పెరటిచెట్టు

    4
    9

    [box type=’note’ fontsize=’16’] తన బిడ్ద అనుభవించబోయే శిక్ష అతడిలో పరివర్తన తీసుకొచ్చి, పరిపూర్ణమైన మానవుడిగా ఎదిగేందుకు తోడ్పడితే చాలుననీ… అందుకు కొడుకు తనని ద్వేషించినా ఆనందంగా భరిస్తాననే ఓ తండ్రి దృఢసంకల్పాన్ని వెల్లడిస్తుంది కె.కె. భాగ్యశ్రీ కథ “పెరటి చెట్టు“. [/box]

    “మనిషి పరిపూర్ణమైన మానవుడిగా ఎదగాలంటే కొన్ని మంచి గుణాలని అలవరచుకోవాలి. అవి… సహనం, శాంతి, దయ, క్షమ, శీలము…” అంటూ ఒక్కో గుణం గురించి సవివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు మహేశ్వరం మాస్టారు. క్లాసులోని పిల్లలందరూ శ్రధ్ధగా చెవులప్పగించి వింటున్నారు. అది మాస్టారి కంఠస్వరంలోని మహాత్మ్యమో… లేకపోతే గురువుగారు బోధిస్తున్న హితోక్తులను ఆసక్తిగా ఆలకించాలన్న తపనో తెలియదు కాని, క్లాసురూమ్‌లో పిల్లలంతా నిశ్శబ్దంగా ఉన్నారు.

    “శీలం అనగా సత్ప్రవర్తన. అంటే మన సాటివాళ్ళని ఏరకంగానూ వేధించకుండా వారితో ఆదరంగా మెలగడం. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలని అదుపులో ఉంచుకుని సద్బుధ్ధితో మెలగడం. సఛ్ఛీలత ఉన్న వ్యక్తి సమాజానికి ఆదర్శప్రాయుడౌతాడు. అందరికీ పూజనీయుడౌతాడు.’’ ప్రవాహవేగంతో సాగిపోతోంది మాస్టారి వాగ్ధాటి.

    మహేశ్వరం మాస్టారికి అరవైఐదు ఏళ్ళుంటాయి. మనిషి సన్నగా, రివటలా ఉంటారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. విలువలకి ప్రాణమిచ్చే మనిషి. ఎందరో విద్యార్ధులను గొప్పవారిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది.

    ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు విజ్ఞానాన్ని సంపాదించుకోవడమే కాక, సమాజహితం కోసం పాటుపడే వ్యక్తులుగా ఎదిగారనడంలో అతిశయోక్తి లేదు. ఆయన గురించి తెలుసుకున్న శ్రీవాణీ విద్యానికేతన్ వారు ఆయన్ను తమ స్కూల్‌లో పనిచేయమని కోరారు.

    రిటైర్మెంట్ తరువాత హాయిగా సత్కాలక్షేపం చేద్దామనుకున్న ఆయన వారి ప్రతిపాదనను నిరాకరించారు.

    “అలా అనకండి సార్… మీ దగ్గర చదువుకున్న విద్యార్ధులందరూ ఉన్నత స్థానాల్లో స్థిరపడి ఈ దేశానికి తమవంతు సేవ చేస్తున్నారు. కేవలం చదువొక్కటే కాదు… మనిషికి సంస్కారం, మంచి నడవడిక కూడా అవసరమే. మేము కేవలం డబ్బు సంపాదనే  ధ్యేయంగా ఈ సంస్థ నడపడంలేదు. మా బడిలో చదువుకున్నవాళ్ళు పదిమందికీ పనికివచ్చే విధంగా, సమాజహితమే లక్ష్యంగా ఎదగాలని మా కోరిక. చదువొచ్చిన ప్రతివాడూ సంస్కారవంతుడు అయి తీరతాడని లేదు.

    కాని,  మీలాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న గురువుల దగ్గర మా విద్యార్ధులు చదువుకుంటే మా విద్యార్ధులకి చదువు-సంస్కారం రెండూ అలవడతాయని మా నమ్మకం. ప్లీజ్ కాదనకండి సార్…’’ అంటు ప్రాధేయపడ్డాడు స్కూల్ ప్రిన్సిపాల్.

    శ్రీవాణీ విద్యానికేతన్ అవడానికి ఇంగ్లీష్ మీడియమ్ స్కూలే అయినా తెలుగుభాషకి పెద్దపీట వేసి,  భాషకి పట్టంకట్టి భాషని పదికాలాలపాటు బతికించాలన్న సదుద్దేశంతో నడుపుతున్న పాఠశాల. బళ్లో పిల్లలందరూ చక్కగా తెలుగులోనే మాట్లాడుకునే వీలు కల్పించింది స్కూలు యాజమాన్యం.

    విద్యార్ధులు అభివృధ్ధి పథంలో దూసుకెళ్లేందుకు ఆంగ్లభాష ఎంత అవసరమో… చక్కని భావవ్యక్తీకరణ చేయడంకోసం మాతృభాష కూడా అంతే అవసరం అన్న సత్యాన్ని గుర్తించి ఆ దిశగా కృషిచేస్తోంది.

