జీవన రాగం

    4
    5

    [box type=’note’ fontsize=’16’] తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య కన్నా నిస్సహాయుడైన తన తండ్రి మీద మరింత ప్రేమ చూపినందుకు జీవన్ జీవితం ఓ కొత్త మలుపు తిరుగుతుంది. అతనిలో కొత్త ఉత్సాహం వెల్లువై విరుస్తుందని చెబుతుంది నండూరి సుందరీ నాగమణి కథ “జీవన రాగం“. [/box]

    “ఛీ ఛీ! ఉదయాన్నే ఏమిటీ న్యూసెన్సు? పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్టు ఆవిడ పోయి రెండు నెలలు అవుతోంది, ఈ పెద్దాయన ఏడుపులేంటి?” ట్రాలీని మంచం కిందికి నెట్టి, హ్యాండ్ బ్యాగ్‌ను మంచం మీదికి విసిరేసింది జాహ్నవి.

    “ప్రయాణం బాగా జరిగిందా జానూ? ముఖం కడుక్కుని రా, కాఫీ ఇస్తాను…” ఆమె అసహనాన్ని పట్టించుకోకుండా ఎప్పటిలాగే ఆప్యాయంగా అన్నాడు జీవన్.

    “నువ్వు మారవా? రెండు నెల్ల నుంచీ జాబ్‌కి సెలవు పెట్టి ఇక్కడే ఉన్నావు. ఆ జాకబ్ గాడు ఎన్ని నోటీసులు పంపినా ఖాతరు చేయడం లేదు నువ్వు. మీ నాన్న కోసం మన ఫ్యూచర్ బలిచేస్తున్నావు. ఏమిటి జీవన్ ఇది? ఈరోజు అన్నీ తేల్చుకోవాలనే వచ్చాను…”

    “ష్… శబ్దం తగ్గించు… నెమ్మది…” ఆమెను వారించాడు జీవన్…

    “ఎందుకు తగ్గించాలీ? నేనేం తప్పు చేసాననీ?” మళ్ళీ తారాస్థాయిలో అరిచింది.

    “తీరికగా మాట్లాడుకుందాం జానూ… ప్లీజ్… కొంచెం ఫ్రెష్ అయి రా… గీజర్ వేసాను… ” అటాచ్డ్ వాష్ రూమ్ వైపు వేలు చూపించాడు నిదానంగా…

    బుస కొడుతూ, కావలసిన బట్టలు తీసుకొని, లోపలికి వెళ్ళి తలుపు ధడేల్న వేసింది జాహ్నవి.

    నిస్సహాయంగా నిట్టూరుస్తూ, గదిలోంచి ఇవతలికి వచ్చి, హాల్లో సోఫాలో కూర్చుని విలపిస్తున్న తండ్రి పక్కనే కూర్చున్నాడు.

    “నాన్నా… ఎన్నాళ్ళు ఇలా? అమ్మకి సమయం అయిపోయింది, వెళ్ళిపోయింది… నువ్వింకా మామూలుగా అవకపోతే ఎలా? ప్లీజ్… కొంచెం ఆలోచించు నాన్నా… అనుక్షణం ఇలా అమ్మ ఫోటో ఒడిలో పెట్టుకుని, నువ్వు కుమిలిపోతూ ఉంటే, నేను తట్టుకోలేక పోతున్నాను… సర్వం తెలిసిన వాడివి… ఎన్నెన్నో గ్రంథాలను చదివిన వాడివి… నువ్వే ఆ మాయలోంచి బయటకు రాకపోతే ఎలా నాన్నా?” ఆయన భుజమ్మీద చేయివేసి అనునయంగా చెప్పాడు, జీవన్.

    “నీకర్థం కాదురా నానీ… అమ్మ నన్ను పసిపిల్లాడిలా చూసుకుంది… ఇప్పుడు తన దారి తాను చూసుకుంది… నేనూ అమ్మతోనే వెళ్ళిపోతానంటే మీరంతా ఆపేశారు… అమ్మ లేకుండా నేను ఉండలేనురా… జయా… ఎందుకిలా చేసావే….” మళ్ళీ ఏడుపు ప్రారంభించాడు నారాయణ.

