[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[విజయవాడ ‘అరుణోదయ ప్రెస్’లో లెనిన్ గారిని కలుస్తాడు పతంజలి. తాను వచ్చిన పని వివరిస్తాడు. మొదట అనుకున్న రెండు కాక, మరో పుస్తకం కూడా వేద్దామనుకుంటున్నానని చెప్తాడు పతంజలి. మాటల్లో తన గురించి, కుటుంబం గురించి వివరిస్తారు లెనిన్ గారు. పతంజలి చేతి రాతని మెచ్చుకుని, పుస్తకాల ఎస్టిమేట్ వేయిస్తారాయన. పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చేసి, కర్నూలు బయల్దేరుతాడు పతంజలి. ముందుగా వెల్దుర్తిలో దిగి ఇంటికి వెడతాడు. తల్లిదండ్రులకు విషయం వివరిస్తాడు. మధ్యాహ్నం భోజనానికి తల్లి పప్పు, కూర చేసిస్తుంది. కర్నూలు చేరేసరికి మిత్రులిద్దరు చెరో క్లాసులో ఉంటారు. కొందరు బ్యాంకు ఉద్యోగులు వచ్చి సి.ఎ.ఐ.ఐ.బి పరీక్షలో ఇంగ్లీషు పేపర్‍కి ట్యూషన్ చెప్తారా అని అడుగుతారు. వారిని చేర్చుకుంటాడు పతంజలి. మధ్యాహ్నం మిత్రులు ముగ్గురు భోంచేశాకా, కింద ఖాళీ చేస్తున్న వెల్డింగ్ షాపు స్థానంలో ఒక స్టేషనరీ షాపు పెడితే బాగుంటుందన్న తన ఆలోచనని వాళ్ళతో పంచుకుంటాడు పతంజలి. దేవసహాయం గారు షాపు అద్దెకి ఇవ్వడానికి అంగీకరిస్తారు. షాపు కూడా బాగు చేయించి ఇస్తానంటారు. షాపు అవసరమైన అలమారాలు, షెల్ఫ్‌లకు ఆర్డరిస్తారు. స్టేషనరీ అవసరాలకు ఎస్టిమేట్ తీసుకుంటారు. షాపు నిర్వహణకు బ్యాంకు లోను తీసుకోవచ్చని రామ్మూర్తి బావ చెప్పి, కర్నూలులోని తమ బ్యాంచ్ ద్వారా లోను అందే ఏర్పాటు చేయిస్తాడు. పతంజలి వెళ్ళి స్థానిక శాఖ మేనేజర్ శ్రీపాద గారిని కలుస్తాడు. బ్యాంకు నిబంధలను వివరించి డాక్యుమెంట్లు సిద్ధం చేయిస్తాడాయన. స్థానిక వ్యక్తి షూరిటీ ఉండాలని చెప్తారు. కొటేషన్స్, డీటెయిల్డ్ ఎస్టిమేట్ తెమ్మని చెప్తారు. – ఇక చదవండి.]
[dropcap]“వె[/dropcap]రీ కైండాఫ్‌యు సర్! ధ్యాంక్యు” అని చెప్పి సెలవు తీసుకొని వచ్చేశాడు. రామ్మూర్తి బావ తమ మేనేజరుతో చెప్పించడం వల్ల ప్రాసెస్ సింప్లిపై అయిందని గ్రహించాడు. రాత్రి రాధాసారు యింటికి వెళ్లి అన్నీ చెప్పాడు. పతంజలి అడగకముందే “నేనొచ్చి షూరిటీ సంతకం పెడతాలే సామీ” అన్నాడాయన.
అందరివీ ఫోటోలు తీసుకొని, రాధాసారుతో కలిసి బ్యాంకుకు వెళ్లారు. రాధాసారు ఎ.డి. అని తెలిసి శ్రీపాదగారు సంతోషించారు. ఆయనను గౌరవంగా చూశారు. ముగ్గురి పేర జాయింట్ అకౌంట్ తెరిచి, కరెంట్ అకౌంట్ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఐదువందలుండాలన్నాడు. ముగ్గురికీ చెక్ పవర్ ఉంటుంది.
రెండు రోజుల తర్వాత దేవసహాయంగారింటికి విజయవాడ నుండి లెనిన్‌గారు ఫోన్ చేశారు పుస్తకాల ప్రింటింగ్ అయిపోయిందనీ వచ్చి బైండింగ్ చేయించుకొని తీసుకొని పోవచ్చుననీ చెప్పారట. సారు కాలేజీకి వచ్చి చెప్పారు. లోన్‌కు షూరిటీ సంతకం తన చేత ఎందుకు చేయించలేదని కోప్పడి వెళ్లారు.
మరునాడు డోన్‌కు పోయి గుంటూరు ప్యాసింజరు ఎక్కాడు. ‘పల్నాడు’ లో విజయవాడ చేరుకున్నాడు. అదే లాడ్జిలో రూం తీసుకొని, స్నానం, టిఫిన్ పూర్తి చేసుకొని అరుణోదయ ప్రెస్‌కు వెళ్లాడు. లెనిన్‌గారు సాదరంగా ఆహ్వానించారు. మూడు పుస్తకాలు టైటిల్ పేజితో సహా పూర్తయ్యాయి. పుస్తకాలు సింపుల్‌గా, కవరు పేజీలు అందంగా వచ్చాయి. ఒక గంట సేపు కూర్చుని అన్నీ పరిశీలించాడు. ఎక్కడో సకృత్తుగా తప్ప ముద్రారాక్షసాలేవీ లేవు. తాము తయారు చేసిన బిట్స్, ఇంగ్లీషు ఎక్సర్‌సైజెస్ అన్నీ, తమ పేర్లు, సంస్థ పేరు అచ్చులో చూసుకుంటుంటే చాలా బాగుంది. కవరు పేజీ మధ్యలో నరసింహస్వామి వారు కొలువుదీరారు. ముద్ర చాలా స్పష్టంగా వచ్చింది.
