[dropcap]“మం[/dropcap]చితనం వేరు, సామర్థ్యం వేరు” అని ఒక పెద్దాయన నాతో అనటం నాకు గుర్తుంది. మంచివారైనంత మాత్రాన ఒకరు ఏ పని చేయటానికైనా సమర్థులు అనుకోవటం పొరపాటు అని ఆయన ఉద్దేశం. సమర్థులైతే దుర్గుణాలున్నా పర్వాలేదా? అదీ కుదరదు. “నా పని నేను బాగా చేస్తున్నాను కదా. నేను ఎలా ఉంటే నీకెందుకు?” అని ప్రశ్నించేవారికి జవాబుగానే నియమనిబంధనలు వచ్చాయి. చెడు ప్రవర్తన వల్ల బుద్ధి పాడయి ఇప్పుడు కాకపోయినా ఒకనాటికి నష్టం జరుగుతుంది. చెడు ప్రవర్తనను క్షమించి వదిలేస్తే వేరే వాళ్ళు నేర్చుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే రోడ్డు మీద ఎడమవైపు కాకుండా కుడి వైపు వాహనం నడిపితే ప్రమాదానికి అవకాశం ఉంటుంది. “నేను జాగ్రత్తగా నడుపుతాను” అంటే కుదరదు. నియమం నియమమే. అందరూ పాటించాలి. ఈ అంశంతో సినిమా తీయటమంటే సాహసమే. అలాంటి సినిమా ‘ఫ్లైట్’ (2012). నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. పెద్దలకు మాత్రమే. హిందీ శబ్దానువాదం అందుబాటులో ఉంది.
ఈ సినిమాలో నాయకుడు ఒక పైలట్. చాలా సమర్థుడైన పైలట్. కానీ తాగుబోతు. విధి నిర్వహణలో కూడా మద్యపానం చేస్తాడు. సహచరులకు తెలిసినా అతని మీద గౌరవంతో నోరు విప్పరు. నేను కోరుకున్నప్పుడే తాగుతాను అంటాడు కానీ తాగకుండా ఉండలేక తాగుతున్నానని ఒప్పుకోడు. ఇతరులకు అబద్ధం చెప్పటమే కాక ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాడు. రక్తంలో ఆల్కహాల్ శాతం 0.08 ఉంటే కారు నడపటమే నేరం. అలాంటిది ఇంకా ఎక్కువ శాతంతో విమానం నడుపుతాడు. నేను సమర్థుడైన పైలట్‌ని కాబట్టి నా తాగుడు సంగతి మీకు అనవసరం అంటాడు. విషయం అధికారులకి తెలిస్తే ఏమౌతుంది? అదే కథాంశం.
‘ఫ్లైట్’ అంటే ఎగరటం, విమానప్రయాణం అనే అర్థాలతో పాటు పారిపోవటం అనే అర్థం కూడా ఉంది. ‘Fly’ అనే క్రియాపదానికి నామవాచకం ‘Flight’. అలాగే ‘flee’ అనే క్రియాపదానికి కూడా అదే నామవాచకం. ‘Flee’ అంటే పారిపోవుట. వాస్తవం నుంచి పారిపోయే నాయకుడి కథ ఇది. ఇలాంటి ఉపకథే అయిదేళ్ళ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో కూడా ఉంది. అందులో డాక్టరైన నాయకుడు తాగి వచ్చి ఆపరేషన్ చేస్తాడు. అక్కడ అది ఉపకథ ఐతే ‘ఫ్లైట్’లో అదే ముఖ్యకథ.
