అందుకున్న నక్షత్రం

0
5

[dropcap]’ఊ[/dropcap]హ’ పెరట్లో ఉన్న నిండుగా విరబూసిన గులాబీ పువ్వులనే తదేకంగా చూస్తోంది, ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటూ. గాలికి అవి అటూ ఇటూ ఊగుతూ తనతో ఏవో కబుర్లు చెబుతున్నాయి. వాటి భాష ఏమిటో అర్థం కావటం లేదు ఆ చిన్న బుర్రకు. అయినా తనకు తోచినట్లుగా ఊహించుకుని వాటితో మాట్లాడేసుకుంటోంది. వాటిలో కబుర్లు చెప్పేసుకుంటోంది.

ఒక్క మొక్కలతోనే కాదు పిట్టలతో, పక్షులతో, రోడ్డుతో, గోడతో – కాదేదీ అనర్హం కవితకు అన్నట్లు అందరితో మాట్లాడేస్తుంది. ఇంకా విచిత్రమేమంటే దేవుళ్ళతో కూడా! అది కూడా ఒక్కోసారి ఒక్కో దేవుణ్ణి స్మరిస్తుంది.

వాళ్ళు ఉండే చోట ఆడుకోవటానికి పెద్ద మైదానం ఉండేది. అక్కడ ఎక్కువగా మగపిల్లలందరూ కలసి క్రికెట్ అడుతూ ఉండేవారు. దాని ఎదురుగా ఉండే ఇంటి అరుగుల మీద కూర్చుని దాన్ని చూసే వాళ్ళు ఈ పిల్లలంతా.

ఒకసారి ఊహ పెన్ను ఆ ప్లేగ్రౌండ్‌లో పడిపోయింది. అప్పట్లో సి.సీ. కెమెరాలు కూడా ఉండేవి కాదు. అప్పుడు ఊహ “శ్రీకృష్ణా! ఇంత పెద్ద స్థలంలో నా చిన్న పెన్ను వెతకాలంటే చాలా కష్టం – నాకు నా పెన్ను దొరికేట్లు చేయవా” అని అడిగింది.

అంతే! ఒక్కసారి అటూ ఇటూ కలియ చూడగానే పెన్ను దొరికేసింది. అది ఎవరి కయినా చెబితే నమ్ముతారా? ఊహు.

భలే! భలే! అని సంబరపడింది. కృష్ణుడికి మనసులోనే ధన్యవాదాలు చెప్పింది.

కాసేపు వెళ్ళి అరుగు మీద కూర్చుంది.

ఈ లోపు నేల మీద చీమలు వెళ్ళుతున్నాయి. వాటిని చూస్తే జాలి వేసింది.

“ఎందుకిలా అందరూ నడిచే రోడ్డు మీద తిరుగుతారు? వాళ్ళ కాళ్ళ క్రింద పడితే చచ్చిపోరూ!” అని అడిగింది.

“ఏం చేస్తాం? మా ఆహారం మేం వెతుక్కోవాలిగా” అన్నాయి అవి, అన్నట్లు అనుకుంది.

ఒకసారి సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నా బీచ్‌కి తీసుకెళ్ళారు.

అక్కడ సముద్రాన్ని చూసి ఆ చిన్న మనసు ఎంత ఆనంద పడిపోయిందో? నీలంగా ఎంత అందంగా ఉంది? అనుకుంది మనసులో. అప్పుడని పించింది నేల మీద నడిచినట్లు అలల మీద నడిస్తే ఎంత బాగుంటుందని!

అమ్మ చెప్పింది – నీళ్ళలోకి దిగగానే లోపలికి నీళ్ళు లాగేసుకుంటూయని, మేము లేకుండా లోపలికి వెళ్ళకూడదని – వాళ్ళద్దరి చేతులు పట్టుకునే నీళ్ళలో కాళ్ళతో ఆడుకుంది.

తన కోరిక తీరుతుందా?

ఏమో?!

తన ప్రశ్నకు మాత్రం సమాధానం దొరక లేదు.

