ఆధ్యాత్మిక యాత్రానుభవం ‘నమామి దేవి నర్మదే’

0
3

[dropcap]గు[/dropcap]ళ్ళూ గోపురాలు సందర్శించటం, పండుగ రోజులు ఇతర శుభ దినాల్లో నదుల్లో, సముద్రంలో స్నానాలు చేయటం, పూజలు వ్రతాలు నిర్వహించుకోవడం ఇత్యాది కార్యక్రమాలు అన్ని భారతీయ సంప్రదాయంలో, హైందవ ధర్మంలో ఒక భాగం. ఈ దేశంలోని ప్రజలందరూ ఆయా ప్రాంతాలలోని నదులను దేవతా స్వరూపాలుగా పూజించటం జరుగుతుంది. ఎందుకంటే కేవలం భారత దేశంలోనే కాక యావత్ ప్రపంచంలో నదీతీర ప్రాంతాలలోనే నాగరికత అభివృద్ధి చెందింది. మన దేశంలో ఉన్న అనేక పుణ్యనదుల్లో నర్మదా నది ఒకటి. ఈ నది మూడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది. దక్షిణ భారతీయులకు వింధ్య పర్వతానికి ఆవల నర్మదానది ప్రారంభమవుతుంది. భోపాల్, ఢిల్లీ, లక్నో, వెళ్లినప్పుడు రైలులో ఎన్నోసార్లు నర్మదానదిని చూడటం జరిగింది. ఈ నది యొక్క మహిమ, పవిత్రత తెలుసుకున్న తర్వాత అనేకసార్లు మనసులో నమస్కరించుచున్నాను. అనంతరకాలంలో నర్మదా పరిక్రమ గురించి వినటం జరిగింది. ఇప్పుడు సంధ్య యల్లాప్రగడ గారు రచించిన ‘నమామి దేవి నర్మదే’ (నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం) అనే పుస్తకం ద్వారా ఎన్నో విశేషాలను తెలుసుకునే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఒక ట్రావెలాగ్ చదువుతుంటే ఆ ప్రాంతం లేదా ప్రదేశంలోని సామాజిక, చారిత్రక, ఆర్థిక విశేషాలు మనకి తెలుస్తాయి. నర్మదా పరిక్రమ యాత్ర 16 రోజుల పాటు సాగుతుంది. ఇండోర్ లోని ఓంకారేశ్వరంతో మొదలైనటువంటి ఈ యాత్ర రచయిత్రి భర్తతో కలిసి ఎంతో భక్తితో నిష్ఠతో చేయటం మన కనపడుతుంది. అలాగే ఈ యాత్రలో వారు సందర్శించి నటువంటి దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, వ్యక్తుల గురించి వివరించడం చాలా అద్భుతంగా ఉంది. ఓంకారేశ్వరం నుంచి మహారాష్ట్రలో షహడ చేరుకున్న తరువాత అక్కడ బాజీరావ్ గురించి ఎంతో వివరంగా తెలియ చేస్తారు. అనంతరం మహారాష్ట్ర దాటి గుజరాత్‌లో ప్రవేశించిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహము, నర్మదా డ్యామ్ సందర్శన వివరాలు చదివిన తర్వాత మనం కూడా ఎప్పుడెప్పుడు వాటిని సందర్శిద్దామన్న ఉత్సుకత కలగటం సహజం. బరూచ్ అనే రేవు పట్టణం గురించి క్లుప్తంగా వివరించటం కూడా చాలా ఆసక్తి గొలుపుతుంది ముఖ్యంగా నన్ను ఆకర్షించింది పరిక్రమ గురించి వివరించే ప్రతి అధ్యాయము చివర్లో ‘త్వదీయ పదపంకజ నమామి దేవీ నర్మదే’ అంటూ ఆ నర్మదా దేవి పాదపద్మములకు రచయిత్రి వందనం చేయడం గొప్పగా ఉంది. నదీ పరిక్రమలో రాజమాత అహల్యాబాయి హోల్కర్ గురించిన ఎన్నో వివరాల అందించారు రచయిత్రి.

పురాణాల నుంచి నడిచి వచ్చిన కారణజన్మురాలు రాజమాత అహల్యా బాయి అంటారు ఆమె. ఆ తల్లి మీద భక్తితో నా హృదయం నిండిపోయింది అంటారు సంధ్యా యల్లాప్రగడ. ఈ పుస్తకంలో రాజమాత అహల్యాబాయి హోల్కర్ గురించి చదివిన తర్వాత మన ఒడలు పులకరించడం మాత్రం ఖాయం. ఎన్నో చోట్ల నర్మదా దేవిని ప్రస్తుతిస్తూ కీర్తనలు, ఆదిశంకరుల స్తోత్రాలు, సందర్భానుసారంగా తెలుగు సంస్కృత శ్లోకాలను ఉటంకించడం రచయిత యొక్క విద్వత్తుకు తార్కాణంగా నిలుస్తాయి. పరిక్రమ చేస్తూ రచయిత్రి ఒక చోట ఇలా అంటారు నర్మదా తీరంలో ఒక మహత్యం ఉంది మనసును పరమాత్మ మీదకు అనుసంధాన పరిచే మత్తు ఉంది. ఆమె ఈ పరిశ్రమ ద్వారా అనుభవాలను అక్షరీకరించడం వలన మన మనసులు కూడా ఆ జగదాంబ మీద అనుసంధానం అయ్యేలా కొంత మత్తును చల్లారేమో అనిపిస్తుంది.

