[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]
[dropcap]ప[/dropcap]నసపుట్టు గ్రామంలో జగ్గారావు, జగ్గమ్మ అనే దంపతులుండేవారు. వారికి కొంత మెరకభూమి ఉంది. అందులో ఏటా కంది చేను వేస్తుంటారు. కొండకందులు ఉడికించుకుని అన్నంలో కలుపుకొని గిరిజనులు తింటుంటారు. అవి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా మంచి శక్తినిస్తాయి.
కంది కాయల నుంచి కందులు ఒలవడం, వాటిని ఎండబెట్టడం, జగ్గమ్మపని. వారపుసంతలో వాటిని అమ్మి, ఇంటికి కావలసిన టీ గుండ, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, బెల్లం వంటివి తేవడం జగ్గారావు పని. ఒకరోజు రాత్రి అడవి పందులు జగ్గారావు కంది చేనులో పడ్డాయి. చేనంతా పాడు చేశాయి. కందికాయలను బాగా నమిలి, చేను మధ్యలో మలవిసర్జన చేసి పారిపోయాయి.
మర్నాడు చేను చూద్దామని వెళ్లిన జగ్గారావుకు కంది చేను అంతా నేలపాలవడం గమనించాడు. చేలోని పాదాల ముద్రలను బట్టి పందులు తన చేనులో చొరబడ్డాయని తెలుసుకున్నాడు. తన ప్రక్క రైతు ఆముదం గింజలు వేయగా మొక్కలు బాగా ఎత్తుగా ఎదిగాయి. విరిగిన కంది కొమ్మలను చేనులోనే ఎండబెట్టి ఇంటికి వచ్చాడు జగ్గారావు. ఈ పందులను తరమడం ఎలాగ అని అతడు ఆలోచిస్తూ ఇంటి అరుగుమీద కూర్చున్నాడు. తన గ్రామంలోని కొందరు గిరిజన పెద్దలను సంప్రదించి ఈ పందుల బెడద పోగొట్టాలనేది అతని ఉద్దేశం.
అడవి పందులు మందలుగా సంచరిస్తుంటాయి. వాటికి మూతిపై భాగంలో పెద్దకోర ఉంటుంది. దానితో నేలను తవ్వగలవు. ఒక్కొక్కప్పుడు దట్టమైన అడవిలో పెద్దపులికి, అడవి పందికి మధ్యన భీకర పోరాటం జరుగుతుంది. పులితో గంటకుపైగా అలసిపోయుండా అది యుద్ధం చేయగలదు. పందికి మెడ తిరిగితే పులిని అవలీలగా చంపగలదు. కానీ దేవుడు దానికి బలం ఇచ్చాడు గాని మెడ తిరగడం అలవరచలేదు. చెట్టుచాటున, తుప్పల్లో అడవి పందులు పిల్లల్ని కంటాయి. ఈనిన అడవి పందిని ఎవరైనా పొరపాటున సమీపిస్తే అది అతణ్ణి వెంట తరుముతుంది. వనమూలికలను తిని బాగా కొవ్వెక్కిన అడవి పందిమాసం గిరిజనులు ఎంతో ఇష్టంగా తింటారు.
జగ్గమ్మ కందులు, టమోటాలు కలిపి కూర వండుదామని మొగుడితో “కందులు, కందులు” అంది. “కందులు తెచ్చావా?” అని ఆమె అడిగితే జగ్గారావు “పందులు పందులు” అని బదిలిచ్చాడు. జగ్గమ్మకు భర్త మాటలేవీ అర్థం కాలేదు.
ఇంతలో అరుగుమీద కూర్చున్న కొందరు గిరిజన పెద్దలు ఆమెతో “నువ్వు ‘కందులు’ అంటే నీ మొగుడు ‘పందులు’ అంటున్నాడు వినలేదా? నీ కందిచేను పందులు పాడు చేశాయని అతడు ఏడుస్తుంటే నీ కందుల గోల ఏమిటి” అని అడిగారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్న జగ్గమ్మ ఆ రోజు పిక్కచారుతో మొగుడికి అన్నం పెట్టింది.