[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[పరీక్షకి దాదాపు మూడు నెలలుందనీ, అంతా సబ్జెక్ట్ పరంగానే ఉంటుందనీ, డిస్‌క్రిప్టివ్ మోడలని చెప్పి బాగా చదవమంటారు చంద్రమౌళి. ఆయనతో పాటు భోంచేసి జేమ్స్ స్టీట్‍లోని రామ్మూర్తి బావ బ్యాంకుకి వెడతాడు. ఆయన ఆశ్చర్యపోతాడు. జరిగినదంతా చెప్తాడు పతంజలి. అంతా నారసింహుని కృప అంటాడు బావ. టీ తాగించి ఇంటి వద్ద దింపుతాడు పతంజలిని. రాత్రి భోజనాలయ్యాకా, పాణిని ఏం చదివించాలో, ఎలా చదివించాలో వివరిస్తాడు రామ్మూర్తి బావ. తనకి ప్రమోషన్ మీద ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉందని చెప్తాడు. పతంజలి ఖచ్చితంగా లెక్చరర్‌గా సెలెక్ట్ అవుతాడని, అతనికి కర్నూలుతో ఋణం తీరిపోతుందని అంటాడు బావ. మర్నాడు కర్నూలు చేరతాడు పతంజలి. మూడు నెలల తర్వాత పరీక్షకి హాల్ టికెట్ వస్తుంది. కర్నులు సిల్వర్ జుబ్లీ కాలేజీలో పరీక్షలు బాగా వ్రాస్తాడు పతంజలి. ఇంతలో ప్రొద్దుటూరులో మేనత్తకి బాగా సీరియస్ అయి, వైద్యం చేయించినా కూడా, ఫలితం దక్కక ఆమె మరణిస్తుంది. మార్కండేయ శర్మ అంత్యక్రియలు, తదనంతర కార్యక్రమాలు చేయిస్తాడు. వసుధకు ధైర్యం చెబుతాడు పతంజలి. ఇంటర్వ్యూకి రమ్మని సర్వీస్ కమీషన్ వారి నుండి కబురు వస్తుంది పతంజలి. . కంబగిరి రెడ్డికి కూడా పిలువు వస్తుంది. ఇంటర్వ్యూ అద్బుతంగా చేస్తాడు పతంజలి. చంద్రమౌళిగారిని కలిసి ఇంటర్వ్యూ బాగా చేశానని చెప్తాడు. ఎవరైనా చేతనయినా బోర్డు మెంబర్స్‌కి చెప్పిస్తే, ఫలితం అనుకూలంగా రావచ్చని ఆయన అంటారు. తిరుమలావధాని గారిని కలిసి విషయం వివరిస్తాడు. ఆయన స్వీయప్రతిభని, దైవాన్ని నమ్ముకోమని సూచిస్తారు. ఆయనకు నమస్కరించి వచ్చేస్తాడు పతంజలి. వసుధని పతంజలికిచ్చి వివాహం జరిపించవలసిందిగా ఆమె అక్కా బావా వచ్చి అడుగుతారు. మార్కండేయ శర్మ అంగీకరిస్తారు. నిశ్చితార్థమయ్యాకా, పెళ్ళికి ముహూర్తం పెడతారు. పెళ్ళి ఘనంగా జరుగుతుంది. అందరి ఆశీస్సులతో దంపతులవుతారు వసుధా, పతంజలి. – ఇక చదవండి.]
[dropcap]“లే[/dropcap]చారా? పదండి క్రిందకు వెళదాం!” అంటూ వచ్చి పక్కమీద కూర్చుంది.
ఆమె చేయి అతని జుట్టు సవరిస్తూంది.
“రాత్రి జరిగింది కల కాదు కద!” అన్నాడు కొంటెగా
“కలేం కాదు. ఇంకా మర్యాదస్తుడివనుకున్నా. అమ్మో!”
“దేవిగారు తక్కువ తిన్నారా ఏం?”
అతని నుదుటి మీద ముద్దిచ్చి అన్నది. “థాంక్ యూ బావా?”
“మదన కదనంలో అలూ మగలిరువురూ విజేతలే. విజితులుండరు” అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ.
క్రిందికి వెళ్లి స్నానాదికం ముగించుకున్నాడు. ముగ్గురికీ టిఫిన్ పెట్టింది వదిన. కారం దోసెలు, కాసేపు బయట అరుగుమీద కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. వసుధ ఫ్రెండ్స్ కొందరు వచ్చారు. పెళ్లిలో కుదరలేదు. వారికి పతంజలిని పరిచయం చేసింది.
“మీ ఫోటో ఇదివరకే చూశామండి. వసుధ చూపించింది” అన్నదొక అమ్మాయి. ప్రశ్నార్థకంగా వసుధ వైపు చూశాడు.
