[box type=’note’ fontsize=’16’] నీలగిరుల యాత్ర చేసిన డి. చాముండేశ్వరి తమ యాత్రానుభవాలు వివరిస్తున్నారు. [/box]
కురింజి పుష్పం:
[dropcap]ఊ[/dropcap]టీ గురించిన మాటల్లో మీకు బ్లూ కురింజి ఫ్లవర్ గురించి చెప్పాను. మాకు ఆ పూవుని చూసే అవకాశం లేదు. 2030లో తిరిగి పూస్తాయిట. లాంగ్ వెయిట్.
వాటి గురించి కోటగిరి లోని ఒక ప్రైవేట్ ఫ్లవర్ గార్డెన్ వాళ్ళని అడిగాము. వాళ్ళు చెప్పిన విషయాలు క్లుప్తంగా:
ఊటీ నీలగిరి కొండలలో ఉంది, ‘నీలి పర్వతాలు’ అని అర్థం, ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వికసించే నీలి కురుంజి పువ్వు కారణంగా ఈ పేరు వచ్చిందిట. ఆ పూలు విచ్చుకునే జులై – అక్టోబర్ సమయంలో టూరిస్టులు ఎక్కువట.
మొక్కలు ఒక సంవత్సరంలో తమ లైఫ్ సైకిల్‌ని పూర్తి చేస్తాయి. అవి విత్తనం నుండి పెరుగుతాయి, వికసిస్తాయి, కొన్ని మొక్కలు తమ లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే పుష్పిస్తాయి, విత్తనాలను వదిలి పోతాయి. ఈ విత్తనాల నుండి తరువాతి తరం మొక్కలు పెరిగి లైఫ్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అటువంటి మొక్కలను మోనోకార్పిక్ అని పిలుస్తారు. వెదురు మోనోకార్పిక్ మొక్క, పరిపక్వం చెందడానికి మరియు పుష్పించడానికి 40 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అటువంటి మొక్కలు చూపించే మరో లక్షణం ఏమిటంటే, ఇవి ఒకే సీజన్‌లో పుష్పిస్తాయిట. వెదురు మరియు కురింజిలు. నీలకురింజి 12 సంవత్సరాలలో పరిపక్వం చెందుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తుందట.
ఊటాకమండ్‌ని బ్లూ మౌంటైన్ అని పిలవటానికి ప్రధాన కారణం కురింజి పుష్పం, ఇది మొత్తం ప్రాంతాన్ని దాని ఊదా రంగులో ఉన్న నీలిరంగు పూలతో కప్పి, పూర్తిగా నీలం రంగులోకి మారుస్తుంది. ఊటీ పర్వత శ్రేణులు దాదాపు 33 రకాల కురింజి పుష్పాలకు నిలయం. కొడైకెనాల్‌లో ఎక్కువగా ఉన్నాయిట. కురింజి ఆండవర్ ఆలయం అని పిలువబడే ఒక ప్రత్యేక ఆలయం ఉందిట. కురింజి పువ్వు, కురింజి ఆండవర్ దేవాలయానికి సంబంధించిన ప్రస్తావనలు కురుంతోగై అని పిలువబడే సంగం యుగ సాహిత్యంలో కనిపిస్తాయిట. దీన్ని బట్టి తమిళనాడు సంస్కృతిలో భాగమైన కురింజి పుష్పం ప్రాచీనతను మనం అర్థం చేసుకోవచ్చు.
అసాధారణమైన పుష్పించే కురింజి పుష్పం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఓ రహస్యంగా, ఓ ఆకర్షణగా మిగిలిపోయింది. కురింజి పుష్పం చాలా కాలం పాటు వికసించి చనిపోయే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది, వాటి విత్తనాలు మస్త్ సీడింగ్ ద్వారా మొలకెత్తి వ్యాప్తి చెందుతాయి. సుదీర్ఘ పన్నెండేళ్ల తర్వాత ఫ్లవరింగ్ టైంకి సిద్ధంగా ఉంటాయి! కురింజి పుష్పించే కాలాన్ని స్వాగతించడానికి పురాతన కాలం నుండి చిన్న తరహాలో పండుగలు జరిపేవారట. ఎందుకంటే ఇది ఆ ప్రాంతంలోని ప్రజలకు రహస్య ప్రేమ మరియు శృంగారానికి చిహ్నం.
