[dropcap]స్వ[/dropcap]ప్నించే రెప్పలమాటున
హృద్యపు దృశ్యం నీదేగా!
కనుగీటుతు, మదిమీటుతూ
సాంధ్యరాగాలాపనల స్వరఝరి
మైమరిపించిన కవితాలాపనల
శ్రావ్యత నులివెచ్చని పరిష్వంగాల
ఙ్ఞాపకమై, మది తొలిచేస్తే
అది నులివెచ్చని నీ కరస్పర్శేగా!
కనుదోయిల నుండి మమకారపు
పుష్పాలు రాలిస్తే అది
నీ స్పర్శలోని లాలిత్యమేగా
నిదురరాని నిశిరాతిరి జోగుతూ
నను తాకిన గుర్తుచెరిపేదా!?
నిద్దురలో నీ పిలుపే చెవిసోకితే
కన్నులలో కెంపులన్ని
యెఱ్ఱనివై పూసాయని
వత్తులేసి నీకోసం
కనుకాయగ ఎదురుచూపైన
నా భుజాన చెయ్యివేసి
సిగ్గులన్ని దొంగిలించిన ..
నీ పరిష్వంగాన తలవాల్చీ సేదతీరి
మై మురిసిన జాడలు వెదికాలా ?!
ప్రేమ ఊసులన్ని నీకు చెప్పి
నే సరాగాలు పోతుండగా
దొంతరలు దొంతరలుగా నవ్వులు
దోసిళ్ళలో పెట్టి అందిస్తూ…
కనుగీటిన నీతోనే
పెంచుకున్న ప్రేమపాశంలో
మునకలైన నను భారంగా తలచి
వదిలేసీ, కలచెరిపీ
ఎడబాసిన వైనం నువ్వు మరిచినా
నేమరువలేనుగా!
అందుకే నీ ఊహల సుమాలన్నీ
దోయిలించి నీ జ్ఞాపకాలకే అంకితమిస్తూ….
ఒంటరి నక్షత్రమై నేనిలా…..