నియో రిచ్-15

0
3

[జయంతి శారదల వివాహం జరుగుతుంది. శారద జయంతి ఇంటికి వచ్చేస్తుంది. అన్ని వ్యవహారాలు అర్థం చేసుకోవడం మొదలుపెడుతుంది. అప్పటిదాకా ఇంట్లో పనిచేస్తున్న నారాయణప్ప, బసప్ప, శివరాలను – అన్ని పనులలోనూ అజమాయిషీ చేయడం మొదలుపెడుతుంది శారద. హంపి చూడడానికి వెళ్దామంటుంది శారద. జయంతి ఒప్పుకుని, నాలుగు రోజులు సెలవు తీసుకుంటానని నారాయణప్పతో చెప్తాడు. కారులో బయల్దేరి మొదట మహానంది చేరుతారు. ఆ క్షేత్రంలోని ఆలయాన్ని దర్శించుకుంటారు. పరిసరాల అందాలకి ముగ్ధుడై మరో రోజు అక్కడ ఆగుదామని అంటాడు జయంతి. పూర్వాశ్రమంలో రామనాధం అని పేరుగల  చిన్నస్వామి అనే సాధువు తారసపడతాడు. పుణ్యక్షేత్రాలకి సంబంధించిన చారిత్రక పత్రాలను వెలికితీసి గ్రంథస్థం చేయమని ఋషులు ఆజ్ఞాపించారనీ, అందుకే ఇలా తిరుగుతున్నానని చెబుతాడు. శారదని ఎక్కడో చూసినట్లుందని అనుకుంటాడా సాధువు. చిన్నతనంలో తానూ, రామనాధం కలిసి చదువుకున్నామని శారద గుర్తు తెచ్చుకుంటుంది. జ్యోతిష్యం చెప్తానంటాడా సాధువు. శాస్త్రం తెలుసా అని జయంతి ప్రశ్నిస్తే ప్రవేశం ఉందని అంటాడాయన. ప్రవేశం ఉండడమంటే అసమగ్రంగా తెలియడమేననీ, ఇలాంటి వాళ్ళ వల్లే శాస్త్రంపై నమ్మకం పోతుందని అంటాడు జయంతి. సాధువు వెళ్ళిపోబోతుంటే ఆపుతాడు జయంతి. ‘మీరు అన్ని ఆలయాలను పరిశీలించి చూస్తూ వివరాలను సేకరిస్తున్నారా’ అడిగితే, అవునంటాడు ఆ సాధువు. ఇక చదవండి.]

[dropcap]“ఇ[/dropcap]లా రండి”

వచ్చాడు స్వామి ఉర్ఫ్ రామనాధం.

“ఈ డబ్బు ఉంచండి” అని చేతిలో పెట్టాడు జయంతి.

అక్కరలేదనలేకపోయాడు.

తీసుకోవాలని మాత్రం అనిపించనట్టు లేదు.

కానీ తీసుకున్నాడు. తిరిగివ్వలేదు.

నీరు నిండుతున్న కళ్లతో చూసి నమస్కరించాడు.

వెనక్కి మళ్లి నడిచాడు.

జయంతి శారదా సాధువు కనిపించకుండా పోయిందాకా అతగాడ్నే చూసారు.

ఆ తెల్లవారు ఝామున లేచి ‘హంపి’కి చేరుకున్నారు.

శ్రీకృష్ణ దేవరాయల మహా సామ్రాజ్యమది. దక్షిణభారత దేశ చరిత్రలో ఆయనది స్వర్ణయుగం.

ఇరవై నాల్గు చదరపు మైళ్ల విస్తీర్ణం కల్గిన అతి పెద్ద కోట ఈ విజయపురిది.

ప్రకృతి సిద్ధమైన అయిదు కొండల మధ్యన ఉన్నది. కోట మధ్య నుంచి నిత్యం పారే జీవన గంగ పంపానది.

దాన్ని అటు ఇటూ దాటేందుకు ఆనాడే క్రిష్ణరాయలు నిర్మించిన రాతి వంతెన.

