[ఆ సాధువు రామనాధానికి కొంత డబ్బిచ్చి పంపేస్తాడు జయంతి. మర్నాడు వారు హంపికి చేరుకుంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి వైభవాన్ని తలచుకుంటారు భార్యాభర్తలు. హంపి వైభవాన్ని ధ్వంసం చేసినందుకు బాధపడతారు. శారద మైసూరు వెడదామన్నా, వద్దంటాడు జయంతి. ఉన్నట్టుంది వేదన కలుగుతుంది జయంతికి. శారద ప్రేమలో ఓదార్పు పొందుతాడు. ఇంటికి చేరుతారు దంపతులు. తిరిగి ఊపిరాడనంత పనులు. ఒకరోజు ఉదయమే కాలింగ్ బెల్ మోగుతుంది. ఇద్దరు నడి వయసు వ్యక్తులు గుమ్మంలో ఉండి జయంతి కోసం అడుగుతారు. నిద్రపోతున్నాడని శారద చెప్తే – తమ పేర్లు శివాజీ, రాముడు అని చెప్పి, జయంతిని నిద్ర లేపమంటారు. ఈలోపు జయంతి బయటికొస్తాడు. శారద టీ, బిస్కట్లు తెచ్చేసరికే వాళ్లు వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి అడుగుతుంది శారద. ఇక చదవండి.]
[dropcap]ఆ[/dropcap] రాత్రి మాత్రం పెందలకడనే వచ్చి కూర్చుని బుద్ధిమంతుడిలా చెప్పాడు.
“ఈ రాముడు పేరు జాన్ రాముడు. జానకి రాముడు, రామయ్య అని కొందరంటారు.
తనని ఇలా ఎందుకు పిలుస్తున్నారు? అని పాపం ఎన్నడూ అనుకున్నవాడు గాదు.
ఎలా పిలిచినా పలికాడు, పలుకుతాడు.
అతనికి ఒక్క నిజం మాత్రం తెలుసు.
ఒక తల్లి ఆవిడ జైలు జీవితం నుంచి బయట పడ్డాక వచ్చి నువ్వు ఫలానా అని చెపితే విని ఊరుకున్నాడు.
దగ్గరకు వెళ్లలేదు.
‘నాతో ఉండు ఎక్కడకెళ్తావు?’ అని కూడా అనలేదు.
ఆవిడ అక్కడ ఉండగానే తలదించుకుని వెళ్లిపోయాడు.
ఓ రోజు రాత్రి పడుకోబేయే ముందు ‘తల్లి’ అని చెప్పగా విని, తలలో మెదిలి ‘ఇది నిజమేనా?’ అనుకున్నాడు. అప్పుడే లేచి చర్చి ఫాదర్ దగ్గరకెళ్లి, అడుగుదామనుకున్నాడు. వెళ్లాడు. వెళ్లాక తనకు కావాల్సిన ఫాదర్ సంవత్సరం క్రితమే చనిపోయాడని చెప్పారు. ఇక ఆ విషయాన్ని పూర్తిగా వదిలేసాడు. మరచిపోయాడు. సృష్టి ప్రారంభాన పుట్టిన మనుషుల జాతి వాణ్ణి అని గర్వంగా ఫీలయ్యేవాడు. ఆ తర్వాత తను ఉంటున్న సమాజాన్ని వారి వారి అనుబంధాల్ని తెల్సుకునే ప్రయత్నం చేసాడు. మేడి పండులా అనిపించింది. చిరాకేసింది. ఒళ్లంతా చీదరగా అసహ్యంగా అనిపించింది. ఈ వెధవ శరీరాన్ని రైలు క్రింద పెట్టి చంపేస్తే బాగు అనిపించింది కూడా. ఆ తర్వాత ఒంటరిగానే కూర్చుని చాలా ఏడ్చాడు.
ఈ సమాజంలో ఏ తల్లి వచ్చి రాముణ్ణి ఓదార్చలేదు. కనీసం ఊర్కోరా అనలేదు. కన్నీరు తుడచిన వారు లేరు. జారిన ఆ కన్నీరు నేల పై పడి ఇంకిపోయినయి.