“మీ ఆయన ఫోటో ఉంటే చూపించవే అని వీళ్లు వేధిస్తూంటే, మా యింట్లో మీ చిన్నప్పటి ఫోటో ఒకటి ఉంటే చూపించాను” అన్నది వసుధ. లోపలికి వెళ్లి ఆ ఫోటో తెచ్చి చూపింది. అది పతంజలి వాళ్లింట్లో కూడా ఉంది. మూడేళ్ల వయసులో సిల్కు చొక్కా వేసి జడవేసి పూలు పెట్టి, స్టూడియోలో తీయించారు. మోకాళ్ల వరకు వచ్చింది చొక్కా. లోపల లాగూ కూడ లేదు.
“సిల్లీ గర్ల్” అన్నాడు భార్యను మురిపెంగా చూస్తూ.
“దీనితో జాగ్రత్తగా ఉండండి సార్. చాలా గడుసుది!” అన్నదింకో అమ్మాయి.
“ఐకెన్ మ్యానేజ్” అన్నాడు పతంజలి. అందరూ నవ్వారు. బెస్ట్ విషెస్ చెప్పి వెళ్లిపోయారు.
మార్నింగ్ షోకు ఏదైనా సినిమాకు వెళ్దామనుకున్నారు. వెంటనే రడీ అయిపోయాడు తోడు పెళ్లికొడుకు.
“అన్నయ్యా! చిరంజీవి సినిమా ఆడుతూందీ వూళ్లో ‘కిరాతకుడు’. సూపర్ హిట్టంట. పోదాం వదినె కూడ చిరంజీవికి ఫానట.”
“ఒకసారి నీ ఫేవరట్ హీరో శోభన్‌బాబు అని చెప్పినట్లు గుర్తు?” అన్నాడ వసుధతో.
“అది ఒకప్పుడు. ఇప్పుడు నాకూ నా ముద్దుల మరిదికీ చిరంజీవే!” అన్నది వసుధ, పాణినికి దగ్గరకు తీసుకొని.
“దానికంటే ‘శంకరాభరణం’ బాగుంటుంది. అది కూడా ఆడుతున్నట్లుంది” అన్నాడు పతంజలి.
“నీవెందుకురా వాళ్ల మధ్యన. నీవు కావాలంటే ఒక్కడివే వెళ్లు. వాళ్లు వేరే సినిమాకు వెళ్లనీ…” వసుంధర వదినె.
బుంగమూతి పెట్టి వసుధ వైపు చూశాడు చిన్నోడు. కడగొట్టువాడయినందువల్ల వాడంటే ఇంటిల్లిపాదికీ గారబమే. పతంజలి దగ్గర వాడికి మరీ చనువెక్కువ.
“మా మరిదిని విడిచిపెట్టి మేం వేరే సినిమాకు పోయే ప్రసక్తే లేదు” అన్నది వదినె, వాడి తల నిమురుతూ.
“మా వదినె మం….చిది” అన్నాడు వాడు ఆమె చూట్టూ చేతులువేసి, ఇంటర్మీడియట్ పూర్తయి డిగ్రీలో చేరబోతున్నా వాడిలో చిన్నతనం పోలేదు.
ముగ్గురూ సినిమాకు వెళ్లారు. ధియేటర్ పేరు రౌనఖ్ పిక్చర్ ప్యాలెస్ అట. చిరంజీవి కటౌట్ దాదాపు ఇరవై అడుగులది పెట్టారు. దానికి సరిపోయే పూలమాల వేశారు. ధియేటరు ముందు భాగమంతా అభిమాన సంఘాల బ్యానర్లు కట్టి ఉన్నాయి. ఏరియా, సభ్యుల పేరు రాసి ఉన్నాయి వాటిమీద. క్రింది క్లాసుల కున్నంత రష్ బాల్కనీ టికెట్లకు లేదు. పాణిని వెళ్లి టికెట్లు తెచ్చాడు. మాస్ సినిమా అయినా ఇంటరెస్టింగ్‌గా సాగింది. బయటికి ‘కిరాతకుడుగా’ కనిపించినా హృదయమున్న మనిషిగా బాగా నటించాడు చిరంజీవి. పాటలు వచ్చిన సమయంలో విజిల్స్, కేకలు, కొందరు తెరముందున్న గట్టుమీదెక్కి చిరంజీవిలాగే డాన్సు చేస్తున్నారు.
ఇంటర్వల్‌లో నిమ్మకాయ సోడా తాగారు. కర్బూజ విత్తనాలు తెచ్చుకున్నారు. అవి ఎంతకూ అయిపోవు.
“సినిమా బాగుంది కదన్నయ్యా!” అన్నాడు చిన్నోడు. అన్నా వదినెల మధ్యలో కూర్చున్నాడు.
“చిరంజీవి సినిమాలు బోర్ కొట్టవు కద బావా!” అన్నది వసుధ.
“హి ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. యాన్ ఎక్సలెంట్ యాక్టర్!” అన్నాడు పతంజలి.
‘మీలాగే” అన్నది వసుధ మెరుస్తూన్న కళ్లతో. తనను చిరంజీవితో పోల్చినందుకు గర్వపడ్డాడు.
