విలక్షణమైన సీరీస్ ‘బెటర్ కాల్ సాల్’

0
3

[dropcap]ఇ[/dropcap]ద్దరు అన్నదమ్ముల కథ. ఇద్దరు ప్రేమికుల కథ. కొడుకుని నిరాశపరచిన తండ్రి కథ. తండ్రిని నిరాశపరచిన కొడుకు కథ. అన్నిటికీ మించి తన ఆత్మను అమ్ముకున్న ఒక లాయరు పూర్వాశ్రమం కథ. ‘బ్రేకింగ్ బ్యాడ్’ అనే సీరీస్‌లో సాల్ గుడ్మన్ ఒక లాయరు. డ్రగ్స్ తయారు చేసే ఒక గ్యాంగ్‌తో పని చేస్తాడు. ఆత్మసాక్షి లేని వాడు. ఆ సీరీస్ అయిపోయిన తర్వాత ఆ లాయరు అలా ఎందుకు మారాడో చూపించే సీరీస్ మొదలుపెట్టారు రచయిత పీటర్ గూల్డ్, పర్యవేక్షకుడు విన్స్ గిలిగన్. అదే ‘బెటర్ కాల్ సాల్’. ఇతర రచయితలు కూడా రచన చేశారు. ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. ఆరు సీజన్లు నడిచి ఈ మధ్యనే ముగిసింది. పెద్దలకు మాత్రమే. ఈ వ్యాసం మొత్తం ఆరు సీజన్ల సమీక్ష అయినా కథలోని ఒక సంఘటన తప్ప ముఖ్యమైన సంఘటనలు ప్రస్తావించలేదు. ఆ సంఘటన ప్రస్తావించే ముందు హెచ్చరిక ఉంటుంది.

నేను ‘బ్రేకింగ్ బ్యాడ్’ పూర్తిగా చూడలేదు. అప్పుడప్పుడూ కొన్ని భాగాలు చూశాను. అదైనా టీవీలో వచ్చినపుడే చూశాను. ఆ సీరీస్‌కి చాలా పేరొచ్చింది. అందులో ఒక రసాయన శాస్త్ర అధ్యాపకుడు తనకి క్యాన్సర్ అని తెలిసి ఎలాగూ చనిపోతాను కాబట్టి నా కుటుంబం కోసం డబ్బు సంపాదిస్తానని డ్రగ్స్ తయారు చేయటం మొదలుపెడతాడు. ఆ కథ నాకంత ఆకర్షణీయంగా అనిపించలేదు. ‘బెటర్ కాల్ సాల్’ మాత్రం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది చూడటం మొదలుపెట్టగానే. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి సీరీస్ చూడలేదు అనిపించింది. డబ్బు సంపాదన మాత్రమే లక్ష్యంగా బ్రతికే ఒక వ్యక్తి అలా ఎందుకు మారాడని చూపించే కథ ఇది. ఎవరూ లేని ఒంటరివాడు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. అంతా అతని తప్పేనా?

ఈ సీరీస్ ఒక ప్రీక్వెల్ (గత కథ) మాత్రమే కాదు, సాల్‌కి సంబంధించినంతవరకు సీక్వెల్ (కొనసాగింపు కథ) కూడా. అంటే ‘బ్రేకింగ్ బ్యాడ్’ తర్వాత సాల్ కథ ఏమైందనేది కూడా చూపించారు. ‘బ్రేకింగ్ బ్యాడ్’ కథ జరిగిన తర్వాత సాల్ పారిపోయి వేరే పేరుతో ఒక మాల్ లో చిన్న పేస్ట్రీ షాపులో మేనేజర్‌గా పని చేస్తుంటాడు. ఎప్పుడు ఎవరు తనను గుర్తు పట్టి పోలీసులకి అప్పగిస్తారో అని భయపడుతూ ఉంటాడు. ఈ సన్నివేశాలన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. ఈ సీరిస్ చివర అతని కథకి ముగింపు ఉంటుంది. చివరి నాలుగు ఎపిసోడ్స్ దాదాపు పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. ‘బ్రేకింగ్ బ్యాడ్’ చూడకపోయినా ఈ సీరీస్ చూడవచ్చు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నవి భవిష్యత్తులో జరిగే సంఘటనలని గుర్తు పెట్టుకుంటే చాలు.

