జ్ఞాపకాల తరంగిణి-63

0
3

[dropcap]మా[/dropcap] నెల్లూరు ఫిల్మ్ సొసైటి ప్రోఫిల్మ్ సజీవంగా ఉన్న పది సంవత్సరాల్లో రెండువందల దేశవిదేశాల కళాత్మక చిత్రాలు ప్రదర్శించి వుంటుంది. 1978లో విశ్వ విఖ్యాత స్వీడిష్ ఫిలిం డైరెక్టర్ ఇంగ్మర్ బెర్గమన్ చిత్రాలు సైలెన్స్, వైల్డ్ స్ట్రాబెర్రీస్, ది వర్జిన్ స్ప్రింగ్, ది సెవెంత్ సీల్ నాలుగు చిత్రాలు ప్రదర్శించాము. విశ్వ విఖ్యాత దర్శకుల్లో వారొకరు. సినిమా మాధ్యమాన్ని అర్థం చేసుకొని దాన్ని ఒక కళావాహికగా సినిమాలు తీశారు.

Ingmar Bergman

బెర్గమన్ ఉత్తమోత్తమ చలనచిత్ర దర్శకులలో ఒకరు. క్రిస్టియన్ మతప్రచారకుల కుటుంబంలో పుట్టడం వల్ల శైశవం నుంచి మరణం తర్వాత మానవుడి జీవనం గురించి, దేవుడి అస్తిత్వాన్ని గురించి, తన పసిమనన్సులో ఎన్నెన్నో ప్రశ్నలు. బాల్యంలోనే devil కు ఒక రూపం ఇచ్చుకోవలసి వచ్చింది. తన ఊహలు, ఆలోచనలు, స్వప్నాలు అన్నిటికి ఒక రూపం ఇచ్చుకోను సినిమా మాధ్యమం పనికొచ్చింది. తనకు తెలిసిన కొద్దిపాటి సంగీతం సినిమాను వ్యాఖ్యానించడానికి సరిపోయింది. ఇంద్రియ వాసనలు, వికారాలు, neurosis మతబోధకుల బోధనలు, అచ్చంగా అసత్యాలను చిత్రించడానికి సినిమా మాధ్యమం తనకు చక్కగా పనికివచ్చింది. తనకు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నా అన్ని రకాల చర్చిల మీద నమ్మకం పోయింది. ఆయన స్వీడిష్ భాషలో తప్ప మరొక భాషలో సినిమాలు తీయలేదు. తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాతలకు మాత్రమే సినిమాలు తీశాడు.

వర్జిన్ స్ప్రింగ్ ఇతివృత్తం మధ్యయుగాల నాటిది. అందమైన యువతి అడవిలో ఎదురుపడితే ముగ్గురు తరుణ వయస్కులైన సోదరులు ఆమెను పాడుచేసి చంపేస్తారు. తర్వాత ఆ రాత్రి ఆ బాలిక ఇంట్లో ఆమె తండ్రి ఆదరంతో అక్కడే విశ్రమిస్తారు. ఈ యువకులే తన ముద్దుల పట్టిని హత్యచేసిన పాపిష్టి వారని గ్రహించి ఆ బాలిక తండ్రి ఆవేశంతో ఉడికిపోతూ ఒక వృక్షాన్ని పెకలించి ఆ చెట్టుతో వాళ్ళను మోది చంపేస్తాడు. ఈ దృశ్యంలో కోపం, దేహ దారుఢ్యాలలో మన భీముడే స్మరణకు వస్త్తాడు. ఆ కన్యక చనిపోయినచోట భూమిలోంచి ఒక స్ప్రింగ్, నీటిబుగ్గ ఉద్భవిస్తుంది. అదే వర్జిన్ స్ప్రింగ్. మధ్యయుగాల కథని అద్భుతంగా చిత్రించాడు.