“కానీ నాకు డ్యాన్సులు, ఫైటింగులు అస్సలు రావే!” అన్నాడు.
“నేనన్నది చదువులో, ‘సక్సెస్’ సంస్థ విషయంలో బావా! మీరు పెరిగిన వాతావరణం ఏమిటి? ఎంత కష్టపడ్డారు. యమ్.ఎ. ఇంగ్లీషు ప్రయివేటుగా చదవడమంటే మాటలా! ఆ బుక్‌షాపు, పబ్లికేషన్లు, అయామ్ ప్రవుడ్ ఆఫ్ యు బావా!” అన్నది మరదలు.
చిన్నోడు చప్పట్లు కొట్టాడామె మాటలకు
“మా అన్నయ్య నిజంగా గ్రేట్ వదినా!” అన్నాడు.
మూడు నిద్రలయ్యాక వసుంధర దంపతులు, నూతన దంపతులను తీసుకొని వెల్దుర్తికి వెళ్లారు. అక్కడ కొత్త కోడలి గృహప్రవేశం, దత్త వ్రతం జరిగాయి. చెల్లిలిని విడిచి వెళ్లేటప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయింది అక్కయ్య. భరత్ వెక్కి వెక్కి ఏడ్చాడు. వాడిని తమ దగ్గరే ఉంచుకుంటామని చెప్పారు దంపతులిద్దరూ. వసుధ బావ వసుధను దగ్గరకు తీసుకొని తలమీద చేయి వేసి చెప్పాడు.
“జాగ్రత్తమ్మా. ఇకనుంచి ఇదే నీ ఇల్లు. వీళ్లే నీవాళ్లు” అన్నాడంతే. రెండే మాటల్లో మరదలికి కర్తవ్యబోధ చేశాడాయన.
కొత్త దంపతులిద్దరూ బయలుదేరి అహోబిలం వెళ్లి స్వామి దర్శనం చేసుకొని వచ్చారు. స్వామి వద్ద పతంజలి పొందే అనుభూతి మొదటిసారి చూసింది వసుధ. నరసింహస్వామితో తనకున్న అనుబంధాన్ని, తన అనుభవాలనూ వివరించాడామెకు. ఆమె ముగ్ధురాలయింది.
మునుపటిలాగా ఆదివారాలు వచ్చిపోవడానికి వర్ధనమ్మ ఒప్పుకోలేదు. కర్నూల్లోనే కాపురం పెట్టమంది. నరసింహారెడ్డి నగర్ అని రైల్వేస్టేషన్ ముందే ఒక కాలనీ ఉంది. అందులో మేడపైన ఒక పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు రెండు పెద్ద గదులు. ముందుగదిలో పడక. వెనుక గదిలో వంట, భోజనాలు ఇంటిముందు చాలా ఖాళీ డాబా. ఒక వైపుగా బాత్‌రూం, లావేటరీ విడివిడిగా ఉన్నాయి. మరొక మూల గిన్నెలు కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోడానికి ఒక కొళాయి, దాని చుట్టూ అర అడుగు ఎత్తున చిన్న గోడ కట్టి ఉంది. క్రింద ఓనర్సుంటారు. ఆయన మున్సిపల్ స్కూలు టీచర్‌గా చేసి రిటైరైనాడు. కొడుకు ఒక్కడే. రాయలసీమ పేపరు మిల్స్‌లో ఉద్యోగం. కోడలు గృహిణి. వాళ్లకు రెండేళ్ల పాప. రాత్రి ఇంటిముందు పక్కలు పరచుకొని పడుకోవచ్చు. ముందు గదిలో ఫ్యానుంది. ఎవరయినా గెస్ట్స్ గాని బంధువులు గాని వస్తే దంపతులు వంటింట్లో పడుకోవచ్చు. అందుకని ఒక టేబుల్ ఫ్యాన్ కొన్నారు.
రెండు స్టవ్‌లు, వంటగిన్నెలు, కిరాణా సరుకులు పోసి పెట్టుకొనే డబ్బాలు అన్నీ తెచ్చుకున్నారు. అమ్మానాన్న వచ్చి పాలు పొంగించి వెళ్లారు. వర్ధనమ్మ కోడలికిబ్బంది లేకుండా చారు పొడి, సాంబారుపొడి, అన్నంలో వేసుకొనే పొడులు, నాల్గయిదురోజులున్నా పాడవని పచ్చళ్లు తెచ్చింది. సమ్మర్ కాబట్టి స్పెషల్ స్పోకెన్ గ్రామరు క్లాసులు, ఎ.పి.ఆర్.జె.సి. ఎంట్రన్స్ క్లాసులు తప్ప పెద్దగా పనిలేదు. షాపుకు కూడ అన్ సీజనే. పెళ్లికి ముందే టైటిల్స్ అమ్మేశారు. సేల్స్‌మెన్ ఇద్దరుండంతో పతంజలి భారం తగ్గింది. ఇంటి దగ్గరున్న చిన్నోడి సైకిలు తెచ్చుకున్నాడు.