“అయితే బైండింగ్‌కు పంపేద్దామా?” అనడిగాడాయన. పతంజలి సరేనన్నాడు. “బుక్స్ ఎలా తీసుకొని వెళతారు? నవతలోగాని ఎస్.ఆర్.ఎమ్.టీ.లోగాని బుక్ చేయండి. రెండ్రోజుల్లో వస్తాయి” అని సలహాయిచ్చాడు.
బుక్‌షాపు సంగతి ఆయనకు చెప్పాడు. స్టేషనరీ, బుక్స్, విజయవాడలోనే తీసుకుందామని అనుకుని వచ్చానన్నాడు. “మాకు తెలిసిన వారే హోల్‌సేల్ డీలర్లున్నారు. మొత్తం ఎ.పి. కంతా సప్లై చేస్తారు. పదండి నేనూ వస్తాను” అని పతంజలిని తన స్కూటరు మీద ఎక్కించుకొని బీసెంటు రోడ్‌కు తీసుకెళ్లాడు. వారి షాపులు, గోడౌన్స్ చూసి పతంజలి ఆశ్చర్యపోయాడు లారీలలో వ్యవహారం జరుగుతూంది.
లెనిన్‌ను చూసి కౌంటర్లో ఉన్న అబ్బాయి సంతోషంగా ఆహ్వానించాడు. “రండి బాబాయ్! చాన్నాళ్లకు” అంటూ కూర్చోబెట్టాడు. ‘టీ’లు తెప్పించాడు. టీ తాగుతూంటే ఎందుకో శ్రీపాదగారు గుర్తొచ్చి నవ్వుకున్నాడు. కర్నూలు మార్వాడీ షాపాయన ఇచ్చిన లిస్టు చూశాడతను.
“ఇందులో లేనివి ఇంకా చాలా పెట్టాలి షాపులో. మన షాపుకు వచ్చిన కస్టమర్‌కు ఏదీ లేదని చెప్పకూడదు. సైకలాజికల్‌గా మన షాపులో అన్నీ దొరకవనే కన్‌క్లూజన్ కొచ్చేస్తాడు.” అంటూ ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేశాడు. వర్కర్స్‌ను పిలిచి గోడవున్ నుండి అన్నీ తెప్పించి పెట్టమన్నాడు.
“ఈయనకు కర్నూల్లో ట్యుటోరియల్స్ కూడ ఉంది. ఎమ్.ఎ. ఇంగ్లీషు చేస్తున్నారు ప్రయివేటుగా” అని చెప్పారు లెనిన్‌గారు. “వీడు మా కజిన్ కొడుకే” అని చెప్పాడు అబ్బాయిని గురించి. “మెటీరియల్ తీయించే లోపల మనం బుక్స్ డీలర్ దగ్గరికి వెళ్లొద్దాము” అన్నాడాయన. “కాదురా చిన్నా, మనవాళ్లు హోల్‌సేల్ బుక్స్ డీలర్లు ఎవరయినా ఉన్నారా?” అని అడిగాడు.
“కాళేశ్వరరావు మార్కెట్ రోడ్డులో నా స్నేహితుడిదే ఉంది బాబాయ్! వాడి పేరు బాపిరాజు. నేను ఫోన్ చేసి చెబుతాను. వెళ్లి మీకు కావలసినవి తీసుకోండి” అన్నాడతను. వెంటనే ఫోన్ చేశాడు. ఆ షాపు పేరు ‘హిమాంశు బుక్ డిస్ట్రిబ్యూటర్స్’ అని చెప్పాడు.
ఇద్దరూ ఆ షాపు చేరుకున్నారు. బాపిరాజు కూడ కుర్రవాడే. పతంజలి వయసుంటుంది.
“జనవరి ఫిబ్రవరి నెలలు పరీక్షల సీజన్ కాబట్టి గైడ్స్, టెస్ట్ పేపర్లకి విపరీతమయిన డిమాండ్ ఉంటుంది. మీకు కర్నూల్లో మెడికల్ కాలేజి ఉంది కాబట్టి మెడికల్ బుక్స్, పాలిటెక్నిక్ బుక్స్ కూడా పెట్టండి. టెంత్ నుండి డిగ్రీ వరకు గైడ్స్ టెస్ట్ పేపర్స్ మీద 40% మార్జిన్ యిస్తాము. టెక్స్ట్ మీద మాత్రం 10% కంటే వుండదు. అవి ప్రభుత్వమే ముద్రిస్తుంది. కానీ షాపులో టెక్స్ట్ కూడా పెట్టాలి. కాంపిటీటివ్ ఎక్జామ్స్‌కు సంబంధించిన బుక్స్, కొన్ని పాపులర్ రచయితల నవలలు పెట్టండి.
స్కూళ్లు కాలేజీలు తెరచిన తర్వాత నోట్‌బుక్స్‌కు, స్టేషనరీకి డిమాండ్ ఎక్కువ. అవి కొన్నేళ్ల వరకు ఏమీ అయిపోవు. గైడ్స్ లాంటివి సిలబస్ మారితే పనికిరావు. అలాంటపుడు మీరు వెనక్కు పంపొచ్చు. ప్రస్తుతానికి ఒక్కో టైటిల్ ఇరవై ఐదు కాపీలు వేస్తాను. ఐదో తరగతి నుండి టెంత్ వరకు అన్ని సబ్జెక్టులు ఉండాలి. వర్క్ బుక్స్, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు కొన్ని సి.బి.యస్.సి. సిలబస్, కొన్ని స్టేట్ సిలబస్ ఫాలో అవుతాయి. ఇక కాన్వెంట్లయితే స్కూలుకొక రకం పుస్తకాలుంటాయి. అవి మనం అమ్మలేం. మీ బడ్జెట్ ఎంత?”