    “అదిగో మళ్ళీ… నువ్విలా ఏడిస్తే అమ్మ సంతోషపడుతుందా నాన్నా… లే, అలా డైనింగ్ టేబుల్ దగ్గరకు రా కొంచెం టిఫిన్ తిందువు గాని… మా నాన్న కాదూ?” ఆయన భుజమ్మీదున్న పైపంచ తో ఆయన కళ్ళు తుడిచి, చేయి పట్టి లేపాడు జీవన్.

    స్నానం చేసి డ్రెస్ చేసుకుని బయటకు వచ్చిన జాహ్నవిని చూస్తూనే, “అమ్మా, ఎలా ఉన్నావు?” అన్నాడు నారాయణ. జవాబు చెప్పకుండా ముఖం తిప్పేసుకుంది జాహ్నవి.

    “చూసావా? మీ అత్తయ్య ఎంత అన్యాయం చేసిందో?” మళ్ళీ ఆరోపణగా అన్నాడు.

    “రా జానూ, కూర్చో, నువ్వూ టిఫిన్ తిందూ గాని…” జీవన్ మాటలకి కోపంగా చూసింది జాహ్నవి.

    “నా సంగతికేం లే? ఆయనకి  పెట్టావుగా తిననీ…”

    “ఛీ… ఉప్మా ఏమీ బాగాలేదురా… మీ అమ్మ చేసినట్టు లేదు…”

    “నేను బాగా  నేర్చుకుంటాను నాన్నా… ఈరోజుకి తినేయ్” పక్కనే కూర్చుని  బుజ్జగిస్తూ స్పూన్‌తో తినిపించసాగాడు జీవన్.

    గదిలోకి వెళ్ళిపోయి, అక్కడున్న సోఫాలో కూలబడింది జాహ్నవి. లాభం లేదు… ఈ మొగుడు తన మాట వినడు… తనతో రాడు. ప్రేమిస్తానంటూ వెంటపడితే అతనంటే ఇష్టం లేకపోయినా అతని జీతం, చూసి, అనవసరంగా పెళ్ళికి ఒప్పుకుంది తను. ఛీఛీ… డాడీ, మమ్మీ చెబుతూనే ఉన్నారు, తానే విన్నది కాదు… ఉక్రోషంతో రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది జాహ్నవి.

    పది నిమిషాల తరువాత ప్లేట్‌లో ఉప్మా పెట్టుకుని, లోపలికి వచ్చిన జీవన్, “అయ్యో, ఇదేమిటి?” అంటూ పక్కనే కూర్చుని ఆమె భుజమ్మీద చేయి వేసాడు.

    విసురుగా ఆ చేయి తోసేసి, దూరంగా జరిగి కూర్చుంది జాహ్నవి. “సారీ జానూ… నాన్నకి మందులిచ్చి పడుకోబెట్టాను… ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాము… ముందు టిఫిన్ తిను…” ఆమె చేతికి పళ్ళెం అందించాడు. దాన్ని విసురుగా తోసేసింది జాహ్నవి. ప్లేట్‌లో ఉప్మా అంతా నేలమీద, జీవన్ మీద చెల్లా చెదురుగా పడింది. పళ్ళెం ఓ మూలకి వెళ్ళి పడింది. జీవన్ ఆమె వైపు ఓ సారి చూసి, పళ్ళెం తీసుకువచ్చి అదంతా ఎత్తి శుభ్రం చేసాడు. తరువాత బట్టలు మార్చుకుని, రెండు చేతులూ కడుక్కుని వచ్చి పక్కనే కూర్చున్నాడు.

    “బ్రెడ్ తింటావా పోనీ? ఏమీ తినకపోతే నీరసం వస్తుంది జానూ…”

    “పోనీ, నా గురించేం బాధపడక్కర లేదు… చూడు, నీక్కూడా టికెట్ బుక్ చేసాను. ఈరోజు సాయంత్రం నాతో బయలుదేరు…” కరకుగా చెప్పింది జాహ్నవి.

