అత్తగారు.. అమెరికా యాత్ర… 8

0
3

జెట్‌లాగ్ తిప్పలు…  తిరుగుళ్లు

మర్నాడు…  ఉదయం స్నానం కాగానే…  దేవుని పూజా కార్యక్రమం అత్తయ్య గారికి అప్పచెప్పాను. దీపారాధన, దేవుని పటాలకు పూవులు అలంకరణ, అష్టోత్తరాలు, స్తోత్రములతో…  ఆవిడ ఎంతలేదన్నా రెండు గంటలైనా గడుపుతారు. వంట కూడా చేస్తానని అన్నారు కానీ…  ఇంత వెంటనే వద్దులెండి.. నాలుగు రోజులయ్యాక మీకు కాస్త అలవాటు అయాక చేయవచ్చు అని అన్నాను. ఈ కరెంట్ పొయ్యి ఆవిడకి కొత్తగా అనిపించి, ఔను అదీ నిజమే…  అన్నారు.

పూజ అయాక…  లంచ్ టైం దాకా అత్తయ్య గారికి…  ఇంట్లో వస్తువులు అన్నీ చూపిస్తూ…  డిష్ వాషర్‌లో అంటగిన్నెలు ఎలా శుభ్రపరచాలి అనేది చూపించే సరికి ఆశ్చర్యపోయారు. “ఇప్పుడు ఇండియాలో కూడా ఇవి ఎక్కువగానే వాడుతున్నారట. మొన్న కరోనా టైములో పనిమనుషులు రాకపోయేసరికి సిటీల్లో వుండేవారు ఇంట్లో అంట్లమిషన్లు కొనుక్కున్నారని మన పావని చెప్పింది. తన కూతురు కొనుక్కుందట. అది చెపితే ఎలా వుంటుందో అనుకున్నా. ఇదే అన్నమాట.” అన్నారు.

“ఔను అత్తయ్యా! ఈ దేశంలో పనిమనుషులు ఉండరు. ఉన్నా కూడా ఎప్పుడైనా ఇల్లు శుభ్రం కోసమో, కార్పెట్ క్లీనింగ్ కోసమో, గార్డెన్ క్లీనింగ్ కోసమో పిలుస్తాము. ఛార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ వారీ పని ఇదిగో ఇలా మిషన్లు సాయంతో ఎవరికి వారే చేసుకోవాలి. మాకు మేమే పనిమనుషులం.” అన్నాను.

“ఇదీ ఒక రకంగా మంచిదేలే! మా ఊళ్ళో లాగా…  పనిమనిషి కోసం ఎదురుచూపులు చూడక్కర్లేదు. ఒక్కోసారి చెప్పాపెట్టకుండా ఎగనామం పెడతారు. వచ్చేది ,రానిది ముందుగా చెప్పరు. తీరా రాకపోతే చచ్చినట్టు అప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుంది. పైగా ఎంత ఇచ్చినా సంతృప్తి అనేది వుండదు వాళ్ళకి. ఇక్కడ మీకే నయం…  ఎప్పటి పని అప్పుడు అయిపోతుంది.” అన్నారు.

తర్వాత, వాక్యూమ్ క్లీనర్ తోనూ, రూంబా తోనూ ఇల్లు ఎలా తుడిచేదీ చూపించాను. “ఇదేం విచిత్రాలు…  ఇదే మనం తుడుచుకుంటే ఐదు నిమిషాలు కూడా అవదు. ఇది అటూ ఇటూ తిప్పుకుంటూ, ముందుకీ వెనక్కీ తిరిగేసరికి గంట పడుతోంది.” అన్నారు. గదులు తుడవడానికి ఒకరకం, నీళ్ళు చిలకరించుకుంటూ తుడిచేది మరొకటి చూసి, ఒకటే నవ్వడం. “ఇక్కడ అంతా మిషన్లు పనులే ఎక్కువగా ఉన్నట్టున్నాయే” అన్నారు.

తర్వాత బేక్ యార్డు, మొక్కలు చూపించాను. రకరకాల పూవుల మొక్కలు చూసి మురిసిపోయారు. ఓ పక్కన పాలకూర, కొత్తిమీర, పుదీనా మడుల్లో వేసాను అవి చూసి ఆకుకూరలు ఇలా తాజాగా ఉంటే ఎంత బాగుంటుందో. వంకాయలు నవనవలాడుతూ వున్నాయి…  అల్లం పచ్చిమిర్చి వేసి చేస్తే వెన్నలా కరిగిపోయేలా వున్నాయి.. ఇలా ప్రతి మొక్క దగ్గరా ఆగి చూస్తూ మాట్లాడసాగారు. ఆవిడకి మొక్కలంటే మహా పిచ్చి. ఆవిడ పెంచని మొక్క అన్నది లేదు. ఆవిడ చేత్తో ఏ గింజ నాటినా…  చక్కగా పెరిగి తీరుతుంది. పెరట్లో కాసిన కూరలు వీధి మొత్తానికి పంచిపెడతారు. అందుకే ఇక్కడ మా మొక్కలు చూసుకుని తన మొక్కలు గుర్తు చేసుకున్నారు. “పాలేరు వీరయ్యని రోజూ వచ్చి మొక్కలకి నీళ్ళు పోసి,పాదులు,గొప్పులు తీసి,కలుపు పెరిగితే తీయమని చెప్పాను. వస్తున్నాడో, లేదో… ” అంటూ మళ్ళీ తనే,

‘వస్తాడులే, నీళ్లు పోసి అదే చేత్తో కూరలు కూడా కోసుకుని తీసుకెళ్ళమని చెప్పాను. వాటి కోసమైనా వస్తాడులే..’ అనుకున్నారు.