నర్మదా పరిక్రమ నా ఆధ్యాత్మిక వృద్ధితో పాటు నా చరిత్ర జ్ఞానాన్ని కూడా పెంచుతోందని సంతోషం కలిగింది అని రచయిత్రి ఒకచోట రాసుకున్నారు. ఇలాంటి యాత్రా పుస్తకాలు చదవడం వల్ల కేవలం రచయితలకే కాక పాఠకులకు కూడా చరిత్ర జ్ఞానం పెరిగే అవకాశం ఉంది. ఈ పుస్తకంలో అనేక దేవాలయాలు, నగరాలు, ప్రాంతాల గురించిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. నాకు చాలా కాలం క్రితం జబల్పూర్ పట్టణం సందర్శించాలి అనే కోరిక ఉండేది. నేను నాగపూర్‌లో ఉండే రోజుల్లో చాలాసార్లు ప్రయత్నించినా కూడా జబల్పూర్ వెళ్ళలేకపోయాను. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత జబల్పూర్ పట్టణం గురించి కొద్దిగా అయినా విశేషాలు తెలుసుకోవడం చాలా సంతోషం కలిగింది. భారతదేశ చరిత్రలో పేర్కొన్న వీర స్త్రీ మూర్తులలో రాణి దుర్గావతి ఒకరు అంటూ రచయిత్రి రాణి దుర్గావతి గురించి తెలిపిన వివరాలు అద్భుతంగా ఉన్నాయి. నర్మద ప్రధాన జన్మస్థానమైన అమరకంటక్ యాత్ర గురించి రచయిత్రి తెలియజేసిన వివరాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయి. అక్కడి దేవాలయం ప్రాంగణాలు కలిగించే భక్తి భావానికి ఏమైనా చేయవచ్చు అని అనిపిస్తుంది. అక్కడికి రావటమే పరమ పుణ్య ఫలం అన్న భావన కలిగింది నా మనసులో అంటారు రచయిత్రి. ఆఖరి రోజు నర్మదా నదికి హారతి ఇస్తుంటే దుఃఖం ఆగలేదు అంటారు రచయిత్రి. మనసా వాచా కర్మణా భక్తితో యాత్రలు చేస్తే ఎవరికైనా ఇలాంటి అనుభూతులు కలుగుతాయి. ఎంతో కష్టతరమైన యాత్రను ఈ దంపతులు దిగ్విజయంగా నిర్వహించడమే కాకుండా వారి అనుభవాలను అక్షరీకరించిన విధానం నిజంగా సంధ్య యల్లాప్రగడ స్థాయిని ఓ మెట్టు పైకి తీసుకెళ్ళింది. 13వ అధ్యాయంలో ఇప్పటిదాకా వారు చేసిన యాత్ర గురించి క్లుప్తంగా వివరించటం ఈ పుస్తకానికే హైలైట్‌గా నిలిచింది.

ఈ పుస్తకం భక్తితో కూడిన ఒక ఆధ్యాత్మిక యాత్రానుభవం. అందుకే రచయిత్రి ఈ పుస్తకం చివరలో నర్మద పరిక్రమ సూచనలు అంటూ భవిష్యత్తులో ఈ పరిక్రమ చేయదలుచుకున్న వాళ్లకు ఎంతో వివరంగా సలహాలు, సూచనలు అందించారు. మొదటిసారి ఈ నర్మదా యాత్ర ప్రారంభించే వాళ్లకు ఈ సూచనలు దిక్సూచిగా ఉంటాయనడంలో సందేహం లేదు. అలాగే ముగింపులో ఈ యాత్ర ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అంటూ ఎన్నో ఆధ్యాత్మిక భావనలను వెలిబుచ్చారు. సాధన యొక్క ప్రాముఖ్యతను ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రాముఖ్యతను అంతర్లీనంగా ఈ అధ్యాయంలో వివరించటం జరిగింది. ఇలాంటి భక్తి, నియమనిష్ఠలతో చేసిన ఆధ్యాత్మిక యాత్ర రచయిత్రి దంపతుల మీద ఖచ్చితంగా ప్రభావం చూపించింది. ఈ యాత్ర మా జీవితాలలో మార్పు తెచ్చింది. వ్యక్తిగతంగా భౌతికంగా పారమార్థికంగా అంటూ ఎంతో భక్తితో పాఠకులకు విన్నవించుకున్నారు.

ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత మళ్లీ మౌలికమైన ప్రశ్న ఉదయించింది. ఇలాంటి యాత్రలు వలన ఉపయోగం ఏమిటి? ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలను కేవలం పిక్నిక్‌గా కాకుండా భక్తితో, పూర్తి నియమనిష్ఠలతో కనక చేయగలిగితే ఒక అలౌకికమైన ఆనందం కలుగుతుంది అని ఘంటాపధంగా చెప్పవచ్చు. అంతేకాక ఒక ఆధ్యాత్మిక యాత్ర మానవునికి ఖచ్చితంగా ఆధ్యాత్మికమైన అనుభూతిని కలుగచేస్తుంది. తద్వారా ముక్తి మార్గానికి సోపానం అవుతుంది. యల్లాప్రగడ సంధ్య దంపతులు ఇలాంటి ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారని ఈ పుస్తకంలో ప్రతి అక్షరం ప్రస్ఫుటంగా చెబుతోంది. అందుకు వారు ధన్యులు.

***

నమామి దేవీ నర్మదే
రచన: సంధ్యా యల్లాప్రగడ
పేజీలు: 152
వెల: ₹ 200
ప్రతులకు:
అచ్చంగా తెలుగు ప్రచురణలు – 8558899478
నవోదయ బుక్ హౌస్‌, కాచీగుడా +91 90004 13413

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here