[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[రాధాసారు హామీ ఇవ్వడంతో పతంజలి వాళ్ళకి బ్యాంకు లోన్ శాంక్షన్ అవుతుంది. ముగ్గురు భాగస్థులకి చెక్ పవర్ ఉంటుంది. విజయవాడ వెళ్ళి పుస్తకాలను పరిశీలిస్తాడు పతంజలి. క్వాలిటీ బాగుండడంతో ప్రింట్‍కు ఆర్డర్ ఇచ్చేస్తాడు. లెనిన్ గారికి తన స్టేషనరీ షాపు గురించి చెప్తే, ఆయన తనకి తెలిసిన షాపు కుర్రాడు చిన్నాకి పరిచయం చేస్తాడు. అతను స్టేషనరీ షాపుకి కోసం పతంజలి తెచ్చిన జాబితా చూసి మరికొన్ని జోడిస్తాడు. కొన్ని వస్తువులు తన మిత్రుడి షాపులో ఉంటాయని, బాపిరాజు అనే ఆ మిత్రుడికి పతంజలికి పరిచయం చేస్తాడు. చిన్నా, బాపిరాజు – పతంజలికి కావల్సిన అన్నీ పుస్తకాలు, స్టేషనరీ వస్తువలు కర్నూలు పంపే ఏర్పాటు చేస్తారు. మంగళగిరిలో నరసింహస్వామిని దర్శించుకుంటాడు పతంజలి. స్థానిక హోటల్లో అక్కడి ప్రత్యేక వంటకం ‘నేతి మిక్చర్ పెసర’ గురించి సర్వర్ చెప్పగా, ఆర్డర్ చేసి తింటాడు. మళ్ళీ విజయవాడ చేరి చిన్నాని కలుస్తాడు. పుస్తకాల అమ్మకం గురించి అతనితో చెబితే, పుస్తకం కొన్నవాళ్ళకి ఒక పెన్ను ఉచితంగా ఇవ్వమని, చవకరకం పెన్నులు సరఫరా చేస్తాడు. అక్కడ్నించి వెళ్ళి ప్రెస్‍లో లెనిన్ గారిని కలుస్తాడు. బుక్ బైండింగ్ పూర్తయిపోయింది. ఆయనకి ఇవ్వవలసిన మిగతా డబ్బు ఇచ్చేసి కర్నూలు బయలుదేరుతాడు పతంజలి. కర్నూలు చేరాకా తన ఆలోచనలన్నీ మిత్రులతో పంచుకుంటాడు. స్టేషనరీ షాపు ప్రారంభోత్సవానికి ఎవరిని పిలవాలో రాధాసారుతో సంప్రదిస్తాడు. – ఇక చదవండి.]
[dropcap]అ[/dropcap]క్కడున్నుంచి పెయింట్స్ షాపుకు పోయి కావలసిన పెయింట్స్ తెచ్చుకున్నారు. ఆరోజు రాత్రి బ్యాక్‌గ్రౌండ్ పెయింట్ వేశాడు ఉస్మాన్. రాత్రి శ్రీశైలం – అనంతపురం బస్సుకు ఇంటికి వెళ్లాడు పతంజలి. ఉదయం విశేషాలన్నీ చెప్పి షాపు ప్రారంభోత్సవానికి మంచి రోజు సమయం చూడమని నాన్ననడిగాడు. మార్కండేయశర్మకు ఒక వైపు సంతోషం, ఒకవైపు టెన్షన్, ఇన్ని కార్యాలు కొడుకు నిభాయించగలడా? యాభైవేలు అప్పు అంటున్నాడు. నెలకు రెండువేలు కంతు కట్టాలి బ్యాంకుకంటున్నాడు. పతంజలి సమర్థతమీద నమ్మకం ఉందిగాని వేలు వేలు పెట్టుబడులు అంటుంటే ఆయనకు భయంగా ఉంది. అది గమనించాడు కొడుకు.
“నాన్నా, మీరు అమ్మ నిశ్చింతంగా ఉండండి. మంగళగిరిలో మన స్వామి దర్శనం చేసుకొని వచ్చాను. ‘నాహం కర్తా హరిః కర్తా’ అన్నట్లు మానవ ప్రయత్నం మనది. అంతా నరసింహుడే చూసుకుంటాడు. మీకు చెప్పగలవాణ్ణా నేను?” అన్నాడు. ఆయనకు కొడుకు మాటలతో మనసు నెమ్మదించింది. పంచాంగం చూసి “సరిగ్గా మూడు రోజులు తర్వాత, బృహస్పతివారం (గురువారం) తదియ. పునర్వసు నక్షత్రం, నీ నక్షత్రమే. ఉదయం పదిగంటల యాభై రెండు నిమిషాలకు బాగుంది” అనన్నాడు.
“ఆ రోజు ఉదయం మీరంతా వచ్చేయండి. మీ చేతుల మీదుగానే పూజ జరగాలి.”
“మన యింటి కార్యంరా అది. మమ్మల్ని పిలవాలా? వినాయకుడి పటం సరస్వతీదేవి పటం, మన స్వామిపటం తెచ్చి పెట్టుకోండి, పూజా ద్రవ్యాలన్నీ మేం తెస్తాము” అన్నాడు.
“అమ్మను ప్రసాదాలు అవీ అని హైరానపడవద్దని చెప్పండి. వచ్చే ఆహూతులకు స్వీటు, హాటు, టీ యిస్తాము” అన్నాడు.
అమ్మ రాత్రి చేసిన తపేలాంట్లు రెండు తిని బయలుదేరాడు. “ఏవయినా రెండు అధరువులు చేసిస్తాను. ఒక గంట తాళరా?” అని వర్ధనమ్మ బ్రతిమాలింది.
“వద్దమ్మా, చాలా పని ఉంది” అని చెప్పి కర్నూలుకు వచ్చేశాడు.
ఎడమవైపు గోడకు కార్పెంటర్‌తో ప్లయివుడ్ రీపర్ కొట్టించి మూడు దేవతల పటాలనూ ఫిక్స్ చేయించాడు. చిన్న టేబుల్ ఫ్యాను కూడా గోడకు ఏర్పాటయింది. రాధాసారు ఆఫీసుకు వెళుతూ వచ్చి షాపు చూశారు. బాగుందన్నారు. ఉస్మాన్ ఈ రోజు తన అసిస్టెంట్‌తో కలిసి షాపు పేరు షాపుకు రెండు వైపులా తాము అమ్మే వస్తువుల లిస్టు రాత్రి రాసేస్తానన్నాడు. లేత నీలంరంగు బ్యాక్‌గ్రౌండ్ మీద పసుపు పచ్చని అక్షరాలు వస్తాయి. అంచులకు ఎరుపు షేడింగ్. ‘సక్సెస్ బుక్ హౌస్’ అని తెలుగులోనే రాయిస్తున్నామని సారుకు చెప్పారు.