సెవెంత్ సీల్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు, అక్క నిగ్రహంతో కోరికలను నిగ్రహించుకొనే యువతి. చెల్లి కోరికలను స్వేచ్ఛగా నిర్లజ్జగా తీర్చుకోగలదు. రెండు భిన్న మనస్తత్వాలను ఈ పాత్రల ద్వారా దర్శకుడు ప్రదర్శిస్తాడు. చివర్లో చెల్లి ఒక వృద్ధుడితో అక్క ముందే కామక్రీడ జరుపుతుంది. వారి రైలు ప్రయాణం, ఇతర సంఘటనలలో మనస్తత్వాలను నిరూపిస్తాడు. సినిమాలో చాలా పొడిపొడిగా సంభాషణలు, అంతా దృశ్యకావ్యం, సినిమాలో నేపథ్య సంగీతం కూడా కథాంశానికి పుష్టినిచ్చేందుకు మాత్రమే వినియోగించాడు.

Silenceలో దృశ్యం

సెవెంత్ సీల్ కథ క్రూసేడ్స్ నేపథ్యంలో సాగుతుంది. ఒక క్రిస్టియన్ మతగురువు ముసల్మానులకు, క్రైస్తవులకు మధ్య సాగుతున్నపోరులో ఒక వీరుణ్ణి, చిన్న రాజుగారిని ప్రోత్సహించి యుద్ధ రంగానికి పంపిస్తాడు. ఆ వీరుడు ఇరవై సంవత్సరాలు మతయుద్ధాలలో, పోరాటంలో పాల్గొని తన సైన్యంతో తన నగరానికి తిరిగివస్తూ నగరం వెలుపల విశ్రమిచి ఉంటాడు. ఆ దేశంలో ప్లేగ్ వ్యాధి ప్రబలి ఎక్కడ పడితే అక్కడ శవాల గుట్టలు, కొందరు మరణానికి సమీపంలో పడివుంటారు. మహా బీభత్సమైన దృశ్యం అది. మన కథానాయకుడు ఆ పరిస్థితికి దుఃఖిస్తూ ఉంటాడు.

ఒక ముసుగుమనిషి పీనుగల వంటిపైన ఉన్న ఆభరణాలను తస్కరిస్తూ ఉంటాడు. మన వీరుడు జుగుప్సతో ఆ దొంగ ముఖం మీది ముసుగు తొలగిస్తే ఆతను ఎవరో కాదు తనను యుద్ధ రంగానికి వెళ్ళమని ప్రోత్సహించిన మతగురువే. తన పోరాటం, త్యాగాలు అన్నీ వృథా అయ్యాయని తెలిసి కృంగిపోతాడు. ఇంతలో అక్కడ ఒక జిప్సీ దంపతులు, వారి బిడ్డతో భోజనం చేస్తూ ఉంటారు. మృత్యుదేవత చూపు వారిమీద పడడం మనవీరుడు గమనించి తనతో మృత్యువును చదరంగం ఆడమని కవ్విస్తాడు. ఓడిపోతే మృతువు వెంట వెళ్ళాలనే షరతుతో క్రీడ ఆరంభమవుతుంది. మృతువు ఆటలో నిమగ్నమైన సమయంలో జిప్సీ దంపతులు భోజనం ముగించి అక్కడనుంచి వెళ్ళిపోతారు. తన ప్రాణానికి ప్రయోజనం సిద్ధించినట్లు అతను సంతృప్తిగా మృత్యువు నరకలోకానికి ప్రయాణమవుతాడు. నాయకుణ్ణి కొరడాలతో కొడుతూ ఆకాశంలో తనలోకానికి తీసుకొనిపోతూన్న దృశ్యంతో సినిమా ముగుస్తుంది. తన జీవితంలో ఒక మంచిపని చేసినందుకు కథానాయకుడు సంతృప్తి చెందినట్లు తెలుస్తుంది.

ఇందులో ఒక దృశ్యం.. విదూషకుణ్ణి మృత్యువు వెన్నాడుతుంది. మృతువు నుంచి తప్పించుకోడానికి విదూషకుడు చెట్టు మొదలుమీదికి ఎగపాకుతాడు. మృత్యువు రంపంతో చెట్టు మొదలును కొస్తుంటాడు. Are there any concessions for jesters? అంటాడు విదూషకుడు. No please అంటూ మృత్యువు తన పని తాను చేస్తుంటాడు.

