సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-30

0
3

[dropcap]హ[/dropcap]మ్ నే దేఖీ హై ఉన్ ఆంఖోంకి మహక్తీ ఖుష్బూ

హాథ్ సే ఛూకే  ఇసే రిష్తోంక ఇల్జామ్ న దో

సిర్ఫ్ ఎహెసాస్ హై యే, రూహ్ సే మహసూస్ కరో

ప్యార్ కో ప్యార్ హి రహనే దో, కోయీ నామ్ న దో..

‘గుల్జార్’ తనదైన శైలిలో రచించిన  నైరూప్య , మార్మిక,  ప్రతీకాత్మకమైన ఈ అద్భుతమైన గీతం ‘ఖామోషీ’ సినిమా లోనిది. హేమంత్ కుమార్ అతి సుందరంగా బాణీని సమకూర్చిన ఈ పాటను సినిమాలో ఓ మగస్వరంలో రికార్డు చేయాలనుకున్నారు. కానీ ఖామోషీలో ఒక్క గాయని పాట కూడా లేదని, ఈ పాట లతా మంగేష్కర్‍తో పాడించాలని నిర్మాత, సంగీత దర్శకుడైన హేమంత్ కుమార్ పట్టుబట్టాడు. ఐతే ఈ పాట గాయకుడు పాడేందుకు   రాసిన పాట. గాయని పాడాలంటే వ్యాకరణం మార్చాలి. వ్యాకరణం మారిస్తే బాణీ మారుతుంది. అందుకని నేపథ్యంలో రావాల్సిన పాటను సినిమాలో రేడియోలో ఓ అమ్మాయి పాడుతున్నట్టు మార్చి, వ్యాకరణ దోషం నుంచి తప్పించుకున్నారు. కానీ లత ఎంత అద్భుతంగా పాటను పాడిందంటే శ్రోతలు వ్యాకరణాన్ని కానీ పాటలోని అమూర్త భావాన్ని, వ్యక్తాతీతమైన భావనలను పట్టించుకోలేదు. కళ్ళల్లో పల్లవించే పరిమళాన్ని చేయితో తాకి బంధుత్వం అన్న నేరారోపణ చేయటాన్ని మనస్సుతో అనుభవించారు. ప్రేమ ఒక భావన అనీ, ప్రేమను ప్రేమగానే ఆత్మతో అనుభవించాలన్న బోధనను అతి సులువుగా  అర్థం చేసుకున్నారు. ప్రేమను ఇంత గొప్పగా అందీఅందనట్టు  నిర్వచించిన పాట మరొకటి లేదు.

‘ప్రేమ పూజారి’ సినిమాలో కవి నీరజ్ ‘షోఖియోమో ఘోలా జాయే ఫూలోం కా  షబాబ్’ అనే పాటలో ప్రేమ రసాయనాన్ని ఎలా తయారు చేయాలో చమత్కారంగా వివరించాడు. కానీ ప్రేమను ఇంత గూఢంగా, ఇంత గాఢంగా, ఇంత గహ్యంగా, అర్థమయీ కాని రీతిలో, అయినా అద్భుతం అనిపించే రీతిలో వివరించిన పాట మరొకటి లేదు. అయితే ప్రేమ ఒక భావన అనీ, అది కళ్ళలో వెల్లివిరిసే పరిమళం లాంటిదని, ఆ పరిమళాన్ని ఒక బంధనం పరిధిలో ఒదిగించటం దాన్ని చేతితో తాకి అమలినం, అపవిత్రం చేసి నేరారోపణ చేయటం లాంటిదని పాటల్లో చెప్తే ‘వహ్వా’ అనేవారు. ‘ఎంత గొప్పగా రాసేడు’, ప్రేమను ఆత్మతో అనుభవించాలని అని పొగిడినవారే, నిజ జీవితంలో ఇరువురి నడుమ వున్న స్నేహ గౌరవాలను ,  భావనను ఒక బంధం అనే పంజరంలో  బంధించకుండా చూడలేరు. అలా బధించి    అదో నేరం అన్నట్టు ప్రవర్తిస్తారు. ఇందుకు చక్కని ఉదాహరణ లతా మంగేష్కర్, రాజ్‌సింగ్ దుంగార్బూర్‍ల నడుమ బంధం గురించిన వార్తలు, వ్యాఖ్యలు, అభిప్రాయాలు, ఊహలు, కథలు..

మన సమాజంలో ‘పెళ్ళి’ అనేది ఒక ‘జాతీయ ఉన్మాదం’ లాంటిది. పిల్లలు పుట్టటం కన్నా ముందే సంబంధాలు నిశ్చయమైపోయేవి ఒకప్పుడు. బాల్య వివాహాలు పెద్ద సమస్య ఒకప్పుడు. వివాహంలో కన్యాశుల్కం, కట్నం, కానుకలు వ్యక్తుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి ఇప్పటికీ. వివాహం అవటంతోటే వ్యక్తి జీవితం పంజరంలో బంధనమౌతుంది. కానీ వివాహం కాని వ్యక్తి మన సమాజంలోనే కాదు, ప్రపంచంలోని అన్నీ సమాజాలలో ఒక వింత. వివాహం కానిదే వ్యక్తి జీవితం సంపూర్ణం కాదన్న నమ్మకం వివాహం అత్యంత ప్రాధాన్యం వహించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతీయ ధర్మంలో గృహస్థ ధర్మం అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. సమాజానికి వెన్నెముక లాంటిది దాంపత్య ధర్మం. ‘బ్రహ్మచర్యం’ అన్నది అభిలషణీయమైనా, సన్యాసం స్వీకరించని  బ్రహ్మచర్యం సమాజంలో ఒక వింత. వివాహం చేసుకోకపోవటాన్ని ఒక లోపంగా, అసాధారణమైన విషయంగా చూస్తుంది.  అందుకే మామూలు జీవితం గడుపుతూ వివాహం కాకుండా ఉండేవారిని సమాజం ప్రత్యేక దృష్టితో చూస్తుంది. ఈ ప్రత్యేకంగా చూడటంలో కూడా బ్రహ్మచారులను చూసే దృష్టికీ, బ్రహ్మచారిణిలను చూసే దృష్టికీ తేడా ఉంది. రాకుమారి అయినా, దాసి అయినా, దేశాధినేత అయినా, సంగీత ప్రపంచ సామ్రాజ్ఞి అయినా, పెళ్ళి చేసుకోని మహిళల పట్ల సమాజం   దృష్టి ఒకటే! అనుక్షణం ‘వారికి ఎందుకు పెళ్ళి కాలేదు?’ అని ఆలోచిస్తూ ‘పెళ్ళి ఎందుకు చేసుకోలేదు?’ అని ప్రశ్నిస్తూ, ఎవరితో ఏ కాస్త సన్నిహితంగా ఉన్నా, నవ్వుతూ కనిపించినా, ఊహలకు రెక్కలనిచ్చి సంబంధాలను అంటగట్టేస్తూ, ఒంటరిగా, విశిష్టమైన రీతిలో బ్రతుకుతున్న మహిళలపై ఆరోపణలు చేయటం సర్వసాధారణం. చెవులుకొరుక్కోవటం, చులకనచేస్తూ మాట్లాడటం, వారి ప్రతి చర్యకూ పెళ్ళికాకపోవటానికి ముడిపెడుతూ వ్యాఖ్యానించటం సర్వ సాధారణం.  లతా మంగేష్కర్‍తో సమాజం వ్యవహరించిన తీరు ఇందుకు భిన్నం కాదు!