తాను సాయంత్రం వస్తాననీ, అందరం కలిసి కర్నూలు మునిసిపల్ ఛైర్మన్ నాగిరెడ్డి గారింటికి వెళ్లి ఎల్లుండి ప్రారంభోత్సవానికి ఆహ్వానిద్దామనీ అన్నాడాయన. నాగిరెడ్డిగారు ఎన్నో సంవత్సరాలుగా ఆ పదవిలో ఉంటున్నారు. ఆ పదవితో ఆయన మమేకమయ్యాడు. ఆయన్ను ప్రజలు ‘ఛైర్మన్ నాగిరెడ్డి’ అని పిలుస్తారు. బస్టాండు దగ్గరున్న సాయిబాబా టాకీసు, పార్కు రోడ్‌లోని చంద్రలాడ్జి ఆయనవే. అవిగాక ‘రాయల్ ఎన్‌ఫీల్డు’ మోటారు సైకిళ్ల అధీకృత డీలరు. డోన్‌కు వెళ్లేదారిలో ఉన్న ‘రాయలసీమ కార్బైడ్స్’ పరిశ్రమ ఆయనదే. పెద్ద భూస్వామి.
అందరూ నాగిరెడ్డి గారింటికి వెళ్లారు. ఆయన ఇంట్లోనే ఉన్నారు. నరసింగరావుపేటలో ఆయన భవంతి ఉంది. బయట లాబీలో చాలామంది ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. అరగంట తర్వాత పి.ఎ. వీరిని లోపలికి పంపాడు.
లోపల గది చల్లగా ఉంది. విశాలమైన సోఫాలున్నాయి. నాగిరెడ్డిగారికి నమస్కరించి ఆయన కూర్చోమన్న తరువాత కూర్చున్నారు.
“ఎవురబ్బా మీరు? యా దానికి నాకాడకొచ్చినారు?” అనడిగాడాయన. రాధాసారు చెప్పాడు. “నాయినా, (కర్నూలు జిల్లాలో రెడ్లను నాయినా అని పిలుస్తారు. ప్రజలకు తండ్రి వంటి వాడిని అర్థం. రామిరెడ్డి నాయిన, పుల్లారెడ్డి నాయిన అని ఆ పదాన్ని పేరుతో కలిపి వ్యవహరిస్తారు). నా పేరు రాధాకృష్ణమూర్తి నాయుడు. వ్యవసాయశాఖలో ఎ.డి.ని. ఈ పిల్లలు మనవాళ్లే. బతుకు తెరువుకోసరం చిన్న బుక్‌షాపు పెట్టుకుంటుండారు. నీ సేతుల్తో ప్రారంభోత్సవం చేయించాలని అడగనీకె వచ్చినారు. రేపు పదిన్నరకు ముహూర్తం పెట్టుకొన్యారు.”
నాగిరెడ్డికి అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉంటాయి. ఇంచుమించు ఆరున్నర అడుగులుంటాడు. తెల్లని అంచు ధోవతి, సుంగులు (అంచులు) నేలను జీరాడేలాగ కట్టుకున్నాడు. తెల్లని జుబ్బా, జట్టు, కనుబొమ్మలు కూడ తెల్లగా నెరిసినాయి. పతంజలి వైపు చూశాడాయన. “నా పేరు పతంజలి. శర్మ మీరు తప్పకుండా రావాల నాయనా. మీ ఆశీస్సులు గావాల మాకు”. ముని, ఉస్మాన్ ఆయనకు నమస్కరించారు.
“నా క్యాడయితాది సామీ! ముడ్డి కడుక్కోనీకె కూడ టయిం సాలక సచ్చావుండా. అయినా బాపనోల్లు యాపారం జేయడమంటే బో విడ్డూరంగా ఉండాదే, రేపు సంగతేందో సూద్దాం తాళండి” అని పి.ఎ.ను పిలిచాడు.
“ఓయ్ దస్తగిరీ! రేపొద్దున పదిన్నర కంట మన పరిసితేందో సూడోకసారి”
పి.ఎ. డైరీ చూశాడు. “రేపుమద్దినాల వరకు పురసత్తుం (ఖాళీ) డాది నాయనా సాయంత్రం మీటింగులుండాయి.”
“సరే సామీ! వచ్చాలే. పిల్లోండ్లు పిలిచ్చే రాకపోతే యెట్ల?” అన్నాడాయన.
“మీ షాపు యాడనో ఉండేది పి.ఎ.కు చెప్పిపోండి. పోన్ నంబరు దీస్కపోయి తొమ్మిది దాటినంకొకపాలి మతికి సెయ్యండి.”
ఆయన వద్ద సెలవు తీసుకొని వచ్చేశారు. ఆత్మీయులందర్నీ ఆహ్వానించారు. షామియానా, చిన్న వేదిక, ముఫై కుర్చీలు ఉదయం 9 గంటల కల్లా అమర్చి వెళ్లాలని ‘కర్నూలు సప్లయర్స్’ వారికి అడ్వాన్సిచ్చారు ‘శ్రీకృష్ణా నేతి మిఠాయిలు’ వారికి మూడు కిలోల బర్ఫీ, రెండు కిలోల మిక్చరు ఆర్డరిచ్చారు. ‘అరోమ టీ స్టాల్’ వాడికి నలభై టీలు స్పెషల్‌గా చేసి పదకొండు గంటలకు తీసుకు రమ్మన్నారు. పెద్దలకు టీ ఇవ్వడానికి పింగాణీ కప్పుల సెట్ కొన్నారు. బంగారం రంగు రిబ్బను, కొత్త కత్తెర రడీ చేశారు. షాపును రంగు కాగితాలతో అలంకరించారు.