కోట నాల్గు చరగులా నీరు అందేందుకు రాళ్లతో పంపానదిన వేసిన ఆనకట్ట.

అశ్వశాలలు, గజశాలలు, సైన్యం విడిది చేసే గృహ సముదాయం. వాటి మధ్యన  రెండంతస్తుల మహలు. ఆలయాలు, ప్రతి ఆలయంలోకి నీరు వచ్చే వనరు. స్నాన వాటికకు సైతం నీరు అందే వైనం. దర్బారు. వాటి అవశేషాలు. ఇప్పటికీ మనకు తీపి గుర్తులలోనికి కొని వెళ్ళి అలనాటి వైభవాన్ని మనస్సు నిండా నింపుతాయి.

రథ, గజ, తురగ, పదాతి దళాల  విశ్రాంతి శాలలు. భోజనశాలలు. వాస్తు రీత్యా కట్టిన తీరు. రాజసభ – దాని అద్భుతమైన అమరిక అనన్య సామాన్యంగా గోచరించి అబ్బురపరుస్తుంది. నిజంగా ఆ ప్రాభవాన్ని కన్నులారా గాంచిన మన పూర్వీకులు ధన్యులు.

ఇక పంపానది అద్దరిన శివాలయాలు, నాట్యమందిరాలు. ప్రపంచం మొత్తం అచ్చెరువొందే శిల్పకళా వైభవం కనిపిస్తుందక్కడ.

సరిగమలు పలికే స్తంభం.

నాట్యశాల.

రాతిరథం.

దాని వెలుపల రాజుకు తమ విన్నపాలు చెప్పుకునేందుకు మ్రోగించే ఘంట. పంపానది ఆనుకొని ఉన్న స్నాన వాటికలు.

విశ్రాంతి శాలలు-

ఎంత కృషి ఫలితమో అంతుపట్టదు.

అని అది మనుష్య నిర్మాణమేనా? అనిపిస్తుంది.

ఆశ్చర్యంలో మునిగి అట్లాగే చూస్తుండిపోతాం.

మరి అంతటి మహోన్నత శిల్పకళానిర్మాణాన్ని – ముస్లిం పాలకులు ఎందుకలా ధ్వంసం చేసారో? వారు విగ్రహారాధకులు కాకపోవచ్చు గాక, అంత మాత్రాన ఇంత పాశవికతా! అందాన్ని చూడలేని మనుషులు ఉంటారు అనిపిస్తోంది.

అర్థం గాదు.

కళ్లు చమ్మగిల్లుతాయి.

ఈ దేశాన్ని దోచుకునడానికి వచ్చి దోచుకున్నంత దోచుకుని ఉన్న సంస్కృతిని, సంస్కృతి చిహ్నాలను ఇలా చెడపడం ఏ దేశ చరిత్రలోనూ కనిపించదు.

విజయపురే వారి వాతబడకుండా ఉంటే అది సూర్యుడు, భూమీ ఉన్నంత కాలం ప్రపంచ ప్రసిద్ధి యాత్రస్థలిగా ఉండేది.

‘అభిమతాన్ని తెలిపేది మతం’ అంటారు.

సంస్కృతిని విలువలను చెడిపేది మాత్రం ‘మతం’ కాదు.

మనుష్య సమాజన గుంపులుగా ఏర్పడినప్పటి మానసిక స్థితి అది. దాన్ని దాటి ఎగుర లేకపోవడం నాగరిక ప్రపంచానికి మరక లాంటిది.

అదో చెరగని ‘కళంకం’ అనిపిస్తుంది.

ఆ మహా వైభవానికి గుర్తుకు మిగిలిన శిధిల శిల్పాలు – మనిషే మరో ‘బ్రహ్మ’ అనడానికి సాక్ష్యాలు.

మనిషి ఉన్నతికీ పండిన సంస్కారానికీ విశాలమైన కళాహృదయానికి, సాక్ష్యం ఈ విజయపురి.

మనిషి అన్నవానిలోని రెండు అంచులూ ఇక్కడ అర్ధమవుతాయి.

ఇక్కడంతా చూసి వెనక్కు మళ్ళారు.