కథానాయకుడి పేరు విప్. అతని తాగుడు వల్లే అతని భార్య విడాకులు తీసుకుంది. వారికి పదిహేనేళ్ళ కొడుకు. తల్లితో ఉంటాడు. తండ్రి తాగుబోతని తెలుసు. పిల్లవాడి సంరక్షణకి విప్ డబ్బులివ్వాలి. అది కూడా సరిగా ఇవ్వడు. మాజీ భార్య మీద కోపం. కారణం లేకుండా విడాకులు తీసుకుందని. తాగుబోతు పెంపకంలో పిల్లవాడు ఏమౌతాడో అని ఆమె భయం. పిల్లవాడంటే ప్రేమ ఉంది కదా తాగితే తప్పేమిటి అని ఇతని వాదన. ఇదో రకం అహంకారం. కట్రీనా అనే ఫ్లైట్ అటెండెంట్‌తో విప్‌కి లైంగిక సంబంధం ఉంటుంది. ఒకరోజు ఆమెతో కలిసి రాత్రంతా తాగి ఉదయం విమానం నడిపే ముందు మెదడు చురుకుగా ఉండటానికి కోకైన్ పీల్చి బయలుదేరతాడు. కట్రీనాతో పాటు విమానంలో ఇంకో ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లు ఉంటారు. కొత్త కో-పైలట్ విప్ దగ్గర వచ్చే మద్యం వాసనకి ఆశ్చర్యపోతాడు కానీ పైకి ఏమీ అనడు. విప్ చురుకుగా తన పని తాను చేసుకుపోతాడు. వాతావరణం బాగాలేకపోవటంతో విమానం కుదుపులకి లోనవుతుంది. ప్రయాణీకులు బెంబేలుపడతారు. విప్ సూచనలతో కో-పైలట్ విమానాన్ని మేఘాలు దాటించి పైకి తీసుకువెళతాడు. అంతా సాఫీగా ఉంటుంది. విప్ మరికొంత మద్యం సేవించి నిద్రపోతాడు. కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటామనగా విమానం అదుపు తప్పుతుంది. విప్ మేల్కొని విమానం ముక్కుసూటిగా కిందకు దూసుకుపోతుండటం గమనిస్తాడు. ప్రయాణీకులనందరినీ సీట్ బెల్టులు పెట్టుకోమని చెప్పిన తర్వాత విమానాన్ని గాల్లోనే పూర్తిగా తలకిందులు చేస్తాడు. దాంతో ముక్కుసూటిగా కిందకు పోతున్న విమానం సమాంతరం అవుతుంది. మళ్ళీ విమానాన్ని సవ్యంగా తిప్పి ఒక మైదానంలో క్రాష్ ల్యాండింగ్ చేస్తాడు. తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోతాడు.
ఆసుపత్రిలో మేల్కొన్న అతనికి కట్రీనాతో పాటు ఇంకో ఫ్లైట్ అటెండెంట్ మరణించిందని, ప్రయాణీకులలో నలుగురు మరణించారని తెలుస్తుంది. పైలట్‌తో కలిపి 102 మంది ఉంటే 96 మంది ప్రాణాలతో బయటపడతారు. కో-పైలట్ కోమాలో ఉంటాడు. కొందరు ప్రయాణీకులు గాయపడి చికిత్స పొందుతూ ఉంటారు. సాధారణంగా ఇలాంటి ఘట్టాలలో నాయకుడు తాగుబోతు కాబట్టి అతను ఏదో పొరపాటు చేస్తాడని దాని వల్ల ప్రమాదం జరుగుతుందని మనం అనుకుంటాం. ఇక్కడే కథ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విప్ ఎంతటి దక్షత గలవాడో మనకు తెలుస్తుంది. తాగి ఉన్న స్థితిలో కూడా అతను వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుంటాడు. విమానాన్ని తలకిందులు చేస్తే విమానం పతనాన్ని ముక్కుసూటిగా కాకుండా చేయవచ్చని అతనికి స్ఫురిస్తుంది. అయితే అతను తాగిన మత్తును పోగొట్టుకోవటానికి కోకైన్ తీసుకుని ఉన్నాడు. తాగటమెందుకు, కోకైన్ తీసుకోవటమెందుకు? అతను తాగుడుకి బానిస అయిపోయాడు. మాదకద్రవ్యాలు తీసుకోవటం ఎప్పటికైనా ప్రమాదమే. వాటికి అలవాటు పడితే శరీరం వాటి మీద ఆధారపడిపోతుంది. స్వతంత్రమనేదే ఉండదు. తన పొరపాటు వల్ల ప్రమాదం జరిగితే విప్ పశ్చాత్తాప పడేవాడేమో! కానీ తన దక్షత వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని అతనికి తెలుసు. అందుకే రక్షణాత్మక (defensive) వైఖరి అవలంబిస్తాడు. అయితే తాగుడు మానేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంట్లో ఉన్న మద్యమంతా పారబోస్తాడు. ఎందుకు? ఎక్కడో ఓ మూల అపరాధభావముంది. అయితే వ్యసనం అంత తొందరగా వదులుతుందా?
