[dropcap]అ[/dropcap]మ్మ ఒడిలో చేరి
పెదవుల కదలికతో జత కలుపుతూ..
ఊసులాడుతూ, ఆతృతగా పలుకుతూ..
ఉగ్గుపాలతో నేర్చిన అమృతాక్షర జిగిబిగి కదూ!
రూపం తెలియని వయసులోనే
నాలుకపై నాట్యం చేసిన పదసొంపులు
అయ్యవారు చేయిపట్టి
వ్రాయించిన ఓంకారంతో
సాకారమై పదాల అల్లికలో
పదనిసలు తొణికిసలాడుతూ…
మాటల స్వరం జత కట్టింది
నాలుక ఎన్ని భాషలు రుచిచూసినా
మనో కోయిల రాగాలు మాత్రం
అమ్మభాషలోనే.. నేటికీ!
మమ్మీడాడీ లాంటి చిలుక పలుకులు
పెదవులపై తడి మాత్రమే!
మోదమైనా, భేదమైనా
సరిగమలు పలికించేది
అచ్చ తెలుగు గీతమే కదా!
అందుకే జీవిత చిత్రాన్ని
సుందరంగా తీర్చి దిద్దిన నుడికారాన్ని
ఊపిరిగా నింపుకుని
అజరామరంగా బ్రతికిస్తా!