    “జానూ… పసివాడిలాంటి నాన్నను ఆయన ఖర్మానికి వదిలేసి ఉన్నపాటున రాలేను… ప్లీజ్… అర్థం చేసుకో…”

    “అరె, ఆయనకి  పిచ్చి పట్టింది… మెంటల్ హాస్పిటల్‌లో పెట్టి నువ్వు రా… ఎన్నాళ్ళు జాబ్‌కి సెలవు పెడతావు? నిన్ను నమ్మి నీ జీవితంలోకి అడుగు పెట్టిన నా పరిస్థితి ఏమిటి?”

    ‘జానూ… ఆయనకి పిచ్చి కాదు… కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం… అమ్మ లేదన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక్కోసారి ఉన్నట్టే భావిస్తున్నారు… చిన్న కన్ఫ్యూజన్… ఈ విషయమై ఆయనకు  ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. నాతో ముంబై తీసుకురావాలంటే, ఇక్కడే ఆయన్ను ఉంచాలని డాక్టర్ చెప్పారు. అలా వదిలేసి రాలేను కదా… ప్లీజ్… అర్థం చేసుకుని, సహకరించు…”

    “ఎన్నాళ్ళు? పెళ్ళి అయి సంవత్సరం దాటినా మూడు నెలల బట్టీ ఒంటరిగానే ఉంటున్నాను. నువ్వు నాకు కావాలనుకున్నాను కానీ నీ వాళ్ళను కాదు… నీకు మీ నాన్నే కావాలి అనుకుంటే, నన్ను వదులుకోవటానికి సిద్ధంగా ఉండు!”

    “అంత మాటనకు జానూ.. ఐ లవ్ యూ… నువ్వు దూరమైతే తట్టుకోలేను… వచ్చే నెలలో స్టేట్స్ నుంచి  మా అక్కయ్య వస్తుంది…ఒక రెండు నెలలుంటుంది… ఈలోగా నాన్నకి కాస్త నయమౌతుంది. తనకి అప్పజెప్పి నేను ముంబై వస్తాను… కొంచెం కోపరేట్ చేయి, నా బంగారు తల్లివి కదా…” గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు.

    అతని వైపు ఓ సారి చూసి తల తిప్పుకుని, ప్లేట్‌లో ఉన్న బ్రెడ్ ముక్కలు కసా కసా నమలసాగింది.

    “వంటావిడ వచ్చే వేళయింది… నీకిష్టమైన ఐటమ్స్ చేయిస్తాను… ఉండు కొంచెం వేడిగా కాఫీ తెస్తాను…” అని కిచెన్ లోకి వెళ్ళాడు, జీవన్.

    బ్రెడ్డూ, కాఫీ వేడివేడిగా పడే సరికి ఒక్కసారిగా ఆమెకు నిద్ర ముంచుకు వచ్చింది. భర్తతో దెబ్బలాటను  వాయిదా వేసి, నిద్రకు ఉపక్రమించింది.

    ***

    మూడు నెలల తరువాత –

    వర్షం పడబోతున్నట్టు మబ్బులు కమ్మేస్తే పైన పనిమనిషి ఆరేసి వెళ్ళిన బట్టలు తెచ్చుకోవడానికి గబగబా మెట్లెక్కి డాబా మీదికి వెళ్ళాడు జీవన్.

    బట్టలన్నీ తీగల మీదనుంచి తీసి చేతుల్లో వేసుకుని, రాబోతున్న జీవన్  యాథాలాపంగా క్రిందికి చూస్తే ఎదురింటి వరండాలో, పడక్కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తున్న గోపయ్య మామ కనిపించాడు. అప్రయత్నంగా తన తండ్రి కనుల ముందు మెదిలాడు. ఇప్పటికి ఇంచుమించు రెండు నెలలవుతోంది, తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోయి… మతిలేని మనిషి… ఏమైపోయాడో, ఎక్కడున్నాడో… అసలున్నాడో లేదో… ఆరోజు రాత్రంతా నిద్ర  లేక, తనకు… తెల్లవారుఝామున నిద్ర పట్టింది. లేచి చూసే సరికి నాన్న ఇంట్లో లేడు.

