దేశ విభజన విషవృక్షం-5

0
4

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]సిం[/dropcap]ధు సరిహద్దుల్లో నౌకా యుద్ధం విఫలమైన తరువాత ఆ ఓటమిని ఖలీఫా ఎంత మాత్రం అంగీకరించలేకపోయాడు. అప్పటివరకు మధ్య ప్రాచ్యం, గల్ఫ్‌ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా విజయమే సాధిస్తూ వచ్చిన తన సైన్యం సింధు సరిహద్దుల్లో ఓడిపోవడాన్ని తట్టుకోలేక పోయాడు. నైతికంగా బాగా కుంగిపోయాడు. తాను జీవించి ఉండగా భారత్‌వైపు మళ్లీ కన్నెత్తి చూడటానికి అతను సాహసించలేదు. అతని తరువాత ఖలీఫాగా వచ్చిన ఉథ్‌మాన్‌ కూడా ఎలాంటి దాడులు చేయలేదు. 649 సంవత్సరంలో ఖలీఫాగా ఉన్న హకీం బిన్‌ జబాలా అలాబ్ది మక్రాన్‌పై దాడి చేశాడు. ఇతను సింధ్‌ నుంచి మక్రాన్‌ వరకు ప్రయాణించాడు. ఈ సమయంలో అలీ.. ఖలీఫాగా ఉన్నాడు. హకీం ఈ అలీకి మక్రాన్‌కు సంబంధించిన వివరాలతో నివేదికను పంపించాడు. దీని ఆధారం చేసుకొని ముస్లింలు తమ దాడులను కొనసాగించారు. 658లో అల్‌ హరిత్‌ నేతృత్వంలో ప్రస్తుత పాకిస్తాన్‌లోని కలత్‌-సిబి ప్రాంతాల మధ్యన ఉన్న కికానన్‌పైన దాడి జరిగింది. ఇక్కడ వారికి మొదటి విజయం లభించింది. ఈ సమయంలోనే సింధ్‌ ప్రాంతంలోని పలువురు జాట్లు ఇస్లాం ప్రభావానికి గురయ్యారు. వీరిలో కొందరు ఎడారిలో ఒంటె సైన్యపు యుద్ధంలో అలీ కోసం పోరాడి చనిపోయారు కూడా. భారతదేశంలో ఇస్లామీకరణకు తొలి బీజం పడింది ఈ యుద్ధంలోనే. దేశంలో సాంస్కృతిక విధ్వంస రచన ఇక్కడినుంచి ప్రారంభమైందని గుర్తుంచుకోవాలి. దాదాపు మూడేండ్లపాటు ఈ ప్రాంతం వారి స్వాధీనంలోనే ఉన్నది. ఆ తరువాత అక్కడి అరబ్‌ కమాండర్‌ను స్థానికులు వధించారు. పరిపాలన తిరిగి స్థానికుల హస్తగతమైంది. ఆ సమయంలో ఇండియన్‌ ఫ్రాంటియర్‌ (థగర్‌ అల్‌ హింద్‌)ను సంపూర్ణంగా ఆక్రమించుకోవడానికి అనేక మంది గవర్నర్లను ఖలీఫా నియమించాడు. 660-680 సంవత్సరాల మధ్యన కికానన్‌ ప్రాంతంతోపాటు దాని చుట్టుపక్కల దాడులు చేసినప్పుడు భారతీయులు వారిని తీవ్రంగా నిరోధించారు. కానీ.. దాడులు మాత్రం ఆగలేదు. నిర్నిరోధంగా కొనసాగుతూనే వచ్చాయి. ప్రజలు ఏనాడూ ప్రశాంతంగా ఉన్న పరిస్థితి లేదు. భారతీయుల ప్రతిఘటనలో చాలామంది అరబ్బు గవర్నర్లు హతమయ్యారు. 705 సంవత్సరంలో అరబ్బులు అతి తీవ్రమైన ప్రజా యుద్ధాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాబూల్‌, జాబుల్‌ షాహీలు ఒకటికి రెండుసార్లు అరబ్బులను ఓడించారు. కానీ.. కొన్ని చోట్ల వాళ్లు విజయం సాధించడంతో భారత్‌పై ఇస్లాం ఆక్రమణకు అడుగులు పడ్డాయి.