నవ్య సంప్రదాయోద్యమం: విశ్వనాథ భూమిక

0
3

(10 సెప్టెంబరు 2022న శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా, డా. జి. వి. సుబ్రహ్మణ్యం రచించగా, యువభారతి ప్రచురించిన ‘విశ్వనాథ నవ్య సంప్రదాయం‘ అనే పుస్తకంలోని వ్యాసాన్ని ప్రత్యేక వ్యాసంగా పాఠకులకు అందిస్తున్నాము.)

[dropcap]స[/dropcap]మాజం ఆచరించటానికి యోగ్యమై అర్థవంతమైన అవగాహనతో కూడుకొన్న ఒక జాతియొక్క సజీవ విజ్ఞానం సంప్రదాయం,. సంప్రదాయం లేని సమాజం ఉండదు, ప్రవాహం లేని నదిలాగా. అయితే, సంప్రదాయం ఆచరణ స్థాయిలో సామాన్య ప్రజాజీవితంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆచరణ వెనుక అవగాహనను రక్షించుకొనే స్థాయి మేధావి వర్గంలో గోచరిస్తుంది. ప్రపంచ జాతుల సంప్రదాయ ధారల్లో ప్రదర్శితమయ్యే ప్రగతి పథాలను పరిశీలించి తమ జాతి జీవన విధానానికి అనువైన వానిని సంవదించుకొనే వినూత్న ప్రయత్నాలను చేసే దార్శనికులలో సంప్రదాయం సజీవంగా ముందుకు సాగుతుంది. సంప్రదాయం సజీవ విజ్ఞానరూపం కాబట్టి దర్శనం దాని జీవశక్తి, దర్శనం జీవితానికి కొత్త వ్యాఖ్యానం. పాత విలువలతో కొత్త విలువలకు సమన్వయం. ఈ సమన్వయంలో పాత కొత్తలకు అన్వయం చెప్పటంలో, ఆచరణయోగ్యతను సాధించటంలో దార్శనికుల నడుమ మేధావుల మధ్య సంఘర్షణలు రావచ్చు, అభిప్రాయభేదా లేర్పడవచ్చు, సిద్ధాంత రాద్ధాంతా లేర్పడవచ్చు. ఇవన్నీ పాత కొత్తల మేలు కలయికగా రూపొందే సంప్రదాయ ధారకు అవగాహనతో కూడుకొన్న సమన్వయాన్ని అందించటానికి దార్శనికులు, మేధావులు చేసే విజ్ఞానమయ వివేచనమే. దార్శకుల నవ్య దర్శనమో సమన్వయమో మొదట మేధావి వర్గంలో ఇంకాలి. వారు వాటి వ్యాఖ్యానం చేసి నిత్య జీవితానికి,  ఆచరణకు వినియోగపడేటట్లుగా సామాన్య ప్రజలకు వినిపిస్తారు. తాము ఆచరిస్తున్న ఆచరణలకు అర్థం మారిందని తెలిస్తేనో, అర్థం లేదని తెలిస్తేనో కాని ప్రజలు తమ ఆచారాలను మానరు. ఈ మూడు పొరల్లోనూ సంప్రదాయం ప్రవహిస్తుంది. అయితే, దార్శనిక విజ్ఞానంగా ఉండే సంప్రదాయం జాతి జీవనానికి తాత్త్విక భూమిక. అర్థవంతమైన అవగాహనగా పరివర్తనం చెందే దార్శనిక విజ్ఞానం ఉద్యమ భూమిక. ఆచరణ యోగ్యమైన సమాజ జీవన పద్ధతిగా మారే అవగాహన సమాజ వాస్తవ చేతన. తాత్త్విక భూమిక సమాజ చేతనలో  వాస్తవాచరణంగా మారటానికి కొంత కాలం పడుతుంది. మొదటి పొరలోనుండి మూడో పొర దాకా సంప్రదాయం ఇంకేసరికి మొదటి పొరలోనే మరొక మార్పు రావచ్చు. అందు వలన ఈ మూడు పొరలలో ఐక్యత, ఏకవాక్యత అనేవి ఒక నిర్దిష్టమైన కాలంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అలా ఉండకపోయిన కాలంలో సంప్రదాయం సమాజంలో అంతస్సంఘర్షణకు గురియౌతున్నట్లు గోచరిస్తుంది. ఆ సంఘర్షణ ఆచరణపరిధిలో బలంగా ఉందే సంస్కరణోద్యమంగా రూపొందుతుంది. అవగాహన పరిధిలో గాఢంగా గోచరిస్తే అభినవప్రయోగోద్యమంగా ఆవతరిస్తుంది. విజ్ఞానపరిధిలో సిద్ధాంతాల ప్రమాణాలతో జీవితాన్ని విలువకట్టే తాత్విక సూత్రాన్వేషణోద్యమంగా వెలువడుతుంది. మూడు పొరల్లో నిండి ప్రవహించే సంప్రదాయం కొన్ని యుగాలు జాతి జీవనాన్ని శాసిస్తుంది. కాని, మార్పే సంప్రదాయానికి మనుగడనిచ్చేది; కూర్పే క్రొత్తదనాన్ని అందించేది.

జాతి జీవనంలాగానే సాహిత్య జీవితంలో కూడా సంప్రదాయం అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూనే ఉంటుంది. సాహిత్యదర్శనం సంప్రదాయ తాత్త్విక భూమిక. వివిధ ప్రయోగాల ద్వారా సాహిత్యదర్శన కళాత్మక వ్యాఖ్యానం ఉద్యమభూమిక. ఉద్యమభూమిక ద్వారా అందే అవగాహన ప్రాతిపదికతో కళాత్మక విలువలను అనుశీలించే విమర్శ విధానం ఆచరణభూమిక. సాహిత్య రంగంలో ఒక క్రొత్త రచన వెలువడిందంటే ఒక క్రొత్త విలువ పొటమరించిందన్నమాట. దాని వెనుక ఒక ఆవగాహనకాని, సమన్వయంగాని దృక్పథంగాని తత్త్వంగాని, దర్శనంగాని తప్పక ఉండి ఉంటుంది. దానిని గ్రహించి వ్యాఖ్యానించినప్పుడే ఆ క్రొత్త రచన అందించే విలువ యొక్క రుచి అవగతం అవుతుంది. ఆ విలువ సంప్రదాయంలో – అంటే సాహిత్య ప్రస్థాన ప్రగతిలో – ఒక ఘట్టంగా, ఒక పరిణామంగా, ఒక వికాసంగా అన్వయింపబడేంతవరకు సిద్ధాంత రాద్దాంతాలు తప్పవు. అవగాహన కుదుటపడితే ప్రయోగం సాహిత్య సంప్రదాయంలో – సాహిత్య సజీవదర్శన విజ్ఞానంలో ఒక భాగంగా కుదురుకుంటుంది. ఆలా కుదురుకొనకపోతే సాహిత్య ప్రయోగం జాతి అనుభవంలో ఇమడ లేదు. కొన్నాళ్ళు కొత్తగా కనపడ్డా కొద్దికాలంలోనే కనుమరుగై పోతుంది. కాబట్టి సంప్రదాయంలో సమన్వయం పొంది సజీవంగా సంప్రదాయాన్ని సాగింపగలిగిందే వినూత్న ప్రయోగం. టి.ఎస్.ఎలియట్ మాటలు గమనింప దగినవి. “The existing order is complete before the new work arrives; for order to persist after the the supervention of novelty, the whole existing order must be, if ever so slightly altered, and so the relations, proportions, values of each work of art towards the whole are readjusted: and this is conformity between the old and the new” (1). గతానికి వర్తమానికి మధ్య జరిగే ధ్రువీకరణమే సజీవ సంప్రదాయ ప్రగతి. ప్రగతి నెంత సాధించినా సంప్రదాయం జాతిజీవలక్షణాన్ని కోల్పోదు; కోల్పోరాదు.