    ఆ పాఠశాలకున్న ఉన్నత ఆదర్శాలు, ఉత్తమ లక్ష్యాలు ఆకట్టుకున్నాయి మాస్టారిని. అలవాటైన బోధనారంగంలో కొనసాగడానికి వేరే ఇతర అభ్యంతరాలేమీ లేవు కనుక మరి కాదనకుండా ఆ స్కూల్లో చేరిపోయారు మహేశ్వరం మాస్టారు.

    ఆయన కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికిన మనిషికాదు. మనసుకి నచ్చిన పని చేయడంలో ఆత్మానందం లభిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తారు. కాబట్టే శ్రీవాణీవిద్యా నికేతన్‌లో విద్యాబోధన చేయడం ఆయనకు అంతులేని సంతృప్తిని కలుగజేస్తోంది.

    ఆయన కంఠస్వరంలోని మాధుర్యం, ఏవిషయాన్నైనా మనసుకి హత్తుకునేలా చెప్పగలిగే నైపుణ్యం అవన్నీ విద్యార్ధులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుడూ అందించలేని విధంగా వ్యక్తిత్వవికాస పాఠాలు నేర్పడంలో ఆయనది అందెవేసిన చేయి. క్లాసు పుస్తకాలలోని పాఠాలతో పాటు, బతుకు పుస్తకంలోని అనుభవాలనే పాఠాలను కూడా పిల్లలకి అర్ధమయ్యే రీతిలో చెప్పడం ఆయన ప్రత్యేకత.

    అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్న కాంక్షతో శ్రీవాణీవిద్యానికేతన్ లో తమ పిల్లలను చేర్చాలని  ఆరాటపడుతున్నారు.

    మహేశ్వరం మాస్టారిలాంటి మహనీయుడి చేతిలో మలచబడ్డ తమ బిడ్డలు నిస్సందేహంగా గొప్పవాళ్లు అయి తీరతారని వాళ్ళకి తెలుసు.

    ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయని విధంగా విద్యార్ధులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మాస్టారి ఆశయం నిరాటంకంగా ముందుకు సాగుతోంది.

    ***

    “మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారండీ…’’ శ్రధ్ధగా పాఠం చెప్తున్న మహేశ్వరం మాస్టారిని ఉద్దేశించి చెప్పాడు ప్యూన్.

    “వస్తున్నాపద!” అని అతడితో చెప్పి, చెప్తున్న పాఠాన్ని పూర్తిచేశాక అక్కడినుంచి కదిలారు మాస్టారు.

    “నమస్తే సార్… రమ్మన్నారట!’’ అంటు ప్రిన్సిపాల్ గారి రూమ్‌లో అడుగుపెట్టిన ఆయన అక్కడ ప్రిన్సిపాల్ గారి ముందు ఎవరో కూర్చుండడం గమనించి క్షణకాలం ఆగారు.

    “రండి మాస్టారూ… ఈయన రంజిత్ గారు. స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నారు.వీళ్ళ అబ్బాయి మన స్కూల్లో టెంత్ క్లాస్ చదువుతున్నాడు. ఈయన మీతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు’’ అంటూ తన ముందున్న వ్యక్తిని పరిచయం చేశారు ప్రిన్సిపాల్ గారు.

    “నమస్కారం మాస్టారూ’’ అంటూ వినయంగా నమస్కరించి తనతో పాటు తెచ్చిన పళ్ళు ఆయన చేతిలో పెట్టి ఆయనకు పాదాభివందనం చేశాడు రంజిత్.

    “అయ్యో! ఇదేమిటండీ…’’ మొహమాటంగా కాళ్లు వెనక్కి లాక్కున్నారు మహేశ్వరం మాస్టారు.

    “లేదు మాస్టారూ… మీరు మాకు చేసిన మహోపకారానికి ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేము. ఏదో… చంద్రునికో నూలుపోగనుకోండి’’ భక్తిగా అయన పాదాలను కళ్లకద్దుకున్నాడు రంజిత్.

    మాస్టారికి ఏమనాలో తోచలేదు. “ఇంతకీ మీరు…?’’

    “మా అబ్బాయి చైతన్య ఈ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. చాలా అల్లరివాడు, మొండివాడు. చిన్నంతరం, పెద్దంతరం లేకుండా ఎవరిని పడితే వారిని నోటికి ఎంతమాట వస్తే అంతమాట అనడం, ఎదురు సమాధానాలు చెప్పడం, అంతుపంతు లేని విధంగా అల్లరి చేయడం… వీటితో నేను, నా శ్రీమతి బాగా విసిగిపోయాం. వాడిని ఎలా తోవలోకి తీసుకురావాలో తెలియక అల్లాడిపోయేవాళ్లం.

    నా భార్య అయితే మరీనూ! దిగులుతో పేషెంట్‌లా తయారైంది. అలాంటి మా చైతన్యలో గత నెలరోజులుగా చాలా మార్పు కనిపిస్తోంది. మనిషిలో దుడుకుతనం తగ్గుముఖం పట్టి, కాస్త నెమ్మది చోటు చేసుకుంది. అయినదానికీ కానిదానికీ పేచీలు పెట్టి, మాతో వాదించి వేధించే వాడి వైఖరిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. కన్నవాళ్ళమైన మాకే చిరాకు తెప్పించే ప్రవర్తన ఉన్నట్లుండి ప్రశాంతతను సంతరించుకుంది.