స్త్రీ పురుష సంబంధం పట్ల పురుష దృష్టికీ, స్త్రీ దృష్టికీ తేడా ఉంది. ప్రధానంగా పురుషులు సృజించిన సాహిత్యం, ఇతర కళలు స్త్రీని అధికంగా పురుష పొందుకోసం తపించే ‘విరహిణి’గా చూపిస్తాయి. కానీ మానసిక శాస్త్రం ప్రకారం స్త్రీకి తనపై ఉన్న నియంత్రణ పురుషుడికి ఉండదు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఒక స్త్రీ మారినట్టు, రాజీపడ్డట్టు, పురుషుడు మారలేడు, రాజీపడలేడు. ఈ విషయంలో పురుషులు బలహీనులు. స్త్రీ శక్తిమంతురాలు. ప్రబంధాల్లో, నవలల్లో, సినిమాల్లో చూపించినట్టు పురుషుడి పొందుకోసం కొట్టుమిట్టాడుతూ,  చెలికత్తెలతో గంధం రాయించుకుంటూ, దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ, పురుష పొందు కోసం స్త్రీ తపించదు. ఆమెపై ఉన్న బాధ్యతలు,  పొంచి ఉన్న ప్రమాదాలు, మోసాలు స్త్రీని పురుషుడి కన్నా అతి జాగరూకురాలిగా మారుస్తాయి. అడుగు తీసి అడుగు వేయటంలో కూడా అతి జాగ్రత్తను నేర్పుతాయి. ఒక పద్ధతి ప్రకారం సమాజంలో ‘స్త్రీ’ గురించి ఒక దురభిప్రాయాన్ని స్థిరపరిచారు. దాంతో ఒంటరిగా ఉన్న ప్రతి స్త్రీని ఆమె స్థాయితో, ఆమె వ్యక్తిత్వంతో, ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఒకే గాటను తూచే దౌర్భాగ్యం సమాజంలో నెలకొని ఉంది. పురుషుడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా సమాజం పట్టించుకోదు. కానీ, స్త్రీ ఒకరివైపు నవ్వుతూ చూసినా కథలల్లేస్తుంది. ఆమె, వ్యక్తిత్వాన్ని చులకనచేసి, విమర్శించి సంతృప్తి పడుతుంది.  ఈ దృష్టితో లతా మంగేష్కర్‌పై వచ్చిన ఆరోపణలను, నీలి వార్తలను పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పత్రికలు ఏం రాశాయి? జర్నలిస్టులు ఏమన్నారు? అన్నది కాక లతా మంగేష్కర్ వ్యక్తిత్వం ఏమిటి? ఆమె అభిప్రాయాలు, విశ్వాసాలు ఎలాంటివి? అన్న విషయాల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మ అతని కళలో ప్రదర్శితమౌతుంది. లత కళను విస్మరించి ఆమె వ్యక్తిత్వాన్ని విశ్లేషించటం కుదరదు. కాబట్టి లత గానం ద్వారా కూడా ఆమె మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

పదమూడేళ్ళ వయసులో సినీ పరిశ్రమలో అడుగిడినప్పటి నుంచీ లత వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆమెకు సినీ పరిశ్రమ తీరుతెన్నుల గురించి ఆరంభం నుంచీ అవగాహన ఉంది. నైతిక విలువల గురించి, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం వంటి విషయాలపై ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. నిర్దిష్టమైన ఆలోచనలు అవగాహనలున్నాయి. అన్నిటినీ మించి తాను ‘ప్రత్యేకం’ అనీ, తన ప్రతి చర్య తన తండ్రి పేరు పై ప్రభావం చూపిస్తుందన్న అతి స్పష్టమైన అవగాహన ఉంది. ఇది ఆమె ప్రతి అడుగులో,  ప్రతి చర్యలో,  ప్రతి మాటలో కనిపిస్తుంది.

పద్నాలుగేళ్ల యువతి, పురుష ప్రాధాన్యం, ఆధిక్యం కల సినీ పరిశ్రమలో తన స్వర ప్రతిభ తప్ప మరే అండ, ఆధారం లేకుండా అడుగు పెట్టటం, నెగ్గుకురావటం అన్నది సామాన్యమైన విషయం కాదు. పైగా ఆ కాలంలో గౌరవనీయ కుటుంబ స్త్రీలు సినిమాల వైపు వచ్చేవారు కారు. సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా సమాజంలో చెడు అభిప్రాయం స్థిరపడి ఉండేది.  చులకన అభిప్రాయం చెలామణిలో ఉంది. ఆ కాలంలో ప్రతి కళాకారుడు, ఏదో ఓ రూపంలో ఇంట్లో వారిని ధిక్కరించి సినీ రంగంలో ప్రవేశించిన వాడే. నాయికలు, అధికంగా నృత్యగత్తెల కుటుంబాల నుంచి వచ్చేవారు. ఆ కాలంలో సినిమా వారంటే తాగుడుకు బానిసలు. స్త్రీ లోలత్వం కలవారు. సినిమాల్లో ప్రవేశించే మహిళల పట్ల కూడా సదభిప్రాయం ఉండేది కాదు. అలాంటి సినీ పరిశ్రమలో పదమూడేళ్ల వయస్సులో లత అడుగుపెట్టింది.

లత వాళ్ళమ్మ సాంప్రదాయాన్ని నమ్మే మనిషి. తప్పనిసరి పరిస్థితులలో లత ఉద్యోగం చేసేందుకు ఒప్పుకున్నది. కానీ సత్ప్రవర్తన పథం నుంచి ఒక్క అడుగు పక్కకు తొలగటం ఆమెకు ఇష్టం లేదు. అంతేకాదు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అధికంగా కల వ్యక్తి. లతకు ఆ గుణాలను ఆమె ఉగ్గుపాలతో నేర్పించింది. అందుకే లత ‘బాల్యంలోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింద’ని ఎవరైనా సానుభూతి వ్యక్తపరచాలని ప్రయత్నిస్తే లత వెంటనే వారిని అడ్డుకుని ఖండించేది. “నా కుటుంబం నా మీదే ఎప్పుడూ ఆధారపడలేదు. నేను సంపాదించిన ధనాన్ని ఎంతో జాగ్రత్తగా పొదుపుగా అమ్మ వాడుకునేది. మేము డబ్బుల్లో తులతూగలేదు కానీ ఎన్నడూ తిండికి లేదన్న పరిస్థితి కానీ, ఒకరిని యాచించాల్సిన పరిస్థితి కానీ రాలేదు. ఆత్మగౌరవం అన్నింటి కన్నా ముఖ్యమైనదని అమ్మ నాకు నేర్పింది. మనం ఏది కోల్పోయినా తిరిగి సంపాదించవచ్చు కానీ గౌరవం పోతే మాత్రం తిరిగిరాదు. గౌరవహీనమైన జీవితం కన్నా మరణం మేలు అని అమ్మ ఎప్పుడూ అంటూండేది” అంది లత.

