మన అనుభూతి మనదే – అది మనమే రాయాలి!
మన అనుభూతి మనదే – అది మనమే చెప్పాలి!
సాహితీ ఆరోహణ
[dropcap]ప్ర[/dropcap]వాస సాహిత్యం గురించి మట్లాడే ముందు, చిన్నగా సాహిత్యం అంటే ఏమిటి, దాని స్థూల ఆవిర్భావం గురించి చెప్పుకోవాలి. మానవ పరిణామ ఆరోహణలో, ఒక అద్భుత ఘటన– మాట! బహుశ మనిషి గానమనే ప్రక్రియను పదిలపరిచిన తరువాయి, ఈ మాట అనేది ఆవిర్భవించి ఉంటుంది! సాంఘిక కట్టుబాట్లు వృద్ధిచెంది, ప్రత్యేక అవసరాలు రూపొందగా, మాటల మూటలు ప్రోగుపడి– మాట, భాష స్థాయికి; అంటే, మాటల వరుస, లిపి, వ్యాకరణము ఆదిగా ఏర్పడ, ఏ కొద్ది భాషలే పరిణితి చెంది నిలిచాయి. భాష పరిణితి సాహిత్యానికి పునాది!
సాహిత్య ప్రత్యేకత
“ఆవేశమున్నది ప్రతి కళలో; అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో” అని అంటాడు ఆచార్య ఆత్రేయ. కళలలో లలితకళలకు, లలితకళలలో సాహిత్యానికి – ఒక అనితరమైన ప్రత్యేకత ఉంది. దాశరధి రంగాచార్య గారు ఏమంటారంటే: “సంగీతం మధురం. విన్నంతనే గుండె గంతులు వేసి, హృదయవీణను మ్రోగిస్తుంది. సంగీతానికి అర్ధంతో పనిలేదు. సాహిత్యం ఆలోచనామృతం. వినగానే గుండె గంతులేయదు. సాహిత్యాన్ని గురించి ఆలోచించాలి. సాహిత్యాన్ని ఆలోచనతో మధిస్తే అమృతం అందుతుంది. ఆనందం ప్రభవిస్తుంది. అందలం ఎక్కిస్తుంది. మనసును వికసింపజేస్తుంది. మానవతను పెంచుతుంది. మనిషిని మనీషిగా చేస్తుంది.”
సంగీతం హృదయాలను ఉప్పొంగచేస్తే, నాట్యం నరుని ఉరకలు వేయిస్తే, సాహిత్యం మెదటిని మేల్కొల్పి, పరువులు తీయిస్తుంది. అటువంటి సాహితీ సృష్టి ఎపుడు జనించినది? రూపమేది? వస్తువేది?
మాట, పాట
పద్యం, గద్యం
నవల, నాటకం
వ్యాసం, ఉపన్యాసం…
ఏ రూపు అయితేనేమీ..
గల గల పారే సెలయేరు –
గుండెలవిశే కన్నీరు…
మేనా దిగని జీవితం –
మీదేమీ లేని నివాసం…
ఏ వస్తువు అయితేనేమీ..
ఆవేశానికి అక్షర రూపమిచ్చి –
అనుభూతిని అంబరమంపి…
ఒక్క సిరాబొట్టు
వేవేల వోల్టుల విద్యుత్తుగా –
అవధరింపజేసే సాహిత్యానికి –
పులకించని నరుడెవ్వడు?
సాహితీ సృష్టి, భవిత, మన బాధ్యత
మహాసాగర సాహితిని తమ రచనా వాహినిలతో సుసంపన్నము చేసినవారు ఎందరో మహానుభావులు. వారందరికి శత సహస్ర వందనాలు.
సుధీర్ఘ మానవజాతి నడకలో –
మనిషి సృష్టించిన సాహిత్యమెంత?
నిక్షిప్తిం చేసినదెంత?
అటువంటి సాహితీ భాండాగారము ఉండేదని –
మనకు తెలిసినదెంత?
ఈనాడు, మనకు అందినదెంత?
ప్రతి మనిషి చేరువలోకి చేరినదెంత?
రేపటి తరానికి మనం అందచేయ బోయేదెంత??