    వాడిలో ఈ మార్పును గమనించి ఆశ్చర్యపోయిన మేము వాడి తోటి విద్యార్ధులని విచారిస్తే ఈమార్పు మీ వల్లనే కలిగిందని చెప్పుకొచ్చారు. ఒక మంచిమనిషికి ఉండవలసిన లక్షణాలను, ఉత్తమమైన వ్యక్తిగా ఎదగడానికి అతడు అలవరుచుకోవలసిన సద్గుణాలను ప్రతిరోజూ మీరు బోధిస్తూ ఉంటారని వాళ్ళు చెప్పారు.

    మా చైతన్య మంచి దార్లో పడడానికి కారణం మీరు చెప్పే ఆ మంచి మాటలేనని మాకు అర్థమైంది. కొడుకు అలా బుధ్ధిమంతుడైపోవడంతో మా ఆవిడ తెగ ఆనందపడిపోతోంది. మాకింత మహోపకారం చేసిన మిమ్మల్ని ఓసారి కలిసి కృతజ్ఞతలు తెలిపిపోదామని వచ్చాను…’’ ఉద్వేగంగా చెప్పిన రంజిత్ కళ్లలో నీళ్ళు నిండాయి.

    “నాదేముందండీ… నాకు తోచిన నాలుగు మంచిమాటలను విద్యార్ధులకి చెప్పాలని తాపత్రయపడతాను. వాటిని గ్రహించి, తమ జీవితాలకి అన్వయించుకోవడం వారి విజ్ఞత. నా పలుకులు మీ అబ్బాయిలో మార్పు తెచ్చాయని భావించడం మీ సంస్కారానికి నిదర్శనం.’’ ఇబ్బందిగా కదిలారు మాస్టారు.

    “గొప్పవాళ్ళెప్పుడూ తమ గొప్పతనాన్ని చెప్పుకునేందుకు ఇష్టపడరు. మీరూ అంతే మాస్టారూ… మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మా చైతన్య మారడం మీ చలవే మాస్టారూ.’’ రంజిత్ వినమ్రంగా అన్నాడు.

    మహేశ్వరం మాస్టారి హృదయం సంతృప్తితో నిండిపోయింది. తాను కంచె వేసి కాపాడిన తోట కాపు కాస్తోందంటే తోటమాలి ఎంత సంతోషిస్తాడో ఆయనకి అనుభవంలోకి వచ్చింది. మరోసారి ఆయనకి ధన్యవాదాలు అర్పించి వెళ్ళిపోయాడు రంజిత్.

    మాస్టారి బోధనలు తమ పాఠశాలకి మంచిపేరు తెచ్చిపెడుతున్నందుకు పొంగిపోయి ఆయన్ను మనస్ఫూర్తిగా అభినంధించాడు ప్రిన్సిపాల్.

    ***

    “ఏమిటండీ… ఇది… ఇంట్లో మామయ్యగారున్నారు… రోజూ మీరిలా అల్లరి చేస్తూ ఉంటే ఆయన ఏమనుకుంటారు? ఒక్కరోజు తిన్నగా ఇంటికి రారు కదా!’’ కోడలి ఏడుపు గొంతు చెవినపడగానే బాత్ రూమ్‌కి వెళ్తున్న మహేశ్వరంగారు ఠక్కున ఆగిపోయారు.

    కొడుకు ఏదో ముద్దముద్దగా అంటున్నాడు. కోడలు జీరవోయిన స్వరంతో ఏదో అంటోంది. ఆమె సమస్య స్పష్టంగా అర్ధం కాకపోయినా ఏదో ఉందని మాత్రం తెలిసింది ఆయనకి.

    వేసవి సెలవులు ఇవ్వడంతో కోడలు పరిమళ ఫోన్ చేసి పిల్లలు గోలపెడుతున్నారని, కొన్నాళ్ళు ఉండిపొమ్మని అభ్యర్ధించడంతో విజయవాడలో ఉన్న సాగర్ దగ్గరకు రాక తప్పలేదు.

    సాగర్, సమీర  ఆయన సంతానం. చదువు పూర్తి కాగానే సమీరకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. సహృదయుడైన భర్త, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలతో ఆమె జీవితం ఆనందంగా సాగిపోతోంది.

    సాగర్‌కి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో ఉద్యోగం వచ్చిందని తెలిశాక ఆయన ఎంతో పొంగిపోయారు. తనలాగే మరికొందరు విద్యార్ధులను ఉత్తమపౌరులిగా తీర్చిదిద్దే గొప్ప అవకాశం అతడికి దొరికినందుకు గర్వపడ్డారు.

    అలా ట్రాన్స్‌ఫర్ల మీద తిరుగుతూ చివరికి విజయవాడలో స్థిరపడ్డాడు సాగర్. అతడికి ఇద్దరు పిల్లలు. పరిమళ అనుకూలవతియైన ఇల్లాలు. మహేశ్వరంగారి అర్ధాంగి మరణించాక ఆయన ఒంటరివాడయ్యారు. కొడుకు, కోడలు తమ దగ్గరకి వచ్చేయమని ఎంతగా బతిమలాడినా ఆయన ఒప్పుకోలేదు.

