మై హ్యాబిట్

0
3

[dropcap]‘ఖా[/dropcap]ళీగా ఉన్న బుర్ర దయ్యాల కొంప’ అని ఒక సామెత. అందుకే మైండ్ ఖాళీగా ఉండి ఈర్షాద్వేషాలతో నిండకుండా ఉండాలంటే కనీసం ఏదో ఒక అలవాటు ఉండాలి. ఇలాంటి అలవాట్ల వలన మనసుపై ఒత్తిడి పడకుండా రిలాక్స్ అవుతుంది. మరల ఎంత పనినైనా తట్టుకోవడానికి దేహమూ, మనసూ సిద్దమౌతాయి. నాకున్న అన్నీ అలవాట్లకు పునాది నేను తొమ్మిదో తరగతి చదివేటపుడు పడింది. అంతకు ముందుగా ఏ అలవాట్లు ఉన్నట్లు జ్ఞాపకం లేదు. అసలంతకు ముందు ఏదైనా తెలుసుకోవాలన్న ఉత్సాహమూ, నేర్చుకోవాలన్న కోరికా కూడా లేదు. ఈ అలవాటు ఏర్పడటం కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఊరు మారి, స్కూలు మారి చీరాలలోని కస్తూర్బాగాంధీ హైస్కూల్లో తొమ్మిదో తరగతిలో చేరాను అపుడు మా క్లాసులో ‘రాజు’ అనే ఒకమ్మాయి ఉన్నది. ‘రాజేంటి అమ్మాయెంటి’ అని ఆలోచించకండి అది తన ముద్దుపేరు. అసలు పేరు రాజేశ్వరి లెండి. ఆ అమ్మాయి చేతిరాత చాలా గుండ్రంగా ఉంటుంది. టీచర్లందరూ చాలా మెచ్చుకునేవారు.

ఒకరోజు ఆ అమ్మాయి తన నోట్ బుక్ పై కొమ్మలు, లతలు, పక్షి ఉన్న ఒక డిజైను వేసుకొచ్చించి. అది చూసి క్లాసులో ఆందరూ ‘ఓహో అద్బుతంగా ఉంది’ అన్నారు. అక్షరాల గుండ్రంగా రాసినా, బొమ్మలు వేసిన ఈ అమ్మాయి అంతటి వాళ్ళు క్లాసులో లేరు అనేవారు అందరూ. రాజు దగ్గర్నుంచి ఆ నోట్ బుక్ తీసుకొని అదే డిజైను నా పుస్తకంలో వేశాను. తెల్లవారి స్కూలుకెల్లగానే అందరికీ చూపించాను. క్లాసులో వాళ్ళు ఆ బొమ్మకు, ఈ బొమ్మకు తేడా కనుక్కోలేకపోయారు. కొత్తగా చేరినమ్మాయి బాగా బొమ్మలు వేస్తోంది అన్నారు. అలా మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. నా బొమ్మల్ని చూసిన స్కూల్లో మాస్టర్లు ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకోమని సూచించారు. అది కేవలం పెన్సిల్‌తో వేసిన డ్రాయింగ్. అదే సమయంలో ప్రముఖ చిత్రకారులు శ్రీవెల్లటూరి పూర్ణానందశర్మగారి’ ‘రేఖాంజలి’ అన్న పుస్తకాన్ని బహుమతిగా అందుకున్నాను. ఆ పుస్తకంలోని బొమ్మల్ని కొన్ని వేశాను. అందులోని ఒక అమ్మాయి బొమ్మను ‘ఎంకి’గా మా కాలేజీలోని డ్రాయింగ్ పోటీలలో వేసి ప్రథమ బహుమతిని సంపాదించుకున్నాను.

ఇంటర్‌లో బైపిసి కావటంతో రికార్డులు వేయాల్సి రావటం వల్ల బొమ్మల మీద మరింత ఇష్టాన్ని పెంచింది. అప్పటిదాకా కేవలం డిజైన్లు గీసిన నేను ఇంటర్ కొచ్చేసరికి జంతువులు గీయాల్సి వచ్చింది. కప్ప అంతరంగాలు అనే బొమ్మలో కప్ప కడుపులో ఉన్న గుడ్లు వేసిన తీరు లెక్చరర్ల దగ్గర నుంచి ప్రశంసలు తెచ్చి పెట్టింది. నాకు ఇలా బొమ్మలు వేయటం వల్ల చాలా మానసిక సంతృప్తి లభించేది. దీంతోపాటు ప్రశంసలు లభిస్తున్నాయనుకోండి.

ఒకరోజు కాలేజీకి రబ్బరు మరచిపోయి వెళ్లడంతో రబ్బరు లేకుండానే బొమ్మలు వేయవలసి వచ్చింది. ఇలా బాగానే వస్తున్నాయని బాల్ పాయింట్ పెన్నుతో వేయడం మొదలుపెట్టాను. దినపత్రికల్లో వచ్చిన భారత రాష్ట్రపతుల క్యారికేచర్లను చూసి నేను కొంత మందిని వేశాను. ఎన్.టి.ఆర్, బాల్ ధాకరే, అంబేద్కర్, మదర్ థెరిసా వంటి ప్రముఖల్ని రేఖా చిత్రాలుగా గీశాను.

