[dropcap]భా[/dropcap]రత స్వాతంత్రం సాధించి 75 ఏళ్ళు అయిన శుభ సందర్భంగా దేశం యావత్తు సంబరాలు జరుపుకుంటోంది. ఆనాటి పోరాటాల గురించి నాయకుల గురించి భారతీయుల దేశభక్తి గురించి ఈనాటి తరానికి అందించటానికి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంది. అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ శుభ సందర్భం పురస్కరించుకుని స్వాతంత్రోత్సవాలను ఒక మధుర జ్ఞాపకంగా ఉంచుకునేలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.
ఈ సందర్భంగా నాకు ఓ చిన్న అనుమానం వచ్చింది. స్వాతంత్ర పోరాట సమయంలో, అనంతరం కూడా సాహిత్యం వీటిని ఎంతో సుసంపన్నం చేసింది. కథ, కవిత్వం, వ్యాసం, నవల అనేక ప్రక్రియల్లో ముందడుగు వేసింది. అలాగే ‘నాకొద్దీ తెల్ల దొరతనం’ అంటూ తెలుగు వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా నిలిచింది తెలుగు సాహిత్యం. దేశభక్తి ప్రేరేపించే ఎన్నో కథలు తెలుగునాట ఎంతోమంది రచయితలు పాఠకులకు అందించారు. ఇక్కడే నాకు ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ గుర్తుకొచ్చారు. ఆయన అనేక సందర్భాలలో అనేక విషయాలమీద కథా సంకలనాలు తీసుకువచ్చారు. అందులో ఈ శుభ తరుణాన గుర్తుంచుకోవాల్సింది ‘దేశభక్తి కథల’ సంకలనం. అలాగే మహాత్మాగాంధీ కథల సంకలనాన్ని కూడా మురళీకృష్ణ సంపాదకత్వంలో రావటం ముదావహం. నిజానికి ఈ దేశభక్తి కథల సంకలనంలో దేశభక్తిని వివరించడమే కాకుండా యువతరానికి కొత్త కోణంలో పరిచయం చేశాయి. 2018 ఆగస్టు 15న ఈ పుస్తకం ద్వారా కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్ సహ సంపాదకత్వంలో దేశభక్తిని అనేక కోణాల్లో పరిచయం చేశారు.
ఇందులోని కథలను ఆరు భాగాలుగా విభజించి ప్రాచీన భారతం, మధ్య భారతం, స్వతంత్ర పోరాట భారతం, సైనిక భారతం, సాంఘిక భారతం చివరగా ఆధునిక భారతం అంటూ కథలను ఆయా కాలాలకు అనుగుణంగా విభజించడం జరిగింది. దేశభక్తిని నిర్వచించటానికి లేదా నిర్వహించుకోవడానికి అనేక పద్ధతులు అనేక మార్గాలను ఈ సంకలనం లోని అన్ని కథలు వివరిస్తాయి. బలివాడ కాంతారావు ఏకంగా ‘దేశభక్తి’ అనే పేరుతో ఓ కథ రాశారు. ఆయన దేశభక్తిని నిర్వచించడంలో చాలావరకు కృతకృత్యులయ్యారు అని చెప్పవచ్చు. “భక్తికి కోరికలు జత పరిస్తే అది భక్తి కాదు. నేనేదో కాంక్షించి దేశభక్తి చూపిస్తే అది అహం మీద నాకున్న భక్తి కానీ దేశభక్తి కాదు. నా పేరు చరిత్రలో కాదు నా ఆత్మలో రాసుకోనీ” అంటూ ఎంతో గొప్పగా దేశభక్తిని నిర్వచిస్తారు. భారతదేశం యొక్క ఔన్నత్యం, ఆంధ్రదేశమున చక్రవర్తుల ఏకపత్నీ వ్రతము తెలుసుకోవాలి అంటే విశ్వనాథ సత్యనారాయణ రచన ‘చామర గ్రాహిణి’ కథ చదవాలి. రోమ్ నగరం నుండి హెలీనా అనే యువతి ఆంధ్రదేశానికి చామర గృహిణిగా తీసుకురా బడుతుంది. కానీ ఆ యువతి ఆంధ్రదేశమున చక్రవర్తికి రాణి కావాలనే ఆశతో ఈ దేశంలో అడుగు పెడుతుంది. ఒకనాడు రాత్రి సమయంలో హెలీనా చక్రవర్తికి తన కోరిక తెలియచేసి ఆయన్ను తన వశం చేసుకోవటానికి ప్రయత్నించగా ఆ చక్రవర్తి ఆమెకు లొంగడు. అనంతరం హెలినాకు అనేక సంపదలు బహుమానంగా ఇచ్చి పుట్టింటికి తిరిగి పంపుతారు. ఈ సున్నితమైన కథాంశంతో ఆ కాలంలో గ్రాంథికభాషలో రాయగా భారతీయులు ముఖ్యంగా ఆనాటి ఆంధ్రదేశంలోని చక్రవర్తుల ఔన్నత్యం, కీర్తిప్రతిష్ఠలు ఈ కథలో చాలా గొప్పగా సున్నితంగా తెలియజేయడం జరుగుతుంది. తన దేశం పట్ల భక్తి అంటే మహారాజు కూడా తన గుణగణాలను కించపరుచుకోడు అని చెపుతుంది ఈ కధ. ఈ సంకలనంలో ఆఖరి కథ ‘జెండా’. ఒక జాతీయ జెండాని చూస్తే ఆ జాతి మనసులో దేశ భక్తి భావన కలగటం అత్యంత సహజం. అలాంటి జెండా స్వేచ్ఛగా రెపరెపలాడాలి అంటే దాని వెనుక ఉన్న త్యాగాలను ప్రదర్శించటమే ఎం. వెంకటేశ్వరరావు కథ జెండా కళ్లకు కట్టినట్లుగా చెప్తుంది. ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ‘చీకటి నుండి వెలుగు వైపు’ అనే కథలో దేశభక్తిని వెరైటీగా వివరిస్తారు. కన్నకొడుకు వైద్యానికి పది మందిని పైకి తీసుకొచ్చిన ఓ పెద్దాయన ఇతరుల ముందు చేయి సాచాల్సిన అవసరం వచ్చింది. తను పెంచి పెద్ద చేసిన పేర్రాజు సహాయం చేయడానికి నిరాకరిస్తే మళ్లీ అతనికే ఓ వంద రూపాయలు ఇచ్చి నా చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది అని చెప్తాడు. తన ఇంట్లో పనిచేసే గోపన్న కొడుకు నారాయణ నక్సలైట్లలో కలిసి పోతాడు. ఆ నారాయణ చివరికి వీళ్ళ కోసం పోలీసులకి లొంగిపోయి తన మీద ఉన్న క్యాష్ అవార్డు అయ్యగారికి ఇప్పిస్తాడు. ‘నేను ‘నుండి ‘అందరం’ అనే బాటలోకి వెళ్లడమే దేశభక్తి అని ఇక్కడ రచయిత్రి పరోక్షంగా చెప్తారు. అలాగే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘నవ్వే కన్నీళ్లు’ అనే కథ చివరకి చాలా టచింగ్‌గా ముగుస్తుంది. ఒక ప్రాంతంలో ఉండే వ్యక్తులు ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులు గురించి ఆ ప్రాంతాల గురించి తెలుసుకోవడం కూడా దేశభక్తి అని ఈ కథ ద్వారా తెలియజేస్తారు.
ఇన్ని కథలు చదివిన తర్వాత మళ్లీ అదే ప్రశ్న మళ్లీ మళ్లీ ఉత్పన్నమవుతుంది. అదే దేశభక్తి అంటే ఏమిటి? నిజానికి దేశభక్తి మనిషికి అనేక విధాలుగా కలుగుతుంది. మన దేశ పటాన్ని చూస్తే దేశ భక్తి కలుగుతుంది. జాతీయ జెండాను చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుంది. మనందరినీ రక్షించే సైనికుని చూసినా దేశభక్తి కలుగుతుంది. దేశం పట్ల ఒక గౌరవప్రదమైన ఆరాధనాభావం ఉంటుంది. నిజానికి వీళ్ళందర్నీ చూస్తే గౌరవంగా సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఇదే కాదు మనుషులు మానవత్వం పెంచుకోవటం, స్వార్థాన్ని తెంచుకోవడం, ఈ విశాలమైన దేశంలో ఒక ప్రాంత ప్రజలు ఇంకో ప్రాంతం గురించి వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకోవటం ఆ ప్రాంత ప్రజలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకోవడం మొదలైనవన్నీ దేశభక్తి అనే పదానికి పర్యాయ పదాలే అని ఈ సంకలనం తెలియజేస్తుంది. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఈ పుస్తకం నిండా ఉన్నాయి.
అందుకే ఈ పుస్తకం భావితరాలకు కూడా పనికి వస్తుంది. ఈనాటి యువత చదివితే దేశభక్తి మీద ఒక కనీస అవగాహన కలిగించే కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంకలనం తెచ్చినందుకు ఈ శుభ సందర్భం లో కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్ గారిని మనం తప్పక అభినందించ వలసిందే.
***
దేశభక్తి కథలు
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 264
వెల: 150/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు