చిరుజల్లు-34

0
3

అవతలి కోణం

[dropcap]మ[/dropcap]ల్లిక చాలా ఏళ్ల తరువాత ఏదో పని మీద మారేడ్‌పల్లి వెళ్లింది. పని పూర్తి అయ్యాక, తిరిగి వెళ్లేటప్పుడు ఒకసారి కామేశ్వరమ్మగారిని కూడా పలకరించాలని అనుకున్నది. ఆ సమయంలో వాసంతి కూడా మల్లికతో పాటు ఉన్నది. వాసంతిని కూడా తనతో రమ్మన్నది.

“ఆవిడెవరో నాకు తెలియదుగదా. వాళ్లింటికి నేనెందుకు? నువ్వు వెళ్లు, నన్ను వదిలెయ్” అన్నది వాసంతి.

“ఆవిడ చూడదగిన వ్యక్తి. అందుకే నిన్ను రమ్మంటున్నాను” అన్నది మల్లిక.

“ఏమిటి ఆమె గొప్పదనం?” అని అడిగింది వాసంతి.

“తల్చుకుంటే, గొప్ప వ్యక్తుల జాబితాలో చేరగల వ్యక్తి. సెలబ్రిటీగా పేరు తెచ్చుకోగల మనిషి. కోరుకున్న మనిషి కోసం తన అవకాశాలన్నీ వదులుకుంది. పోనీ ఆ మనిషితో నైనా సుఖంగా జీవించిందా అంటే అదీ లేదు. ఆయన కొన్నాళ్ల తరువాత ఆమెను వదిలేశాడు…” అన్నది మల్లిక.

“పాపం… మరెలాగ” అన్నది వాసంతి.

“ఏమో మరి? ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం” అన్నది మల్లిక.

కామేశ్వరమ్మగారి ఇంటి ముందు ఆగి, ఒకసారి ఆ ఇంటి వైపు చూశారు. ఇల్లు చాలా పాతది అయిపోయింది. గోడలకు సున్నాలు వేయించి ఎన్నేళ్లో అయినట్లుంది. కొన్ని చోట్ల గోడలకు పెచ్చులు ఊడిపోయినయి. ఇంట్లో ఎవరన్నా ఉంటున్నారా లేదా అన్నట్లుగా కళావిహీనంగా ఉందా ఇల్లు.

తలుపు తట్టిన కాసేపటికి కామేశ్వరమ్మగారు తలుపు తీసి ఎదురుగా నిలబడి, మల్లికను చూసి జీవం లేని నవ్వు నవ్వింది.

“రా, రా… చాలా కాలానికి వచ్చావు…” అని అహ్వానించింది.

వీళ్లు లోపలకు వెళ్లాక, లోపల ఉన్న ఒక యువకుడు వీళ్లని చూసి బయటకు వెళ్లాడు.

వాసంతిని కామేశ్వరమ్మగారికి పరిచయం చేసింది మల్లిక. ఆమె వీళ్ల యోగక్షేమాలు కనుక్కుంది. మల్లిక నాలుగు వైపులకూ దృష్టి సారించింది. ఒక వైపున రెండు చాపల మీద రెండు వీణలు ఉన్నాయి. అప్పటి దాకా ఎవరో సాధన చేసి వెళ్లినట్లున్నారు.

“ఉండు, కాఫీ తెస్తాను” అని లేవబోయింది కామేశ్వరమ్మగారు.

“ఇప్పుడు అవన్నీ ఏమీ వద్దండి. కాసేపు మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను” అన్నది మల్లిక.

అయుదుపదుల వయస్సులో ప్రవేశించినందు వలన చెంపల దగ్గర కనిపించే తెల్ల జుట్టు పెద్దరికాన్ని తెచ్చి పెట్టింది. ఆమె మాటల్లో ఎంతో ప్రశాంతత ద్యోతకమవుతోంది.