లత ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు, ఏ స్థాయిలో ఆమె తండ్రి గౌరవం నిలపటం తన కర్తవ్యంగా భావించిందో; ఎంతగా అమ్మకు దుఃఖం కలిగించకూడదని, అమ్మ గౌరవంగా తల ఎత్తుకుని జీవించే రీతిలో తన ప్రవర్తన ఉండాలని తపించిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి మరో విషయం జోడించాలి. ఇంకా కుటుంబ పరిస్థితి మెరుగుకాక మునుపే సోదరి ఆశా భోస్లే ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదలివెళ్ళి పోయింది. సోదరి ఈ చర్య తల్లిని ఎంతగా బాధించిందో, ఎంతగా తలవంపులు తెచ్చిందో లత అతి దగ్గరగా చూసింది. ఇంట్లో ఒకరు ప్రేమ వివాహం చేసుకుంటే, ఇంట్లో మిగిలిన వారంతా ప్రేమ వివాహానికి వ్యతిరేకులౌతారు. పైగా ఇంటి బాధ్యతను స్వీకరించినవారు, ఇంట్లో వాళ్ళు పడుతున్న వేదనను చూసిన తరువాత తామూ అలాంటి పని చేయాలన్న ఆలోచననను దరిదాపులకు కూడా రానివ్వరు. వారి జీవితాలలో ‘ప్రేమ’ అన్నపదం అర్థం మారిపోతుంది. తల్లిని వ్యతిరేకించి ప్రేమించటం, వివాహం చేసుకోవటం అన్న ఆలోచన దరిదాపులకు కూడా రాదు. వారెవరినైనా ప్రేమించినా, ఆ ప్రేమ ఫలవంతం కాదు. ఎందుకంటే అడుగడుగునా కుటుంబ సభ్యుల వేదన, వారి పట్ల తన బాధ్యత వంటి విషయాలు మనసును వెనక్కు లాగుతుంటాయి. కాబట్టి లత ఒక వ్యక్తిని తనకు సన్నిహితంగా రానివ్వటం జరగదు. సన్నిహితంగా ఎవరైనా వచ్చినా వారు ఒక స్థాయి దాటి సాన్నిహిత్యం సంపాదించలేరు. లత జీవితాన్ని గమనిస్తే ఈ విశ్లేషణలోని ఔచిత్యం అర్థమౌతుంది.

పై విశ్లేషణలో మరో అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. లత వ్యక్తిత్వంలో ముక్కుమీద కోపం ఒక ప్రధాన అంశం. శాస్త్రీయ సంగీత విద్వాంసురాలవ్వాలన్న లక్ష్యం ఉన్నా సినీ నేపథ్య గాయనిగా జీవిక  కోసం స్థిరపడాల్సి వచ్చింది. ఇది కూడా ఆమె వ్యక్తిత్వాన్ని నిర్దేశించిన ప్రధాన అంశం. తాను ఏం చేసినా తానే అత్యుత్తమురాలు అన్న విశ్వాసం ఓ వైపు, తనకిష్టమైన పని కాక తప్పనిసరి పరిస్థితులలో ఇష్టం లేని పని చేయాల్సి రావటం మరోవైపు ఉంటూ, ఈ రెండు భావాల నడుమ సంఘర్షణ కూడా ఆమె వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసింది. అందుకే పాట పాడేటప్పుడు సర్వం మరచి పాటలో లీనమైపోయినా, ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవటం, తగాదాలు పడటం; ఎవరెంత పెద్దవారు, గొప్పవారైనా లెక్కచేయకపోవటం ఆమె స్వభావంలో కనిపిస్తాయి. ఓ వైపు దైవభక్తి, ధర్మ భక్తి, సాంప్రదాయ గౌరవం, ధార్మితక వంటివి కనిపిస్తూంటాయి. మరోవైపు అసహనం, చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకోవటం, ఎవరినీ లెక్క చేయకపోవటం, తన తొందరపాటు చర్య కెరీర్‍పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఆలోచించకపోవటం వంటి చర్యలు కనిపిస్తాయి. దీనితో పాటు తన గాన ప్రతిభ పట్ల అచంచలమైన విశ్వాసం, ఎలాంటి వారైనా తన ముందు బలాదూర్ అవక తప్పదన్న ఆత్మవిశ్వాసం కూడా ఇలాంటి చర్యల నేపథ్యంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచీ లత ప్రవర్తన అర్థమవుతుంది.

ఆరంభంలోనే సినీ పరిశ్రమ తీరు తెన్నులు అర్థం చేసుకుంది లత. ‘విజయం’ సినీ రంగానికి ‘దేవత’ అన్నది గ్రహించింది. అవకాశాల కోసం సంగీత దర్శకులను కలసింది. కానీ ఏ సంగీత దర్శకుడిని కూడా ప్రాధేయపడలేదు. తన స్వరం బాగాలేదని తిరస్కరించిన వారి దగ్గర మౌనంగా ఉంది. బాగుందని అవకాశాలిచ్చిన వారి దగ్గర విధేయంగా ఉంది. తన చుట్టూ ఒక గిరి గీసుకుని దాన్ని ఎట్టి పరిస్థితులలో దాటలేదు. ఎవ్వరినీ ఆ గీత దాటి రానివ్వలేదు. ఓ పెన్ను ఇస్తేనే లతకూ తనకూ నడుమ ఏదో ఉందని కథలల్లి అనుచితంగా ప్రవర్తించిన వారిని దూరం పెట్టటం ఆరంభంలోనే నేర్చుకుంది. ఎంత పేరున్న గాయకుడైనా, అనవసరమైన వ్యాఖ్య చేస్తే వాకౌట్ చేసింది. ఇవన్నీ 1949 కన్నా ముందు, ఇంకా సినీ పరిశ్రమలో స్థిరపడటం కన్నా ముందు జరిగిన సంఘటనలు. అంతేకాదు, ఎట్టి పరిస్థితులలో ద్వంద్వార్థాలు ధ్వనించే పాటలు పాడనని ఇంకా పేరు రాకముందే స్పష్టం చేసింది. అంటే అవకాశం దొరికితే పీక్కు తినేందుకు క్రూర జంతువులు సిద్ధంగా ఉండే సినీ అరణ్యంలో ఆరంభంలోనే తన వ్యక్తిత్వాన్ని స్పష్టం చేసి, అప్రమత్తంగా ఉంటూ తనకంటూ ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన ఇమేజీని ఏర్పరచుకుందన్న మాట లతా మంగేష్కర్.

ఎప్పుడైతే ఓ వ్యక్తి అందరికన్నా భిన్నంగా ఉంటూ, తనదైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాడో అప్పుడు సమాజం ఆ వ్యక్తిని లొంగ దీయాలని చూస్తుంది. వంగ దీయాలని చూస్తుంది. విరవాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాలేమీ సఫలం కాకపోతే, అవకాశం కోసం, బలహీన క్షణం కోసం ఎదురు చూస్తూ దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉంటూ, నీరాజనాలర్పిస్తుంది. ఇది కూడా లతకు తెలుసు. అందుకని ఒక్కసారి విజయం సాధించిన తరువాత శిఖరం దిగలేదు.