‘సక్సెస్ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మాన్యులు ప్రియతమ నాయకులు శ్రీ ఛైర్మన్ నాగిరెడ్డిగారికి స్వాగతం’ అని ఉస్మాన్‌తో రాయించి రెండు కర్రలు పాతించి బ్యానరు కట్టారు. ఛైర్మన్ గారికి వేయడానికి పూలమాల సిద్ధం చేసుకున్నారు. ఆ రోజు మార్నింగ్ సెషన్ క్లాసులు రద్దు చేశారు. స్టాక్సన్నీ ఆ ముందు రోజు వచ్చేశాయి. రాత్రి ముగ్గురూ ఒంటిగంటన్నరకు పని చేసి ర్యాంకులు షోకేసు నింపారు.
ముగ్గురికీ ఉద్వేగంగా ఉంది. ఏడున్నర కల్లా సిద్ధమయ్యారు. ఎనిమిదిన్నరకు అమ్మానాన్న, మహిత, పాణిని వచ్చేశారు. చిన్నోడు అన్నయ్య వెంబడే తిరుగుతున్నాడు. షామియానా, కుర్చీలు, వేదిక సిద్ధమయ్యాయి. చిన్న పేపరు ప్లేట్లలో స్వీటు, హాటు సర్దుకున్నారు. టీ వాడిని అలర్ట్ చేసి వచ్చారు. తమ విద్యార్థుల కోసం ‘బెంగుళూరు అయ్యంగార్స్’ బేకరీలో ఒక వంద కేకులు తెచ్చి పెట్టుకున్నారు. పిల్లలందర్నీ ఆహ్వానించారు.
తొమ్మిదిన్నరకు ఛైర్మన్ గారింటికి ఫోన్ చేశాడు ముని. “ఆ మతికుండాది. ఛైర్మన్ గారు పదిన్నరకంతా అక్కడుంటారు. అన్నీ రడీగా బెట్టుకోండి. నాయన వచ్చింతర్వాత తొక్కులాడుకుంటుంటే ఆయనకు కోపం వచ్చాది” అని చెప్పాడు పి.ఎ.
ఛైర్మన్ గారు రిబ్బన్ కట్ చేయగానే పూజ ప్రారంభించుకుందామని నాన్నకు చెప్పాడు. పటాలకు, పైన ఆఫీసులో స్వామి వారి పెద్ద పటానికి పూలమాలలు వేశారు.
సరిగ్గా పదీ నలభైకి ఛైర్మన్‌గారి అంబాసిడర్ కారు షాపు ముందాగింది. ముందు సీట్లోంచి గన్‌మేన్ దిగాడు. పతంజలి పరుగున వెళ్లి వెనుక తలుపు తెరిచి పట్టుకున్నాడు. నాగిరెడ్డి గారు దిగి పతంజలిని చూసి నవ్వారు.
“నమస్కారం, నాయినా” అన్నాడు పతంజలి. ముని, ఉస్మాన్ కూడ నమ్మస్కరించారు.
“ఏమప్పా, రడీగా ఉండారా, నేను మల్ల గార్గేయపురానికి బోయేదుండాది” అంటూ ఆయన వేదిక దగ్గరికి నడిచారు. ఆయనతో బాటు స్కూటర్లు, మోటారు బైకులు, సైకిళ్ల మీద ఒక ఇరవైమంది దాకా వచ్చారు. ఎవరో “ఛైర్మన్ నాగిరెడ్డి నాయిన కూ” అని అరిచాడు. చాలామంది “జై!” అని ప్రతినినదించారు. ఆయన చిరునవ్వుతో జేజేలు స్వీకరిస్తూ వెళ్లి వేదికముందు కుర్చీలో కూర్చున్నారు. వేదికంటే ఏమీ లేదు ఒక టేబుల్ మీద ఉతికిన క్లాత్ పరచి, దేవ సహాయం సారింట్లోది ఒక ప్లవర్ వేస్ పెట్టారంతే. వెనక రెండు కుర్చీలు వేశారు.
పతంజలి తండ్రిని పిలిచి ఛైర్మన్ గారికి పరిచయం చేయబోతుంటే ఆయన గభాలున లేచి, “సామీ! నమస్కారం! మీరు ఈడ….” అన్నాడు. “వీడు నా కొడుకే నాయినా” అన్నాడు మార్కండేయశర్మ నవ్వుతూ. పక్కనున్న వారితో చెప్పాడాయన. “మన జిల్లాలో సామిని తెలియనోడు లేడు. పురాణాలు ఆయన సెపుతుంటే కల్లముందు రామాయనం భారతం నిలబడాల్సిందే. మన బాస్కర్రెడ్డి, మాదన్న సామి మంచిరోజు సూడందే యాపనీ సెయ్యరు. శానా సంవత్సరాల క్రిందట ఉడుముల పాట్లో సామి అట్టా వదానం సూసినా” అంటూ మార్కండేయ శర్మ కాళ్లకు నమస్కరించాడాయన.
సరిగ్గా పదీ యాభై రెండు నిమిషాలకు ఛైర్మన్‌గారితో రిబ్బను కట్ చేయించారు. ఇద్దరు విలేఖరులు ఫోటోలు తీశారు. పతంజలి ఆయన మెడలో పూలమాల వేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆయన వేదిక వెనక నిలబడి, పతంజలి కోరిక మీద నాలుగు మాటలు మాట్లాడారు.
“ఇయ్యాల నాకు శానా సంతోషంగా ఉండాది. పిల్లలు ఉజ్జోగాల కోసం సూడకుండా ఇట్టాంటి యాపారాలు బెట్టుకోవాల. ఈ బుక్ షాపు… దీని పేరేంది? అని పతంజలి నడిగాడు. ‘సక్సెస్ బుక్ హౌస్’ అని చెపితే “సక్సెస్ పుస్తకాల షాపు బాగా జరిగి ఈ పిల్లలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటుండాను” అని ముగించాడు. కుర్చీలో కూర్చున్నాడు. స్వీటు, హాటు, ఇస్తే వద్దన్నాడాయన. ‘మదుమేగం” వచ్చిండ్ల్యా. ఇయన్నీ తినను. టీ కాపీ కూడ మానేసినా. కడుపులో మంటొచ్చాది” అన్నాడు.
“అయితే మజ్జిగ తెప్పిస్తాను. దయచేసి మా తృప్తి కోసం తాగండి” అన్నాడు పతంజలి. ఒక కుర్రవాడిని పరిగెత్తించారు.