జూలై మధ్యలో కిల్-కోటగిరిలో మరియు కోటగిరి, కూనూర్ స్లోప్స్ లోని ఇతర ప్రాంతాలలో పుష్పించేది. ఇప్పుడు ఊటీ ఔటర్ లోని కల్హట్టి స్లోప్స్‌లో కూడా పూస్తోందట.
‘కురింజి’ ఇప్పుడు ఒక టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారింది. సంవత్సరాల తరబడి పెరుగుతున్న సాగు, తేయాకు తోటల expansion కారణంగా ఈ పూలు పెరిగే విస్తీర్ణం బాగా తగ్గిందని స్థానికులు అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే రిసార్ట్‌లు పెద్ద ముప్పు కలిగిస్తున్నాయి.
నీలగిరిలో మొట్టమొదటిసారిగా రికార్డు చేయబడిన ‘కురింజి’ 192 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 1826లో పుష్పించింది.
నీలగిరిలో ఉన్న ‘కురింజి’ పెరిగే ప్రాంతాలని పరిరక్షించడానికి ప్రత్యేక కృషి చేయాల్సిన సమయం వచ్చిందని స్థానికుల అభిప్రాయం.
కురింజి దాని సహజ నివాస స్థలంలో స్వేచ్ఛగా పెరిగే పుష్పం. ఏది ఏమైనప్పటికీ, మిగిలిన పర్యావరణ వ్యవస్థలో జరుగుతున్నట్లుగా, షోలా అటవీ మరియు పచ్చికభూముల పరిసర ప్రాంతాలు ఇప్పుడు ప్రైవేట్ గృహాలు, తేయాకు తోటలు మరియు కాఫీ తోటలతో నిండిపోయాయి .
ఇతర వృక్ష జాతులు కూడా ఒకప్పుడు నీలి రంగు పువ్వులకే చెందిన స్థలాన్ని మరింత తగ్గించాయి. టూరిస్ట్ పెరుగుదల, ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటి క్షీణత కూడా పువ్వుల సహజ పర్యావరణ వ్యవస్థని దిగజార్చాయి. ఫలితంగా, మనకు 10 శాతం స్ట్రోబిలాంతస్ లేదా నీలి కురింజి పువ్వులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
కురింజి పువ్వుల పెరుగుదల, ఇంకా అవి వికసించే ప్రాంతాలు, వాతావరణం యొక్క ప్రాముఖ్యత గురించి పర్యాటకులకు ఇతర వ్యక్తులకు తెలియదు కాబట్టి, అభయారణ్యం కమిటీ, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, అటవీ అధికారులు మరియు కొడైకెనాల్‌లోని దిండిగల్ జిల్లా యంత్రాంగం అందరికి తెలిసేలా గొప్ప వేడుకతో పువ్వుల హోర్డింగ్‌లను ఏర్పాటు చేసి, పోటీ మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలలో చైతన్యం కోసం ప్రయత్నిస్తున్నారట. మంచి ప్రయత్నం కదా?
మనిషి అత్యాశకి ప్రకృతిలో అన్ని కనిపించకుండా పోతున్న దుస్థితి కదా. నీలగిరుల్లో, ఇతర హిల్ స్టేషన్స్‌లో పెరుగుతున్న కాంక్రీట్ కట్టడాలు, తగ్గిపోతున్న పచ్చదనం ప్రకృతి ప్రేమికులను బాధ పెడుతోంది.
***
కూనూర్ సిమ్స్ పార్క్:
ఊటీ హాలిడే ట్రావెల్‌లో కూనూర్ విజిట్ ఒకటి. ఊటీ నుండి కూనూర్ ప్రయాణం ఎప్పటిలా పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లదకరంగా ఉంటుంది. చిన్న ఊరు. అందంగా ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. మేము తిరిగి చూసి మంత్రముగ్ధులమైపోయాం. ఇతర నీలగిరి ప్రాంతాల లాగే కూనూర్ కూడా మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్ సిమ్స్ పార్క్.
