ఎవరికి ఎవరు..

0
3

[dropcap]“అ[/dropcap]మ్మా! చంటి బిడ్డ ఆకలితో ఏడుస్తుంది.. గ్లాసుడు పాలుపోయండి..” అంటూ వీధి గేటు దగ్గిర రాత్రి ఎనిమిది గంటలకి పిలుస్తోంది ఎవరో బిచ్చగత్తె.

భోజనం చేసి వంటగది సర్దుకుంటున్న గాయత్రి ఆ పిలుపుకి బయటికి వచ్చి చూసింది.

మరీ బిచ్చగత్తెలా లేదు కానీ బలహీనంగా చెదిరిన జుట్టు, మాసిన పైజామా షర్టుతో ఏడుస్తున్న బొమ్మలాంటి పిల్లని టవల్‌లో చుట్టి అడుగుతోంది .

“సరే.. ఇలా వచ్చి అరుగుమీద కూర్చో. నీకు కూడా అన్నం కూరా ఇస్తాను.” అంటూ గాయత్రీ వంట గదిలోకి వెళ్లి గ్లాసుడు పాలు మరో చేత్తో అన్నం కూర పళ్లెంతో తెచ్చి బాటిల్తో నీళ్లు ఇచ్చింది. అక్కడే కుర్చీలో కూర్చుంది.

చంటిబిడ్డ పాలు తాగి నిద్రపోయింది. పాపని అరుగుమీద పడుకోబెట్టి ఆవురావురని అన్నం కూరా తింటూ ఉంటే ఆ మనిషి ఆకలి ఏమిటో తెలిసింది గాయత్రికి.

“అమ్మా.. పోయే ప్రాణాలు నిలబెట్టారు, నాకూ, బిడ్డకీ. నూరేళ్లు చల్లగా వుండండి..” అంది బిచ్చగత్తె.

“ఈ రోజుల్లో వీధిలో అడుక్కునే వారిని నిషేధించింది ప్రభుత్వం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్?” అడిగింది గాయత్రి.

“మాది కోనసీమలో గ్రామం…. ఇంటినుంచి పారిపోయి తప్పు చేసాను. శిక్ష అనుభవిస్తున్నాను” అందామె.

“నీ పేరు ఏమిటి? ఏమి తప్పు చేసావ్?” అడిగింది గాయత్రి.

ఆమె మాటా తీరు చదువుకున్నట్టు సంస్కారమైన కుటుంబం నుంచి వచ్చినట్టు అర్థమైంది గాయత్రికి.

కన్నీళ్లు పొంగి వస్తుంటే ఆమె కాసేపు రోదించింది.

తర్వాత స్తిమితపడి “దయగల మనసు మీది. హేళనగా చీదరించుకోకుండా నా కష్టం అడుగుతున్నారు. నా బాధ చెప్పుకుంటాను” అంటూ మొదలు పెట్టింది.

“నా పేరు దీప. నాన్న ఆ ఊరిలోనే స్కూల్ టీచర్. మా ఊరి కాలేజీలో ఇంటర్ పూర్తిచేసి ఇంజినీరింగ్‌లో చేరడానికి ఎంట్రెన్స్ కోచింగ్ కోసం హైదరాబాదుకి వచ్చాను. అక్కడ హాస్టల్లో వున్నప్పుడు పరిచయం అయ్యాడు అరవింద్..” అంటూ ఆగింది దీప.

“అర్థం అయినది. నువ్వు పరీక్ష రాయలేదు అరవింద్ వలలో పడి.. మోసపోయావు. నిన్ను గాల్లోకి వదిలి అరవింద్ పారిపోయాడు. నువ్వు బిడ్డని కని ఇంటికి వెళ్లి మీ అమ్మ నాన్నల ముఖం చూడలేక ఇలా తిరుగుతున్నావు. అంతేనా? ఇలాంటి సంఘటనలు చాలా వింటూనే వున్నాను” అంది గాయత్రి.