“బుక్స్‌కు ఇరవై వేలు స్టేషనరీకి పదివేలు అనుకున్నాము”
“సరిపోదు. కనీసం లక్ష రూపాయలైనా కావాలి. ప్రస్తుతానికి మీ బడ్జెట్ ప్రకారం అన్ని రకాలూ ఇస్తాను. మీరు రోటేషన్ అయింతర్వాత కూడ డబ్బు పంపొచ్చు. చిన్నాగాడు చెప్పాడు కాబట్టి పదివేలు విలువగలవి అదనంగా యిస్తాను. తీసుకొని వెళ్లండి. బుక్స్ తీయించి విడిగా బండిల్స్ కట్టిస్తాను. మీరు లంచ్ చేసి రండి” అన్నాడు బాపిరాజు.
“సరే పతంజలిగారూ, నేను యింటికి వెళతాను. రేపు మీ పుస్తకాలు లారీ పార్సెల్ సర్వీసులో బుక్ చేద్దాం. మీరు భోజనం చేసి కొంత రెస్ట్ తీసుకొని వెళ్లండి” అని లెనిన్ వెళ్లిపోయారు.
పతంజలి దగ్గర్లోని ‘దుర్గావిలాస్’లో భోజనం చేశాడు. ‘ఉలవచారు ఈ రోజు స్పెషల్’ అని బోర్డుమీద వ్రాశారు. నల్లగా, చిక్కగా ఉందది. చాలా రుచిగా ఉంది. కందిపొడి అన్నంలో వేసి దాని మీద సమృద్ధిగా నెయ్యి పోశాడు. ఉప్పు మిరపకాయలు, క్యాబేజీ పకోడీ, పెరుగు గట్టిగా పేరుకొని ఉంది. చివర్లో అరటిపండు, పాన్ కూడా యిచ్చారు. కర్రీస్ కూడ చాలా బాగున్నాయి. ధర కూడ ఐదు రూపాయలే. ఎ.సి. రెస్టారెంటది.
రూంకు రిక్షాలో వెళ్లి ఒక గంట పడుకొని, తయారై ‘చిన్నా’ షాపుకు వెళ్లాడు. అన్నీ సీరియల్ నంబరు ప్రకారం చెక్ చేసుకున్నాడు. మొత్తం పదిహేడు వేలయింది.
కొన్ని అయిటమ్స్ తొలగిద్దామన్నాడు పతంజలి.
“వద్దు ఉండనివ్వండి. మీరెంత ఇస్తారో ఇవ్వండి. మా స్టాఫ్ ప్రతి నెలా కర్నూలుకు వస్తూనే ఉంటారు. షాపు సేల్స్‌ను బట్టి మీరు జమ చేయవచ్చు. అందునా మీరు మా బాబాయికి మిత్రులు. మీరెంతో మంచివారైతే తప్ప ఆయన స్వయంగా రారు. ఏం ఇబ్బందిలేదు. మన బంధం ఇకముందు కూడ కొనసాగుతుంది” అన్నాడు చిన్నా.
పన్నెండు వేలకు చెక్కురాసి యిచ్చాడతనికి. “ఇవన్నీ ఐదారు కార్టన్స్‌లో ప్యాక్ చేయిస్తాను. మీరు మా బాపిరాజుగాడి దగ్గరకు వెళ్లిరండి. మా వ్యాన్‌లోనే పార్సెల్ ఆఫీసుకు పంపుతాను” అన్నాడతను.
అక్కడ నుంచి హిమాంశుకెళ్లాడు. బాపిరాజు అతనికొక కేటలాగ్ ఇచ్చాడు. వాళ్లు సప్లయిచేసే బుక్ టైటిల్స్ అన్నీ ఉన్నాయి. నోట్ బుక్స్ కు వేరే క్యాటలాగ్ ఇచ్చాడు. ప్రతి ఐటం ఎదురుగా ఎన్ని కాపీలో సంఖ్య పెన్‌తో వేసి ఉంది. కార్బన్ కాపీ తాను పట్టుకొని, వర్కరు ప్రతి ఐటం చూపించి, కాపీలు లెక్కిస్తూంటే ఇద్దరూ క్యాటలాగ్‌లో టిక్ పెట్టుకున్నారు. బిల్లింగ్ అయ్యేసరికి ఐదయింది. మొత్తం ముప్ఫై ఆరువేలయింది.
“కంగారు పడకండి.కొన్ని మిగిలిపోతాయి. సిలబస్ మారినవి వెనక్కొస్తాయి. మీరెంత ఇస్తారు?”
“ఇరవై ఐదు వేలు”
“సరే క్యాష్ ఎలాగూ అంతదూరం నుండి తెచ్చి ఉండరు. చెక్ యిస్తారా.”
“తప్పకుండా” అంటూ ఇరవై ఐదువేలకు చెక్ రాసి సంతకం పెట్టి యిచ్చాడు.
“మీకు షాపులో సర్దుకోవడానికి వీలుగా విడివిడిగా కార్టన్స్ ప్యాకింగ్ చేయిస్తాను. ఇంచుమించు పది కార్టన్లవుతాయనుకుంటున్నాను. దేంట్లో బుక్ చేద్దాం? ‘నవత’ ఈ ప్రక్కనే ఉంది” అంటూ చిన్నాకు ఫోన్ చేశాడు.
“రేయ్ చిన్నా పతంజలి గారి స్టేషనరీ ప్యాకింగ్ అయినవెంటనే వ్యాను నా దగ్గరికి పంపు. అన్నీ ఇక్కడ నవతలో బుక్ చేస్తాము” అని చెప్పాడు.