Wild Strawberries Bergman చిత్రాలన్నిటిలో గొప్ప చిత్రం అంటారు. కథానాయకుడు యూనివర్సిటీలో మెడికల్ ప్రొఫెసర్. ప్రాక్టీసులో ఎంతోమంది ప్రాణాలను కాపాడి ప్రజల కృతజ్ఞతకు పాత్రుడవుతాడు. ఆయన భార్య చాలాకాలం క్రితం పోయింది. వృధ్ధ దాసి లేదా attendant అయన అవసరాలన్నీ గమనించుకొంటూంటుంది. లుండ్ విశ్వవిద్యాలయం తనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తోన్న సభకు తాను, తన సహాయకురాలు విమానంలో వెళ్లి రావాలని అంతా ప్లాన్ చేసుకొంటాడు. ఆరోజు వేకువన తనకొక వింతకల వస్తుంది. గడియారం స్తంభంలో గడియారానికి ముళ్ళుండవు. వీధంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇంతలో ఒక జోడుగుర్రాల బండి, అందులో శవపేటిక, గుర్రాలు అదుపుతప్పి పరుగుతీయడంతో శవపేటిక కిందపడి దానిమీది మూత ఊడిపోతుంది. ప్రొఫెసర్ తొంగిచూస్తే అందులో తన శవమే ఉంటుంది. శవం తన చెయ్యిపట్టుకొని లోపలి లాక్కుంటుంది. అంతా పిచ్చిగా, విచిత్రంగా స్వప్నం.

ప్రొఫెసర్ విమానంలో వెళ్ళకుండా కారులో వెళ్లాలనుకొంటాడు. దాసి చాలా నిరుత్సాహపడిపోతే, ఆమెను విమానంలో పంపించి తాను కారులో బయలుదేరుతాడు ఉదయం. దారిలో తన సొంతవూరులో ఆగి, దాదాపు నూరేళ్లు నిండిన తల్లిగారిని చూస్తాడు. ఆమెకు కొంత మతిమరుపు, జీవించి ఉన్నవారిని లేరని, ఉన్నవారిని లేరని భావిస్తూ దాసి సహాయంతో జీవిస్తూ ఉంటుంది. అక్కడ పెట్రోలు బంకు యజమాని డాక్టర్‌ను గుర్తించి తన బిడ్డ ప్రాణాలు కాపాడారని కృతజ్ఞత చూపుతాడు. దారిలో ఒక భార్యాభర్తలు కారు చెడిపోయి సహాయం కోరుతారు. కారు బాగు కాదు. వాళ్లకు lift ఇస్తాడు. ఇంతలో ఒక యువతి, ఇద్దరు యువకులు పాదయాత్ర చేస్తూ వెళ్ళే యాత్రికులకు lift ఇస్తాడు. ఆ యువజనులు ఆనదంగా తుళ్ళింతలు కేరింతలు, ఎందుకో అర్ధంకాని నవ్వులతో చాలా సందడిగా. కారులో ఎక్కిన దంపతులు దారిపొడవునా ఘర్షణ, తగాదాలు, వారిని డాక్టర్ దింపేస్తాడు. డాక్టర్‌కు ఏవో పగటికలలు, ఎప్పుడో పోయిన భార్య తోటలో మరొక పురుషుడితో తిరిగే దృశ్యం, ఇటువంటివే కొన్ని దృశ్యాలు ఆయన స్మృతికి వస్తాయి. సాయంత్రం చీకటిపడే వేళకు లండ్ నగరం చేరుకొని కుమారుడి ఇంటికి వెళ్తాడు. పిల్లలు వద్దనుకొన్న ఆ మధ్యవయసు దంపతుల మధ్య శైత్యం, coldness నెలకొని యాంత్రిక జీవితం గడుపుతుంటారు. లిఫ్ట్ తీసుకొన్న యువకులు డాక్టర్ గారు విశ్రమించిన గది కిటికి వద్దకు వచ్చి శుభరాత్రి చెప్పి వెళ్తారు.