“ఎలా ఉన్నారు? కాలక్షేపం ఎలా అవుతోంది?” అని అడిగింది మల్లిక.

“ఎలా ఉన్నానో చూస్తూనే ఉన్నావు కదా. ఇక కాలక్షేపం అంటావా? దానికీ కొదవలేదు. వీణ నేర్చుకునేందుకు నలుగురైదుగురు పిల్లలు వస్తుంటారు. వాళ్లు లేనప్పుడు నా సంగీత ప్రపంచం నాకు ఉండనే ఉంది. కళ చేతిలో ఉన్న వాళ్లకు కాలక్షేపానికి లోటు ఉండదు. సంగీతం ఒక సముద్రం లాంటిది. ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటూనే ఉంటుంది” అన్నదామె.

భర్తకు దూరమైనందుల్ల పడుతున్న మనోవేదనను ఎక్కడా చూచాయిగా అయినా వ్యక్తం కానివ్వలేదు. అందుచేత మల్లిక అడిగింది.

“మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తి, ప్రతిభను ప్రదర్శించేందుకు దోహదం చేసే వ్యక్తి మరోకరు అండగా ఉంటే, మీరు ఎంతగానో రాణించేవారు. మీ పేరు దేశమంతా మారుమ్రోగిపోయేది. ఏమైనా మీ ప్రతిభకు, మీకున్న టాలెంటుకు తగిన పేరు రాలేదనే అనిపిస్తుందండి” అన్నది మల్లిక.

“ఎవరో ప్రోత్సహిస్తేనో, ఇంకెవరో దోహదం చేస్తేనో రాణించాలనుకునేవారు ఎంత కాలం రాణిస్తారు? తాటి చెట్టు ఎక్కే వాడిని ఎంత వరకు పైకి నెట్టగలరు?” అన్నది కామేశ్వరమ్మగారు.

భర్త విడిచిపెట్టిన తరువాత ఆమె ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నదో తెల్సుకోవాలనుకున్న మల్లిక ఈసారి సూటిగానే అడిగింది.

“మీరు చెప్పింది నిజమే. ఎన్ని కష్టాలు బాధ్యతలూ ఉన్నా, నా అనే వాళ్లతో కల్సి జీవించటంలో ఎనలేని తృప్తి, మనశ్శాంతి ఉంటాయి. నరసింహరావుగారితో కల్సి మీరు కాపురం చేస్తుంటే, ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే వాళ్లు కాదేమో అని అనిపిస్తుంటుంది…” అన్నది మల్లిక.

ఆమె దానికి సమాధానం చెప్పటం ఇష్టం లేనట్లు మౌనంగా ఉండిపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి, కొంచెం టైం తీసుకుని, నెమ్మదిగా అన్నది.

“ప్రతి మనిషిలోనూ మంచితనమూ, మృగత్వమూ కూడా దాగి ఉంటాయి. కొందరు మంచితనాన్ని మాత్రమే ప్రదర్శిస్తే, మరి కొందరు మృగత్వాన్ని మాత్రమే ప్రదర్శిస్తారు. ఇంకొందరు మంచితనం ముసుగులో మృగత్వాన్ని, మృగత్వం చాటున మంచితనాన్ని ప్రదర్శిస్తారు. రకరకాల మనుషుల సమూహాల మధ్య మనం బ్రతుకుతున్నాం. వీళ్లందరూ కలిస్తేనే ప్రపంచం…” అన్నదామె.

“ఏమైనా మీకు రావాల్సినంత గుర్తింపు, పేరు రాలేదేమో నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను…” అన్నది మల్లిక.

అంతటితో ఆ సంభాషణ తెగిపోయింది. ఇంకా దాన్ని పొడిగించటం ఆమెకు ఇష్టం లేదని అర్థమైంది.

మరి కొంతసేపు మరి కొన్ని విషయాల మీద సంభాషణ సాగింది. బయల్దేరబోయే ముందు, ఏమనుకుందో ఏమో, చెప్పవల్సింది, మనసున దాగి ఉన్నది చెప్పకుండా ఉండలేకపోయిందో ఏమో, కామేశ్వరమ్మగారే అన్నది.

