[dropcap]హై[/dropcap]దరాబాద్ నగరంలో
తొలకరి పలకరింతకు
పులకించిన నేను
రాజధాని నగరం ఢిల్లీకి వచ్చాను
మా మనుమరాలితో ఉండేందుకు
ఐతే
ఇక్కడ వాతావరణం మాత్రం
హైదరాబాద్ కు పూర్తి భిన్నంగా ఉంది
ఉష్ణతాపం ఉక్కపోతతో కలిసింది
దేహం కురిసే వర్షమైంది
భరించలేని ఇక్కడి వేడికి
నేనైతే
కొలిమిలో కాలిన ఇనుమైనాను
పొద్దు పొద్దున్నే
ఓ కొత్త పుస్తకాన్ని తిరిగేస్తున్నా
ఎ.సి గదిలో
ఫ్యాన్ల వింజామరల గాలిలో
మనుమరాలు ‘అమేయ’తో కలిసి
అదో ప్రేమ పూదోటలో
బాల్యం ఆడిన ఆట
పుస్తకం కమ్మలను తిప్పేస్తున్నవి
వేళ్ళు లీలగా
తెల్లని అందమైన పేజీల్లో
సిరా రాతల వరుసలు శూన్యం
అక్షరాలు మొలకెత్తనిదా పొత్తం
ఆశలు బోసినవ్వులుగా విరిసే
ఊసులే వెలుగై మెరిసే
అక్షర మైదానంలో కళాత్మకంగా…
తెరిచిన పుస్తకంలో విప్పారిన
తెల్లని కొత్త కాంతి ప్రకాశించె
శిశువు కనులలో
అంతర్లీన జ్ఞాన బీజం
నేనేమో
మౌనంగా, నిబిడాశ్చర్యంలో
మైదానం రాసిన అక్షరాల మునుముగా
మా మనుమరాలు రువ్వే
నవ్వుల ధృతి అమేయమైన
నా సంతసం తీరం తాకిన కడలి తీరు
కవితాత్మ వెలిగింది
జీవకళగా
సృజన ఎదిగేను నిత్యం
శైశవ గీతంలా
అక్షర మైదానంలో
భూమ్యాకాశాలు శ్వాసించేను
కాలనాళికలో...