విప్ చాకచక్యం వల్లనే పెద్ద ప్రమాదం తప్పిందని మీడియా వాళ్ళు అతన్ని ఆకాశానికెత్తేస్తారు. ఆసుపత్రిలో ఉండగా అతనికి నికోల్ పరిచయమౌతుంది. ఆమె డ్రగ్ ఓవర్ డోసుతో స్పృహ కోల్పోగా ఆమెని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె అందమైనది. ఎంతో సన్నిహితంగా ఉండే తల్లి క్యాన్సర్‌తో మరణించింది. ఫొటోగ్రఫర్ అవ్వాలనుకున్నదల్లా చివరికి మసాజ్‌లు చేస్తూ వేశ్యగా మారింది. ఆమె కథ విన్న అతనికి ఆమె మీద సానుభూతి కలుగుతుంది. ఆమె చిరునామా తీసుకుంటాడు. కొన్ని పరిచయాలు వెంటనే గాఢమైన అనుబంధంగా మారతాయి.
ఆసుపత్రిలో ఉండగానే అతని రక్తం నమూనా తీసుకుని పరీక్ష చేశారని తర్వాత విప్‌కి తెలుస్తుంది. పైలట్ల యూనియన్ వాళ్ళు ఒక లాయర్‌ని విప్ కోసం నియమిస్తారు. ఆరుగురి ప్రాణాలు పోయాయి కాబట్టి ఎవరో ఒకరిని బాధ్యులని చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. విమానం తయారీ సంస్థదే తప్పని, కాదు విమానయాన సంస్థ సరైన నిర్వహణ పద్ధతులు పాటించలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. రక్త పరీక్షలో విప్ శరీరంలో ఆల్కహాల్ శాతం 0.24 ఉందని తేలుతుంది. అయితే పరీక్షకు ఉపయోగించని యంత్రం సరిగా లేదని, పరీక్షించినవారు అన్ని వివరాలు సరిగా నమోదు చేయలేదని కారణాలు చూపించి ఆ నివేదికను బయటకు రాకుండా చేస్తాడు లాయరు. విమానంలో లోపం ఉందని అందరికీ తెలుసు. అది నిజమే! మరి తన తాగుడు సంగతి బయటకు రాకూడదని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అది నియమాలకు విరుద్ధం కాబట్టి. నియమాలు పాటించకపోతే విమానయానం లాంటి ప్రమాదకరమైన ఉద్యోగాలలో శిక్షలు కఠినంగా ఉంటాయి. ఈ సంఘర్షణతో మళ్ళీ తాగుడు మొదలుపెడతాడు విప్. సంఘర్షణలో ఉన్నప్పుడు పక్కదారి పట్టడం మానవప్రవృత్తి. ఇలాంటి సమయాలలో ధర్మం ఏమిటని ఆలోచిస్తే సరైన దారి దొరుకుతుంది.