ముగ్గురు పాదచారులైన యువజనులు

అంతా చిన్న చిన్న సంఘటనలతో డాక్టర్ జీవితం పునర్మూల్యాంకనం జరుగుతోంది. ఉపేక్షించబడిన భార్య, కుమారుడితో సరైన మానవ సంబంధాలు లేకపోవడం, డాక్టర్ వ్యక్తిత్వంలో వెలుగునీడలు.. ఆ రోజు యువజనులతో కలిసి చేసిన ప్రయాణంలో ఒక ఆనందం, తనలో తాను సమాధానపడడం గుర్తిస్తాము. డాక్టర్ జీవితంలో తను చేసిన అపరాధాలు, పొరబాట్లు, జీవితంలో ప్రేమకు చోటివ్వకపోవడం,జీవిత సహచరిని పట్టించుకోకపోవడం, అన్నీ తన మనసులో మెదులుతాయి. తన హృదయంలో కాఠిన్యానికి తప్ప దేనికి తావివ్వలేదని గ్రహిస్తాడు.

డాక్టర్ సొంతవూరులో ఆగినప్పుడు మైదానంలో అడవి స్ట్రా బెర్రీ ఫలాల కోసం వెదుకులాడిన శైశవదశలో సోదరులు, ఇతర బంధువుల పిల్లలు Wild Strawberries కోసం పచ్చిక బయల్లో తిరగడం ఆ దృశ్యాలు స్వచ్ఛమైన ఆనందానికి సంకేతం. ఆ పళ్లే అకల్మషమైన జీవనానికి ప్రతీకలు. యువజనులతో కలిసి చేసిన ప్రయాణంలో డాక్టర్‌లో జీవితేచ్ఛ చిగురిస్తుంది.

సినిమా అంతా అనేక స్ఫురణలు, సజషన్లు మనకు స్ఫురిస్తుంటాయి. గడియారంలో ముళ్ళు లేకపోవడం, శవపేటికలో తానే పడుకొని ఉన్నట్లు, శవం తనను లోపలి లాగడం, గతస్మృతుల్లో,తను పట్టించుకోని భార్య, మరొక స్వప్నంలో తాను మెడికల్ బోర్డు ముందు పరీక్షకు నిలబడి, వారడిగిన ప్రశ్నలకు తత్తరపాటు చెందడం, తొలి యవ్వనంలో తను, తన ఆమడ సోదరుడు ఒకే యువతి ప్రేమ కోసం పోటీపడడం ఇట్లా అనేక జ్ఞాపకాలు..

ఈ ప్రయాణం ఒక ఆత్మ పరీక్ష, ఆ రాత్రి డాక్టర్ ప్రశాంతగా నిదురిస్తాడు.

వైల్డ్ స్ట్రాబెరీస్ పూనెలో పాఠ్యాశంగా పెట్టి అనేక పర్యాయాలు కోర్సులో ప్రదర్శించారు. సినిమా స్క్రిప్టు అనేక మార్లు చదివాను కూడా. ఎంతో సుకుమారమైన భావాలను సెల్యులాయిడ్ తెరపై ప్రదర్శించడం ఆయనకే సాధ్యమైంది.

కలర్ సినిమా వచ్చిన తర్వాత, టివితో ప్రసారానికి అనువుగా ‘సీన్సు ఫ్రం ఎ మ్యారేజ్’ సినిమా తీశారు. మానవుని ముఖంలో సమస్తభావాలు అభివ్యక్తమవుతాయని బెర్గమన్ అంటారు. ఈ సినిమా చాలా పెద్ద పెద్ద క్లోజప్ లతో తీశారు. టివి రూపకాలకు ఆ రోజుల్లో ఈ సినిమా ఒక ఆదర్శం. మన సీరియల్ దర్శకులు ఈ చిత్రాన్ని చూస్తే చాలా లాభపడతారు.

ప్రోఫిల్మ్ ప్రచురించిన బెర్గ్‌మన్ విశేష సంచిక ముఖచిత్రం

బెర్గమన్ నటీనటులు అత్యంత పరిణతి చెందిన బృందం. అటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నటులు అందరికీ దొరకరని సత్యజిత్ రే అంటారు. బెర్గమన్ సినిమాలలో దాదాపు అందరూ మళ్ళీ మళ్ళీ కనిపిస్తారు. అదొక గొప్ప వరమైంది వారికి.

ఫొటోలు గూగుల్ సహకారంతో

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here