జ్ఞాపకాల తరంగిణి-60

0
3

అదృష్టాధ్య గమనంలో 75వ మైలురాయి

[dropcap]ఎం[/dropcap]దరెందరో త్యాగధనులు తమ సర్వస్వాన్ని, ప్రాణాలను సహితం దేశ స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం ఆత్మార్పణ చేసుకొన్నారు. మహాత్ముని నాయకత్వంలో చివరకు స్వాతంత్ర్యాన్ని సాధించుకొన్నాము.

మన జాతీయోద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజా రామ్‌మోహనరాయ్ బ్రహ్మసమాజాన్ని స్థాపించి మనలో మూర్ఖత్వాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు జాగురూకులై హక్కుల కోసం పోరాటాలకు ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంతో నాంది పలికారు. విప్లవ వీరవనిత ఝాన్సీలక్ష్మి వంటి నాయికలు ఈ విప్లవాన్ని నడిపారు. కంపెనీ ప్రభుత్వం పోయి విక్టోరియా రాణి ప్రభుత్వం వచ్చింది. దోపిడి, అణచివేత, శ్వేతజాతి దురహంకారం మరింత పెరిగాయి తప్ప ఏమీ తగ్గలేదు. ఉప్పు మీద, పప్పు మీద, అన్నిటి పైనా పన్నులే. మాంచెస్టర్ వస్త్రాలను ఈ దేశంలో అమ్మి చేనేత వస్త్ర పరిశ్రమను నాశనం చేశారు. బ్రిటీష్ అధికారులు చిన్నవారైనా, గవర్నర్ అయినా వాళ్ళ విలాసాలకు పరిమితి లేదు. 1836లో రాజమండ్రి జిల్లా జడ్జి ఇంట్లో పనివాళ్ళు 52 మంది అంటే ఊహించుకోవచ్చు కడమ వారి జీవన విధానం.

1885లో ఎ. ఓ. హ్యూమ్ సహకారంతో భారతీయ విద్యావంతులు ఒక వేదిక మీదికి రావడానికి నేషనల్ కాంగ్రెస్ సంఘం ఏర్పాటయింది. మద్రాసులో కొంచం ముందుగానే నేటివ్ అసోసియేషన్ పేరుతోనో అటువంటి ఆశయాలతోనో ఒక సంఘం ఏర్పడింది. ఈస్టిండియా కంపెనీ తోడ్పాటుతో ఈ దేశంలో క్రైస్తవ మతాంతరీకరణ, మిషనరీ పాఠశాలలు, మిషనరీ వైద్యశాలలు, 1830 ప్రాంతాలకే ఏర్పాటయ్యాయి. 1858 ప్రాంతంలో మద్రాసు, బొంబాయి, కలకత్తా విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. ఇంగ్లీషు వారు ఏ ఉద్దేశంతో నెలకొల్పినా, భారతీయులు తమ దేశ ప్రజల కోసం, పత్రికలను ప్రారంభించారు. ప్రజలను దేశ సమస్యలపైన మేల్కొలపాలని ప్రయత్నం చేశారు. 1900 తర్వాత దేశభాషలలో పత్రికలు ప్రజల హక్కుల కోసం రాయడంతో ఇంగ్లీషు ప్రభుత్వానికి కంటగింపుగా మారింది.

దేశ ప్రజల సమైక్యతను దెబ్బతీయడానికి వైస్రాయి కర్జన్ బెంగాల్ రాష్ట్రాన్ని మత ప్రాతిపదికపైన తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని రెండు ముక్కలుగా విడదీయడంతో రాష్ట్ర సమైక్యత కోసం బిపిన్ చంద్ర పాల్, టాగోర్ వంటి వారు గళమెత్తారు. లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్ త్రయం ‘లాల్-బాల్-పాల్‌’గా ప్రజల హృదయాలను దోచుకున్నారు. తిలక్ ‘సంపూర్ణ స్వాతంత్ర్యం మా జన్మహక్కు’ అని ప్రకటించడంతో మాండలే జైలుకు పంపబడ్డాడు. కఠినమైన ప్రెస్ యాక్టు అమలు పరిచి దేశంలోని పత్రికలన్నిటిని రాక్షస చట్టాలతో మూయించారు పాలకులు. బెంగాల్‌ని 1911 సమైక్యపరిచినా, బెంగాలీయులపైన కక్షతో దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించారు.