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. హిందూ అన్న శబ్దం. ఈ శబ్దం ఈ సమయంలోనే పుట్టుకొని వచ్చింది. అప్పటివరకు ఈ దేశానికి భారత వర్షమనే పేరు ఉన్నది. ఛప్పన్న దేశాల సమాహారంగా ఆర్యావర్తం భారతవర్షమన్న పేరుతో విలసిల్లింది. అంగ, వంగ, కళింగ, కాంభోజ.. ఇలా 56 దేశాలన్నీ కలిసి చుట్టూ సముద్రాలు, మంచుకొండల మధ్యన అత్యంత సురక్షితమైన భారతవర్షం ఉన్నదని అప్పటికే చరిత్ర చెప్పుతున్నది. నాలుగు వేదాల్లో, అష్టాదశ పురాణాల్లో, ఉపనిషత్తుల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఎక్కడా కూడా మచ్చుకు కూడా హిందూ శబ్దం కనిపించదు.. వినిపించదు. హిందూ అన్న శబ్దమే లేనప్పుడు మతం ఎక్కడినుంచి పుట్టుకొచ్చింది? ఈ ప్రశ్నకు ఇవాళ సోకాల్డ్‌ చరిత్రకారులు ఏమని జవాబు చెప్తారు? సింధ్‌ ప్రాంతంపై దాడి చేసిన మహమ్మదీయులు ముందుగా ఈ ప్రాంతాన్ని హింద్‌గా పిలిచారు. థగర్‌ అల్‌ హింద్‌.. అని సింధ్‌ సరిహద్దులను పిలుచుకొన్నారు. హిందూ అనే మాట పుట్టింది బహుశా దీనితోనే కావచ్చు. ఈ హిందూ అన్న పదంలో మతంలేదు. ధర్మంలేదు. జాతిలేదు. ఇది కేవలం సింధూనదికి ఆవలవున్న ప్రజలు అన్న అర్ధంలో వాడేరు. అరబ్బులు స పదాన్ని హ గా పలుకుతారు. అందుకని సింధు హిందు అయింది. వారి దృష్టిలో సింధు పరిసరప్రాంతాలవారు సింధువులు..హిందువులు అయ్యారు. కాబట్టి హిందు అన్న పదం…ఈ దేశంలో వున్న ప్రజలందరికీ వర్తిస్తుంది. ఒక మతానికి, జాతికి, కులానికి, ధర్మానికి పరిమితంకాదు. ఇది స్పష్టంగా అర్ధంచేసుకోవాల్సివుంటుంది. సింధుకు ప్రత్యామ్నాయంగానే హిందూ అన్న మాట వచ్చింది తప్ప ఈ దేశానికి హిందూ అన్న మాటతో ఎటువంటి సంబంధం లేదు. హిందూ అన్నది తరువాత ఇండస్‌ అయింది. ఇండస్‌ కాస్తా ఇండియా అయింది. అది కాస్తా మతం రూపం దాల్చి మన నెత్తిన వచ్చి కూర్చున్నది. భారతీయ స్వధర్మాన్ని ఉద్ధరిస్తామంటూ వ్యవస్థీకృతమైన సంస్థలు కూడా ఈ పదాన్ని పరిహరించలేక.. అరబ్బులు.. బ్రిటిష్‌ వాళ్ల మేనియాలో పడి.. హిందూ, హిందూయిజం, హిందుత్వమన్న పదాలను సొంతం చేసుకొని.. వాటి చుట్టూనే జోరీగల్లా పరిభ్రమిస్తున్నారే తప్ప ఇది భారతదేశం.. మనది భారతీయత.. మనం పునః సుప్రతిష్ఠం చేయాల్సింది భారతీయ ధర్మాన్ని అన్న ఆలోచన కూడా రాని పరిస్థితుల్లో ఈ సంస్థలు ఉన్నాయి. ఒక్కటి సుస్పష్టం. మనది భారతవర్షం. ఆర్యావర్తం. జంబూద్వీపం. మనం భారతీయులం మాత్రమే. ఇక్కడ ఎవరి మతాలు వాళ్లకున్నాయి. శైవం ఒక మతం, వైష్ణవం ఒక మతం, శాక్తేయం ఒక మతం, బౌద్ధం ఒక మతం, జైనం ఒక మతం, సిక్కు ఒక మతం.. చివరకు చార్వాకం (నాస్తికత్వం) కూడా ఒక మతమే. అంతేకాదు. ఆది శంకరులకు షణ్మతస్థాపకులు అని పేరు. ఆ షణ్మతాలు ఆనాటికే ప్రసిద్ధిలో ఉన్నాయి. శైవము, వైష్ణవము, శాక్తము, సౌరము, కౌమారము, గాణాపత్యము. ఈ దేశంలో