ఆధునికాంధ్ర సాహిత్యరంగంలో వినబడే సాహిత్య పారిభాషిక పనిలో సంప్రదాయవాదం, నవ్యసంప్రదాయ వాదం అనేవి సంప్రదాయానికి అనుకూలమైనవి గానూ; కాల్పనిక వాదం, అభ్యుదయవాదం, విప్లవ వాదం మొదలైనవి సంప్రదాయానికి విరుద్ధమైనవిగానూ కనపడుతూ ఉన్నాయి. వీటిలో నవ్యసంప్రదాయోద్యమంలో కవిత నిర్వహించిన పాత్రను సమీక్షించటం ఈ వ్యాస తాత్పర్యం.

ఇంగ్లీషులో ‘నియో క్లాసిజమ్’ అనే పదానికి సమానార్ధకంగా తెలుగులో ‘నవ్య సంప్రదాయవాదం’ అని కొందరు వ్యవహరిస్తున్నారు. కాని, ఈనాడు ఆ అర్థంలో ఆ పారిభాషిక పదం రూఢికెక్క లేదు. కాల్పనిక కవితాయుగ చైతన్యం నుంచి విడివడి విశ్వనాథ సత్యనారాయణగారు 1933 – 34 ప్రాంతంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం రచించటం ప్రారంభించిన నాటినుంచి నవ్య సంప్రదాయోద్యమం ప్రారంభమైనట్లు విమర్శకులు భావిస్తున్నారు. అయితే ఈ మాట దాదావు 1982 తరువాతనే ప్రచారంలోకి వచ్చింది. అంతకు పూర్వం సంప్రదాయోద్యమమనే అనేవారు. ఈ మాటకు ప్రాచుర్యం కలిగించింది విశ్వవిద్యాలయాచార్యులే అనుకుంటాను. ఆధునికాంధ్ర సాహిత్య ధోరణులను, ఉద్యమాలను వివేచించి, వాటి స్వభావాలకు అనుగుణంగా ఉండే పేర్లను పెట్టాలనే ప్రయత్నంలో 1933 – 34 నుంచి శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’తో ఆభ్యుదయ కవిత్వోద్యమం రూపుతాలిస్తే, విశ్వనాథ కల్పవృక్షం రచనతో నవ్యసంప్రదాయ  కవిత్వోద్యమం బలపడట్లు సమన్వయించటం జరిగింది. శ్రీమద్రామాయణ కల్పవృక్ష రచనం 1961 దాకా సాగింది. అదే కాలంలో అభ్యుదయ కవిత్వోద్యమం పుట్టటం, పెరగటం, విరగటం కూడా జరిగింది. నవ్యసంప్రదాయ ప్రయోగాలు నేటికీ సాహితీక్షేత్రంలో సజీవంగా సాగుతున్నవని చాలమంది అంగీకరిస్తున్నారు. నియోక్లాసిజమ్‌ను నవీన ప్రబంధోద్యమమనీ, నవ్య కావ్యదృక్పథమని పిలిచేవారు కొందరున్నారు. అయితే, నవ్యసంప్రదాయోద్యమం అనే పదం నియోక్లాసిజమ్‌కు అనువాదం కాదు. అది స్వతంత్రంగా రూఢికెక్కిన పారిభాషిక పదం.

ఇంగ్లీషు సాహిత్యంలో వచ్చిన నవ్య సంప్రదాయ యుగానికి, తెలుగులో వచ్చినదానికి స్వరూప స్వభావాల్లో సామ్యం కొంత ఉన్నా భేదమే విశేషంగా గోచరిస్తుంది. ఇంగ్లీషులో నవ్యసంప్రదాయ యుగం రెస్టోరేషన్ యుగం తరువాత 17వ శతాబ్ది చివరి నుంచి 18వ శతాబ్ది చివరిదాకా ప్రవర్తిలింది. దాని తరువాత కాల్పనిక కవిత్యోద్యమం వచ్చి, 19వ శతాబ్ది పూర్వపాదంలో తన ప్రత్యేకతను ప్రదర్శించింది. కాల్పనిక కవిత్వోద్యమానికి ప్రతిగా విక్టోరియన్ సాహిత్య యుగ చైతన్యం 19వ శతాబ్ది పూర్వార్ధంలోనే మొదలై, ఆ శతాబ్ది చివరిపాదందాగా సాగింది. కాగా, తెలుగులో నవ్యసంప్రదాయ కవిత్వోద్యమం భావకవిత్వయుగం తరువాత సాగింది. ఈ చారిత్రిక సత్యం నవ్వసంప్రదాయ కవిత్వోద్యమంలోని కొన్ని విలువలను వివేచించటానికి తోడ్పడుతుంది.

నవ్యసంప్రదాయ కవితా చైతన్యం, కాల్పనిక కవితా చైతన్యం ప్రాచుర్యం వహించిన ఆయా కాలాలను సాహిత్య చరిత్రలో వేరు వేరు యుగాలుగా పరిగణించే పద్దతిని కొందరు అంగీకరింపరు. అవి రెండూ పరస్పరం ప్రత్యర్థులుగా సాహిత్యంలో సదా సాగుతూ ఉండే శక్తిమంతాలైన చైతన్యాలని వారు పేర్కొంటారు. “There are many people who think of Neo-classic and Romantic as terms standing for ideas rather than fixed periods, as representing the great polar opposites of English poetry, irrespective of dates, literary movements or eras. Most critics, however, prefer to limit the application of the terms to specific periods to believe that it is possible to isolate some major aspects of the theory of Neo – classic poetry which set the poetry in sharp and essential contrast that of two generations of romantic poets” (2) అని యుగ  వివేచనాన్ని సమర్థించే వారూ ఉన్నారు.  తెలుగు విమర్శకులందరూ దాదాపు పై రెండో అభిప్రాయాన్నే బలపరుస్తున్నారు.