సైజులో ఊటీ బొటనికల్ పార్క్ కన్నా చిన్నది. అయినప్పటికీ అరుదైన మొక్కలు, రంగు రంగుల పూలు, చిన్న బోటింగ్ ఏరియాతో అద్భుతంగా ఉంటుంది. Visit Memorable. వదిలి రా బుద్ధి కాదు.
స్థానిక చరిత్రని గురించి తెలుసుకునే ప్రయత్నంలో నాకు ఈ క్రింది విషయాలు తెలిసాయి.
ఈ అసాధారణమైన పార్క్-కమ్-బొటానికల్ గార్డెన్ 148 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేయబడింది. స్థానిక చెట్లు, పొదలు, లతలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకువచ్చిన అనేక అసాధారణ జాతుల చెట్లు, రుద్రాక్ష – పూసల చెట్టు, ఇంకా క్వీన్స్‌ల్యాండ్ క్యారీ పైన్, ఈ పార్క్‌లోని అనేక ఆకర్షణల కొన్ని. సిమ్స్ పార్క్ అండ్ బొటానికల్ గార్డెన్ భారతదేశంలోని సమశీతోష్ణ మొక్కల అతి పెద్ద రిపోజిటరీ. వృక్షశాస్త్రజ్ఞులకు ముఖ్యమైన గమ్యస్థానం. సిమ్స్ పార్క్ వార్షిక కూరగాయలు మరియు పండ్ల ప్రదర్శనకు వేదిక.
కోటగిరి నెహ్రు పార్క్‌లో కూడా కూరల ప్రదర్శన మే నెలలో ఉంటుంది. మేము చూసాము.
సిమ్స్ పార్క్, కూనూర్, ఎర్లీ యూరోపియన్ రెసిడెంట్స్ నివాసం కారణంగా ఉనికిలోకి వచ్చింది. డిసెంబర్, 1874లో ప్రభుత్వ కార్యదర్శి శ్రీ జెడి సిమ్, నీలగిరి అడవుల తాత్కాలిక సూపరింటెండెంట్ మేజర్ ముర్రే కృషి కారణంగా ప్రారంభించబడింది. ఈ పార్కుకు జేడీ సిమ్స్ పేరు పెట్టారు.
రెసిడెంట్స్ మరియు టూరిస్టుల కోసం ఇది ఒక ఆహ్లాదకరమైన రిసార్ట్‌గా ప్రారంభించబడినప్పటికీ, ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ప్రయోజనాల కోసం ఇప్పుడు బొటానికల్ గార్డెన్‌గా అభివృద్ధి చెందింది.
ఈ ఉద్యానవనం సముద్రమట్టం నుండి 1768 నుండి 1798 మీటర్ల ఎత్తులో కూనూర్ రైల్వే స్టేషన్‌కు ఉత్తరం వైపున లోతైన లోయలో ఉంది. ఇది 12 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అనేక సహజ ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది పోమోలాజికల్ స్టేషన్, పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ మరియు సిల్క్ వార్మ్ సీడ్ స్టేషన్‌కి ఆనుకొని ఉంది.
నీలగిరిలోని కూనూర్‌లోని టీ కాఫీ ప్లాంటర్లతో రహదారి చరిత్ర ప్రారంభమవుతుంది. మెట్టుపాళయం వద్ద రైలుమార్గాన్ని ఉదగమండలం (ఊటీ)తో కలిపే ఘాట్ రోడ్డు, అప్పట్లో బడగ గ్రామం కంటే పెద్దది కాదు. నేడు, ప్రముఖ హిల్ స్టేషన్ ఊటీ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం, 50,000 దాటిన జనాభాతో కూనూర్ ఉంది.