ఇవన్నీ జటిలమైనా, మానవాళి అళోచించుకోవలసిన ప్రశ్నలు.
అన్నమయ్య, 15వ శతాభ్దిలో సృష్టించిన 34,000 మధుర పద కవితల అమూల్య సంపద, భారతీయుల కొంత అదృష్టం మేరకు, సుమారు 14,000 పదాలు, 1930-40 ప్రాంతాలలో (అంటే అన్నయ్య తరువాత 550 సంవత్సరాలకు) మనకు అందాయి. మొన్న మొన్నటి ‘ఆంధ్రా షెక్సిపియరు’, పానుగంటి వారి 37కు పైగా నాటకాలలో మనకు దొరుకుతున్నది: ‘కంఠాభరణం’ ఒక్కటే!
అయితే భాష సంస్కరింపబడక ముందు సాహిత్యము లేకపోలేదు. ఆలాగునే సంస్కరణకు సమాంతరముగా సాహిత్య సృష్టి జరిగే ఉండాలి. అయితే సంస్కరింపబడిన భాషను ఆధారము చేసుకొని, మనకు దొరికిన, అందిన సాహిత్యం సమున్నతమైనదనుకోవడం తప్పుకాదు.
కాని, సాహిత్య పరిణామాన్ని గుర్తించక పోవడం, గుర్తించినా ఒప్పుకోని మూర్ఖత్వం, మన తెలుగు భాషకు మాత్రమే పరిమితమై పోయింది! దీని పర్యవసానమేమిటంటే, ఎంతో సమున్నతమైన మన తెలుగు భాష, ప్రాచీనమైనది కాదు అని మనకు మనమే తీర్మానించుకొన్న దుస్థితి. ఈ స్థితి మారాలి.
తెలుగు వారి ప్రస్థానం
తెలుగువారు శతాబ్దాల క్రితమే, మారిషస్, మలేసియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఫిజీ వంటి ప్రాంతాలకు వలసపోయినా, 1960 ల తరువాత సంపన్న దేశాలకు ప్రయాణం, వలసలు ఎక్కువ అయ్యాయని అనుకోవచ్చు. ఈ వలసలు చదువు కోసం, తదుపరి ఉద్యోగం కోసం ఆ తదుపరి వ్యాపార నిమిత్తం – అంది పుచ్చుకున్నాయి. వలస దేశాలలో భిన్న సంస్కృతి, ఆహార వ్యవహారాలు, జీవన విధానాలు- బ్రతుకు తెరువు సంపాదించి నిలదొక్కుకోవడం, వాటికోసం ఆరాటం, ప్రతి మనిషిని ఒక్కొక్క విధంగా ప్రభావితం చేశాయి. చేస్తున్నాయి. చేస్తాయి కూడా! కొన్ని దేశాలలో తెలుగువారి వలసలు అర్థ శతాబ్దం దాటాయి కూడా! ఈ ప్రస్థానంలో వారు ఏవిధంగా తమ జీవనాన్ని నిలదొక్కుకుని, వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా చేసిన కృషి ఏమిటి; మాతృదేశ పరిస్థితితో బేరీజు వేస్తే లోతుపాతులు ఏమిటి; నేర్చుకొన్న పాఠాలు ఏమిటి; తెలుగు, తెలుగువారు ప్రపంచ వేదికలో తమ మనుగడ సాధించడానికి, ఉన్నతి చాటడానికి ఏమి చేయవచ్చు? సాధించిన విజయాలు పదిమంది దృష్టికి ఎలా తీసుకొనిరావాలి?