ఒంటిపై జారినవి ఆరిపోయినయి.
తనకు తెల్సిన తల్లి గుర్తులోకొచ్చింది.
ఆవిడ పేరు లచ్చమ్మ. నాటకాలాడేది గనుక ‘శ్రీలక్ష్మి’ అనేవారు.
వేషాలేస్తుండగానే పెళ్లి నిర్ణయమైంది.
గూడూరు దగ్గర పల్లెకి నాటకం ఉంటే వెళ్లింది. నాటకం పూర్తయింది.
రంగు కడుక్కొన్నాక నాటకం వేయించిన ఆసామిని పైకం అడిగింది.
నాటకం ఆడించిన వారు ముగ్గురు. ముగ్గురు కలసే డబ్బు ఇచ్చారు.
బస్సు స్టాండున దిగబెడతాం అని జీపు ఎక్కించుకున్నారు.
ఆ జీపు బస్సు స్టాండుకు వెళ్లక ఓ కాలనీని దాటి చివారనున్న పూరి గుడిసే దగ్గర ఆగింది.
పరిస్థితి అర్ధమైంది లచ్చమ్మకు. అరిచింది. పరుగెత్తింది.
ఏదీ సాగలేదు. ఆమాంతం ఎత్తుకొని గుడిసె లోపల వేసారు.
ఎంత బ్రతిమాలినా పెళ్లి పిల్లను అని మొత్తుకున్నా జాలి చూపలేదు.
ముగ్గురూ కలిసే తమ ‘కోరిక’ తీర్చుకున్నారు.
రెండు రోజులు ఆ పూరి గుడిసెలోనే వారి కోరికలు తీర్చుతూనే శవంలా ఉండిపోయింది.
ఆ మర్నాడు వదిలేసారు.
ఇంటికి చేరింది. చావలేక.
ఒంటికి పట్టిన జ్వరం మాత్రం వదలలేదు.
ఇది ఇలా ఉంటే ఖాయమైన పెళ్లి పిల్లాడు ఆ వూరి పిల్లనొక దాన్ని తీసుకొని పారిపోయాడు. దానితో పెళ్లి ఆగింది. ఇదేం ఖర్మరా భగవంతుడా అని ఏడుస్తుంటే గర్భవతి అయినట్లుగా తేల్సింది. ముగ్గురి పశుత్వానికి పడ్డ పిండాన్ని ఛిద్రం చేయాలని నాల్గయిదు సార్లు ప్రయత్నించింది. ఫలించలేదు. అపస్మారపు దశన మగ పిండంగా బయటపడింది. పారేసి వద్దామని తీసుకెళ్తూ ముగ్గరు పశువులలో ఏ పశువుకు వీడు బిడ్డ అని అనుమానించే ప్రయత్నమూ చేసింది. అర్థం కాలేదు.
అర్థమయ్యేదాకా సాకితే అనిపించింది.
సాకింది. పట్టుదలగా లోకాన్నీ దాని నిందల్నీ భరించుతూ.
కొంత ఎదిగినా స్పష్టత గోచరించలేదు.
వీడు ఎదురుగ కనిపించినంత మేరా, ఆ ముగ్గురి పై కక్ష అలివి మాలి పెరిగింది.
కాని ఎలా?
ఇద్దరు చాలా దూరాన ఉంటున్నారు. ఒకడు సినిమాలలో చేరాడు.
అందుబాటులో ఉన్న వాణ్ణి ఒకసారి కల్సింది. నిర్లజ్జగా వంటిని ఆబగా చూస్తూనే మాటాడాడు. ‘నాతో ఓ వారం రారాదూ?’ అని అడిగాడు. తల ఊపింది.
ప్రయాణంలో ఒక చోట ఆగారు. అక్కడ అవకాశమూ దొరికింది.
పూర్తి ఆనందాన్ని వానికిచ్చింది. అదమరచి వాడు నిద్రలో ఉండగా కత్తితో తలను మెండెం నుంచి వేరు చేసింది.
