిలో సత్యం గొంతు వినబడడంతో సుధకి అనుమానం వస్తుంది. తులసిని నిలదిస్తే, తన తప్పేం లేదంటుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు సుధకి. – ఇక చదవండి]

[dropcap]ప[/dropcap]ర్యాటకరంగాన్ని అభివృద్ధి పరుస్తున్న కొద్దీ మరిన్ని ఆలోచనలు సవాళ్లూ ఎదుట నిలబడుతున్నాయి. వీలైనంత చురుగ్గా తన పనుల్ని వేగవంతం చేస్తున్నాడు జగత్. మరలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. భీమిలి ఎమ్మెల్యే లేచి నిలబడ్డాడు. “అధ్యక్షా! మా విశాఖ జిల్లాకు గొప్ప సాగరతీరమున్నది. విశాఖపట్నం వెళ్లిన వాళ్లంతా సముద్రాన్నీ, బీచ్ లనూ చూడాలని ఉవ్విళ్లూరుతారు. ‘రామకృష్ణ బీచ్’, ‘రిషికొండ’, ‘భీమిలీ’, ‘యారాడ’ బీచ్‌లే కాక ఇంకా ఎన్నో చోట్ల బీచ్ లను అభివృద్ధి, చేయొచ్చు. అలా చేస్తే పర్యాటకులెక్కువగా వస్తారు. ‘తొట్లకొండ’, ‘కార్తీకవనం’ ప్రాంతాలను, అభివృద్ధి చేస్తే బీచ్ ప్రమాదాల నుంచి పర్యాటకులను రక్షించవచ్చు. ముఖ్యంగా మా భీమిలీ బీచ్ చాలా అనువుగా వుండే ప్రదేశం. ఇక్కడ గోస్తనీ నది సముద్రంలో కలిసే ప్రాంతం. ఇది చాలా అందమైన ప్రదేశం కూడా. ఇది తప్పకుండా పట్టించుకుని అభివృద్ధి చేయాల్సిన ప్రాంతం అధ్యక్షా. దీంతో పాటు అరకు వ్యాలీ మీద కూడా దృష్టి పెట్టాలి. దీన్ని అందరూ ఆంధ్రా ఊటీ అని పిలుచుకుంటారు. ఇక్కడి చాపరాయి వాటర్ ఫాల్స్, పద్మావతి బోటానికల్ గార్డెన్స్, గిరిజన మ్యూజియమ్, బోర్రా గుహలు, వీటన్నింటి గురించి నేను కొత్తగా చేప్పేది ఏమీ లేదు అధ్యక్షా. ఇక్కడి అనంతగిరి, కిందకు దూకే జలపాతాలూ ముఖ్యంగా వర్షాకాలంలో చూపు తిప్పుకోనివ్వవు గదా అధ్యక్షా. కాని వీటిని చూడటానికి వచ్చే వారికి కనీస సదుపాయాలు లేవు. దాంతో ఎంతో మంది పర్యాటకులు నిరాశతో నెనక్కు వెళ్లిపోతూ వున్నారు. అరకులో తప్ప ఆ చుట్టుపక్కల ఎక్కడా కనీస సౌకర్యాలు లేవు. లంబసింగికి తెల్లవారుఝామున కొచ్చే వారికి తిండీ, నీరు లభ్యం కాని పరిస్థితి. మన ప్రభుత్వం చొరవ తీసుకుని కాటేజీలు, హోటల్స్ లాంటివి కడితే పర్యాటకులు లెక్కకు మిక్కిలిగా వస్తారు. సినిమా ఘాటింగ్‌లకు కూడా చాలా అనువైన ప్రాంతం. పద్మానాభాలయం, సోమ లింగేశ్వరాలయం లాంటి చారిత్రక ఆలయాలు కూడా వున్నాయి. వీటన్నింటిని అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపయోగంగా వుంటుంది. మా భీమిలీ ప్రజలు ఈ విషయం మీదే పదే పదే అడుగుతున్నారు అధ్యక్షా. మన పర్యాటక మంత్రిగారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను” అంటూ కూర్చున్నాడు.

