జ్ఞాపకాల తరంగిణి-61

0
3

ఆర్ట్ సినిమాలతో మా ప్రయాణం

[dropcap]బా[/dropcap]ల్యంలో అమ్మ వెంట నెల్లూరు మణి టాకీస్‍లో ‘సంసారం’ సినిమా చూచి రావడం గుర్తుంది. సినిమా అంటే ఒంటెద్దు బండి లోనో, జట్కా బండి లోనో ఆడవాళ్ళు, పిల్లలం అందరం ఇరుక్కుని కూర్చుని వెళ్లేవాళ్లం. మణి టాకీసుకు మా పొగతోట నుంచి దాదాపు గంట ప్రయాణం ఒంటెద్దు బండిలో అయితే. మణి టాకీసే అప్పటికి నెల్లూరులో వచ్చిన కొత్త సినిమా హాలు. మాకు ఊహ తెలిసేటప్పటికి మా ఊళ్లో కొత్త హాలు, వినాయక సినిమా అనే రెండు సినిమా హాళ్ళుండేవి.

1950కి శేష్ మహల్, రంగమహల్ అనే ఆధునిక సినిమా హాళ్ళు, కాస్త విలాసవంతమైన సినిమా హాళ్ళు వచ్చాయి.

1954 వేసవికాలంలో కాబోలు నెల్లూరు వెంకటేశ్వర సినిమా హాల్లో ‘రోజులు మారాయి’ విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ వేసవిలో మ్యాటిని చూచి వెలుపలికి వచ్చి చమటచొక్కాలు విప్పి పిండుకోవలసి వచ్చింది. ఆంధ్ర దేశంలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించి సుందరయ్య గారి నాయకత్వంలో మత్రివర్గాన్ని నెలకొల్పుతుందనే అభిప్రాయంతో ఆ సినిమా సుందరయ్య మంత్రివర్గానికి అంకితం చేసినట్లు సినిమా ఆరంభంలో వేశారట కూడా. పార్టీ ఘోరంగా అపజయం పాలవడంతో దాన్ని తొలగింఛినట్లు తర్వాత విన్నాము.

నెల్లూరులో వి.ఆర్. కళాశాలకు ఫర్లాంగు దూరంలో నెల్లూరు తొలి సినిమా హాలు ‘కృష్ణ’ సినిమా హాలు ఉండేదట. లీలామహల్ ఎదురుగా, ఇప్పుడు టెలిగ్రాఫ్ ఆఫీసు వుండే ప్రదేశంలో మెక్లిన్సు క్లబ్ ద్వారం పక్కన పూర్వం కృష్ణా సినిమా హాల్ వుండేది. ఇదే తొలి సినిమా హాలు ఈ వూళ్ళో. రాంప్యారి అనే బొంబాయి సినిమా నటి వారం రోజులు ఈ హాల్లో నృత్య ప్రదర్శన లిచ్చింది. వూళ్ళో పెద్దలు, వర్తకులు, వకీళ్ళు తిలకించి తరించారట! 800/- రూపాయలు ఆమెకు ముట్టాయట. నా చిన్నతనంలో కూలిన హాలు గోడలు చూచా. మా తల్లిగారు అందులో 1930 ప్రాంతాల్లో మూగ సినిమాలు చూచినట్లు చెప్పారు. నేను హైస్కూలు చదివే రోజుల్లో ఆ స్థలంలో కూలిపోయిన భవనాల తాలూకు గోడలు మాత్రం కనిపించేవి. కొందరు మిత్రులు అది టెంట్ సినిమా హాలని అంటారు. ఏమైనా నెల్లూరులో సినిమాలు ప్రదర్శించిన తొలి సినిమా హాలు ‘కృష్ణా సినిమా’నే.

1950 ప్రాంతాల్లో శేష్ మహల్, రంగమహల్ సినిమా హాళ్లలో విజయ, వాహిని వారి సినిమాలు చూచాము. హైస్కూలు చదివే రోజుల్లో నెల్లూరు సినిమా హాళ్లలో గురువారం నుంచి ఆదివారం వరకు ఇంగ్లీషు, హిందీ సినిమాలు మ్యాటినీ షోగా ప్రదర్శించారు. భాష అర్థం కాకపోయినా, ఎన్నో ఇంగ్లీషు, హిందీ సినిమాలు చూచే అవకాశం కలిగింది. అకిరో కురసావా రషోమన్, బై సైకిల్ థీవ్స్ మొదలైన సినిమాలు గొప్ప కళాఖండాలు చూస్తున్నామనే అవగాహన లేకుండానే చూచాము. పన్నెండో ఏట హిందీ పరీక్ష రాష్ట్రభాషకు చదువుతూన్న సమయంలో ‘సికందర్’ హిందీ సినిమా చూచే అవకాశం కలిగింది. సుప్రసిద్ధ హిందీ రచయిత సుదర్శన్ హిందీ నాటకం సికిందర్‍ను 1941లోనే సినిమాగా తీశారట.

