[dropcap]‘సం[/dropcap]చిక’ పాఠకులకు నమస్కారాలు!! వారం వారం పెరుగుతున్న పాఠకుల సంఖ్య ఆనందం కలిగిస్తున్నా, ఈ పెరుగుదల అనుకున్నంత స్థాయిలో లేకపోవటం ఆలోచనలను కలిగిస్తోంది. ఇంకా, ఏం చేస్తే పాఠకులను ఆకర్షించే వీలున్నదోనన్న ఆలోచనలను రగిలిస్తోంది.
ప్రస్తుతం తెలుగు సాహిత్య రంగంలో అధికంగా 50 ఏళ్ళు దాటినవారే కనిపిస్తున్నారు. సాహిత్యం అధికంగా చదివేదీ వారే. యువ రచయితలు విరివిగా రాస్తున్నా, నాణ్యత, నవ్యత అన్నది కనబడటంలేదు. దీనికితోడు అధ్యయనం లేకపోవటంతో రచనా నైపుణ్యం అన్నది లోపిస్తోంది. యువ రచయితలను ప్రోత్సహించేందుకు సాహిత్య అకాడెమీ యువ పురస్కారాన్ని ఇస్తున్నా, అది ప్రతిభ వల్ల కాక వయసు ప్రాధాన్యంగా ఇచ్చే బహుమతి కావటంతో ప్రతిభ కన్నా లాబీయింగ్ వల్లనే అవార్డు వస్తుందని యువత అతి సులభంగా గ్రహించింది. ఎంత బాగా రాస్తే అవార్డు వస్తుందన్న తపన కన్నా, ఎవరిని ఎలా పట్టుకుంటే బహుమతి సాధించవచ్చోనన్న ప్రయత్నాలు అధికమయ్యాయి. ఇందుకు యువ అవార్డు పొందిన రచయితల రచనలే తిరుగులేని నిదర్శనాలు. అవార్డు తమ వయసు వల్ల తప్ప ప్రతిభ ఆధారంగా వచ్చిందన్న గ్రహింపులేక యువ బహుమతిగ్రహీతలు తామెంతో సాధించేశామని, ఇక సాధించేదేమీ లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇందుకు కొన్ని మినహాయింపులున్నా, అధికులలో ఈ అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అవార్డు వచ్చిన తరువాత వారి రాతలను గమనిస్తే, అహంకార పూరిత ప్రవర్తన, ప్రతిభ రాహిత్యాలు మరింత కొట్టొచ్చినట్టు తెలుస్తాయి. అందుకే, సంవత్సరానికో యువ రచయిత బహుమతి పొందుతున్నా, నాణ్యమయిన రచనలకోసం మళ్ళీ పాత తరం వైపే చూడాల్సి వస్తోంది.
మరో రకమయిన యువ రచయితలున్నారు. వీరు కూడా రచనలో ప్రతిభ చూపటం కన్నా, గుంపులను పోగేసుకోవటమో, గుంపుల్లో చేరిపోవటమో రచయితగా పేరు సంపాదించేందుకు అడ్డదారి అని గ్రహించేసి ఒక ముఠాలో చేరిపోయి, తమ ముఠావారి పొగడ్తలతో సంతృప్తి చెంది గొప్ప రచయితలమయిపోయామని కాలర్లెగరేస్తున్నారు. ఇలా, వీరిని పనిగట్టుకుని మోయటంలో క్విడ్ ప్రో క్వో గా తమని పొగడించుకుంటూ, యువ రచయితలను పావులా వాడుకుని గొప్పాతిగొప్ప రచయితలుగా చలామణీ అయ్యే ముఠామేస్త్రీలు తయారయ్యారు. ఈ ముఠామేస్త్రీల పట్టు సాహిత్యంపై ఏ స్థాయికి చేరిందంటే, ముఠామేస్త్రీలు గుర్తిస్తేనే ఒక రచయిత రచయిత అయినట్టు లేకపోతే కానట్టు భావించే స్థితిని ఈ ముఠాల్లోని వెన్నెముకలేని వందిమాగధగణ భజనబృందాలు కల్పిస్తున్నాయి.