పర్యాటక మంత్రి సమాధానం చెప్పటనికి లేచి నిలబడ్డాడు.

“అధ్యక్షా, భీమిలీ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ ముందుంచిన ప్రతిపాదనలు చాలా వున్నాయి. విశాఖ తీరప్రాంతమంతా అందమైనదే. ఇప్పటికే మన ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మిగతా వాటిని కూడా ఒక్కొక్కటిగా ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తాం అధ్యక్షా” అంటూ కూర్చున్నాడు.

ముఖ్యమంత్రిగారితో మాట్లాడి ఒప్పించుకుంటున్నాడు. ఆర్థిక మంత్రి గారితో డబ్బు కొంత కొంతగా శాంక్షన్ చేయించుకుంటున్నాడు. జగత్ మోహన్ రాష్ట్రం నలువైపులా సుడిగాలిలా పర్యటిస్తున్నాడు. తన హయాంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కాలన్న పట్టుదలతో పని చేస్తున్నాడు. ఇంటి విషయాలు కాని, స్వంత బిజినెస్‌లు కాని ఏం గుర్తుకు రావటం లేదు. రాష్ట్రము – అభివృద్ధి ఈ రెండు విషయాలే జగత్ మోహన్ మనసులో సుళ్లు తిరుగుతున్నాయి.

***

మిల్ స్టోర్స్ రన్నింగ్ లోకొచ్చింది. ఆ రోజు సత్యనారాయణ వచ్చాడు. అంతా తిరిగి మరోసారి చూసుకున్నాడు. “ఈ మిల్ స్టోర్స్‌లో ఇద్దరు వుండటం అనవసరం. ఒకరు సరిపోతారు. సత్యం, నీకు గతంలో మిల్లులు నడిపిన అనుభవమున్నది. ఒక పెద్ద దాల్ మిల్ మనమే రన్ చేద్దాం. దాన్ని నువ్వు తీసుకో. మా అబ్బాయి ఈ మిల్ స్టోర్స్ చూసుకుంటాడు. గవర్నమెంట్‌కు కట్టే టాక్స్, అగ్రికల్చర్ మార్కెట్‍కు చెల్లించే సెస్సు అన్నీ నువ్వు గుర్తు పెట్టుకో. నీకు ప్రత్యేకించి చెప్పనఖ్ఖర్లేదనుకో. ఆఫీసును, వర్కర్స్‌ను నేను చూస్తాను. ఏ క్లాసు మినుములూ, కందులూ, పెసలు, శనగలూ, వేరుశనగలూ అన్నీ కొందాం. దాంతో పాటు గోధుమల మీద కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడంతా చిరుధాన్యాల మీద పడ్డారు. అవీ స్టాక్ పెట్టుకోవాలి. వాటన్నింటిని కొని శుభ్రం చేయించి పాలిష్ పెట్టిద్దాం. ఇక్కడే దొరికే పప్పులు మన బ్రాండ్ పేరుతో బాగా పాపులర్ అవ్వాలి. కాన్వాసింగ్ ఏజెంట్లను పెడదాం. టీ.వీలో, పేపర్‌లో యాడ్స్ ఇవ్వాలి. దాల్ మిల్స్ ప్రెసిడెంట్‌తో మాట్లాడాను. పెట్టండి, మార్కెట్ బాగానే వుంటుందన్నాడు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లను బీట్ చెయ్యాలి” అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పాడు.