ఆ రోజుల్లో సినిమా హాళ్లు చాలా తక్కువ. ఒక్కో సినిమా నెలల తరబడి ఆడేది. నెల్లూరులో రామారావు గారి జయసింహ, పాతాళభైరవి; నాగేశ్వరరావు గారి సువర్ణ సుందరి 30 వారాల పైనే ఆడినట్లు గుర్తు. నెల్లూరు చుట్టుపట్ల పల్లెల వాళ్ళంతా ఎడ్లబండ్ల మీద సినిమాలు చూడడానికి వచ్చేవాళ్ళు. కొంతమంది ధనికులకు సొంత గుర్రబ్బళ్ళు. ఆ రోజుల్లో గుర్రబ్బళ్ళు స్టేటస్ సింబల్.

సినిమా విడుదలకు ముందే పెద్ద సైజు పోస్టర్లున్న బోర్డులు బండిలో పెట్టి ఊరంతా తిప్పేవాళ్ళు, బ్యాండుమేళం వారి వాయిద్యాలతో. సినిమా ఎన్ని రీళ్లో ప్రకటనల్లో ఉండేది. హైస్కూలుకు వచ్చిన తర్వాత కూడా అత్యధికమైన నిడివి వున్న సినిమాను ఎంపిక చేసుకునేవాళ్లం. ఆ రోజుల్లో ఫిల్మ్ బాక్సు ఒక ఊరి నుంచి మరొక ఊరికి తీసుకొని పోయి పల్లెటూరి టెంట్ హాళ్లల్లో వేయించేందుకు కొందరు ఉద్యోగులు, చాలా తక్కువ జీతంలో ఉండేవాళ్లు. నా సహధ్యాయి తండ్రి ఒకరు ఆ పని చేశారు.

నెల్లూరులో ఏ సినిమా ప్రారంభోత్సవానికైనా, ప్రారంభోత్సవ సభలో కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామరెడ్డి గారి పేరుండాల్సిందే. నెల్లూరికి సంబంధించినంత వరకు వారు ఆ రోజుల్లో గొప్ప సినిమా కళాభిజ్ఞులు. సినిమా సమీక్షలు రాసేవారు. శేష్ మహల్, రంగమహల్, విజయ మహల్ అన్ని ప్రారంభోత్సవాలలో ఆయన ఉపన్యసించారు.

మా ఇంటికి మూడిళ్ళ అవతల రైలు కట్ట – దాటితే విజయ మహల్ సినిమా హాలు. ఎస్.ఎస్.ఎల్.సి. చదువుతున్న రోజుల్లో ఈ సినిమా నిర్మాణం మొదలయింది. సోమయాజులనే ఇంజనీర్ పర్యవేక్షణలో ఈ నిర్మాణం రెండేళ్ళపైనే సాగింది. ఆయన పొడవుగా, తెల్లని పేంటుతో, షర్టు, నోటి నిండా తాంబూలంతో కనిపించేవారు. సౌకర్యంగా ఉంటుందని కాబోలు, మా వీధి – కస్తూరిదేవినగర్ చివరి ఇల్లు బాడుగకు తీసుకుని కుటుంబాన్ని తెచ్చుకున్నారు. సినిమా హాలు నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా వారు ఆ ఇంట్లోనే పది పదిహేనేళ్లున్నారు. వారికి ముగ్గురో నలుగురో అమ్మాయిలు. ఒక కాలేజీ చదివే అమ్మాయికి ఏదో పూనకం వచ్చినట్టు పేనా (పెన్) పట్టుకుంటే ఎవరే ప్రశ్న అడిగినా సమాధానం కాగితం మీద రాసిచ్చేది, అంటే తనకు తెలియకుండానే యాంత్రికంగా రాసేదట! తర్వాత ఆమె రాసే పద్ధతికి ‘ఆటో రైటింగ్’ అని నెల్లూరు విజ్ఞులు నామకరణం చేశారనుకోండి! అనేక రకాల సమస్యలతో ప్రజలు సమాధానాల కోసం వాళ్ళ వాకిట్లో వేచి ఉండేవాళ్ళు. పాపం కాలేజీకి వెళ్ళే యువతి ప్రశ్న చెప్పే అమ్మాయి అవతారంలోకి మారింది. అయితే సోమయాజులు కుటుంబం ఆటోరైటింగ్‍ను సంపాదనకు మార్గంగా ఎంచుకోకపోవటం విశేషం.

