పరుగుల రాణి పి.టి. ఉష

4
3

[dropcap]ఆ[/dropcap]మె భారతీయ క్రీడాకారిణుల ఖ్యాతిని అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు తీయించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రికార్డులను సృష్టించారు. తరువాత ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్ క్రీడలలోనూ అంతర్జాతీయ క్రీడాకారిణిగా అనేక రికార్డులను స్వంతం చేసుకున్నారు.

భారతీయ క్రీడా శిక్షణా కేంద్రాలలో సౌకర్యాల లేమి ఆమెను మడమ తిప్పనివ్వలేదు. ముందడుగు వేయించింది. ఇతర దేశాల లోని శిక్షణా కేంద్రాలను, క్రీడా ప్రాంగణాలను చూసి సంబరపడ్డారు. ఇటు వంటి సౌకర్యాలుంటే అథ్లెటిక్ రంగంలో మన భారతీయ క్రీడాకారులకి ఎదురే ఉండదని అనుకునేవారామె. ఎప్పటికయినా అద్భుతమైన, సౌకర్యాలతో గొప్ప శిక్షణా కేంద్రాన్ని స్థాపించాలని ఆకాంక్షించి, ఆశించి, ఆచరణలో పెట్టారామె. సుమారు ఇరవై సంవత్సరాల పైన రన్నింగ్ ట్రాక్‌ను శాసించే స్థాయిలో కృషి చేసి, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి భారతీయ మహిళా అథ్లెట్లలో శిఖరంగా నిలిచారు. ఆమే ‘పిలవుల్లకండి తెక్కెర పరంబిల్ ఉష’, మనందరి పి.టి. ఉష.

ఈమె 1964 జూన్ 27వ తేదీన కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లా పయ్యోలిలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు టి.వి. లక్ష్మి, ఇ.పి.యమ్.పైతాల్. పేద కుటుంబం కావడంతో సరైన పోషకాహారం అందేది కాదు. అనారోగ్యంతో బాధలు పడ్డారు.

ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే క్రీడలలో పోటీ చేశారు. వ్యాయామోపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించేవారు. పాఠశాల స్థాయిలోనే 4వ తరగతిలోనే అనితరసాధ్యమైన ప్రతిభను కనపరిచారు.

కోజికోడ్ లోని ప్రొవిడెన్స్ ఉమెన్స్ కాలేజిలో చదువును కొనసాగించారు. కన్నూర్ లోని ప్రత్యేక క్రీడా పాఠశాలలో చేరి క్రీడా శిక్షణను పొందారు. కేరళ ప్రభుత్వం ఈమె ప్రతిభను గుర్తించి 250 రూపాయలు ఉపకార వేతనాన్ని మంజూరు చేసింది.

ఈమె ప్రతిభను గుర్తించిన ప్రముఖ అథ్లెటిక్ కోచ్ శ్రీ 0.M. నంబియార్ ఈమెను శిష్యురాలిగా స్వీకరించారు. వీరి శ్రమ ఫలించింది.

1978లో కొల్లాంలో అంతర్రాష్ట్ర జూనియర్స్ మీట్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు పందెంలో, 60 మీటర్ల హర్డిల్స్, హైజంప్‌లో 4 బంగారు పతకాలను పొంది ‘బంగారు బాలిక’ అయింది. ఈ పోటీలలోనే 4×100 మీటర్ల రిలే పరుగు పందెంలో కాంస్య పతకాన్ని పొందారు. ఈ విధంగా ఒకేసారి ఆరుపతకాలను సంపాదించిన గొప్ప అథ్లెట్ ఆమె. ఈ విజయాల పరంపర కొనసాగుతూ ఆమెను విజయపథం వైపు పరుగులెత్తించింది.

1980 మాస్కో ఒలింపిక్ క్రీడలలో పోటీ చేశారు. రెప్పపాటు కాలంలో పతకాన్ని కోల్పోయారు. ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.

1981లో బెంగుళూరులో జరిగిన అంతర్రాష్ట్రీయ అథ్లెటిక్ పోటీలలో 100 మీటర్లను 11.8 సెకన్లలో, 200 మీటర్లను 24.6 సెకన్లలోను అధిగమించి జాతీయ రికార్డులను నెలకొల్పారు.

1982లో ఢిల్లీలో జరిగిన 9వ ఆసియా క్రీడలలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందాలలో రజత పతకాలను సాధించారు.

1983లో జంషెడ్‌పూర్‌లో జరిగిన ఓపెన్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 200 మీటర్ల పరుగు పందెంలో 23.9 సెకన్ల లోను, 400 మీటర్ల పరుగు పందెంలో 53.6 సెకన్లలోను అధిగమించి నూతన రికార్డులను సాధించారు.

1983లో కువైట్‌లో జరిగిన ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 400 మీటర్ల విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు.

1985లో జకార్తాలో జరిగిన ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 5 బంగారు పతకాలతో బంగారు పతకాల రాణి (బంగారు కన్య) అనిపించుకున్నారు.

