[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం చెంచా అంతరంగం తెలుసుకుందాం.
***
మధ్యాహ్న సమయం. మా షాపు అంటే అక్షయ స్టీల్ ఫ్యాలెస్ యజమాని లంచ్ చేసి రావడానికి బయల్దేరుతూ, సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ కేసి చూసి, ‘కబుర్లు చెప్పుకుంటూ కూర్చోకండి. కస్టమర్లు వస్తే జాగ్రత్త. వాళ్ల చేత కొనిపించేలా మాట్లాడాలి తెలిసిందా?’ అన్నాడు. అంతా ‘సరే సార్’ అన్నారు వినయంగా. ఆయన వెళ్లిపోయాడు.
ఆ వెంటనే ‘మనం కూడా లంచ్ చేసేద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది. పొద్దున లేటయిందని టిఫిన్ కూడా చేయకుండా వచ్చాను’ అంది అంజలి. ‘నేను రెడీ. టిఫిన్ తిని వచ్చినా కూడా నాకు ఆకలిగానే ఉంది’ నవ్వుతూ అన్నాడు నగేష్. ‘నాకు బిర్యాని ఆకలి.. మా అమ్మ ఈరోజు బిర్యాని చేసింది’ లత అంది. ‘అయితే మీరంతా తినండి. నేను తర్వాత తింటాను. కస్టమర్లు ఎవరైనా వస్తే ఒకళ్లమైనా రెడీగా ఉండాలి కదా’ వేణు అన్నాడు. ‘అక్కడికి నువ్వొక్కడివే సిన్సియర్ అనా.. ఏం ఫర్వాలేదు. ఈ పావుగంటలోనే ఎవరూ రారు. ఒక వేళ ఎవరైనా వచ్చినా మనం చెంచాలతోనే కదా తినేది. లేచి వెళ్లిచ్చులే. మా అమ్మ చేసిన బిర్యాని రుచి చూడవా?’ అంది లత.
‘చెంచాల తోనే’ అనే మాట వినగానే ‘ఆహాఁ.. మా చెంచాల వల్ల ఎంత సౌకర్యం. ఎంగిలి చేతులు కడుక్కోవాలనే సమస్యే ఉండదు. తినే ముందు చేతులు కడుక్కోకపోయినా ఫర్వాలేదు’ అనుకున్నాను నేను. నా భావం అర్థం చేసుకున్న మా స్నేహ చెంచాలు కూడా గర్వంగా ‘అవును, ఎంతైనా మనం గ్రేట్’ అన్నాయి.
అంతలో ‘ఇంక ఏం అడ్డుచెప్పక నువ్వు రావాల్సిందే వేణూ’ అన్నారు మిగతా ఇద్దరూ కూడా. ‘మీరు ఊరుకోరు కదా’ అంటూ తనూ బ్యాగ్ లోని బాక్స్ తీసి వాళ్లతో కలిశాడు.
‘చూశారా.. అందరి చేతుల్లో మనమే’ అన్నాను నేను. నా మాట విని చెంచాలన్నీ నవ్వుతూ చూస్తే, ఆ పక్కనున్న పెద్ద పెద్ద గరిటలోని ఓ గరిట మాత్రం ఉరిమి చూస్తూ ‘కాస్త ఉన్నావో లేదో నీకే అంత గర్వమైతే మా కెంత ఉండాలి?’ అంది.
‘మేం చిన్నగా ఉంటాం కాబట్టే ఎంచక్కా వాళ్ల చేతుల్లో ఇముడుతున్నాం. మా సాయంతో సుతారంగా, ఫ్యాషన్‌గా తింటున్నారు తెలుసా?’ అంది నా తోటి చెంచా. గరిటగారు ఘాటుగా బదులివ్వబోయింది. ఈలోపలే షాపులోకి కస్టమర్లు వచ్చారు. ఘాటుగా అని ఎలా చెపుతున్నానంటే దాని వైఖరి అలా ఉంది మరి. వాళ్లు రాగానే వేణు మిగిలిన ఒక్క ముద్ద అన్నాన్ని చెంచాతో నోట్లో కుక్కుకుని, బాక్స్ మూసేసి గబగబా వచ్చి ‘రండి రండి.. ఏం కావాలమ్మా’ అడిగాడు. మేం కూడా వారికేసి కళ్లు, చెవులు అప్పగించాం.
