[dropcap]ఆ[/dropcap]గస్టు 29 శ్రీ గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఈ వ్యాసం.
~
జననము-బాల్యము: గిడుగు రామమూర్తిగారు 1863 ఆగస్ట్ 29న శ్రీకాకుళంలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీముఖలింగక్షేత్రానికి రెండుమైళ్ళ దూరంలో గల పర్వతాలపేటలో జన్మించారు. తల్లిదండ్రులు వీరరాజు, వెంకాయమ్మ దంపతులు. తండ్రి గోదావరిజిల్లా నుండి విశాఖపట్నంజిల్లా వచ్చి, విజయనగరం సంస్థానంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా పనిచేశారు. తల్లిది విజయనగరం.
సంస్కారము-స్వభావము: గిడుగు రామమూర్తి గారికి ఐదు సంవత్సరముల ఐదు నెలలకు అక్షరాభ్యాసం చేశారు. రామమూర్తిగారు చదువంటే పాఠశాలల్లో నేర్చినది మాత్రమే కాదని ఋజువు చేశారు. వారణాసి గున్నయ్యగారు ఇంటికి వచ్చి సంస్కృతం, గణితం, తెలుగు నేర్పారు. ఎనిమిది సంవత్సరాల వయసుకి ‘శబ్దమంజరి’ నేర్చుకున్నారు. తండ్రి దగ్గర బాలరామాయణ శ్లోకాలు, భారత, భాగవత పద్యాలు, తల్లిదగ్గర పురాణకథలు విన్నారు. 11 సంవత్సరాల వయసులో శాస్త్రోక్తంగా ఉపనయనం జరిగింది.
ఇతనికి ఛాందసభావాలు లేవు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే మనిషి. కులమత పట్టింపులు లేవు. మూఢనమ్మకాలు లేవు. అనుకున్న పని ఎంత కష్టమైనదైనా పట్టుదలగా పూర్తిచేసే స్వభావం. రాజీలేని ధోరణి కావడంతో ఎన్నో ఇబ్బందులు పడేవారు.
విద్యాభ్యాసం: తండ్రికి చోడవరం బదిలీ కావడంతో, విజయనగరంలో మేనమామ ఇంటిలో ఉంటూ మహారాజా కళాశాలలో చదువుకున్నారు. శ్రీ గురజాడ వెంకటఅప్పారావుగారు, ఆదిభట్ల సూర్యనారాయణగారు, కేసరి కామేశ్వరరావుగారు ఇతనికి సహ విద్యార్థులు. మెట్రిక్ ఉత్తీర్ణులయ్యారు. తండ్రి మరణంతో విశాఖపట్నం కలెక్టరేట్‌లో నెలకు 15 రూపాయలు ఉద్యోగానికి చేరారు. కందికొండ రామదాసుగారి అమ్మాయి అన్నపూర్ణతో వివాహం జరిగింది. సంతానం సీతాపతి, వీరరాజు, రామదాసు, సూర్యనారాయణ అని నలుగురు కుమారులు కలరు.
ఉద్యోగము: పర్లాకిమిడిలో పులుల భయము ఎక్కువ. అక్కడి కొండలలోని దోమలు కుడితే చెముడు వస్తుందని తెలిసినా ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తారని కుటుంబ బాధ్యతల కోసం 30 రూపాయల జీతానికి పర్లాకిమిడిరాజుగారి పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరారు. కుటుంబబాధ్యతలతో పాటు విద్యాభ్యాసం కూడా అంచెలంచెలుగా ఇంటర్, బి.ఏ. చరిత్ర చదివి కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. ఎన్నో పద్య, వచనకావ్యాలు చదివి ధారణలో ఉంచుకునేవారు. దేశచరిత్రలు, వార్తాపత్రికలు, టీకా-తాత్పర్య గ్రంథాలు, బడి పుస్తకాలు, శాస్త్రగ్రంథాలు, నిఘంటువులు, శాసనాలు చదివి అపార పాండిత్యాన్ని గడించారు.