    ఒంట్లో ఓపిక ఉన్నన్నినాళ్ళూ తానీ ఉపాధ్యాయ వృత్తి విడిచిపెట్టలేనని, అప్పుడప్పుడు వచ్చిపోతానని సున్నితంగా చెప్పేసారు. ఆయన సంగతి తెలిసిన వారు మరి ఆయన్ను ఒత్తిడి చేయలేదు. అప్పుడప్పుడు సెలవులిచ్చినప్పుడు… ఇలా వాళ్ళదగ్గరకు వచ్చిపోతూ ఉంటారు ఆయన.

    ఎప్పుడూ లేని విధంగా ఈసారి కోడలు ఎందుకో బాధపడుతోందని రాగానే గ్రహించారు. గతంలో ఆమెని ఇలా చూడలేదు. ఇప్పుడు మాత్రమే ఆమెఇలా బాధపడుతోందో… లేక గతంలో ఏ బాధా లేనట్లుగా మానేజ్ చేసిందో ఆయనకి బోధపడలేదు.

    పరిమళ లాంటి మంచి అమ్మాయి… అలా కన్నీరు పెట్టుకుని తల్లడిల్లడం ఆయన చూడలేకపోయారు. కొడుకు చెడు అలవాట్లకి లోనయ్యాడని ఆయన అర్ధం చేసుకున్నారు.

    కేవలం తాగుడొక్కటే అతడికి అలవాటైందా? లేక… నైతికంగా కూడా పతనమయ్యాడా!?

    ఈ ప్రశ్న ఆయన్ను వచ్చిన దగ్గరనుంచీ వేధిస్తోంది. మూడురోజుల క్రితం పనిమనిషి నూకాలమ్మ కోడలితో ఏదో చెప్పి కంటతడి పెట్టుకోవడం ఆయన కళ్లారా చూశారు. అది కేవలం పనిమనిషి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, అందులో తన కొడుకు ప్రమేయం ఏదో ఉందని ఆ క్షణమే అర్థమైంది.

    కాని, తానుగా ముందుకి వెళ్ళి సంగతేమిటని కోడల్ని అడిగితే ఆమె సిగ్గుపడి చెప్పలేకపోవచ్చును అనుకుని ఆగిపోయారు.

    కాని, ఇప్పుడు ఆమె ఆవేదన వింటూ ఉంటే కొడుకు చాలా చెడిపోయాడని బోధపడింది. కన్న కూతురిలా తనని చూసుకునే తమ ఇంటిదీపం అయిన పరిమళ వేదనకి మూలం ఏమిటో అన్వేషించి, వీలైతే ఆ సమస్యను పరిష్కరించి కాని తానిక్కడినుంచి కదలకూడదు.

    అలా అనుకున్నాక మనసులో గుబులు తగ్గి మాగన్నుగా కునుకు పట్టిందాయనకి.

    ***

    ఉదయం ఆయన లేచి నిత్యకృత్యాలు ముగించుకుని హాల్లో పేపర్ చదువుతూ కూర్చున్నారు. సాగర్ ఎనిమిదింటికి లేచి ఆదరాబాదరా స్నానాదికాలు పూర్తి చేసుకుని బయటకి వెళ్ళిపోయాడు. కాసేపు తండ్రి దగ్గర కూర్చోవడం కాని, మనసువిప్పి కష్టం సుఖం మాట్లాడడం కాని చేయడంలేదు అతడు. కోడలి మాటను మన్నించి మనవలకోసం వచ్చాడే కాని, కొడుకు విపరీతవైఖరి చూస్తే అక్కడ ఉండాలనిపించలేదు. కోడలి అనుమతితో ఈరోజు బయలుదేరదామని అనుకున్నారు.

    కాని రాత్రి కోడలి మాటలు, ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభ చూశాక తన నిర్ణయం మానుకున్నాడు. పిల్లలు టిఫిన్ తినేసి  ఆటలకి పక్కింటికి వెళ్లాక నెమ్మదిగా కోడల్ని కదిపారు మహేశ్వరంగారు.

    “అబ్బే! ఏమీలేదు మామయ్యా… ఏదో మామూలే…’’ తడబడిందామె.

    ఆమె కళ్లలో దిగులు, మాటల్లో తత్తరపాటు ఆమె అబధ్ధం చెబుతోందని పట్టి ఇచ్చాయి.

    “చూడమ్మా పరిమళా… నీ తండ్రిలాంటి వాడిని. నువ్వు ఈ ఇంట అడుగుపెట్టిన తరువాత నీ మంచిచెడ్డలు చూడవలసిన బాధ్యత నామీద ఉంది. నాకు సమీర ఎంతో, నువ్వూ అంతే… నా దగ్గర దాచడానికి చూడద్దు. విషయం చెబితే నా వల్ల అయ్యే సహాయం చేస్తాను…’’ మృదువుగా కోడల్ని ఊరడించారు ఆయన.

    పరిమళ ముఖం పాలిపోయింది. పెదవులు వేదనతో వణికాయి. ఏంచెప్పాలో తెలియనట్లుగా సన్నగా ఏడవడం మొదలెట్టింది.