‘బెటర్ కాల్ సాల్’ అంటే ‘వెంటనే సాల్‌ని సంప్రదించండి’ అనే అర్థం చెప్పుకోవచ్చు. ప్రకటనల్లో “మీకేదైనా సమస్య ఉంటే నేను సాయం చేస్తాను. వెంటనే నన్ను సంప్రదించండి’ అంటాడు సాల్. సాల్ ఒక చిన్నపాటి లాయరుగా ఉన్నప్పుడు కథ మొదలవుతుంది. అతని అసలు పేరు జిమ్మీ మెగిల్. కేసులు చేజిక్కించుకోవటానికి, తీర్పు తనకు అనుకూలంగా రావటానికి అడ్డదారులు తొక్కడానికి వెనుకాడడు. అతని అన్నగారు చక్ మెగిల్ ఒక పెద్ద లాయరు. భార్యతో విడాకులైపోయాయి. పిల్లలు లేరు. హెచ్ హెచ్ ఎమ్ అనే ఒక పెద్ద లాయర్ల సంస్థలో పని చేస్తుంటాడు. ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో అతను ఒకడు. హెచ్ హెచ్ ఎమ్ లో ఎమ్ అంటే మెగిల్. ఇక్కడ గతం కొంచెం చెప్పుకోవాలి. చిన్న చిన్న మోసాలు చేసి డబ్బు సంపాదించుకునే జిమ్మీ తాను మారిపోయానని చెప్పటంతో చక్ తన సంస్థలో చిన్న ఉద్యోగం వేయించాడు. జిమ్మీ మోసాలు చేయటానికి ఎందుకు అలవాటు పడ్డాడు? వారి తండ్రి అమాయకుడు. ఎవరేం చెప్పినా నమ్మేసే రకం. అతన్ని చాలామంది చిన్న మొత్తాల కోసం మోసం చేయటం జిమ్మీ చూశాడు. అందుకే మోసాలు నేర్చుకున్నాడు. అది అతని స్వభావంగా మారిపోయింది. ఉద్యోగంలో చేరిన తర్వాత దూరవిద్యలో లా చదివాడు జిమ్మీ. కానీ హెచ్ హెచ్ ఎమ్ లో లాయరుగా ఉద్యోగం దొరకలేదు. సొంతగా లాయర్ ప్రాక్టీసు పెట్టుకున్నాడు. అయితే చట్టంలోని లొసుగులు వాడుకోవటానికే తన విద్యని ఉపయోగిస్తాడు.

చక్ కి ఒక వింత వ్యాధి సోకుతుంది. దాని పేరు ఎలెక్ట్రోమేగ్నెటిక్ హైపర్ సెన్సిటివిటీ (EHS).  విద్యుత్తు ప్రసారం జరిగే చోట ఉండలేడు. బ్యాటరీలు కూడా సరిపడవు. ఒంటిలో నొప్పి, మంటలు పుట్టినట్టుంటుంది. డాక్టర్లెవరూ చక్‌కి ఈ వ్యాధి ఉందని నిర్ధారించరు. కానీ అతను తనకు ఆ లక్షణాలు ఉన్నాయని అంటాడు. ఆధునిక ప్రపంచంలో విద్యుత్తు, బ్యాటరీలు లేనిదెక్కడ? అందుకే బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే విద్యుత్తూ, బ్యాటరీలు లేకుండా ఉంటాడు. ఉద్యోగం మాత్రం వదలడు. ఈ వ్యాధి శారీరకమైనదా, మానసికమైనదా? శారీరకమైనదే అంటాడు చక్. జిమ్మీ చక్‌కి కావలసినవన్నీ ఓపికగా తెచ్చి పెడుతుంటాడు. అన్నగారిని చూసుకోవటం తన బాధ్యత అంటాడు.

చక్ & జిమ్మీ

హెచ్ హెచ్ ఎమ్ అధిపతి హవర్డ్. అతను తనకి లాయరుగా ఉద్యోగం ఇవ్వలేదని జిమ్మీకి అతని మీద కసి. పైగా అనారోగ్యంతో ఉన్న చక్ కావలిసినంత డబ్బు తీసుకుని ఉద్యోగం వదిలేయవచ్చు కదా అంటాడు హవర్డ్. కుదరదంటాడు జిమ్మీ. జిమ్మీ మంచి మాటకారి. ముసలివాళ్ళకి వీలునామాలు రాసిపెట్టే పని మొదలుపెడతాడు. ఇక్కడ మోసాలేమీ ఉండవు. వారికి నిజంగానే సహాయం చేస్తాడు. ఎవరూ పట్టించుకోని వారిని జిమ్మీ ఆదరంగా చూసి వారి పని చేసిపెడతాడు. ఈ క్రమంలో ఒక వృద్ధాశ్రమంలో జరిగే అక్రమాలు తెలుస్తాయి. దాని మీద ఒక దావా వేద్దామని అన్నగారిని సలహా అడుగుతాడు. అది మంచి కేసని చక్‌కి తెలుసు. పెద్ద కేసు కాబట్టి హెచ్ హెచ్ ఎమ్ కి అప్పగించాలని అంటాడు. జిమ్మీ బయట నుంచి పని చేయవచ్చని అంటాడు. అయితే తమ్ముడి మీద కొంత ఈర్ష్య ఉంటుంది. అల్లరిచిల్లరిగా తిరిగేవాడు లాయరేమిటి అని అతని భావన. ఈ భావన తప్పు కాదు. అందుకు ఒక ఉదాహరణగా జిమ్మీ చేసిన ఒక గిమ్మిక్కుని చెప్పుకోవచ్చు.