కైజర్-ఇ-హింద్: మందస నుండి గుంప వరకు ‘సవరలు’ అనే కొండజాతివారు నివసించేవారు. వారానికి ఒకరోజు సంతలో తమ దగ్గర దొరికే చింతపండు, తేనె, పళ్ళు లాంటివి తీసుకొచ్చి అమ్మి, తమకు కావలసిన వస్తువులు తీసుకుపోయేవారు. స్థానికులు వారిని మోసం చేసేవారు. విద్య లేకపోవడం వలన వారు మోసపోతున్నారని బాధపడిన రామ్మూర్తిగారు సవరభాష నేర్చుకుందికి కృషి చేశారు. అందరూ వాళ్ళ మాతృభాషను నేర్చుకుని, తద్వారా ఇతరభాషల్ని తేలికగా నేర్చుకోవచ్చు అని ఆలోచించేవారు. ఆయనవి జాతీయ భావాలు. ఆయనకు ఎన్నో భాషలు వచ్చు. తౌడు అనే ఒరియా అతని ద్వారా సవరభాష నేర్చుకున్నాడు. అతని సహాయంతో సవరల కోసం ఒక పాఠశాల ప్రారంభించారు. సవరభాషకు లిపి లేకపోవడం వలన తను సేకరించిన కథలు, పాటలు తెలుగు లిపిలోనే రాసుకునేవారు. సవర వ్యాకరణం వ్రాసి ‘సవర వాగనుశాసనుడి’గా పేరుపొందారు. సవరల మీద రాసిన వ్యాసం ‘మద్రాసు లిటరరీ సొసైటీ వారి జర్నల్ లో ప్రచురించారు. సవరభాష నేర్చుకోవడమే కాకుండా వాళ్ల ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, అలవాట్లు, జీవనశైలి కూడా అధ్యయనం చేశారు. వారి గూడేలకు వెళ్లి పరిసరాలను పరిశీలించి వారి కథలోనూ, పాటలనూ రికార్డు చేసేవారు. ఆ సమయంలో తిరుగుతున్నప్పుడు దోమకాటు వలన మలేరియా వచ్చింది. 40 రోజులు క్వినైన్ వాడడంతో, మలేరియా తగ్గింది గాని చెవుడు వచ్చింది. అయినా తన ప్రయత్నం ఆపలేదు. తెలుగు-సవర నిఘంటువుని రాశారు. వారికి పాఠాలు నేర్పడానికి వాచకాలు రాశారు. ఈ వివరాలన్నిటితో 1894లో ‘హిందూ’ పత్రికలో వ్యాసం వ్రాసారు. 1908 లో వెల్ష్ మాన్ అనే ఫారెస్ట్ ఉద్యోగికి, 1928 లో మిస్ మన్రో అనే దొరసానికి సవరభాష నేర్పగా వారు సవరలకు ఎంతో ఉపయోగపడినారు. కలెక్టర్ మాక్ మెకేల్ దొరకు చెప్పి, మద్రాసు ప్రభుత్వంవారి ప్రోత్సాహంతో ఇంగ్లీషు-సవర మరియు సవర-ఇంగ్లీష్ నిఘంటువుల్ని తయారుచేశారు. అందువలన సవరలకు మిగతా ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి.
పొందిన పురస్కారాలు: 1932-34లో సవరలకు గిడుగు చేసిన సేవల్ని ప్రభుత్వం గుర్తించి కైజర్-ఇ-హింద్ అనే బంగారు పతకం ఇచ్చి గౌరవించింది. 1935లో ఐదవ జార్జి చక్రవర్తి రజతోత్సవ పతకాన్ని కూడా ప్రభుత్వం బహూకరించి సత్కరించింది. విద్యా, సాహిత్య, సాంస్కృతికరంగాలలో విశేషమైన కృషి చేసినవారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ పురస్కారము అందజేస్తుంది.1938లో గిడుగు రామమూర్తిగారు ‘కళాప్రపూర్ణ’ పురస్కారము అందుకున్నారు.