    “నా తల్లివి కదూ! ఏం జరిగిందో చెప్పమ్మా? నీ సందేహం నాకర్ధమైంది. నాకొడుకు గురించి నాకే కంప్లైంట్ చేస్తే నేనేమన్నా అనుకుంటానేమో అన్నదే కదా నీ భయం! నేను ముందు మనిషిని. ఆ తరువాతే నీకు మామగారిని అయినా… వాడికి తండ్రిని అయినా… మరేం సంకోచించక చెప్పు…’’ అనునయించారు మహేశ్వరం గారు.

    ఆయన సహృదయతకి మురిసిపోయింది పరిమళ. తన హృదయాన్ని దహించివేస్తున్న ఆ అగ్నికీలలను బయట పెట్టకతప్పదన్న నిశ్చయానికి వచ్చింది. సన్నగా వెక్కుతూనే భర్త గురించిన వాస్తవాలు ఏకరువు పెట్టింది.

    కోడలి నోటమ్మట చేదు నిజాలు వెలువడుతూ ఉంటే నిశ్చేష్టుడే అయ్యారు మహేశ్వరం గారు. కొడుకు ఇంతలా పతనమయ్యాడని, అనైతికత అనే బురదలో కూరుకుపోయాడని వింటూంటే ఆయన మనసు మండిపోతోంది.

    ఎందరో విద్యార్ధులను సఛ్ఛీలురిగా తీర్చిదిద్దిన ఆయన నైపుణ్యం కొడుకు విషయంలో విఫలమైందన్న సత్యం అవగతమవగానే ఆయన సిగ్గుతో తలదించుకున్నారు.

    అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడింది’ అన్నట్లు ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచిన తాను… కన్నబిడ్డని ఎలా వదిలేశాడు! హాయిగా చదువుకుని, మంచి ఉద్యోగం చేసుకుంటూ ముచ్చటైన భార్యాపిల్లలతో చక్కగా సంసారం చేసుకుంటున్నాడన్న తృప్తితో తానక్కడ నిశ్చింతగా ఉంటున్నాడు.

    ‘పెరటిచెట్టు వైద్యానికి పనికి రాదు’ అన్నట్లు.. తాను నిరంతరం వల్లించే నీతి సూత్రాలు, ధర్మపన్నాలు తనకొడుకుని మంచివ్యక్తిగా తయారుచేయడానికి ఉపయోగపడలేదు. ఒక గురువుగా తాను విజయం సాధించినా ఒక తండ్రిగా తాను ఫెయిలయ్యాడు.

    “ఆయన కేవలం తాగి తందనాలాడి, పేకాట లాంటి వ్యసనాలకి లోనై ఇల్లు గుల్ల చేస్తే నేను సర్దుకుపోదును మామయ్యా…కాని, ఆయన మానవత్వం మరచి, నీతి నియమాలకి తిలోదకాలిచ్చి గతి తప్పి ప్రవర్తిస్తే మాత్రం నేను తట్టుకోలేక పోతున్నా.

    శీలం అనేది ఆడదానికే కాదు మామయ్యా…మగవాడికి కూడా ముఖ్యం. తన దగ్గర చదువుకునే విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళని లైంగికంగా వేధించడం, తన కోరిక తీర్చమని ఒత్తిడి చేయడం, ఒకవేళ తీర్చకపోతే వాళ్ల కెరీర్ నాశనం చేస్తాను అని బెదిరించడం… తెలిసిన వాళ్ల అమ్మాయిలకి సహాయం చేస్తానని మాట ఇచ్చి వాళ్ళతో మిస్‌బిహేవ్ చేయడం… ఇవీ ఆయన చేస్తున్న అకృత్యాలు.

    పాపం! చదువే ఊపిరిగా బతికే ఆడపిల్లలు… ఏం చేస్తారు మామయ్యా! ఇంట్లో చెప్తే చదువు మానిపించేస్తారేమోనన్న దిగులుతో తమ బాధను లోలోపలే అదిమేస్తున్నారు కొందరు.  ఏ మీడియానో ఆశ్రయించి వారి సమస్యను పరిష్కరించుకుందామన్నా తమకి సపోర్టుగా ఎవరుంటారన్న సందేహంతో ఆగిపోతున్నారు. కొందరు మౌనంగా బాధపడుతూ ఆయనకి సహకరించి తమ పని కానిస్తూ ఉంటే, మరికొందరు అలా చేయలేక మానసికంగా నలిగిపోతూ, చిత్రవధ ననుభవిస్తున్నారు.

    మొన్న మానస అనే అమ్మాయి నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంది. కాలేజ్‌లో ఆయన ఆగడాలు శ్రుతి మించుతున్నాయని, తనలాంటి ఎందరో అమ్మాయిలు బయటకు చెప్పుకోలేక, అలాగని భరించలేక మౌనంగా కుమిలిపోతున్నారని దుమ్మెత్తి పోసింది. ఆయన కష్టసుఖాలలో నాకు భాగం ఉన్నట్లే… పాపపుణ్యాలలో కూడా వాటా ఉంటుందని గుర్తుచేసింది. ఆయన చేస్తున్న ఈ దుర్మార్గం వలన ఎందరో ఆడపిల్లలు ఉసూరుమంటున్నారని, వాళ్లందరి శాపాలు తగిలి నేను, నా పిల్లలు మట్టి కొట్టుకుపోవడం ఖాయమని శపించి వెళ్లింది.