సత్యానికి సత్తెనపల్లిలోని తమ రైస్ మిల్ గుర్తుకొచ్చింది. నాన్న ఎంత కష్టపడి దాన్ని పైకి తీసుకొచ్చారో జ్ఞాపకమొచ్చి బాధేసింది. సత్తెనపల్లిలో వీళ్లదే పెద్ద రైస్ మిల్. మంచి సన్నని బియ్యం, ఒంటి పట్టు ముడి బియ్యం, అన్నీ శుభ్రంగా బాగు చేసి అమ్ముతారని పేరున్నది. ఇంకా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా మంచి బియ్యాన్ని ఎగుమతి చేసేవారు. తమ ఏజెంట్లను పంపి వడ్లు బాగా పండే ప్రాంతాలలోని రైతుల దగ్గర నుండి నేరుగా ధాన్యాన్ని కొనే అలవాటు రామారావుకు మొదటి నుండి వున్నది. ధాన్యపు బేరంలో దళారీలు లేకుండా వారి కమీషన్ కూడా రైతుకే దక్కేటట్లుగా చూసేవాడు. దాంతో రామారావు రైస్ మిల్లుకే ధాన్యాన్ని అమ్మటానికి రైతులు బాగా ఉత్సాహ పడేవారు. వడ్లు నుంచి వచ్చిన ఊకను కూడా న్యాయంగా ఇస్తాడని ఇటుకల తయారీ వాళ్లు కూడా చెప్పుకునే వాళ్లు. ఊక నుండి బయోగ్యాస్, ఆ తర్వాత వచ్చే తవుడు నుండి రైస్ బ్రైన్ ఆయిన్ తీసి దాన్ని రిఫైన్ చేసి సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ ద్వారా సబ్బుల తయారీ చేపట్టాలని, ఈ రైస్ రిచ్ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ చేపలకు, కోళ్లకు దాణాగా సప్లై చేయాలని తను అనుకున్నాడు. ఈ రైస్ మిల్లును మొదట్లో రామారావు స్టీమ్ ఇంజన్‌తో మొదలు పెట్టాడట. ఆ తర్వాత ఆయిల్ ఇంజన్ తోనూ తర్వాత కరెంటు ద్వారా నడిపాడు. రామారావు రైస్ మిల్ పెట్టే ముందు హల్లర్స్ సిస్టంతో బియ్యాన్ని తయారు చేయటం పాలిష్ పెట్టటం గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎమ్రిషెల్లర్ నుపయోగించి పాలిష్ కోన్స్‌తో తయారు చేయటం, ఆ తర్వాత ఎమ్రిషెల్లర్‍కు బదులుగా రబ్బరు షెల్లర్ ఉపయోగించటం, కోన్స్‌కు బదులు వైటనర్ ఉపయోగించటంతో సహా అన్నీ వివరాలనూ తెలుసుకునేవాడు. ఇంజన్లు నడిపే డ్రైవర్లతోనూ తరుచూ మాట్లాడేవాడు. ప్రస్తుతం బియ్యంలో మట్టి తీసే మిషన్లతోనూ, బియాన్ని, నూకల్నీ, సైజుల వారీగా వేరు చేసే గ్రేడర్ల నుపయోగించి, నాణ్యమైన బియాన్ని తమ మిల్లులో తయారు చేయిస్తున్నారు. అవన్నీ గుర్తొచ్చి నిట్టూర్చాడు సత్యం.

“సత్తెనపల్లిలో మాది బ్రహ్మండమైన రైస్ మిల్. దాన్నింత వదిలేసి వచ్చి ఇక్కడ కొత్తగా దాల్ మిల్ పెట్టే దేంటండీ?” అన్నాడు చిరాగ్గా.

