మరుగునపడ్డ మాణిక్యాలు – 10: ద బిగ్ సిక్

0
3

[dropcap]వ[/dropcap]లసదారులు మెరుగైన జీవితం కోసం వలస పోతారు. వారి పిల్లలు ఆ కొత్త దేశంలో అక్కడి సంస్కృతినే అలవాటు చేసుకుంటారు. వీళ్ళేమో మన సంస్కృతిని కాపాడుకోవాలి అంటారు. వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవాలంటే వాళ్ళ దేశంలోనే ఉండవచ్చుగా. కొత్త దేశంలోని సౌకర్యాలు కావాలి కానీ వారి సంస్కృతి ప్రభావం ఉండకూడదంటే కుదురుతుందా? ఏ సంస్కృతినైనా మరో సంస్కృతి కంటే చెడ్డది అనే హక్కు ఎవరికీ లేదు. సామూహిక (Collectivistic) సంస్కృతి ఉన్న దేశాల్లో తలితండ్రులే కాక పెద్దమ్మ, పెదనాన్న, అత్తయ్య, మావయ్య లాంటివాళ్ళు కూడా పెత్తనం చెలాయిస్తారు. ఆ సమిష్టి కుటుంబాన్ని వదిలి వ్యక్తిగత (Individualistic) సంస్కృతి ఉన్న దేశంలోకి అడుగుపెట్టినప్పుడే తమ సంస్కృతికి ఒకింత ద్రోహం చేసినట్టే కదా! అదే ప్రశ్న పిల్లలు వేస్తే? ‘ద బిగ్ సిక్’ (2017) లో ఇదే అంశాన్ని హాస్యం జోడించి ప్రస్తావించారు.

పాకిస్తానీ కుటుంబానికి చెందిన కుమైల్ నంజియానీ, అమెరికాకు చెందిన అతని భార్య ఎమిలీ గోర్డన్ తమ నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కలిసి స్కీన్ ప్లే వ్రాశారు. స్క్రీన్ ప్లేకి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. మైకెల్ షొవాల్టర్ దర్శకత్వం వహించాడు. ‘Sick’ అనే పదం విశేషణంగానే వాడతారు, ‘జబ్బుపడిన’ అనే అర్థంలో. ఈ సినిమా పేరు (‘The Big Sick’) లో ఆ పదాన్ని నామవాచకంగా వాడారు అదేమిటో మరి! వినటానికి బాగుంటుందనేమో. సినిమాలో నాయిక జబ్బుపడుతుంది. అయినా సినిమా పేరుకి వేరే అర్థముంది. కొన్ని కుటుంబాలు పిల్లల జీవితాలను తమ అదుపులో ఉంచుకోవాలనే జబ్బుతో బాధపడుతుంటాయని సూచన. తెలుగులో ఈ సినిమాకి ‘మాయరోగం’ అనే పేరు అతికినట్టు సరిపోతుంది! సినిమాలో కుమైల్ తన పాత్ర తానే ధరించాడు. ఎమిలీగా జోయి కజాన్ నటించింది. ఇతర ముఖ్యపాత్రల్లో హాలీ హంటర్, రే రొమానో, జెనోబినా ష్రాఫ్, అనుపమ్ ఖేర్ నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంది. పెద్దలకు మాత్రమే.

కథలో కుమైల్ ఒక స్టాండప్ కమీడియన్. ముప్ఫై ఏళ్ళుంటాయి. షికాగోలో ఉంటాడు. టాక్సీ కూడా నడుపుతుంటాడు. అతని కుటుంబం అతని చిన్నప్పుడే పాకిస్తాన్ నుంచి వలస వచ్చింది. అతని తల్లి అతను లాయరు కావాలని కోరుకుంటుంది. అమెరికాలో ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు వృత్తిని ఎంచుకుంటారు. కుమైల్‌కు కామెడీ అంటే ఇష్టం. అందుకే కమీడియన్‌గా బార్లలో ప్రదర్శనలు ఇస్తుంటాడు. అతని తల్లికి అది అవమానంగా ఉంటుంది. కుమైల్ ఒక కామెడీ షోలో అన్నట్టు పాకిస్తానీ తల్లులకు మొదట నచ్చే వృత్తి డాక్టరు, తర్వాత ఇంజినీరు, తర్వాత లాయరు, తర్వాత వంద వృత్తులు, తర్వాత ఐసిస్, తర్వాతే కమీడియన్! కుమైల్‌కి ఒక అన్న. తలిదండ్రులు కుదిర్చిన అమ్మాయిని పెళ్ళి చేసున్నాడు. కుమైల్ వేరుగా తన స్నేహితుడితో ఉంటాడు. అప్పుడప్పుడూ తన కుటుంబంతో భోజనం చేయటానికి వెళతాడు. ఆ సమయంలో అతని తల్లి ఎవరో ఒక పాకిస్తానీ అమ్మాయిని ఇంటికి రప్పించి కుమైల్‌కి నచ్చుతుందేమే అని చూస్తూంటుంది. ఈ అమ్మాయిల ఫోటోలు కుమైల్ దగ్గర్ ఒక చిన్న అట్టపెట్టెలో పేరుకుపోయి ఉంటాయి.