హెచ్ హెచ్ ఎమ్ సంస్థ లోగోని అనుకరిస్తూ జిమ్మీ జె ఎమ్ ఎమ్ అనే లోగో తయారు చేస్తాడు (జిమ్మీ పూర్తి పేరు జేమ్స్ ఎమ్ మెగిల్). హైవే పక్కన ఒక పెద్ద హోర్డింగ్ మీద ఆ లోగోని ప్రదర్శిస్తాడు. హెచ్ హెచ్ ఎమ్ వారు అతని మీద దావా వేస్తారు. కోర్టు అతన్ని ఆ లోగో వాడొద్దని చెబుతుంది. హైవే పక్కన ఉన్న హోర్డింగ్ మీద ప్రదర్శించిన లోగోని తొలగించటానికి జిమ్మీ ఒకతన్ని నియమిస్తాడు. ఈ తతంగమంతా వీడియోలో రికార్డ్ చేయిస్తాడు (అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేవు). నడుముకి తాడు కట్టుకుని హోర్డింగ్ పైకి ఎక్కినతను జారిపడి వేలాడుతుంటాడు. జిమ్మీ పైకెక్కి అతన్ని పైకి లాగి కాపడతాడు. వీడియోని వార్తల్లో ప్రసారం చేస్తారు. జిమ్మీని సాహసవంతుడని పొగుడుతారు. ఇది చూసిన చక్ “అలా ఎవరూ పడిపోరు. ఇది కావాలని చేసిన పనే. ఇలాంటి పనులు జిమ్మీకి అలవాటే” అంటాడు. ఇలాంటి పనులు చేసేవారు లాయరు వృత్తికి అవమానం తెస్తారని అతని అభిప్రాయం. అయితే వృద్ధాశ్రమం కేసులో జిమ్మీ మనసుపెట్టి పని చేశాడు. ఆ విషయం చక్ నమ్మడు. తప్పెవరిది? నమ్మి కేసు అప్పగిస్తే జిమ్మీ తన ప్రయోజనాల కోసం గిమ్మిక్కులు చేయడని నమ్మకం ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో చక్ ఏం చేశాడనేది ఆసక్తికరం.

కిమ్

హెచ్ హెచ్ ఎమ్ లో లాయరుగా పనిచేసే కిమ్‌కి జిమ్మీ అంటే ప్రేమ. అతనికి ఎప్పుడూ అండగా ఉంటుంది. అతను లాయరుగా నిలదొక్కుకోవాలని కోరుకుంటుంది. అతను చేసే గిమ్మిక్కులకి ఆమెకి అసహనం వస్తుందని మనం అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరంగా ఆమె అతని చేయి వదిలిపెట్టదు. జిమ్మీకి సాయం చేసిందని కిమ్ మీద కోపంగా ఉంటాడు హవర్డ్. ఆమెకి ఆమె స్థాయికి తగని పనులు అప్పగిస్తాడు. జిమ్మీ వల్లే ఇదంతా జరిగినా కిమ్‌కి జిమ్మీ మీద కోపం రాదు. పైగా హవర్డ్ మీద కక్ష పెంచుకుంటుంది. సీరీస్ చివరికొచ్చేసరికి జిమ్మీకి, కిమ్‌కి హవర్డ్ మీద పగ తీర్చుకోవాలనే కోరిక పెరుగుతుంది. చిన్నతనంలో కిమ్ తల్లి ఆమె చేత చిన్న చిన్న దొంగతనాలు చేయించేది. ఆమెకి ఆ అపరాధభావం మనసులో నాటుకుపోయింది. అయితే జిమ్మీని చూసి ఆమె నాలాగా ఇంకా ఎందరో ఉన్నారు అనుకుని అతన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అతనికి మోసాల్లో సాయపడుతుంది. ఇది ఎంతవరకు వెళుతుందంటే – ఒకసారి జిమ్మీ చేసిన పనికి కిమ్ చేష్టలుడిగి ఉండిపోయినపుడు ఆమె ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంటుంది. అమెరికాలో భర్త కోర్టు కేసులో ఇరుక్కుంటే భార్య అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటానికి నిరాకరించవచ్చు. అలాగే భార్య విషయంలో భర్త కూడా. చట్టం ఇందుకు అనుమతిస్తుంది. భార్యాభర్తల సంబంధం లేకపోతే సాక్ష్యం కోసం పిలిస్తే వెళ్ళాలి. అప్పుడు నిరాకరించటం కుదరదు. అందుకని ఆమె జిమ్మీని పెళ్ళి చేసుకుంటుంది! ఇదో వింత మనస్తత్వం. ఎవరినైనా మోసం చేసినపుడు వారిలో ఒకరి మీద ఒకరికి లైంగిక వాంఛ ఎక్కువగా కలుగుతుంది. చిన్నతనంలో ఎదురైన అనుభవాలు పెద్దయ్యాక జీవితాలని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. అయితే ఏం జరిగినా వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ మాత్రం తగ్గదు. ఇది అసాధారణమైన ప్రేమకథ. మామూలుగా తమ సొంత ప్రయోజనాల కోసం మోసాలు చేసే వీరిద్దరూ పోను పోను పగ తీర్చుకోవటానికి మోసాలు చేయటం మొదలుపెడతారు. చివరి సీజన్‌కి వచ్చేసరికి జిమ్మీ సాల్ గుడ్మన్ అని పేరు మార్చుకుంటాడు. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నవారికి సాయం చేస్తుంటాడు. తప్పు చేసినవారినైనా తప్పిస్తాను అంటాడు. కిమ్ తెలీక తప్పులు చేసిన వారికి లాయరుగా సాయం చేస్తూ ఉంటుంది. ఇద్దరూ మోసాలు మాత్రం మానరు. వారు చేసిన ఒక మోసానికి ఎదురైన పరిణామంతో సాల్, కిమ్ నిశ్చేష్టులౌతారు. దు:ఖంలో కిమ్ “మనం ఒకరికొకరు నష్టం చేసుకోవటమే కాక మన చుట్టూ ఉన్నవారందరికీ నష్టం చేస్తున్నాం” (We are not just bad for each other. We are bad for everybody around us.) అంటుంది. ఆ పరిణామాలు ఏమిటనేది చూసి తీరాల్సిందే. ‘బ్రేకింగ్ బ్యాడ్’ చూసినవారికి ఈ పరిణామాలు చూస్తే ఇంకా బావుంటుంది.