చచ్చేపుడు వాడి ముఖంలో కనిపించిన వికృతపు మార్పులో పిల్లాడి పోలిక కనిపించింది.
కసి తీరక నాల్గయిదు సార్లు చచ్చినవాన్ని చీల్చింది.
ఇంటికి చేరి ఈ పోరడ్ని చర్చి ముందు వదలి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
జైలు కెళ్లింది.
అలా వదిలిన వాడే ఫాదర్ దగ్గర పెరిగాడు.
చిన్నతనాన తండ్రి ఎవరో ‘తెలిస్తే బాగు’ అనుకున్నాడు.
జైలుకెళ్లి తల్లి అన్న దాన్ని అడిగాడు.
పెదవి విప్పలేదు.
రిజిష్టరులో మాత్రం ఈ సృష్టికి మూల పురుషుడైన బ్రహ్మను తండ్రిగా వ్రాసాడు. బ్రహ్మదేవుని సంతానంగా ఫాదర్ అండలో పెరిగిన వాడే జాన్ రాముడు.
వయస్సు వచ్చినప్పటి నుండి మారాడు.
ఆ మార్పులో బాలాజీ అనే వ్యాపారి తగిలాడు.
వెంట తీసుకెళ్లాడు.
బాలాజీ భార్య తులసమ్మ అమ్మోరిలా దేవుళ్లగా కనపడింది.
అనుకోనకుండానే దండం పెట్టాడు.
‘ఇక మనతోనే ఉంటాడు’ అని చెప్పి ఆవిడకు అప్పగించాడు.
దగ్గరకు పిలిచి ‘నీ పేరు’ అని అడిగింది.
‘రాముడు’ అన్నాడు. లోనకు తీసుకెళ్లింది.
ఆ మర్నాడు నుంచి పనిలోకెళ్లాడు.
బాలాజీది కటిక వ్యాపారం. చాలా కాలంగా అతను చేస్తున్నది.
నిత్యం పది పన్నెండు జీవాలు తెగుతాయి. అమ్ముడువుతయి. పండగా పబ్బాలనాడు ఇరవైకి తగ్గవు. బాలాజీకి చేతి క్రింద మనిషి లేని లోటును రాముడు తీర్చాడు. మొదట నమ్మకము తెచ్చుకొని, ఆనక ఇంటి మనిషిగా ఎదిగాడు.
తులసికి సంతానం కల్గకపోవడంతో ఆవిడ రాముని చూసుకుంటూ పిల్లలు లేని లోటును తీర్చుకున్నది. రెండు మూడు సంవత్సరాల కాలగమనంలో ఆ దంపతులకు సర్వస్వం అయ్యాడు.
ఊరు చానా వేగంగా పెరగడం ప్రారంభించింది.
దాంతో వ్యాపారమూ ఇంకా పెరిగింది.
రాముడు ఇంకా ఇద్దరు రోజువారీ నౌకర్లను పెట్టుకోంది వెళ్లని స్థితి వచ్చింది.
బాలాజీని తులసిని సంప్రదించి పెట్టుకున్నాడు కూడా.
నాల్గు డబ్బులూ వెనకేయడం ప్రారంభమైంది. రాముడి పేర.
తులసి ఆప్యాయతలూ అనురాగాలు చూసాక అమ్మ అనేది ఇలా ఉండాలి అనుకొన్నాడు రాముడు.
ఒకనాడు కొమరయ్య అనేటోడు ఇరవై జీవాలను తోలుకొచ్చి బాలాజీని కలిసాడు. వారికి ఎట్టాగూ అవసరమేగదా! చూసి బేరమాడి మందలో కలిపమని చెప్పి పంపాడు రాముడ్ని. వెళ్లి జీవాల్ని చూసి ఆరు వేలకు బేరం ఖరారు చేసుకొని మందలో కలిపి పైకం ఇచ్చి పంపేసాడు. ఆ మర్నాడు వరసలోనే కొమరయ్య దగ్గర తోలుకొచ్చిన జీవాలు కోతకు వెళ్లినయ్. సివారు పల్లెన పెద్ద గొల్లలు మందనంతా బేరం పెడతున్నానని కబురు చేస్తే బాలాజీయే చూద్దామని స్వయంగా వెళ్లాడు. ఊరు దాటక ముందే బాలాజీ కోసం ఓ కొత్త మనిషి వచ్చాడు.