నేను ప్రీ-యూనివర్సిటీ చదువుతున్న రోజుల్లో నెల్లూరు విజయ మహల్‍ను దేవ్ ఆనంద్ నటించిన హిందీ సినిమా ‘లవ్ మ్యారేజీ’తో ప్రారంభించారు. నేను, నా మిత్రుడు – మరుపూరు కోదండరామరెడ్డి కుమారుడు తరుణేందు శేఖర్ ప్రారంభోత్సవం జరిగిన రోజు మొదటి ఆటకు వెళ్ళాము. ఇంటర్‍వెల్ అయ్యాకా, మా వెనక సీట్లోంచి రెండు చేతులను ఎవరో మా భుజాలపైన వేశారు. వెనక్కి తిరిగి చూస్తే కోదండరామరెడ్డి గారు. బాల్కనీలో కూర్చుని ఉన్న వారు మమ్మల్ని చూచి మా వద్దకు వచ్చి పలకరించి, ఆ సినిమా హాలు ప్రత్యేకతలన్నీ వివరించారు. ప్రారంభ సభలో ఉపన్యసించిన ఆయన మళ్ళీ మొదటి ఆటకు కూడా వచ్చారు. సినిమా తెర పైన శ్రీకృష్ణుడు రథసారథిగా అర్జునుడి రథం ఉబ్బెత్తు శిల్పాన్ని చూపించి, సింబాలిక్‍గా ఆ శిల్పాన్ని పెట్టినట్టు వివరించారు.

కోదండరామరెడ్డి గారికి సినిమాలంటే చాలా ఇష్టం, పిచ్చి. శేష్ మహల్, రంగమహల్‍లో వేసే ఇంగ్లీషు సినిమాలకు కుమారుడిని వెంట పెట్టుకుని వెళ్ళి, ఆ సినిమాలలోని కళా విశేషాలను వివరించేవారు. ఆ విధంగా మా మిత్రుడు తరుణేందు శేఖర్‍కు హాలీవుడ్ సినిమాలతో పరిచయం కలిగింది.

బాల్యం నుంచీ హిందీ సినిమాలు చూడడం నాకు అలవాటయింది. హిందీ చదువుకోడం వల్ల హిందీ సినిమాలు తేలిగ్గా అర్థమయ్యేవి. ప్రీ-యూనివర్సిటీ తరగతి చదువుతున్న సమయంలో నెల్లూరు శేష్ మహల్‌లో సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ సినిమా మ్యాటనీగా వేశారు. సినిమా మొదలవగానే తెర ముందు మైక్ పట్టుకుని ఒకరు తెర మీద జరుగుతున్న సంఘటనలను తెలుగులో వివరిస్తున్నారు. కాసేపటికల్లా జనం పెద్దగా కేకలు వేసి అతణ్ణి వెళ్ళమన్నారు. మూగ సినిమాలకు ‘వ్యాఖ్యాత’ ఉండేవాడని విన్నాము గాని, పరభాషా చిత్రాలకు interpreter ను చూడడం మొదటిసారి. మూగ సినిమా అని పేరే గాని, తెర ముందు రకరకాల వాయిద్యాలతో, ఒక బృందం కూర్చుని సందర్భానుసారంగా సంగీతం వినిపించేది. ఏదో ద్వని, చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా సినిమా చూడలేము.

1895లో ఫ్రాన్స్ దేశంలో ‘ల్యూమియర్ బ్రదర్స్’ 5, 10 నిమిషాల నిడివి మూగ చిత్రాలను తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘రైలు స్టేషన్‍లోకి రావడం’ దృశ్యాన్ని మూగ సినిమాగా మొదటిసారి ప్రదర్శించినపుడు ప్రేక్షకులు భయంతో లేచి పరుగులు తీశారట! ఆ మరుసటేడే మన దేశంలోనూ మూగ సినిమాల ప్రయత్నం జరిగింది. అమెరికాలో D.W. గ్రిఫిత్ పూర్తి నిడివి సినిమా విడుదల చేసిన మరు సంవత్సరమే దాదా సాహెబ్ ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ మూగ సినిమా, పూర్తి కథాచిత్రం తయారు చేశారు. ఆ కాపీ మనం పోగొట్టుకున్నాం గాని, క్యూబాలో కాబోలు లభించింది. పూనాలో నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్‌కు వెళ్లినప్పుడు ఇందులో కొన్ని భాగాలు చూచే అవకాశం కలిగింది. చారిత్రక దృష్టి లేక మన సినిమాలను మనం భద్రపరుచుకోలేకపోయాము గాని, విదేశాలలోని ఫిల్మ్ ఆర్కైవ్‌లు జాగ్రత్త చేశాయి. 1980 ప్రాంతాల్లో స్వర్గీయ పి.కె. నాయర్ పూనా నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ క్యూరేటర్‍గా ఉన్న కాలంలో మన సినిమా వారసత్వాన్ని, సినిమా రీళ్ళను, పాటల పుస్తకాలు, వాల్ పోస్టర్లు వంటి వన్నీ సేకరించి భద్రపరిచే కార్యక్రమాన్ని జయప్రదంగా కొనసాగించారు.