“అది రామారావు రైస్ మిల్లులాగా ముద్రపడిపోయింది. ఇక్కడ విజయవాడలో నీ పేరు మీద పెట్టే వన్నీ నీ పేరుతో మారుమోగిపోవాలి. అంతే కాని సత్తెనపల్లీ, సత్తెనపల్లిలో మిల్లూ అంటూ నీళ్లు కూడా సరిగా దొరకని ఏరియా గురించి ఒకటే ఆలోచించుకు. ఎంత సేపూ మీ నాన్నా రైస్ మిల్లూ, నాన్న పెట్టిన పెట్రోలు బంకూ అంటూ అందులోనే కూరుక్కుపోకు. బయటి కొచ్చినీ కాళ్ల మీద నువ్వు నిలబడి చూపించు. మా అమ్మాయీ, నేను పోరుకులాడటం కాదు. నీ అంతట నీకే ఇంట్రస్ట్ కలగాలి. గుఱ్ఱాన్ని నీళ్ల దాకా తీసికెళ్తాం కాని నీళ్లు తాగించలేం కదా?” అన్నాడు సత్యనారాయణ.

“నీళ్లలో గుఱ్ఱాన్ని ముంచైనా మీరు నీళ్లు తాగిస్తారు లెండి. నేను చదివిన బి.టెక్ చదువును కూడా నా వ్యాపారానికీ వుపయోగించుదామనుకన్నాను. నేను చేసే పనులను మధ్యలోనే వదిలేసుకుని అన్నీ రీజులకివ్యాల్సి వచ్చింది. నా కెంత బాధగా వుంటుందో ఆలోచించండి.”

“చూడు సత్యం, నేను దాల్ మిల్ అన్నాను. నీ కింట్రెస్ట్ లేకపోతే చెప్పు. వెండి, బంగారం, టైర్లు, ఎలక్ట్రికల్, దేంట్లో నీకిష్టమే చెప్పు. అదే పెట్టుకుందాం. నేను చెప్పే వన్నీ లోకల్ బిజినెస్‍లే అనుకుంటే ఇంకా పెద్ద స్థాయి ఫ్యాక్టరీ లేమైనా ఐడియా వుంటే చెప్పు. పర్మిషన్లు తెచ్చుకుందాం.”

“నే ననుకున్న ఆలోచనలన్నీ తెగిపోయాయి, ఇప్పుడిక ఏదైతే ఏముంది లెండి?” అంటూ అక్కడ్నుంచి లేచాడు.

అల్లుడి మూడ్ ఈ రోజు బాగాలేదు. రెండు రోజులాగి మళ్లీ మాట్లాడాలనుకున్నాడు సత్యనారాయణ.

‘ఎవరు దేనికి సూటవుతారో దుర్భిణీ వేసి మరీ చెప్తాడు’ అనుకున్నాడు సత్యం మామగారినుద్దేశించి.

***

కొన్ని రోజులు గడిచిన తర్వాత మాతాజీ మరలా రాజేష్ క్లినిక్‌కు వచ్చింది.

“ఈ పేగుపూత బాగా ఇబ్బంది పెడుతున్నది డాక్టర్. ఏ పదార్థం తినాలన్నా భయమేస్తున్నది. కడుపు నొప్పీ, తోచనితనం వుంటున్నాయి. సాయంత్రమయితే చాలు పొత్తికడుపు బాగమంతా అల్లకల్లోలంగా వుంటున్నది. ఇదంతా తగ్గటానికి ఏదైనా టాబ్లెట్ వేసుకోవాలన్పిస్తున్నది. ఈ చికాకులతో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. సేవా సమితి పనుల్లో కూడా చురుగ్గా వుండలేకపోతున్నాను” అన్నది.

“అవును మాతాజీ, ఇది చాలా చికాకు పెడుతుంది. మందులతో పాటు ఆహారపు జాగ్రత్తలు కూడా చాలా తీసుకోవాలి. సరిపడని ఆహారపదార్థాలను తీసుకోవటం కాదు గదా! కడుపు నొప్పికీ, అనీజీనెస్ తగ్గటానికి ఒక సిరప్ వ్రాస్తున్నాను. భోజనం చెయ్యగానే రెండు పూట్లా తాగండి. ఈ మందులు వాడి చూడండి. తగ్గకపోతే ‘కొలనోస్కోపీ’ కూడా చేసి చూద్దాం. వర్రీ అవ్వాల్సిన పని లేదు.” అంటూ… “మాతాజీ, ఈరోజు కాసేపు వుండండి. వీలవుతుందా?” అన్నాడు రాజేష్.