తిలక్ శిక్ష పూర్తయి వచ్చాకా, అనిబిసెంట్ తదితరులు హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్న తరుణంలోనే గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి అక్కడ జరిపిన పోరాటాల అనుభవంతో జాతీయోద్యమంలో దిగారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన టర్కీ మీద విధించబడ్డ శిక్షల్లో ఆ దేశం ప్రపంచ ముస్లింలకు నాయకత్వాన్ని వహించడాన్ని రద్దు పరచడం ఒకటి. బ్రిటీష్ వారి చర్యకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరుస్తూ, మన దేశంలో ఆందోళనలు చేపట్టారు. గాంధీజీ ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ కొనసాగించారు. బ్రిటీష్ ప్రభుత్వం పౌర హక్కులను, సమావేశ, సభా హక్కులను రద్దుపరుస్తూ రౌలట్ చట్టాన్ని తెచ్చింది. రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశమంతటా శాంతియుతంగా సభలు, ప్రదర్శనలు జరిగాయి. 13 ఏప్రిల్ 1919న శాంతియుతంగా రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సభ జరుపుకుంటున్న ప్రజలపై జనరల్ డయ్యరు సైనికుల చేత కాల్పులు జరిపించడంతో వందలమంది చనిపోయారు, వందలమంది గాయపడ్డారు. బ్రిటీష్ వలస పాలనలో ఇదొక మాయనిమచ్చ.

1921లో జాతీయ కాంగ్రెస్, గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణ లేదా అసహాయోద్యమం నిర్వహించింది.  ప్రజలు పన్నులు కట్టడానికి నిరాకరించారు. ఆంద్ర ప్రదేశ్‌లో పల్నాడు పన్ను నిరాకరణ ఉద్యమం చరిత్రలో ప్రత్యేకంగా స్థానం సంపాదించుకొంది. జాతీయోద్యమంలో ఈ ఘట్టంలోనే మొత్తం దేశంలో వందల వేల సంఖ్యలో ప్రజలు అరెస్టయి జైలు శిక్షలు అనుభవించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే గాంధీజీ దేశమంతా పర్యటించారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గోరఖ్‌పూర్ దగ్గర చౌరిచౌరా అనే గ్రామంలో సహాయ నిరాకరణ ఉద్యమం కోసం శాంతియుతంగా సమావేశమైన ప్రజల మీద బ్రిటీషు పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురో నలుగురో చనిపోయారు. అనేకమంది ప్రజలు గాయపడ్డారు. ఈ సంఘటనతో రెచ్చిపోయిన ప్రజలు పోలీసుల మీద దాడి చేస్తే, అల్ప సంఖ్యాకులైన పోలీసులు ఆత్మరక్షణ కోసం పోలీసు స్టేషన్లో తలదాచుకొన్నారు. ఆగ్రహంతో ఉన్న ప్రజలు స్టేషన్‌ను తగలబెట్టడంతో పోలీసులందరూ చనిపోయారు. ఉద్యమం హింసాయుతంగా మారడంతో మహాత్ముడు ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు.

1929 డిసెంబరు చివర, 1930 జనవరి ఆరంభంలో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సభల్లో కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యాన్ని, ‘స్వరాజ్యం మా జన్మహక్కు’ అని నినదించిన తిలక్ మహాశయుడి ఆశయాన్ని, ఆశయంగా అంగీకరించి అందుకోసం ఉద్యమించింది. జవహర్‌లాల్ నెహ్రూ వంటి యువకులు కాంగ్రెస్‍లో నాయకులుగా ఎదుగుతున్న కాలం అది. మహాత్ముడు 1930లో గుజరాత్‍లో సముద్రతీరంలో ఉన్న దండికి – ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ఉప్పు తయారు చెయ్యడానికి సుదీర్ఘమైన నడక – దండి మార్చ్ – ప్రారంభించారు. దారిలో ఎంతమందో యువతీయువకులు, నాయకులు కలిశారు. దండి లోనే కాదు, ఆ స్ఫూర్తితో ప్రజలు నిర్భయంగా, చట్టాలను ఉల్లంఘించి సముద్ర తీరాల్లో ఉప్పు తయారు చేసిన నేరానికి జైళ్ళకు వెళ్ళారు. ప్రజల నిత్యజీవితానికి సంబంధించిన అంశం కనక, ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా జరిపిన ఉద్యమం గొప్ప విజయాన్ని సాధించింది. ఉప్పు తయారు చేసినవారినే కాక, స్వచ్ఛంద సేవకులకు ఆశ్రయమిచ్చిన గ్రామీణులను, అన్నం పెట్టిన గ్రామీణులను కూడా అరెస్టు చేసి ప్రభుత్వం జైళ్ళకు పంపింది.