వీరి తెలుగు గ్రంథాలు 1.బాల కవిశరణ్యము కొత్త వ్యాకరణం గ్రంథము 2.వ్యాసావళి దీనిలో వ్యావహారికభాష గురించిన వ్యాసాలు ఉన్నాయి. 3.పండిత భిషక్కుల భాషా భేషజము పండితుల డొల్లతనాన్ని తెలియచేస్తూ రాసిన వ్యాససంపుటి. 4.గద్య చింతామణి. 400 సం.ల నుండి తెలుగు వ్యాసరచన వాడుక భాషలో ఉందని తెలియచెప్పే గ్రంథము.
డైరెక్ట్ మెథడ్: ఆంగ్లభాష నేర్చుకుందికి ఫోనెటిక్స్ ఉపయోగించి డైరెక్ట్ మెథడ్ ద్వారా సులువుగా ఆంగ్లం నేర్పవచ్చునని, అది శ్రేష్టమైన పద్ధతి అని రామమూర్తిగారికి నమ్మకం. తాను 1907లో లాంగ్వేజ్ ట్రైనింగ్ పరీక్ష పాఠ్యగ్రంథాలుగా చదివిన, పద్ధతిని పర్లాకిమిడిలో ఒకటవ తరగతి విద్యార్థులకు నేర్పే ప్రయత్నం చేశారు. కేవలం 9 మాసాలలో 2000 ఆంగ్లపదాలు నేర్చుకోగలిగిన విద్యార్థులు తాము స్వతంత్రంగా వాడుకభాషలో నిత్యజీవితంలో ఉపయోగించగలిగారు. 1913లో ‘రావు సాహెబ్’ బిరుదుతో ప్రభుత్వం సత్కరించింది. ఈ విధానాలు ఏ భాష నేర్చుకుందికైనా మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము? శాస్త్రీయమైన పద్ధతి ఇది తెలుసుకొని అనుసరించడమే ఈ వ్యాసం లక్ష్యం. గిడుగు రామమూర్తిగారి జీవితం మొత్తం పాఠ్యప్రణాళికలో పెడితే అటువంటివి చదివిన విద్యార్థులకు ఇన్ని పనులు ఒకవ్యక్తి చేయడం సాధ్యమా? అనిపిస్తుంది.
పోలియోగ్రఫీ: ఆ రోజులలో ఆలయాలలో ఉండే శాసనాలను దేవతలు రాశారు అని ప్రజలు భావించి అదే ప్రచారం చేసేవారు. కళింగరాజులతో స్నేహబాంధవ్యాలు ఉండడం వలన నారాయణదేవుగారి లైబ్రరీలో బర్నల్ దొరగారు రాసిన ‘సౌత్ ఇండియన్ పోలియోగ్రఫీ’ అనే పుస్తకము కోరిన వెంటనే జమీందారుగారు తెప్పించి ఇచ్చారు. గిడుగు రామమూర్తిగారికి అది ఎంతో ఉపయోగపడింది.
శ్రీముఖలింగేశ్వర ఆలయంలోగల 11 శిలా శాసనాలను అనర్గణంగా చదివేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. అదేవిధంగా తామ్రశాసనాలను కూడా పరిశీలించి ఆంగ్ల దొరలకు ఉత్తరాల ద్వారా అనేక విషయాలు తెలియపరచారు. అదే విధంగా ప్రాచీన నాణేల ప్రాముఖ్యం కూడా అర్థం చేసుకుని అనేక నాణాలు సంపాదించి వాటిని ‘కాయిన్స్ ఆఫ్ సదరన్ ఇండియా’ పుస్తకంతో పోల్చి చూసుకొని క్షేత్ర మహత్యాన్ని, చరిత్రను సమన్వయపరచారు. 35 పేజీల అధోజ్ఞాపికలతో, ప్రామాణిక సూచనలతో, వంశవృక్షాలతో రాసిన వ్యాసం ‘మద్రాస్ జనరల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్’ వారికి పంపగా వారు ప్రచురించారు. అది మన దక్షిణాపథంలోని తెలుగుశాసనాల యొక్క ప్రాముఖ్యతకు ప్రమాణాలు అని అర్థం అవుతుంది. ఇతని పరిశోధనా ఫలితాలను అనేకమంది చరిత్రకారులు ఆమోదించారు. వీరు అనేకమంది యువ పరిశోధకులకు శిక్షణ ఇవ్వడం వలన వారుకూడా ప్రాచీన లిపి నేర్చుకుని, శాసనాలను ప్రకటించేవారు.