కుమైల్ ఒక ప్రదర్శన ఇస్తున్నప్పుడు ప్రేక్షకులలో ఎమిలీ ఉంటుంది. ఆమెకి కూడా ముప్ఫై ఏళ్ళుంటాయి. ఆమెలోని చలాకీతనం అతనికి నచ్చుతుంది. అతని మాటతీరు ఆమెకి నచ్చుతుంది. ఎమిలీ థెరపీ విద్యార్థిని. చదువు కోసం వేరే రాష్ట్రం నుంచి షికాగో వచ్చింది. ఆమెకి ప్రేమ అనే లంపటం ఇష్టం లేదు. కుమైల్ కూడా ఏ అమ్మాయినీ రెండుసార్లకు మించి డేట్ చేయను అంటాడు. ఇద్దరూ కలిసి పడుకుంటారు. అమెరికాలో లైంగిక స్వేచ్ఛ ఎక్కువ. ఒకరి మీద ఒకరికి మమకారం పెరగక ముందే విడిపోదామనుకుంటారు కానీ వదులుకోలేకపోతారు. తనకు విడాకులైన సంగతి చెబుతుంది ఎమిలీ. కుమైల్ మాత్రం తన తల్లి చేసే పెళ్ళి ప్రయత్నాల గురించి చెప్పడు. ఎమిలీ తన తలిదండ్రులు షికాగో వచ్చినపుడు అతన్ని కలవాలనుకుంటున్నారని అంటుంది. మీ అమ్మానాన్నలని ఎప్పుడు పరిచయం చేస్తావు అని అడుగుతుంది. త్వరలోనే అని అబద్ధం చెబుతాడు కుమైల్. ఎమిలీ వ్యక్తిగత సంస్కృతికి అలవాటు పడినా తన తలిదండ్రులకి ముఖ్యమైన విషయాలు చెబుతుంది. కుమైల్‌కి తన తలిదండ్రుల మీద గౌరవం కంటే భయం ఎక్కువ. వారికి ఎమిలీ సంగతి చెప్పడు. ఇక్కడ విషయమేమిటంటే ఎమిలీ తన భాగస్వామిని తాను ఎంచుకోవటం ఆమె తలిదండ్రులు ఆమోదించారు. ఆమెకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అమెరికాలో ఇదే అత్యధికులు అనుసరించే పద్ధతి. కుమైల్ తలిదండ్రులు పాకిస్తానీ అమ్మాయిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలని షరతు పెట్టారు. అమెరికా పద్ధతులు పాటించనపుడు అమెరికాకి రావటమెందుకని అతను తర్వాత ప్రశ్నిస్తాడు.

ఒకరోజు అమ్మాయిల ఫోటోలు ఉన్న చిన్న అట్టపెట్టెని ఎమిలీ తెరిచి చూస్తుంది. అసలు విషయం చెబుతాడు కుమైల్. మరి నా గురించి మీ అమ్మ అభిప్రాయమేమిటని అడుగుతుంది. అతను మౌనం వహిస్తాడు. అమెకి విషయం అర్థమౌతుంది. ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. అతను మూర్ఖంగా నీ విడాకుల సంగతి కూడా ముందు నువ్వు నాకు చెప్పలేదుగా అంటాడు. “అదేమీ భవిష్యత్తులో మనం కలిసి బతకటానికి అడ్డు కాదు. కానీ నీ కుటుంబం మనల్ని కలవనివ్వదుగా” అంటుంది. అతను “పాకిస్తాన్‌లో పెళ్ళంటేనే పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అమెరికాలో లాగా పెళ్ళంటే ప్రేమవివాహం కాదు” అంటాడు. “మరి నాతో ఏం చేస్తున్నావు?” అని ఆమె వెళ్ళిపోతుంది. అతను ఆమెని మరిచిపోవటానికి ప్రయత్నిస్తాడు. కొన్నాళ్ళకి అతనికి ఒక కామెడీ ఫెస్టివల్లో పాల్గొనే అవకాశం వస్తుంది.