ఒక్క మైసూర్ చూడాలని శారద ఎంత పోరినా, ముచ్చటపడ్డా జయంతి వినలేదు.

హంపి చూసాక నిజంగా జయంతి తల దెయ్యాల నిలయమైంది.

శిల్పం మనిషి లాంటిది కాదు.

మనిషి – అపర బ్రహ్మలు – జరిపిన మరో సృష్టి.

దానికి మనిషిలా వయస్సూ, వృద్ధాప్యమూ ఉండరాదు, ఉండదు.

శాశ్వత కీర్తి మాత్రమే ఉంటుంది.

సృష్టి ఉన్నంతకాలం ఉంటున్న మనిషి చెక్కిన మూర్తులను అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.

అలాటి శాశ్వతత్వాన్ని.. ఛ.

మనిషి అన్నవాడు వాటి జోలికిపోలేడు.

పసిదాని బోసి నవ్వు మనకు తన్మయతనిస్తుంది.

ఆకలితో పసివాడు చన్ను కుడుస్తుంటే ఆ తల్లి పిల్లలకు కలిగే మమైకతకు క్రూరమైన పులి సైతం క్రౌర్యాన్ని మరచి  ఎంతో కొంత సయ్యాటలాడటం..

ముది వగ్గయిన కన్నతల్లి  కనిపించినపుడు  ఆవిడ నుదుట ముడతలు ఏ కవిని కరిగించాయో కవిత చేయడం.

అందమైన పూవు కనిపించినపుడు మనస్సుకు కలిగే ఆనందం.

కానీ..

పూవును నలిపి రెక్కలు విరిచి విసిరి ఆనందించడం?

రాక్షసులు అలా చేసినట్టు అనిపించారు.

తలపోటుతో పగిలేలా అనిపించితే తప్ప అర్ధం మాత్రం కాలేదు.

ఇలా ఆలోచనలు దొర్లి దొర్లి ఆగిపోయి – తెల్లకాగితంలాగయింది.

అసలీ సృష్టిన మనిషి ఎటు?

ఎంతో కొంత బలోపేతంగా ఎదిగాడు.

తెలివిమంతుడైనాడు.

ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.

మనిషి మరొకడ్ని చంపితే ఆనందం కల్గడం మనిషి లక్షణమే కదా?

ఒకరి బాధపై మరొకరికి సుఖం దొరకుతుందా? ఆ సుఖమే సరా?

ఇట్టాటి మనిషి ఎదగడం అవసరమా?

తలకున్న నరాలు చిట్లుతయ్యేమోననిపించింది.

గబగబా లేచి శారద పక్కలోకి వెళ్లాడు.

ఆవిడ నడుం వాటేసుకొని రొమ్ములపై తల నుంచి నిమురుతూ

“శారదా ఏవైనా చెప్పు” అన్నాడు.

‘ఏం చెప్పను?’ అనుకుని సేద తీరేలా ఇంకొంచెం దగ్గరకి జరిగింది.

“చెప్పూ” అన్నాడు నెమ్మదిగా.

“ఆలోచనల్ని ఆపండి. చెప్తాను” అంది నవ్వి.

అర్థమైంది శారదకు.

భుజం పైకి జయంతి తలను జరుపుకున్నది.

నుదుటన ఆత్మీయంగా ముద్దిచ్చింది.

జయంతి జుత్తు లోనికి వేళ్లు జొనిపి సర్దుతూ ఇంకా దగ్గరయింది. అలా నిమురుతూనే వాల్మీకి కాక మునుపు కథ చెప్పింది.

వింటూ వింటూనే కళ్లు మూసుకున్నాడు.

***

ఇంటికి చేరగానే ఊపిరాడనంత పనులు.

తరగనివీ, ఆగనివి కూడా.

ఒకనాటి ఉదయం లాన్‍లో నిలబడి ఉండగా ఓ కారు వేగంగా వచ్చి అక్కడ ఆగింది.

దాని నుంచి ఇద్దరు నడికారు మనుష్యులు దిగి వచ్చి బజ్జర్ నొక్కారు.

“ఎవరు” అనడిగింది శారద అటుగా నడిచి.