తెలుగులో ‘సంప్రదాయ కవిత్వం’ Traditional Poetry అనే అర్థంలో వాడబడటం లేదు. Classical Poetry అనే అర్థంలో వాడుతున్నాం. సంప్రదాయవాదం అంటే క్లాసిసిజం అనే చెప్పుకోవాలి. ‘క్లాసిక్’ అంటే ప్రథమశ్రేణి అనీ, ఆదర్శస్థాయి అని మొదట్లో ఆర్థం ఉండేది. ఏ ప్రక్రియలోనైనా ప్రయోగం జరిగినప్పుడు దాన్ని అనుశీలించటానికి ‘క్లాసిక్ ఫారమ్’ను ప్రమాణంగా గ్రహించటం సంప్రదాయ మార్గం. ప్రాథమిక ప్రయోగం నుంచి పరిణత ప్రయోగం దాకా పరిణతిని సాధించే పద్ధతి గాని, ఆదర్శరూపం నుండి ప్రక్రియ వైవిధ్యాన్ని సాధించే ప్రయోగాలను నిర్వహించే పద్ధతిగాని సంప్రదాయ మార్గంలో సాధారణంగా గోచరిస్తుంది. స్థూలంగా మొదటి పద్దతిని సంప్రదాయ మార్గమనీ, రెండవ పద్దతిని నవ్యసంప్రదాయ మార్గమని పేర్కొనవచ్చు.

ప్రాచీనాంధ్ర సాహిత్యంలో కావ్య ప్రక్రియకు క్లాసిక్ రూపం ప్రబంధం. దానిని తెలుగు కవులు యుగ యుగాల ప్రయోగాలతో పదహారో శతాబ్దిలో సాధింపగలిగారని విమర్శకులు వివేచించడం ప్రసిద్ధమే. నన్నెచోడుని నుండి క్రమంగా పరిణతి చెందిన ఆ ప్రక్రియా వికాసం ఆయాకవుల కవిత్వోద్యమ స్ఫూర్తితో ఆదర్శస్థాయికి అందుకోగలిగింది. ఇలాగే ఒక్కొక్క ఆరంభం ఉంటుంది. ప్రయోగ వికాసదశ ఉంటుంది. పరిణతరూప సాధన దశ ఉంటుంది. ఆ వికాసం వెనుక ఆయా కవులు ఆ ప్రక్రియను దర్శించిన సాహిత్య దృక్పథాల ప్రత్యేకతలు కూడా ప్రత్యక్షమౌతూ ఉంటాయి. వాటికి సంబంధించిన అవగాహనను, అనుశీలనను, ఆదర్మరూప సాధనను సంప్రదాయోద్యమ మంటారు. ఒక్కొక్క ప్రక్రియ వెనుక ఒక ఉద్యమం ఉన్మీలిత మౌతుంది.

కావ్యనాటక ప్రబంధేతిహాసాలవంటి బలమైన సాహిత్య ప్రక్రియలు మాత్రమేకాక శతక దండకాలవంటి సాధారణ ప్రక్రియలు కూడా సాహిత్యంలో  ఉన్నాయి. వీటిల్లో క్లాసిక్ రూపాలు వున్నా ఆదర్శ శిఖరాల్లాగా ఉండవు. అయినప్పుడు ఆ ప్రక్రియల్లోని ప్రయోగాలను నిర్మించే యత్నాన్ని ధోరణిగా పేర్కొనవచ్చు. అంటే, తెలుగులో ప్రబంధ కవిత్వోద్యమం, శతక రచనాధోరణి ఇలా ఉండటం సహజమన్న మాట. సంప్రదాయంలో ఉద్యమం ఏమిటి అనేవారున్నారు. అది  అర్థం లేని ప్రశ్న. తాత్త్వికభిత్తిక ఉన్న ఏ ప్రయోగ ప్రయత్నమైనా ఉద్యమ స్ఫూర్తిని పొందగలుగుతుంది. ధ్వని ప్రస్థానంలో కవిత్రయం సాధించిన కావ్యేతిహాసకవిత్వోద్యమం మూడు శతాబ్దాలు సాగింది. శృంగార రసోన్ముఖమైన రీతి ప్రస్థానం శ్రీనాథునిలో మొలకెత్తి ఒక శతాబ్దం కవిత్వాన్ని ఉర్రూత లూపింది. భక్తి కవితాప్రస్థానం పాల్కురికితో మొదలై పోతన్నలో క్లాసిక్ రూపాన్ని అందుకోగలిగింది. వక్రోక్తి  ప్రస్థానం ప్రేరణగా సాగిన ప్రబంధకవుల వివిధ ప్రయోగాలు ప్రౌఢ కవితావతారాలుగా రెండు శతాబ్దాలు తమ మనుగడను సాగించి కొన్ని క్లాసిక్ రూపాలను అందించగలిగాయి. సంప్రదాయవాదానికి సాహిత్య సిద్దాంతం తాత్త్విక భూమిక ; ప్రయోగం ప్రగతి; క్లాసిక్ రూపం గమ్యం.

హోమర్, వర్జిల్, డాంటే, షేక్‌స్పియర్, వాల్మీకి, వ్యాసుడు, భవభూతి, నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథుడు, పోతన మొదలైనవారు ఆయా భాషా సాహిత్యాల్లో ప్రథమశ్రేణి కవులు, వారి రచనలు క్లాసిక్సు. ఆ రచనలను ఆధారంగా చేసికొని తరువాతి వారు కొన్ని సాహిత్య సిద్ధాంతాలనూ, సూత్రాలనూ ఏర్పరచుకొంటారు. వాటి ననుసరించి రచింపబడినవి ‘నియోక్లాసిక్’ రచన లనిపించుకుంటాయి. ఈ భేదాన్ని నవ్యసంప్రదాయ కవితోద్యమాన్ని వివేచించేటప్పుడు విన్మరించటానికి వీలు లేదు. కాని, విమర్శకులు కొందరు ఈ వివేచనాన్ని అంత సూక్ష్మంగా పాటించటం లేదు. “The great Neo-classic poets are fundamentally conservatives and traditionalists”(3) అనే ధోరణితో నవ్యసంప్రదాయకవులు నవ్యతను సాధించలేరనీ, గతానుగతికమైన రచనను నిర్వహిస్తారని భావించి వారిని పరిగణనలోకి తీసికోరు. దానికి కారణం ఆ ఉద్యమాన్ని గురించిన సరియైన ఆవగాహన వారికి లేక పోవటమే.