    ఆయన్ను నిలదీస్తే… అది తన నైజమని, మార్చుకోలేనని తెగేసి చెప్పారు. ఏంచేయాలో తెలియక నరకం అనుభవిస్తున్నాను మామయ్యా…

    తనంటే పడిచచ్చే ఆడదానితో ఎలాగైనా పొమ్మనండి నేను కాదనను. కాని, ముక్కు పచ్చలారని ఆడపిల్లలతో ఈ వికృత చేష్టలేమిటి మామయ్యా! అన్నింటి కన్నా దారుణం ఏమిటంటే ఆమధ్య ఒంట్లో బాగా లేదని నూకాలమ్మ తన పదేళ్ళ మనవరాలిని పనిలోకి పంపింది. ఈయనగారు తన వెకిలి చేష్టలను, వికృత మనస్తత్వాన్ని ఆ పిల్లమీద కూడా ప్రయోగించారుట. దానితో ఆ పిల్ల హడలిపోయి మరి ఇక్కడికి రానని భీష్మించుకు కూర్చుందట. ఇంట్లోని వాళ్ళు బతిమాలి అడిగితే నిజం చెప్పిందట.

    మొన్న నూకాలమ్మ నాతో మాట్లాడింది అదే. ఆమె కాళ్లవేళ్ల పడి, క్షమించమని వేడుకుని ఆ గొడవ సద్దుమణిగేలా చేశాను. ఇదేం పైశాచికమని ఆయన్ను నిలదీస్తే వంకర నవ్వొకటి నవ్వారు కాని ఆయన పనులు మానుకోలేదు.

    అసలు ముక్కుపచ్చలారని పసిదానిలో ఆయనకు ఆడది ఎలా కనిపిస్తుందోనని ఒకటే బాధగా ఉంది మామయ్యా… పోనీ చూసీ చూడనట్లుగా వదిలేద్దాం అనుకుంటే ఈనాటి ఈయన విపరీత ప్రవర్తన ఎదుగుతున్న నా కొడుకుల మీద ఎక్కడ పడుతుందోనని ఒకటే ఆవేదన… ఆయన్ను ఎలా తోవలోకి తేవాలో, ఆయనకి సద్బుధ్ధి ఎలా కలిగించాలో తెలియక విపరీతమైన క్షోభని అనుభవిస్తున్నాను.’’

    కోడలి మనోవేదన నిండుకడవల్లే బద్దలైన క్షణాన కొయ్యబొమ్మలా బిగుసుకుపోయారు మహేశ్వరం గారు. కొడుకు ఇంత నీతిలేనివాడిలా, దుశ్శీలుడిలా ఎలా మారాడో ఆయనకి అంతుచిక్కలేదు. ఎక్కడుంది లోపం! తన పెంపకంలోనా! వాడి మనస్తత్వంలోనా!

    ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర బరువై కణతలు పగిలిపోతాయేమోన్నన్నంత నొప్పి కలుగుతోంది.

    తోటలోని మొక్కలను సంరక్షించే తోటమాలి ఆమొక్కలకి చీడపీడలు సోకితే ఏంచేస్తాడు! పురుగుమందులు కొడతాడు… మరో ఆలోచన లేకుండా చీడపట్టిన ఆ కొమ్మలని కత్తిరిస్తాడు. లేకపోతే ఆ తెగులు తోటంతా వ్యాపించి మిగతా మొక్కలు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది.

    మధుమేహవ్యాధితో పీడింపబడుతున్న రోగికి పుండు పడితే వైద్యుడు ఏం చేస్తాడు! ఆ పుండు వలన శరీరమంతా కుళ్లిపోకుండా ఆ భాగాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తాడు.

    అక్కడ ఆ తోటమాలికి చీడ సోకిన ఆ మొక్కపట్లా, ఇక్కడ వైద్యుడికి రోగగ్రస్తుడైన ఆ మనిషి పట్లా ద్వేషం ఏమీ ఉండదు. కేవలం మిగతా భాగాలు అయినా బాగుంటాయన్న ఆలోచన తప్ప!

    అనైతికత అనే జబ్బు సోకిన మనిషికి ఏ వైద్యం చేస్తే మామూలు మనిషౌతాడు! అతడి మనసుని కొరికిపోస్తున్న ఆ పైత్యపు ఆలోచనలని సమూలంగా తృంచివేస్తే అతడు మనిషి అనిపించుకుంటాడు!

    ఇప్పుడు క్రూరమృగంలా మారి అమ్మాయిల శీలాలతో చెడుగుడాడే తన బిడ్డకి ఏవైద్యం చేయాలి! అతని మెదడుని చెదపురుగులా కొరికిపోస్తున్న చెడు ఆలోచనా విధానాన్ని నాశనం చేయడానికి ఎవరు ముందుకొస్తారు! పెరటిచెట్టు వైద్యానికి పనికి రాదని మిన్నకుండే వీలులేదు. ఆ చెట్టులోని ఔషధగుణాలు కొడుకు మనసుకి పట్టిన తెగులుని సమూలంగా నాశనం చేయగలవని నిరూపించాలి.