కొత్త కాపురం మధుర మధురంగా సాగిపోతోందది. ప్రతి ఆదివారం వెల్దుర్తికి వెళ్లి వస్తున్నారు. అక్కా బావల ఆహ్వానం మేరకు హైదరాబాదుకు వెళ్లి నాల్రోజులుండి చూడదగ్గ ప్రదేశాలన్నీ చూశారు. ఇద్దరికీ మంచి బట్టలు పెట్టారు వాళ్లు. మహిత డిగ్రీ సెకండియర్‌లో ఉంది. మళ్లినాధ దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. తండ్రి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. “నేత్రోన్మీలనమ్” అనే సంస్కృత కావ్యాన్ని వ్రాస్తున్నాడాయన. అమ్మా నాన్న ఇద్దరూ అరవైల్లో ప్రవేశించారు.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ప్రాస్పెక్టస్, అప్లికేషన్ ఫారం రామ్మూర్తి బావ పంపించాడు. అందులో జత చేసిన జాబులో శుభవార్త తెలిపాడు. తనకు మేనేజరుగా ప్రమోషన్ వచ్చిందనీ, విజయవాడకు వేశారనీ, బెంజి సర్కిల్ బ్రాంచికి కేటాయించారనీ తెలియజేశాడు. త్వరలో విజయవాడకు షిప్ట్ అవుతామన్నాడు.
పాణినితో అప్లికేషన్ నింపించి ఢిల్లీకి పంపాడు పతంజలి. వాడికి ఇంటర్మీడియట్‌లో 91 శాతం, స్టేట్ 9వ ర్యాంక్ వచ్చింది. నెలరోజుల్లో వాడికి సీటు ఇస్తున్నట్లు లెటరు వచ్చింది. హాస్టలు వసతి కూడ ఉంది. దాదాపు నెలకు ఐదువందలు హాస్టలు ఫీజు, ఇతర ఫీజులు, ఖర్చులు కలుపుకొని సంవత్సరానికి పదివేల రూపాయలు అవుతూంది. మెరిట్ స్కాలర్‌షిప్ కూడ ఉంది. ఒకవేళ అది వస్తే కొంత బరువు తగ్గుతుంది. ఒక గొప్ప లక్ష్యం నెరవేరాలంటే తప్పదు మరి.
చిన్నోడిని తీసుకొని ఢిల్లీకి వెళ్లాడు పతంజలి. ఎ.పి. ఎక్స్‌ప్రెస్‌లో రిజిర్వేషన్ చేయించుకొని వెళ్లారు. కళాశాల భవనాలు ‘రాయల్’గా ఉన్నాయి. హాస్టలు వసతి కూడ చాలా బాగుంది. ఒక రోజంతా ఉన్నాడు. లైబ్రరీ చూసి కడుపు నిండిపోయింది. తిరిగి వస్తూ చిన్నోడికి చెప్పాడు. “నా ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నానురా. నేను పడిన కష్టాలు నీవు పడకూడదు. మన స్తోమతకు మించిందే అయినా ఫరవాలేదు. దేనికీ ఇబ్బందిపడకు. రాజీ పడకు. మొదట్లో కొంత కొత్తగా ఉంటుంది. ఆల్‌ది బెస్ట్”
కళ్లనిండా నీళ్లు నింపుకొని అన్నయ్యను కౌగిలించుకున్నాడు చిన్నోడు. వాడి వీపు నిమురుతూ ఉండిపోయాడు పతంజలి. వాడికి కావలసినవన్నీ ఢిల్లీలోనే కొనిపెట్టాడు. తమ్మున్ని అంత దూరం వదలిపెట్టి వస్తూంటే చాలా బాధనిపించింది.
వసుంధర వదినె వాళ్లకు చిత్తూరుకి ట్రాన్స్ ఫరయిందట. భరత్‌ను కూడ తమతోపాటు తీసుకువెళ్లి, బి.యస్సీలో జాయిన్ చేస్తారట. ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు టెంత్, పాప చిన్నది ఎయిత్ చదువుతూన్నారు.
ఇంటర్వ్యూ అయిన ఆరు నెలల తర్వాత జూనియర్ లెక్చరర్ల నియమాక ఫలితాలు వచ్చాయి. ‘ఈనాడు’లో వేశారు. జోన్‌ల వారీగా సెలెక్ట్ అయిన అభ్యర్థుల రిజిస్టర్ నంబర్లు ఇచ్చారు, రాయలసీమ నాలుగు జిల్లాలు జోన్ – 4 క్రిందికి వస్తాయి. ఇంగ్లీష్ సబ్జెక్టు జోన్ ఫోర్‌లో తన నంబరు వెతికాడు. రెండుసార్లు చూసినా నంబరు కనపడలేదు. చాలా నిరాశగా అనిపించింది. ఇంటికి వెళ్లి వసుధకు చెప్ప బాధపడ్డాడు. వసుధ అంత బాధపడలేదు.