“ఎందుకు డాక్టరుగారూ నాతో ఏమైనా పని వున్నదా?”

“అవును మాతాజీ, పనైతే వున్నది. మీరు సహాయం చేస్తే ఆ పని అవుతుంది. మీకు సహాయంగా వచ్చిన వారిని కూడా వుండమని అడుగుతున్నాను.” అన్నాడు.

సహాయంగా వచ్చినామే రాజేశ్వరి.

పేషంట్లందరూ వెళ్లిపోయారు. సిస్టర్ మెడికల్ షాపు కెళ్లి కూర్చున్నది. రాజేష్ మాతాజీని, రాజేశ్వరిని లోపలికి పిలిచాడు. అది రాజేష్ రెస్ట్ రూమ్. వాళ్లు లోపలికి రాగానే తలుపు దగ్గరగా వేశాడు. “ఎవరూ రారు లోపలికి. కూర్చోండి.” అంటూ రాజేష్ వాళ్లకు కుర్చీలు చూపించి తనూ కూర్చున్నాడు.

“మిమ్మల్ని ఉండమనటం పద్ధతి కాదు. దానికి నన్ను క్షమించాలి.”

“ఫర్వాలేదు డాక్టరుగారూ. విషయమేమిటో చెప్పండి.” అంటూ, ఎన్నో సార్లు ఎన్నో చోట్ల తమ మహాత్మా గాంధీ సేవాసమితి గురించి మాట్లాడేది. కాని ఇవ్వాళ ఈ డాక్టరుగారు తనను  ఏం పని మీద ఆపారో, అంతు బట్టటం లేదనుకున్నది మాతాజీ.

“మాతాజీ! నేను విషయాన్ని సూటిగా చెప్పేస్తాను. ఈ రాజేశ్వరిగారిని మొట్టమొదసారి రిలయన్స్‌లో పని చేసే రాజేంద్రగారింట్లో చూశాను. కమ్మని టీ పెట్టి ఇచ్చారు. విషయమేమిటంటే వీరికీ, నా భార్యకూ చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇప్పుడు నా బార్య ఎలా వున్నదో చిన్న వయసులో వున్నపుడు వీరు అలా వుండి వుంటారు. ఏ సంబంధమూ లేకుండా ఇద్దరి వ్యక్తుల మధ్య దగ్గరి పోలికలుండటం అసాధ్యం. మా అత్తమామల్నే అడిగి తెల్సుకుందామనుకుంటున్నాను. వారు అపార్థం చేసుకుంటారేమో, నిదానించి చూద్దామనుకున్నాను. కాని వారిని అడిగే ముందు ఈ రాజేశ్వరిగారినే, అడగాలని మీ సేవా సమితికి కొన్ని సార్లు వచ్చాను. కాని మాట్లాడటం కుదరలేదు.”

డా. రాజేష్ మాటలు వింటుంటే రాజేశ్వరిలో ప్రకంపనలు మొదలయ్యాయి. చాముండేశ్వరి గారింట్లో తను కొద్ది రోజులులే వున్నది. ‘ఆ రోజు దేవసేనను పరీక్షగా ఒకసారి చూశాను. కాని  ఈ డాక్టరుగారిని శ్రద్ధగా గమనించలేదు. ఇదేమిటి ఇలా జరిగింది? ఎవరికి తాను దూరంగా వుంటున్నదో,  ఆ కుటుంబంలోని వారికే తను కనుపించింది. ఇప్పుడీయనకు ఏం చెప్పాలీ?’ అన్న ఆలోజనలో పడింది.