ఏం కావాలని అడిగాడు రాముడు.
‘కొమరయ్య దగ్గర జీవాలు కొన్నరట గదా’ అనడిగాడు.
అవునన్నాడు.
‘వాటిలో ఓ గొఱ్ఱె ముక్కుకు గాటున్నది, నాదే తప్పి వచ్చింది. ఆయన గొఱ్ఱె నా దగ్గరే ఉన్నది. మీ దాన్ని మీరు తీసుకొని నా గొఱ్ఱెను నాకిప్పియ్యండి’ అని అడిగాడు.
‘కొమరయ్య వచ్చి చెప్పాలి గదా’ అన్నాడు రాముడు.
‘నా పేరు రఘుపతి. నా గొఱ్ఱె రోగిష్టిది. కుములుతోంది. నాది నాకిప్పించండి’ అన్నాడు తిరిగి.
కొమరయ్యను తీసుకురాందే కుదరదని చెప్పాడు రాముడు ఖచ్చితంగా.
‘మీకది మూడు వందలు పడితే ‘వంద’ పెచ్చిస్తాను’ అని బ్రతిమిలాడుతూ తగిలాడు రఘుపతి.
నిజానికది ఆ మూడు వందలే చేయదు. వంద దానికి ఎక్కువనే ఇస్తానంటాడెందుకు అని అనుమానించాడు రాముడు. సరైన కారణమూ అర్థం కాలేదు. అంచేత ఏది ఏదైనా కొమరయ్య రావాలి లేదా బాలాజీ వచ్చాక మాడ్లాడదామన్నాడు. తెల్లవారి రమ్మని చెప్పి పంపాడు.
బాలాజీ రాగానే అయ్యా అని జరిగింది చెప్పాడు. ఆ రాత్రికి గొఱ్ఱెను ఇంటికి తెచ్చి చూద్దామనుకున్నాడు. అయితే రఘపతి మళ్లా వచ్చాడా సాయంత్రం.
రోగిష్టిదాన్ని అమ్మకూడదు, నయమైనాక ఇద్దాంలే అన్నాడు అని చెప్పాడు.
బేరం ఖరారే గదా అన్నాడు రఘపతి.
‘ఆ వేళనే ఖరారు చేసుకొనడం. ఇవ్వాడమూను. ఇప్పుడెందుకు’ అని నడిచాడు.
రఘుపతి ఈ మారు ఆందోళన పడుతున్నటు కనిపించాడు.
‘ఎల్లుండి వస్త’ అని పైకం ఇంకో వంద అధికంగా చేతిలో పెట్టాడు.
ఎంత అక్కరలేదన్నా వినక వెళ్లిపోయాడు.
రాముడు రాత్రయ్యే సరికి కొమరయ్యని కలిసి రఘుపతి సంగతి చెప్పాడు.
‘నేను రఘుపతి అన్నోడి దగ్గర కొనలేదు వాటిని. అసలా పేరు గలవాడెవడూ నాకు తెలవదు’. అని చెప్పి ‘రాత్రి పూట మంద జాగ్రత్త. ఎత్తుకెళ్లగలరు’ అని హెచ్చరించాడు.
ఇంటికి చేరాడు రాముడు. బాగా రాత్రయ్యాక బ్యాటరీ లైటుతో ముక్కు దగ్గర గాటున్న గొఱ్ఱెను చూసాడు. కడుపులో నొప్పట్లుంది. కునారీలుతూ కనపడ్డది. ముక్కుతోంది. మందకు మలిపే ఎల్లమంద వచ్చి ‘అన్నా మన జీవాలపైన దొంగలు పడ్డరే. కుక్కల్ని ఉసిగొలిపి వెంట పడితే పారిపోయిండ్రు’ అని చెప్పాడు.