కుర్చీలన్నీ నిండిపోయాయి. కొందరు నిలబడ్డారు. రోడ్డున పోయే వారు కూడా ఆగి చూస్తున్నారు. విద్యార్థులు దాదాపు డెభై మంది వచ్చారు. కుర్చీల్లోని వారికి స్వీటు, హాటు ఇచ్చారు. గ్లాసులతో మంచినీళ్లు అందించారు. టీలు వచ్చాయి.
ఛైర్మన్‌గారు మజ్జిగ తాగారు. పూలదండ తీసి టేబుల్ మీద పెడితే గన్‌మ్యాన్ దాన్ని కారులో పెట్టివచ్చాడు. లోపల పూజ జరుగుతూంది. క్లుప్తంగా ముగించాడు శర్మ. అవతల పెద్దాయన అంత సేపు ఉండడం కుదరదు. అష్టోత్తరం చేసి, హారతిచ్చాడు ఆయన పటాలకు.
“మీ చేత్తో ఏదైనా వస్తువు తొలి కొనుగోలు చేయండి. మీ హస్తవాసి మంచిదని విన్నాను” అన్నాడు పతంజలి.
“యాదన్నా మంచి పెన్ను ఇద్దువుగాని పాసామీ” అన్నాడాయన.
షోకేసులోంచి ఖరీదయిన ‘కేమ్లిన్ పెన్’ తీసి ఆయన కిచ్చాడు పతంజలి దాని ఖరీదు పది రూపాయలుంటుంది. ఆయన పెన్ను తీసుకొని జేబులోంచి వంద రూపాయలు తీసియిచ్చాడు. బోణీ అయింది. ఆయన చిల్లర తీసుకోలేదు. ఆయన అనుయాయులు కొందరు పెన్నులు, నోట్‌బుక్స్ కొన్నారు. రాధాసారు, బాజిరెడ్డి, దేవసహాయం దంపతులు కూడా కొన్నారు. విద్యార్థులు కూడా కొనడం ప్రారంభించారు.
ఛైర్మన్ గారిని కారు వరకూ సాగనంపి వచ్చారు మిత్రులు. అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. పిల్లలందిరికీ కేకులు పంచారు. మస్తానమ్మ చురుకుగా పని చేసింది.
ముని తమ్ముడు శివను షాపులో పని చేయడానికి పిలిపించుకున్నారు. వాడు టెంత్ ఫేలయి ఖాళీగా ఉన్నాడు. వాడికి నెలకు మూడు వందలు జీతం, వీళ్లతోనే ఉంటాడు. నలుగురూ కలిసి ఏ వస్తువు ఎంతకమ్మాలో ఒక అవగాహనకు వచ్చారు. ర్యాకులన్నీ నిండిపోయాయి. షోకేసు కళకళలాడుతూంది. శివతో పాటు షాపులో ముగ్గురిలో ఒకరుండాలని అనుకున్నారు. ట్యుటోరియల్స్‌కు చలమేశ్వర్ అనే ఆయనను నియమించుకున్నారు. ఆయన బి.ఎస్సీ. బి.యిడి. ఆయనకు పీరియడ్‌కు పదిరూపాయలు రోజూ ముడు క్లాసులు చెపుతున్నాడాయన. ఆదివారాలు సెలవులు పోను దాదాపు ఆరేడు వందలు వస్తుంది. శివ, చలమేశ్వర్‌ల వల్ల వీళ్లకు పనిభారం కొంతమేరకు తగ్గింది.
ఎమ్.ఎ. చదువు రాత్రి పొద్దు పోయేంతవరకు, తెల్లవారు జామున కొనసాగిస్తున్నాడు పతంజలి. వారం రోజులో షాపు ఒక దారికొచ్చింది. రోజూ ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల దాకా బేరం జరుగుతూ ఉంది. మంచి రోజు చూసి పతంజలి బుక్స్ అమ్మకం కోసం బయలుదేరాడు. అగరుబత్తీలవాళ్లు, చొంగలు (Gold Fingers) అమ్మేవాళ్లు సరుకు తీసుకుపోయే కాన్వాస్ సంచులు పెద్దవి రెండు కొన్నారు.
ఒక వెయ్యి కాపీలు, మూడు టైటిల్స్ కలిపి, సంచుల్లో సర్దుకున్నాడు. వెయ్యి పెన్నులు కూడ సర్దుకున్నాడు. మొదట కోడుమూరు, ఎమ్మిగనూరు రూటు ఎంచుకున్నాడు. కోడుమూరు వరకు బస్సులో వెళ్లి, అక్కడ బస్టాండులో కూల్ డ్రింక్స్ షాపు వాడిని రిక్వెస్ట్ చేసి బ్యాగులక్కడ ఉంచేశాడు. టైటిల్‌కు నాల్గయిదు కాపీల చొప్పున కొన్ని శాంపిల్స్, ఐదారు పెన్నులు తీసుకొని ముందు జడ్.పి స్కూలుకు వెళ్లాడు.
హెడ్‌మాస్టర్ దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకున్నాడు. “సార్! మేం నిరుద్యోగులం కలిసి కొన్ని బిట్‌బ్యాంక్స్, గ్రామరు తయారు చేసి పబ్లిష్ చేశాము. మీరు అనుమతిస్తే క్లాసులకు వెళ్లి పిల్లలకు చెపుతాను. ఆసక్తి ఉన్నవాళ్లు మధ్యాహ్నాం డబ్బు తెచ్చుకుంటారు. ఇదే కేవలం మా ఉపాధి కోసమే కాని, టీచర్ల కంటే మేం గొప్పవాళ్లం కాదు సార్” అని విన్నవించుకున్నాడు. ఆయన “సరే! ట్రై యువర్ లక్!” అని చెప్పాడు అటెండరును తోడుగా పంపాడు.
ముందు సెవెంత్ క్లాసుకెళ్లారు. రెండు సెక్షన్సున్నాయి. ‘ఎ’ సెక్షన్‌కు వెళ్లి టీచరును విష్ చేశాడు. పిల్లలకు చెప్పాడు. “మైడియర్ స్టూడెంట్స్, మేం సక్సెస్ పబ్లికేషన్స్ అనే పేరుతో ఏడవ తరగతి పిల్లల కోసం బిట్ బ్యాంక్ తయారు చేశాము. ‘జెమ్స్’ వాటి పేరు. అన్ని సబ్జెక్టులకు కలిసి వెయ్యి బిట్స్ ఉంటాయి. పుస్తకం చూడండి…” అంటూ నాలుగు కాపీలు సర్కులేట్ చేశాడు. ఐదు నిమిషాల తర్వాత చెప్పాడు.