కాల్పనిక కవితాయుగ కవికి, నవ్యసంప్రదాయ కవితాయుగకవికి ఉండే భేదాన్ని తెలుసుకోవటానికి శ్రీ వడలి మందేశ్వరరావుగారి ఈ మాటలు తోడ్పడతాయి. “రొమాంటిస్టు ఎలాగైనా స్వేచ్ఛాప్రియుడు. వెనుకటి బంధనాలను ఊడ్చుకుంటాడు. శృంఖలాలను తెంచుకోవటం అతని కవసరం. అతని నూతన ఆలోచనలు వెనుకటి మూసలలో ఇమడవు. అందుచేత గతంతో అతను తెగత్రెంపులు చేసుకోవాలనుకుంటాడు. క్లాసిసిస్టు అలా అనడు పైకి. సంప్రదాయవాదిలా కనపడతాడు. స్వేచ్ఛను కోరుతున్నట్టే కనపడడు, కాని, వెనుకటి కవులు చూపిన బాటను సునిశితంగా పరిశీలిస్తాడు. ఆ మార్గాన్నే పయనించినట్లు కనపడతాడు. కాని, ఆ మార్గాన్ని విస్తృత పరుస్తాడు. వెనుకటి ఛందస్సుల్ని అంగీకరించినట్లు కనపడతాడు. అందులో కొత్త లయను ప్రవేశ పెడతాడు. వెనుకటి అలంకారాలనే వాడినట్లు కనపడతాడు. కాని, ఇతని శబ్దచిత్రాలు కొత్తగా ఉంటాయి. కాని, ఇవన్నీ బాహ్య స్వరూపానికి సంబంధించినవి. క్లాసిసిస్టును నిక్కచ్చిగా పట్టి ఇచ్చేది అతని ఆలోచనా విధానం, శిల్పదృష్టి, లోచూపు. సంప్రదాయంమీద తిరగబడినా, అనుసరించినా అతని ఆలోచనా విధానం విశ్లేషణను ఆకర్షిస్తుంది; శిల్పదృష్టి అకుంఠితంగా ఉంటుంది; లో చూపు లోకానికి ఉపకరించేది అవుతుంది.” (4) ఈ మాటలు తెలుగులోని నవ్య సంప్రదాయవాద కవులకూ, విశేషించి విశ్వనాథకూ తప్పక అన్వయిస్తాయి.

“నేను ఏమి వ్రాస్తానో నేను తెలుసుకొని వ్రాస్తాను. అనాది నుంచీ ఈ దేశంలో  ఒకటి జ్ఞానం అనిపించుకుంటూ వస్తున్నది. ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి, నేను సఫలుణ్ణయి, వాళ్ళను జ్ఞానవంతులను చేస్తున్నాను అనే భావం నాకు ఉన్నది. ఈ భావం ఉన్న వాళ్ళు చాలమంది ఉన్నారని నాకు తెలుసు.. పూర్వ సాహిత్యం ఒకటి ఉన్నది.. నేను పోతే నాతో పోయేవాళ్ళు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన్న, పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు మొదలైనవారు” (5) అని చెప్పుకున్న విశ్వనాథ ప్రాచీనాంధ్ర కవుల ప్రమాణాలను గౌరవిస్తూనే తనదైన మహాకావ్య రచనను చేపట్టిన నవ్య సంప్రదాయయుగ చైతన్యమూర్తి,

నవ్య సంప్రదాయ యుగకర్త విశ్వనాథ. ఆయన ఇంగ్లీషు సాహిత్యం లోని నవ్య సంప్రదాయయుగ కవులకంటె, విమర్శకులకంటె, విక్టోరియన్ యుగకవుల సాహితీ ధోరణికి సన్నిహితుడుగా కనపడతాడు. జీవితాన్ని ఉదాత్త నైతిక తాత్త్విక కళాదృక్పథంతో దర్శించి భావించటమే కవుల ధర్మమనీ, కవిత్వం ద్వారా సమాజంలో శాశ్వత నైతిక ప్రమాణాల విలువలు  పునరుద్దరింపబడాలనీ, ఉత్తమ కావ్యేతివృత్తాలు, ఉదాత్త శైలి కవితకు అత్యవసరమనీ తలంచిన విక్టోరియన్ యుగకవుల దృక్పథాలు విశ్వనాథలో కనపడతాయి. శ్రీ ఆర్.ఎస్. సుదర్శనం గారన్నట్లు “కాల్పనికోద్యమ ప్రభావంతో ప్రారంభమైన విశ్వనాథ సత్యనారాయణ సాహితీ కృషి అనతికాలంలోనే ఆ ప్రభావాన్ని అధిగమించి, ఆయన యేర్పరచుకొన్న విశిష్ట దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ పరిణితి చెందింది. ఆయన ప్రతిభ భావనాత్మకమే కాదు ఆలోచనాత్మకం కూడా. ఆపైన ఆధిభౌతిక దర్శన శక్తి (Capacity for spiritual insight) ఒకటి ఆయన భావనకు, సామాన్యంగా కాల్పనికయుగ రచయితలకు లేని, తత్త్వపరిపూర్ణతను ఇచ్చింది.”(6)