“పోనీలే బావా! మనకు ప్రాప్తం లేదు. అయినా మనకు చేతినిండా పని ఉంది. నేను కూడా ఇన్‌వాల్వ్ అవుతాను. రేపట్నించి వస్తాను. టెంత్ వారికి సోషనల్ స్టడీస్, ఇంటర్ వాళ్లకు కామర్స్ చెబుతాను. షాపులో కూడ కూర్చుంటాను. కొంత ట్రయినింగ్ ఇవ్వండి. మీ సేవలందుకొనే అదృష్టం ప్రభుత్వానికి లేదు” అన్నది.
పతంజలికి ఈ మాటలతో ఊరటవచ్చింది. వసుధను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు.
“యు ఆర్ నాట్ ఓన్లీ మై వైఫ్, బట్ మై ఫ్రెండ్ అండ్ సొలేస్” అన్నాడు.
“బట్ అయామ్ యువర్ డార్లింగ్ ఫస్ట్” అన్నది వసుధ.
మనసు బాగాలేదని ఇద్దరూ సాయిబాబా గుడికి వెళ్లారు. బాబా దర్శనం చేసుకుంటుంటే ఎందుకో ఆయన నవ్వుతున్నట్లుగా అనిపించింది. ‘నీక్కూడ నేనంటే ఎగతాళిగా ఉందా స్వామీ’ అనుకున్నాడు. తుంగభద్ర ఒడ్డున మెట్ల మీద కాసేపు కూర్చున్నారు.
బయటకు వచ్చిం తర్వాత మిరపకాయ బజ్జీల బండి కనపడింది. “పదండి బజ్జీలు తిందాం” అన్నది వసుధ. పతంజలి ఆసక్తి చూపలేదు.
“అంత ఇష్టం కదా మీకు. నాకూ నేర్పించారు. అవేం పాపం చేశాయి?” అంటూ నాలుగు తెచ్చింది. ఒక్కటి తిన్నాడు.
రాత్రంతా కలత నిద్రతోనే గడిపాడు. ఉదయం లేచి స్నానం చేసి దేవుని గూటి ముందు కూర్చున్నాడు. దీపారాధన చేసి, స్వామికి అష్టోత్తరం చేశాడు. స్వామి కూడ నవ్వుతున్నట్లుగా అనిపించింది.
“చేసిందంతా చేసి నవ్వుతున్నావా?” అన్నాడు గట్టిగా. ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపాడు. మరునాటికి తేరుకొని మామూలయ్యాడు పతంజలి. ట్యుటోరియల్స్లో హుషారుగా పాలుపంచుకున్నాడు. రాత్రి భార్యభర్తలిద్దరూ సెకండ్ షోకు వెళ్లారు. ‘శ్రీరామ’ ధియేటర్‌లో ‘షాన్’ అనే హిందీ సినిమా చాలా బాగుంది. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని పడుకున్నారు. వసుధను తనకభిముఖంగా తిప్పుకొని, “ఇక థర్డ్ షో వేసుకుందామా!” అన్నాడు.
“ఈరోజుకిదే ఫస్ట్ షో” అన్నది ముద్దుల మరదలు.
“అమ్మయ్య! రెండు రోజుల్నుండి మీ ధోరణి చూస్తూంటే నాకు మనసేమీ బాగులేదు. మై బావ హాజ్ బికం మై బావ అగెయిన్!” అంటూ అతన్ని అల్లుకుపోయింది.
మరునాడు మధ్యాహ్నం పోస్టులో ఒక కవరు వచ్చింది. చింపి చూశాడు. ఏదో పేపర్ కటింగ్, ఒక లెటరు ఉన్నాయి. క్రింద సంతకం చూశాడు. కంబగిరి రెడ్డి! గబగబా చదివాడు.
“పతంజలి స్వామికి, కంబగిరి రెడ్డి వ్రాయునది. మన రిజల్ట్సు వచ్చినాయి. నిన్ను జోన్ వన్‌కు అలాట్ చేసినారు. మెరిట్ లిస్ట్‌లో ఉన్న వారిని ఏ జోన్ కయినా అలాట్ చేసే డిస్‌క్రెషినరీ పవర్స్ సర్వీస్ కమీషన్ కుంటాయి. నీ మెరిటే నీకు వేరే జోన్ వేయించింది! నీవు మన జోన్ – 4 లో వెతుక్కొని, నీ నంబరు కనబడక నిరాశపడతావని ఈ జాబు వ్రాస్తున్నాను. మేము వారం రోజుల క్రిందటే మా చిన్నాయన బిడ్డ పెండ్లికి రాజంపేటకు వచ్చినాము. ఆ పేపరు కటింగ్ కూడ పంపుతున్నాను. జోన్ వన్‌లో నీ నంబరు అండర్‌లైన్ చేసినా చూడు. ఆ రోజు నేను చెప్పినానా లేదా! అన్నట్లు నేను కూడ సెలెక్టయినాను. మన జోన్‌కే వేసినారు. పది పన్నెండు రోజుల్లో మనకు ఆర్డర్స్ రావొచ్చు. అభినందనలతో – కంబగిరి రెడ్డి!