‘మంచి స్పూన్లు కావాలి’ అంది ఆవిడ. ఇంగ్లీషులో మమ్మల్ని స్పూన్లు అంటారని మాకు తెలుసు. అందుకే ‘మాకోసమే వచ్చారన్నమాట’ అనుకున్నాం. ‘ఏ స్పూన్లు కావాలి, టేబుల్ స్పూన్లు కావాలా, టీ స్పూన్లు కావాలా? ఏ సైజు కావాలో చూసుకోండి’ అన్నాడు వేణు. అందుకామె ‘అంతా టీ స్పూన్లు, టేబుల్ స్పూన్లు అంటుంటారు కానీ వాటిలో తేడా ఏమిటో నాకింత వరకు తెలీదు. టేబుల్ స్పూన్, టీ స్పూన్ కంటే కాస్త పెద్దదని అనుకుంటాను. అంతకంటే వాటి కొలతల వివరం నాకు తెలీదు’ అంది.
అంతలో అంజలి వచ్చి ‘ఆంటీ! నేను మీకు అన్నీ వివరంగా చెపుతాను. ఒక టేబుల్ స్పూన్ అంటే పదిహేను మిల్లీ లీటర్లకు సమానం. ఒక టీ స్పూన్ అంటే అయిదు మిల్లీ లీటర్లకు సమానం. అంటే టీ స్పూన్ కంటే టేబుల్ స్పూన్ మూడు రెట్లు పెద్దగా ఉంటుంది’ చెప్పింది. ‘ఎంత బాగా చెప్పావమ్మా. అయితే మాకు ఓ డజను టీ స్పూన్లు, అర డజను టేబుల్ స్పూన్లు కావాలి’ అంది ఆవిడ.
‘సరే.. ఇటు రండి. ఇక్కడ చూడండి. మీకు ఏ మోడల్‌వి కావాలో చూసుకోండి’ అంటూ మేం ఉన్నచోటు దగ్గరకు వాళ్లను పిలిచింది అంజలి. ఆవిడ ఓ ఐదారు నిముషాలు అన్నిటినీ పరిశీలించి మమ్మల్నే పైకి తీసి, ‘ఏమండీ.. ఈ స్పూన్లు బాగున్నాయి కదూ’ అంటూ వెంట ఉన్న భర్తను అడిగింది. ఆయన బాగున్నాయన్నట్లు తల ఊపాడు. ఆమె మా సెట్‌ను తీసి పక్కనుంచి, టేబుల్ స్పూన్లను కూడా ఎంచుకుంటుండగా ‘అయితే ఈ షాపుతో మాకు రుణం తీరి పోయిందన్నమాట. ఇక పై వీళ్ల ఇంట్లో మా సేవలకు శ్రీకారం అన్నమాట’ అనుకున్నాను నేను.
‘అమ్మాయ్! ఇక్కడ ఇంకా రకరకాల స్పూన్లు ఉన్నాయి కదా. వాటికి కూడా వేర్వేరు పేర్లున్నాయా?’ అడిగింది. ‘ఉన్నాయాంటీ! స్పూన్లు దాదాపుగా తొమ్మిది రకాలు. మీకు టైమ్ ఉందంటే చెపుతా’ అంది. ‘ఫరవాలేదు చెప్పమ్మా’ అంది ఆమె. ‘ఎస్. వెరీ ఇంటరెస్టింగ్’ అంది. ఆమె పక్కనున్న అమ్మాయి.. కూతురు కాబోలు.