***

అలా ఆలోచిస్తూనే డిగ్రీ లోకి వచ్చేసింది.

ఇప్పుడు మరో కోరిక, తన కిష్టమైన వాళ్ళ దగ్గిరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గాలిలో అప్పటికప్పుడు ఎగిరి వెళ్ళి కాసేపు ఉండి వాళ్ళతో కబుర్లు చెప్పుకుని వచ్చెయ్యాలని.

పురాణాలలో అలా లేపనం రాసుకుని వెళ్ళారని చిన్నతనంలోనే పుస్తకాలలో చదివింది మరి. అది అలా మనసులో ఊడిపోయింది. మనసులో ఎలా అయినా ఆ లేపనాన్ని సంపాదించాలని ఎన్నో సార్లు అనుకునేది.

అది తీరకుండానే పెళ్ళి అయిపోయింది. భర్త ‘నూతన్’తో ఒకసారి అననే అంది.

“హిమాలయాలలో వందేళ్ళ నుంచీ తపస్సు చేసే వారుంటారట. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళను మెప్పించి లేపనం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది?” అని.

తీసుకు వెళతానులే అంటాడనుకున్న భర్త –

“వాళ్ళనలా తపస్సు చేసుకోనివ్వు తల్లీ. నువ్వు వెళితే వాళ్ళకు తపఃభంగం అవుతుంది. నిన్ను చూసి వాళ్ళు సన్యాసం వదిలేస్తారు. పాపం వాళ్ళ నెందుకు చెడగొట్టటం!” అంటూ జోకు లేసే వాడు.

మరి ఊహ అందం అలాంటిది.

“పోమ్మా! ఎప్పుడూ అలాగే అంటావు. మునులంటే ఇలాంటి బాహ్య సౌందర్యానికి పడిపోయే వాళ్ళు కాదు. అలా అయితే ఇన్నిన్ని సంవత్సరాలు అలా ఎలా జపం చేస్తారు?” అనేది వదలకుండా.

“జరగని పనులు కోసం ఎందుకు మాట్లాడుకోవటం చెప్పు. రా బంగారం!” అంటూ తనని ఇక మాట్లాడనిచ్చేవాడు కాదు.

అప్పటితో అది ముగిసిపోయేది. కానీ అది చిన్నతనం నుంచీ గింజలా మొలకెత్తి పెద్ద వృక్షమయ్యిందని ఆమెకే తెలుసు.

కళ్ళు మూసుకుని ఆలోచిస్తూనే ఉంది.

***

‘వండర్ వరల్డ్’ అనే పత్రికలో పక్షి భాషను నేర్పే అతను చైనాలో ఉన్నాడని తెలుసుకుంది.

ఎలాగో చైనీస్ అతన్ని పట్టుకొని ఆ భాషను నేర్చుకుంది. ఇప్పుడు రాజుల కథల్లో పక్షులు చెప్పుకున్న మాటలను గ్రహించి అన్నీ తెలుసుకున్నట్లు ఇప్పుడవి ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసుకుంటుంది. వాటితో నిజంగా కబుర్లు చెప్పుకుంటోంది. దానికి ఎంతో కష్టపడింది సాధించింది.

సాధనలో పనులు సమకూరు ధరలోన… అన్నదాన్ని నిజం చేసింది.

***

తమ ఊరి సత్రంలో ధ్యానం, యోగా నేర్పిస్తున్నారంటే వెళ్ళింది. వీటి ద్వారా గాలిలో ఎగర వచ్చని, అలలపై కూర్చోవచ్చని తెలుసుకుంది. కాకపోతే దానికి నిరంతర సాధన కావాలి.

ఇక ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆ రెండింటిలో కుస్తీ పట్టేది.

సంవత్సరాలు దొర్లాయి.

ఇప్పుడు ఆ కాశంలోనూ, నీళ్ళ పైనా కూడా వెళ్ళగలిగే సామర్థ్యాన్ని సంపాదించింది. ‘ఊహ’ గిన్నీస్ బుక్ లోకి కూడా ఎక్కింది.

అసాధ్యం సుసాధ్యమే అని నిరూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here