బుక్స్ ప్యాకింగ్ ఆరున్నరకు పూర్తయ్యింది. వర్కర్ల వేగం, నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాడు పతంజలి. ప్యాకింగ్ అవుతూంటే చూస్తూ కూర్చున్నాడు. ‘కట్ మిర్చి’ తెప్పించాడా అబ్బాయి. మిరపకాయ బజ్జీలను మూడు నాలుగు ముక్కలు కోసి, మళ్లీ నూనెలో వేయించి, దానిమీద మసాలాపొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వేసి లైట్‌గా నిమ్మకాయ పిండారు. అద్భుతంగా ఉంది. తర్వాత అల్లం టీ తాగారు.
“మీ ఇద్దరు స్నేహితులూ చిన్న వయసులోనే ఇంత పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నారంటే చిన్న విషయం కాదు” అన్నాడు పతంజలి.
“మా ఫోర్ పాదర్స్ నుండి ఇదే వ్యాపారమే నండి మాది. చిన్నప్పటినుండి అలవాటు చేస్తారు. మా గొప్పతనమేంలేదండి. మీరు ప్రయివేటుగా ఎమ్.ఎ ఇంగ్లీషు చేస్తూ ట్యుటోరియల్ కాలేజి నడుపుతూ, ఈ బుక్ షాపు కూడ పెడుతున్నారంటే మీ ముందు మేమెంతండి బాబూ” అన్నాడతడు. అది అతని సంస్కారం.
ఏడు గంటలకు స్టేషనరీ వ్యాన్ వచ్చింది. బుక్స్ కూడ దాన్లో ఎక్కించారు. వర్కర్సును తోడిచ్చి పంపాడు బాపిరాజు. చిన్నా బిల్లులు పంపాడు. ఇవ్వవలసిన బ్యాలెన్స్ నోట్ చేశాడు. బాపిరాజు బిల్స్ ఇచ్చాడు. “బిల్స్ జాగ్రత్తగా ఫైల్ చేసుకోండి. కమర్షియల్ టాక్సోళ్లు ఇబ్బంది పెడతారు. రెండు క్యాటలాగ్స్ కూడ జాగ్రత్త. ఏ టైటిల్ ఎన్ని కాపీలు ఇచ్చామన్నది దానిలోనే ఉంది. ఏప్రిల్‌లో మా మనిషి వస్తాడు. ఫైనల్ బిల్ సెటిల్ అవుతుంది. ఎక్స్‌పైర్ అయినవి అతనికిచ్చేస్తారు. నాదీ, చిన్నాదీ ఫోన్ నంబర్లు బిల్లులమీదే ఉన్నాయి. ఫోన్ చేయండి. కావలసింది పంపుతాము. మీరు మాటి మాటికి విజయవాడ రానవసరం లేదు. ఫోన్లల్లోనే వ్యవహారమంతా నడుస్తుంది. డబ్బు మా మనిషికైనా ఇవ్వొచ్చు లేదా మా అకౌంటుకైనా క్రెడిట్ చేయవచ్చు. ఉంటానండి మాస్టారు” అని వెళ్లిపోయాడు బాపిరాజు.
వర్కురు వ్యాన్ బాడీలో ఎక్కాడు పతంజలి క్యాబిన్‌లో కూర్చున్నాడు. ‘నవత ట్రాన్స్‌పోర్టు’ ఎంతో దూరం లేదు. వ్యాన్ ఆగగానే హమాలీలు వచ్చి కార్టన్స్ అన్నీ దింపి ఒకవైపుగా పెట్టారు. మొత్తం పదిహేడు కార్టన్స్.
నవత ట్రాన్స్ పోర్టు దాదాపు అర ఎకరం ఉంది. కర్నూలుకు బుక్ చేసి రసీదు ఇచ్చారు. ‘టు పే’ చేయించాడు. సరుకు డెలివరీ తీసుకున్నప్పుడు ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్ కట్టాలి. కార్టన్ల మీద పింక్ కలర్ ఇంక్‌తో యల్.ఆర్. నంబరు, సక్సెస్ బుక్ హౌస్ కె.ఆర్.యన్.టి. అని రాస్తున్నారు కొందరు.
నవత నుండి బయటకు వచ్చేసరికి ఎనిమిదయింది. లాడ్జికి వెళుతూ ప్రెస్ దగ్గర దిగి లెనిన్ గారికి అన్నీ బుక్ చేశానని చెప్పి, థ్యాంక్స్ చెప్పాడు.
“రేపు మధ్యాహ్నానికి మన బుక్స్ వచ్చేస్తాయి. మీరు రేపు రాత్రికి వెళ్లిపోవచ్చు. మన ప్రెస్ దగ్గరే ‘క్రాంతి’ ట్రాన్స్‌పోర్ట్ ఉంది. నాలుగు లోపే బుక్ చేయిస్తాను” అన్నాడాయన.
“కనక దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నారా?”
“క్రితం సారి వచ్చినపుడే అమ్మవారిని దర్శించుకున్నానండి”
“అయితే ఉదయం బయలుదేరి మంగళగిరికి వెళ్లండి. మీరు నరసింహస్వామిని కొలుస్తారు కదా! చాలా పెద్ద పురాతనమయిన దేవాలయం. పైన పానకాలరాయుడుంటాడు. దర్శనం చేసుకొని పన్నెండు గంటలకల్లా వచ్చేయండి. మహా అయితే అరగంట పట్టవచ్చు. నాన్‌స్టాపులు కాకుండా గుంటూరు పోయే ఆర్డినరీ బస్సు ఎక్కడి” అన్నాడాయన.