తెలుగులో కాల్పనిక యుగ చైతన్యానికి వ్యతిరేకంగా నవ్యోద్యమాలకు రెండింటికి శ్రీకారం చుట్టినవారు శ్రీశ్రీ, విశ్వనాథ. వీరిద్దరూ సమాజంలోని రెండు ప్రవృత్తులకు ప్రతినిధులుగా నిలిచారు. వీరిద్దరూ కవితలను సమాజం కోసమే వ్రాశారు. సమాజం చైతన్యాగ్నివంటిది. సాహిత్యానుభవం కోసం పంచజిహ్వలతో అర్రులు చాస్తూ ఉంటుంది. వాస్తవ, కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మికానుభూతుల కొరకై సమాజం తన కామనను వ్యక్తం చేయటమే ఆ పంచజిహ్వల ప్రవృత్తి. ఆ పంచజిహ్వలతో ఆస్వాదించే కళానుభవమే పరిపూర్ణం, సమగ్రం. సమాజానికి సమగ్రానుభవాన్ని అందించటమే ఒక్కొక్క సాహిత్యయుగధర్మం. అయితే సమాజం ఒక్కొక్కసారి ఒక్కొక్క జిహ్వ కనువైన అనుభూతి కోసం తీవ్రయత్నం చేసిన ఘట్టాలు కూడా చరిత్రలో కనపడతాయి. ఒక కాలంలో సమాజం వాస్తవ దృక్పథాన్ని పెంచుకుంటుంది. మరొక కాలఖండంలో కాల్పనికతను వరిస్తుంది. మరొక తరుణంలో జీవ చైతన్యశక్తినీ, అలాగే మరికొన్ని కాలాల్లో హేతువాదాన్నీ, భక్తినీ, ఆధ్యాత్మికానుభవాన్నీ వాంఛిస్తుంది. వాటికి తగిన ప్రేరక శక్తులు ఆయా కాలాల్లో బలంగా పుంజుకోవటం చూస్తుంటాం. ఒక కాలంలో  ఒక చైతన్యం ఉవ్వెత్తుగా పొంగుతున్నప్పుడు, దానిని కవులు పోషిస్తూ ఒక ధోరణినో, ఒక ఉద్యమాన్నో సాగిస్తున్నప్పుడు – సమాజ చైతన్యం లోని మరో భాగంగా ఉండే తదితర ప్రవృత్తులు బలహీనంగా ఉన్నా చచ్చిపోవు. తమ శక్తులను కూడగట్టుకోవటానికి మందంగానో లేదా తీవ్రంగానో; వ్యక్తంగానో లేదా అవ్యక్తంగానో కృషి చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఆ శక్తులన్నింటికీ ప్రతినిధిగా ఒక రచయితో, లేదా కొందరు రచయితలో తమ ప్రయత్నాలను బలంగా సాగించవచ్చు ఇటువంటి పనే అభ్యుదయ కవిత్వోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే విశ్వనాథ సత్యనారాయణగారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం రచిస్తూ, మేరువులా సాధించిన నవ్య సంప్రదాయ యుగసిద్ధి.

సమాజ సాహిత్యానుభూతిని దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్ష రచనా పరమార్థం మరింత స్పష్టంగా గోచరిస్తుంది. కాల్పనిక కవితాయుగంలో వెలసిన వివిధ కవితా శాఖలూ, కవుల రచనల్లో గోచరించే వివిధ ధోరణులూ – ఆ కాలంలోని సమాజ ప్రవృత్తి కాల్పనిక చైతన్యం ద్వారా ఒక సమగ్రానుభూతిని పొందాలని యత్నించినట్లు నిరూపిస్తున్నాయి. గురజాడ కాల్పనిక చైతన్యంలోని వాస్తవికతా ప్రవృత్తిని పోషించాడు. రాయప్రోలు వారు అమలిన శృంగార సిద్ధాంతం ద్వారా వైజ్ఞానికానుభవస్పూర్తిని కాల్పనిక యుగ చైతన్యానికందించారు. హేతువాదులు కూడా ఇటువంటి ప్రవృత్తిని పోషించినవారే. ప్రణయతత్త్వశాఖను పూయించిన కవులందరూ జీవచైతన్యానుభూతిని కాల్పనిక ప్రవృత్తికి పోషకంగా అనుసంధించారు. దేశభక్తి, మధుర భక్తి ప్రవృత్తులు ఆధ్యాత్మికానుభవంలోని అభినవరుచుల నందిస్తూ కాల్పనిక చైతన్యానికి ఒక సమగ్రతనాపాదించాయి. ఇలా భావకవిత్వయుగంలో కాల్పనిక చైతన్యం కేంద్రంగా చేసికొని సమాజం సమగ్రానుభవసిద్ధిని సాధించింది.

విశ్వనాథ సత్యనారాయణగారు ఈ స్థితిని సమీక్షించి, అంతకంటె ఒక అడుగు ముందుకువేసి పంచవిధ ప్రవృత్తుల ద్వారా సమాజం పొందే కళానుభవాన్ని సమాహారరూపంగా అందింపగలిగిన ఒక మహాకావ్యాన్ని రచించటానికి పూనుకున్నారు. రామాయణ కల్పవృక్షం పేరుకు తగ్గట్టు సమాజం కాంక్షించే వాస్తవిక కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మికానుభవాల సంపుటిని అందింపగలిగిన విశిష్ట రచన. ఆయన జీవుని వేదన సమగ్ర కళానుభూతి కోసం సమాజ జీవచైతన్యం వ్యక్తం చేస్తున్న ఆవేదన, పంచజిహ్వల సమాజచేతనకు విశ్వనాథ వారు అందించిన అమృత నైవేద్యమే, అనుభవ కోశమే శ్రీమద్రామాయణ కల్పవృక్షం.

ఆ కావ్యంలోని సన్నివేశాలూ, పాత్ర స్వభావాలూ సమాజంలో కానవచ్చే వాస్తవ జీవిత వృత్తాలకు ప్రతిబింబాలుగా ఉండటం వల్ల వాస్తవానుభవాన్నీ, కాల్పనిక చైతన్యంతోనూ కల్పనా మహనీయ విశేషాలతోనూ పద్యాల్లో వ్రాసిన నవలా అన్నట్లు పఠితలను రమింపచేయటం వలన కాల్పనికానుభవాన్నీ, భారతీయ తత్త్వశాస్త్ర మర్యాదధారతో అందులోనూ అద్వైత మత దృష్టితో – రామకథా తత్త్వాన్ని వ్యాఖ్యానించటం చేత జ్ఞానానుభవాన్నీ, జీవవేదనా భరితమైన ఆ కావ్యమంతా జీవ చైతన్య ప్రవృత్తిభరితమై ఉండటం చేత రసానుభవాన్నీ, భక్తి కర్మ జ్ఞాన మార్గాల విశిష్ట సమన్వయంగా సాగే భారతీయ జీవన పరమార్థధార పరమ రమ్యంగా కావ్యార్థాలలో వ్యంజింపబడటం చేత ఆధ్యాత్మికానుభవాన్నీ సమాజ సమగ్రానుభవ సంసిద్ధికి అందించే శక్తిమంతమైన కావ్యంగా రూపొందింది. పరిపూర్ణ కావ్యరసానుభూతి కోసం పరితపించే సాహితీ జగత్తుకు ఉపాయనంగా అందించిన కావ్యం. నవ్య సంప్రదాయ కవితా ప్రవృత్తికి పతాక శ్రీమద్రామాయణ కల్పవృక్షం.