ఇంకో పాత్ర మైక్. పోలీసుగా పని చేసి రిటైర్ అయినవాడు. అతని కొడుకు తండ్రిని ఆదర్శంగా తీసుకుని పోలీసు అవుతాడు. అయితే మైక్ ఎప్పుడో అవినీతికి అలవాటు పడ్డాడు. డ్రగ్స్ మాఫియా నుంచి డబ్బులు తీసుకుని చూసీ చూడనట్టు వదిలేస్తాడు. అతని కొడుక్కి ఈ విషయం తెలియదు. తండ్రి నీతిమంతుడని అనుకుంటాడు. ఒకసారి అవినీతి పని చేసే అవకాశం కొడుక్కి వస్తుంది. తండ్రిని సలహా అడిగితే ఆ పని చేయకపోతే తోటి పోలీసులే అతణ్ణి శత్రువులా చూస్తారని మైక్ అంటాడు. దాంతో కొడుక్కి తండ్రి కూడా అవినీతిపరుడేనని తెలుస్తుంది. మనసు విరిగిపోతుంది. అవినీతికి ఒప్పుకుని డబ్బు తీసుకుంటాడు. అయితే అతన్ని ఎవరో చంపేస్తారు. కొడుకుని నిరాశపరచిన తండ్రిగా మైక్ మిగిలిపోతాడు. అతనికి కోడలు, మనవరాలు ఉంటారు. వారు జిమ్మీ ఉన్న ఊరికి నివాసం వస్తారు. మైక్ కూడా వారి కోసం ఆ ఊరికి వస్తాడు. వారి క్షేమమే జీవితలక్ష్యంగా బతుకుతాడు. వారికి మంచి జీవితం ఇవ్వటం కోసం అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తాడు. అయితే జీవితాంతం మానసిక సంఘర్షణ అనుభవిస్తాడు. కానీ నైతికత ఉన్న పాత్ర. అడ్డదారుల్లో నైతికత ఉంటుందా అంటే ఉంటుంది. మహాభారతంలో కర్ణుడికి ఉన్న నైతికతే. మైక్ పాత్ర ‘బ్రేకింగ్ బ్యాడ్’ లో కూడా ఉంటుంది.

లాలో

మరో పాత్ర నాచో. ఒక డ్రగ్స్ మాఫియాలో పని చేస్తుంటాడు. అతని తండ్రి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అతనికి కొడుకు చెడు సహవాసాలు ఇష్టం ఉండవు. నాచోకి తండ్రి అంటే అమితమైన ప్రేమ. నాచో తండ్రి వ్యాపారాన్ని డ్రగ్స్ సరఫరా వాడుకోవాలని మాఫియా నాయకుడు హెక్టర్ నిర్ణయిస్తాడు. నాచో బతిమాలినా వినడు. తన తండ్రి కోసం హెక్టర్ ప్రాణం తీయటానికి సిద్ధపడతాడు నాచో. గుండె జబ్బుకి అతను వాడే మందులని మార్చి పనికిరాని మందులని పెడతాడు. ఈ సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. హెక్టర్‌కి ఒక మేనల్లుడు ఉంటాడు. అతని పేరు లాలో. అతను పరమ కిరాతకుడు. అతనికి నాచో చేసిన పని తెలిస్తే నాచోకి, అతని తండ్రికి కూడా ప్రమాదమే.