నేను కూడా అంజలి మాటలు వినడానికి ఆత్రుతగా ఎదురు చూస్తుండగా.. ‘స్పూన్లు దాదాపుగా తొమ్మిది రకాలని చెప్పానుకదా.. వాటిలో డిన్నర్ స్పూన్లు. ఇవి కోలగా, కొద్దిగా లోతుగా ఉండే టేబుల్ స్పూన్లు. సర్వింగ్ స్పూన్ అంటే వడ్డించేవి.. ఇవి పెద్దవిగా, పెద్ద కాడ కలిగి ఉంటాయి. లోతైన చిప్ప ఉండేవాటిని ఇంగ్లీషులో సూప్ స్పూన్ అంటారు. తెలుగులో పులుసు గరిట లేదా గంటె అంటారు. వీటిలో మళ్లీ బ్రిటిష్ సూప్ స్పూన్స్, చైనీస్ సూప్ స్పూన్స్ అని వేరుగా ఉంటాయి. బ్రిటిష్ సూప్ స్పూన్లు కొద్దిగా చిన్నవి, చిప్ప గుండ్రంగా ఉంటుంది. చైనీస్ సూప్ స్పూన్ అడుగున కొంతమేర చదునుగా, పైన కొంతమేర విశాలంగా కొద్దిగా వంపుగా, పూర్తి కోలగా కాకుండా ఉంటాయి. ఇవి వేర్వేరు సైజుల్లో ఉంటాయి. ఇంక ఐస్డ్ బీవరేజ్ స్పూన్లు, సోడా స్పూన్లు, కాఫీ షాపుల్లోని డెమిటాస్ స్పూన్లు, సలాడ్ స్పూన్లు ఇలా ఎన్నో.. ఇంక డిజర్ట్ స్పూన్, సూప్ స్పూన్ లాగే ఉన్నా, చిప్ప కోలగా ఉంటుంది. టీ స్పూన్ కన్నా రెట్టింపు సైజులో ఉంటుంది. ఇవి కాకుండా బార్ లేదా కాటెయిల్ స్పూన్లు, పొడవైన, స్పైరల్ కాడతో, బుల్లి చిప్పతో ఉంటాయి’ ఆగింది అంజలి.
‘అబ్బో! మా జాతి ఇంత విస్తృతమైందా!’ అని నేను ఆశ్చర్యపోతుండగా, ‘చాలా రకాల స్పూన్ల గురించి చెప్పావమ్మాయ్. కొంతమంది వస్తువులు చూపించడానికి, వివరంగా మాట్లాడడానికి విసుక్కుంటారు. సేల్స్ గర్ల్స్ అందరూ నీలాగా ఉంటే ఎంత బాగుంటుందీ’ అంది ఆంటీ మెచ్చుకుంటూ. ‘అవును. ఇక నుంచి స్టీలు వస్తువులు ఏవి కొనాలన్నా మీ దగ్గరకే వస్తాం’ అంది ఆంటీతో ఉన్న అమ్మాయి. ‘థ్యాంక్యూ’ అంది అంజలి వినయంగా.
ఆంటీ స్పూన్లను అంటే మమ్మల్ని అందుకుని, ‘సిరీ! బిల్లు సంగతి చూడు’ అంది. ‘అలాగే అమ్మా’ అంటూ సిరి బిల్లు చెల్లించింది. ఆంటీ వాళ్లు బయటకు నడుస్తుంటే, నేను షాపులో అందరికీ బై చెప్పాను. కానీ వాళ్లకేం అర్థమవుతుంది! అంతలో యజమాని ఎదురయ్యాడు. ఈయనను చూడటం కూడా ఇదే ఆఖరు అనుకున్నాం నేను, మా తోటి స్పూన్లు. కారులో ఆంటీ వాళ్లింటికి చేరాం.
వెళ్లగానే హాల్లో ఒకామె పిల్లవాడికి వెండి చెంచాతో అన్నం తినిపిస్తోంది. చిన్ని వెండిగిన్నెకు జతగా చిన్ని చెంచా ముద్దుగా ఉంది. ఆంటీని చూడగానే ‘అదుగో! బామ్మ వచ్చేసింది చూడు. ఈ ఒక్క చెంచా తినేయాలి. గుడ్ బాయ్ కదూ’ అంది. ఆ చెంచాను చూసి మేం స్నేహపూర్వకంగా నవ్వుతూనే, ‘బామ్మ అంది కాబట్టి ఈమె ఆంటీ కోడలన్న మాట’ అనుకున్నాం. ఆంటీ ‘వాణీ! స్పూన్లు తక్కువయ్యాయి అనుకున్నాం కదా, ఇవాళ ఇదుగో ఇవి కొనుక్కొచ్చాం’ అంటూ మమ్మల్ని తీసి చూపించింది.
