శ్మశానము

    0
    3

    [box type=’note’ fontsize=’16’] కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ విరచిత కాశ్మీర రాజ వంశ చారిత్రాత్మక నవలలలో నాల్గవ నవల “సంజీవకరణి”లోని చిన్న అంశం ఆధారంగా శ్రీ కాంత గుమ్ములూరి అందిస్తున్న ప్రయోగాత్మక కవిత “శ్మశానం“. [/box]

    శవములు దహింపబడు స్థలము
    మృతదేహములు ఖననమగు భూ ఖండము
    విలక్షణమై అలజడి కలిగించు ప్రదేశము
    కొన్నిచోట్ల బూడిద ప్రోవులు
    కొన్ని చోట్ల సమాధులు
    మరి కొన్ని చోట్ల పాతిపెట్ట బడిన
    పసి శవాల చీల్చి భక్షించు నక్కలు
    కండ్లను దుమ్మెత్తి పోయు విపరీతపు గాలులు
    ఆరిపోని కాష్ఠము దూరమున కెగసి పడు నిప్పు రవ్వలు
    అతి శీతల కాలమందు అల్పాల్పములైన జ్వాలలు
    గాలిలోని హిమ బిందువులు ఘనీభవించి గుచ్చు హిమశిలలు
    అంధకార సమాచ్చాదితములై పీడను కల్గించు మూలలు
    చిమ్మ చీకట్లలో భయోత్పాదిత జగములు
    మనసు చెదరిన కనగలరు భూత ప్రేత పిశాచములు
    మనసు చెదరక కనలేరు వాయుమయ తేజోమయ శరీరములు.

    మనసు చెదరుట యన నేమి? ఉన్న చోటునుండి కదలుట.
    మనసున్న చోటేది? తెరచిన కన్నుల వెంట.
    కన్నుల పని యెట్టిదన పంచభూతాత్మక మైన సృష్టిని చూచుట.
    చూడగల వస్తువులు పృథివీ పదార్థ బహుళములై ఉండుట.
    మరి కన్నులు చెదరుట జరుగుట ఎవ్విధమట?
    మనసు చెదిరిన కనులు చెదరుట జరుగునట.
    జరుగునా శరీరాంగమునకు తన స్థానము నుండి బెసఁగుట?
    తన నిజ స్థానమును వీడి జరుగుట కాదు బెసఁగుట
    పృథివీమయ శరీరాధికములను చూచుట యందే
    పొదగ బడి యున్న మనసు తన స్థానమునుండి తొలగుట.
    అతి సహజము నేత్రేంద్రియము ద్వారా పనిచేయు మనసు
    కనుల యందే లగ్నమై యుండుట.
    అట్టి మనస్థితి చెదరిన పొందగలరు భూతములను చూచుట.
    సంభవమా కదలిన మనస్సుకు ఈ కన్నుల ద్వారా చూచుట?
    కన్నులు నిమిత్త మాత్రములు నిజమునకు మనస్సే ప్రపంచమును చూచుట.
    దాని ఇష్టమును బట్టి దాని ఇష్టము వచ్చిన దానిని చూచుట
    చూచినది ఒకటి చూడబడినది మరొకటి కాదు
    చూడవలయునన్న కోర్కె మేరకే చూచుట సంభవించుట.
    ఆ కోరిక భౌమములను దివ్యములను కూడ దాటిన యొక చోట నిల్చునట.

    మనసు దేనియందు లగ్నమగునో మనిషి కనుల కదియే కనిపించును.
    కొన్ని సామాన్యములు మరికొన్ని అధిక విషయములు
    ప్రతి వ్యక్తికీ అభీష్టముగా యుండును.
    మనసు లగ్నమగుట యన్నది వాని యందు లగించును
    కంటిని హఠాత్తుగా లాగును.
    ఒక దారి వెంట పోవు వ్యక్తికి దారి వెంట నుండు బహు విషయములు
    దృష్టి పరామర్శకు రావు నిత్యదృశ్యమాన విషయములును
    తన కెదురుగ సర్పము వచ్చిన, తప్పక కంటికి తగులును.
    సర్పము మనుజులకు ప్రాణాపద కల్గించును
    ప్రాణ భయము అత్యధికము మనసు పరాధీన యైనను.
    బహు జన భరితమైన సభలో తన పుత్రుని తప్పక గాంచును.
    కొడుకు కాని, గురువు కాని, పరమ మిత్రుడైన గాని
    వారి యందు వీని మనసు నిత్య జాగ్రత్తగా నుండును.
    ఏ వస్తువు నందు, ఏ విషయము నందు అధిక పరిచయము చేత
    సహజ పరిచయము చేత మానవుని మనస్సు శ్రద్ధను పెంచునో,
    ఆ విషయము వానికి తప్పక కనిపించును.

    అతి భయానకము, ఆత్మగ్లాని కలిగించు స్థలము – శ్మశానము.
    అంధకార మయము, భూత ప్రేత పిశాచాదుల కాలవాలము.
    చూడవలయునను కోరిక తోడగు నమ్మిన మనసుకు
    కనులు చెదరు, మనసు బెసఁగు కనబడి తీరును – భూతము!!

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here