[dropcap]“కి[/dropcap]షోర్! ఇదే నీకు ఆఖరి సారిగా చెప్పడం. మళ్ళీ మళ్ళీ చెప్పి నిన్ను విసిగించడం, నువ్వు ఒప్పుకోక పోవడం.. నేను కన్నీళ్ళు పెట్టుకోవడం.. నువ్వు నన్ను ఓదార్చడం.. ఎన్నాళ్ళిలా?? నాకూ ఓపిక నశించి పోతోంది.. వయసు పెరుగుతుండడంతో ఓపిక కూడా తగ్గిపోతోంది.
ఇకనైనా నీకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతానురా. ఇదివరకు అడిగితే ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేయనీ అన్నావు.
అలా అంటూనే నాలుగు సంవత్సరాలు గడిపేసావు.. ఇప్పుడైనా ఇంక నాకు అడ్డు చెప్పకు” ఆరోజు పొద్దున్నే కిషోర్‌తో వాదనకి దిగాను నేను.
“సరే అమ్మా! నీ ఇష్టం.. నీ మాట ఎందుకు కాదనాలి, అలాగే కానీ.. అయితే నాదో కండీషన్, నా డిమాండ్లు నాకూ ఉంటాయి మరి..
నాకు మాత్రం అమ్మాయి కుందనపు బొమ్మలా, బాపూ గీసిన చిత్రంలా.. అందంగా వుండాలి..
అలాగే తప్పనిసరిగా ఉద్యోగం చేస్తుండాలి. ఈ రెండు క్వాలిటీస్ వుండేలా మాత్రం చూడమ్మా.” అన్నాడు కిషోర్.
“నీకేంటిరా! మగ మహారాజువి, అందగాడివి, ఇంచుమించుగా కొంచెం తక్కువగా ఆరడుగులు వుంటావు.
అదీగాక నెలకి లక్ష దాటి జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వుంది. అన్ని సౌలభ్యాల తోటీ కట్టించుకున్న సొంత ఇల్లు, కారూ ఉన్నాయి. నిన్ను చూసి ఏ ఆడపిల్ల అయినా ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటుంది.” కిషోర్ కేసి గర్వంగా చూస్తూ అన్నాను.
మగపిల్లాడి తల్లినని అప్పుడే కొద్దిగా గర్వం కూడా వచ్చింది నాకు.
మా కాలంలో పెళ్ళి జరిగే రోజుల్లో గానీ, ఈ మధ్య కాలంలో మా కుటుంబాలలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసినప్పుడు గానీ, పెళ్లిలో ఆడపెళ్ళివారు మగపెళ్లి వారికి అణుకువగా వుండి, వారు కోరిన కోరికలు క్షణాల మీద తీర్చి, మగ పెళ్లి వారికి వారి బంధువులకూ, పెళ్ళికూతురి తండ్రో లేక అన్నగారో దగ్గరుండి మరీ అరిటాకులు వేసి..
అణగి మణిగి ఉంటూ శ్రద్ధగా కొసరి కొసరి మరీ వడ్డించి, చాలా జాగ్రత్తగా, వాళ్లకి కోపం రాకుండా చూసుకునే వాళ్ళు. మగపెళ్లి వారి భోజనాలు పూర్తి అయ్యేకే ఆడపెళ్లి వారు భోజనాలు చేయడం మొదలు పెట్టేవారు.
మా అమ్మగారి పెళ్లిలో అయితే మగపెళ్లి వారు బూరెలు లడ్డూలు కావాలని పందిరి మీదకి విసిరేసి, అయిపోయాయి మళ్లీ తీసుకు రమ్మని చెప్పేవారని మా అమ్మ వైపు వాళ్లని చాలా ఇబ్బందులు పెట్టేరనీ ఇప్పటికీ మా అమ్మ బాధ పడుతూ అందరికీ చెప్పుకుంటూ ఉంటుంది.
మా తాతగారూ, వాళ్ళ బంధువులూ గడగడా వణుకుతూ నాన్నగారి వైపు బంధువులకు మర్యాదలు చేసేవారుట.