1986లో సియోల్‌లో జరిగిన 10వ ఆసియా క్రీడలలో నాలుగు బంగారు పతకాలను, ఒక రజత పతకాన్ని సాధించారు. అన్ని అంశాలలోను ఆసియా స్థాయిలో రికార్డులను నెలకొల్పారు. స్ప్రింట్ క్వీన్‌గా పేరు పొందారు. 1984, 1985, 1986, 1987, 1989 లలో జరిగిన ఆసియా ఖండ స్థాయిలో అత్యుత్తమ అథ్లెట్‌గా నిలిచారు. ఈ స్థాయిలో అవార్డులను స్వంతం చేసుకున్నారు. 1987లో సింగపూర్ ఆసియా ఛాంపియన్‌షిప్ పోటీలలో మూడు బంగారు, రెండు రజిత పతకాలను, 1989లో నాలుగు బంగారు, రెండు రజతపతకాలను పొందారు.

1984లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 100 మీటర్ల పరుగు పందెంలో సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఒలింపిక్ క్రీడలలో సెమీ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డును సృష్టించారు. అయితే సెకనులో వందో వంతు తేడాతో కాంస్యపతకాన్ని కోల్పోయారు. ఆమెతో పాటు భారతీయులు కూడా నిరాశకు లోనయ్యారు. అయినా నిరాశకు లోనవలేదు ఆమె. అంతర్జాతీయ పోటీలలో పాల్గొని విజయాలని సాధించి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. తరువాత అనేక సార్లు ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలలోను పాల్గొన్నారు.

ఈమెకి 2000 సంవత్సరంలో కన్నూర్ విశ్వవిద్యాలయం, 2017లో కాన్పూర్ విశ్వవిద్యాలయం, 2018లో కాలికట్ విశ్వవిద్యాలయం, గౌరవ డాక్టరేట్లతో గౌరవించి, క్రీడాకారుల ప్రతిభను గుర్తించామని నిరూపించుకున్నాయి.

సుమారు 2 దశాబ్దాల పాటు రన్నింగ్ ట్రాక్‌ను శాసించారు. పదహారేళ్ళ వయస్సులో మొదలు పెట్టి ముప్ఫై నాలుగేళ్ళవరకు తన అథ్లెట్ ప్రస్థానాన్ని కొనసాగించారు. తన జీవితంలో 103 అంతర్జాతీయ పతకాలను, 1042 ఇతర పతకాలను సాధించి ‘పరుగుల రాణి’ గా నిలిచారు.

1984లో క్రీడారంగంలో అత్యుత్తమ ప్రదర్శనకు అందించే అర్జున అవార్డుతోను, 1985లో వివిధ రంగాలలో నిష్ణాతులకి అందించే పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి పి.టి. ఉషను గౌరవించింది భారత ప్రభుత్వం.

ఈమె జూలై 2022లో రాష్ట్రపతి నియామక ఉత్తర్వులతో రాజ్యసభ సభ్యురాలిగా నియమించబడ్డారు. ఇలా ఈమె రాజకీయ జీవితం మొదలయింది.

ఈమె రైల్వే శాఖలో ఉద్యోగిగా పని చేశారు. 1984,1985,1989,1990 సంవత్సరాలలో రైల్వే క్రీడాకారుల కిచ్చే మార్షల్ టిటో అవార్డు ఈమెకి లభించింది.

ప్రముఖ క్రీడాకారుడు వి.శ్రీనివాసన్‌తో ఈమె వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

ప్రస్తుతం భారతదేశం యొక్క ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉద్యమం యొక్క సలహాదారుల బోర్డులో సభ్యురాలిగా పనిచేస్తున్నారు.

ఈమె మన దేశంలోని క్రీడాకారులకు శిక్షణను ఇవ్వడం కోసం కేరళ రాష్ట్రంలోని కోయిలాండిలో అథ్లెటిక్ శిక్షణా పాఠశాలను స్థాపించారు. ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ పేరుతో ఈ పాఠశాలను విజయవంతంగా నడుపుతున్నారు. ఇందులో అధునాతన సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. క్రీడాకారులకి ఉచిత శిక్షణను అందిస్తూ తన సేవాభావాన్ని, క్రీడలు-కీడాకారుల పట్ల ప్రేమని కనపర్చుతున్నారు.

ఈమె గౌరవార్థం 1990 సెప్టెంబర్ 29వ తేదీన బీజింగ్‌లో జరిగిన 11వ ఆసియా క్రీడల సందర్భంగా 4 రూపాయల స్టాంపును విడుదల చేశారు. ట్రాక్ మీద పరుగెత్తడానికి రెడీగా ఉన్న పి.టి. ఉష ఈ స్టాంపు మీద కనిపిస్తారు.

ఈ క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌గా ప్రాచుర్యం పొందిన పయ్యోలి ఎక్స్‌ప్రెస్ రాజ్యసభ సభ్యురాలుగా నియమితులయిన సందర్భంగా ఈ వ్యాసం.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here