“లేదమ్మా.. వినండి. అరవింద్ చాలా మంచివాడు. నాకు చాలా సహాయం చేసాడు. తప్పు అతడిది కాదు. వినండి. ఇంజినీరింగ్ ఎంట్రన్స్ రాసాను. మంచి రాంక్ కూడా వచ్చింది. హైదరాబాదులోనే చేరాను. హాస్టల్లో ఉండటం వలన అమ్మానాన్నల భయం లేకుండా పోయినది. సినిమాలు, విహారాలు, పబ్బులో పార్టీలు అబ్బాయిలతో స్నేహాలు ఇష్టం వచ్చినట్టు తిరిగాను. చదువులో వెనక పడ్డాను. అరవింద్ హెచ్చరిస్తూనే వున్నాడు. నువ్వు స్నేహం చేసేవాళ్ళు డ్రగ్ అలవాటు వున్నవాళ్లు. పేరున్న ఆఫీసర్ల పిల్లలు. ఏదైనా తేడా వస్తే నిన్ను ఇరికించి తప్పుకుంటారు.. జాగ్రత్త! అని. మంచిగా చెబితే తలకు ఎక్కలేదు.

ఒకరోజు నేను పబ్బులో పోలీసులకు పట్టుబడ్డాను. నేను అరవింద్ మాట వినక పోయిన నా వెనకాలే తిరిగే అరవింద్ ఈ కబురు తెలిసి నాన్నకి ఫోను చేస్తే వచ్చి విడిపించారు. ఇంటికి తీసుకెళ్లి చదువు మానిపించి పెళ్లి సంబంధాలు చూసారు. మత్తు మందులకు అలవాటు పడిన నేను మానుకోలేక డబ్బు తీసుకుని ఇంటినుంచి పారిపోయాను.

ఒళ్ళు తెలియని స్థితిలో అన్ని పోగొట్టుకుని రోడ్డుమీద పడివున్న నన్ను ఎవరో హాస్పటల్లో చేర్చారు. డెలివరీ ఆయ్యేవరకు వాళ్ళే కొద్దిరోజులు ఆశ్రయం ఇచ్చారు. అమ్మానాన్నల పరువు పోగొట్టిన నేను ఇంటికి వెళ్లలేక ఈ బిడ్డ ప్రాణాలు తీయలేక చీకటి పడ్డాక ఎవరూ చూడకుండా ఇలా అడుక్కుంటున్నాను.” చెప్పింది దీప.

“నిజమే తప్పు చేసావ్. తప్పు చేసిన బిడ్డలను అక్కున చేర్చుకునేది అమ్మానాన్నలే. మా ఇంటి వెనుక అవుట్ హవుసు వుంది ఇక్కడే వుండు. నీకు ఏదైనా బతుకు తెరువు చూపుతాను. నాకు ఎవరైనా మనిషి సాయం కావాలి. నీ బిడ్డను చదివించుకో. నువ్వు తేరుకున్నాక నా సెక్రటరీగా వుందుగాని. నాకు ఇద్దరు కొడుకులు వున్నారు. వాళ్ళు అమెరికాలో వుంటారు. మేము అటూ ఇటూ తిరుగుతూ ఉంటాము. ఇక నుంచి ఆడపిల్లలు లేని మాకు నువ్వే కూతురివి..” అంటూ భర్త ప్రతాప్ గారిని పరిచయం చేసింది గాయత్రి.

ఆయన కొంత సందేహించాడు, ఎన్నో దురాగతాలు జరుగుతున్నాయి. వూరు పేరు లేని కొత్త మనిషిని ఇంట్లో పెట్టుకుంటే.. ఏమో అని!

“పర్వాలేదు. చిన్నతనంలో తప్పు చేసినా ఇప్పుడు తెలుసుకుని బయటపడింది. వూరు పేరూ లేకనేమి అన్ని వున్నాయి. మన అరవిందుకి స్నేహితురాలే. మంచి కుటుంబంలో పిల్లే! ఐనా నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను లెండి..” అని ఆయనను ఒప్పించింది.

పాపకి గాయత్రిగారు ‘సారంగి’ అని పేరు పెట్టారు. మనవలు కొడుకులు దూరంగా వున్నారు అని బెంగ లేకుండా చిన్నారి సారంగి ఆటపాటలు చూసి మురిసి పోతారు ఆ దంపతులు.