తర్వాత రాయబారాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు కొనసాగుతూ వచ్చాయి. 1931 ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెసులో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు. 1940లో కాంగ్రెస్, పెద్ద ఎత్తున కాకుండా, ఎంపిక చేసిన కొందరిని సత్యాగ్రహం చెయ్యడానికి అనుమతించేది. అట్లా కొందరు నాయకులు వ్యష్టి సత్యాగ్రహంతో పాల్గొని ఉద్యమం వేడి తగ్గకుండా కొనసాగించారు. సుభాష్ చంద్రబోస్ హిట్లర్ సహకారంతో ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మించి బ్రిటీష్ సైన్యంతో తలపడ్డారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో మన నాయకులు బ్రిటీష్ ప్రభుత్వానికి సహకరించారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటీష్ ప్రభుత్వం – కాంగ్రెస్‍ను యుద్ధానికి సహకరించమని కోరినప్పుడు – “యుద్ధం తర్వాత స్వాతంత్ర్యం ప్రకటిస్తారా?” అని కాంగ్రెస్ ప్రశ్నించింది. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవడంతో కాంగ్రెస్ ‘Quit India’ – ‘మా దేశం విడిచి వెళ్ళండి’ అంటూ ఉద్యమాన్ని ప్రారంభించింది. రష్యా నాయకులు స్టాలిన్ యుద్ధంలో హిట్లర్‍కు వ్యతిరేకంగా ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్నారు కనుక, మన దేశంలోనూ కమ్యూనిస్టులు ప్రభుత్వానికి యుద్ధకాలంలో సహకరించారు. అది పెద్ద నేరమేమీ కాదు. కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో యువత పాల్గొని అక్కడక్కడా టెలిగ్రాఫ్ వైర్లు తెంపడం, పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్‌లు, ఆఫీసులు ధ్వంసం చెయ్యడం వంటి ఘటనలకు పూనుకొన్నది. శాంతియుత ఉద్యమంలో ఇదొక ఘట్టం.

స్వాతంత్ర్యం ప్రకటించబోతున్న సమయంలో, యుద్ధానంతరం, సుమారు 500 పై చిలుకు సంస్థానాధిపతులకు – భారతదేశంలో కలసిపోయేందుకు, లేదా స్వత్రంత్య్ర దేశాలుగా ఉండేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దేశ ప్రజలను హిందూ మహమ్మదీయులుగా 1919 ప్రాంతాల్లోనే విడదీసి, జాతీయోద్యమాన్ని నీరుగార్చడానికి  ముస్లిం నాయకుల చేత ముస్లిం లీగ్ పార్టీ నెలకొల్పేట్టు చేసింది. లీగ్ నాయకుల ఆధ్వర్యంలో పాకిస్తాన్‍ను ఏర్పాటు చేయించింది, బ్రిటీష్ ప్రభుత్వం – జిన్నాగారికి స్వతహాగా అటువంటి ఆలోచన లేకపోయినా.

1600లలో ఈ దేశంలో ఇనుప పాదం మోపి, ప్లాసీ యుద్ధం తరువాత దేశాన్ని అధీనంలో తెచ్చుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1857 వరకు పాలించగా, తర్వాత ఇంగ్లీషు రాణే దేశాన్ని పరిపాలించింది.

జవహర్‌లాల్, లాల్ బహాదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ నాయకత్వంలో దేశ పునర్నిర్మాణానికి పూనుకోవడమే కాక, బాబా సాహెబ్ అంబేద్కర్ చేత గొప్ప లౌకిక రాజ్యాంగాన్ని తయారు చేయించి దేశ ప్రజలకు ఇవ్వడమే కాక – ఎన్ని ఒడిదొడుకులు, సరిహద్దుల్లో యుద్ధాలు వచ్చినా ప్రభుత్వాలు ఈ గణతంత్ర రాజ్యాన్ని ముందుకు నడిపించడం గొప్పగా చెప్పుకోదగినది. మనతో పాటు స్వాతంత్ర్యాన్ని పొందిన పాకిస్తాన్ తనని తాను ముస్లిం దేశంగా ప్రకటించుకొని, అల్ప సంఖ్యాకులను అణచివేస్తూ నియంతృత్వ మార్గంలో సాగుతోంది. భిన్నత్వంలో ‘ఏకత్వం’ మనం నిర్వచించుకొన్న సూత్రం. మన జాతి మనుగడకు లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యమే రక్ష!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here