తన ‘ప్రేయసి’ కట్రీనా లేకపోవటంతో ఒక తోడు కోసం నికోల్‌ని వెతుక్కుంటూ వెళతాడు విప్. ఆమె ఇంటి అద్దె కట్టకపోవటంతో ఖాళీ చేయిస్తూ ఉంటాడు యజమాని. అతనికి డబ్బిచ్చి ఆమెని తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమె ఒక చిన్న ఉద్యోగం చూసుకుంటుంది. ‘ఆల్కహాలిక్స్ అనానిమస్’ (AA) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించే మీటింగులకి వెళుతూ ఉంటుంది. తాగుడుకి, మాదకద్రవ్యాలకి బానిసలైన వారు ఈ మీటింగులలో తమ వ్యక్తిగత విషయాలు ఇతరులతో చెప్పుకుంటారు. ఇలా చేస్తే కుంగుబాటుకు దూరమై తాగుడుకి దూరంగా ఉంటారు. చెప్పుకోవటానికి ఎవరూ లేకపోతే బాధలు మరచిపోవటానికి తాగుడు మళ్ళీ మొదలుపెడతారు. తమ సన్నిహితులతో చెప్పుకోవచ్చు కదా అంటారేమో, వ్యక్తిగత విషయాలంటే సన్నిహితుల మీద అలకలు, అనుమానాలు కూడా ఉంటాయి. బయటివారితో చెప్పుకుంటే వారు తటస్థంగా ఉండి సలహాలు ఇస్తారు. బయటివారికి చెప్పుకుంటే గుట్టు రట్టు కాదా అనే ప్రశ్న రావచ్చు. పాశ్చాత్య దేశాలలో ఎవరి జీవితం వారిదే. పక్కవారిని తప్పుబట్టే సంస్కృతి తక్కువ. తప్పులు చేయటం, సరిదిద్దుకోవటం – ఇదే వరస. మనవాళ్ళు సమాజానికి భయపడి తప్పులు చేయకుండా ఉండేలా ప్రయత్నిస్తారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఆధునికత పేరుతో వింత పోకడలన్నీ వచ్చి పడుతున్నాయి.
విమానయాన సంస్థ అధిపతి విప్‌దే తప్పు అన్నట్టు ప్రవర్తించేసరికి మరీ కుంగిపోతాడు విప్. ఇంతలో కో-పైలట్ కోమా నుంచి బయటపడ్డాడని తెలుస్తుంది. అతన్ని చూడటానికి వెళతాడు. అతను, అతని భార్య నిజమైన క్రిస్టియన్లు. దేవుడి ఆఙ లేకుండా ఏదీ జరగదని నమ్ముతారు. “నువ్వు తాగి ఉన్నావని నాకు తెలుసు. అయినా ఎవరికీ ఏమీ చెప్పను. కానీ దేవుడు ఈ పరిస్థితి ఎందుకు కల్పించాడో నువ్వు ఆలోచించుకోవాలి” అంటాడు కో-పైలట్. ఒత్తిడిలో విప్ దేశం విడిచిపోదామంటాడు నికోల్‌తో. అతనితో ఉంటే మళ్ళీ తాను డ్రగ్స్‌కి బానిస అవుతాననే భయంతో ఆమె రానంటుంది. అతను కూడా AA మీటింగులకి వస్తే తాగుడు వ్యసనం నుంచి బయట పడవచ్చని అంటుంది. అతను అసహనం చూపిస్తాడు. తనకి వ్యసనమే లేదంటాడు. దీంతో నికోల్ అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. త్వరలోనే ప్రమాదం మీద రవాణా భద్రత సంస్థ విచారణ చేయబోతోందని తెలుస్తుంది విప్‌కి. ఆపై ఏం జరిగిందనేది మిగతా కథ.