“చూడండమ్మా, ఈమె ఎవరు? ఎక్కడ నుండి వచ్చింది? మీ సేవా సమితిలో ఎందుకు వుంటున్నది? ఈమె కెవరూ లేరా? ఒక వేళ వుంటే ఆమె బంధువులు ఎక్కడుంటారు? నాకీ వివరాలు కావాలి. చెప్పమనండి మాతాజీ.”

“మా నాన్నగారు సేవాసమితిని స్థాపించిన కొత్తలోనే తను అక్కడ కొచ్చింది. తన వివరాలమేమీ చెప్పలేదు. ‘నేను సేవా సమితిలోనే పునర్జన్మ ఎత్తాననుకుంటాను. నేనే తప్పూ చేయలేదు. నన్ను నమ్మండి. నేనొక దీనురాలిని. నా కింత చోటు ఇవ్వండి’ అని నాన్నగారి కాళ్లు పట్టుకుని గుండెలవిసిపోయే లాగా ఏడ్చింది. ఆమె ఏడుపుకు రాళ్లు కూడా కరిగేటట్లు వున్నాయన్నారు నాన్నగారు. పైగా ‘తప్పులు చేసిన వారు, పాపకర్ములు ఇంత కరుణా పూరితంగా ఏడవలేరు’ అని అన్నారు. అప్పటి నుండీ మా మహాత్మాగాంధీ సేవా సమితిలో ఒక సభ్యురాలిగా వుంటున్నది. అంతకు మంచి తన గురించి ఎవ్వరికేం చెప్పలేదు, డాక్టరుగారూ.”

“మీరిప్పుడైనా నోరు విప్పి మాట్లాడండి రాజేశ్వరి గారూ! లేకపోతే మీ గురించి నేను వేరే రకంగా అనుకోవాల్సివస్తుంది. అలాగే నా భార్య పుట్టుక గురించీ నేను సందేహపడవలసి వస్తుంది.”

“అలా అనుకోవద్దు డాక్టరు గారూ! ఆమె ఎవరి అమ్మాయిగా మీ జీవితంలో కడుగుబెట్టిందో వారి, అమ్మాయి అనే అనుకోండి. ఇన్నేళ్లు గడిచిన తరువాత ఇప్పుడనుమానపడటం మంచిది కాదు. అలా అనుమానంతో భార్యను గురించి అనుకోవటం తప్పు కదా?” అన్నది రాజేశ్వరి.

“అలా అనుమానించకుండా ఉండాలంటే మీరు నోరు తెరవాలి. నిజం చెప్పాలి” అన్నాడు పట్టుదలగా.

రాజేశ్వరి బేలగా మాతాజీ వంక చూసింది.

ఇంతలో సిస్టరు వచ్చి తలుపు దగ్గర నిలబడి “డాక్టరు గారూ!” అన్నది.

“యస్. కమిన్.”

“నన్ను, మెడికల్ షాపు అతణ్ణీ వెళ్లమంటారా డాక్టరుగారూ?” అన్నది.

టైం చూశాడు. పదింబావు అయింది. “మీరు మాట్లాడండి మాతాజీ. మనం మరోసారి కలుసుకుందాం” అంటూ గదిలో నుంచి లేచి వచ్చాడు. సిస్టర్‌ను తాళాలు వేసుకోమన్నాడు. మాతాజీ, రాజేశ్వరి కూడా బయలుదేరారు.

***

మాతాజీ, రాజేశ్వరులు భోజనం చేశారు. మాతాజీ పడుక్కుర్చీలో వాలిపడుకున్నారు. ఆమె ఎదురుగా చిన్న మోడా మీద రాజేశ్వరి కూర్చుని వున్నది. సేవా సమితిలో అంతా నిశ్శబ్దంగా వున్నది. చాలా మంది నిద్రపోతున్నట్లున్నారు.