“దీపా! ఎవరో తెలియని మాకు సారంగిని చూస్తే ఇంట ఆనందంగా వుంది. మీ వూరు వెళ్లి అమ్మ నాన్నలకు చూపించి రావడం నీ బాధ్యత..” అంటూ చెప్పింది గాయత్రి.

“వద్దు ఆంటీ.. అదసలే పల్లెటూరు. ఆ వూళ్ళో అంతా నా గురించి మర్చిపోయి వుంటారు. అమ్మ నాన్న కూడా తమ్ముడి చదువు చెల్లి పెళ్లి కోసం ఆ వూరు వదిలి వెళ్లిపోయారు. ఎక్కడో సుఖంగా వున్నానని అనుకుంటారు. అనుకోనీండి. నేను వెళ్లి పెద్ద వయసులో వాళ్ళని మరింత బాధ పెట్టలేను.” అని వారించింది.

“దీప అనే అమ్మాయిని నేను సెక్రటరీగా నియమించుకున్నాను. చాలా మంచి అమ్మయి. మా ఇద్దరికీ అన్ని చూస్తుంది. మా గురించి వర్రీ అవ్వకు” అంటూ చెప్పింది కొడుకులతో గాయత్రి ఒకరోజు.

దీప ఎలా ఉంటుందో తెలిసాక నమ్మకం కుదిరాక ఏడాది తర్వాత చెప్పింది వాళ్ళతో.

“ఏదీ ఫోను ఫేస్‍టైమ్‌లో మాకు చూపించు..” అన్నారు వాళ్ళు.

“దీపా ఇలారా నా కొడుకులు నిన్ను చూస్తారు” అంటూ పిలిచింది గాయత్రీ.

తీరా చేస్తే గాయత్రీ పెద్దకొడుకు అరవిందే. ఇటు దీపా అటు అరవింద్ ఆశ్చర్య పోయారు.

“అరే దీపా నువ్వా..” అన్నాడు అతను.

“మీరు.. మీరు.. అరవింద్..!” అంటూ తలవంచుకుంది దీప.

“నాకు చాలా హాపీగా వుంది దీపా, ఈ రకంగా మళ్ళీ నిన్ను చూస్తాను అనుకోలేదు. ఇంక మా పేరెంట్స్ గురించి మాకు బెంగలేదు.” అన్నాడు ఆనందంగా.

గాయత్రికి దీప ఎప్పటి పరిచయమో చెప్పాడు. ఏదో అనుకోకుండా భర్తతో ‘మన అరవింద్ క్లాస్‌మేట్.. అని యథాలాపంగా చెప్పింది ఇప్పుడు నిజమే అయినది’ అనుకుంది గాయత్రి.

అప్పుడు ఆమెకు గుర్తు వచ్చింది.

‘దీప అని మాకు జూనియర్. నాకు చాలా ఇష్టం. కానీ చెడు అలవాట్లకు అలవాటుపడి చదువు పాడు చేసుకుంది. మంచి దారిలో పెట్టాలని చాలా ప్రయత్నించాను. దురదృష్టం చదువు మానేసి వాళ్ళ వూరు వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు ఎంత స్ట్రిక్ట్ అంటే దీప గురించి కనిపెట్టి ఫోను చేసిన నన్ను కూడా నమ్మలేదు. అక్కడి గొడవలో నేను కూడా వున్నాను అనుకుని దీపతో మాటాడవద్దని ఫోను చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. దీపను నేను చెల్లిగా అనుకునే వాడిని. కానీ ఆమె నన్ను అపార్థం చేసుకుంది’ – అంటూ ఆ రోజు అరవింద్ చెప్పి చాలా బాధ పడ్డాడు.

“ఎనీవే మళ్ళీ ఇన్నాళ్లకు మా ఇంట్లో నిన్ను చూసినందుకు నాకు సంతోషం. మా అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో..” అన్నాడు అరవింద్.

దీప గురించి తర్వాత చెప్పింది అరవింద్‌తో.

అతను దీప పర్సనల్ మేటర్ గురించి తెలియనట్టే వుండిపోయాడు. దీప కొంతలో కొంత అదృష్టవంతురాలు. అరవింద్ అమ్మానాన్నల ఆశ్రయంలో కూతురు సారంగిని మంచి వాతావరణంలో పెంచుకునే అవకాశం లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here