నాచోకి జిమ్మీ పరిచయమయ్యే సన్నివేశం హాస్యభరితంగా ఉంటుంది. ఒక గవర్నమెంటు ఉద్యోగి నిధులు స్వాహా చేసి పట్టుబడతాడు. అతనికి జిమ్మీ లాయరుగా ఉంటానంటాడు. అతని భార్య బెట్సీకి జిమ్మీ మీద నమ్మకం లేక ఒప్పుకోదు. ఇదిలా ఉండగా జిమ్మీకి ఇద్దరు యువకులు పరిచయమౌతారు. వారు స్కేటింగ్ చేసుకుంటూ కార్లకి అడ్డుపడి, గాయపడినట్టు నటించి యజమానుల దగ్గర డబ్బు గుంజుతూ ఉంటారు. వారిని బెట్సీ కారుకి అడ్డుపడి, ఆమెని బెదిరించమని జిమ్మీ పంపిస్తాడు. అప్పుడు ఆమెని ఆ కేసు నుంచి తప్పించినట్టు నటించి నిధుల స్వాహా కేసుని పట్టేద్దామని జిమ్మీ పథకం. అయితే ఆ యువకులు వేరే కారుకి అడ్డుపడతారు. ఆ కారు యజమాని ఓ ముసలావిడ. అయోమయంలో ఎవరో తన కారుకి గుద్దుకుని అవతల పడ్డారని తెలియక వెళ్ళిపోతుంది. వీళ్ళు ఆమెని వెంబడిస్తారు. ఆమె హెక్టర్ మరో మేనల్లుడైన టూకోకి నానమ్మ. టూకో కాస్త ఉన్మాదం కలవాడు. అతని అనుచరుల్లో నాచో ఉంటాడు. టూకో ఆ ఇద్దరు యువకుల్ని, జిమ్మీని బంధిస్తాడు. జిమ్మీ గత్యంతరం లేక నిజం చెబుతాడు. బెట్సీ భర్త దగ్గర చాలా డబ్బుందని కూడా చెబుతాడు. నాచో ఆ డబ్బు దొంగిలించాలని వెళతాడు. కానీ అప్పటికే బెట్సీ, ఆమె భర్త డబ్బు తీసుకుని పారిపోతారు. నాచో మాత్రం పట్టుబడతాడు. జిమ్మీ అతన్ని తప్పిస్తాడు. ఆ విధంగా పరిచయమైన జిమ్మీని తర్వాత లాలోకి లాయరు అవసరం కావటంతో అతనికి పరిచయం చేస్తాడు నాచో. లాలో జిమ్మీని తన పనులకి వాడుకుంటాడు. ఈ పనులు ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా ఉంటాయి. చివరి సీజన్లో ప్రేక్షకులు నోరు వెళ్ళబెట్టేంత దారుణాలు జరుగుతాయి. అప్పటి నుంచి లాలో అంటే జిమ్మీకి విపరీతమైన భయం. ‘బ్రేకింగ్ బ్యాడ్’ లో కూడా లాలో ఎప్పటికైనా వస్తాడని భయపడుతూ ఉంటాడు సాల్ (అంటే జిమ్మీ).

నాచో, టూకో, మైక్

ఫ్రింగ్ మరో మాఫియా నాయకుడు. ఒక రెస్టారెంట్ నడుపుతూ తెర వెనక డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. హెక్టర్ కి ఇతను పోటీ. ఇద్దరూ తాము డ్రగ్స్ సరఫరా చేసే ప్రాంతాలని పంచుకుంటారు. వీళ్ళిద్దరికీ ఒకడే బాస్. ఫ్రింగ్ భూగర్భంలో ఒక రహస్య డ్రగ్స్ తయారీ లాబొరెటరీ కట్టి సొంతంగా వ్యాపారం చేయలనుకుంటాడు. దాని కోసం జెర్మన్ ఇంజినీర్లని రప్పిస్తాడు. ఎవరికీ తెలియకుండా వారు తమ పని చేస్తుంటారు. వారికి మైక్ కాపలా. ఫ్రింగ్ రహస్యంగా ఏదో చేస్తున్నాడని లాలోకి అనుమానం వస్తుంది. అదేమిటో తెలుసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఈ సన్నివేశాలన్నీ ఊపిరి బిగపట్టి చూసేలా ఉంటాయి.