    బట్టలన్నీ మంచం మీద పడేసి దిగులుగా కూర్చున్నాడు జీవన్… పసిపిల్లాడి కన్నా అన్యాయం తండ్రి… తన ఆకలి తనకు తెలియదు… అమ్మ ఫోటో చూస్తూ, ఏడుస్తూ, ఆమెతో మాట్లాడుతూ గంటలు గంటలు గడిపేస్తాడు… అసలు కడుపుకు ఆకలి తెలుస్తోందా? తింటున్నాడా? ఆయన కోసం వెతకని ఊరులేదు, ప్రదేశం లేదు… అసలు ఈ ఊరు తప్ప వేరే ప్రపంచం తెలియని మనిషి… ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అసలు జీవించి ఉన్నాడో లేదో… దుఃఖం ముంచుకు వచ్చింది జీవన్ కి… తన దిండు కింద ఉన్న తండ్రి పై పంచ తీసి అందులో ముఖం దాచుకున్నాడు… ఆయన ఒంటి పరిమళాన్ని నింపుకున్న ఆ వస్త్రాన్ని ఆఘ్రాణిస్తూ…

    “తమ్ముడూ…ఏమిటిది, లైట్ కూడా వేసుకోకుండా ఇలా కూర్చున్నావ్?” లైట్ వేసి వచ్చి పక్కనే కూర్చుంది అనూరాధ.

    “నా జీవితం అంతా చీకటి మయమే కదక్కా…” నిర్లిప్తంగా అన్నాడు జీవన్…

    “ఏంటిరా ఇది? మీ ఇద్దరి ప్రేమనూ ఒప్పుకొని, అమ్మా, నాన్నా, నేను వైభవంగా నీకు పెళ్ళి చేసిన దృశ్యాలు నిన్న మొన్నటివిలా ఉన్నాయి… అలాంటిది, అమ్మ వెళ్ళిపోయింది, అర్థాంతరంగా… నాన్న మతి చలించిన వారిలా అయిపోయారు… నీ ఉద్యోగం పోయింది, ఆ పిల్ల లీగల్‌గా విడాకులు తీసుకుని అబ్రాడ్ వెళ్ళిపోయింది… నాన్న ఇల్లు విడిచి ఎటో వెళ్ళిపోయారు. వెదకని ప్రదేశం లేదు. అసలు సజీవంగా ఉన్నారో లేదో, తెలియదు. ఆయన ఇక్కడికే వస్తారని, నీ భవిష్యత్తును బలి పెడుతున్నావు. ఈ పల్లెటూరిలో ఆయన కోసం ఉండిపోకుండా, మంచి ఉద్యోగం చూసుకుని సిటీకి వెళ్ళిపోరా నానీ ప్లీజ్… నేనైనా తరచుగా ఇండియా రాలేకపోతున్నాను కదా… నీగురించే రా నా బెంగంతా…” దిగులుగా అంది అనూరాధ.

    “ఫర్లేదు అక్కా… నువ్వు డాక్టర్‌వి… నాకోసం నీ సంసారాన్నీ, ఉద్యోగాన్నీ వదులుకుని పదే పదే రాకు. నాన్నకు బయటి ప్రపంచం తెలియదు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు.  బ్రతికుంటే ఎప్పటికైనా ఇక్కడికే వస్తారు. ఇక్కడెవరూ లేకపోతే ఏమైపోతారు? అందుకని నేనిక్కడే ఉండాలి… జాబ్‌కి వెళితే గానీ గడవదన్న పరిస్థితి లేదు… ఇక జానూ సంగతి అంటావా? ప్రేమన్నది ఒక్క వైపే అయితే ఇలాగే ఉంటుంది అక్కా… నేను ఆమెను ప్రేమించాను, ఆమె నా ఉద్యోగాన్ని, హోదాను ప్రేమించింది. నా బాధ్యతలు కూడా నిర్వహించకూడదని ఆంక్షలు పెట్టింది. ఇప్పటి ఆడపిల్లలు అందరూ ఇలాగే ఉన్నారు. నేను అన్నీ వదిలేసి ఆమెతో వెళ్ళిపోయి, మనసు లేని కాపురాన్ని చేయలేక విడాకులకు సమ్మతించాను. మరి మనకు వేరే ఆప్షన్ లేదు కదా…”

    “కానీ ఈనాటి ఆడపిల్లలంతా ఇలాగే ఉన్నారు కదరా… భర్త తనతోనే ఉండాలని భార్య కోరుకోవటంలో తప్పేముంది చెప్పు? నువ్వు నాన్నను వదిలి వెళ్ళి ఉండాల్సింది…” చెప్పలేక చెప్పింది అనూరాధ.

