[dropcap]ఇ[/dropcap]ది భాగ్యనగరం, మన రాష్ట్రానికే ప్రధాన నగరం.
ఇది జనారణ్యం, సకల వ్యథల బ్రతుకులకూ నిలయం.
బాల్యం నుండే బీదరికం చేసే, చేపించే…
కకావికల వికృత విన్యాసాలకూ ప్రదర్శనాలయం,
అయినా, ఇది భాగ్యనగరం, మన రాష్ట్రానికే ప్రధాన నగరం.
ముక్కుపచ్చలారని అమాయక ముఖాలు,
దుమ్ము, ధూళి శరీరాలు,
చిరిగిన, మాసిన అతుకుల గుడ్డలు,
భుజాన వ్రేలాడే చీకిన సంచులు,
కుడిచేతిలో కొన వంగిన సీకులు-
పారేసిన ప్లాస్టిక్కులకు, పాత అట్టపెట్టెలకు,
వాడి పడవేసిన వస్తు వ్యర్థములకు –
రోడ్ల వెంబడి చీదర చెత్తల్లో,
చెత్తడబ్బాల్లో వెతుకులాటలు.
తెల్లారక మునుపే తప్పని ఆకలి తిప్పలు..
బీదరికంలో తెల్లారుతున్నాయి బాల్యం బ్రతుకులు.
వీధి, వీధిన ఇవి సాక్షాత్కారం, హృదయ నేత్రం చూడగలిగితే!
అయినా, ఇది భాగ్యనగరం, మన రాష్ట్రానికే ప్రధాన నగరం.
ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్నది చెత్తా, చెదారము.
నింపుకొని తరలిస్తున్నది లాగుడు బండ్లలో,
స్వ సుస్థము పణముగ పారిశుద్ధ్యము చేయుచున్నది,
బ్రతుకు బండిని ఏలాగో, లాగుకొనుచున్నది…
బీదరికం చిన్నబుచ్చిన పిన్న వయసు బాల్యం.
వీధి, వీధిన ఇవి సాక్షాత్కారం, హృదయ నేత్రం చూడగలిగితే!
అయినా, ఇది భాగ్యనగరం, మన రాష్ట్రానికే ప్రధాన నగరం.
ఫంక్షను హాళ్ళల్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో,
అల్పాహార కేంద్రాల్లో, భోజనశాలల్లో,
బడ్డీబండ్ల తినుభండార తావుల్లో,
తిన్న ప్లేట్లు తీస్తూ, శుభ్రము చేస్తూ,
అంట్లు తోముతూ, అడ్డచాకిరీ చేస్తూన్నది,
ముద్ద కోసం తిప్పలుపడుచున్నది…
బీదరికంలో వెలవెలబోయిన మురిపాల బాల్యం.
వీధి, వీధిన ఇవి సాక్షాత్కారం, హృదయ నేత్రం చూడగలిగితే!
అయినా, ఇది భాగ్యనగరం, మన రాష్ట్రానికే ప్రధాన నగరం.
భవన నిర్మాణంలో ఇటుక, ఇసుక మోస్తూ,
కట్టిన కర్ర మెట్లెక్కుతున్నాయి
ఆటలు మరచిన చిన్ని చిన్ని కాళ్ళు.
మేఘాలను తాకే అంతస్తులు వెలుస్తున్నా,
బీదరికంలో వసి వాడుచున్నది…
కాయ-కష్టముల బలియై, పసి పసిడి బాల్యం.
వీధి, వీధిన ఇవి సాక్షాత్కారం, హృదయ నేత్రం చూడగలిగితే!
అయినా, ఇది భాగ్యనగరం, మన రాష్ట్రానికే ప్రధాన నగరం.
బస్ స్టాపుల్లో, బడలిక తీర్చుకొంటున్న బస్సుల్లో,
పబ్లిక్ పార్కుల్లో, జనకూడలి ప్రదేశాల్లో –
పల్లీ, బఠాణీల బుట్టలతో, పేలాల ప్యాకెట్లతో,
బ్రతుకుతెరువే తనకు తొలి బడిగా…
బీదరికంలో ఏమారుతున్నది బడి ఈడు బాల్యం.
వీధి, వీధిన ఇవి సాక్షాత్కారం, హృదయ నేత్రం చూడగలిగితే!
అయినా, ఇది భాగ్యనగరం, మన రాష్ట్రానికే ప్రధాన నగరం.
బలపమే అమరని చిన్ని చేతులు
చేస్తున్నాయి పేవ్మెంట్లపై బూటు పాలిషులు.
అకటా! ఉదయంతోనే-
ఉదర పోషణకు ఎన్నెన్ని వెతలో…
బీదరికంలో అల్లాడుతున్నాయి బాల్యం బ్రతుకులు.
వీధి, వీధిన ఇవి సాక్షాత్కారం, హృదయ నేత్రం చూడగలిగితే!
అయినా, ఇది భాగ్యనగరం, మన రాష్ట్రానికే ప్రధాన నగరం.
అందుకే, మరి అందుకే, ఈ మహానగరం
బీదరికపు బందీగా బడుగు జీవి
బ్రతుకు మెతుకు పోరులను కళ్ళకు కట్టే…
బాల్యం పోకడలే లేని భావి పౌరుల
వివశ బేల బాల్యానికీ సజీవ దర్పణం.
అయినా, ఇది భాగ్యనగరం, మన రాష్ట్రానికే ప్రధాన నగరం.