పతంజలి మనస్సు ఉరకలు వేసింది. స్వామిని దర్శించుకొని వెళితే అంతా విజయమే. లెనిన్‌గారికి చెప్పి, కృష్ణా విలాస్‌లో రెండిడ్లీ, ప్లెయిన్ రవ్వదోసె తిని, మజ్జిగ తాగి, లాడ్జికి వెళ్లి పడుకున్నాడు. ఉదయం ఆరుగంటలకు లేచి, స్నానాదులు ముగించుకొని రిక్షాలో బస్టాండుకు వెళ్లి గుంటూరుకు వెళ్లే ప్యాసింజరు బస్సెక్కాడు. అరగంటలో మంగళగిరిలో దిగాడు. ఊర్లో ప్రవేశిస్తూండగానే స్వామి వారి ఆలయ గోపురం సమున్నతంగా దర్శనమిచ్చింది. గోపురానికి జోతలు సమర్పించాడు. బస్టాండు ఎదురుగా ఉన్న హోటల్లో కాఫీ తాగాడు.
మంగళగిరిలో రిక్షాలు చాలా అందంగా ఉన్నాయి. కర్నూలులోని జట్కాబండ్ల మాదిరి గూడు కలిగి ఉన్నాయి. గూడు బయటి భాగం కళాత్మకంగా, రెగ్జిన్ క్లాత్ మీద రంగురంగుల డిజైన్లు, పొలాలు, పక్షులు చిత్రీకరించబడి ఉన్నాయి. ఒకసారి ఎక్కి చూద్దామని ఒక రిక్షా వాణ్ని పిలిచి గుడికి తీసుకొని వెళ్లమని చెప్పి కూర్చున్నాడు.
గుడిదగ్గర దిగింతర్వాత ఎంతిమ్మంటావని అడిగితే “ముప్పావలా ఇవ్వండి బాబూ” అన్నాడతను. రూపాయి యిచ్చి చిల్లర తీసుకోకుండా ముందకు నడిచాడు. మనసులో అనుకున్నాడు.
‘రామ్మూర్తి బావ చెప్పినట్లు మన లెవెల్ పెరిగిపోతూంది.’ తర్వాత అనిపించింది. ‘పాపం రిక్షా అతను బీదవాడు. అతనికో పావలా అదనంగా ఇస్తే దానికి లెవెల్ ఏమిటి’ అని. స్వామి దయవల్ల తాను ఆర్థికంగా నిలదొక్కుకుంటే తన ఆదాయంలో కొంత భాగం పేదలకివ్వాలని అనుకున్నాడు. ఆ భావన వచ్చిన వెంటనే మనసంతా ఎంతో ప్రశాంతత ఆవరించింది. ‘భావనామాత్రం చేత ఇంత హాయినివ్వగలిగిన ఆ దృక్పథాన్ని ఆచరణలో పెడితే ఎంత బాగుంటుందో కదా’ అనుకున్నాడు.
స్వామివారి గుడి చాలా పెద్దది. చుట్టూ ఎత్తయిన ప్రాకారం. విశాలమయిన ఆవరణ. శిల్ప సంపద. చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. గుడి బయటే స్వామివారికి తులసిమాల, కమలాఫలాలు, కొన్నాడు. ఎందుకో గాని పతంజలికి టెంకాయకొనాలనిపించదు! ప్రసిద్ధ క్షేత్రాలు వేటిలోనైనా లోపల కొబ్బరికాయ కొట్టరు. పూజ తర్వాత ఇచ్చే చిప్ప విషయంలో కూడ మేం తెచ్చిన టెంకాయ పెద్దది. మాకు పెద్ద చిప్ప రావాలి అనేవాళ్లు, చిన్న కాయ తెచ్చినా, పెద్ద చిప్ప ఇచ్చారని సంతోషపడేవాళ్లను చూస్తే నవ్వు వస్తుంది.
దర్శనం, అర్చన కోసం రెండు రూపాయల టికెట్ కొని లోపలికి ప్రవేశించాడు. భక్తులు తక్కువగానే ఉన్నారు. స్వామి వారిని దర్శించుకొన పరవశుడయ్యాడు. పూజారి గోత్రనామాలు అడుగితే చెప్పాడు. ఆయన “సహ కుటుంబానాం ఆయురారోగ్య…” అని చెబుతూ ఉండానే “లోక కల్యాణసిధ్యర్థం” అని అప్రయత్నంగా అందించాడాయనకు. ఆయన కూడ ఆ ముక్క కలిపి సంకల్పం చెప్పాడు.
అష్టోత్తర శతనామావళి కేవలం రెండు నిమిషాల్లో ముగించాడాయన. హారతిచ్చాడు. పతంజలి శరీరం రోమాంచితమయింది. కళ్ల నిండా నిళ్లు. లోపల్నుంచి దుఃఖం వస్తూ ఉంది. వెనుక ఉన్న ఒక భక్తుడు “ఏమయింది మాస్టారు?” అంటూ కంగారు పడ్డాడు. పూజారి అతనికి నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు. పతంజలి ఉద్వేగం నుండి తేరుకున్న తర్వాత పూజారి అతనికి రెండు కమలాలను చేతిలో పెట్టి ఆశీర్వదించాడు.
“లక్ష్మీనరసింహ కరుణాకటాక్ష సిద్ధిరస్తు”
పతంజలి మంటపంలో స్తంభానికానుకొని స్వామివారిని ధ్యానించుదామనుకుంటుండగా, ఇందాకటి భక్తుడు వచ్చి ఎదురుగ్గా కూర్చున్నాడు.
“మీకు స్వామి ఒంటిమీదికి వస్తాడా సార్?” అని అడిగాడు. “మా వాళ్లకు (భార్య) కూడ కనకదుర్గమ్మ గుడిలో మీకు లాగా అవుతుంది. మన ధ్యాసలో ఉండదు. ఒకటే ఏడుపు. కంట్రోలు చేసుకోలేదు.”