వ్యావహారిక భాషావాదము: 1910లో పదవీవిరమణ తరువాత వాడుకభాషను ఉద్యమంగా చేపట్టారు. గురజాడ అప్పారావుగారు, కందుకూరి వీరేశలింగముగారు ఇతనికి పూర్తి సహాయ సహకారాలు అందజేశారు. పత్రికలు ఎక్కువమందికి చేరువ కావాలంటే గ్రాంథిక భాష కంటే వాడుక భాషలోనే ఉండాలని భావించారు. గిడుగువారు తన వినికిడిని పోగొట్టుకోవడంతో పాటు మిత్రులిద్దరినీ కూడా 1915&1919 సరికి కోల్పోయారు. అయినా అతనికి గల పట్టుదల అతని కడవరకూ తోడుంది. ప్రజలకు వారి భాషలోనే కావ్యాలైనా, విజ్ఞానమైనా అందించాలని ధృఢంగా నమ్మారు. అక్షరాస్యతతోనే తెలుగు భాషాభివృధ్ధి సాధ్యమని, మాతృభాషాభివృధ్ధికి పాటుపడాలని ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాడాలని ప్రచారం చేశారు.1919-20లో వ్యవహారిక భాషోద్యమ ప్రచారంకోసం ‘తెలుగు’ అనే మాసపత్రికను నడిపారు. ప్రముఖ సంప్రదాయవాదులు అతని వాదనలోని నిజాన్నీ, నిజాయితీని గ్రహించి సహాయంగా నిలిచారు. క్రమంగా పత్రికలన్నీ వాడుక భాషలోనే రచనలను ప్రచురించాయి. సిధ్ధాంతగ్రంథాలు కూడా ఆమోదించబడ్డాయి.
భాషాభిమానము: ‘ఉన్నఊరూ-కన్నతల్లీ’ అంటారు పెద్దలు. అటువంటిది 55 సంవత్సరాలు గడిపిన పర్వతాలపేటను తెలుగుభాషకోసం తృణప్రాయంగా వదిలేశారు. 1936లో ఒరిస్సా రాష్ట్రము ఏర్పడినప్పుడు అనేక తెలుగుగ్రామాలు ఒరిస్సాలో చేరవలసి వచ్చినపుడు తన తెలుగు భాషకోసం తన చిరకాలమిత్రుడు విక్రమదేవ్ వర్మతో విభేదించారు. తాను ఉంటున్న ఊరినీ, ఇంటినీ వదిలేసి వచ్చేశారు. తెలుగు ప్రజల గుండెలలో చిరస్థాయిగా ఉంటారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారు రామమూర్తిగారి పుట్టినరోజుని ‘మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించి వేడుకలు చేసుకుంటున్నారంటే తెలుగువారికి గర్వకారణం. 77సం:లు సవరజాతి కోసం, శాసనాల కోసం, వ్యవహారభాష కోసం, తెలుగుఉనికి కోసం జీవితాన్ని వెచ్చించిన గిడుగు రామమూర్తిగారిని ప్రజలు ముద్దుగా ‘మా గిడుగు- పిడుగు’ అని పిలుచుకుంటారు.