    దారితప్పిన కన్నబిడ్డని సక్రమమార్గంలో నడిపించడానికి తనే కంకణం కట్టుకోవాలి. తన కోడలి కళ్లలో వెలుగు చూడాలన్నా, మనవలు భవిష్యత్తులో చక్కగా ఎదగాలన్నా తాను గుండె రాయి చేసుకుని కొడుకుని శిక్షించాలి. ఆ శిక్ష అతడిలో పరివర్తన తెసుకురావాలి.

    తన ఆలోచనని పరిమళతో పంచుకున్నక హృదయం తేలికపడింది మహేశ్వరం మాస్టారికి.

    “ఏమ్మా… పరిమళా… నీ భర్త మంచివాడిగా మారాలి అంటే నువ్వు నాతో సహకరించాలి. కాస్త కర్కశంగా వ్యవహరించాలి. పిల్లలను కూడా అందుకు మెంటల్‌గా ప్రిపేర్ చేయాలి. ఈ ఆపరేషన్‌లో నేను కాస్త కఠినంగా ఉండాల్సి రావచ్చును. నా కొడుకు మనిషిగా మారి నీ ముందుకు రావాలి అంటే… నేను చెప్పినట్లుగా వినాలి…’’ అంటూ తన ప్లాన్ కోడలికి చెప్పారు ఆయన.

    “ఆయనలో మంచి మార్పుకోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నా మామయ్యా…అందుకు ఏమి చేయడానికైనా నేను రెడీ… కాని, ఆయన మీ కన్నబిడ్డ…’’ అర్ధోక్తిలో ఆగిపోయింది పరిమళ.

    “అర్ధమైందమ్మా… కడుపుతీపితో కన్నబిడ్డల అకృత్యాలని సమర్ధించిన దృతరాష్ట్రుడు దుర్యోధనాదుల పతనానికి కారణమయ్యాడు. నేను కూడా అలా కళ్లుమూసుకుని నా కొడుకు వినాశాన్ని కోరుకోలేను.

    ఎందరో విద్యార్ధులకు నీతులు బోధించి, నయానో భయానో నచ్చచెప్పి వారిని సరియైన తోవలో పెట్టాను. కాని, ఇప్పుడు సాగర్ నీతులకి లొంగే స్థితి దాటిపోయాడు. వాడికి దండోపాయమే సరియైనది. అసలు సంస్కరణ అనేది ఇంటినుండే ప్రారంభం కావాలి.

    అప్పుడే ఇంకొకరికి నీతులు బోధించే అర్హత వస్తుంది. సాగర్‌లో మనమాశించిన మార్పు వచ్చేవరకు నేను నా వృత్తిని మానుకుంటాను. ఆ మార్పుకోసం నా శాయశక్తులా శ్రమిస్తాను…’’ ఎందుకో స్వరం రుధ్ధమైంది మాస్టారికి.

    ఆయన అంతరంగ వేదన అర్థం చేసుకున్నదానిలా మౌనంగా ఉండిపోయింది పరిమళ.

    ***

    “కీచక పర్వానికి తెరదించిన వీరవనిత మానస… కొన్నాళ్ళుగా తనను వేధిస్తున్న అధ్యాపకుడు సాగర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టి ఇచ్చి తన సత్తా చాటుకున్న ఆమెను కాలేజ్ యాజమాన్యం అంతా అభినందిస్తోంది. ఇన్నాళ్ళుగా తమ కళాశాలకి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన సాగర్‌ను విధులనుంచి బహిష్కరిస్తున్నామని యాజమాన్యం తెలియజేస్తోంది. విద్యార్ధినులను వేధిస్తూ, రాక్షసుడిలా ప్రవర్తిస్తున్న సాగర్‌ని ‘నిజం’ టివి సహకారంతో పట్టుకుని పోలీసులకి అప్పగించిన మానసని అభినందిస్తున్న డిఎస్పీ గణేష్…’’ టివిలో పదే పదే వస్తున్న ఆ వార్తను చూసి విషాదంగా నవ్వుకున్నారు మాస్టారు.

    పరిమళ, పిల్లల ఆవేదనకి అంతే లేదు. ఇలా పదేపదే టివిలలో స్క్రోలింగ్స్, వార్తలు, విజువల్స్ ప్రసారమైతే రేపు నలుగురిలో ఎలా తలెత్త్తుకోగలం అన్న బాధతో అతలాకుతలం అయిపోతున్నారు వాళ్ళు. పదేపదే సాగర్ ముఖాన్ని జూమ్ చేసి చూపిస్తూ ఉంటే ఎదలో కెలికినట్లుగా అవుతోంది.

    “బాధపడుతున్నావమ్మా పరిమళా!’’ లాలనగా ప్రశ్నించారు మహేశ్వరం మాస్టారు.

    “పడకుండా ఎలా ఉండగలను మామయ్యా… ఎంతైనా ఆయన నా భర్త.’’ వెక్కివెక్కి ఏడ్చింది పరిమళ.