“ఆమె ధన్యురాలు. అమ్మవారి కటాక్షం ఆమెపై సంపూర్ణంగా ఉంది. అది ఒంటిమీదికి రావడం కాదు. హృదయంలో ప్రవేశించడం” అన్నాడు. ఇంకా పతంజలి పూర్తిగా తేరుకోలేదు.
“అయితే మంచిదేనంటారా?”
“చాలామంచిది. ఆమె మనసు నొప్పించకుండా ఉండండి”
ఆయన పతంజలికి నమస్కరించి వెళ్లిపోయాడు. పదినిమిషాలపాటు నృసింహకవచం, ద్వాదశనామాలు చదువుకొని పానకాల స్వామి దర్శనం కోసం కొండ ఎక్కసాగాడు. మెట్లు స్టీప్‌గా ఉన్నాయి. పైకి చేరడానికి పావుగంట పట్టింది. పైన గుడి చాలా చిన్నది. గుడి అనే కంటే గుహ అనవచ్చు స్వామివారి చిన్న విగ్రహం నోరు తెరుచుకొని వుంది. బయట పానకం అమ్ముతున్నారు. గ్లాసు, చెంబు, బిందె ఇలా ఎవరి శక్తి కొద్దీ వాళ్లు కొని లోపల పూజారికిస్తే ఆయన స్వామి వారి వదన గహ్వరంలో పానకం పోస్తే. సగం స్వామి వారు స్వీకరించి, సరిగ్గా సగం బయటకు వదులుతున్నారు. పాత్ర పరిమాణంతో సంబంధం లేదు. ఇది ఎలా సాధ్యమని చాలా పరిశోధనలు చేసినా కనుక్కోలేకపోయారు. గుడి లోపల చిత్తడిగా ఉంది. పానకం వాసనలు గుడి అంతా వ్యాపించాయి. విచిత్రంగా ఈగలు ముసరడంగాని, చీమలు పట్టడం గాని లేదు.
పతంజలి ఒక చెంబు పానకం కొనుక్కొని స్వామివారికి సమర్పించాడు. నరసింహోచ్ఛిష్టమయి వెనక్కు వచ్చిన సగం చెంబు పానకాన్ని తాగాడు. అత్యంత మధురంగా ఉంది. గుడి బయట చిన్న అరుగుమీద కూర్చొన్నాడు. మంగళగిరి పట్టణమంతా కనబడుతూంది. స్తోత్రం చదువుకున్నాడు. మూలమంత్రాన్ని జపించాడు.
కొండదిగుతూంటే మనసంతా ప్రశాంతంగా అనిపించింది. అందర్నీ చల్లగా చూడమని స్వామిని ప్రార్థించాడు.
టైం పది దాటింది. నడుస్తూ బస్టాండు చేరుకున్నాడు. ‘శ్రీలక్ష్మీ నరసింహవిలాస్’ లో టిఫిన్ చేశాడు. ఈరోజు స్పెషల్ ‘మిక్చర్ పెసరట్టు, ఉప్మా’ అని రాసి ఉంది. సర్వర్‌ను పిలిచి “మిక్చర్ పెసరట్టు అంటే ఏమిటి?” అని అడిగాడు.
“మిక్చరంటే మీరనుకొనే మిక్చర్ గాదండి. ఉల్లిపాయ, అల్లం పచ్చిమిర్చి సన్నగా తరగి జీలకర్ర కలిపి పెసర దోసె మీద పరుత్తారండి. పైన పలుచగా ఉప్మా అద్దుతారండీ. నేతితో వేయించమంటారా శానా బాగుంటాది?” అన్నాడు. పతంజలి సరే అనగానే వంటింట్లోకి వినబడేలా “ఒక నేతి మిక్చర్ పెసర” అని పొలికేక పెట్టాడు “ఉప్మా” అని కూడ యాడ్ చేశాడు.
పదినిమిషాల్లో వచ్చింది స్పెషల్ పెసరట్టు. ఘుమఘుమ లాడుతోంది. మూడు రకాల చట్నీలు ఇచ్చాడు.
“తవురి గోరి కోసం పెత్తేకంగా కాల్పించానండి. తవురిదీ జిల్లాగాదేంటండి?” అనడిగాడు సర్వరు.
“మాది కర్నూలు జిల్లా లెండి” అన్నాడు.
లోపల ఉప్మా వేయడం వల్ల అది కూడ పెసరట్టుతో బాటు మగ్గి అద్భుతమయిన రుచి వచ్చింది. తృప్తిగా తిన్నాడు. కడుపు నిండిపోయింది. సర్వరు బిల్లు తెచ్చి ఇచ్చాడు. బిల్లు చెల్లించి, అతనికి ఓ పావలా ఇచ్చాడు. “చాలా బాగుంది” అని చెప్పాడు.
“వత్తూండండి బాబూ!” అన్నాడతను.
అతనెవరు? తానెవరు? ‘జననాంతర సౌహృదాని’ అని కాళిదాసుడన్నట్లు. మానవుల్లో అధిక శాతం మంచివాళ్లే. తానీ ప్రాంతం వాడు కాదని గ్రహించి, ప్రత్యేక శ్రద్ధతో పెసరట్టు వేయించి తెచ్చాడతను. ఆత్మీయతకు పూర్వ పరిచయాలు అవసరం లేదని మరోసారి రుజువైంది.
రెండు నిమిషాల్లో విజయవాడ బస్సు వచ్చింది. పదకొండు కల్లా దిగి, ఎదురుగా ఉన్న షాలిమార్ టీ ప్యాలెస్‌లో టీ తాగాడు. విపరీతమయిన రద్దీగా ఉంది. టోకెన్ తీసుకొని టీ కప్పు “సాధించుకు రావడానికి పది నిమిషాలు పట్టింది. టీ చాలా బాగుంది.