అన్నదమ్ముల మధ్య తగాదాలు వస్తే ఎలా ఉంటుందో మనకందరికీ కొద్దో గొప్పో తెలుసు. చక్‌కి న్యాయవాద వృత్తి అంటే అమిత గౌరవం. జిమ్మీ లాంటి వారు ఆ వృత్తికి తగరు అని అతని అభిప్రాయం. జిమ్మీ మంచివాడేనని అయితే ఒక మంచి ప్రయోజనం పేరు చెప్పి తప్పుడు పనులు చేయటం తప్పు అని చక్ అంటాడు. జిమ్మీ మాత్రం మంచి జరుగుతున్నప్పుడు మార్గం ఏదైతే ఏంటి అంటాడు. ఒక సందర్భంలో ఇద్దరి తగాదా కోర్టు దాకా వెళుతుంది. ఈ సన్నివేశం కథలో ముఖ్యమైనది. మూడో సీజన్లో వస్తుంది. తెలుసుకోవద్దనుకునేవారు క్రింద చుక్కలు వచ్చేదాకా వదిలి ఆ క్రింద చదవండి.

జిమ్మీకి చక్ మీద, హవర్డ్ మీద కోపమొస్తుంది. ఎందుకు అనేది పక్కన పెడదాం. ఆ కోపం సమంజసమైనదే. దాంతో వారిద్దరి పనికీ విఘాతం కలిగిస్తాడు రహస్యంగా. జిమ్మీయే తమ పని చెడగొట్టాడని చక్‌కి అనుమానం వస్తుంది. కానీ ఋజువు దొరకదు. తన పేరు చెడిపోవటంతో తట్టుకోలేక చక్ ఉద్యోగం మానేస్తానంటాడు. తన పొరపాటు వల్లే పని చెడిపోయిందని కుంగిపోతాడు. జిమ్మీ పశ్చాత్తాపంతో తానే వారి పని చెడగొట్టానని ఒప్పుకుంటాడు. ఆ మాటలను చక్ రికార్డు చేస్తాడు. ఆ విషయం జిమ్మీకి తెలుస్తుంది. కొంత గొడవ జరిగాక తగాదా కోర్టుకి వెళుతుంది. జిమ్మీ లాయరుగా ఉండటానికి తగడని చక్ దావా వేస్తాడు. జిమ్మీ మాత్రం తాను చక్‌కి ఎలాంటి ద్రోహం చేయలేదని, అతను ఉద్యోగం మానేస్తాననటంతో అతని బాధ చూడలేక అతనికి ఊరట కలిగించటానికి అతనికి అబద్ధం చెప్పానని అంటాడు. నిజానికి ఇదే అబద్ధం.

విచారణ జరిగే సమయంలో చక్ కోసం కోర్టు వారు విద్యుత్తు సంబంధమైన వస్తువులేం లేకుండా ఏర్పాటు చేస్తారు. అందరి సెల్ ఫోన్లు, వాచీలు సేకరించి బయటపెడతారు. జిమ్మీ తన సెల్ ఫోన్ తన కార్లో ఉందని అంటాడు. విచారణలో చక్ రికార్డు చేసిన టేపు అందరూ వింటారు. చక్ తరఫు లాయరు “టేపులో మీరు వింత వింతగా మాట్లాడారు కదా. ఏమిటి కారణం?” అంటాడు. “అదంతా నటన. జిమ్మీ చేత నిజం చెప్పించటానికి” అంటాడు చక్. జిమ్మీ తన కేసు తానే వాదించుకుంటాడు.  చక్ తనను ద్వేషిస్తున్నాడని, అందుకే ఈ దావా వేశాడని అంటాడు. నిజం చెప్పించటానికి నటించానని అంటున్నా తాను అతని బాధ చూసి అతనికి ఊరట కలిగించటానికి ఏమైనా అంటానని తెలిసి నటించాడని అంటాడు.