ఉదగమండలం మిలిటరీ శానిటోరియం, ఇంకా సమ్మర్ రిట్రీట్‌గా ప్రాచుర్యం పొందినప్పుడు సరైన రహదారి అవసరం వచ్చింది,1833లో కూనూర్ ఉనికిలోకి వచ్చినప్పుడు మరింత మెరుగైన రోడ్లు కావాల్సి వచ్చాయి. అంతే కదా జనాభా, స్థానికేతరులు, వసతులు పెరిగే కొద్దీ రోడ్లు, రైల్వేస్ లాంటి ట్రాన్స్‌పోర్ట్ అవసరం పెరుగుతుంది. అభివృద్ధి పేరుతో స్థానిక tribals displace అయ్యారు. కాలక్రమేణా ఇతరులు స్థానికులు అయ్యారు. ఇది ఇక్కడి సంగతే కాదు, చరిత్ర అంతా ఇంతే కదా?
అందుకని, మెరుగైన సౌకర్యాల కోసం 1870వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మద్రాస్ సాపర్స్ అండ్ మైనర్స్ రెజిమెంట్‌లో భాగమైన లెఫ్టినెంట్ కల్నల్ జివి లా, కార్ట్‌లోడ్‌లు, టోంగాలు, ఇంకా గుర్రాలపై వెళ్లే వ్యక్తుల కోసం ఉద్దేశించిన నిరాడంబరమైన ట్రాక్‌ను మోటారు దారిగా మార్చే పెద్ద పనిని చేపట్టారు.
1847లో కూనూర్ మొత్తం జనాభాలో 30 మంది యూరోపియన్లు మరియు 250 మందికి పైగా భారతీయులు ఉన్నారు. రెండు వందల యాభై ఎకరాల్లో కాఫీ, మల్బరీ సాగు ఉండేది. యూరోపియన్లు ఔత్సాహికులు మరియు కాఫీ తోటలను అభివృద్ధి చేశారు. వసంతన్ ఈ సమాచారాన్ని లెఫ్టినెంట్ కల్నల్ J Ouchterlony సర్వే నివేదిక నుండి సేకరించారు. లెఫ్టినెంట్ బర్టన్ రూపొందించిన కూనూర్ యొక్క విశాలమైన స్కెచ్ అత్యంత విలువైనదని అతను చెప్పాడు. ఇది తొమ్మిది యూరోపియన్ నివాసాలు, స్థానిక షాండీ, భారతీయుల కోసం ‘చెట్రం’ మరియు 1800లలో నిర్మించిన డేవిసన్స్ హోటల్‌తో పట్టణాన్ని చూపించిన తొలి వాటిలో ఒకటి. ఇది అగ్నిప్రమాదంలో పాడయిపోయిందట.
ఆర్నిథాలజీకి అంకితమైన విభాగం కూడా ఉంది. నీలగిరిలోని పక్షులకు సంబంధించిన మొట్టమొదటి డాక్యుమెంటేషన్ TC జెర్డాన్, ఒక రోల్ మోడల్. పక్షి శాస్త్రవేత్త, స్కెచ్‌లలో పక్షి జాతులను గమనించి, గుర్తించి స్కెచ్‌లలో వివరించిన ఘనత పొందారుట. జెర్డాన్ 1839 మరియు 1845 మధ్య జిల్లాలో చురుకుగా ఉండేవాడు. అతను బెస్రా అని పిలువబడే రాప్టర్, తూర్పు గడ్డి గుడ్లగూబ వంటి అనేక ఇతర పక్షుల గురించి వివరించాడు. “పశ్చిమ కనుమలకు చెందిన నీలగిరి ఫ్లైక్యాచర్, నీలగిరి లాఫింగ్ థ్రష్, నలుపు మరియు నారింజ ఫ్లైక్యాచర్ మరియు మలబార్ లార్క్ వంటి జాతులు కూనూర్‌లో కనిపిస్తాయి” అని వైద్యుడిగా మారిన పక్షుల పరిశీలకుడు వసంతన్ చెప్పారు.