విధిని ఎవరూ తప్పించుకోలేరు. ‘నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాను. నేనేం చేసినా చెల్లుతుంది’ అనుకునేవారికి ఎప్పుడో ఒకప్పుడు క్లిష్టమైన సమస్యలు ఎదురవుతాయి. ఏం చేయాలో పాలుపోదు. ప్రమాదం జరగకుండా ఉంటే రక్తపరీక్ష జరిగేది కాదు. రక్తపరీక్ష జరగకపోతే నిజం బయటపడేది కాదు. మరి ప్రమాదం విధి విలాసం కాకపోతే ఏమిటి? ప్రమాదంలో ఎక్కువ ప్రాణనష్టం కలగకుండా విప్ చూడగలిగాడు. కానీ తనకు తాను చేసుకునే నష్టం ఏమిటో అతనికి చివరికి తెలిసివస్తుంది. అప్పుడైనా అతను ధర్మమార్గంలో నడుస్తాడా? నియమాలు ఉల్లంఘించాడు కాబట్టి తాను అపరాధినే అని ఒప్పుకుంటాడా? విమానంలో లోపమే ప్రమాదానికి కారణం అని అందరూ ఒప్పుకుంటారు. కానీ నియమాలు ఉల్లంఘించినవారికి శిక్ష పడకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రోడ్డుకి కుడివైపున వాహనం నడిపేవారిని లంచం తీసుకుని వదిలేసే పోలీసుకి… ఏదో రోజు ప్రమాదం జరిగితే ఆ పాపంలో భాగం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నియమాలని పాటించేలా చూడాల్సినవారు ఆ పని ఖచ్చితంగా చేయాలి. ఉల్లంఘనలకు శిక్షలుంటాయనే సందేశం అందరికీ చేరాలి. కొన్ని నియమాలు అనవసరమని అనిపించవచ్చు. అలంటప్పుడు కోర్టులని ఆశ్రయించాలి.
పైలట్ల యూనియన్ విప్‌కి అండగా నిలుస్తుంది. యూనియన్ లీడర్ ఒక సందర్భంలో విప్‌ని చీవాట్లు వేస్తాడు. “ఇంత జరిగినా ఇంకా తాగుతున్నావు” అంటాడు. విప్ ఇంటి బయట మీడియా వారు కాపు కాయటంతో తన ఇంట్లో ఉండేందుకు అనుమతిస్తాడు. అయితే తాగకూడదని షరతు పెడతాడు. యూనియన్ వాళ్ళు నిజాన్ని దాచటం కూడా ఒక రకంగా తప్పే. అయితే యూనియన్ వాళ్ళు ఎంతో సంఘటితంగా ఉంటారు. విప్ ని AA మీటింగులకి వెళ్ళమని యూనియన్ లీడర్ చెప్పకపోవటం కొంచెం అసమంజసంగా ఉంటుంది. సంక్షోభం ముగిశాక అయినా వెళ్ళాలని చెప్పకపోవటం మరీ వింతగా ఉంటుంది.
విప్‌గా నటించిన డెంజెల్ వాషింగ్టన్‌కి ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. చివర్లో వచ్చే సన్నివేశాలలో అతని నటన చిరస్మరణీయంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే వ్రాసిన జాన్ గాటిన్స్‌కి ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో నామినేషన్ వచ్చింది. పాత్రల ఔచిత్యం దెబ్బ తినకుండా స్క్రీన్ ప్లే ఉంటుంది. కో-పైలట్ “నీ దగ్గర జిన్నో మరేదో వాసన వచ్చింది” అంటాడు. దైవభక్తి ఉన్నవాడికి అది ఏ రకం మద్యం వాసనో తెలియదని చెప్పకనే చెప్పాడు స్క్రీన్ ప్లే రచయిత. రెండు నామినేషన్లు వచ్చినా అవార్డులు దక్కలేదు. విజువల్ ఎఫెక్ట్స్‌కి నామినేషన్ రాకపోవటం అన్యాయం అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ అంటే గ్రాఫిక్స్ ఉపయోగించి చూపించే దృశ్యాలు. విమానం తిరగబడినప్పటి దృశ్యాలు, కూలినప్పటి దృశ్యాలలో గ్రాఫిక్స్ ఉపయోగించారు. ఇవి సంభ్రమం గొలిపేలా ఉంటాయి. విమానం తిరగబడినప్పుడు విమానం లోపలి దృశ్యాలు కూడా ఊపిరి బిగబట్టి చూసేలా ఉంటాయి. ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించాడు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం నామినేషన్లు రాకపోవటంతో ఈ చిత్రం మరుగున పడిపోయింది.
ఈ క్రింద సినిమా ముగింపు ప్రస్తావించబడింది. సినిమా చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. సినిమా చూసిన తర్వాత చదవవచ్చు.