నవ్య సంప్రదాయవాదిగా విశ్వనాథ “రసము వేయిరెట్లు గొప్పది నవకథాదృతిని మించి” అని పునఃస్థాపింపదలచాడు. ఆధునిక యుగంలో కళానుభవాన్ని ఆస్వాదయోగ్యంగా చేయటానికి మూడు పద్ధతులేర్పడ్డాయి. వాటిని 1. ఆత్మీయీకరణమనీ, 2. సామాజికీకరణమనీ, 3. సాధారణీకరణమనీ పిలువవచ్చు. స్వాత్మీయీకరణం భావకవిత్వాన్ని ఆస్వాదించటానికి పఠిత కుపకరించే పద్ధతి. సామాజికునికి అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని ఆత్మనాయకంగా కవి కవితలో వ్యక్తీకరించటం, దాన్ని సహృదయుడు ఆత్మీకరించుకొని తాదాత్మ్యంతో అనుభవించటం అనే ప్రక్రియ ఇందులో గాఢంగా కనపడుతుంది. కాబట్టి దీన్ని స్వాత్మీయీకరణం  అని పేర్కొనటం జరిగింది. “అభ్యుదయ కవిత్వం ఉత్తేజం ద్వారా క్రియాశీలతా పర్యవసాయి లేక కార్యోత్సాహ పర్యవసాయి” (రా.రా). ఇలా పర్యవసించే పద్ధతి సామాజికీకరణం. ఇందులో కవి కవితలలో ప్రకటించే ఉద్రేక ఉత్తేజాలకంటే సహృదయుల రచన వలన పొందే ఉద్రేకానికీ, ఉత్తేజానికీ ఉద్యమకర్తవ్యాల పట్ల ఉన్ముఖీకరణానికీ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రక్రియ ఏదైనా ఈ పద్ధతిలో ఫలితం ఒక్కటే.

ఈ రెండు పద్ధతులకంటె సంప్రదాయధారగా వస్తున్న రసానుభవ విధానమే సులభమైనదనీ, ఉదాత్తమైనదనీ విశ్వనాథ నిరూపింపదలచుకున్నాడు. రససిద్ధాంతంలో సాధారణీకరణం ప్రసిద్ధం. అది కథ నాశ్రయించిన కావ్యాలకే ఎక్కువగా వర్తిస్తుంది. సామాజికానుభవ చైతన్యాని గమనించిన కవి సామాజికుల సహానుభూతిని పొందగలిగిన పాత్రలను, సన్నివేశాలను, భావాలను సంపుటీకరించి సాహితీ ప్రక్రియలను వెలువరుస్తారు. ఆ ప్రక్రియల్లో కావ్యం, ఇతిహాసం ఉదాత్తమైనవి. కావ్య పాత్రల ద్వారా వ్యక్తమయ్యే భావాలను, అనుభవాలను పఠిత సాధారణీకరణం ద్వారా స్వీయానుభవాలుగా మార్చుకొని సాత్విక చైతన్యంతో విశ్వజనీనంగా రమిస్తాడు. ఆ రమణంలోని చిత్త ద్రవస్థితియే రసానుభవం. ఇది పాతబడ్డదని భావించటం పొరపాటు. ఇది విశ్వజనీనం కాబట్టి ప్రతియుగంలోనూ బ్రతికే ఉంటుంది. తద్విరుద్దమైన ప్రయోగాలకు ప్రాబల్యం వచ్చినప్పుడు స్వీయశక్తి ప్రదర్శన కోసం అభినవాసక్తితో విజృంభిస్తుంది. అంతేతప్ప దానికి చావులేదు. పై మూడు విధాలలో అత్యంత సరళమైనదీ, శక్తివంతమైనదీ ఈ సాధారణీకరణం. నవ్య సంప్రదాయవాదికి సాధారణీకరణం పరమ ప్రమాణం. కాల్పనిక, అభ్యుదయ, విప్లవ కవిత్వాలలో పొందలేని ఈ కళానుభవస్థితికి విశ్వనాథ వారి కావ్యం కల్పవృక్షం.

శ్రీమద్రామాయణ కల్పవృక్షంలోని ఆధునిక స్పృహను గురించి విమర్శకులు వివేచన చేశారు. ఆధునిక యుగంలో మానవునికి ప్రకృతిపట్ల గల అహంకార పూరితమైన విజిగీషా ప్రవృత్తికి రావణుని పాత్ర ప్రతినిధి. ప్రకృతిపట్ల వినయ దృష్టిగల మానవునికి ప్రతినిధి హనుమంతుడు. మానవుని ఆహంకార ప్రవృత్తి వల్లనే ఈనాడు ప్రకృతి సంక్షోభం ఏర్పడుతున్నది. దానివలన ప్రపంచానికి ఎన్నో దుష్ఫలితాలు కలుగుతున్నాయి. ఆ సంక్షోభాన్ని మార్చి ప్రకృతి సమతౌల్యాన్ని ప్రతిష్ఠాపించి విశ్వశాంతిని ప్రతిష్ఠాపించాలని నేటి మానవ యత్నం. ఆ యత్నం కల్పవృక్షంలో శ్రీరాముని ప్రయత్నంగా ప్రతీకాత్మకంగా విశ్వనాథ వారు చిత్రించారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆధునిక మానవసమాజంలో ఉన్న వివిధ ప్రవృత్తులకు ప్రతినిధులుగా, ప్రతీకలుగా చిత్రించినవారే శ్రీమద్రామాయణ కల్పవృక్షంలోని పాత్రలన్నీ. ఈ దృష్టితో చూస్తే శ్రీమద్రామాయణ కల్పవృక్షం ఆధునిక మానవసమాజ చిత్రణకు పూనుకున్న ప్రతీకాత్మక కావ్యేతిహాసం; ఆధునిక మహాకావ్యం. ఈ విధంగా ఆ కావ్యాన్ని దర్శించి, నిర్మించటం నవ్యసంప్రదాయ ప్రయోగ ప్రతిభకే సాధ్యం.

నవ్య సంప్రదాయం ఒక కవితకు, కావ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. విశ్వనాథ నవ్య సంప్రదాయ దృక్పథంతో నిర్మింపదగిన ప్రక్రియల నన్నింటిని  చేపట్టి వాటిని బంగారం చేశారు. మచ్చుకు మరికొన్నింటిని  గమనిద్దాం. బ్రిటీషు వలస పాలకుల వలస భావాలతో  రచింపబడిన భారతదేశ  చరిత్రలో కుట్రలూ, దుర్వ్యాఖ్యానాలూ ఉన్నాయని జాతీయ చరిత్రకారులు నిరూపించి, వలస చరిత్రకారుల రచనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటువంటి వ్యతిరేకతనే విశ్వనాథ వారు ‘పురాణ వైర గ్రంథమాల’ అనే నవలల పరంపరలో వ్యక్తం చేశారు. జాతీయవాద చరిత్రకారుల దృష్టి నవ్య సంప్రదాయ భావధారకు ఒరవడి పెట్టింది. దానిని మమ్మూర్తుల ప్రదర్శించింది విశ్వనాథవారి ‘పురాణవైర గ్రంథమాల’.