ఈ సందర్భంలో లత దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రధాని నరేంద్రమోదీకి అందించిన సభలో ఆశా ప్రసంగాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. “నా సోదరిది (లత) చాణక్యుడి  లాంటి మేధస్సు. ఆమె భవిష్యత్తు గురించి స్పష్టమైన అవగాహన కలది. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు నోరు విప్పాలో బాగా తెలుసు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు నన్ను తిట్టేది. ఆమెకు ఏం కావాలో తెలుసు. తనకు కావాల్సింది ఎలా సాధించాలో తెలుసు” అని వివరించింది. గ్రామఫోన్ కంపెనీలు గాయని పేర్లు రికార్డులపై ముద్రించేవారు కాదు. ఆరంభంలో మౌనంగా ఉన్న లత, పేరు రాగానే పట్టుబట్టి రికార్డులపై గాయనీ గాయకుల పేర్లు ముద్రించేట్టు సాధించింది. సినిమాల్లో సంగీత దర్శకుల కన్న ముందు గాయనీ గాయకుల పేర్లు రావాలని పట్టుబట్టి సాధించింది. రాయల్టీ విషయంలో కూడా అంతే. ఇంగ్లండ్‍లో సభను రాయల్ అల్బర్ట్ హాల్‍లోనే నిర్వహించాలని పట్టుబట్టి సాధించింది. దీన్ని బట్టి లత స్వభావంలో ఎలాంటి మోసానికి, exploitation కి ఒప్పుకోని తత్త్వం పుష్కలంగా ఉందని గ్రహించవచ్చు. ఆ సమయంలో మౌనంగా ఉన్నా, తరువాత సరైన సమయంలో తాను అనుకున్నది సాధించి తీరుతుందనీ అర్థం చేసుకోవచ్చు.  కీలెరిగి వాతపెట్టటం లతకు వెన్నతో పెట్టిన విద్య.

రవీంద్ర జైన్ చక్కటి  సంగీత దర్శకుడు. అతను లతతో పాటలుపాడించినా అధికంగా హేమలతకు ప్రాధాన్యం ఇచ్చాడు. లత మౌనంగా వుంది. తనకు నచ్చిన గాయనితో పాడించటం సంగీత దర్శకుడి హక్కు. అధిక  సంఖ్యలో హేమలతతో పాడించాడు రవీంద్ర జైన్. అతని కేరీర్‌లో అద్భుతమయిన కమర్షియల్ హిట్ రాజ్‌కపూర్ సినిమా ‘రాం తెరీ గంగా మైలీ. ఆ సినిమాలో అన్నిపాటలకన్నా అధికంగా సూపర్ హిట్ అయిన పాట లత పాడిన  ‘సున్ సాహెబా సున్’ . రాం తెరీ గంగా మైలి సినిమా విజవంతమైనందుకు జరిపిన అభినందన సభలో మాట్లాడుతూ లత, సున్ సాహెబా సున్ పాటను గతంలో రాజ్‌కపూర్ నిర్మించాలనుకుని ఆపేసిన అజంతా సినిమా కోసం రికార్డ్ చేసానని, ఆ పాటను శంకర్‌జైకిషన్ రూపొందించారనీ బహిరంగంగా చెప్పింది. అంటే, రవీంద్ర జైన్ రూపొందినట్టుగా భావిస్తున్న పాటను రూపొందించింది శంకర్‌జైకిషన్ అని స్పష్టంచేసింది. పరోక్షంగా ఆ పాట హిట్ అవటంలో రవీంద్రజైన్ పాత్ర లేదని చెప్పినట్టయింది. హేమలతకు ప్రాధాన్యం ఇచ్చినందుకు లత ప్రతీకార చర్య ఇది అని రాజు భరతన్ లాంటివారు వ్యాఖ్యానించారు. అనేది అనేసిన తరువాత లత ఎప్పటిలాగే మౌనంగా వుంది. కానీ,  అంతవరకూ రవీంద్రజైన్ నిర్మించుకున్న ఒరిజనల్  సంగీతదర్శకుడి ఇమేజీ ఒక్క దెబ్బతో కూలిపోయింది.

ఆరంభంలో ‘శ్యామ్ సుందర్’ అనే సంగీత దర్శకుడితో ఇతరులు కల్పించిన వివాదం వల్ల లత ఎవరు ఏమన్నా స్పందించటం మానేసింది. సినీ పరిశ్రమలో మాటలకు రెక్కలు రావటమే కాదు రూపం, ప్రాణాలు కూడా వస్తాయని తెలుసుకుంది. అంటే, సినీ పరిశ్రమలో వ్యక్తుల మనస్తత్వాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ లత అతి దగ్గరగా చూసింది. తెలుసుకుంది. జాగ్రత్త పడింది. పద్ధతి ప్రకారం తన ఇమేజీని నిర్మించుకుంది. ఎట్టి పరిస్థితులలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. లత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న తరువాత ఆమెపై ఉన్న ఆరోపణలను, గాలి వార్తలను పరిశీలించాల్సి ఉంటుంది.

హుస్న్‌లాల్ భగత్‌రామ్‍లలో హుస్న్‌రామ్‌తో లతకు ప్రేమ వ్యవహారం ఉందని, హుస్న్‌లాల్ భార్య గోల చేసిందని, అప్పుడు లత హుస్న్‌లాల్‍తో పనిచేయటం మానేసిందని అంటారు. హుస్న్‌లాల్‍కూ లతకూ నడుమ దాదాపుగా పదేళ్ళ అంతరం ఉంది. అప్పటికే హుస్న్‌లాల్‍కు పెళ్ళయింది. ఉదయం పూట పాటలు నేర్చుకునేందుకు లత అతని ఇంటికి వెళ్ళేది. లతపై హుస్న్‌లాల్ చూపిస్తున్న ప్రత్యేక అభిమానం అతని భార్యకు నచ్చలేదు. దాంతో లత అతని ఇంటికి వెళ్ళలేదు. అతనితో పనిచేయటం మానేసింది. దీనికి లత హుస్న్‌లాల్‍ను ప్రేమించిందని వదంతులు వచ్చాయి. తాగి బాణీ కడతాడని ఓ సంగీత దర్శకుడితో పనిచేయటం మానేసింది లత. అనుచితంగా ప్రవర్తించాడని ఓ గాయకుడితో పాడటం మానేసింది. అలాంటి లత పాట నేర్పే సంగీత దర్శకుడితో అనుచితమైన భావనలు ప్రదర్శిస్తుందని ఊహించటం కుదరదు. అయితే తన భర్త మరో యువతిపై శ్రద్ధ చూపించటం ఏ భార్య కూడా సహించదు. పైగా ఆ అమ్మాయి సినీ ప్రపంచానికి చెందినదైతే అనుమానాలు కలగటం సహజం. ఒక సహజమైన దాన్ని అసహజంగా చిత్రించి వ్యక్తిపై బురదజల్లి ఆ వ్యక్తి ఎదుగుదలను అరికట్టాలని ప్రయత్నించటం సినీ పరిశ్రమలో స్వాభావికం. అందులో ఆ అమ్మాయి ఒంటరిదై, ఎవరి అండా లేకపోతే ఇలాంటి ప్రచారాలు మరింత శక్తివంతం అవుతాయి.