ఉదాహరణకి ఆస్ట్రేలియా విషయం తీసుకుందాం. ఐదు పదులు దాటిన ఆస్ట్రేలియా తెలుగువారి ప్రస్థానం మొదట్లో వైద్య, విద్యా, పరిశోధనా రంగాల్లోని నిష్ణాతులకు పరిమితమైనా, 1990 దశకంలో మొదలైన కంప్యూటర్ రంగ నిపుణుల వలస వలన ఎన్నో రెట్లు పెరిగిందనే చెప్పాలి. శుభకార్యాలకు పురోహితుడు ఎవరూ లేరనే నాటి నుండి, నేడు అనేక మంది, అదే వృత్తిగా కొనసాగుతున్నవారు ఉన్నారు. సంగీతం, నాట్యం, యోగ లాంటి కళలకు ఆదరణ పెరగటంతో, వాటిని నేర్చుకునేవారు, వాటిని సంస్థాపరంగా నేర్పేవారు పెరుగుతూ, వ్యాపార విస్తరణ జరుగుతుంది. మన పప్పు దినుసులే దొరకని నాటి నుండి, నేడు ఎందరో ఔత్సాహికులు, భారతీయ తినుబండారాల వ్యాపారాలు నడుపుతూ, పురోగమించి, నేడు ఎన్నో భారతీయ రెస్టారెంట్లకు నాంది పలికింది. ఇప్పుడిప్పుడే కొంతమంది రాజకీయ రంగంలో అడుగిడడంతో ప్రవాసంలో తెలుగువారు మరో మెట్టు ఎదిగినట్టే. వృత్తిలో రాణిస్తూ, ప్రభుత్వానికి సేవలు అందిస్తూ, సివిల్ పురస్కారాలు అందుకున్న వారు ఉన్నారు.
స్వదేశంలోనే ఎన్నో భాషలు, సంస్కృతులు ప్రపంచీకరణ నేపధ్యంలో తమ అస్థిత్వం కోల్పోతుంటే, అచ్చటనే వాటిని బ్రతికించాలనే తపన, ఆరాటం, సంఘటిత కృషి గగన కుసుమాలు అవుతుంటే, మాతృగడ్డకు వేలవేల కిలో మీటర్ల దూరంలో నివశిస్తున్న ప్రవాస తెలుగువారి, ముఖ్యంగా మా ఆస్ట్రేలియా తెలుగు వారి ప్రయాణం, గత 25 సంవత్సరాలలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంది. ఒకప్పటికంటే సంఖ్యాపరంగా పెరిగి, సామాజికంగా ఎదుగుతూ, ఆర్ధికంగా నిలదొక్కుకుంటూ, తమ తమ వృత్తులలో ముందడుగు వేస్తూ, తాము ఎంచుకున్న నేలకు సేవలు అందిస్తూ, ఆస్ట్రేలియా లోని తెలుగు వారు అభివృద్ధిని అందుకొంటున్నారు. ఆస్ట్రేలియాలో తెలుగువారి సంఖ్యా వివరాలు (2021), విస్తరణ కలుమపత్యంగా సోదాహరణ పత్రం లో పొందుపరచబడ్డాయి. ఇటువంటి గణాంకాలు, ప్రవాస తెలుగువారు అందరి గురించి సంపుటికరణం చేస్తే ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉంది. బహుశా ఈ పరిణామం ప్రపంచ పరివ్యాప్తంగా మనము చూడవచ్చు. కానీ, దీనిని అక్షరబద్ధం చేసినట్లు మనకు అగపడదు.
ప్రవాస సాహిత్యం
భాష, సాహిత్యాల పట్ల సమున్నత సంఘటిత కృషి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే, భాష, సంస్కృతి విడదీయ రానివి. తెలుగు వారిలో ఉన్న భిన్న శాఖలు, తమ తమ వారి కోసం, ప్రాంతం కోసమే కాక; తమ భాష కోసం, నిజ సంస్కృతి కోసం, సాహిత్యం కోసం సంఘటితమై, దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవాలి. సాహితీ సంపద మనం ఎంతో కొంత వెనుకకు వేసుకున్నా, శిఖరాల తమ వెనుకటి అనుభవాలు, అనుభూతులు – ఎన్నో ఎన్నో అక్షరబద్ధం చేయవలసిన బృహత్తర అవసరం ఉంది.
ఇది సామాజిక సాహిత్యం. ఒక విధంగా మన చరిత్ర మనం రాసుకోవడం!
అది తెలుగులో ఉంటే బాగుంటుంది, కానీ తెలుగులోనే ఉండాలని లేదు!