వెంటనే బాబు గబగబా పాక్కుంటూ వచ్చి నన్ను తీసి నోట్లో పెట్టుకున్నాడు. చెప్పొద్దూ నాకు భలే సంతోషం అనిపించింది. అది చూసి అప్పటి వరకు బాబుకు తినిపించిన వెండి చెంచా ఉడుక్కుని ‘వెండి చెంచాను నేనుండగా ఎలా వెళ్లిపోయాడో ఆ చెంచా దగ్గరకు’ సణిగింది. నేను దాని ఫీలింగ్‌ను అర్థం చేసుకుని, ‘పిల్లలకు వెండి, స్టీలు తేడాలేం తెలుస్తాయి, కొత్తగా కనిపించి వచ్చాడంతే. నీ స్థానం నీదేలే’ అన్నాను అనునయంగా. నా మాటలకు వెండి చెంచా సంతోషించి, ‘నీదెంత మంచి మనసు. మనమంతా ఒకటేలే. అయినా నాకెప్పుడూ చోర భయం ఉంటుంది, మీకా బాధ లేదు. మిమ్మల్ని వాడినంత ఎక్కువగా మమ్మల్ని వాడరు కూడా. ఇక నుంచి మనమంతా నేస్తాలం’ అంది. ఆ మాటలకు మేమంతా ఆనందంగా ‘సరే’ అన్నాం.
బాబు నోట్లోంచి నన్ను తీసి, కడిగి, మమ్మల్నందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరున్న స్పూన్ల స్టాండ్‌లో సర్దారు. ఇల్లు నలువైపులా మా చూపులు సారిస్తున్నాం. డైనింగ్ హాల్ నుంచి వంటిల్లు చక్కగా కనిపిస్తోంది. అక్కడ గరిటల స్టాండ్ చూడటంతోనే మా పెదక్కలను చూసిన సంతోషం కలిగింది. రకరకాల గరిటలు.
ఇంతలో ‘వాణీ! కాస్త కాఫీ కలిపి తీసుకురా. నేను బాబును ఎత్తుకుంటా’ అంటూ బాబును అందుకుంది ఆంటీ. కొద్ది సేపటికి వాణీ కాఫీ ట్రే తెచ్చి అందరికీ ఇచ్చింది. సిరి చక్కెర కొంచెం తక్కువైందంటూ చిన్నిపింగాణీ బౌల్‌లో ఉన్న చక్కెరను చెంచాతో వేసుకుని కలుపుకుంది. అంతలో బైక్ శబ్దం వినపడటంతోనే ‘మీ నాన్న వచ్చినట్లున్నాడురా’ ఆంటీ అంటుండగానే అతడు లోపలకు ప్రవేశించాడు. అతడు హెల్మెట్ పక్కన పెట్టి, లోపలకు వెళ్లి పైజమా లోకి మారి వచ్చాడు. వాణి అతడిక్కూడా కాఫీ తెచ్చిచ్చింది.
ఆంటీ ‘సాగర్! ఇవాళ చక్కటి కొత్త చెంచాలు కొనుక్కొచ్చాంరా. అక్కడ సేల్స్ గర్ల్ చెంచాల్లో రకాల గురించి భలేగా చెప్పిందిలే’ అంటూ మాకేసి చూపించింది. అది విని ‘చెంచాలు, గరిటలు అంటే నాకు అమ్మమ్మ గుర్తిస్తుంది. మనం అక్కడికెళ్లినప్పుడు ఘుమఘుమలాడే నెయ్యి వడ్డించేది. ఆ నేతి చెంచా బుల్లిగా భలే ఉండేది. దాన్ని అమ్మమ్మ ‘మిల్లి గంటె’ అనేది. ఇంకోటి పోపు గంటె ఇనపది.. ఇంత బారుగా ఉండేది. దాంతో అమ్మమ్మ పులుసులో, చారులో పోపు వేస్తుంటే ఆ ఘాటు వీధిలోకి వచ్చేది. ఆ గంటెను పులుసులో ముంచగానే ‘సుయ్’ మంటూ విచిత్రమైన శబ్దం’ అన్నాడు సాగర్. ‘అవును. మా అమ్మ చేతి రుచులే వేరు’ అంది ఆంటీ.
