[dropcap]గ[/dropcap]బ్బిలాల చప్పుళ్ళు రెక్కలు తెంపుకునే రాత్రిలో
సర్వం మిళితమయిన చావు వాసన
గుప్పుగుప్పున పొగమంచులా..
ముఖాలు మాడ్చడం ఎరుకైన నిశికి
శూన్యగానం పరిచయమున్న ప్రియనేస్తమే.
పువ్వులు కొన్ని, మృత తుమ్మెద రెక్కల్ని పరచుకొని
జాలిగా గాలితో మొరపెట్టుకొనుటొక
మానవత్వపు ప్రకృతి దృశ్యమని
హోరుగాలిలో ఆ తరువాతెగిరే రెక్కలు
చెప్పకనే చెప్పే నీతిసూత్రాలూ..
వానమ్మ చేయించే మైలస్నానాలూ..
పువ్వులు పువ్వులే
ప్రకృతి ప్రకృతే
మనిషే కొన్ని సమూల వినాశనాలకు వికృతి.
నిర్ణీతసమయమంటూ లేని పులకరింతల అలలతో
నిర్భీతిగా నిలుచున్న సంద్రమొకటి చూస్తోంది
కలలను ఇసుకతో మేటేసిన తీరాన్ని
తన కనురెప్పలతో బంధించాలని.
సంద్రమెందుకో అప్పుడప్పుడు
అతిపెద్ద ఒకే తిమింగళంలా అగుపిస్తది దృష్టి లోపమున్నోళ్ళకి…
కానీ, ఇంకిన భావతుంపరల్ని
రెట్టింపువేగంతో
బదులు తీర్చడం మాత్రం మరువదు.
పువ్వులు కొన్ని తేలతాయి.
మనుషులు కొందరు తూలతారు.
భూమ్యాకాశాలు అలాగే ఉంటాయి
మరిన్ని ప్రళయాలకు సాక్షిగా…!!