“డాక్టరుగారే కాదు రాజేశ్వరీ!  ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా నోరు తెరువు. ఇన్నాళ్ల నుండో గుండెల్లో మోస్తున్న భారాన్ని దింపుకుంటే మంచిది. బాలింతగా వచ్చావు. బిడ్డనేం చేశావో తెలియదు. మన సేవా సమితిలోని వారికి రకరకాల అనుమానాలు వచ్చాయి. నీ మెళ్లో మంగళసూత్రం కాళ్లకు మెట్టెలు ఇలా అన్నీ వున్నాయి. ఇప్పటికీ నువ్వు అలాగే కళకళలాడుతున్నావు. కాని ఆనాటి నీ పరిస్థితి ఎన్నో అనుమానాలకు తావిచ్చింది.  పూజ్య స్వామీజీ అయిన మా నాన్నగారు నిన్ను ఆశీర్వాదించారు. అభయం ఇచ్చారు. నాన్నగారిని చూసి ఎవరూ ఏం మాట్లాడలేకపోయ్యారు. తర్వాత తర్వాత నీ ప్రవర్తనతో అందరి మనసుల్నీ గెలిచావు. చివరకు మావారు కూడా స్వంత తోబుట్టువులాగానే ఆదరించారు. నీ గతం చెప్పమని నిన్నడిగినా నువ్వు ఏనాడూ నోరు విప్పలేదు. ఇవాళ డాక్టరుగారు గట్టిగా పట్టుబడుతున్నారు. నీ గతం ఎలాంటిదైనా వారికి చెప్పక తప్పదు. వారి భార్య పోలికలున్నాయి కాబట్టి వారు పట్టుబట్టటంలోనూ తప్పులేదు. ఇంకా నువ్వు మౌనంగా వుంటే లేనిపోని అనుమానాలు, పెరిగి కొంత మంది జీవితాల మీద ఆ ప్రభావం పడుతుంది” అన్నది మాతాజీ.

వచ్చే నిటూర్పును అణుచుకుంటూ రాజేశ్వరి గతంలోకి వెళ్లింది.

మల్లికార్జునకు కొత్తగా పైళ్లైంది. భార్యతో కలిసి అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తున్నాడు.

“లక్ష్మీ! నాకు మొదటి నుండీ వ్యవసాయమంటే చాలా ఇష్టం. నాన్నకూ, అన్నయ్యకూ నేను వ్యవసాయం చేయటం అంత ఇష్టం లేదు. అగ్రికల్చర్ బి.యస్సీ చదివింది ఉద్యోగం చేసుకోవటానికే, వ్యవసాయం చేయటానికి కాదు, ఇప్పటికైనా ఏదైనా ఉద్యోగం చూసుకో అనేవారు. అమ్మ ఒక్కతే నన్ను అర్థం చేసుకున్నది. నాన్నను కూడా ఒప్పించింది. అప్పటికే నేను కొంత సమాచారం సేకరించి పెట్టుకున్నాను. కర్ణాటకలో నేల సారవంతమైనది. పైగా కొన్ని ప్రాంతలలో భూముల ధర కూడా చాలా తక్కువ. నా స్నేహితుడు ఒకతను బళ్లారిలో కాపురం పెట్టాడు. వాడి దగ్గరకెళ్లి ఆ చుట్టుపక్కలున్న భూముల గురించి విచారించుకున్నాను. వాడు ప్రోత్సహించాడు. నాకు రాయచూరు ప్రాంతం బాగా నచ్చింది. అప్పటికే అక్కడ మన తెలుగు వాళ్లు చాలా మంది వెళ్లి క్యాంపుల్లో మకాం పెట్టారు.”

“క్యాంపులా? అవేంటి?” అనడిగింది లక్ష్మి.