తర్వాత చక్‌ని ప్రశ్నిస్తాడు జిమ్మీ. “నీకు విడాకులయిన తర్వాత కొంతకాలానికి నీకు EHS వ్యాధి వచ్చింది కదా” అని జిమ్మీ చక్‌ని అడుగుతాడు. విడాకులకి, వ్యాధికి ఏం సంబంధం లేదంటాడు చక్. వ్యాధి లక్షణాలు ఏమిటని అడుగుతాడు. విద్యుత్తు దగ్గరలో ఉంటే నొప్పి, మంట ఉంటాయని అంటాడు. “మరి టేప్ రికార్డర్‌లో రికార్డు చేసినపుడు అసౌకర్యం ఏమీ లేదా?” అంటాడు జిమ్మీ. ఉంది కానీ పంటిబిగువున భరించాను అంటాడు చక్. జిమ్మీ చక్ దగ్గరకు వచ్చి “ప్రస్తుతం నొప్పి, మంట ఉన్నాయా?” అని అడుగుతాడు. చక్‌కి తమ్ముడి సంగతి తెలుసు. “జిమ్మీ! నువ్వేదైనా వస్తువు నీ జేబులో పెట్టుకున్నావా?” అని అడుగుతాడు. అవునని సెల్ ఫోన్ జేబులో నుంచి తీస్తాడు జిమ్మీ. చక్ అది తెరిచి చూస్తే అందులో బ్యాటరీ ఉండదు. “బ్యాటరీ లేదు. ఉండి ఉంటే నాకు నొప్పి, మంట ఎప్పుడో మొదలయ్యేవి. నీ సంగతి నాకు తెలుసు. ఇలాంటి వేషాలు నీకు కొత్త కాదు. నీ పాచిక పారలేదు” అంటాడు చక్. “నీ జేబులో ఏముందో చూసుకో” అంటాడు జిమ్మీ. చక్ చూసుకుంటే బ్యాటరీ అతని జేబులోనే ఉంటుంది. విచారణకి చక్ వచ్చేటపుడు ఒకతని చేత ఆ బ్యాటరీ చక్ జేబులో వేయిస్తాడు జిమ్మీ. పూర్తిగా చార్జ్ చేసిన బ్యాటరీ జేబులో ఉన్నా చక్‌కి ఏమీ కాలేదంటే అతనికి శారీరకమైన వ్యాధి ఏదీ లేదని, మానసిక రుగ్మతతో నొప్పి, మంట ఉన్నట్టు ఊహించుకుంటున్నాడని ఋజువౌతుంది. చక్‌కి విపరీతమైన కోపం వస్తుంది. తాను మానసిక వ్యాధి కారణంగా పనిలో పొరపాటు చేశాననటం తప్పని అంటాడు. జిమ్మీయే పని చెడగొట్టాడని అరుస్తాడు. అతని స్వభావం తెలిసి కూడా అతనికి ఉద్యోగమిప్పిస్తే తనకే ద్రోహం చేశాడని అంటాడు. చిన్నప్పడు జిమ్మీ దొంగతనం చేశాడని చెప్పినా తలిదండ్రులు నమ్మలేదని అక్కసు వెళ్ళగక్కుతాడు. జడ్జీలు అతని అరుపులకి విస్తుపోతారు. కేసు కొట్టేస్తారు.

ఇలాంటి సంక్లిష్టమైన సన్నివేశాలు ఈ సీరీస్‌లో చాలా ఉంటాయి. జిమ్మీ చక్‌కి, హవర్డ్‌కి ద్రోహం చేశాడన్నది నిజమే. కానీ అతను వారు అన్యాయం చేశారనే భావంతో ఆ పని చేశాడు. తానే పొరపాటు చేశాననుకుని చక్ ఆ విషయాన్ని మరిచిపోతాడని అనుకున్నాడు. ఇంత సంపాదించాక ఇలాంటి విషయాలు వదిలెయ్యాలని అతని ఉద్దేశం. కానీ చక్ ఆ విషయాన్ని వదిలేయలేదు. తాను కుంగిపోయినట్టు నటించి జిమ్మీ చేత నిజం చెప్పించాడు. జిమ్మీ చేసింది తప్పే. అయితే అతను చేసిన ఇంకా పెద్ద తప్పు అన్నగారి మానసిక వ్యాధిని బహిరంగంగా బయటపెట్టడం. డాక్టరు అతని వ్యాధి మానసికమైనది ఎప్పుడో చెప్పింది. అయినా అన్నగారి మీద ప్రేమతో జిమ్మీ అతన్ని మానసిక వైద్యశాలలో చేర్పించలేదు. తనకు అవసరమైనప్పుడు మాత్రం అన్నీ పక్కన పెట్టేసి ఆ వ్యాధి మానసికమైనదని నిరూపిస్తాడు. తాను చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకుంటాడు. ఎవరిది తప్పు? తమ్ముడు లాయరయ్యాడనే విషయాన్ని జీర్ణించుకోలేని అన్నగారిదా? అన్నగారి వ్యాధిని బయటపెట్టి అతనికి అపఖ్యాతి తెచ్చిన తమ్ముడిదా? దీనికి సమాధానం ఉందా? ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదా? లేకపోతే చక్ జిమ్మీకి ఉద్యోగం ఎందుకు ఇప్పించాడు? జిమ్మీ అన్నగారి బాగోగులు ఎందుకు చూసుకున్నాడు? మానవ సంబంధాలలోని సంక్లిష్టత ఇలాగే ఉంటుంది. చక్ తన తమ్ముడు తన కంటే కింది స్థాయిలోనే ఉండాలని అనుకున్నాడు. జిమ్మీ తనకు న్యాయం అనిపిస్తే అన్నగారిని కూడా అభాసుపాలు చేశాడు.