పేపరు కటింగ్ చూశాడు. మొదటి జోన్ – వన్ ఇంగ్లీష్ బ్రాకెట్లో (శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం జిల్లాలు) అని ఉంది. తన నంబరు అండర్‌లైన్ చేసి ఉంది!
‘తండ్రీ! లక్ష్మీ నరసింహా!’ అనుకున్నాడు. మొన్న బాబా, నిన్న స్వామి ఎందుకు నవ్వారో అర్థమయింది. వెంటనే మునికీ, ఉస్మాన్‌కు చెప్పాడు. సైకిలు తీసుకొని ఇంటికి వెళ్లాడు. తలుపు తీసిన వసుధను ఎత్తుకొని గిర్రున తిప్పాడు.
“బావా, బావా, ఆపండి! ఏమయింది! ఎందుకింత సంతోషం!” అన్నదామె ఉక్కిరి బిక్కిరవుతూ. నవ్వుతూ లెటరిచ్చాడు. చదివింతర్వాత ఆమె ముఖం మందార పువ్వులా విచ్చుకుంది.
“నాకెందుకో మొదటి నుండి ఏదో డౌట్ గానే ఉంది. అయితే ఇదన్నమాట సంగతి. ఈయనెవరో మనా పాలిటి…”
“నరసింహస్వామి” అని పూర్తి చేశాడు పతంజలి. “లాస్ట్ మినిట్‌లో వచ్చి నాతో అప్లయి చేయించింది కూడా ఇతనే”
“పదండి నోరు తీపి చేసుకుందాము” అంటూ వంటింట్లోకి దారి తీసింది వసుధ. వెంటనే వెళ్లాడు వసుధా మనోహరుడు.
“ఆమె చక్కెర డబ్బా అందుకుంటుంటే, ఇటు తిప్పుకుని, “నోరు తీపి చేసుకునే విధానం అదికాదు” అంటూ ఆమె పగడాల పెదవులను తన పెదవులతో బంధించాడు.
ఇద్దరూ వెల్దుర్తికి వెళ్లి శుభవార్త తెలియజేశారు. నాన్న సంతోషం చూపించలేదు.
“ఇక్కడ సిద్ధాన్నం అంతా వదులుకొని అంత దూరం వెళ్లాలా?” అన్నది ఆయన స్పందన.
“నాన్నా, మీకు తెలియదు. డైరెక్ట్‌గా గజిటెడ్ ఆఫీసరు పోస్టు రావడమంటే మాటలు కాదు. ఇది కేవలం నరసింహస్వామి కృప. తప్ప మరొకొటి కాదు. దూరం అంటున్నారు. మన రాష్ట్రంలోనే కదా. ‘నదూరభూమిరుద్యోగినః’ అని మీలాంటి పెద్దలు చెప్పిందే కదా. వెల్డింగ్ టైలరింగ్ లాంటి పనులు చేసుకొనేవాళ్లే గల్ఫ్ కంట్రీస్‌కి బ్రతుకు తెరువుకోసం వెళుతూన్న ఈ రోజుల్లో మన రాష్ట్రంలోనే మనం దూరమనుకుంటే ఎలా నాన్నా?” అన్నాడు పతంజలి.
తండ్రి బదులు చెప్పలేదు. అసలు విషయం ఏమిటంటే ఆయన పెద్ద కొడుకును వదిలి ఉండలేడు. ఇంచుమించు దశరథ మహారాజుకు శ్రీరామచంద్రుడిపట్ల ఉన్న పితృవాత్యల్యమే ఆయనకూ ఉంది. అన్ని బాధ్యతలూ ఒంటి చేత్తో మోసే కొడుకు తనను వదిలి దూరంగా ఉద్యోగానికి పోతాడంటే జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన కాసేపటికి అన్నాడు.
“కానీ, విధి స్తు బలీయః”
మల్లినాధ అన్నాడు. “నాన్నా మీరు దిగులు పడకండి. నేనున్నాను కదా. అన్నయ్యకు అంతమంచి ఉద్యోగం వచ్చింది. ఈ అవకాశం మనకు కావలసినపుడు లభించదు.”
పతంజలి తండ్రిని కౌగిలించుకొని “మీరు అంగీకరించే దాకా వదలను” అంటూ గారాబం చేశాడు. వసుధ నవ్వుతూ చూస్తూంది.
శర్మగారి ముఖం ప్రసన్నమైంది. “సరేలే. నన్ను వదిలిపెట్టు మరి” అన్నాడు చిరునవ్వుతో.