“కొన్ని కుటుంబాలు ఒక చోట ఇళ్లు కట్టుకుని దానికో పేరు పెట్టుకుంటారు. అలా నేను మండవ క్యాంప్‍లో ఒకణ్ణయ్యాను. నా మరో స్నేహితుడింటి పేరు మండవ. ఆ పేరు కలిసొచ్చేటట్లుగా క్యాంప్ పేరు కూడా మండవ అనే పెట్టకున్నాను. ఇప్పుడిప్పుడు కాస్త ఫర్వాలేదు కాని, మొదట్లో నేను అక్కడికి వెళ్లినప్పుడు పెద్ద సౌకర్యాలేం లేవు. భూమి పట్ల, వ్యవసాయం పట్ల ప్రేమతో, సర్దుకుని వుండేవాళ్లం. నా మిత్రునితో కలసి మేం కొనుకున్న పొలంలో ప్రత్తి వేశాం. దిగుబడి పర్వాలేదు అనిపించింది. కొంత మంది రాగులు వేసే వాళ్లు. మేం కొంత పొలం నిమ్మగడ్డి సాగు చేశాం.”

“నిమ్మకాయలు కాకుండా గడ్డి కూడా వుంటుందా?”

“కాయకూ, గడ్డకీ సంబంధం లేదు. నేను చెప్పే నిమ్మగడ్డి సబ్బుల తయారీ, సెంట్ల తయారీలో, సుగంధ ద్రవ్యంగా వాడతారు. అక్కడక్కడా ప్రొద్దుతిరుగుడు పంటను కూడా వేస్తారు. వస్తున్నావుగా నువ్వు చూస్తావులే అన్నీ” అన్నాడు మల్లికార్జున.

“ఇన్ని పంటలు ఒక దాని తర్వాత ఒకటి చెప్తున్నారు. అక్కడి వాళ్లకు చేతినిండా పని వుంటుందేమో?”

“చేసే వాడికి ఎప్పుడు పని వుంటుంది లక్ష్మీ.”

“మీరు చెప్పే ఈ మండవ క్యాంప్ రాయిచూర్ జిల్లా, సింధనూరు తాలూకాలో వున్నదన్నారు కదూ? మా చుట్టాలొకరు ‘సిరిగుప్ప’ తాలూకాలో వుండేవాళ్లు. నేనొకసారి అక్కడకు వెళ్లాను. అక్కడంతా ఎక్కువగా మామిడి తోటలు కనపడ్డాయి. ఆ తోటల్లోనే వాళ్లు ఇళ్లు కట్టుకున్నారు. వాళ్ల మామిడితోటలోకి నెమళ్లూ, గిన్నెకోళ్లూ వచ్చేవి. వేసం కాలంలో కూడా చల్లగా హాయిగా వున్నదక్కడ” అని చెప్పింది లక్ష్మి.

“అవును లక్ష్మీ. మేం కూడా అక్కడ చూశాం. నాకెందుకో తుంగాభద్రా నదీ తీరంలో వున్న ఈ ప్రాంతమే బాగా నచ్చింది. నేను చదువుకున్న చదువు నుపయోగించుకుని ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని ఎంతో ఉత్సాహంగా వున్నది నాకు. అంతకు ముందెప్పుడో ఆ ప్రాంతానికి వరదలొచ్చి అక్కడంతా మట్టిదిబ్బల మాదిరిగా ఏర్పడి మెరక తేలింది. కొంత మంది వద్దన్నా మేం అక్కడే మెరగ్గా ఇళ్లు కట్టుకున్నాం. కొద్దికొద్దిగా సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. మమ్మల్ని చూసి మరో పది మంది వస్తారు. నెమ్మదిగా ఒక ఊరే ఏర్పడుతుందన్న నమ్మకం బాగా వున్నది.”

“పొలాలకన్నా తోటలు చూడటానికి బాగుంటాయి. చల్లగా కూడా వుంటుంది కదూ?”

“అవును లక్ష్మీ. మంగుళూరు ప్రాంతమంతా వక్కతోటలే. చూట్టానికి మన కొబ్బరితోటల్లాగా వుంటాయి. వాటి కింద అంతర పంటలుగా మిరియాలు, ఏలకలు సాగుచేస్తారు. నిదానంగా మనమూ తోటలు వేసుకుందాం.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here