ఎల్లమందకి అన్నం పంపుతానని చెప్పి గొఱ్ఱెను ఎత్తుకుని ఇంటికి చేరాడు.
వసారాన దాన్ని ఆపి పటకా కత్తి తెచ్చి మూడు తుండాలుగ నరిగాడు. పేగు పొట్టన రాళ్లు తగిలినట్టనిపించింది. పరీక్షగా చూసాడు. పేగుల్లో నిజంగనే రాళ్ల లెక్క గట్టిగా అనిపించినయి. వలచాడు. రాళ్లు కావవి బంగారపు కాసులు. వెనకటి మొహారీలు. దాదాపు రెండొందలు. బయటికొచ్చాయి. వాటిని కడిగి భద్రంగ గురిగిలో పోసి గాది నున్న బియ్యంలోకి అడుగన పెట్టి పైన కమ్మాడు. తోలు వలిచి దట్టాన్ని దాచి వేసి పడుకున్నాడు. తెల్లారగట్ల దాన్ని కొట్టుకు పంపాడు.
తెల్లారాక ఎల్లమంద వచ్చాడు.
రాత్రి వుషారు లేదని, నెగడేసుకొని కూర్చున్నానీ చెప్పాడు.
‘రాముడేడి’ అడిగాడు బాలాజీ.
‘కొట్టేపు పోయిండేమో’ అన్నది.
‘రాత్రి తెచ్చిన గొఱ్ఱె కనపడదేం?’ అడిగాడు.
‘తమ్మే ఊడి ఉందియ్యా. రాముడు చూసాడో లేదో’ అని, ‘మందేపు ఇరిపోయుంటది. అంజగాణ్ణి తోలినలే, నువ్వు మొఖం కడుగు’ అన్నది తులసెమ్మ.
‘దాన్ని అమ్మినన్నడు గదా, ప్రొద్దుటే వాడొస్తే పరువుపోదు’ అన్నాడు బాలాజీ.
‘మందల ఉంటే గద అమ్మోది. దొంగలెత్తుకపోయాక తెచ్చి అప్పగిస్తావా ఏంది?’ అని నవ్వి, ‘ఇంత సద్ది తిని పిల్లడికి తోడుగ కొట్టుకు పో’ అని కసిరింది.
తలగోక్కుంటూ ఆగిపోయాడు బాలాజీ.
అనుకున్నట్టుగానే రాముడు మర్నాడు ప్రొద్దుటానే వచ్చాడు.
జీవాన్ని పట్టెయ్యపోతి అంటూ…
‘నిన్నటి నుంచీ దానికోసం వెతకలేక చస్తన్నాం’ అన్నాడు అక్కడే ఉన్న ఎల్లమంద.
‘అసలు నువ్వు ఉంచమనకపోతే నిన్ననే సొమ్మయ్యేది నాకు, దండగ గొఱ్ఱె’ అని బాలాజీ రఘుపతి పైకం వాని చేతిలో పెట్టాడు.
‘పోయిందా? ఏడపోయింది?’ అంటూనే చతికిలపడిపోయాడు రఘపతి.
‘ఏమయిందరయ్యా ఏందీ?’ అంటూ ఇన్ని నీళ్లు ముఖాన చల్లాడు ఎల్లమంద.
రాముడొచ్చి కూర్చుని మంచినీళ్లు త్రాగించాడు.
ఇంతలో జీపొకటి వచ్చి బాలాజీ ఇంటి ముందు ఆగింది.
‘రఘుపతి’ అంటూ వచ్చి, ‘ఏమయిందిరా?’ అని ‘డాక్టరు దగ్గరకు తీసుకుపోతాం’ అంటూ ఎక్కించుకొని పోయారు.
ఆ పోకడ వారం దినాలదాకా ఎక్కడ జాడలేదు.”
(ఇంకా ఉంది)