సి. రామచంద్రతో లతకు ఉన్న అనుబంధం గురించి ఈనాటికీ ఊహాగానాలు సాగుతున్నాయి. తన సినిమాల్లో లతనే పాడాలని పట్టుబట్టేవాడు సి. రామచంద్ర. లత అతని జీవితంలోకి వచ్చాక సి. రామచంద్ర సృజన స్వరూపం మారింది. అతని బాణీలలోని మాధుర్యం పెరిగింది. ఎప్పుడైతే లత అతనితో కలసి పనిచేయటానికి నిరాకరించిందో, అప్పటి నుంచీ సంగీత దర్శకుడిగా సి. రామచంద్ర పతనం వేగవంతం అయింది. రెండు మూడేళ్ళలో రామచంద్ర కెరీరు దాదాపుగా సమాప్తమైపోయింది. లత లేని పాటను తానూహించలేనని బహిరంగంగా ప్రకటించాడు సి. రామచంద్ర. అయితే లత సి. రామచంద్రను తన జీవితంలోంచి సంపూర్ణంగా తొలగించింది. ఆయన పేరు తలవలేదు. చివరికి ‘ఏయ్ మేరే వతన్ కే లోగో’ పాటను కూడా కవి ప్రదీప్ పాటగా పేర్కొంది తప్ప సి. రామచంద్ర పాటగా ఎప్పుడూ ప్రస్తావించలేదు. తాను పాడిన ఉత్తమ గీతాల జాబితాలో సి. రామచంద్ర పాటను పేర్కొనలేదు. వారిద్దరి నడుమ ఏం జరిగిందన్నది ఊహాగానాలలో మిగిలింది.

సి. రామచంద్రని పెళ్ళి చేసుకోమని లత అడిగిందని అందుకు సి. రామచంద్ర నిరాకరించటంతో లత అతనితో సంబంధం త్రెంచుకుందని సి. రామచంద్ర స్వయంగా మరాఠీలో రాసిన తన జీవిత చరిత్ర ‘మాఝ్యూ జీవనాచి సర్గమ్’ (1977)లో ప్రస్తావించాడు. లత బదులు ‘సీత’ అని రాశాడు. ఇటీవలే ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది ఇంగ్లీషులో. ‘The Bitter-Sweet Cocktail Movies, Music, Wine, Women,  The Life and Times of C. Ramchandra’ గా దిలీప్ శ్రీపాద్ ఫన్సాల్కర్ అనువదించారు. తాను ఆడవాళ్ళ విషయంలో చాలా బలహీనుడిననని ఆరంభంలోనే చెప్పాడు రామచంద్ర. తరువాత తాను ఎవరెవరితో సంబంధాలు నెరపాడో వారి గురించి రాశాడు. తన భార్య ఎలా రాజీపడేదో కూడా రాశాడు. చివరికి ‘వాసన్’ అనే తమిళ నిర్మాతకు తనని సంగీత దర్శకుడిగా తీసుకోవద్దని అతని ‘ప్రేయసి’ ఫోన్ చేసిందన్న విషయం వాసన్ చెప్పాడని చెప్పి ఆ ప్రేయసి పేరు సీత అని; తనకూ సీతకూ నడుమ జరిగిన విషయాలు చెప్పటం ఆరంభిస్తాడు.

‘The clues themselves in this book will reveal the identity of Seeta’ అంటూ ఆరంభిస్తాడు. అంటే, తాను మారు పేరుతో రాసినా అసలు వ్యక్తి ఎవరో అందరికీ తెలిసేట్టే రాసేడన్నమాట.

“Among those Seetas who called me Ram, she was one of them. She always greeted me as Ram both in private and public. This particular Seeta came into my life around 1947-48, although I do not remember the exact day and date! (The Bitter-Sweet Cocktail Movies, Music, Wine, Women The Life and Times of C. Ramchandra; Page No. 106).

1947-48 నడుమ తన జీవితంలోకి వచ్చిందనటం, సీత అనటంతోటే రామచంద్ర ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడో అందరికీ అర్థమైపోతుంది. ఇలా రాయటంలోనే సీ రామచంద్రకు లత పట్ల ఉన్న కసి, ద్వేషాలు స్పష్టమవుతాయి. అదీ, సంఘటన జరిగి దాదాపుగా 20 ఏళ్ళపైన అవుతున్నా సీ రామచంద్ర ఆ సంఘటనల తలపులతో రగులుతున్నాడనీ, లతాను ఏమీ చేయలేక, ఈ రకంగా ఆమెపై అభాండాలువేసి పేరు పాడుచేసి సంతృప్తి పడే ప్రయత్నమే ఈ జీవిత చరిత్ర రచన అనీ అర్ధమవుతుంది. తనని కాదన్న యువతిని వేధించటం, ఆమెకు వేరే సంబంధాలు అంటగట్టడం, ఫోటోలు మార్ఫ్ చేసి ఏడ్పించటం చేసే మనస్తత్వంలాంటి మనస్తత్వం ఇది. కళాకారుడిగా సీ రామచంద్ర అతి గొప్పవారి జాబితాలో అగ్ర స్థానంలో వుంటాడు. కానీ, ఆయన జీవితచరిత్రలో అమ్మాయిలను అనుభవించి ఆతరువాత ఆడవాళ్ళని నమ్మద్దని తండ్రి ఎప్పుడో చెప్పాడని అది వినక తాను నష్టపోయానని అనటం అతని వ్యక్తిత్వానికి మచ్చలాంటిది. కేవలం లతను అవమానించి, చులకనచేయటానికే తన ఇతర సంబంధాలగురించి రాశాడనిపిస్తుంది.

సీత తొలిసారి పాడటం విని తాను నిశ్చేష్టుడనైపోయానని, ఎందుకంటే ఒక కళాకారుడు తన కళ ఎలా ధ్వనించాలని కోరుకుంటాడో అలానే ఆమె స్వరం ధ్వనించిందని అంటాడు. తరువాత ఆ గాయని దగ్గరకు వెళ్ళి “నువ్వు ఎంత అద్భుతంగా పాడావంటే నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది” అని అన్నానని రాశాడు. దానికి సమాధానంగా “మీకు తెలుసు నేను హుస్న్‌లాల్ ప్రేమించుకుంటున్నామని. నేను ఆయనని మాత్రమే ప్రేమించగలను” అందా గాయని అని రాస్తాడు సి. రామచంద్ర. అప్పుడు సి. రామచంద్ర ‘నేను నీ గొంతుని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నాన’ని రాశాడు.

రామచంద్ర సీత అని రాసినా లత అని అర్ధం అయ్యేట్టు రాశాడు. ఈ సంఘటం రామచంద్ర స్వకపోల కల్పితం అని సులభంగా పసికట్టవచ్చు. లతా మంగేష్కర్ ఆరంభమ్నుంచీ తన వ్యక్తిగత విషయాలను బహిరంగపరచలేదు. గుట్టుగా వుంది. ఒక గాయకుడు ఆమె తెల్లచీర కట్టుకుంటే రొమాంటిక్ మూడ్ రావటంలేదనీ పాట పాడలేకపోతున్నానని అన్నాడని, అతనితో పాడటం మానేసింది లత. అలాంటి లత ముద్దుపెట్టుకోవాలని వుందంటే, నేనింకొకరిని ప్రేమిస్తున్నానని చెప్పటం అనౌచిత్యం, లత వ్యక్తిత్వ విరుద్ధం. కాబట్టి సీత, లత కాదు. రామచంద్ర తన జీవితచరిత్ర కసి తీర్చుకోవటం కోసం రాశాడు తప్ప మరొకందుకు కాదు అని అర్ధమవుతుంది. ఎందుకంటే, ఈ జీవిత చరిత్ర రచనలో తమ సృజన గురించి రాయలేదు. అధికాంగా అమ్మాయిలతో తన వ్యవహారాల గురించి రాశాడు. పైగా, ఆడవాళ్ళని నమ్మవద్దని తన తండ్రి చిన్నప్పుడే చెప్పాడనీ తానే వినలేదనీ,అన్నివిధాలా నష్టపోయాననీ రాశాడు. కాబట్టి, ఈ జీవిత చరిత్రలో సీత అంటూ రాసినదంతా నిజమని అనుకోకూడదు, ప్రతి విషయాన్నీ లతకు ఆపాదించి ఊహించకూడదు. కానీ, అందరూ సీత, లతనే అనుకున్నారు. రామచంద్ర రాసినదాన్ని నిజమని నమ్ముతున్నారు.