    “మొదట నాకు కూడా అలాగే అనిపించిందమ్మా… కాని మనిషికి సిరిసంపదలతో పాటు శీలసంపద కూడా అవసరం. మన ముందుతరాలకి వారసత్వంగా అందించవలసింది వెలలేని ఆ సంపదనేనమ్మా. నా దురదృష్టం కొద్దీ ఒక తండ్రిగా నేను అందులో విఫలమయ్యాను. కనీసం, నా బిడ్డ అయినా తన పిల్లలకు ఆదర్శంగా నిలవాలన్న తపనతోనే ఏ తండ్ర్రి చేయని పని చేశాను. సాగర్ మారిన మనిషిగా, స్వఛ్ఛమైన మనసుతో ఇంటికి తిరిగొస్తాడన్న విశ్వాసమే నన్నీ పనికి పురిగొల్పిందమ్మా… నువ్వు ఇలా కుమిలిపోతే నేను నీకు అన్యాయం చేసానేమోనన్న బాధ నన్ను మరింత వెంటాడుతుంది.’’ అనునయంగా ఆమె తల నిమిరారు మహేశ్వరంగారు.

    “నా బాధ తాత్కాలికం మామయ్యా… ఒకవేళ… ఈ పని మనమే చేశామని తెలుసుకుని… ఆయన మనమీద ద్వేషం, కోపం పెంచుకుంటే…’’ కళ్లు తుడుచుకుంటూ అంది పరిమళ.

    “చిన్నతనంలో పిల్లవాడు తప్పు పనిచేశాడని కన్నతల్లి చెవి మెలేసి శిక్షిస్తుంది. తల్లి అలా చేసిందని బిడ్డ ఆమెపైన కోపగించుకుంటాడా! లేదే… కాసేపు అలుగుతాడు… అలకతీరిన తరువాత తల్లిమెడ చుట్టుకుని గారాలుపోతాడు. ఎదిగిన నాబిడ్డ ఎరిగో, ఎరగకో తప్పు పని చేస్తే నేను మందలించకుండానూ, శిక్షించకుండానూ ఎలా ఊరుకోగలను.

    ఎదిగీ ఎదగని వయసులో బిడ్దలు పెడదారి పట్టకుండా తల్లి శిక్షణ ఎంత అవసరమో… ఎదిగాక అదే బిడ్దలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళని శిక్షించడం కూడా అంతే అవసరం. ఆ శిక్ష వాళ్ళు పశ్చాత్తాపాగ్నిలో కాలి, మేలిమి బంగారమై ప్రకాశిస్తారు అన్న ఆశతో అమలుపరచేది.

    ఒకరకమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్న సాగర్‌కి ఈ శిక్ష సరైనదే అని నేను భావిస్తున్నాను. అవసరం అయితే మనం సైకియాట్రిస్ట్ సలహా కూడా తీసుకుందాం. వారి కౌన్సిలింగ్‌లో సాగర్ పులుకడిగిన ముత్యంలా మారుతాడన్ననమ్మకమే నన్నీపనికి ప్రేరేపించింది.

    ఇప్పుడు నా బిడ్ద అనుభవించబోయే శిక్ష అతడిలో పరివర్తన తీసుకొచ్చి, పరిపూర్ణమైన మానవుడిగా ఎదిగేందుకు తోడ్పడితే అంతే చాలు… అందుకోసమని వాడు నన్ను ద్వేషించినా ఆనందంగా భరిస్తాను.’’ మహేశ్వరం మాస్టారి నయనాలు నీటిచెలమలయ్యాయి.

    ఆయన వేదన అర్ధం చేసుకున్న పరిమళ బిక్కముఖాలేసుకుని తనకేసే చూస్తున్న కొడుకులని దగ్గరగా అదుముకుంది ధైర్యం చెబుతున్నట్లుగా.

    మానసతో కలిసి, ‘నిజం’ టివి వాళ్ళని కలిసి మాట్లాడిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చిన మహేశ్వరం మాస్టారు సాగర్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించే పథకం వేశారు. ఆ ప్లాన్ వర్కౌట్ అయి సాగర్ పట్టుబడ్డాడు. నిర్భయ చట్టం మీద అతడిమీద కేసు బుక్ చేసి లోపల తోశారు పోలీసులు. ఎలా లేదన్నా జైలుశిక్ష తప్పదు.

    ఆ శిక్షాసమయం అతడిలో పరివర్తన తీసుకొచ్చి, అతడిని శీలవంతుడిగా మారుస్తుందని మాస్టారి ఆశ. ఇనుము వంగాలంటే సమ్మెటపోట్లు తప్పవు. గతి తప్పిన సాగర్ మంచిమార్గంలోకి మళ్లాలంటే అతడికి ఆత్మ పరిశీలన అవసరం. అతడికి పడిన శిక్ష అందుకు దోహదపడుతుందన్న గట్టినమ్మకంతోనే గుండె రాయి చేసుకుని కొడుకుని జైలుకి పంపారు ఆయన.

    అతడు మనిషిగామారి బయటకు వచ్చేవరకు కోడలికి, పిల్లలకి అండగా ఉండాలని నిశ్చయించుకున్నారాయన. ఈలోపు కాముకుడైన తండ్రిని పిల్లలు అసహ్యించుకోకుండా వారి మనసులని ఎలా మలచాలో ప్రణాళిక వేసుకుంటూ కళ్ళుమూసుకున్నారు మాస్టారు రేపటిమీద ఆశతో.

    కె.కె. భాగ్యశ్రీ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here