మరీ అంత చేయక పోయినా కొంచెం అయినా మగ పెళ్లి వారి దర్పం చూపించాలి కదా. ఇప్పుడు నాకు కూడా ఆ అవకాశం వచ్చిందని తెగ మురిసి పోతున్నాను.
పెళ్లి కొడుకు తల్లిని కదా! నా పెత్తనం నా గొప్పతనం చూపించాలి. ఆడ పెళ్లి వారిని హడలెత్తించి పరుగులు పెట్టించాలి. మనసులోనే ఏమేం చేయాలో ప్రణాళికలు వేసేసుకుంటున్నాను.
ఇంతలో మా మావగారు వచ్చి.. “మీరు ఎన్ని అయినా చెప్పండి. అమ్మాయి మాత్రం బ్రాహ్మణులలో మన శాఖ వారే అయి వుండాలి” అని గట్టిగా అల్టిమేటం ఇచ్చి వెళ్ళారు.
మా అత్తగారు వచ్చి “అమ్మాయ్! నా మనవడికి భార్య కాబోయే అమ్మాయికి దైవభక్తి తప్పని సరిగా వుండాలి. పూజలు వ్రతాలు నోములు లాంటివి ఏవీ వదలకుండా చేయాలి.. అలాంటి అమ్మాయిని చూడవే!!” అని సలహా ఇచ్చారు.
మా ఆయన వచ్చి “వంట వచ్చిన అమ్మాయిని చూద్దాం. ఇంత కాలం ఇక్ష్వాకుల కాలం నాటి రెసిపీలతో నీ చేతి వంటలు తిన్నాం, ఇప్పుడు ఇంక కొత్త వంటలు లేటెస్ట్ వంటలు రుచి చూడాలని వుంది.” అంటూ ఒక కండిషన్ చేరుస్తుంటే ఆయన వైపు కొరకొరా చూసాను. అయినా వంటొచ్చిన అమ్మాయైతే నాకు వంటచేసే శ్రమ తప్పుతుందని మౌనంగా అంగీకరించేసాను.
మా ఆడపడుచు “ఆ వచ్చిన అమ్మాయికి అన్నదమ్ములు వుండేలా చూడవే. బావమరిది బ్రతుకు కోరతాడు అంటారు” అని సలహా ఇచ్చింది.
ఈ కండిషన్ లన్నీ మళ్ళీ ఎక్కడ మరిచి పోతానో అని, గుర్తుగా ఒక పేపర్ పెన్ తీసుకుని రాయడం మొదలు పెట్టాను.
అది ఎలా ఉందంటే కిరాణా షాపు సరుకుల లిస్టులా తయారయ్యింది..
‘నాకు ఎలాంటి కోడలు కావాలంటే?’
- అమ్మాయిది మా కులం మా శాఖ మాత్రమే అయి వుండాలి.
- అబ్బాయికి అమ్మాయికి జాతకాలు బాగా కుదరాలి.
- అమ్మాయి అందంగా సన్నగా నాజూగ్గా వుండాలి.
- అమ్మాయి ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వుండాలి.
- అమ్మాయికి పనిపాటలు అన్ని రకాల వంటలు చేయడం వచ్చి వుండాలి.
- అమ్మాయికి అన్నదమ్ములు తప్పని సరిగా వుండాలి (అక్కచెల్లెళ్ళు లేకుండా ఒక్కత్తే కూతురైతే మరీ శ్రేష్ఠం).
- అమ్మాయి తల్లిదండ్రులు పెద్ద పొజిషన్‌లో వుండాలి.
- పెళ్లి గ్రాండ్‌గా సెంట్రలైజ్డ్ ఎ.సి. ఫంక్షన్ హాల్‌లో చేయాలి.
- లాంఛనాలు పెట్టుపోతలు చీరలు సారెలు ఘనంగా పెట్టాలి.
- కోడలిగా మా ఇంటికి వచ్చాక అణుకువగా వుండి ఎదురు సమాధానం చెప్పక అందరితో కలిసి మెలిసి వుండాలి.
- పూజలు వ్రతాలు నోములు చేయాలి.
- బంధువులను ఆదరించాలి. సాంప్రదాయ బద్ధంగా వుండాలి.
ఇలా ఒక లిస్టు తయారుచేసుకుని సంబంధాలు చూడడం మొదలు పెట్టాను.