‘అన్నయ్యా! అసలీ చెంచాలు ఎప్పటినుంచీ ఉన్నాయంటావు?’ అడిగింది సిరి. ‘క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల కాలం నుంచే చెంచాలున్నట్లు ప్రాచీన ఈజిప్టులో ఆధారాలు దొరికాయి. చెకుముకి రాయి, చెక్క, దంతం వగైరాలతో రూపొందిన చెంచాలు లభించాయి. చైనాలో షాంగ్ వంశస్థులు జంతు ఎముకలతో తయారైన చెంచాలు వాడేవారట. అయితే పదిహేనో శతాబ్దంలో చెంచాలు సర్వసాధారణ వస్తువులుగా కనిపిస్తాయి. రాజగృహాలలో వెండి, బంగారు చెంచాలు.. లోహపు చెంచాలు సామాన్య గృహాల్లో ఉండేవి. మధ్యయుగంలో అత్యంత ఆసక్తికరమైన స్పూన్‌లలో ఒకటి, ఆంగ్లేయుల పట్టాభిషేకంలో వాడిన స్పూన్’ చెప్పాడు సాగర్.
‘మా చిన్నప్పుడు నిమ్మకాయ ఉంచిన స్పూన్‌ను నోట్లో పెట్టుకుని పరుగెత్తే ఆటల పోటీ జరిగేది. నేను ఇంట్లో చాలాసార్లు ప్రయత్నించాను. ఎప్పుడూ పడిపోయేది. ఇంక పోటీకేం వెళతాను’ అంది ఆంటీ. ‘నిమ్మకాయను, చెంచాకు జిగురుతో అతికించుకుని పరుగెత్తాల్సింది’ అప్పటివరకు మౌనంగా ఉన్న అంకుల్ అన్నాడు. అంతా నవ్వారు. ఆంటీ ఉడుక్కుని, ‘మరే.. మీ అంత తెలివితేటలు నాకెక్కడివి’ అంది.
అంతలో ఇద్దరు పెద్ద పెద్ద గరిటలతో ప్రవేశించారు ‘పద్మావతమ్మ గారూ! ఒకసారి రమ్మని ఫోన్ చేశారు. ఏంటో కనుక్కుందామని వచ్చాం’. ‘ముందు కూర్చోండి. ఆయుధాలతో వచ్చారు, గిరాకి తగిలిందేమిటి’ అంది ఆంటీ వాళ్ల చేతుల్లోని జాలీ గరిటెలు, అరిసెలు వత్తే గరిటలు చూస్తూ. నేను, వాటికేసి స్నేహంగా నవ్వాను. అవి ఒకింత బిడియంగా చూశాయి.
‘గుర్నాథం గారింట్లో అరిసెలు, బూందీ పని పూర్తి చేసి వస్తున్నాం’ అందామె. ‘అలాగా.. మీకు వచ్చే గురువారం ఖాళీ ఉందా, మా చెల్లెలు వాళ్లింట్లో బారసాల ఫంక్షన్ ఉంది. అందరు మెచ్చేలా వంటలు ఉండాలి, వియ్యాలవారు మెచ్చాలి అంటే మీరు గుర్తొచ్చారు. వెంటనే మీకు ఫోన్ చేశాను’ అంది ఆంటీ.
‘ఆఁ ఖాళీయే అమ్మా. ఫోన్ నంబరు ఇవ్వండి. మాట్లాడతాం. ఏ ఏరియాలో ఉంటారు?’ అడిగాడు అతడు. ‘దిల్‌సుక్‌నగర్‌లో ఉంటారు. ఇదుగో.. ఇది ఫోన్ నంబరు. ఓ రెండొందలు ఎక్కువ తీసుకున్నా ఫర్వాలేదు గానీ వంటలు అందరూ మెచ్చేలా ఉండాలి. నా మాట నిలబెట్టాలి’ అంది ఆంటీ. ‘చూస్తారుగా. వస్తాం అమ్మా’ అంటూ వాళ్లు వెళ్లిపోయారు.
‘ఆయనేమో బక్కగా.. ఆయన చేతిలో ఆ పెద్ద గరిటే ఇంకా బలంగా ఉన్నట్లుంది’ నవ్వుతూ అంది సిరి. ‘అంటే గరిట పట్టుకునే వాళ్లు భీముడిలా ఉండాలంటావా, అసలు పాకకళా ప్రవీణులు నల, భీములే కదా’ అంది ఆంటీ. నేను గరిటలు పట్టుకున్న నల, భీములను ఊహించుకుంటుండగా సాగర్, ‘గరిట తిప్పడం ఇప్పుడు గొప్ప చదువు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు, డిప్లొమా ఇన్ కేటరింగ్ లకు ఇప్పుడు యమ గిరాకి. పెద్ద హోటల్లో చెఫ్ అయితే మాంఛి జీతాలు’ అన్నాడు సాగర్. నేను ‘అబ్బో!’ అనుకుంటుంటే, ‘అవునవును’ అన్నారంతా.