మానసిక వ్యాధులు చాలా రకాలు ఉంటాయి. చక్‌కి విడాకులైనా అతనికి భార్య మీద ఇంకా ప్రేమ ఉంది. EHS గురించి విన్న చక్ విడాకులైన తర్వాత ఆ బాధ తట్టుకోలేక విద్యుత్తుని చూసి భయపడటం ప్రారంభిస్తాడు. ఇది Schizophrenia అనే మానసిక వ్యాధి. లేనిది ఉన్నట్టు ఊహించుకోవటం. కొందరికి లేని మనుషులు కూడా ఉన్నట్టు కనపడతారు. చక్ కి మాత్రం లేని నొప్పి, మంట ఉన్నట్టు ఊహించుకోవటంతో నిజంగానే నొప్పి, మంట కలుగుతాయి. డాక్టరు మానసిక వైద్యశాలలో చేరమని చెప్పినా వినడు. అహం అడ్డొస్తుంది. “నేను విద్యావంతుణ్ని. పేరున్న లాయరుని. నాకు పిచ్చి అంటారా? నాకున్నది శారీరకమైన వ్యాధి మాత్రమే” అంటాడు. శరీరాన్ని పరీక్ష చేయాలంటే విద్యుత్తు పరికరాలు వాడాలి. చక్ ఒప్పుకోడు. జిమ్మీ ఇంక ఏమీ చేయలేక చక్ కి కావలసినవి తెచ్చిపెడుతూ ఉంటాడు. చక్‌కి ఈ మాత్రం సాయం చేసేవారు దొరక్కపోరు. అయినా జీమ్మీ “నువ్వు నా అన్నయ్యవి కాబట్టి నేనే చేస్తాను” అంటాడు. జిమ్మీకి ప్రేమ ఉంది కానీ గౌరవం దక్కలేదు. చక్ అతని లాయరు వృత్తికే ఎసరు పెట్టాలని చూశాడు. జిమ్మీ తోక తొక్కిన పాములా రెచ్చిపోయాడు.

***

కథ కన్నా కథనం బావుంటుంది. ‘బ్రేకింగ్ బ్యాడ్’లో సాల్ తన అసలు ఇంటి పేరు మెగిల్ అని అంటాడు. లాలో గురించి భయపడతాడు. ఇలాంటి విషయాలని తీసుకుని అతని గతంలో జరిగిన కథని అల్లిన రచయితల ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కోసారి కథనం చాలా నెమ్మదిగా కదులుతున్నట్టు ఉంటుంది. కానీ ఎక్కడా విసుగు రాదు. ఒక్కోసారి పాత్రలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి అని అనుమానం వస్తుంది. కానీ ఆలోచించటానికి వ్యవధి కూడా ఉంటుంది. అరటిపండు వలిచి చేతిలో పెట్టరు రచయిత, దర్శకులు. ఓపిగ్గా చూడాలి. యాక్షన్ కోరుకునేవారికి ఈ సీరీస్ నచ్చకపోవచ్చు. ఫొటోగ్రఫీ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ సీరీస్‌కి ఈ సంవత్సరం 4 ఎమ్మీ నామినేషన్లు వచ్చాయి. అవి ఉత్తమ డ్రామా సీరీస్, ఉత్తమ రచయిత (థామస్ ష్నాజ్) ఉత్తమ నటుడు (జిమ్మీగా నటించిన బాబ్ ఓడెన్కర్క్), ఉత్తమ సహాయనటి (కిమ్ గా నటించిన రియా సీహార్న్) నామినేషన్లు. ఉత్తమ సీరీస్ అవార్డు రాకపోయినా ఉత్తమ రచయిత అవార్డు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నామినేషన్ల గడువు తేదీ ముగిసేసరికి సీరీస్ ఇంకా ముగియలేదు. కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ ఖచ్చితంగా నామినేషన్లు వస్తాయి. అప్పుడు ఉత్తమ డ్రామా సీరీస్ అవార్డు వస్తుందని నాకనిపిస్తోంది. ఎందుకంటే సీరీస్ చివరి భాగాలు అద్భుతంగా ఉన్నాయి. సరదాగా మోసాలు చేసే జిమ్మీ, కిమ్ ప్రపంచం, కిరాతకుడైన లాలో ప్రపంచం కాసేపు ఒకే చోటికి వస్తే ఎలా ఉంటుందో చూసి నోరు వెళ్ళబెట్టాల్సిందే. ఆ తర్వాత జిమ్మీ, కిమ్ ఏం చేశారనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ భాగాలను విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తారు.

నేర ప్రపంచం ఎలా ఉంటుందని ఆసక్తి ఉన్నవారే కాక మానవసంబంధాల మీద ఆసక్తి ఉన్నవారు కూడా ఈ సీరీస్ తప్పక చూడాలి. తాము చేసే పనుల పరిణామాలు ఎలా ఉన్నా తమకు కష్టం కలగకుండా ఉంటే చాలు అనుకునేవారు కొందరు. అలా ఉండలేక దారి మార్చుకునేవారు కొందరు. అయితే చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలని కొందరే అనుకుంటారు. వీరే అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే అనేది మన పురాణాలలో ఉన్నా మన సినిమాల్లో, సీరియళ్ళలో ఇలాంటి కథాంశాలు తీసుకోకుండా కేవలం వినోదం చూపిస్తున్నారు. బయటి దేశాల్లో ఈ కథాంశాలతో మంచి సినిమాలని, సీరియళ్ళని నిర్మిస్తున్నారు. ఆలోచింపజేసే సినిమాలు, సీరియళ్ళు మనవాళ్ళూ తీయాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here