“నేను ప్రేమే లోకమనికొని, ఆయన్నే నమ్ముకుని, ఆయిన వాళ్లందరినీ వదులుకొని వచ్చేశాను. ఇప్పుడు నాకు సంబంధించినంత వరకూ ఆయన లేరు. కొన్నాళ్లు బాధపడ్డాను. నాలో నేనే కుమిలి కుమిలి ఏడ్చాను. కొన్నాళ్లకు అలా ఏడుస్తూ కూర్చున్నందువల్ల లాభం లేదని తెల్సుకున్నాను. నా కన్నీళ్లు నేనే తుడుచున్నాను. దృఢ సంకల్పంతో లేచి నిలబడి, పరిస్థితులను చక్కదిద్దకొని, నా చుట్టూ ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. నడి వయస్సులో భర్తను పోగొట్టుకున్న ఎంతో మంది దురదృష్ణవంతురాండ్రులో నేను ఒకరిని అని అనుకున్నాను. నువ్వు అడిగిన ప్రశ్నకూ సమాధానం చెబుతాను. సిరి సంపదలు వదలుకున్నాను. పేరు ప్రఖ్యాతలనూ ఆశించలేదు. ప్రపంచంలో ధనవంతుల సంఖ్యా తక్కువగానూ, పేదవాళ్ల సంఖ్య ఎక్కువగానూ ఉంటుంది. నేను మెజారిటీ వైపు ఉన్నాను గదా..” అని జీవం లేని నవ్వు నవ్వింది.

“ఎంతో ప్రతిభ ఉండి మీరిలా సంగీతపు పాఠాలు చెప్పుకుంటూ మిగిలిపోవటమే విచారకరం. వెలుగులోకి వచ్చి ఉంటే సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేసి ఉండేవారు…” అన్నది మల్లిక.

ఇంక వెళ్తామని ఆమె దగ్గర శలవు తీసుకున్నారు. వీళ్లను సాగనంపేందుకు ఆమె గుమ్మం దాకా వచ్చింది.

“గార్డెన్ బాగా పెంచుతున్నారు” అన్నది మల్లిక.

“నాకు పూల మొక్కలు పెంచటం ఒక హాబీ. పూలు పూసిన తరువాత, ఆ పూలతో నేను మాట్లాడుతుంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో కొన్ని ఇష్టాలను పోగొట్టుకోకూడదు. ఇంటిని చూస్తున్నావు గదా ఇల్లు బాగు చేయించుకునే స్తోమత లేదు. నా ఇంట్లో రెండు వీణలు మ్రోగుతున్నంత కాలం, నా పెరట్లో రెండు గులాబీలు పూచినంత కాలం నేను నిరుపేదను కాను…” అన్నదామె నిండుగా నవ్వుతూ.

మల్లికా, వాసంతి బయటకు వచ్చారు. ఆటోలో వెళ్తున్నప్పుడు మల్లిక చెప్పింది.

“ఆమె భర్త ఈమెను ఇలా వదిలేసి మరొక శ్రీమంతురాలిని వివాహం చేసుకున్నాడు. ఇంతసేపు మనతో మాట్లాడినా ఆమె భర్త గురించి ఒక్క మాట అనలేదు. తాను దురుదృష్టవంతురాలిని అని మాత్రమే అన్నది. అక్కడే ఆమె సంస్కారం బయటపడుతోంది” అన్నది మల్లిక.

“అయితే ఆమె భర్త వివాహం చేసుకున్న మరో స్త్రీ.. ఆమె ఎలాంటిదో, ఏమంటుందో?” అన్నది వాసంతి.

“ఆమె కూడా నాకు తెల్సు. రేపు ఒకసారి వెళ్లి ఆమెనూ పలకరిద్దాం” అన్నది మల్లిక.