బ్రిటీషు పాలకుల వలస పాలన విధానాన్నీ, భారతీయ సంస్కృతి పట్ల వారు ప్రదర్శించే దమన పద్ధతినీ, వారి ప్రచ్ఛన్న దోపిడీ వ్యవస్థనూ, బ్రిటీషు పాలనలో జరుగుతున్న పరిణామాలలో జాతీయమైన, దేశీయమైన వ్యవస్థలకు కలుగుతున్న అన్యాయాలను, వాటివలన ఉత్పన్నమౌతున్న అనేకానేక జీవన సమస్యలను జాతీయవాద దృక్పథంతో సమీక్షించి, వ్యాఖ్యానించి, దేశీయమైన విలువలకు వ్యాఖ్యానం చెప్పే వైఖరిని విశ్వనాథ వారు నవల, కథానికా ప్రక్రియల నాశ్రయించి కూడా ప్రపంచించారు. అందువలన విశ్వనాథ వారి నవలలు అచ్చమైన జాతీయవాది చేస్తున్న తిరుగుబాటులాగా ఉంటుంది. మన జాతి జీవశక్తిని అర్థం చేసుకోగలిగితే విశ్వనాథ వారి నవలల్లోని భావజాలాన్నీ, భావజాలాన్నీ పట్టి రూపొందే ప్రక్రియా వైవిధ్యాన్నీ విలువకట్టి వివేచించగలం. ఇంగ్లీషు చదువుల వలన దేశీయ విద్యా విధానంలో ఉన్న విలువలు ఎన్ని ఎలా విధ్వంసమౌతున్నాయో వెలువరించి, వాటికి ఆధునిక సమాజ జీవితంలో గల ప్రయోజనాలను ప్రపంచించటానికి వెలసిన నవలలు చెలియలికట్ట, సముద్రపు దిబ్బ మొదలైనవి. వివాహం, కుటుంబ వ్యవస్థ, ప్రకృత్యారాధనం మొదలైన దేశీయ వ్యవస్థలకు బ్రిటీషు యుగంలో ఏర్పడ్డ సవాళ్లకు సంప్రదాయంలోని మౌలిక మూల్యాలకు భంగం లేకుండా ఆధునిక యుగంలో పరిష్కారాలను చర్చించారు. ఇటువంటి భావజాలానికి పరాకాష్ట ‘వేయిపడగలు’. వేయిపడగలు నవ్య సంప్రదాయ ప్రస్తానంలో వెలువడిన సాంఘిక నవలా కావ్యేతిహాసం. విశ్వనాథ వారందించిన స్ఫూర్తితో నవ్య సంప్రదాయ ధోరణులను నవలారచనలో పాటించిన ప్రసిద్ధులతో నోరి నరసింహశాస్త్రిగారు, ఎక్కిరాల కృష్ణమాచార్యులుగారు, తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు (అద్వయానంద భారతీస్వామి) ముందుగా పేర్కొనదగినవారు.

పాశ్చాత్య విద్య,  పాశ్చాత్యీకరణం సమాజంలోని పాత విలువలను తుడిచి పెట్టివేస్తూ, ఆరోగ్యదాయకమైన కొత్త విలువలను సృష్టించలేకపోవడం వలన ఏర్పడిన శూన్యాన్ని (vacuum), విలువల సంక్షోభాన్ని (value crisis) చిత్రించటానికీ, వాటిని అధిక్షేపించటానికీ, సంప్రదాయంలోని మౌలికమైన విలువలను ఉపయోగించుకోవటం వలన ఏర్పడే పరిష్కారాలను గురించి విశ్వనాథవారు తమ నవలలలో, కథలలో విస్తృతంగా చర్చించారు. కళాత్మకంగా సమస్యలను చిత్రించారు. విశ్వనాథవారి నవలా వాఙ్మయం నవ్య సంప్రదాయ చైతన్యంతో పొంగులువారిన ప్రయోగజగత్తు.

ఇటీవల కాలంలో సమాచారాన్ని సేకరించి నవలలు వ్రాసే పద్ధతి బాగా ప్రచారంలోకి రావడం గమనిస్తాం. విశ్వనాథ ఈ రకమైన పద్ధతిని తమ నవలల్లో ఎప్పుడో ప్రవేశపెట్టినట్లు వారి ఏ నవలైనా వెల్లడి చేస్తుంది. నవల వ్రాసేది కేవలం కథ కోసం కాదు. రచయిత ఆ కథా భూమికకు అవసరమనుకున్న అనేక విషయాలను అందులో చొప్పిస్తాడు. విజ్ఞానపు భాండాగారాన్ని పాఠకుడి ముందు కుమ్మరిస్తాడు. విశేషానుభవంతో, పండిన స్వీయానుభూతులను నవలల్లో అమరుస్తాడు. ఆరు నదులు, సముద్రపు దిబ్బ, వేయిపడగలు, ప్రళయనాయడు మొదలైన నవలలు ప్రపంచ రాజకీయ సాంస్కృతిక ఆర్థిక తాత్విక దృక్పథాలకు ఎంతగా ఆలంబనలయ్యాయో, అంతగా దేశీయతాముద్రకు, జానపద గాథలకు నిలయాలుగా కనపడతాయి. విశ్వనాథ వారి ప్రతి నవలా వాస్తవ సంఘటనో, చరిత్రనో ఆధారంగా చేసుకొని చెప్పినదే. వాటిని విశ్లేషించి పరిశీలించినపుడు ఈ పునాదులు గోచరిస్తాయి. వీటిల్లో కూడా వస్తువు, భాష, కథనం ఎంత వైవిధ్యాన్ని వ్యక్తీకరించటానికి వీలున్నదో విశ్వనాథ ప్రదర్శించి చూపించారు. వచన రచనలో వ్యవహారిక భాషాశైలి వారి సొత్తు. నవలా రచనలో ‘ఆశుపద్ధతి’ విశ్వనాథ ప్రవేశపెట్టారు. ఏకకాలంలో మూడు నాల్గు నవలలను డిక్టేట్ చేయడం గమనిస్తే ఇటీవల బిజీ సీరియల్ రైటర్సుకు కూడా విశ్వనాథ మార్గదర్శకుడా అనిపిస్తుంది.

విశ్వనాథ మధ్యాక్కరలనే పేరుతో పది శతకాలను రచించి ఆధునిక శతక సాహిత్యంలో ఒక నవ్య సంప్రదాయాన్ని స్థాపించారు. మనసులోని మాటను ఆర్తితో, ఆత్మీయంగా, అరమరికలు లేకుండా పరమాత్మునితో చెప్పుకోటానికి మధ్యాక్కర మధురంగా తోడ్పడుతుందని విశ్వనాథ నిరూపించారు. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో నన్నయాదులు పరిమితంగా వాడినా బహువిధ రస భావ వ్యంజకంగా ఆ వృత్తాన్ని నడిపి చూపించారు. అయితే, గడిచిన నాలుగైదు శతాబ్దాలుగా మధ్యాక్కరను ఎన్నుకొని ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని సాధించే యత్నం చేసిన కవి కానరాడు. ఈ వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో మధ్యాక్కరతో ఒక శతక ప్రక్రియనే నిర్మించవచ్చునని దర్శించి, పది శతకాలు రచించి, వేయి విధాలుగా ఆ వృత్తాన్ని నడిపించి, పదివేల విధాల శిల్పాలను అందులో ప్రదర్శించవచ్చునన్న ప్రజ్ఞను ప్రదర్శించిన ప్రతిభామూర్తి విశ్వనాథ సత్యనారాయణ.