ఇలా కాసేపు ఇల్లంతా తిప్పి చూపిస్తూ కొంత టైము కాలక్షేపం కానిచ్చాను. ఆ తర్వాత భోజనం అయ్యాక నెమ్మదిగా ఆవిడని కారులో బజారుకి తీసుకువెళ్ళాను.

పాపం…  ఆవిడకి కారు సీట్లో బెల్టు పెట్టుకోవడం చాలా ఇబ్బందనిపించింది. కానీ, తప్పదు మరి. పొట్ట పట్టేసినట్టుగా వుంది…  అని విసుక్కుంటూనే పెట్టుకున్నారు. పిల్లలని కూడా కారు సీట్లో బెల్టు పెట్టి కూర్చోబెట్టడం చూసి…  పాపం…  మనకే ఇంత ఇబ్బందిగా వుంటే చిన్న పిల్లలకి ఇంకెంత కష్టమో…  అనుకున్నారు.

“ఏంటీ? అప్పుడే పుట్టిన పసిగుడ్డులని కూడా ఇలా కారు సీట్లో కూర్చోపెట్టి, బెల్టు కట్టేయాలా? ఇదేం చోద్యం? మూడో నెల దాటే దాకా మెడ కూడా నిలబెట్టలేరు. అలాంటిది వాళ్ళనొక్కళ్ళనీ విడిగా కూర్చోపెట్టడమేంటీ?” బుగ్గలు నొక్కుకున్నారు.

“ఇక్కడ రూల్స్ అంతే అత్తయ్యా! అసలు హాస్పిటల్ స్టాఫ్ బయటకి వచ్చి,మన కారులో బేబీ సీటు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసిన తర్వాతనే డిశ్చార్జి చేస్తారు. అయినా సీటు బెల్టు పెట్టాలన్నది మన సేఫ్టీ కోసమే కదా!” అన్నాను.

“అదీ నిజమే! రూల్స్ అనేది పకడ్బందీగా అమలు చేస్తేనే జనాలు మాట వింటారు. మన దేశంలో కూడా ఈ రూల్ గట్టిగా అమలు చేయాలి. కొన్ని సిటీల్లో స్ర్రిక్టుగా వుంది కానీ చిన్న ఊళ్ళలో పట్టించుకోరు. మితి మీరిన వేగం, కారు సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం…  ప్రమాదాలకు కారణమవుతాయి.” అంటూ ఒప్పుకున్నారు.

రోడ్ల మీద వాహనాలు వెళ్ళాల్సిన వేగం…  అక్కడక్కడా ఆయా ప్రాంతాలని బట్టి వేగం పరిధి బోర్డులు రాసి పెట్టి వుండడం…  వాహనాలు నడిపేవారు వాటిని తప్పనిసరిగా పాటించడం నచ్చింది. స్కూళ్లు ఉన్నచోట్లా, గృహ సముదాయాల ప్రాంతాల్లో వేగం బాగా తగ్గించి నడపడం చూసి మెచ్చుకున్నారు అత్తయ్య గారు.

పక్క సందుల్లోకి టర్నింగ్ తిప్పేటపుడు గబుక్కున తిప్పకుండా, కారుని విధిగా కొద్దిగా ఆపి ఆ తర్వాత కొనసాగే పద్ధతి చాలా బాగుంది అన్నారు. ఒకసారి ఇలాగే ఆవిడ గుడికి వెడదామని ఆటో ఎక్కాననీ, ఆ ఆటో డ్రైవర్ ముందు వెనక చూడకుండా పక్క సందుల్లోకి తిప్పేసి ఎదురుగా వచ్చే మరో ఆటోని గుద్దుకున్నట్లు చెప్పారు.

మా అత్తయ్య గారి పరిశీలనా శక్తికి జోహార్లు అనుకున్నాను. ప్రతి చిన్న విషయాన్ని ఆవిడ అబ్జర్వ్ చేయడం…  దాని గురించి అడిగి తెలుసుకుని…  తన అభిప్రాయాన్ని చెప్పడం చాలా బాగుంది. మొదటి రోజే ఆవిడ ఇంత గమనిస్తూ చెపుతోంటో…  ఇక తర్వాత ఇక్కడ పరిసరాలు, పద్ధతులు, వ్యక్తులు ఇలా ఎన్నింటినో ఆవిడ విశ్లేషిస్తారు కదా అనుకున్నాను.

మొత్తం మీద ఈ తిప్పుళ్ళు, ఈ ముచ్చట్లతో ఈరోజుకి మధ్యాహ్నం నిద్ర పోనీయకుండా ఆపగలిగాను అనుకుంటూ కారుని ఇంటి దగ్గర ఆపి, “ఇంటికి వచ్చేసాం. దిగండత్తయ్యా!” అన్నాను. ఆవిడ దగ్గర నుంచి సమాధానం లేదు. చూడబోతే…  కారు సీటు బాగా వెనక్కి వాల్చుకుని, బాగా జారబడి, నోరు తెరుచుకుని మరీ నిద్ర పోతూ కనిపించారు. ఓర్నీ…  అనుకుంటూ…  గట్టిగా కుదిపి లేపి.. ఇంట్లోకి తీసుకువెళ్ళాను.

వచ్చే వారం మిగతా కబుర్లు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here