    “అప్పుడు నేను నాన్నను చంపిన హంతకుడిని అయి ఉండేవాడిని అక్కా… నాన్న మనకి జన్మను ఇచ్చాడు… మనకు గురువు, దైవం ఆయనే. ఆయన్ను అనాథలా ఎలా వదిలిపెట్టగలను? ఎప్పటికైనా నాన్న తిరిగి వస్తాడు… ఇక్కడికే వస్తాడు అక్కా… నేను వేచి ఉంటాను…”

    “కానీ ఒంటరి వాడవై పోయావు కదరా…” అనూరాధకు ఏడుపు ముంచుకు వచ్చింది.

    “అమ్మ నాతో  ఎప్పుడూ ఉంది, నాన్న నాకోసం తిరిగి వస్తారన్న ఆశ ఉంది, నీవు నాతోనే ఉంటావు… నాకు ఒంటరితనమేమిటి అక్కా… అలా అనుకోకు… రేపు హాపీగా బయలుదేరి వెళ్ళు…”

    “తమ్ముడూ…”

    “అక్కా… ప్లీజ్ ఏడవకూడదు…” ఆమె భుజం తట్టాడు జీవన్.

    ***

    మరునాడు ఏదో అనాథాశ్రమానికి చందా కోసం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవటంతో, బ్యాంకుకని బయలుదేరాడు జీవన్.

    ఆశ్రమం ఖాతాలో డబ్బు జమ చేసి వెనుతిరగగానే ఆ ఊరి ప్రజలు అక్కడ చాలా మంది కనిపించారతనికి.

    “అయ్యా… తవరు మా నారాయణ బాబుగారి కొడుకే కద… పట్నంలో పెద్ద కొలువు సేత్తన్నారట … కొంచెం డబ్బులు తీసుకోవాల, ఈ కాయితం నింపి పెట్టండి బాబు…” అని అడిగాడు ఒకాయన. సరే అని అతనికి ఆ పని చేసి పెట్టే సరికి, ఇంకో నలుగురైదుగురు ఫారాలతో రెడీ అయ్యారు. కొంత మంది డబ్బు డిపాజిట్ చేయటానికి….కొంతమంది విత్ డ్రాయల్ చేయటానికీ… అందరికీ ఫార్మ్స్ నింపి పెట్టేసరికి అరగంట టైం పట్టింది… ఈలోగా అతని మెదడులో ఒక పథకం రూపు దిద్దుకుంది.

    వారం రోజులు తిరిగే సరికి జీవన్ ఇంటి ముందున్న అతని ఖాళీ స్థలంలో ఒక పాక వెలిసింది. చెక్క బెంచీలు, నల్లబల్లా వచ్చాయి… ‘వయోజన విద్యా కేంద్రం’ అన్న బోర్డు వెలిసింది. నిరక్షరాస్యతను తుడిచివేయాలన్న సంకల్పంతో, రాత్రి పూట  అందరికీ అక్షరాలూ నేర్పించటం మొదలుపెట్టాడు, జీవన్.

    పగటిపూట, ఇంటర్ విద్యార్థులకూ, పోటీ పరీక్షలకు వెళ్ళే యువతకూ పాఠాలు నేర్పిస్తూ, తన విద్యను సార్థకం చేసుకోసాగాడు. జీవన్ మనసులో కొత్తగా ఉదయించిన ఉత్సాహరాగం భూపాలమై, కొత్తశక్తిని అతని అణువణువునా  నింపసాగింది.

    నండూరి సుందరీ నాగమణి

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here