తరువాత కొన్నాళ్ళకి సీత ఏడుస్తూ తన దగ్గరకు వచ్చిందని, కారణం అడిగితే, తనను ప్రేమిస్తున్నానని నమ్మించిన హుస్న్‌లాల్ భార్య గర్భవతి అయిందని, ఆ మోసానికి ఏడుస్తున్నానని సమాధానం ఇచ్చిందని రాశాడు. అంతేకాదు, ‘Afterwards she told me that she expected me to make love to her’ అని రాశాడు.  లతా మంగేష్కర్ తనకంటూ నిర్మించుకున్న ఇమేజీని దెబ్బ తీయాలన్న ఆలోచన ఈ రాతలో స్పష్టంగా కనిపిస్తుంది. తాను నాశనమయిపోయినా ఆమె సంతోషంగావుందన్న కసి ఇది.

  ఓ రోజు రామచంద్రతో ఉన్నప్పుడు మైమరచి సీత ‘హా హుస్నా’ అందని అయినా తాను పట్టించుకోలేదని రాశాడు. అలాంటామె హుస్న్‌లాల్ మరణించినా పట్టించుకోలేదని, నిష్ఠూరాలాడేడు. సీత తన్ను తాగుడు మానేయమందని, ఓ రోజు బడే గులామ్ ఆలీఖాన్, సంగీత సభను సీత ఏర్పాటు చేసిందని ఆ సభకు తాను వస్తే తనను తిట్టిందని; ‘నా డబ్బుతో తాగుతాను’ అని తాను అనగానే ఆమె స్పృహ తప్పిపోయిందనీ, అప్పుడు రెండు చెంచాల బ్రాందీ తాగిస్తే, స్పృహ వచ్చి, బ్రాందీని కావాలని కక్కేసిందనీ రాస్తూ ఓ వ్యంగ్య బాణం విసిరాడు. ‘She believes nothing is worse than drinking. That is why she does all other bad things which she thinks are better than drinking’ (Page no 110). ఇక్కడకూడా రామచంద్ర తెలిసోతెలియకో లత ఇమేజీ పాడచేస్తున్నాననుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. లత చెడుపనులు చేస్తున్నదని రాశాడు. కానీ, ఆ చెడుపనులు చేస్తున్నది రామచంద్ర ప్రకారం రామచంద్రతోనే!!!

మరో సంఘటన రాశాడు సి. రామచంద్ర తన జీవిత చరిత్రలో. ఓసారి సి. రామచంద్ర, సీత ఓ హాలీవుడ్ సినిమా చూసేందుకు వెళ్తూంటే అక్కడ అతని భార్య దారి కాసి సీతను జుట్టుపట్టి కొట్టిందని అందుకు ప్రతిగా తాను సీతను కలసినప్పుడు సీత తన భార్యకు ఫోన్ చేసి ‘నీ భర్త నా ముందు పెంపుడు కుక్కలా కూర్చున్నాడ’ని చెప్పిందని, అంత కర్కోటకురాలు సీత అనీ రాశాడు. గేయ రచయిత రాజేందర్ క్రిషన్  సీత ఎవ్వరినీ పెళ్ళి చేసుకోదని, ఆమె కోసం జీవితం పాడు చేసుకోవద్దని హెచ్చరించాడనీ రాశాడు సి. రామచంద్ర. అలాగే సీత తల్లి, స్నేహితురాలు కూడా, తనను హెచ్చరించారనీ రాశాడు.  అయితే రామచంద్ర ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడని, ఆ అమ్మాయిని చూపించి సీతకు పరిచయం చేస్తే, మరుసటి రోజు ఓ రాకుమారుడిని తీసుకుని వచ్చి పరిచయం చేసి ‘ఒకప్పుడు నాకు నువ్వెలాగో, ఇప్పుడు ఈయన అలాగ’ అందని రాశాడు సి. రామచంద్ర (పేజి నెం. 113). సీత పేరుతో రామచంద్ర ప్రస్తావిస్తున్న లత, తీసుకొచ్చి పరిచయం చేసిన ఆ రాకుమారుడెవరు?

ఇక్కడి నుంచి సమస్య ఆరంభమయింది.

సి. రామచంద్ర రాసిన ప్రతి మాటను సినీ ప్రముఖులు, సామాన్యులు నిజమని నమ్మారు. లత అటు హుస్న్‌లాల్‍తో వ్యవహారం నడిపి, అతని జీవితం పాడు చేసిందని; ఇటు సి. రామచంద్రను ప్రేమలో ముంచి ద్రోహం చేసి అతడి కెరీర్ నాశనం చేసిందనీ ప్రతి ఒక్కరూ అంతా తమకు తెలిసినట్టు, చూసినట్టు వ్యాఖ్యానించి తీర్మానించేశారు. అయితే సి. రామచంద్ర మాటల్లో ఎంత సత్యముందో ఎవరికీ తెలియదు కానీ తాను ప్రేమించిన అమ్మాయిని దోషిగా, జాలి దయ లేని రాక్షసిగా, ఎలాంటి సున్నిత భావనలు లేని కర్కోటకురాలిగా చూపించాల్సిన తపనలో తనని తాను ఏ స్థాయిలో దిగజార్చుకున్నాడో సి. రామచంద్రనే కాదు, అతడి మాటను ప్రామాణికంగా తీసుకుని లతపై దుర్వ్యాఖ్యానాలు చేసినవారూ మరచిపోయారు. “ Rumors are carried by haters, spread by fools, and accepted by idiots.”