మొదటి సారి వచ్చిన ఆరు సంబంధాలు మా కంటికి అస్సలు ఆనలేదు.
మేము మగపెళ్లి వారం అనే అహంకారంతో ఆ సంబంధాలను ఏదో కారణం చెప్పి వెనక్కి పంపించి వేసాము.
మాకేంటి ఇంకా మంచి సంబంధం వస్తుంది. అసలు దేనికీ కాంప్రమైజ్ కాకూడదు అని బిగదీసుకు కూర్చున్నాము.
మొదట్లో వానాకాలం వర్షాల్లా సంబంధాలు బాగానే వచ్చినా ఆ తరువాత ఎండా కాలం జల్లుల్లా వాటి ఉధృతి తగ్గిపోయింది.
సరిగా అలాంటప్పుడే ఒక మంచి సంబంధం వచ్చింది. అన్ని విధాలా మాకందరికీ చాలా బాగా నచ్చింది.
వెంటనే ఓకే చెప్పేసాము, అయితే కథ అడ్డం తిరిగి ఆ అమ్మాయి వాళ్లు సంబంధాన్ని రిజక్ట్ చేసారు.
కారణం ఏమిటంటే అబ్బాయి కంటే అమ్మాయికి జీతం ఎక్కువట అందుకని సంబంధం రిజక్ట్.
మరో సంబంధం అబ్బాయి కంటే అమ్మాయికి బి.టెక్‌లో మార్కులు.. ఎక్కువ వచ్చాయిట అందుకని సంబంధం రిజక్ట్.
ఇంకో సంబంధం అబ్బాయి బి.టెక్ మంచి కాలేజ్‌లో చదవలేదుట. అమ్మాయి పెద్ద.. పేరున్న కాలేజ్‌లో చదివిందిట సంబంధం రిజక్ట్.
మరో సంబంధం ఉమ్మడి కుటుంబం వద్దు అని అమ్మాయి వాళ్ళు సంబంధం రిజక్ట్ చేసారు.
ఇంకో సంబంధం అబ్బాయి ఆరడుగుల పొడవైన వాడు వుండాలని అమ్మాయి కోరికట. కానీ ఆరు అంగుళాలు.. తక్కువగా వున్నాడని సంబంధం రిజక్ట్.
పెళ్లి చూపులు చూడడానికి అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి నప్పుడు (కారు సర్వీసింగ్‌కు ఇచ్చిన కారణంగా) ఆటోలో వచ్చారని, మరీ చీప్‌గా ఆటోలో రావడమేమిటి? అని అమ్మాయి వాళ్లు సంబంధం రిజక్ట్ చేసారు.
ఒక సంబంధం వాళ్లు అబ్బాయి తల్లి అంటే నేను స్టైలిష్‌గా లేనని, లిప్‌స్టిక్ గట్రా వేసుకోలేదని మోడ్రన్‌గా లేననీ పాతకాలపు అత్తగారిలా వున్నాననీ సంబంధం రిజక్ట్ చేసారు.
అలాగే చాలా సంబంధాలు జాతకాలు దగ్గర వెనక్కి వెళ్ళి పోయాయి. మా పండితులు ఇద్దరికీ జాతకాలు కలిసాయి, పెళ్లి చేసుకోవచ్చు అని చెపితే..
అమ్మాయి వైపు వాళ్లు “మా పండితులు జాతకం కుదరలేదు అని చెప్పారు అండీ. మాకు ఆయన చెప్పిందే వేదం మేము ఇంక ఎవరు చెప్పినా వినం.” అని భీష్మించుకుని కూర్చుని సంబంధం రిజక్ట్ చేసేవారు.
అలా చాలా సంబంధాలు జాతకాలు దగ్గర పోయాయి.
ఒక సంబంధం అయితే “ఏమోనండీ మా అమ్మాయికి, మీ అబ్బాయితో మాట్లాడాక ‘అబ్బ!!! ఈ అబ్బాయి నా కోసమే పుట్టాడు’!! అనే ఫీలింగ్ రాలేదంటండీ. ఏమనుకోకండి మంచి సంబంధమే వస్తుంది మీకు” అంటూ పుండుమీద కారం చల్లినట్లు సానుభూతి వాక్యాలొకటీ!! (అంటే వాళ్లది మంచి సంబంధం కానట్టు).