అబ్దుల్ కలాం గారి రేఖాచిత్రాన్ని నేను రాసిన ‘సైన్స్ పాయింట్’ అనే శాస్త్రవేత్తల పరిచయ వ్యాసాల సంకలనానికి ఇన్నర్ పేజీగా వేసుకున్నాను. అంబేద్కర్ రేఖా చిత్రాన్ని ఒక మెమెంటోగా తయారు చేసి అప్ప్తి హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవండర్ గుప్తా గారికి ఇచ్చాను. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టరు సి. నారాయణరెడ్డి గారికి ఆయన బొమ్మను వేసిచ్చినపుడు ఆయన చూసి ‘నీ బొమ్మలో నా వయసు పది సంవత్సరాలు తగ్గించావమ్మా’ అన్నారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ బొమ్మవేసి చాలా స్కూళ్లకు ఉపాధ్యాయ దినోత్సవం నాడు బహుకరించాను. పోలీసులు, న్యాయమూర్తుల బొమ్మలు వేసి వాటిని కవితలతో, తలుకులతో అందంగా మెమెంటోలుగా తీర్చిదిద్ది పోలీస్ ఆఫీసర్లకు, జడ్జిలకు బహుమతులుగా ఇచ్చాను. మావూరి నుంచి ట్రాన్స్‌ఫరై వెళ్లిపోయేటప్పుడు ఆ వీడ్కోలు సమావేశాలలో ఆయా రంగాలకు  సంబంధించిన బొమ్మలు వేసి ఇచ్చేదాన్ని. ఈ బొమ్మలు వేసే అలవాటు ఎంతో మందిని అభిమానులుగా మార్చింది అంటే బాపూ లాగానో వడ్డాది పాపయ్య లాగానో బొమ్మలు ఎప్పటికీ వేయలేకపోయినా ఓ చిరు అలవాటు మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది. అందుకే ఎవరికి హాని చేయని ఏ చిన్ని అలవాటునైనా పెంచి పోషిస్తే ఆనందం అనే దాని నీడ కింద మనల్ని ప్రశాంతంగా నిలబెడుతుంది.

కాలేజీలో ఉన్నపుడు శ్రీధర్ కార్టూన్లను తయారు చేశాను. వాటిని మా బటానీ లెక్చరర్ చూసి కొన్ని కార్టున్లు వయోజన విద్య మీద గీయమని చెప్పారు. ఆంధ్రా యూనివర్సీటీ వయోజన విద్యా విభాగంవారు మా కాలేజీలో కార్టూన్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్‌లో నా కార్టూన్లు కూడా పెట్టారు. ఈ బొమ్మలు వేసే అలవాటు వల్ల ఒక్క నిముషం కూడా ఖాళీగా ఉన్నామన్న స్పృహ ఉండదు. బోర్ అన్న ఫీలింగే రాదు.

వారపత్రికల అట్టల మీద వచ్చే బాపు బొమ్మల్ని చూసి ఆ బొమ్మల్ని ఆయిల్ పెయింటింగ్స్‌తో వేశాను. ఆయిల్ పెయింటింగ్స్ వేసిన తరువాత గ్లాస్ పెయింటింగ్, శాండ్ పెయింటింగ్‌లు కూడా వేశాను. వీటిలో కొన్నింటిని మా ఇంటిలోనూ అందంగా అలంకరించుకున్నాను. నా అలవాటు ఇంటికి కావల్సిన గృహోపకరణ పస్తువులు కొనే పని తప్పించింది. ఇంట్లో ఉన్న కప్పులు, సాసర్లు, గ్లాసులు, సీసాలు, మాడిపోయిన బల్బులు ఆఖరికి ఫ్యాన్లతో సహా రంగు రంగుల పెయింటింగ్‌లు ఒళ్ళంతా పూసుకొని మా షో కేసుల్లో అందంగా కూర్చున్నాయి. వచ్చిపోయే అతిథుల్ని అలరిస్తున్నాయి.

నా బొమ్మలు వేసే అలవాటు నా పిల్లలకు కూడా కొంచెం వచ్చింది. నేను రాసిన పుస్తకాలన్నింటికీ కవర్ పేజీలు వాళ్ళే వేశారు. అంతేకాదు ‘మై పిక్చర్స్’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా వేశారు. వాళ్ళ ఈ అలవాటు కాలేజీలో ‘ఫేస్ పెయింటింగ్’ గా రూపాంతరం చెందింది. అంతేకాదు నా ఈ అలవాటు ముగ్గుల్లో కొత్తదనం వెతికింది. సామాజిక సమస్యల్ని ముగ్గుల్లో ప్రతిఫలింప చేసింది. ఒక చిన్న అలవాటు జీవితంలో ఎన్ని విధాలుగా ఉపయోగపడిందో కదా! ఎన్నో రూపాలుగా తనను తాను మార్చుకొని అందంగా కళ్లెదుట నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here