సి. రామచంద్రకు వివాహం అయింది. పిల్లలు పుట్టరన్న బాధను తాగుడులో, ఇతర అమ్మాయిలతో వ్యవహారాలలో మరచిపోవాలని ప్రయత్నిస్తున్నాడు సి. రామచంద్ర. ఓ యువ గాయనిని ప్రేమించాడు. ఆమె లేనిదే బ్రతకలేనన్నాడు. కాని ఆమెని తన భార్య కొడుతూంటే ఒంటరిగా వదిలేసి, పారిపోయాడు. ఆమె తాగవద్దంటే తాగుడు లేకుండా బ్రతకలేననటమే కాదు ఆమెకూ బ్రాందీ పోశాడు. చివరికి ఆమెతో వ్యవహారం నడుపుతూ తనకన్నా చిన్న వయసున్న అమ్మాయితో ప్రేమలో పడి, భార్య బ్రతికి ఉండగా మరో వివాహం మహారాష్ట్రలో నేరమని గోవా వెళ్ళి ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. ఆమెని పెళ్ళి చేసుకోబోతున్నానని తన ప్రేయసికి పరిచయం చేశాడు. ఎలాంటి వ్యక్తిత్వం ఇది? అమ్మాయిలంటే చులకన అభిప్రాయం అడుగడుగునా కనిపిస్తుంది. తన వైఫల్యానికి నేరం మరొకరిపై నెట్టివేయటం స్పష్టంగా తెలుస్తూంటుంది. ఇక్కడ సి. రామచంద్ర వ్యక్తిత్వాన్ని తక్కువ చేయటం కాదుగానీ, ఇలాంటి వ్యక్తి మాటలను నమ్మి, లతా మంగేష్కర్ వ్యక్తిత్వాన్ని అంచనా వేసి, తీర్మానించేసి నోళ్లు నొక్కుకుని, చెవులు కొరుక్కుని – అన్నీ తమకే తెలుసనుకునేట్టు వ్యాఖ్యానించే వారిని చూస్తే, మన సమాజం ఎంతగా పురుష పక్షపాతియో తెలుస్తుంది. పురుషుడు ఎలా ప్రవర్తించినా ఫరవాలేదు. పురుషుడి దుష్ప్రవర్తనకు బాధ్యత మాత్రం స్త్రీదే! దోషం స్త్రీదే! తనను నమ్మి సన్నిహితంగా వున్న స్త్రీ గురించి పురుషుడు ఎన్ని దుర్భాషలాడినా, ఎంత దుష్ప్రచారం చేసినా, ఆ పురుషుడి పనిని సమర్ధిస్తూ స్త్రీని దొషిగా భావిస్తుంది సమాజం. అలాంటి సమాజంలో ఒంటరిగా నిలబడి, అందరూ తనెలా ఆడిస్తే, అలా ఆడుతూ తన కనుసన్నలలో మెలిగేట్టు చేసుకున్న లతా మంగేష్కర్ గొప్పతనం, చాణక్య మేధ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినీ ప్రపంచంలోని మహిషాసురుల మదమణచే మహారాణి కాళికాదేవి లతా అనిపిస్తుంది. పాటలుపాడేప్పుడు సరస్వతీ దేవి, ఇతర సమయాల్లో మహిషాసురమర్దిని!!!

లతా మంగేష్కర్ వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఆమె ప్రతిచర్యలో ‘పద్ధతి’ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె ఎవరినీ సన్నిహితంగా రానీయకపోవటం, నమ్మకపోవటం కనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బు వ్యవహారాలలో నిక్కచ్చితనం కాదనలేనంత స్పష్టంగా తెలుస్తూంటుంది. అలాంటి లత సి. రామచంద్రను నమ్మింది. అతనితో కలసి సినిమా నిర్మాణం చేసింది. ఆ సినిమా విఫలమైంది. సి. రామచంద్ర మాట విని పి.ఆర్. భిడే అనే వ్యక్తి చేసే వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. రామచంద్ర సంతకం పెట్టమన్న చోటల్లా పెట్టింది. రామచంద్రకు గ్యారంటీగా నిలిచింది. చివరికి పి.ఆర్. భిడే వీరిద్దరూ తనకు రెండున్నర లక్షలు ఇవ్వాలని, వీళ్ళు పెట్టిన సంతకాలే సాక్ష్యంగా చూపి  కోర్డుకు లాగేడు. కథ చివరికి సుఖాంతం అయింది కానీ సి. రామచంద్రను నమ్మటం అనర్థదాయకం అన్న విషయం స్పష్టం అయింది. ఈ సంఘటన సి. రామచంద్ర తన జీవిత చరిత్రలో రాశాడు. కానీ లతకూ తనకూ నడుమ దూరం ఏర్పడటానికి, లత తనకు పాడకపోవటానికి కారణాలు వేరే అని,  అందరికీ ఉత్సాహం కలిగించేవి చూపాడు. ఒకవేళ సి. రామచంద్ర నిజంగా నిజాయితీగా లతను ప్రేమించి ఉంటే తామిద్దరి నడుమ జరిగిన విషయాలను బయటపెట్టడు. ఆమెపై గౌరవంతో మౌనంగా ఉంటాడు. కానీ ఇలాంటి రాతల వల్ల అతనికి ప్రేమ కన్నా ఆమె తనతో పని చేయటం మానేసిందన్న బాధ ఎక్కువగా ఉందని, అతని అహం దెబ్బతిన్నదనీ, ఆ అహాన్ని సంతృప్తి పరచుకునే ప్రయత్నమే ఇలాంటి రాతలు అనీ స్పష్టంగా తెలుస్తూంది. ‘మనం మాట్లాడటం మానేసిన తరువాత మన గురించి మాట్లాడతార’న్న నిజం సి. రామచంద్ర ప్రవర్తన నిరూపిస్తుంది.

వీటన్నిటికీ లత సమాధానం మౌనం!

ఇది లత సంస్కారాన్ని సూచిస్తుంది.

గమనిస్తే, సీ రామచంద్ర లతకే పరిమితమయిన సమయంలో , లత అందరు సంగీత దర్శకులతో కలసి పనిచేసింది. ముఖ్యంగా ఈ సమయంలో శంకర్‌జైకిషన్ ఆమెతో అధిక సంఖ్యలో పాటలు పాడించటమేకాదు, అత్యద్భుతమయిన పాటలు పాడించారు. హేమంత్ కుమార్ , ఎస్డీ బర్మన్, నౌషాద్, రోషన్…ఒకరేమిటి ఒక్క ఓపీ నయ్యర్ మినహా అందరి పాటలూ పాడింది లత. దీని అర్ధం ఏమిటంటే, రామచంద్ర లత పట్ల తన ప్రేమనో, విధేయతనో ప్రదర్శించాడు. కానీ, లతకు అలాంటి స్పృహ కూడా వున్నట్టులేదు. ఆమెకు కేరీర్ తప్ప మరో విషయంపై ధ్యాసలేదు.
ఒక స్త్రీ తనని చూసి నవ్వితే పురుషుడు కలలు కనేస్తాడు. ఊహల హర్మ్యం నిర్మించేస్తాడు. ఆమె నేనలా అనుకోలేదే!! అంటే మోసం చెసిందని ఇల్లెక్కి కోడై కూస్తాడు. ప్రపంచం అతనిపై సానుభూతి కురిపిస్తుంది. ఆమెను ద్వేషిస్తుంది. మోసగత్తె అంటుంది.  స్త్రీ అలా కాదు. ఆమె రక్షణ వ్యవస్థ ఆమెది. పురుషుడిలా కాస్త దగ్గరకు వచ్చిన ప్రతివాడినీ ప్రియుడిలా భావించదు. అదీ, ఆ కాలంలో, సంప్రదాయాన్ని నమ్మే వ్యక్తి,  ఎంతో నమ్మితే తప్ప దగ్గరికి రానీయదు. సీ రామచంద్ర సీతలా ఊహల్లో తప్ప నిజ జీవితంలో ఎవ్వరూ ప్రవర్తించరు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇదే సమయానికి కొందరు హేమంత్ కుమార్‌తో లత వ్యవహారం నడుస్తోందని రాశారు. హేమంత్ కుమార్ లతను అభిమానిస్తాడు. లత స్వరం తప్ప ఇతరుల స్వరాలకు ప్రాధాన్యం ఇవ్వడు. లత హేమంత్ కుమార్ ను గౌరవించింది. అభిమానించింది. లతపై బురద చల్లే ఆత్రంలో హేమంత్ కుమార్ వ్యకిత్వాన్నీ దెబ్బతీసేందుకూ వెనుకాడలేదు. ఇలా లత గురించి వీరంతా రాసినవి నమ్మితే లత ఒక నింఫోమేనియాక్ లా అనిపిస్తుంది. వీరు రాసిందంతా నిజమనుకుంటే ఆమెకు పాటలు పాడే సమయమే వున్నట్టు అనిపించదు. కానీ, సంవత్సరానికి 150 పాటలు పాడుతూ, ఈ సమయంలో ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా వుంది లత.