నేటికీ ఉన్న అనేక భవనాలు చరిత్రకు సాక్ష్యంగా ఉన్నాయని కూనూర్ మున్సిపల్ కమిషనర్ కె బాలు అన్నారు. ఉదాహరణకు, ఈరోజు మేజిస్ట్రేట్ కోర్టుగా ఉన్నది బ్రిటిష్ వారి మొదటి ట్రావెలర్స్ బంగ్లా. “గ్యాలరీ ఆధునిక నివాసాలు, చారిత్రక మైలురాళ్ళు మరియు వారసత్వ నిర్మాణాల గురించి ప్రజలకు తెలియజేస్తుంది. వాటిని పరిరక్షించడానికి మరియు సంరక్షించడానికి మేము యువ తరాన్ని ప్రేరేపించాలనుకుంటున్నాము” అన్నారు. క్లీన్ కూనూర్ స్వచ్ఛంద సంస్థ ట్రస్టీ డాక్టర్ పిజె వసంతన్ మున్సిపాలిటీతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఎన్జీవో ఇటీవల కూనూర్ హెరిటేజ్ గ్యాలరీని ప్రారంభించింది.
ఎంతో చక్కని, నేటి పరిస్థితులకు అవసరం అయిన ఆలోచన. నేటి నవ తరానికి జాతి జనుల గొప్పతనం, పోరాటాలు, అభివృద్ధి గురించి సరైన అవగాహన తక్కువ. సరైన సమాచారం సరైన విధంగా ఈ ఫ్యూచర్ కిడ్స్‌కి చెప్పాల్సిన బాధ్యత మన అందరిదీ.
కూనూర్‌లో ఉన్న ఒక పురాతన అంటే బ్రిటిష్ క్లబ్‌ని చూసాము. ఇది 1870లో ఇద్దరు బ్రిటిష్ సైనికోద్యోగుల చొరవతో ప్రారంభం అయ్యింది. ఇప్పటికి మెయిన్ క్లబ్ బిల్డింగ్ ఓల్డ్ స్టయిల్‌ని కలిగి ఉంది.
***
కొడనాడ ఎస్టేట్ వ్యూ పాయింట్:
కొడనాడ్ ఎస్టేట్ ఒకప్పుడు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె జయలలితకు ఇష్టమైన హాలిడే హోమ్. మేం చూడడానికి వెళ్ళినప్పుడు – సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు, పక్షుల కిలకిలారావాలు మొదలయ్యాయి. కార్మికులు టీ ఎస్టేట్‌ల వెంట నడుస్తున్నారు, వీపుపై వేలాడుతున్న – ఆకులను సేకరించడానికి పెద్ద బుట్టలు; టిఫిన్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్లను చేతిలో పట్టుకుని చిన్న బుట్టలతో. మండే వేడి మరియు కొరికే చలి మధ్య వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది చూస్తే.
ఇక్కడే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఉండేదిట.
జయలలిత మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 1994లో పీటర్ జోన్స్ నుండి 906 ఎకరాలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత తక్కువ ధర రూ. 7.6 కోట్లకు బలవంతంగా అంగీకరించారని పలు ఇంటర్వ్యూలలో ఆరోపించారు. బంగ్లాలో VIP హాల్, ఒకేసారి 100 మంది వ్యక్తులు ఉండగలిగే కాన్ఫరెన్స్ హాల్, కామన్ డైనింగ్ హాల్ మరియు చెన్నైలోని సెయింట్ జార్జ్ ఫోర్ట్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో కనిపించే అన్ని ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఎస్టేట్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక విలాసవంతమైన పడవ, 10 ఎకరాల ఫ్లోరికల్చర్ స్ట్రెచ్ మరియు మినీ హాస్పిటల్ ఉన్నాయి.
2011 ఎన్నికలలో ఆమె గెలిచిన తర్వాత, కొడనాడ్ ఎస్టేట్ జయలలితకు వాస్తవ వేసవి కార్యాలయంగా మారింది. కొడనాడ్‌లోని పచ్చని టీ ఎస్టేట్‌ల మధ్య తెల్లటి బంగ్లా ఉంది. తమిళనాడు ప్రజలు చాలా కాలంగా ఈ భవనంతోనూ, కొడనాడ్‌తోను జయలలితతో అనుబంధం కలిగి ఉన్నారు.