ఒకనాటి రాత్రి ఎమిలీ స్నేహితురాలి దగ్గర నుంచి కుమైల్‌కి ఫోన్ వస్తుంది. ఎమిలీ హాస్పిటల్లో ఉందని, తాను వేరే ఊళ్ళో ఉన్నానని, ఆమెకి తోడుగా వెళ్ళమని అంటుంది. అతను వెళతాడు. ఎమిలీ తాను బాగానే ఉన్నానని అంటుంది. డాక్టరు అతన్ని పక్కకి తీసుకెళ్ళి “ఆమెకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆమెని కోమాలోకి పంపి వైద్యం చేయాలి. నువ్వు ఆమె భర్తవి కదా. వైద్యానికి ఒప్పుకుంటున్నట్టు సంతకం చెయ్యి” అంటాడు. అతను గత్యంతరం లేక సంతకం పెడతాడు. తర్వాత అమె తలిదండ్రులకి ఫోన్ చేస్తాడు. వాళ్ళు హుటాహుటిన వస్తారు. ఎమిలీ తల్లి పేరు బెత్. తండ్రి పేరు టెర్రీ. కుమైల్ వ్యవహారమంతా వారికి తెలుసు. బెత్ ఉండటానికి మనిషి చిన్నదైనా గట్టి మనిషి. కుమైల్‌ని వెళ్ళిపొమ్మంటుంది. అతని వెళ్ళి మర్నాడు వస్తాడు. ఎందుకొచ్చావని అడుగుతుంది బెత్. టెర్రీ ఆమెని వారిస్తూ ఉంటాడు. కుమైల్ దూరంగా కూర్చుంటాడు. క్యాంటీన్‌లో భోజనానికి వెళ్ళినపుడు టెర్రీ కుమైల్‌ని తమతో పాటు కూర్చోమంటాడు. టెర్రీ ఏం మాట్లాడాలో తెలియక “9/11 గురించి ఎవరితోనైనా మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. దాని గురించి నీ అభిప్రాయమేమిటి?” అంటాడు. కుమైల్ ముస్లిం అయినంతమాత్రాన అతని దగ్గర ఈ విషయం ఎత్తటం ఎంతవరకు సమంజసం? కుమైల్ “అతి హేయమైన సంఘటన. మా యోధులు 19 మందిని కోల్పోయాం” అని హాస్యమాడతాడు. కమీడియన్ కదా! బెత్‌కి చిర్రెత్తుకొస్తుంది. ఇంతలో స్పీకర్లో వారిని వెంటనే ఐసీయూకి రమ్మని పిలుస్తారు. కుమైల్ కూడా వెళతాడు బెత్‌కి ఇష్టం లేకపోయినా. డాక్టరు మర్నాడు ఎమిలీకి ఆపరేషన్ చేస్తున్నామని చెబుతుంది. చేసేదేం లేక అందరూ ఎమిలీ అపార్ట్‌మెంట్‌కి వస్తారు.

కుమైల్ అక్కడి నుంచి బయటపడటానికి తనకి కామెడీ ప్రదర్శన ఉందని చెబుతాడు. ఇంట్లో ఉంటే ఆందోళన పడుతూ ఉంటామని టెర్రీ బెత్‌ని ప్రదర్శన చూడటానికి బయలుదేరదీస్తాడు. అక్కడ కుమైల్ ప్రదర్శన జరుగుతుండగా ప్రేక్షకులలో ఒకడు “గో బ్యాక్ టు ఐసిస్” అని అరుస్తాడు. బెత్ అతన్ని నిలదీస్తుంది. అతను “వాడి రంగు టెర్రరిస్టులా ఉంది కనక అన్నాను” అంటాడు. మాటా మాటా పెరుగుతుంది. అసలే కూతురి గురించి ఆందోళనలో ఉన్న బెత్ అతని తెంపరితనాన్ని భరించలేక అతన్ని కొట్టడానికి వెళుతుంది. కుమైల్ గుడ్లప్పగించి ఉండిపోతాడు. టెర్రీ బెత్‌ని బలవంతాన ఆపి బయటకి తీసుకువెళతాడు. ఆ రాత్రి బెత్, కుమైల్ ఎమిలీ గురించి సంగతులు చెప్పుకుంటూ గడిపేస్తారు. ఆమెకి కుమైల్ మీద ఉన్న చెడు అభిప్రాయం దూరమైపోతుంది.