మర్నాడు సాయంత్రం ఆ బంగళా ముందు గేటు తీసుకొని లోపలికి వెళ్లారు. కుక్కపిల్లల అరుపులు, నౌకర్ల ఎంక్వయిరీలు అయ్యాక లోపలికి వెళ్లారు. అయిదు నిముషాలు సోఫాలో కూర్చుని ఎదురు చూశాక ప్రసన్న వచ్చి వాళ్లకు ఎదురుగా కూర్చుంది.

“ఏమిటి చాలా రోజులకు కనిపించావు?” అన్నది ప్రసన్న నవ్వుతూ.

“ఇటు వైపు పని మీద వచ్చాం. మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్లాలనిపించింది.. అందుకని పిలవకపోయినా వచ్చాం..” అన్నది మల్లిక.

ఆయన కవి. ఆయన గురించి కాసేపు ప్రశంసలు గుప్పించింది మల్లిక. ఆమె సంతోషించింది.

“ఆయనకు ప్రేరణ మీరేననుకుంటా…” అన్నది మల్లిక.

“ఆ విషయం ఆయనే అందరితో చెబుతుంటారు. ఏ కళాకారుడు అయినా, ఏ కళలో అయినా అత్యున్నత శిఖరాలు చేరుకోవాలంటే, అందుకు తగిన వాతావరణం, ప్రోత్సాహం ఉండాలి. ఉత్సాహాన్ని ఇచ్చే సహచరణి లభించినప్పుడే, వాళ్లు గమ్యాన్ని చేరుకోగలగుతారు. మానసికంగా కృంగిపోయి, అనుక్షణం వారిని కృంగదీస్తుంటే, ఏ ఆర్టిస్ట్ అయినా ఏం ఎదుగుతాడు?” అని అడిగిందామె.

“నిజమే నండి” అని మల్లిక ఆమెతో అంగీకరించింది.

“సారము లేనిది సంసారము కాదు. ఇవాళ ఆయన ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారంటే, మీలాంటి వాళ్లు ఆయన్ను చూడటానికి ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నారంటే, ఇదంతా నేను కల్పించిన వాతావరణం, ఇస్తున్న ఉత్సాహం, ప్రోత్సాహం వల్లనే కదా..” అన్నది ప్రసన్న.

“నిజమేనండి. కానీ ఎటొచ్చీ ఆయనకు ఇంతకు ముందొక వివాహం అయింది గదా. ఆమె ఖర్మకు ఆమెను వదిలేశారన్నాదే చిన్న బాధ..” అన్నది మల్లిక.

“వాళ్లు విడిపోవటానికి నేను ఎంత మాత్రం కారణం కాదు. ఏ మాత్రం ఇష్టం లేకుండా జీవితామంతా నిస్సారంగా జీవించటం ఎవరి మెప్పు కోసం? జీవితంలో మనసులు కల్సి, ఒకరి నొకరు అర్థం చేసుకుని, కల్సి జీవించాలనుకోవటంలో తప్పేమీలేదు. ఇంక లోకం అంటావా? ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. లోకులు కాకులు గదా. ఎవరో ఏదో అనుకుంటారని మనం అదృష్టాన్ని కాలదన్నుకోనవసరం లేదు…” అన్నది ప్రసన్న.

ఇంకొంచెం సేపు ఆయన ఎంత గొప్ప కవీశ్వరుడో చెప్పాకా, ఆయన రాసిన ‘అవతలి కోణం’ పుస్తకాన్ని వాళ్లకు ఇచ్చింది ప్రసన్న.

“నిజానికి ఈ పుస్తకం ఆయన మీకు ఇవ్వాలి. నేను ఆయన భావుకతను గనుక నేను ఇస్తున్నాను” అన్నది ప్రసన్న నవ్వుతూ.

‘అవతలి కోణం’ అందుకుంటూ మల్లిక ఆమెకు థాంక్స్ చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here