వెళ్లేముందు కౌంటరు వద్ద ఉన్నతనితో “టీ చాలా బాగుందండీ” అని కితాబిచ్చాడు.
“అలాగాండి. శానా సంతోషమండి” అన్నాడతను.
రిక్షాలో ప్రెస్ చేరుకున్నాడు. “త్వరగానే వచ్చేశారే. దర్శనం బాగా జరిగిందా?” అనడిగాడు లెనిన్. కూర్చోబెట్టి న్యూస్ పేపర్ చదవడానికిచ్చాడు.
“ఈ పుస్తకాలు షాపులకు వేస్తారా?”
“లేదండి. స్కూళ్లకు తిరిగి పిల్లలకు డైరెక్టుగా అమ్ముతాం”
“అది చాలా మంచి పద్ధతి. ఒక పని చేయండి. పుస్తకం కొంటే పెన్ను ఉచితంగా ఇస్తామని చెప్పండి. మార్కెటింగ్ స్ట్రేటజీ అది. చౌక రకం బాల్ పెన్నులుంటాయి. గ్రోసు ఇంత అని ఉంటుంది. మా చిన్నాగాడే సప్లయ్ చేస్తాడు. మీరు తీసుకున్న స్టేషనరీలో కూడ రకరకాల పెన్నులున్నాయిగాని, ఇవి చాలా చౌక. సేల్స్ బాగా పెరుగుతాయని నా ఉద్దేశం” అన్నాడాయన.
పతంజలి అంగీకరించాడు. “పదండి వెళ్లొద్దామయితే” అంటూ స్కూటర్ తీశాడాయన.
“దీనిలో నా స్వార్థమూ ఉందిలెండి. నెలరోజుల్లో పుస్తకాలు అమ్ముడైపోతే మరో ఐదు వేల కాపీలకు మాకే స్ట్రయికింగ్ ఆర్డరిస్తారని…” అన్నాడు దారిలో.
“అది మీ సంస్కారం తప్ప స్వార్ధమెలా అవుతుంది?” అన్నాడు పతంజలి.
చిన్నా బిజీగా ఉన్నాడు. “బాబాయ్ రెండంటే రెండు నిమిషాలు కన్‌సైన్‌మెంటు దిగింది. ఇప్పుడే వస్తా” అని లోపలికి వెళ్లి పది నిమిషాలకు తిరిగి వచ్చాడు. “చెప్పండి బాబాయ్” అన్నాడు. “మేం చిన్న వయసులోనే ఇంత పెద్ద వ్యాపారం నిర్వహిస్తున్నామని మా బాపిరాజును నన్నూ పొగిడారట” అన్నాడు పతంజలితో. “మావాడు తెగ సంబరపడిపోతున్నాడు. నేను కూడ అనుకోండి.”
“ఆయనన్నది కరెక్టే గదరా? మీ వయసెంతని?” అన్నాడు లెనిన్.
గుణగ్రాహిత్వం కూడ ఉత్తమ వ్యక్తిత్వంలో భాగమే. “అక్‌నాలెడ్జ్ ది మెరిట్ ఇన్ యువర్ ఫెలోబీయింగ్స్” అంటాడు కార్లైల్.
విషయం విని రెండు రకాల పెన్నులు చూపించాడు చిన్నా. ఇవి ఎక్కువ కాలం మన్నవు. రీఫిల్ వేసుకోవడం కుదరదు. ‘యూజ్ అండ్ త్రో’ ‘ఉపయోగించి పారేయడమే’ అన్నాడు. “ఇది తీసుకోండి గ్రోసు ముప్ఫై ఆరు రూపాయలు పడుతుంది. ఒక్కో పీసు పావలాకే వచ్చినట్లు”
పతంజలి ఆలోచించాడు “గ్రామీణ విద్యార్థులకు పెన్నులు ఉచితంగా ఇచ్చిన తృప్తి ఉంటుంది. దాని కోసం పిల్లలు కొంటారు. ప్రింటింగ్ కాస్ట్ మరో పావలా పెరిగిందనుకుంటే సరి” అనుకున్నాడు.
“ఎన్ని కాపీలు వేయించారు?”
“మూడు టైటిల్స్ ఒక్కోటి మూడు వేలు వేయించారు” లెనిన్ చెప్పాడు. చిన్నా లెక్కవేసి, “60 గ్రోసులు సరిపోతాయి.” అన్నాడు. “రెండు వేల నూట అరవై అవుతుంది. రెండు వేలివ్వండి చాలు. ప్రస్తుతం మీకు డబ్బు చాలకపోతే తర్వాత పంపినా ఇబ్బందేం లేదు” అన్నాడు.
“పెన్నులు ప్యాక్ చేయించి ఒక గంటలో బాబాయి దగ్గరకు పంపుతాను. ఒక కార్టన్‌లో సరిపోతాయి.” అన్నాడు. “డజను పెన్నులు కలిపి ఒక రబ్బరు బాండు వేస్తాము”
వీళ్లు ప్రెస్‌కు వెళ్లే సరికి పుస్తకాలు వ్యాన్ నుండి దింపుతున్నారు. చక్కగా బైండ్ చేశారు. లెనిన్ గారికి మిగతా డబ్బు యిచ్చేశాడు. మూడు టైటిల్స్ విడిగా లెక్కపెట్టుకోమన్నాడాయన. తర్వాత అదే వ్యాన్‌లో ‘క్రాంతి’ ఆఫీసుకు వెళ్లి కార్టన్స్ అన్నీ కర్నూలుకు బుక్ చేస్తుండగానే లెనిన్‌గారు పంపారని పెన్నుల కార్టన్ మోసుకొచ్చాడొకతను. దాన్నీ కలిపి బుక్ చేసి రశీదు జాగ్రత్త చేసుకొని వచ్చేశాడు.