ప్రాథమికంగా ఉన్న మతాలు ఇవే. ఆ తరువాతే బౌద్ధం, జైనం వచ్చాయి. ఇంత ఫ్లెక్సిబులిటీ ఉన్న సాంఘిక ధార్మిక సమాజ జీవనంలో హిందూ అనే మాటకు అస్తిత్వం ఎక్కడున్నది? ఎవడో బయటినుంచి వచ్చి నోరు తిరక్క.. ఏదో ఒక నది కనిపిస్తే.. దాని పేరును జాతి నామవాచకంగా మార్చి పిలిస్తే.. దాన్ని మనం మతవాచకంగా మార్చుకొని జీవిస్తున్నామంటే.. ఇంతకంటే దురదృష్టం ఏమున్నది? ఏ రకంగా చూసినా.. మనల్ని హిందువులు అని పిలవడానికి వీలే లేదు. వలస పాలనలో కొంతకాలం మన ఉనికి మరుగున పడి ఉండవచ్చు. కానీ.. ఆ తరువాత దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించడం వల్లనే పెడ పోకడలు వచ్చాయి. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా ఇంగ్లీష్‌లో ఒకపేరు, హిందీలో ఒకపేరు, సంస్కృతంలో ఒకపేరుతో దేశాన్ని పిలుచుకొంటున్నాం. ఈ పరిస్థితిలో మార్పు వచ్చినప్పుడే దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు అసలైన సార్థకత ఏర్పడుతుంది. మతం అంటే ఇష్టమయినది అని అర్ధం. ధర్మం అన్నదానికి ఇష్టాయిష్టాలతో పనిలేదు. అది పాటించి తీరాల్సిందే. ఎందుకంటే, అది విశ్వశ్రేయస్కరమయినది. మతం ఎవరిష్టం వారిది. ఈ సూక్ష్మ విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవాల్సివుంటుంది. భారతదేశంలో పలుమతాలున్నాయి. ధర్మం ఒక్కటే, అది సనాతన భారతీయ ధర్మం.  మతం వ్యక్తిగతం. ధరం సార్వజనీనం.

సింధ్‌ ప్రాంతాన్ని హింద్‌గా అరబ్బులు పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏండ్ల తరబడి వరుసగా దాడులు కొనసాగాయి. 661-680 మధ్య కాలంలో మక్రాన్‌లో కొంతభాగం అరబ్బుల వశమైంది. ఇక్కడ వారు స్థావరాన్ని ఏర్పాటుచేసుకొన్నారు. ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటు ముస్లింలు తూర్పు భారతం వైపు తమ దాడులను కొనసాగించారు.

708-711 సంవత్సరాల మధ్యన కలీఫాగా ఉన్న అల్‌ వాలిద్‌ 1, ఇరాక్‌ గవర్నర్‌గా ఉన్న అల్‌ హజ్జజ్‌లు కలిసి అరబ్బుల సైన్యాన్ని సింధు రాజైన రాజా దహీర్‌పైకి యుద్ధానికి పంపించారు. రాజా దహీర్‌తో అరబ్బుల యుద్ధం ఘోరంగా జరిగింది. తొలి యుద్ధంలో దేబాల్‌ దగ్గర అరబ్బులను రాజా దహీర్‌ ఓడించాడు. వారి సైనిక కమాండర్‌ అయిన ఉబాయిదుల్లాను హతమార్చాడు. కానీ అల్‌ హజ్జజ్‌ ఓటమిని అంగీకరించలేదు. మరో కమాండర్‌ బుదెయిల్‌ను ఓమన్‌ నుంచి పిలిపించి మరీ సింధ్‌పైకి పంపించాడు. దహీర్‌ కుమారుడు జయసింహతో బుదెయిల్‌ తలపడాల్సి వచ్చింది. ఇద్దరి మధ్యన పెద్ద యుద్ధమే జరిగింది. భారతీయులు బుదెయిల్‌ను పూర్తిగా చుట్టుముట్టారు. జయసింహ చేతిలో బుదెయిల్‌ హతమయ్యాడు. భారత సరిహద్దుల్లో అరబ్బులకు మరో ఓటమి తప్పలేదు.