మేము ఎక్కడో మేఘాల్లో విహరిస్తూ వున్న వాళ్లం కాస్తా అమాంతం అప్పటికప్పుడు పైనుంచి గబగబా లిప్ట్‌లో కిందకు దిగిపోయాము. ఇప్పుడు మా కాళ్లు నేలమీదే వున్నాయి. నేను ముచ్చటపడి, కష్టపడి రాసుకున్న లిస్టు ఎప్పుడో చింపేసాను.
ఫలానా ‘గుడిలో దేవుడి కళ్యాణం చేయించండి. వెంటనే మీ అబ్బాయి పెళ్లి అయిపోతుంది’ అని ఒకరు.
‘ఒకసారి కాళహస్తి తీసుకు వెళ్లి రాహు కేతు పూజ’ చేయించమని ఒకరు.
‘ఫలానా గుడిలో మీ అబ్బాయిని నిద్ర చేయమని చెప్పండి’ అని ఒకరు.
‘పలానా చెట్టు కింద మీ అబ్బాయిని నలభై రోజులు దీపం పెట్టమనండి’ అని ఒకరు.
‘మీ అబ్బాయిని ఫలానా మంత్రం జపం చేయ మనండి’ అని ఒకరు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు.
ఇదంతా చూసి చూసి విసిగి పోయిన కిషోర్
“అమ్మా! నేను డైవోర్స్ తీసుకున్న అమ్మాయిని కానీ, భర్త చనిపోయిన అమ్మాయిని కానీ పెళ్ళి చేసేసుకుంటాను, వాళ్లకి ఒక జీవితాన్ని ఇచ్చినట్లు అవుతుంది” అంటూ పెద్ద సంఘ సంస్కర్తలా, వీరేశలింగం పంతులు గారి లెవెల్లో ప్రకటించేసాడు.
“అయ్యో! ఇదేం ఆలోచనరా?!” అంటూ కొడుకు పడుతున్న వేదన చూడలేక అనునయిస్తున్నట్లుగా ఇంకా ఎక్కడో చిరు దీపంలా ఆశ రెపరెప లాడుతుంటే..
“అంత ఖర్మ ఏమీ పట్టలేదురా నీకు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. ఆ అమ్మాయిలు మాత్రం అంత ఈజీగా ఒప్పేసుకుంటారా! ఏమిటి! ఒకసారి జీవితంలో దెబ్బతిన్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఆచి తూచి మరీ అడుగులు వేస్తారు. వాళ్లు ఇంకా సవాలక్ష ప్రశ్నలు వేస్తారు.” అంటూ ఓదార్పుగా కిషోర్ భుజం మీద చెయ్యి వేసాను.
మంచి మార్కులతో చదువు పూర్తి అవ్వగానే కిషోర్‌కు కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది.
కాలేజీ గేట్ నుంచి కార్పోరేట్ ఆఫీసు వరకూ ఏ ఆటంకాలు లేకుండా వెళ్లాడు కానీ కార్పోరేట్ ఆఫీసు నుంచి కళ్యాణ మండపం దాకా వెళ్ల లేక పోతున్నాడు.
దీనికి కూడా ఇంటర్వ్యూ లాంటివి, కోచింగ్ సెంటర్ లాంటివి వుండే బావుండును.
“అమ్మా! పోనీ నేను అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే? పూర్వం రోజులలో అలాగే చేసుకునే వారుట కదా.” అయోమయంగా చూస్తూ అన్నాడు కిషోర్.
నాకు వాడిని చూస్తే భయంగా వుంది. ఇప్పుడు ఈ పెళ్లి కూతుర్లు పెడుతున్న వంకలకీ కండీషన్లకీ నా కొడుకుకు ఒకవేళ పిచ్చి గానీ ఎక్కుతుందేమో అని భయం మొదలైంది నాలో.
ఇప్పటికే బుర్ర హీటెక్కి పోయి వాడి జుట్టు కూడా ఊడి బట్టతల అయిపోతోంది. ఇప్పుడు అదో వంక దొరుకుతుందేమో.. అమ్మాయిలకు.. బట్టతల వాడు మాకొద్దు అని రిజక్ట్ చేస్తారేమో.