అంతలో ఆంటీ అందుకుని ‘గరిట అంటే గుర్తుకొచ్చింది, కాశీలో అన్నపూర్ణాదేవి మందిరంలో అన్నపూర్ణాదేవి బంగారు విగ్రహం ఉంటుంది. ఆమె ఒక చేత బంగారు పాత్ర, ఒక చేత గరిట ధరించి ఉంటుంది. దాని వెనుక ఒక కథ ఉందని చెప్పారు. అది.. ఒకసారి శివుడు, పార్వతితో ఆహారంతో సహా ప్రపంచం మొత్తం భ్రమ అన్నాడట. దాంతో ఆహార దేవత అయిన పార్వతికి కోపం వచ్చి, భూమిపై ఉన్న ఆహారాన్నంతటినీ మాయం చేసింది. ప్రపంచమంతా ఆకలితో అల్లాడిపోయింది. అది చూసి శివుడు, తలుపు వద్దే నిలిచి, ఆమెను ఆహారం కోసం వేడుకున్నాడు. పార్వతి సంతోషించి శివునికి స్వయంగా ఆహారాన్ని సమర్పించింది. భక్తుల కోసం కాశీలో వంటగదిని సిద్ధం చేసింది’ చెప్పింది. ఆశ్చర్యపోవటం నావంతయింది. ‘నాక్కూడా చెంచా గురించి చెంచాడు తెలుసు’ అన్నాడు అంకుల్. ‘చెప్పండి నాన్నా’ సిరి, సాగర్ ఒకేసారి అన్నారు.
‘జానపద కళాకారులు కూడా గరిట వాడతారు. కొలనుపాక భాగవతులను ‘గంటె భాగవతులు’ అంటారు. వీరి ప్రదర్శనలు రాత్రివేళ జరుగుతాయి. నా చిన్నప్పుడు ఓసారి చూశాను. చేతిలో దీపం వెలిగించిన గరిట పట్టుకుని ప్రదర్శన మొదలు పెడతారు. ఆ వెలగులో ప్రతి పాత్ర హావభావాలు, ఆంగిక చలనాలు ప్రేక్షకులకు చక్కగా కనిపిస్తాయి. మధ్య మధ్యలో నటను సాగిస్తూనే గరిటలలోని వత్తిని ఎగదోస్తూ ఉంటారు’ వివరించాడు. ‘భలే’ అన్నారంతా.
ఆ వెంటనే సాగర్ ‘ఇది వినండి, బహుజన సమాజ్ పార్టీ స్థాపకుడు, కాన్షీరాంగారు ‘ద చెంచా ఏజ్’ అని ఏకంగా ఓ పుస్తకమే రాశారు. చెంచాగిరిపై అసహ్యమే ఆయనతో ఆ పుస్తకం రాయించింది. స్వార్ధ రాజకీయ నేతల చేతుల్లో మిగిలిన వారు చెంచాలుగా ఆడించబడడానికి ముగింపు పలికి, నూతన వికాస యుగంలోకి ప్రవేశించాలని అభిలషించాడు’ చెప్పాడు. ‘బాగుంది’ అన్నారంతా. నాకెందుకో ‘చెంచాగిరి’ అనే మాట నన్ను తిట్టినట్లుగా అనిపించి, బాధేసింది.
అంతలో వాణి అందుకుని ‘అన్నట్లు ఇప్పుడు వాడి పారేసే ప్లాస్టిక్, చెక్క చెంచాలు మాత్రమే కాదు పదార్థంతో పాటు చెంచాను కూడా తినేందుకు వీలైన రకాలు వచ్చాయి. ఈ రకం చెంచాలు చాక్లెట్, బీట్‌రూట్, స్పినాచ్, క్యారెట్ రుచుల్లో దొరుకుతున్నాయి. తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలతో కూడా ఈ చెంచాలను తయారుచేస్తున్నారు. పీచు పదార్థం ఉంటుంది. కనుక ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి. ప్రొటీన్లు కూడా బాగా లభిస్తాయి. ఒకవేళ నచ్చనివారు పారేసినా, ఇవి కొద్ది రోజుల్లోనే నేలలో కలిసిపోతాయి కాబట్టి పర్యావరణ పరంగా కూడా ఇవి మేలైనవి’ చెప్పింది.