ఈ యుద్ధం జరిగిన తరువాత అతి పెద్ద యుద్ధం 711లో జరిగింది. అల్‌ హజ్జజ్‌ ఈ సారి పెద్ద ఎత్తుగడ వేశాడు. భారతీయులను ఎదుర్కోవడం అంత సులభం కాదని అతనికి అర్థమైంది. భారీగా సైన్యాన్ని సమీకరించాడు. వారికి ఆయుధాలను సమకూర్చి పెట్టాడు. పదాతి దళాలతో పాటు నౌకాదళ సహకారాన్ని కూడా తీసుకొన్నాడు. మహమ్మద్‌ బీన్‌ ఖాసిం నాయకత్వంలో సింధ్‌పై భారీ యుద్ధం జరిగింది. మహమ్మద్‌ బీన్‌ ఖాసింకు ముందు దాదాపు శతాబ్దంపైన అసాధారణ విజయాలు సాధించిన భారతీయులు ఇతని చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఖలీఫా ఉమయ్యద్‌ సేవలో మిలటరీ కమాండర్‌గా ఉన్న మహ్మద్‌ బీన్‌ ఖాసిం.. సింధ్‌ ప్రాంతంలో అత్యంత భయంకరమైన మారణకాండకు పాల్పడ్డాడు. మక్రాన్‌ ప్రాంతం నుంచి సింధ్‌ దాకా ఇతని దాడి కొనసాగింది. ముందుగా దేబాల్‌ రేవు పట్టణంపై దాడి చేశారు. ఇది అంత సులభంగా వశం కాలేదు. దాదాపు పదిహేను సార్లు దేబాల్‌ పోర్టుపై అరబ్బుల దాడులు కొనసాగాయి. పోర్టు నగరంలో కోటలో ఒక మందిరాన్ని సంరక్షిస్తూ.. దానిపై ఆధారపడి దాదాపు 3 వేల మంది బ్రాహ్మణులు, 4 వేల మంది రాజ్‌పుత్‌లు ఉండేవారు. మహమ్మద్‌ బీన్‌ ఖాసిం కోటగోడలను ధ్వంసం చేశాడు. దాదాపు మూడు రోజులపాటు యుద్ధం జరిగింది. ఆ తరువాత నగరంలోకి ప్రవేశించి అక్కడి రాజ్‌పుత్‌లను, బ్రాహ్మణులను దారుణంగా ఊచకోత కోశాడు. దాదాపు 700 మంది దేవదాసీలను బానిసలను చేశాడు. అనంతమైన సంపదను దోచుకొన్నాడు. పిల్లలు, పెద్దల తలలను నరికాడు. ఆ తరువాత సింధ్ రాజు దహీర్‌పై దాడిచేశాడు. ఈ యుద్ధంలో దహీర్‌ ఓడిపోయాడు. ఖాసిం దహీర్‌ తలను నరికి అల్‌ హజ్జజ్‌కు పంపించి ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ మరో తీవ్రమైన అంశం ఏమిటంటే.. దహీర్‌ తలతోపాటు, ఆయన ఇద్దరు కూతుళ్లను కూడా బానిసలను చేసి అల్‌హజ్జజ్‌కు కానుకగా పంపించాడు. అనేకమందిని బానిసలుగా చేసి అరబ్బుకు తరలించాడు. భారత భూభాగంపై తొలి ఇస్లామిక్‌ రాజ్యం మహమ్మద్‌ బీన్‌ ఖాసిందే. 708 నుంచి 711 వరకు యుద్ధం జరిగింది. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించి 715 వరకు సింధ్‌ ప్రాంతాన్ని తానే పాలించాడు. సింధ్‌ ప్రాంతాన్ని ఇస్లామీకరణ చేయడంలో ఖాసిం అత్యంత కీలకమైన భూమిక పోషించారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇస్లామ్‌ దండయాత్రలన్నీ అత్యంత దారుణమైన సామూహిక మానవ హననంతోనే కొనసాగాయి. యూదు వ్యాపారుల ఊచకోత, తలల నరికివేత భారత్‌ దాకా కూడా కొనసాగింది. మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా అమానవీయంగా, పైశాచికంగా వ్యవహరించారు. ఇది ఆధునిక కాలం దాకా కొనసాగుతూ వచ్చింది. దీని వెనుక అరబ్బులకు ఉన్న ప్రధాన లక్ష్యం భయం కల్పించడం. అతి తీవ్రమైన భయం కల్పించడం ద్వారా.. కల్లోలం సృష్టించి మతాన్ని ప్రతిష్ఠించాలి. మతాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ఇక్కడ పోగుపడిన అపారమైన సంపత్తిని సాధించుకోవాలి. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలి. ఇస్లామీకరణ వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఇదే. ఇదే ఆధునిక కాలంలో దేశ విభజన.. విభజనానంతర పరిపాలన దాకా సాగుతూ వచ్చింది. వస్తున్నది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here