“నన్ను శివాజీ అంటారు” అన్నాడు వినయంగా వంగి.

‘వెధవలాగున్నాడు పేరు మాత్రం శివాజీ’ అనుకుంది.

మనిషి ఆరడుగులు.. టక్ చేసుకున్నాడు.

మీసాలు లేవు.

“నా పేరు రాముడు” – అంటూ ఆడంగి వానిలా ఉన్న ఒకడు కనిపించాడు శివాజీ పక్కన.

“ఏం కావాలి?”

“జయంతి కావాలి” అన్నాడు శివాజీ.

“ఉన్నారు కూర్చోండి” అని లోపలకి నడిచింది.

“త్వరగా కలవాలి” అన్నాడు రాముడు అతి వినయంగా.

“నిద్రలో ఉన్నాడు.”

“నేనొచ్చానని చెప్పండి.” అన్నాడు శివాజీ.

ఇంతలో బయటకొచ్చాడు జయంతి.

ఈ ఇద్దరూ జయంతి దగ్గరకు వేగంగా వెళ్ళి కౌగిలించుకున్నారు. జయంతి వివాహానికి రాలేకపోయానందుకు ఎంతగానో నొచ్చుకున్నారు. క్షమాపణలూ చెప్పుకున్నారు.

లాన్ లోనే కూర్చుని ఇంకా ఏవోవో మాటాడుకుంటుండగా శారద లోనకెళ్ళింది.

‘టీ బిస్కట్లు’ తీసుకొని వచ్చేసరికే లేరు.

“ఏరి” అడిగింది శారద, ఒంటరిగా ఆలోచనలో ఉన్న జయంతిని.

“వెళ్లారు.”

“టీ త్రాగి వెళ్ళవచ్చు కదా. పైగా దగ్గరి స్నేహితులలా అనిపించారు.”

“శారదా వాళ్ళకు పని ముఖ్యం. ఫార్మాలిటీ కాదు” అని నవ్వి ఓ కప్పు టీ తను తీసుకున్నాడు. మారుమాటడకుండా లోనకు నడిచింది శారద.

భోం చేస్తునప్పుడు మాత్రం “నీకు శివాజి ఎలా అనిపించాడు?” అనడిగాడు జయంతి.

“నాకు వాళ్లను గురించి ఏమైనా ఎందుకు అనిపిస్తుంది. పైగా మొదటిసారి కనిపించారు.”

“వాళ్లను గురించి తెల్సుకోవాలని అనిపించలేదా?”

తల అడ్డంగా ఊపింది.

“వాళ్ళు నాకు స్నేహితులు. వాళ్లను గురించి నీకు తెలియడం మంచిది.”

“మీకు వారే కాక ఎందరో స్నేహితులున్నారు. ఉంటారు, తప్పేముంది?”

“నీకు వాళ్ళు తెలవడం” అటుండగానే….

“అలా మీకు అనిపిస్తే చెప్పండి” అంది.

శారద ఉన్న తీరు అప్పుడు చాలా ముచ్చటగా అనిపించింది.

అదాటుగా దగ్గరికి వెళ్లాడు. శారదను వడుపుగా సందిట్లోకి తీసుకున్నాడు. పెదాల్ని ముద్దు పెట్టుకున్నాడు.

ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయింది శారద.

జయంతి వెంటనే వెళ్లి కుర్చీలో కొచ్చి “ఇక విను” అన్నాడు.

“ఇలాంటి పనులుంటే నేను వినను” అంది కోపంగా ఓ చూపు చూసి.

“అలాగే” అని మొదలెట్టబోయాడు.

శారద ఏదో పని ఉన్న దానిలా లేచి జయంతి ఒళ్లో గభాల్న కూర్చుని ముఖమంతా ముద్దులతో నింపింది.

ఈసారి షాక్ తినడం జయంతి వంతయింది.

తేరుకున్నాక శారదను ఒడి నుంచి లేవనివ్వలేదు. ఎంత గింజుకున్నా పట్టు వదలలేదు.

ఆ పూటకు శివాజీ ఎటు కనుమరుగయ్యాడో?

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here