నాహం కర్తాః హరిః కర్తాః… ఒక జ్ఞాపకం

1
3

[dropcap]నే[/dropcap]ను నాస్తికురాలిని కాను. సైన్సును నమ్ముతాను. పూజలు, గుళ్ళు, మొక్కులు, ఉపవాసాలు, నమ్మకాలు లాంటి అలవాట్లు లేవు. మా నాయనమ్మ గారి వరకు ఏమైనా పాటించారేమో. నాకు మాత్రం అమ్మగారి వైపు కూడా తెలియవు.

కారణం ఏదైనా హాయిగా ప్రశాంతంగా వున్నాను. ఏది అయినా కష్టం వస్తే ‘ఇది జీవితం, తప్పవు’ అని అనుకుంటాను.

మావారిది కూడా ఇదే ఆలోచన. మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ విషయంలో.

విచిత్రంగా, మా నాన్నగారికి పరిచయం ఉన్న శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాదులో వున్నప్పుడు వారు రాసిన పుస్తకాలకు సమీక్షలు రాసేను.

అవి చదివిన ప్రసాద్ గారు చాలా సంతోషపడి మెచ్చుకోవడం జరిగింది.

ఆ విషయం నాకు ఈ-మెయిల్ ద్వారా తెలియచేసారు.

నా గురించి తెలిసి “భక్తి, నమ్మకాలు లేని నువ్వు నా పుస్తకాలు ఎలా చదివావు?” అని అడిగారు.

“ఆ పుస్తకాలు రాసిన విధానం, శైలి నన్ను చదివేలా చేశాయి” అని చెప్పాను.

నేను ఎనిమిది సంవత్సరాలుగా అమెరికాలో వున్నందువలన వారిని, గోపిక గారిని ఎప్పుడు కలుసుకునే అవకాశం రాలేదు.

ప్రసాద్ గారు పరమపదించిన రెండు నెలలకు హైదరాబాదు వచ్చి గోపిక గారిని కలిసాను.

గోపిక గారిది నాదీ పుట్టిల్లు కాకినాడ. ఇల్లు కూడా దగ్గిరే! పరిచయం వుంది.

కానీ ప్రసాద్‌గారు అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు గారికి P.S. గా వున్నారు. అంతటి హోదాలో ఉన్న వారిని, గోపిక గారిని కలవాలంటే మొహమాటం అనిపించేది.

తర్వాత ఒకసారి గోపిక గారిని కలవడానికి వెళ్ళినపుడు తిరుమల తిరుపతి దేవాస్థానం ఉద్యోగులు కొందరు కూడా అక్కడ వున్నారు.

శ్రీనివాసుడి ప్రసాదం లడ్లు కొన్ని తెచ్చి గోపిక గారికి సమర్పిస్తే ఆమె అందులోనుండి నాకు రెండు లడ్లు ఇవ్వడం జరిగింది.

నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు అనే మాట మాటాడని నేను ప్రసాద్ గారు రాసిన తిరుమల గురించిన పుస్తకాలు చదివి సమీక్ష రాయడం వలన నాకు ఆ లడ్లు లభించాయా? ఏమో….!

ప్రసాద్ గారు నమ్మే సిద్ధాంతం – “అంతా ఆ పైవాడి దయ, మనకు ప్రాప్తం” నిజం అనుకోవాలా!

కొన్ని సంఘటనలు విచిత్రంగా మన ప్రమేయం అంటూ లేకుండానే జరుగుతాయి అనడానికి నిదర్శనం ఇది.

ఆగష్టు 21వ తేదీ శ్రీ ప్రసాద్ గారి వర్ధంతి!

వారిని గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here