వీటిని, అంటే ఈ సాహితీ సృష్టిని అధిగమించి, ఇక్కడి మంచి దేశీయ పద్ధతులను, భిన్న సంస్కృతుల జీవన విధానాన్ని ఉన్నతిస్తూ, కథలను వెలువరిస్తే, స్వంత భూమిలో కొంత ఆలోచన రేకెత్తించ వీలుపడుతుంది. తెలుగులో ‘ఆస్ట్రేలియా కథ’, ‘అమెరికా కథ’, అలా భిన్న భిన్న కథలు తన విలక్షణతను రూపొందించుకోవాలి.
భాష మారేదే, అంటే సంస్కృతీ మారేదే! మార్పు సహజం!
కానీ మంచిని ఎంచుతూ, మంచిని పంచుతూ, తోటి ఆస్ట్రేలియన్లకు కూడా మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించే తెలియచేయాలి. అంటే మన సాహిత్యాన్ని భిన్న సంస్కృతి వారికి పరిచయం చేయాలి. దాని యందు వారికి అనురక్తిని కలుగజేస్తే, తెలుగు భాషను తెలుగు వారే కాదు, మరెందరో స్వచ్ఛంధ పూనికతో అలరించ వీలుపడుతుంది.
ప్రవాస సాహిత్యం ప్రముఖంగా, భిన్న సంస్కృతుల మధ్య సారూప్యత, విభిన్నతను ప్రస్ఫుటం చేయాలి.
చిన్న చిన్న అడుగులు
వంగూరి పౌండేషన్ వారి మరియు Telugu Association of Australia Inc. (TAAI) వారి సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన ‘2018 సాహితీ సదస్సు’ ఒక వేదిక కావాలని ఆశించాను. దానికి తగిన విధంగా, ప్రవాస తెలుగువారి అనుభవాలు అక్షరబద్ధం చేయడానికి, స్పూర్తిగా, ఒక సమావేశం, ‘తెలుగు వారి ప్రస్థానం’ ప్రధాన అంశంగా తీర్చిదిద్దాలని ఆశించి, ఒక సంకేత చిత్రాన్ని కూడా తయారు చేయించడం జరిగింది (చూ. ప్రక్కన అందించిన సంకేత చిత్రం-1).
ఇక్కడి తెలుగువారిని, ‘తెలుగు వారి ప్రస్థానం’ అనే అంశంపై కూడా కవితలు, వ్యాసాలు, కథలు ఆదిగా రాయమని కోరడం జరిగింది. అందులో భాగంగా సిడ్నీ తెలుగు అసోసియేషన్ యొక్క 25 సంవత్సరాల ప్రయాణాన్ని, వారి అనుమతితో ఒక సమగ్ర వ్యాసం అందించాను. సమయం తక్కువ అయినందువల్ల, ఆశించిన రీతిలో రచనలు రాలేదేమోనని నా ఊహ. అంతేకాదు, బహుశా రచనలను తెలుగుకు మాత్రమే పరిమితం చేయకుండా, English లో కూడా ఉండవచ్చు అని అనివుంటే, మరిన్ని ప్రస్థానం, ఆస్ట్రేలియాకు మన జీవన సరళిని అన్వయించుకున్న విధానాన్ని తెలుపుతూ మరిన్ని అనుభవాల మాలిక మనకు అందేదేమో! సంతోషకరమన విషయమేమిటంటే, ఆ క్రమంలో రావు కొంచడా గారు పలువురితో మాట్లాడి ఒక తొలి ప్రతిని అందించారు. ఆ వ్యాసాన్ని విపులీకరించడం, విభాగించడం తో పాటు, 50 సంవత్సరాల మన తెలుగు వారి ప్రయాణాన్ని ఒక ప్రణాళిక బద్దంగా విశ్లేషించి, రాబోయే మరియు రావలసిన మార్పులను కల్పన చేస్తూ, నా అనుస్పందన ‘అవలోకన – ఆశాభావం’ అనే భాగంగా జత చేయడం జరిగింది. ఆశాభావం ఆస్ట్రేలియా తెలుగు వారి తో పాటు, ప్రపంచంలోని ప్రవాస తెలుగు వారి చరిత్ర పై అవగాహనకు ఉపయుక్తం కావాలని ఆశించడం జరిగింది.