విమానంలో విప్ మద్యం తాగి రెండు చిన్న సీసాలు చెత్తబుట్టలో వేస్తాడు. విచారణ చేసేవారు ఆ సీసాలను సేకరిస్తారు. సాధారణంగా ప్రయాణీకులకు కూడా మద్యం అందుబాటులో ఉంటుంది. అయితే కుదుపుల కారణంగా ఆ రోజు ప్రయాణీకులకు మద్యం అందజేయమని చెబుతారు. కాబట్టి ఆ సీసాలలో మద్యం ప్రయాణీకులకు ఇచ్చారని చెప్పటానికి లేదు. సిబ్బందిలో చనిపోయిన వారితో సహా అందరికీ రక్తపరీక్షలు చేస్తారు. చనిపోయిన కట్రీనా రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్టు గుర్తిస్తారు. అవి ముందురోజు రాత్రి విప్‌తో కలిసి సేవించిన మద్యం ఆనవాళ్ళు. ఆమెయే విమానంలో రెండు సీసాల మద్యం తాగిందనే అభిప్రాయం కలిగిస్తే విప్ ఏ నియమాలూ అతిక్రమించలేదని నిరూపించవచ్చని లాయరు పథకం. అయితే విప్ ఈ పరిణామంతో ఇంకా అసహనం పెంచుకుంటాడు. తన ఇంటి బయట మీడియా వాళ్ళు ఉండటంతో తన మాజీ భార్య ఇంటికి వెళతాడు. తాగి ఉన్న అతని ప్రవర్తన నచ్చక అతని కొడుకు వెళ్ళిపొమ్మంటాడు. అప్పటికే మీడియా వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. “మా కుటుంబానికి ఏకాంతం కావాలి” అని వీలైనంత హుందాగా చెబుతాడు విప్. అతను ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలిసినవాడని మనకి అర్థమవుతుంది. అతని ఉన్న పెద్ద దుర్గుణం తాగుడు వ్యసనం ఒక్కటే. అదొక్కటీ చాలదా జీవితాన్ని నాశనం చేయటానికి?
విచారణకు ముందు కొన్ని రోజులు యూనియన్ లీడర్ ఇంట్లో ఉంటాడు. మద్యపానం చేయకుండా ఉంటాడు. విచారణ ఒక హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేస్తారు. రవాణా భద్రత సంస్థ అంతర్గత విచారణ కాబట్టి కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. విచారణ జరిగే ముందు రాత్రి విప్ ఆ హోటల్లో ఒక గదిలో ఉండేలా ఏర్పాటు చేస్తారు. బయట ఒక గార్డు ఉంటాడు. గదిలో మద్యం లేకుండా ముందు జాగ్రత్త తీసుకుంటారు. అయితే హోటల్ పక్క గదికి ఒక తలుపు ఉంటుంది. తాళం తీసి ఉంటుంది. అది గమనించిన విప్ పక్క గదికి వెళ్ళి మద్యం తాగుతాడు. మర్నాడు మళ్ళీ కథ మామూలే. చురుగ్గా ఉండటానికి తన స్నేహితుడు తెచ్చిన కోకైన్ పీల్చి విచారణకు వెళతాడు. యూనియన్ లీడరు, లాయరు చేష్టలుడిగి చూస్తుంటారు.