నేను ఆశ్చర్యపోతుండగానే, ‘అవును, ఆ మధ్య నేనూ చూశాను’ అన్నాడు సాగర్. ‘ఇదేదో బాగుందే’ అంది ఆంటీ. ‘అంతే కాదు, ఇప్పుడు మార్కెట్లో తేనె చెంచాలు కూడా దొరుకుతున్నాయి. ఆఫీసులో గ్రీన్ టీ తాగాలనుకునే వారు టీ బ్యాగులు, వేడినీళ్లు సులభంగానే ఏర్పాటు చేసుకోవచ్చు కానీ రుచి కోసం తేనె కలుపుకోవాలంటే మాత్రం ఇబ్బందే. ఆఫీసుకి తేనె సీసా తీసుకెళ్లడం, దాచడం కష్టం. ఒకవేళ దాచినా ఆ సీసాలో ముంచిన చెంచాను కడగటం ఇబ్బంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు రెడీమేడ్‌గా తేనె చెంచాలు వచ్చాయి’ చెప్పింది వాణి. ‘ఔరా’ అనుకుంటుండగా, ‘ఎన్నికొత్త ఆలోచనలో, ఎన్ని కొత్త తయారీలో’ అంది ఆంటీ.
ఆ వెంటనే సిరి ‘ఆ మధ్య చెంచాల మ్యూజియం గురించి చదివాను. అది ఇజ్రాయిల్ లోని యూరీ గెల్లర్ మ్యూజియం. దాని ప్రవేశద్వారం వద్ద ఒక టీ స్పూన్ ఉంటుందట. అది ప్రపంచం లోనే అతి పెద్ద టీ స్పూన్. ఎంత పెద్దదంటే దాని పొడవు యాభైమూడు అడుగుల పైమాటే. ఈ మ్యూజియంలో కొన్ని వందల స్పూన్లు ఉంటే వాటిలో చాలా వరకు యూరి గెల్లర్ వంచినవే ఉన్నాయి. ఆయన మెజిషియన్, ఇల్యూషనిస్ట్. తనకు అసాధారణ శక్తులు ఉన్నాయని ప్రకటించుకున్నాడు. తరచు టీవీ షోల్లో కనిపించేవాడు. ఆ ప్రదర్శనల్లో స్పూన్లను వంచటం తప్పనిసరి అంశంగా ఉండేది. ఈ మ్యూజియంలో యూరి గెల్లర్ సేకరించిన రెండువేల ఆరొందల స్పూన్లు ఒక కాడిలాక్‍కు అతికించి ఉంటాయి. విన్‌స్టన్ చర్చిల్ మొదలు జాన్ ఎఫ్. కెనడీ వరకు ఎందరో ప్రముఖులు వాడిన స్పూన్లను అక్కడ చూడవచ్చు’ చెప్పింది సిరి.
‘బల ప్రదర్శనకు మేమే దొరికామా’ అని నేననుకుంటుంటే, ‘ఎవరి పిచ్చి వారికే ఆనందం’ అంకుల్ అన్నాడు. ‘నేను వేల్స్ లోని నేషనల్ మ్యూజియం గురించి చదివాను. ఈ మ్యూజియం ‘వెల్ష్ లవ్ స్పూన్ల’కు ప్రసిద్ధి. పదిహేడవ శతాబ్దంలో అక్కడి యువకులు తమ ప్రియురాళ్లకు ఎంతో కళాత్మకమైన చెక్క స్పూన్లను స్వయంగా తయారుచేసి వారి మనసు గెలుచుకునే వారట. ఈ లవ్ స్పూన్ల కాడ భాగంలో వారు చెక్కిన వైవిధ్యభరితమైన డిజైన్లు ఎంతో ఆశ్చర్యకరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడు కూడా లవ్ స్పూన్ల కళాకారులెందరో వాటిని తయారు చేస్తున్నా, వాటిని పెళ్లిళ్లకు, నిశ్చితార్థాలకు బహుమతులుగా వినియోగిస్తున్నారు’ చెప్పింది వాణి. ‘లవ్ స్పూన్’ పేరెంత బాగుందో అనుకుంటుంటే.. ‘భలే ఉందే’ అంది సిరి.