“అలా ఆలోచించకురా కిషోర్. అప్పుడు అమ్మాయి వాళ్లకి వీడిలో ఏదో లోపం వుంది అందుకే ఎదురు కట్నం ఇస్తానంటున్నారు. అని తప్పుగా ఆలోచిస్తారు అవన్నీ ఏం వద్దు. ‘కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు’ నీకు కళ్యాణ ఘడియలు తోసుకు వస్తే తప్పకుండా అవుతుంది. ఇంకా ఆ టైమ్ రాలేదనుకుంటాను.” వాడిని ఓదారుస్తూ అన్నాను.
ఇప్పుడు నేను గానీ మా ఇంట్లో వాళ్లు గానీ పెళ్లిళ్లకి ఫంక్షన్స్‌కి వెళ్లడం మానేసాము. తప్పు చేసిన వాళ్లలాగా తప్పుకు తప్పుకు తిరుగుతున్నాము.
“మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారూ? మాకు పప్పు అన్నం ఎప్పుడు పెడతారూ?” అని అందరూ వ్యంగ్యంగా అడుగుతూ వుంటే ఏం చెప్పాలో తెలియడంలేదు.
అమ్మాయిలకి పెళ్లి తొందరగా అవ్వాలంటే రుక్మిణి కళ్యాణం పుస్తకం చదవమని చెపుతారు.
“మరి అబ్బాయిలకు పెళ్లి తొందరగా అవ్వాలంటే ఏమి చదవమని.. మా అబ్బాయికి చెప్పనూ? మా అబ్బాయి చేత ఏమి వ్రతం.. చేయించనూ? కాస్త మీరైనా చెప్పి పుణ్యం కట్టుకోండి”.
అప్పటికీ తిరుపతిలో కళ్యాణం చేయించాను. ఎన్నో మొక్కుబడులు మొక్కుకున్నాను.
ఇప్పుడు నేను లిస్టు మళ్లీ తిరగ రాసుకున్నాను.
‘నాకు ఎలాంటి కోడలు కావాలంటే’?
ఎలాంటి కోడలు అయినా పరవాలేదు.
- అమ్మాయి మా కులం మా శాఖ కాక పోయినా,
- జాతకాలు కుదరక పోయినా,
- పూజలు వ్రతాలు నోములు చేయకపోయినా,
- అమ్మాయి అందంగా, సన్నగా, నాజూగ్గా లేకపోయినా,
- అమ్మాయి తక్కువ చదువుకున్నా, ఉద్యోగం చేయక పోయినా,
- అమ్మాయికి పనిపాటలు, వంట రాక పోయినా,
- అమ్మాయికి అన్నదమ్ములు లేకపోయినా,
- పెళ్లి ఎంత సింపుల్‌గా చేసినా, ఆఖరికి ఏ గుడిలో చేసినా,
- లాంఛనాలు పెట్టుపోతలు చీరలు సారెలు పెట్టక పోయినా,
- ఏ భాష ఏ ప్రాంతం ఏ కులం ఏ మతం అయినా,
- డైవోర్స్ తీసుకున్న అమ్మాయి అయినా,
- ప్రమాదవశాత్తూ భర్త చనిపోయిన అమ్మాయి అయినా,
ఇలా లిస్ట్ తయారుచేసి ఇంకా సంబంధాలు వెతుకుతూనే వున్నాను.
ఈ రోజుల్లో మగపిల్లాడికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయడం కంటే కొంచెం కష్టపడితే చంద్ర మండలానికి అయినా వెళ్లి రాగలమేమో..
ఇదివరకు ఆడపిల్ల పెళ్లి కాస్త లేట్ అయితే ‘గుండెల మీద కుంపటి’ అనే సామెత వాడేవారు. ఇప్పుడు మగపిల్లాడి పెళ్లి లేట్ అయితే ఏ సామెత వాడాలి. ‘గుండెల మీద ఇండక్షన్ స్టవ్’ అనాలా?
మీరు కూడా మా అబ్బాయికి ఒక సంబంధం చూడరూ!!.. ఎలాగైనా మా అబ్బాయికి పెళ్లి చేయాలి.