విచారణలో చాలామంది ఉంటారు. మీడియా వాళ్ళు కూడా ఉంటారు. విచారణ చేసే అధికారిణి ఎలెన్ మొదట విప్‌ని పొగుడుతుంది. అతనిలా ఎవరూ ఆ విమానాన్ని ల్యాండ్ చేయగలిగేవారు కాదని రుజువైందని అంటుంది. విమానంలో ఉన్న లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని అంటుంది. విప్ రక్తపరీక్ష నివేదికని అశాస్త్రీయమైనదని నిర్ధారించటంతో ఆమె ఆ నివేదికని ప్రస్తావించే అవకాశం లేదు. అయితే ఆమె తెలివిగా కట్రీనా రక్తపరీక్ష నివేదికని ప్రస్తావిస్తుంది. చెత్తబుట్టలో దొరికిన సీసాల గురించి ప్రస్తావిస్తుంది. “కట్రీనాయే ఆ రెండు సీసాల మద్యం తాగిందని మీ అభిప్రాయమా?” అని విప్‌ని అడుగుతుంది. విప్ ఈ ప్రశ్నతో ఖంగు తింటాడు. అతని మనసు అల్లకల్లోలమైపోతుంది. ఇక్కడ డెంజెల్ నటన అత్యద్భుతంగా ఉంటుంది. చివరికి “కాదు. ఆ మద్యం నేనే తాగాను” అంటాడు. “ఇప్పుడు కూడా తాగి ఉన్నాను” అంటాడు. తనని, తన ఉద్యోగాన్ని కాపాడుకోవటం కోసం చనిపోయిన కట్రీనా గురించి అబద్ధం చెప్పలేక అతను నిజం బయటపెడతాడు. చనిపోయిన వారి పేరుకి కళంకం రాకూడదనే అతని ఆలోచన ఎంతో అభినందనీయం. దీన్ని బట్టి అతని ఉన్నత వ్యక్తిత్వం తెలుస్తుంది. ఉన్నదల్లా ఒక్క దుర్గుణం. దాని వల్ల అతనికి శిక్ష పడుతుంది. “నేను చెప్పే అబద్ధాల పరిమితి అయిపోయినట్టనిపించింది. ఇంకొక్క అబద్ధం చెబితే బయటపడేవాడిని. కానీ ఇక అబద్ధం చెప్పాలనిపించలేదు. ఇప్పుడు జైల్లో ఉన్నా స్వేచ్ఛగా ఉన్నట్టుంది” అంటాడు చివర్లో. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండటం కాదు, మనసు మీద విజయం సాధించటమే అంటారు గరికిపాటి నరసింహారావు. మనసు మీద విజయం సాధిస్తే జైల్లో ఉన్నా స్వేచ్ఛే.
విప్ నిజం ఒప్పుకున్నాక అతని మాజీ భార్య, కొడుకు కూడా అతన్ని క్షమిస్తారు. నికోల్ జైల్లో ఉన్న అతన్ని చూడటానికి వస్తుంది. అతను అబద్ధం చెప్పి ఉంటే అందరూ దూరమైపోయేవారు. చేసిన తప్పులకి శిక్ష అనుభవించటమే సరైన నిర్ణయం. లేకుంటే విధి మరోలా శిక్ష విధిస్తుంది. ఆధ్యాత్మికత అంటే దైవభక్తి మాత్రమే కాదు. సత్యాన్ని, ధర్మాన్ని పాటించటం కూడా. ఆధ్యాత్మికత అలవాటు చేసుకుంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
చురుగ్గా ఉండటానికి కోకైన్ తీసుకున్నాడని చిత్రంలో చూపించారు. అది నిజమే అయినా ఎవరూ ఆ కారణంగా డ్రగ్స్ తీసుకోకూడదు. నిజానికి డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేసేవారు ఇలాంటి కారణాలు చెప్పి ఆశపెడతారు. లొంగిపోతే జీవితం నరకమైపోతుంది. డ్రగ్స్ వ్యసనం బారిన పడి డ్రగ్స్ అందక గిలాగిలా కొట్టుకుని చనిపోయిన వారెందరో ఉన్నారు. పెద్దవాళ్ళు బాధపడతారని కాదు, తమ జీవితం పాడవుతుందని గుర్తుంచుకోవాలి. స్టెరాయిడ్స్ తీసుకుని క్రీడల్లో పాల్గొన్నవారు తర్వాత ఎంత అపఖ్యాతి మూటకట్టుకున్నారో మనకు తెలుసు. పెద్దలు కూడా పిల్లలని చదువుల్లో ఒత్తిడికి గురిచేయకూడదు. ఎవరి సామర్థ్యం వారిది. వారు ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం, ర్యాంకులు కాదు.