“చూశారుగా దీని వెల ఐదు రూపాయలే. ఈ పెన్ చూడండి. షాపులో అర్ధరూపాయి పెడితే గాని రాదు. కాని మా బిట్ జెమ్స్ కొన్నవాళ్లకి ఈ పెన్ ఉచితంగా ఇస్తాము”
ఒక నిమిషం పాటు క్లాసులో గుసగుసలు టీచరు “సైలెన్స్! అన్ని బిట్లు ఒకే పుస్తకంలో ఉంటే చదువుకోడానికి బాగుంటుంది. పైగా పెన్ను ఫ్రీగా వస్తుంది! తీసుకోండి! మంచిదే!” అని ప్రోత్సహించాడు.
“తీసుకోదలచిన వాళ్లు చేతులెత్తండి! నేను మధ్యాహ్నం పుస్తకాలు తీసుకొని వస్తాను. మీరు డబ్బు తెచ్చుకోండి. పుస్తకమూ, పెన్నూ తీసుకోవచ్చు” అన్నాడు పతంజలి.
ఆ క్లాసులో దాదాపు యాభై మంది పిల్లలున్నారు. అందులో కొంత మంది చేతులెత్తారు. పతంజలి లెక్కపెట్టాడు పద్దెనిమిది మంది. ఒక పిల్ల రెండు చేతులెత్తింది.
“నీకు రెండు పుస్తకాలు కావాలా అమ్మా” అనడిగాడు.
“లేదండీ. ఉట్టిగే!” అన్నదా అమ్మాయి. అందరూ నవ్వారు.
“సరే మధ్యాహ్నం ఐదు రూపాయలు తెచ్చుకోవడం మర్చిపోకండి” అని, టీచరుకు ధ్యాంక్స్ చెప్పి ఇతర సెక్షన్లన్నీ తిరిగాడు. ఒక పాకెట్ నోటు బుక్కులో ఏ సెక్షన్‌లో ఎన్ని పుస్తకాలవసరమో నోట్ చేసుకున్నాడు. తర్వాత ఎయిడెడ్ మిషనరీ స్కూలొకటుందని తెలిసి అక్కడా పిల్లలకు వివరించాడు. లెక్క చూస్తే సెవెంత్ 35, టెంత్ నలభై, గ్రామరు అన్ని క్లాసులకు కలిపి 70 కాపీలు కావాలని చేతులెత్తారు. మధ్యాహ్నమయింది.
కోడుమూరు చిన్న ఊరే. వెల్దుర్తి అంతుంటుంది. భోజన హోటళ్లేమీ మంచివి కనబడలేదు. సరేలే అనుకొని ఉగ్గాని బజ్జీ తిని టీ తాగాడు. రెండు గంటలకు రెండు వందల కాపీలు తీసుకొని జడ్.పి స్కూలుకు వెళ్లాడు. చేతులెత్తిన వాళ్లలో కొందరు డబ్బులు తేలేదు. మొత్తం మీద రెండు స్కూళ్లల్లో కలిపి బిట్స్ ఎనభై కాపీలు, గ్రామరు యాభై కాపీలు అమ్ముడుపోయాయి. అక్కడి నుండి బయలుదేరి సి.బెళగళ్, గూడూరు స్కూళ్లలో పిల్లలను కలిశాడు. రేపు ఉదయం డబ్బులు తెచ్చుకోమన్నాడు. సాయంత్రానికి కర్నూలు చేరుకొని క్లాసులకు హాజరయ్యాడు. షాపులో ఒక గంట గడిపాడు.
మర్నాడు ఉదయం పుస్తకాలతో ఎమ్మిగనూరు వెళ్లాడు. అది టౌన్. జెడ్.పి. బాయిస్, జె.పి. గర్ల్స్, గవర్నమెంటు హైస్కూలు,యం.జి బ్రదర్స్ స్కూలు మొత్తం నాలుగు స్కూళ్లున్నాయి. ఎమ్మిగనూరులో ఒక చోట పుస్తకాలు పెట్టుకొని, తొమ్మిది గంటలకల్లా గూడూరు వెళ్లాడు. అక్కడ ఒక యాభై, సి.బెళగళ్‌లో ఒక నలభై కాపీలు తీసుకున్నారు. పదకొండు గంటలకు ఎమ్మిగనూరుకు వచ్చి, అద్దెకు ఒక సైకిలు తీసుకొని ఒంటిగంటవరకు నాలుగు స్కూళ్లు కవర్ చేసి, మధ్యాహ్నం వెళ్లి పుస్తకాలు ఇచ్చాడు. దాదాపు రెండు వందల నలభై కాపీలు ఖర్చయినాయి.
సాయంత్రం కర్నూలు చేరాడు. మరునాడు డైరెక్ట్‌గా ‘ఆదోని’కి వెళ్లాడు. చాలా పెద్ద టవునది. జడ్.పి. వి రెండు, గవర్నమెంటుది ఒకటి. టి.జి.యల్ ఇండస్ట్రీస్ వారి దొకటి, ఉన్నాయని తెలుసుకున్నాడు. అవిగాక సెయింట్ మేరీస్ వారి ఎయిడెడ్ స్కూలుంది. దాంట్లో ఇంగ్లీషు మీడియంతో బాటు, తెలుగు మీడియం కూడ ఉందని తెలిసింది.
ఉదయం సెషన్‌లో అన్ని స్కూల్సు విజిట్ చేసి, బుక్స్ పిల్లలకు ఇంట్రడ్యూస్ చేశాడు. సెయింట్ మేరీస్‌లో మటుకు వారు ఇలాంటివి అనుమతించమని చెప్పారు. మధ్యాహ్నం దాదాపు మూడు వందల ఎనభై కాపీలు అమ్మాడు.
అలా మూడు రోజులకు ఒక రూటు కవరయింది. మొత్తం ఎనిమిది వందల నలభై కాపీలు సేలయ్యాయి. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సరాసరి రోజుకు మూడు వందల కాపీలకు ఢోకా లేదు. కర్నూల్లో ఒక మీడియం సైజు క్యాష్ బ్యాగ్ కొన్నారు.