ఇలాంటి కథ తోనే “వైల్ యూ వెర్ స్లీపింగ్” అనే సినిమా వచ్చింది. దాన్నే కొంచెం మార్చి తెలుగులో “చంద్రలేఖ” సినిమా తీశారు. అయితే ఇక్కడ ముఖ్యమైనది సాంస్కృతికమైన సంఘర్షణ. తను మనస్ఫూర్తిగా మెచ్చిన అమ్మాయిని తన తలిదండ్ర్రులు అమోదించరని తెలిసి ఆమెను వదులుకున్న అతను మనసులో నుంచి మాత్రం అమెని తొలగించలేకపోయాడు. దూరంగా ఉంటే ఎలాగోలా సర్దుకుపోయేవాడేమో. మళ్ళీ దగ్గరయ్యేసరికి, అందునా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉండేసరికి ఆమెని వదలలేకపోయాడు. ఆమె లేని జీవితమే కష్టమనుకుంటే ఆమె లేని ప్రపంచం ఎలా ఉంటుంది? టెర్రీ, బెత్‌ల జీవితంలోకి కూడా తొంగి చూసే అవకాశం వస్తుంది. ఎవరి జీవితమూ పరిపూర్ణం కాదని తెలిసి వస్తుంది. ఎక్కడో ఒక చోట రాజీ పడాలి. బెత్, టెర్రీల జీవితంలో రాజీ పడిన సందర్భం వేరు. కుమైల్ విషయంలో తాము రాజీ పడుతున్నామని వారెప్పుడూ అనుకోలేదు. అతని జాతి, మతం వారికి అనవసరం. మనిషి మంచివాడా అన్నదే వారికి ముఖ్యం. తలిదండ్రులకు భయపడే అతని స్వభావం వారికి నచ్చలేదు. అమెరికాలో స్వతంత్రంగా బతకటమే ముఖ్యం. కుమైల్ తలిదండ్రులకి వారి వారసత్వం ముఖ్యం. కొడుకు సంతోషంగా లేకపోయినా సరే! కుమైల్‌కి పాకిస్తానీ అమ్మాయిలు ఎవరూ నచ్చలేదా? ఒకమ్మాయి నచ్చుతుంది. అయితే అప్పటికే అతను ఎమిలీ ప్రేమలో పడిపోయాడు. జీవితం ఇలాగే ఉంటుంది.

చివరికి ఏం జరుగుతుందో ముందే చెప్పేశానుగా! కుమైల్, ఎమిలీ పెళ్ళి చేసుకుంటారు. అయితే కథ మనం అనుకున్న కథలా ఉండదు. అదే నిజజీవితానికి, కల్పితకథకి తేడా. “Truth is stranger than fiction” అని ఒక నానుడి. నిజజీవితం కల్పనల కంటే విస్మయంగా ఉంటుంది. బెత్‌గా హాలీ హంటర్ నటన అనితరసాధ్యంగా ఉంటుంది. సరైన నటులు దొరికితే పాత్రలు ఎలా జీవం పోసుకుంటాయో ఆమె నటన చూస్తే తెలుస్తుంది. “ద పియానో” చిత్రానికి 1994లో ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డుతో పాటు అన్ని అవార్డులు గెలుచుకుంది ఆమె. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా కనీసం నామినేషన్ రాకపోవటం అన్యాయం అనిపిస్తుంది. టెర్రీగా రే రొమానో నటన ఆకట్టుకుంటుంది. అతనేమో పొడుగు, బెత్ పొట్టిది. అయినా ఆమె తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. అతను మెతక, ఆమె గడుసు. ఇద్దరూ కలిసి నటించే సన్నివేశాలు అద్భుతంగా పండాయి. జెనొబినా ష్రాఫ్ పిల్లలను తన చెప్పుచేతల్లో ఉంచుకునే తల్లిగా ఇంటిమిడేటింగ్‌గా నటించింది. పాకిస్తానీ తల్లులకి, భారతీయుల తల్లులకి పెద్ద తేడా లేదు కదా అనిపిస్తుంది. అనుపమ్ ఖేర్ పెళ్ళాం చాటు భర్తగా ఒదిగిపోయాడు. ఏ సంస్కృతి అయినా ఒకటి మాత్రం కామన్ – పెళ్ళాం మాట మొగుడు వినాల్సిందే.

నిజజీవితంలో ఎమిలీ, కుమైల్

ఈ క్రింద చిత్రకథ మరికొంత ప్రస్తావించబడింది. కథ ఇంకాస్త కూడా తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయవచ్చు.