‘అన్నట్లు అమ్మమ్మ వాళ్ల ఊళ్లో కాకులు చెంచాలు ఎత్తుకొచ్చి పెరట్లో పడేసేవి. అలాంటి చెంచాను చూసి అదేదో ఉచిత బహుమతిలాగా సంబరపడే వాళ్లం’ నవ్వుతూ చెప్పాడు సాగర్. ‘గమ్మత్తుగా ఉంది’ అనుకున్నా నేను. ‘ఇప్పుడు కాకులు కనపడటమే కష్టం’ అంది సిరి.
అంతలో ‘అరెఁ బాబిగాణ్ని చూడండి, ఉద్ధరిణె నోట్లో పెట్టుకున్నాడు. ఎప్పుడు వెళ్లాడో దేవుడి గదికి’ వాడిని పట్టుకుని ఉద్ధరిణె తీసేసింది. ఉద్ధరిణె అంటే ఏమిటో అనుకున్నా.. మా జాతే. కాకపోతే రూపు కొంచెం వేరుగా ఉంది. దేవుడి దగ్గర వాడేది కావడంతో కాస్తంత కళాత్మకంగా కూడా ఉంది. నేను దాన్ని పలకరిద్దామనుకునే లోపలే ఆంటీ దాన్ని తీసుకుని లోపలకు వెళ్లింది.
‘సాగర్! నీ స్నేహితుడు దివాకర్ ఇప్పుడెక్కడున్నాడు?’ అడిగాడు అంకుల్. ‘వాడికేం, నోట్లో సిల్వర్ స్పూన్‌తో పుట్టాడు. వాడిని పెంచుకున్న పెదనాన్నకు బోలెడంత ఆస్తి. భార్య తరఫున కూడా బాగా ఆస్తి కలిసి వచ్చింది. చిన్నప్పుడు వాడిదంతా స్పూన్ ఫీడింగ్, సొంతంగా ఏం చేయలేడు అనేవాళ్లు. అలాంటి వాడు ఇప్పుడు సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు’ చెప్పాడు సాగర్. ‘మొక్కలకు నీళ్లు పోయాలి’ అంటూ లేచాడు అంకుల్. ‘కబుర్లలో టైమ్ తెలియలేదు’ ఆంటీ అంది. అంతా లేచి ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.
నేను మాత్రం ఇంకా మా జాతి గురించిన ఆలోచనల్లోనే ఉన్నాను. మనిషికి ఇన్నిరకాలుగా సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ నన్ను కించపరుస్తూ ‘చెంచాగిరి’ లాంటి వ్యాఖ్యలు చేయొద్దని మనవి చేయాలని ఉంది. ఎందుకంటే నేను ఎలాంటి తారతమ్యాల్లేకుండా అందరికీ సేవ చేస్తాను. అలాంటి నా సేవను స్వప్రయోజనం కోసం స్వార్థనేతలకు చేసే సేవతో పోల్చడం ఎంత బాధాకరం. అలాగే స్పూన్ ఫీడింగ్ అంటూ నన్నెందుకు నిందించడం. ఆ మాటకొస్తే పాశ్చాత్యులు స్పూన్‌తో తప్ప చేత్తో ఏదీ తినరు. ఆ లెక్కన వారంతా పరాధీనులైపోరుగా. ఈ మనుషులు మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో’ అనుకుంటుంటే వంటింట్లో మా దోస్తు.. అదే పోపు గంటె సుయ్, సుయ్ చప్పుడు.. భలే..
ఇంతలో సిరి టీ.వీ. ఆన్ చేసింది.. అందులో ప్రకటన వస్తోంది.. ఓ కోడలు ఇంట్లోకి వస్తూ ‘అత్తయ్యా! మీ కోసం మార్న్‌విటా.. దానికి ఓ స్పూన్ ఫ్రీ అట. ఇదుగోండి’ అంటూ అందిస్తోంది.. వెంటనే అత్తగారు ‘నేను మధ్యాహ్నమే కొనుక్కొచ్చా.. అదుగో’ అంటూ టేబుల్ వైపు చూపుతోంది. అక్కడ మార్న్‌విటా.. కొత్త చెంచా.. అంతలో పిల్లలిద్దరూ ‘మార్న్‌విటా కొందాం, కొత్త చెంచాతో తిందాం’ అంటూ స్పూన్లతో డ్యాన్స్.. భలే భలే.. ఆనందంతో నా మనసూ డ్యాన్స్ చేస్తోంది.