సి. రామచంద్ర ఆరోపణలకు లత ఎలాంటి సమాధానం ఇచ్చినా, అది మరింత వివాదానికి దారితీసేది తప్ప, లత నిర్దోషిత్వమో, అమాయకత్వమో ఎవ్వరూ ఒప్పుకునేవారు కాదు. పైగా అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యేది. అందుకని సి. రామచంద్ర ఎలాంటి ఆరోపణలు చేసినా, తమ నడుమ ఏమేం జరిగాయని చెప్పినా, లత స్పందించలేదు. పట్టించుకోలేదు. తన గమ్యం వైపు వెళ్తున్న వ్యక్తిని దారి మళ్ళించేందుకు అతని దృష్టిని లక్ష్యం నుంచి తప్పించేందుకు దారికి ఇరువైపులా నిలబడి ఎంతోమంది ప్రయత్నిస్తారు. వారిని పట్టించుకున్నా, వారికి ప్రాధాన్యం ఇచ్చినా, లాభం ఏమీ ఉండదు. పైగా లక్ష్యం దెబ్బ తింటుంది. కాబట్టి లత తన దృష్టిని లక్ష్యం నుంచి మరల్చలేదు. మరింత గొప్పగా పాటలు పాడుతూ ముందుకు సాగిపోయింది. పుస్తకమయితే ప్రచురించాడు కానీ, సీ రామచంద్ర పుస్తకం కాపీలు ఇన్నాళ్ళు లభ్యం కాలేదు. కొత్త ఎడిషన్ ప్రచురితం కాలేదు. ప్రచురితమయిన  వెంటనే కాపీలను వెనక్కి తీసేసుకున్నాడు. ఇప్పుడు లత మరణించిన తరువాత ఇంగ్లీషు అనువాదం ప్రచురితమయింది. జీవిత చరిత్ర రాసే సమయానికి రామచంద్ర కేరీర్ సమాప్తమయ్పోయింది. ఆయన ఒకరు బెదిరిస్తే బెదిరే మనిషి కాదు. అయినా కాపీలు వెనక్కి తీసుకున్నాడంటే, తను చేసిన పనిలో క్రౌర్యం, నైచ్యం బహుషా ఆయన గ్రహించాడని అనుకోవచ్చు.

సి. రామచంద్ర తన జీవిత చరిత్రను మరాఠీలో 1977లో ప్రచురించాడు. అప్పటికి లత వయస్సు 48. అప్పుడప్పుడే యువగాయనిలు లతకు సవాళ్ళు విసురుతున్నారు. ఆమె తమకు అవకాశాలు రానివ్వటం లేదని ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో ఓ సినిమా పత్రిక లత వల్ల తమ కెరీర్లు నష్టపోయారని అనుకుంటున్న వారందరినీ ఇంటర్వ్యూ చేసి ఓ స్పెషల్ స్టోరీ చేసింది. దానిలో శంకర్ జైకిషన్‍లలో శంకర్ ‘లత’ను ‘తెల్ల దుస్తులు వేసుకున్న రాక్షసి’గా అభివర్ణించాడు. ఇంకా ఇలాంటి వ్యాఖ్యలే పలువురు చేశారు. ఇవన్నీ తరువాత జర్నలిస్టులు నిజమని భావించి ప్రచారం చేశారు. లత వారిని నాశనం చేసింది, వీరికి అన్యాయం చేసింది అని తాము కళ్ళతో చూసినట్టు కథనాలు రాశారు.

1977 హిందీ సినీ సంగీత ప్రపంచంలో కీలకమైన సమయం. ఇలాంటి సమయంలో పలు ఆరోపణలు చేయటం ద్వారా, వాటికి విస్తృత ప్రచారం ఇచ్చి లతను కర్కోటకురాలిగా, మోసగత్తెగా చిత్రించి, ఆమెను మానసికంగా దెబ్బతీయాలని తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. కానీ తానేమిటో తెలియని వారు ఎవరేమన్నా ఆవేశం తెచ్చుకుంటారు. ఆవేశంలో విచక్షణ కోల్పోతారు. తనని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న వారి వలలో పడిపోతారు. తానేమిటో తెలిసినవారు, ఎవరేమన్నా, ఎంత దూషించినా బెదరరు. కదలరు. తొణకరు. బెణకరు. అరుపులను, ఆరోపణలను  పట్టించుకోరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. అరుస్తున్న వాడొకడు లేనట్టే ప్రవర్తిస్తారు. తద్వారా వాడి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తారు. లత చేసింది అదే. సి. రామచంద్రనే కాదు, ఎవరు తన గురించి ఎలాంటి వ్యాఖ్యాలు చేసినా పట్టించుకోలేదు. స్పందించలేదు. జర్నలిస్టులు ఎంతగా ఆమెని విమర్శించినా, ఆమెని దూషించినా చెక్కు చెదరలేదు. ‘అదాలత్’ సినిమాలో నర్గీస్ కోసం పాడిన పాట, లత హృదయం పలికే మాట అనిపిస్తుంది.

ఉన్ కో యె షికాయత్ హై కి హమ్ కుఛ్ నహి కహతే

అప్‍నీ తో యె ఆదత్ హై కి హమ్ కుఛ్ నహి కహతే

కుఛ్ కహనెసె తూఫాన్ ఊఠాలేతీ హై దునియా

అబ్ ఇస్ పె కయామత్ హై కి హమ్ కుఛ్ నహి కహతే!

ఏమీ మాట్లాడకపోతే మాట్లాడటం లేదని గోల చేస్తారు. మాట్లాడితే మాట్లాడిన మాటల ఆధారంగా తుపాను సృష్టిస్తారు. కాబట్టి ఎవరేమన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం. కనీసం లక్ష్యం నుంచి దృష్టి మరలదు. తమ ఆరోపణలకు స్పందన రాక కుళ్ళి ఏడుస్తారు. లత అయినా మరో మహిళ అయినా ఇది ఉత్తమ పద్ధతి! ఆ ఉత్తమ పద్ధతిని అవలంభించటంలో లత సిద్ధహస్తురాలు. అయితే సి.రామచంద్ర ‘సీత’ అన్న పేరుతో అందరికీ లత గురించి తెలిసేలా రాస్తూ, చివరలో అందరికీ ఆనందం కలిగించే ఓ ఆధారాన్ని వదిలాడు.  లతపై పలు ఆరోపణలకు మందుగుండు సిద్ధం చేసి అందించాడు.

“Once I took, a young girl along to Bombay lab to record a song for ‘Seeta’. I introduced the girl to ‘Seeta’ and said, ‘I am going to marry this girl’. ‘Seeta’ kept quiet. A few days later she brought along a man and introduced me to him. ‘He is a prince. What he means to me now is how you meant to me before.” (Page 113).

‘He is a prince’, అతడు రాకుమారుడు’ అన్న వాక్యం దగ్గర జర్నలిస్టులు, లత ద్వేషులు ఆగిపోయారు.

లత జీవితంలో ఉన్న రాకుమారుడు ‘రాజస్థాన్ రాజవంశీకుడు, రాజ్‌సింగ్ దుంగార్పూర్’

అలా ఆరంభమయింది రాజ్‌సింగ్ దుంగార్పూర్, లతల విషయంలో పలు వ్యాఖ్యానాల వరద.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here