అందరికీ ఈ వార్త తెలుపుతూ ఉత్తరాలు వ్రాశాడు. బడేమియాగారికి, చంద్రమౌళిగారికి కృతజ్ఞతలు తెలిపాడు. నాలుగు రోజుల తర్వాత బడేమియా బదులు వ్రాశాడు.
“స్వామీ! కంగ్రాచ్యులేషన్స్. మన జోన్‌కు మార్చుకోవడానికి వీలుంటుందా అని వ్రాసినారు. ఉంటుంది కాని ఇప్పుడు కాదు. ముందు చేరండి. కనీసం 2 సం॥ల ప్రొబేషనరీ పీరియడ్ ముగిసిన తర్వాత ఇంటర్ జోనల్ ట్రాన్స్‌ఫర్‌కు ట్రై చేయవచ్చు. కానీ అది అంత సులభ సాధ్యంకాదు. మెరిట్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న కొందరిని ఇతర జోన్లలో వేస్తారు. మీకు అలాట్ అయిన జోన్-వన్‌లో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలున్నాయి. ఏ జిల్లాలోనైనా వేయవచ్చు. కాని ఆ మూడు జిల్లాల్లో చాలా వెనుకబడిన ప్రాంతాలున్నాయి. భయంకరమైన ఏజన్సీ ఏరియాలున్నాయి కనీస సౌకర్యాలేవీ ఉండవు.
మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చే అధికారం రాజమండ్రిలోని రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారికే ఉంటుంది. మొదటి రెండవ జోన్లు అంటే శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు ఆయనే ఉన్నతాధికారి. ఆరు జిల్లాలకు అందగాడన్నమాట. ఆర్.జె.డి ఆఫీసులో ఇక్కడ పని చేసి వెళ్లిన నా మిత్రుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు (ఎ.ఓ)గా ఉన్నాడు. ఆయన పేరు మారుతీ ప్రసాద్. ఆయనకు నేను ఫోన్ చేసి నీ వివరాలు చెప్తాను. నీ పేరు సబ్జెక్టు చెబితే చాలు. రోడ్డు రైలు మార్గంలో ఉన్న మంచి టౌన్‌లో నీకు పోస్టింగ్ ఇవ్వమని చెబుతాను. ఫైల్లో ఆయన రిమార్క్స్‌ను బట్టే ఆర్.జె.డిగారు నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక విషయం ముందు సర్వీస్ కమీషన్ వారు సెలెక్షన్ ప్రొసీడింగ్స్ పంపుతారు. వారం రోజుల్లో రాజమండ్రి నుండి పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి. వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్లి జాయినవ్వండి. కేవలం ఒక్క రోజు సీనియారిటీ తేడా వచ్చినా, ప్రమోషన్‌లో వెనుకపడే ప్రమాదం ఉంది. ఉంటాను. బడేమియా”
తన పట్ల అంత ‘కన్‌సర్న్’ చూపుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు బదులు వ్రాశాడు. వసుధను వెల్దుర్తిలోనే ఉంచి, తాను కర్నూలుకు వెళ్లాడు. రాధాసారింటికి స్వీట్సు తీసుకొని వెళ్లాడు. ఆయన పతంజలిని కౌగిలించుకున్నాడు.
“నీ పాసుగూల గట్టోనివి సామీ” అన్నాడు. “స్టేట్ గవర్నమెంటులో మీది అంటే జె.యల్స్‌ది, సివిల్ అసిస్టెంట్ సర్జన్లది, జూనియర్ ఇంజనీర్లది, అగ్రికల్చర్ ఆఫీసర్లది, వెటర్నరీ డాక్టర్లది ఒకటే క్యాడర్ ప్రస్తుతం బేసిక్ పే ఎనిమిది వందలు. హెచ్.ఆర్.ఎ. డి.ఎ. కలిసి దాదాపు పధ్నాలుగు వందలు వస్తుంది.”
“మరి యిన్ని పెట్టుకోనుండావు గదా ఈడ. ఇయన్నీ సెటిల్ జేసుకొని పోవాల. ఆర్డరొచ్చింతర్వాత టైముండదు. ఒక్కరోజు కూడ లేట్ చేయకుండా జాయినవ్వాల. ప్రమోషన్‌లో ఒక్కోసారి ఆ ఒక్కరోజే దెబ్బతీస్తాది. ” అన్నాడాయన. ఆయన దగ్గర సెలవు తీసుకొని వచ్చేశాడు.
ఆరోజు రాత్రి ఆఫీసురూంలో ముగ్గురు మిత్రులూ సమావేశమయ్యారు. ఉస్మాన్‌కు ఆదోనిలో ఎయిడెడ్ స్కూల్లో టీచరుగా వచ్చే అవకాశముందట. మైనారిటీస్ నడిపే స్కూలట అది.
“మరి ఏం చేద్దాం?”