ఇటీవల, sanchika.com సారధి, కస్తూరి మురళీకృష్ణ గారు, వారి వెబ్ మాగజైన్ కు రచనలు అందించడంతో పాటు, ఒక కొత్త శీర్షిక సూచించమని ప్రతిపాదించారు. ఆసంభాషణ క్రమంలో వారికి, ‘మన అనుభూతి మనదే – అది మనమే రాయాలి!’ అనే వాక్యాన్ని ప్రేరణగా, ‘విశ్వవేదిక’ అనే క్రొత్త అంశాన్ని వారికి సూచించిడం, అది బుడిబుడి అడుగులతో గత సెప్టెంబరు-2021 నుండి ప్రారంభం కావడం జరిగింది. పైన అందించిన సమస్త అంశాలను అవలోకిస్తూ, దాని పరిచయ వాక్యం రూపొందించాము.
“ప్రవాసంలో వందలుగా సంస్థలు, నడిపే పత్రికలు, వేదికలు ఉన్నా, ‘ఎల్లలు లేని తెలుగుదనం’ వినిపించలేక పోతున్నాయి. అందునా ‘తెలుగువారి ప్రస్థానం’ కి తగిన వసతి చూపలేకపోయాయి అనేది వాస్తవం. ఆ లోటును భర్తీ చేయాలని, తెలుగువారు వివిధరంగాలలో సాధించిన ప్రగతిని, అనుభవాలని ఒకచోట నిక్షిప్తం చేయాలనే అభిలాషతో ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాము. మీ మీ అనుభూతులు, అనుభవాలు తెలియచేయండి. తెలుగు నేలతో వాటి అవినాభావ సంబంధం కూడా పరరిశీలించవచ్చు. క్లుప్తంగా సాంస్కృతిక సంస్థల విషయాలు, మీ గురించి, మీ స్నేహితుల గురించి తెలియ చేయండి. ఇది నిరంతరం కొనసాగేది కావున, మీ రచనలను, క్రమం తప్పక ప్రతీ నెల మూడవ వారం లోపు పంపితే, వాటిని వచ్చే నెల సంచికలో పొదుపరుస్తాము. మీ రచనలు తెలుగులో ఉండాలనేది ముఖ్యమైనా, English లో ఉన్నవాటిని కూడా పరిశీలిస్తాము.” అని చెప్పడం జరిగింది. ఈ వేదిక మనది. మన అనుభూతి మనదే – అది మనమే రాయాలి!
ప్రవాస తెలుగు వారు తమ వారసత్వ సంపద నిలుపుకుంటూ, తన అస్థిత్వాన్ని నిలదొక్కుకుంటూ; తోటి సంస్కృతుల నుండి మంచిని గ్రహిస్తూ, వారికి మన విభవం తెలియచేస్తూ; ఈ ప్రస్థానంలో నేర్చుకున్న విలువలు, పాఠాలు, విశ్వవ్యాప్త తెలుగు వారికి తెలియ చెప్పే వారధిగా నిలుస్తూ; తెలుగు వారు మహోన్నత శిఖరాలు అందు కొనడం సుసాధ్యం!
నా /మన ఆకాంక్ష నెరవేరుతుంది! ఇది నిజం!
ఉపయుక్త వ్యాసాలు
- సారధి మోటమఱ్ఱి, 2014. సాహిత్య సమీక్ష – భవిత, వంగూరి పౌండేషన్ 9వ సాహిత్య సదస్సు, హుస్టన్, అక్టోబరు, 2014.
- సారధి మోటమఱ్ఱి, 2018. తెలుగు వారి ప్రస్థానం అవలోకన – ఆశాభావం, వంగూరి పౌండేషన్ ప్రపంచ సాహిత్య సదస్సు, మేలబర్న్, నవంబరు, 2018.
- సారధి మోటమఱ్ఱి, 2021. విశ్వవేదిక – పరిచయ వాక్యం, sanchika. com, https://sanchika.com/sanchika-viswavedika-intro/.
- సారధి మోటమఱ్ఱి, 2022. 2021 ఆస్ట్రేలియా జనాభా గణన – తెలుగు వారి సంఖ్యా వివరాలు, sanchika. com, https://sanchika.com/sanchika-viswavedika-number-of-telugus-in-australia-2021/.