యువ సాహిత్యాసక్తులు కూడా సాహిత్య ప్రచారకులై ప్రొద్దున్న లేచినప్పటినుంచీ ఈ ముఠాల్లోని రచయితల రచనలను పదే పదే ప్రస్తావించటమే గొప్ప సాహిత్యాభిమానం అని భ్రమపడుతున్నారు. వీరు చిన్న నీటిగుంటలోని కప్పలని బయట గొప్ప సాహిత్య సముద్రం వుందన్న నిజాన్ని విస్మరిస్తున్నారు. ఇదంతా సాహిత్య భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తున్న విషయం. ఎందుకంటే రాసేవాళ్ళు ఇసుకవేస్తే రాలనంతమంది వున్నారు. నాణ్యంగా, విశిష్టంగా, వైవిధ్యంగా రాసేవారు వ్రేళ్ళమీద లెక్కించేంతమంది కూడా లభించటంలేదు. అవార్డులు, పేర్లు, బహుమతులు పొగడ్తలు అన్నీ నాణ్యమయిన రచనల ద్వారా సాధించవచ్చు, అదే అసలయిన పద్ధతి అన్న చైతన్యం, సాహిత్య సృజన ఒక తపస్సులాంటిది, దానికోసం సర్వ ప్రపంచాన్ని త్యజించి, సాహిత్యమే లోకంగా బ్రతకాలన్న గ్రహింపు కనబడటంలేదు. రచయిత అన్నవాడికి వుండాల్సింది సృజనాత్మక ప్రతిభతో పాటూ దృక్కోణం,నిబద్ధత, నిజాయితీలు అన్న స్పృహ లేని రచయితలే అధికంగా కనబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిభ వున్న వారిని ప్రోత్సహిస్తూ, భవిష్యత్తు కోసం వెన్నెముక వున్న రచయితలను తయారుచేయాలని ‘సంచిక’ ప్రయత్నిస్తోంది.
అందుకే, త్వరలో సృజనాత్మక రచనలకు సంబంధించిన ఒక ప్రత్యేక శీర్షికను ఆరంభిస్తుంది ‘సంచిక’. వివరాలు త్వరలో ప్రకటిస్తాము. ఇలాంటి సాహిత్యపరమయిన శీర్షికలతో పాటూ పాఠకులకు బహు విషయాలపై అవగాహన కలిగిస్తూ ఆనందాన్ని, వినోదాన్నిచ్చే శీర్షికలను కూడా ‘సంచిక’ అందించబోతోంది. అందులో భాగంగా, త్వరలో ప్రఖ్యాత హాలీవుడ్ సస్పెన్స్ దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సినిమాల విశ్లేషణ శీర్షికను ‘సంచిక’ ఆరంభించబోతోంది. దీనికి తోడుగా సినిమా చూసి అర్థం చేసుకోవటం ఎలా, ఒక రచనను ఎలా చదవాలి? వంటి విషయాలపై అవగాహన కలిగించే శీర్షికలను కూడా ‘సంచిక’ అందించబోతోంది. రచనల స్థాయి, నాణ్యతలతో ఏ మాత్రం రాజీ పడకుండా ఉత్తమ స్థాయి రచనలను అందిస్తూ, పాఠకుల అభిరుచులను గమనిస్తూ, వారిని ఆకర్షించే రీతిలో సంచికను తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో పాఠకులు, రచయితలూ అందరూ భాగస్వామ్యం వహించాలని ‘సంచిక’ అభ్యర్ధిస్తోంది.
~
ఎప్పటిలానే వ్యాసాలు, ఇంటర్వ్యూ, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 సెప్టెంబరు 2022 సంచిక.
1 సెప్టెంబరు 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- రచయిత అంబల్ల జనార్దన్ గారి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…6 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
- సంచిక విశ్వవేదిక – ప్రవాస సాహిత్యం – ఆవశ్యకత – సారధి మోటమఱ్ఱి
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- సెప్టెంబరు 2022- దినవహి సత్యవతి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -30 – ఆర్. లక్ష్మి
పుస్తకాలు:
- వందేళ్ళ మార్పులకు ప్రతిబింబం ‘శత వసంతాల తెలుగు కథ’ – పుస్తక సమీక్ష – నల్ల భూమయ్య
కవితలు:
- గుబులు – శ్రీధర్ చౌడారపు
- మనుషులు చాలా రకాలు – డా. విజయ్ కోగంటి
- ఇష్టం..! స్పష్టం..!! – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కథలు:
- మరమానవి – చిత్తర్వు మధు
- ఉప-దైవం – వేదాంతం శ్రీపతిశర్మ
- అడవిలో వెన్నెల – శ్యామ్ కుమార్ చాగల్
- ప్లాన్ ఫ్లాపయ్యింది – గంగాధర్ వడ్లమాన్నాటి
సినిమా/వెబ్ సిరీస్:
- విలక్షణమైన సీరీస్ ‘బెటర్ కాల్ సాల్’ – పి. వి. సత్యనారాయణరాజు
బాల సంచిక:
- ప్రజా సందేశం – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- పాలమూరు సాహితి అవార్డు ప్రదానం – ప్రెస్ నోట్ – డా. భీంపల్లి శ్రీకాంత్
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.