ముని అన్నాడు. “మీ యిద్దరూ లేకుండా నేనొక్కడినీ ఇవన్నీ చేయలేను. బుక్ షాపు నాకిచ్చేయండి. నేనూ నా తమ్ముడూ చూసుకుంటాము. అకడమిక్ యియర్ మధ్యలో పిల్లలను వదిలెయ్యలేము గనుక మార్చి వరకు ట్యుటోరియల్స్ నడుపుదాం.”
“మూసేయాల్సిన పని ఉండదు” అన్నాడు ఉస్మాన్. “ఎవరికయినా టేకోవర్ కిస్తే సరిపోతుంది. మన పేరు బాగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి కొంత గుడ్‌విల్ అమౌంట్ కూడా యిస్తారు.”
ముగ్గురూ కలిసి జాగ్రత్తగా లెక్కలు వేశారు. పెట్టుబడి, ఆదాయం మూడు భాగాలు చేశారు. బ్యాంకులో ఉన్న అమౌంట్ ఎంతో చూశారు. అంతా లెక్కతేలింది. తలా ఇరవై వేల రూపాయలు వస్తుంది.
“షాపు నాకిస్తున్నందుకు గుడ్‌విల్ అమౌంట్ ఇస్తాను” అన్నాడు ముని.
ఇద్దరూ కయ్యిమని లేచారతని మీదికి. అంతమాటన్నందుకు బాధపడ్డారు. ట్యుటోరియల్స్ మీద వచ్చే గుడ్‌విల్ కూడ తనకు వద్దన్నాడు పతంజలి. అన్నీ సెటిల్ అయ్యాయి. ఫర్నిచర్, స్టడీమెటీరియల్ మొదలైన వాటికి మాత్రం టేకోవర్ ద్వారా వచ్చే డబ్బు మూడు భాగాలు చేద్దామన్నారు.
విషయం తెలిసిన దేవ సహాయం సారు దంపతులు చాలా సంతోషించారు. ముగ్గుర్నీ భోజనానికి పిలిచారు. చక్కని వంటలు చేశారు మేడమ్‌గారు. భోజనం చేస్తుంటే అన్నదామె.
“నీ భార్య చాలా బాగుందయ్యా.. నేను కాలేజీ నుండి వస్తూంటే మీ ఇద్దరూ కెసికెనాల్ బ్రిడ్జి మీద నడుచుకుంటూ వెళుతున్నారు. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ అమ్మాయితో ఉద్యోగం మాత్రం చేయించకు. భార్యా భర్తలిద్దరూ ఉద్యోగం చేస్తే ఇదిగో మా సంసారంలాగే ఉంటుంది”
“థ్యాంక్యూ మేడమ్!” అన్నాడు పతంజలి
“ఏం? ఇప్పుడు మన సంసారానికేమయింది?” అన్నాడు సారు.
“మీకేం? అన్నీ నానెత్తిన వదిలేసి హాయిగా తిరుగుతారు.”
మొదలైంది సరాగం అనుకున్నారు మిత్రులు. భోజనాలయిన తర్వాత సారు అడిగారు. ఏం చేయబోతున్నారని. తామనుకున్నది ఆయనకు వివరంగా చెప్పారు. ఆయనిలా అన్నాడు.
“మా కజిన్ కొడుకు బి.ఎస్సీ. బి.యిడీ చేసి ఖాళీగా ఉన్నాడు. వాడి ఫ్రెండొకడు ఎమ్.ఎ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషనట. వాళ్లిద్దరినీ పిలిపిస్తాను. మంచి పేరుంది మన సంస్థకు. అదే టైటిల్ మీద నడుపుతారు. కొంత గుడ్‌విల్ అమౌంట్ కూడా యిప్పిస్తాను. ఫర్నిచర్, ఇతరత్రా వాటికి లెక్కగట్టి డబ్బులిస్తారు. వాళ్లకూ ఒక ఉపాధి, రెడీమేడ్‌గా దొరుకుతూంది కదా! ఇంకెవరికీ చెప్పకండి”
“మీ మాట కాదంటామా సార్!” అన్నారు.
రెండ్రోజుల్లో సారు చెప్పిన వాళ్లిద్దరూ వచ్చారు. ఒకాయన క్రిస్టఫర్. ఇంకొకాయన హరిచంద్రారెడ్డి, పదివేలు గుడ్‌విల్, ఫర్నిచర్ మిగతావాటికి మరొక ఐదు వేలు ఇప్పించారు సారు. పతంజలి ఎంత కాదన్నా వినకుండా అతని భాగం ఇచ్చేశారు మిత్రులు. మొత్తం ఇరవై ఐదు వేలు వచ్చింది ఫైనల్‌గా.
తండ్రికి పదివేలు అకౌంట్‌లో వేశాడు. ఢిల్లీలో చిన్నోడికి పదివేలు పంపాడు. మరో సంవత్సరం వరకు వాడికి ఇబ్బంది లేదు. తానొక ఐదువేలు పెట్టుకున్నాడు.
మిత్రుల హృదయాలు బరువెక్కాయి. ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి ఉన్నారు. కష్టం సుఖం పంచుకున్నారు.
(సశేషం)