రెండో రూటు ఉస్మాన్ వెళ్లాడు. నందికొట్కూరు, గడివేముల మిడుతూరు ఒకరోజు, రెండవ రోజు ఆత్మకూరు, వెలుగోడు, నైట్ స్టే అక్కరలేదు. రెండ్రోజుల్లో ఉస్మాన్ ఐదువందల అరవై కాపీలు అమ్మగలిగాడు.
తరువాత రూటుకు మునిని పంపారు. అలంపూరు, గద్వాల, ఐజ, మునగాల, మానపాడు, ఇటిక్యాల ఇలా మూడు రోజులు తిరిగాడు. ఏ వూరుకు ముందు, ఇంట్రడక్షన్, సేల్స్ ఒక రూటు మ్యాపు ముందుగానే రూపొందించుకున్నాడు. ముని అమ్మకాలు మూడు రోజులకు ఐదు వందలు దాటలేదు. ముని మాటకారి కాదు. చాకచక్యం తక్కువ. చొరవగా దూసుకుని పోయే స్వభావం కాదు. పతంజలి ఏమీ అనలేదు కాని, ఉస్మాన్ కొంచెం ఎగతాళి చేశాడు మునిని. ముని తానీ పని చేయలేనని ఇన్‌స్టిట్యూట్, షాపు చూసుకుంటానని అన్నాడు.
నాలుగు రోజులు కర్నూల్లో ఉన్న స్కూళ్లు కవర్ చేశాడు పతంజలి. మున్సిపల్ స్కూళ్లే నాలుగున్నాయి. కంట్రోల్ రూం దగ్గరున్న స్కూలు చాలా పెద్దది. దాదాపు రెండు వేలమంది పిల్లులున్నారు. ఆ ఒక్క స్కూల్లోనే ఎనిమిది వందల కాపీలు పోయాయి. దేవసహాయంసారు పని చేస్తున్న స్కూల్లో ఆయన పిల్లలకు స్వయంగా చెప్పి దాదాపు మూడు వందల కాపీలు కొనిపించారు. జి. పుల్లారెడ్డిగారి ఎయిడెడ్ స్కూల్లో రెండు వందలు, చిన్మయా మిషన్ హైస్కూల్లో మూడు వందలు, ఉర్దూ స్కూల్లో కూడా గ్రామర్ కాపీలు వంద పోయినాయి. మాంటిసోరి వాళ్లు అనుమతించలేదు. సెయింట్ జోసెఫ్స్‌లో రెండు వందలు. జిల్లా కేంద్రం జిల్లా కేంద్రమే అనిపించుకుంది. మొత్తం కర్నూలు సేల్స్ పదిహేడు వందలు మున్సిపల్ పరిధిలోని కల్లూరు. సి.క్యాంపు స్కూళ్లు కూడ కవర్ చేశారు.
డిసెంబర్ మూడవ వారంలో హైదరాబాదు నుండి గ్రీటింగ్ కార్డుల హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటరు ఏజంట్ వచ్చాడు. జనవరి ఫస్టు వరకు న్యూయియర్ గ్రీటింగ్స్‌కు మంచి డిమాండ్ ఉంటుందని. తాము ‘సెల్ అండ్ పే’ అంటే అమ్మిన తర్వాత డబ్బు చెల్లించే విధానం మీద కార్డులిస్తామనీ, రూపాయి నుండి ముఫై రూపాయల రేంజ్ వరకు ఉంటాయనీ, జనవరి రెండో తేదీన వచ్చి, మిగిలిన కార్డులు తీసుకొని, అమ్మిన కార్డులకు డబ్బు కలెక్ట్ చేసుకుంటామనీ చెప్పాడు. కార్డుల అమ్మకంపై నలభై శాతం కమీషన్ ఇస్తామని చెప్పాడు. ఒక వెయ్యి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలనీ, అది కూడ జనవరి రెండున తిరిగి యిచ్చేస్తామన్నాడు.
పదివేల రూపాయల విలువగల గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొడానికి నిర్ణయించుకొని వెయ్యి రూపాయలు డిపాజిట్ కట్టారు. రూపాయినుండి పది రూపాయలలోపువే సింహ భాగం ఆర్డరిచ్చారు. క్రిస్‌మస్ పండుగకు నాలుగు రోజులకు ముందే గ్రీటింగ్స్ కార్డ్సు, వాటిని పెట్టుకోవడానికి లేతరంగుల కవర్లు వచ్చేశాయి. షాపు ముందు భాగంలో గోడలకు పురికొసలు కట్టి, కార్డులు డిస్‌ప్లే చేశారు. న్యూయియర్‌కు నాలుగు రోజుల ముందు సప్లయర్స్ నుండి బెంచీలు తెప్పించి కార్డులు వాటిమీద పరుస్తారట. ఆ నాలుగు రోజులూ షాపు ముందు భాగాన్ని చిన్న చిన్న సీరియల్ బల్బుల సరాలతో అలంకరించాలి.
శివ ఒక్కడే మేనేజ్ చేయలేకపోతున్నాడని అతనికి ఒక అసిస్టెంట్‌ను నియమించారు. వాడెవరో కాదు. మస్తానమ్మ కొడుకు ‘దిలావర్’. వాడు ఎనిమిదో తరగతిలో ఆపేశాడు. కొన్నాళ్లు బస్టాండు దగ్గర వల్లెలాంబా బుక్ సెంటర్లో పని చేసి మానేశాడట. వాడు చాలా చురుకైనవాడు. శివకు వాడు కుడిభుజమయ్యాడు. వాడికి నెలకు రెండువందల జీతం.
ఈలోగా ఉస్మాన్ చిన్న టేకూరు, ఉలిందకొండ, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి వరకు రెండు రోజులు బుక్స్ అమ్మాడు. ఏడు వందలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి.