అప్పటికి రెండు దాటింది. ఉదయం తిన్న పెసరట్టు మహిమేమో అంత ఆకలిగా అనిపించలేదు. లెనిన్ గారి వద్ద సెలవు తీసుకొని వచ్చేశాడు. ‘కృష్ణావిలాస్’లో రెండు పెరుగు వడలు తిన్నాడంతే. రూముకు వెళ్లి నాలుగు వరకు పడుకున్నాడు. లేచి తయారై బ్యాగ్ తీసుకొని క్రిందికి వచ్చి రూము ఖాళీ చేశాడు. బస్సులో గుంటూరు చేరుకొని కొంతసేపు గుంటూరు రోడ్ల మీద తిరిగాడు. ఒకచోట చిన్న చిన్న బోండాలు వేస్తున్నాడు బండిమీద. అవేమిటని అడిగితే క్యాప్సికం బోండాలని చెప్పారు. క్యాప్సికం పంట ఉడిగిపోయే సమయంలో చిన్నచిన్నవి వస్తాయట. వాటిల్లో ఉల్లికారం కూరి శనగపిండిలో ముంచి వేస్తున్నాడు. రూపాయికి నాలుగిచ్చాడు. వంకాయ బోండాల కంటె బాగున్నాయి.
గుంటూరు రైల్వే స్టేషన్ ముందున్న మమత హోటల్‌లో ఎనిమిది గంటలకు భోంచేశాడు. టికెట్ తీసుకొని సిద్ధంగా ఉన్న గదగ్ ప్యాసింజర్లో కూర్చుందామని చూస్తే జనరల్ పెట్టెలు నిండిపోయి ఉన్నాయి. స్లీపర్ క్లాస్ కండక్టరును రిక్వెస్ట్ చేస్తే ఆయన యస్ 2లో డెభై రెండులో పడుకోమన్నాడు. నాలుగు రూపాయలు బెర్త్ ఛార్జీ. ఐదు రూపాయలిస్తే తీసుకొని, రశీదిచ్చి, ఒక నవ్వు నవ్వాడు. ‘సరిపోయింది. రూపాయి మీద ఆశ పెట్టుకోవద్దని’ దానర్థం.
డెభై రెండు అప్పర్ బెర్తు. బాత్ రూంకు పోయి వచ్చి పైకెక్కి పడుకున్నాడు. గాఢ నిద్ర పట్టేసింది. నంధ్యాల్లో నాలుగు గంటలకు దిగి అక్కడనుండి కర్నూలుకు బస్సులో చేరుకున్నాడు.
***
ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకునేసరికి ఆరున్నరయింది. ఒక గంట పడుకొని లేచాడు. ఎనిమిది నుంచి పన్నెండు వరకు క్లాసులు చెప్పాడు. భోజనం టైములో విజయవాడ విశేషాలన్నీ చెప్పాడు. బుక్స్ కొన్నవారికి పెన్ ఉచితంగా ఇచ్చే పథకం గురించి చెప్పాడు. పెన్స్ చాలా చౌకగా వచ్చాయని, పావలా కూడ పడలేదన్నాడు. మిత్రులిద్దరూ బాగుందన్నారు. ఎల్లుండి స్టాక్స్ వచ్చేలోపల షాపు సెట్ చేసుకుంటే మంచిరోజు చూసి ప్రారంభించవచ్చుననుకున్నారు. షాపు ఇనాగురేషన్ అయింతర్వాత పుస్తకాలు అమ్మడానికి వెళ్లాలి.
మధ్యాహ్నం వెళ్లి చెక్ యిచ్చి, ర్యాక్స్ పంపించమని చెప్పారు. వాళ్ల వర్కర్లు ఇద్దరు వచ్చి ర్యాక్స్ బిగించిపోయారు. పతంజలి విజయవాడలో ఉండగానే ముని, ఉస్మాన్ సీలింగ్, ప్లోరింగ్ పని చేయించేశారు. సీలింగ్ ఫ్యాన్ తిరిగే సందులేదు. కౌంటరుకు ఒక మూల చిన్న టేబుల్ ఫ్యాన్ గోడకు బిగింపజేసుకుంటే సరి.
మర్నాడు ఉదయం షోకేసు వచ్చింది. చాలా బాగా చేశాడు. ప్లోరింగ్‌లో అమర్చిన రెయిల్స్ మీద అంటూ ఇటూ లాగి చూస్తే సరిగ్గా సరిపోయింది.
బుక్స్, స్టేషనరీ షాపులో సర్దుకున్నా, తాముంటున్న రూములో బిట్ బ్యాంక్స్, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు పెట్టుకోవాలి. ఆ రూములో అటక కూడ ఉంది. రాత్రి రాధాసారు యింటికి వెళ్లి విషయమంతా వివరించారు. షాపు కూడ మీ చేత్తోనే ప్రారంభించాలని కోరారు. ఆయన నవ్వి ఇలా అన్నాడు.
“షాపు మాత్రం నేను వద్దు, నేను వద్దన్నానని ఏ దేవసహాయంతోనైనా చేయించేరు. టౌన్‌లో పలుకుబడి ఉన్న నాయకుడినెవరినైనా పిలుద్దాము. ఆయన వెంట పదిమంది వస్తారు. విలేఖరులు కూడ వస్తారు. షాపు ముందు షామియాన వేయించి ఇరవై ముఫై కుర్చీలు వేయిద్దాము. వచ్చిన వాళ్లందరికీ స్వీటు, హాటు, టీ ఇస్తే సరి. కొంత పబ్లిసిటీ వస్తుంది.”
“నిజమేసార్” అన్నారు ఏక కంఠంతో.
(సశేషం)