అయితే కొడనాడ్‌ను మొదట బ్రిటీష్ వారు హిల్ రిసార్ట్‌గా అభివృద్ధి చేశారు, బహుశా ఆతిథ్య వాతావరణం కారణంగా దీనిని రూపొందించారు. ఇక్కడే రాజ్ కొండల్లో మొదటిసారిగా కాఫీ ఎస్టేట్‌లను ప్రవేశపెట్టాడు. 1843లో, అప్పటి సేలం జిల్లా కలెక్టర్ మాంటేగ్ డుండాస్ కాక్‌బర్న్, ఏర్కాడ్ కొండలపై కాఫీ తోటలను ప్రవేశపెట్టి, కోటగిరిలో దానిని ప్రతిరూపం చేశారు.
అయితే, మొదటి టీ ఎస్టేట్ 1853లో కూనూర్‌లో ప్రవేశపెట్టబడింది. 1863లో కోటగిరిలో కాక్‌బర్న్ కుమార్తె మార్గరెట్ కాక్‌బర్న్ మొదటి తేయాకు తోటను ప్రవేశపెట్టిందని, ఆ మరుసటి సంవత్సరం కొడనాడ్ టీ ఎస్టేట్ స్థాపించబడిందని చెప్పబడింది.
అనేక చేతులు మారిన తర్వాత, ఎస్టేట్ చివరకు 1975లో విలియం జోన్స్ అనే విదేశీయుడికి చేరుకుంది. అతను ఆస్తిని ₹33 లక్షలకు కొనుగోలు చేసినప్పుడు, అది 1,000 ఎకరాలకు పైగా విస్తరించింది. జోన్స్ కుటుంబం తరువాత 100 ఎకరాలను విక్రయించింది మరియు 906 ఎకరాలను నిలుపుకుంది.
1976లో, అతని కుమారుడు పీటర్ కార్ల్ ఎడ్వర్డ్ క్రెయిగ్ జోన్స్ ఎస్టేట్ నిర్వహణ కోసం కొడనాడ్ చేరుకున్నాడు. మంచి దిగుబడి రావడంతో కోడనాడ్ టీ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో టీ ప్రాసెసింగ్ కంపెనీని ప్రారంభించాడు.
1992 వరకు జోన్‌లకు అంతా బాగానే ఉంది. జయలలిత తన మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మరియు ఆమె సహచరులు నీలగిరిలో ఒక ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నారు. వీరి కన్ను కొడనాడ్ ఎస్టేట్‌పై పడింది, చర్చలకు రెండేళ్లు పట్టింది. చివరకు 1994లో 906 ఎకరాలను జయలలిత కొనుగోలు చేశారు. పీటర్ జోన్స్ అనేక ఇంటర్వ్యూలలో కేవలం ₹7.6 కోట్ల ధరకు బలవంతంగా అంగీకరించినట్లు ఆరోపించాడు.
కొడనాడులో టెలిస్కోప్ ఉన్న ఒక వ్యూ పాయింట్ ఉంది. 5 రూపాయలు ఇస్తే అందులోంచి దూరంగా ఉన్న కథెరిన్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అక్కడి ఆదివాసీ స్త్రీలు చేసిన తోడా ఎంబ్రాయిడరీ ప్రొడక్ట్స్ వారే అమ్ముతారు. వారు ఎంబ్రాయిడరీ చెయ్యటం చూడవచ్చు.
కింద వైపున ఒక టీ స్టాల్ ఉంది. కొంచం కిందకి దిగితే ఇంకో ఓపెన్ వ్యూ పాయింట్ ఉంది. నీలి కొండలు, నీలి నీలి ఆకాశం కనువిందు చేస్తాయి. మెట్లు దిగుతుంటే లెక్కకు మించిన సీతాకోక చిలుకలు మనల్ని చుట్టుముట్టి సంతోషాన్నిస్తాయి.
అక్కడికి చేరటానికి తమిళనాడు ట్రాన్స్‌పోర్ట్ వారి బస్సులు ఉన్నాయి. దారిపొడవునా ఉన్న ప్రకృతిని చూస్తూ ప్రయాణాన్ని ఆస్వాదించడం ఓ మజా!
(మళ్ళీ కలుద్దాం)