పతంజలి చదువు నత్తనడక నడుస్తూంది. కానీ వచ్చే నవంబరులో పరీక్షలు కదా చాలా టైముందనే ధీమాలో ఉన్నాడు. మూడు రోజులు నన్నూరు, పుల్లగుమ్మి, కలుగొట్ల, పాణ్యం, నంద్యాల టౌన్ కవరు చేశాడు పతంజలి. ఒక నంద్యాలలోనే ఏడు స్కూళ్లున్నాయి. పదిహేను వందల కాపీలు అమ్మాడు. ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకే పిల్లలు దొరుకుతారు. తర్వాత ఫ్రీఫైనల్ పరీక్షలు, ప్రిపరేషన్ హాలిడేస్ వస్తాయి. ఒక కర్నూలు జిల్లాలోనే దాదాపు ఐదువేల కాపీలు అమ్మినట్లే. అంటే జనవరి మొదటి వారంలో స్టాకంతా క్లియరవుతుంది. జనవరి, ఫిబ్రవరి సగం, ఉన్నాయి. మూడు టైటిల్స్‌కూ మూడయిదులు పదిహేను వేల కాపీలకు ఆర్డరిస్తే జనవరి రెండో తేదికి అందేలా వస్తాయి. ఒక వారం రోజులు సంక్రాంతి సెలవులు వస్తాయి. తర్వాత గట్టిగా నెల రోజులే మార్కెట్ ఉంటుంది. అందరూ చర్చించుకొని లెనిన్‌గారికి ఫోన్ చేసి, పదిహేనువేల కాపీలకు స్ట్రయికింగ్ ఆర్డరిచ్చారు. ఆయన యిచ్చిన అకౌంట్ నంబరుకు పదివేల రూపాయలు మెయిల్ ట్రాన్స్‌ఫర్ (యంటి) చేశారు.
పుస్తకాలు స్కూళ్లకు తీసుకొని వెళ్లి అమ్మడానికి ఒక పుల్ టైం సేల్స్‌మన్ ఉంటే బాగుంటుందనిపించింది. ‘ఈనాడు’లో టౌన్ ఎడిషన్‌లో ఒక చిన్న ప్రకటనయిచ్చారు. మరుసటి రోజు ఆ ప్రకటనకు స్పందించి ఆరుమంది వచ్చి కలిశారు. వారిలో ఇద్దర్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకతని పేరు యాగంటయ్య. డిగ్రీ హోల్డరు. ఇంకొకతనిపేరు బషీర్, ఇంటర్మీడియట్ పాసయ్యాడు.
“నెల జీతాలేమీ ఉండవు. ఒక వెయ్యి కాపీలు ఇస్తాము. రూట్ మ్యాప్ ఇస్తాము. ఏ స్కూళ్లకు వెళ్లాలో కూడ చెబుతాము. మన రాయలసీమ నాలుగు జిల్లాలు కవర్ చేయాలి. 5% కమీషన్ యిస్తాము” అని స్పష్టం చేశారు. మూడు టైటిల్స్ వారికి చూపించి, పిల్లలకు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో వారికి నేర్పించాడు పతంజలి. హెచ్.ఎం.లతో క్లాసులోని టీచర్లతో ఎలా వ్యవహరించాలో ఆ మెలకువలన్నీ వాళ్లకు చెప్పాడు.
యాగంటయ్యకు గుత్తి, పామిడి, కల్లూరు, గుంతకల్, మద్దికెర, తుగ్గలి, పత్తికొండ కవర్ చేయమన్నారు. బషీర్‌కు బనగానిపల్లె, బేతంచెర్ల, కోవెలకుంట్ల, నొస్సం, సంజామల, రూట్ ఇచ్చారు.
నాలుగు రోజుల్లో ఒక్కొక్కరు వెయ్యి కాపీలు, అమ్ముకొని వచ్చారు. వెంటనే వారి కమీషన్ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేసి, వారినభినందించి, వేరే రూట్లకు పంపారు.
సరిగ్గా వారం రోజులకు లెనిన్‌గారి నుండి ఫోన్ వచ్చింది పుస్తకాల ముద్రణ బైండింగ్ పూర్తయ్యాయనీ ‘క్రాంతి’ ట్రాన్స్‌పోర్టులో బుక్ చేసి, ‘టుపే’ చేశామనీ. అక్కడ విడిపించుకోమనీ చెప్పాడాయన. ఎల్‌ఆర్‌లు రిజిస్టర్ పోస్టులో పంపాడు. రెండు రోజుల తర్వాత పుస్తకాలు లారీ ఆఫీసు నుండి తెచ్చుకున్నారు. బ్యాలెన్సు అమౌంట్ లెనిన్ గారికి యం.టి. ద్వారా పంపారు.
క్రిస్‌మస్ వచ్చి వెళ్లిపోయింది. గ్రీటింగ్ కార్డుల బిజినెస్ బాగా జరుగుతూంది. షాపంతా సీరియల్ లైట్లతో అలంకరించారు. జనవరి రెండు కల్లా 90% కార్డులు అమ్మేశారు. కేవలం వారం రోజుల్లో మూడు వేల ఐదువందలకు పైగానే కమీషన్ వచ్చింది.
సేల్స్‌మెన్ చురుకుగ్గా పని చేస్తున్నారు. రెండవ ముద్రణ పుస్తకాలు కూడా అమ్మకం ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లాకు ఆనుకునే ఉంటుంది. గిద్దలూరు, కంభం, మార్కాపురం ప్రాంతానికి కూడ బుక్స్ వెళ్లాయి. అటు కదిరి, మదనపల్లె, ధర్మవరం, అనంతపురం, తాడిపత్రి, యాడికి, బుక్కరాయ సముద్రం. ఇటు పెనుగొండ, హిందూపురం, లేపాక్షి, కొడికొండ, గోరంట్ల, వజ్రకరూరు, ఉరవకొండ ప్రాంతాలకూ, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి, కాళహస్తి, నగరి, చిత్తూరు, పలమనేరు, సత్యవేడు, వాయల్పాడు, వరకూ సక్సెస్ పబ్లికేషన్లు వెళ్లాయి. జనవరి రెండవ వారంలో సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యేసరికి దాదాపు ఆరు వేల కాపీలు అమ్ముడుపోయాయి. “ఉచిత పెన్ను పథకం” బాగా క్లిక్ అయినట్లే. పుస్తకాలతో పాటు చిన్నా పెన్నులు కూడా పంపాడు. పతంజలి, ఉస్మాన్ కూడ రెండు రూట్లలో వెళ్లొచ్చారు.
బుక్ షాపు బాగా జరుగుతూంది. రోజు వెయ్యి, పన్నెండువందల వరకు అమ్మకాలున్నాయి. పెట్టుబడి ఇంకా పెంచాలని నిర్ణయించారు.