మా కళ్ళ ముందే సినిమా కళలో, పరిశ్రమలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. వర్ణ చిత్రాలు, సినిమా స్కోపు చిత్రాలు, 70 mm చిత్రాలు ఇట్లా సాంకేతిక ఆవిష్కరణలతో సినిమా రూపమే మారిపోయింది. సినిమా అభిమానిగా ఈ మార్పులన్నీ గమనించాను. నెల్లూరులో కళాశాల అధ్యాపకుడిగా నేను, నా మిత్రుడు తరుణేందు శేఖర్ బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడ్డాక, మా సినిమా అభిరుచిని కొనసాగించాము. మంచి సినిమాలు మద్రాసు వెళ్ళి చూచి వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లోనే మా నెల్లూరు కవి పఠాభి – తిక్కవరపు రామిరెడ్డి గారి కుమారుడు – పఠాభి రామరెడ్డి – యు.ఆర్. అనంతమూర్తి కన్నడ నవల ‘సంస్కార’ను 30 రోజుల్లో అదే పేరుతో సినిమాగా తీశారు గాని సెన్సారు చిక్కుల్లో పడి, 1970లో నిషేధానికి గురై, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 1971లో విడుదలై భారత ప్రభుత్వం అత్యుత్తమ పురస్కారం స్వర్ణపతకం పొందింది. లొకార్గొ (జెక్ రిపబ్లిక్) ఫిల్మ్ ఫెస్టివల్‍లో కూడా పురస్కారం పొందింది. 1973లో మేము నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం తరఫున పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’ కవితలను పునర్ముద్రించాము. పఠాభి సినిమా మీద పత్రికలు విశేషంగా రాసినా, ఆ సినిమాను చూచే అవకాశం మా నెల్లూరీయులకు లభించలేదు. ఈ నిరాశ, వేదనలోంచే కొందరు మిత్రులం ఫిల్మ్ సొసైటీ ప్రారంభించాలనుకొన్నాము. అప్పటికే మద్రాసు, విజయవాడ, హైదరాబాదు వంటి నగరాల్లో ఫిల్మ్ సొసైటీలు పని చేస్తున్నాయి. నెల్లూరు ఫిల్మ్ సొసైటీ పేరుతో ప్రారంభించాలని అనుకొన్నా, ఆ రోజుల్లో progress అనే మాట లేకుండా ఏ సంఘం ఉండేది కాదు, Progressive Union Library, అభ్యుదయ వేదిక వంటి పేర్లతో. కనక అందరి ఆమోదంతో Progressive Film Association పేరు స్థిరపరిచి రిజిస్టరు చేయించాము గాని ప్రజలలో Profilm అనే పేరే స్థిరపడింది. ఆరంభం నుంచి ఆధ్యాపక ఎం.ఎల్.సి. సింగరాజు రామకృష్ణయ్య కుమారుడు రాజేంద్ర ప్రసాద్, తరుణేందు శేఖర్, డాక్టర్ సి.పి.శాస్త్రి, వి.ఆర్. కాలేజీ గణిత అధ్యాపకులు సి. సంజీవరావు, రసాయనశాస్త్ర అధ్యాపకులు ఎం. పట్టాభిరామిరెడ్డి మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహించారు.

1974 జనవరి 4వ తారీఖు ఉదయం పది గంటలకు ఆ రోజుల్లో అత్యంత అధునాతమైన శ్రీరామ ఎ.సి.హాల్లో ఆహూతుల ముందు తొలి ప్రదర్శన, ఆహ్వానితులతో హాలు నిండిపోయింది.

పఠాభి ఉచితంగా ప్రింట్ పంపించారు. పఠాభి సోదరీమణులు, బంధువులు, బెజవాడ గోపాలరెడ్డి దంపతులు వంటి ప్రముఖులంతా తరలి వచ్చారు. సినిమా కథ, ఇతర వివరాలు సంగ్రహంగా ఆహ్వానంలోనే ముద్రించాము. Sub titles ఉన్నాయి కనుక ప్రేక్షకులు హాయిగా సినిమా చూడగలిగారు. ఆ విధంగా మా ఫిల్మ్ సొసైటీ Profilm ప్రస్థానం పదేళ్లు నిరాఘాటంగా కొనసాగి, నెల్లూరీయులలో సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించిందని పెద్దల మెప్పు పొందగలిగాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here