ఎమిలీకి ఆపరేషన్ చేసిన తర్వాత మొదట బాగానే ఉన్నా తర్వాత ఇన్ఫెక్షన్ ఆమె మూత్రపిండాలకు చేరుతుంది. బెత్ ఆ హాస్పిటల్ కన్నా మంచి హాస్పిటల్‌కి ఎమిలీని మారుద్దామంటుంది. వడివడిగా కదులుతుంది. టెర్రీ ఆమెకి సర్దిచెప్పటానికి చూస్తాడు. ఆమె అతన్ని తూలనాడుతుంది. నువ్వెన్నో తప్పులు చేశావు అని అంటుంది. టెర్రీ పాతవన్నీ ఎందుకు తవ్వుతావు అంటాడు. కుమైల్ అక్కడ ఉండటానికి ఇబ్బందిపడి పక్కకి వెళతాడు. ఎమిలీ గదికి వెళితే అక్కడ నర్సు ఎమిలీని కదపటం ప్రమాదకరమని చెబుతుంది. ఆ రాత్రి బెత్ టెర్రీని హాస్పిటల్లో వదిలేసి ఇంటికి వెళుతుంది. కుమైల్ అతన్ని తన అపార్ట్‌మెంట్‌కి తీసుకువెళతాడు. నర్సు చెప్పిన సంగతి అతనికి చెబుతాడు. ఎమిలీ స్థానంలో తనకి ఇంఫెక్షన్ వస్తే బావుండేదని టెర్రీ అంటాడు. బెత్‌కి తన మీద కోపంగా ఉందని అంటాడు. ఉన్నట్టుండి “నేను ఇంకొకామెతో పడుకున్నాను” అంటాడు. “అప్పుడు ఏదో కుంగుబాటులో ఉండి ఆ పని చేశాను. సంభోగం అయిన తక్షణమే ఎంతో పశ్చాత్తాపం కలిగింది. ఇంటికి వెళ్ళిన వెంటనే బెత్‌కి చెప్పేశాను. ఆమె చాలా బాధపడింది. అందుకే నన్ను ద్వేషిస్తూంది” అంటాడు. కుమైల్ “ఆమెకి మీ మీద కోపముందేమో కానే ద్వేషమైతే లేదు” అంటాడు. మళ్ళీ “ఆమెకి ఆ విషయం ఎందుకు చెప్పారు?” అని అడుగుతాడు. “అపరాధభావం మనసులో ఉంచుకోవటం నాకు కష్టం. నీకో సత్యం చెబుతాను. ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తున్నావని ఎప్పుడు తెలుస్తుందంటే వేరొకరితో పడుకుని నీకు పశ్చాత్తాపం కలిగినపుడే” అంటాడు. కుమైల్ “అంటే ప్రేమని పరీక్షించుకోవటానికి వేరొకరితో పడుకోవాలా?” అంటాడు. “అదెంత తప్పుడు ఆలోచనో నువ్వు అడుగుతుంటే తెలుస్తోంది” అంటాడు టెర్రీ. మనకి ఒకపక్కన నవ్వు వస్తూ ఉంటుంది. మళ్ళీ “ప్రేమ చాలా కఠినమైనది. అందుకే దాన్ని ప్రేమ అన్నారు” అంటాడు టెర్రీ. “ఇది కూడా నాకర్థం కాలేదు” అంటాడు కుమైల్. “ఏదో తెలివిగా మాట్లాడాలనుకున్నాను. కుదరలేదు” అంటాడు టెర్రీ. మళ్ళీ కిసుక్కున నవ్వొస్తుంది.

ఒక కాబోయే మామగారు అల్లుడికి తన రహస్యాలని చెప్పాడంటే నిజజీవితం కల్పన కంటే అద్భుతమా కాదా? కూతురు హాస్పిటల్లో చావుబతుకుల మధ్య ఉంది. భార్య అతని మీద కోపంగా ఉంది. ఈ పరిస్థితిలో అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కుమైల్ మీద నమ్మకం కూడా ఉందని తెలుస్తుంది. ఇంత పెద్ద విషయాన్ని పక్కనపెట్టి బెత్ టెర్రీతో కలిసి ఉందంటే తాను కూడా తను ప్రేమించిన వ్యక్తి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కుమైల్‌కి అనిపిస్తుంది. ఈ సన్నివేశాన్ని ఇంత హాస్యభరితంగా రాసిన రచయితలని మెచ్చుకోవలసిందే. కుమైల్ ఎమిలీ సంగతి తన తలిదండ్రులకి చెప్పే సన్నివేశం మొత్తం చిత్రానికే ఆయువుపట్టులా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here