సంక్రాంతికి వారంరోజులు ట్యుటోరియల్స్‌కు సెలవిచ్చారు. మొత్తం కుటుంబానికంతా సంక్రాంతికి బట్టలు తీశాడు పతంజలి. బావకు వెయ్యి రూపాయలు పంపాడు. సంక్రాంతికి అందర్నీ రమ్మని ఫోన్ చేశాడు. అమ్మకు ‘ధర్మవరం సిల్క్స్’లో ఎనిమిదివందలు పెట్టి పట్టు చీర, మహితకు పట్టు లంగా, జాకెట్టు, పైట, తమ్ముళ్లకు మంచి బట్టలు తీసుకున్నాడు. దిలావర్‌కు, శివకు, యాగంటయ్యకు, బషీర్‌కు కూడ బట్టలు తీసుకున్నాడు. నాన్నకు కూడ మంచి ధోవతి, జుబ్బా కొన్నాడు.
రాధాసారు అప్పు తీర్చేశారు. బుక్ షాపులోను తొలి ఇన్‌స్టాల్‌మెంట్ కట్టేశారు. నెలకు రెండు వేలు కట్టడం పెద్ద కష్టమేమీ కాదనిపించింది.
పండక్కు హైదరాబాదునుండి అక్కయ్య వాళ్లు వచ్చారు. శ్రీశైలం నుండి మల్లినాధ వచ్చాడు. బాగా పొడుగయ్యాడు. మరో ఏడెనిమిది నెలల్లో వాడి చదువు అయిపోతుంది. వచ్చే సంవత్సరం చిన్నోడు టెంత్ కొస్తాడు. మహిత ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ మార్చిలోనే.
సంక్రాంతి చాలా బాగా జరిగింది. గణపతిని ఇంటికి పిల్చుకొని వచ్చారు. వర్ధనమ్మకు చేతినిండా పని. బుక్ షాపు మాత్రం మూయలేదు. ఆ మూడు రోజులూ ఉస్మాన్ చూసుకుంటానన్నాడు. పతంజలి చదువును మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. మార్చికల్లా ట్యుటోరియల్స్‌లో సిలబస్‌లు అయిపోతాయి, టైటిల్స్ అమ్మకం కూడ పూర్తవుతుంది. మళ్లీ జూన్లో రీ-ఓపెనింగ్ వరకు బాగా చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు.
సంక్రాంతి సెలవుల తర్వాత మళ్లీ హడావుడి ప్రారంభమైంది. క్లాసులు ముమ్మరంగా జరుగసాగాయి. ఇద్దరు సేల్స్‌మెన్ కోస్తా జిల్లాల్లో తిరుగుతున్నారు. పతంజలి, ఉస్మాన్ రెండు మూడు విడతలు తెలంగాణాలోని మహబూబ్‌నగర్, జడ్‌చర్ల, షాద్‌నగర్, ప్రాంతాలకు వెళ్లారు. పతంజలి రెండు వేల కాపీలు తీసుకొని హైద్రాబాద్, సికింద్రాబాద్‌లోని స్కూళ్లు తిరాగాడు. అక్కయ్య వాళ్లింట్లో బస. కానీ సిటీలో అంత రెస్పాన్సు రాలేదు. నాలుగు రోజులు తిరిగి, ఒక ఎనిమిది వందల కాపీలు అమ్మగలిగాడు.
మొత్తానికి ఫిబ్రవరి రెండో వారానికి మొత్తం కాపీలు అమ్ముడుపోయాయి. ఇరవై నాలుగు వేల కాపీలకు ఖర్చులు, కమీషన్, పెన్స్ కాస్ట్ పోను అరవై వేలకు పైగా లాభం వచ్చినట్లే. మార్చి మొదటివారంలో లెక్కలు తేల్చుకొని, ఎవరి భాగం వాళ్లు తీసుకున్నారు.
మార్చిలో మహిత పరీక్షలు ప్రారంభమయ్యాయి. సెయింట్ జోసఫ్స్ (గర్ల్స్) సెంటరు ఇచ్చారు. ఇన్‌స్టిట్యూట్‌లో ఆడపిల్లకు సౌకర్యంగా ఉండదని రాధాసారింట్లో మహితనుంచాడు పతంజలి. వాళ్లింట్లోనే భోజనం. అమ్మనాన్నలు కూడ ‘రికన్‌సైల్’ అవక తప్పలేదు. రోజూ మహితను సెంటరు దగ్గర దిగబెట్టి, పరీక్ష అయింతర్వాత రాధాసారింట్లో విడిచిపెట్టి వస్తున్నాడు. పరీక్షలు బాగా రాసింది బంగారమ్మ. రాధాసారు, ఆయన భార్య, మహితను చాలా బాగా చూసుకున్నారు. ఆ పది రోజులూ నాన్ వెజ్ వండుకోలేదు.
“ఒక్క మడి కట్టుకోవడం తప్పించి, శుచీశుభ్రత విషయంలో వాళ్లు మనకేమీ తీసిపోరన్నయ్యా” అంది చిట్టి చెల్లెలు. రోజూ పరీక్ష అయింతర్వాత రిక్షాలో వచ్చేటప్పుడు చెరుకు రసం తాగాల్సిందే. అంతిష్టం చెరుకురసమంటే. “రిక్షా అతనికి కూడ తాగిద్దామన్నయ్యా. పాపం ఎండలో మనల్నిద్దర్ని కూర్చోబెట్టి తొక్కుతున్నాడు” అంటుంది బంగారుతల్లి. చెల్లిలి మంచితనం అన్నయ్యకు ముచ్చటగా ఉంటుంది.
మార్చి మూడవ వారం నుండి పతంజలికి తీరుబాటు దొరికింది. హైస్కూలు, కాలేజీ పిల్లలకు సమ్మర్‌లో స్పెషల్ గ్రామర్ క్లాసులు ప్రారంభించారు. రెగ్యులర్ స్పోకెన్ ఇంగ్లీషు కోర్సు కాక అదొక క్లాసు మాత్రమే. షాపు కూడ అన్‌సీజన్. జూన్ నెలాఖరు వరకు చదువు బ్రహ్మాండంగా సాగింది. జూన్ రెండవ వారం నుండి బుక్ షాపుకు కావలసిన బుక్స్, స్టేషనరీ విజయవాడ నుండి తెప్పించారు. దాదాపు ముఫ్పై వేల రూపాయల విలువగల స్టాక్స్ వచ్చాయి. జూన్ నుండి బుక్ షాపు సీజను ప్రారంభం అవుతుంది.
(సశేషం)