విశ్వనాథవారి పంచశతి గాథాసప్తశతిని తలపింపచేస్తుంది రూపంలో. కాగా, అందులో వ్యాఖ్యానింపబడే జీవన సత్యం మాత్రం నిత్యనూత్నమైనది గాను హాస్యరస స్పురణను కలిగించేది గాను కనపడుతుంది. ప్రబంధ ఫక్కీలో వారు రచించిన శ్రీ కుమారాభ్యుదయము తెలుగు పల్లెసీమలకు పట్టిన అద్దం. పల్లీయుల వ్యావసాయిక సంస్కృతికి, దేశీయ వాతావరణానికి అది రంగభూమి. వ్యావసాయిక జీవనేతివృత్తంపై రూపొందించిన ప్రతీకాత్మక ప్రబంధమిది. దేశభక్తి కవిత్వం విశ్వనాథతో సరికొత్తదైన ఊపునందుకున్నది. విశ్వనాథ విమర్శలో శిల్పానుశీలన ధోరణిని ప్రవేశపెట్టి, కావ్యాన్నంతా ఒక కళాఖండంగా, ఒక అనుభూతి పూర్ణంగా సమన్వయించే నవ్య విమర్శ పద్ధతిని ప్రవేశపెట్టారు. విమర్శలో సాహిత్యాంశాలే కాక ఇతర శాస్త్రాంశాలు ఎన్నో చోటు చేసుకొంటాయి. ఖగోళశాస్త్రం, భూగర్భశాస్త్రం మొదలైన ఆధునిక శాస్త్రాంశాలను సహాయభూతాలుగా చేసికొనే విశ్వనాథ దృక్పథం సరికొత్తది.

పాశ్చాత్య వ్యామోహజనితమైన ఆంధానుసరణాన్ని తొలగించుకోవడం ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవాలంటాడు విశ్వనాథ. అతిమాత్రంగా ప్రచలితమైన ఇంద్రియ లౌల్యాన్ని ప్రేమగా నామకరణం చేయటం ఎంత ఆధునికమని ఎందరు సమర్థించినా దాన్ని విశ్వనాథ వ్యతిరేకించాడు. ఆంగ్ల విద్యావిధానం మన చదువులలో, సంస్కారాలలో కలిగించిన, కలిగిస్తున్న లోపాలను గుర్తించక దానికి పట్టం గట్టే భావజాలాన్ని విశ్వనాథ నిరసించారు.

విశ్వనాథ వారు తమ జీవితకాలంలో ప్రపంచంలోనూ, దేశంలోనూ, తన రాష్ట్రంలోనూ  సాగుతున్న  సాంఘిక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, మత, నైతిక రంగాల  ఉద్యమాల నన్నింటినీ అధ్యయనం చేసి, వాటికి తన స్పందనలను, ప్రతి స్పందనలను తన సాహిత్యంలో రికార్డు చేసిన వివేకజ్ఞుడు. “నేను ఏమి వ్రాస్తానో తెలిసే వ్రాస్తాన’ని చెప్పుకొన్న జ్ఞాతశిల్పి. స్వాతంత్రోద్యమం, రష్యన్ విప్లవం, కమ్యూనిస్టు ఉద్యమం, ఆంద్రోధ్యమం, చరిత్రాధ్యయనోద్యమం, తాత్త్విక ఆధ్యాత్మికోద్యమం, పునరుజ్జీవనోద్యమం, సంస్కరణోద్యమం, భాషోద్యమం, నాస్తికవాదం, జానపద చైతన్యోద్యమం,  పర్యావరణ పరిరక్షణోద్యమం ఇలా ఎన్నో ఉద్యమ చైతన్యాలపై విశ్వనాథ వారు స్పందించారు. సమకాలీనోద్యమాలకు సమగ్రంగా స్పందించి తన దృక్పథాన్ని నిర్భయంగా, నిజాయితీతో చెప్పిన ఋజువర్తనుడు. తాను నమ్మింది, తాను చెప్పింది, తాను జీవితంలో ఆచరించింది ఒక్కటిగా సాగించుకున్న మానవతామూర్తి విశ్వనాథ.

వేయిపడగలు, ఝాన్సీలక్ష్మి, శివార్పణం మొదలైనవి స్వాతంత్రోద్యమాన్నీ; ఆంధ్రపౌరుషము, ఆంధ్రప్రశస్తి, బద్దన్నసేనాని మొదలైనవి ఆంధ్రోద్యమాన్నీ; పురాణవైర, నేపాలచరిత్ర, కాశ్మీర్ చరిత్ర నవలలు మొ..ద్వారా ప్రాచీన కాలానికి చరిత్రను అనుసంధించే ఉద్యమాన్నీ; విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, హాహాహూహూల ద్వారా భాషా శాస్త్ర ప్రభావాన్నీ; సముద్రపు దిబ్బ, శార్వరి నుండి శార్వరి దాకా, వేనరాజు, నాస్తికధూమము మొదలైన వాటి ద్వారా నాస్తికోద్యమాన్నీ; దమయంతీ స్వయంవరం, నందిగ్రామ రాజ్యం మొదలైన వాటితో రాజకీయోద్యమాలనూ; ఆరు నదులు, స్వర్గానికి నిచ్చెనలు, శతక సంపుటి, భక్తి కావ్యాలు మొదలైన వాటితో తాత్త్వికోద్యమాలనూ విశ్వనాథ వారు తమ సాహిత్యంలో ప్రతిఫలింపజేసి, వాటికి తాను ప్రతిస్పందించారు.

విశ్వనాథ వారికి శిష్యులున్నారు, ప్రశిష్యులున్నారు. అనుయాయులతో పాటు ప్రత్యర్థులూ ఉన్నారు. అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరుపొందారు. ఆయన తిట్టినా, దీవించినా అందరూ ఆమోదించేవారు. ఆయన భావజాలంతో ఎవరైనా అంగీకరించకపోవచ్చును గాని, ఆయన ఈ శతాబ్ది కన్న ‘జీనియస్’ అని అందరూ ముక్తకంఠంతో అంగీకరిస్తారు. శతాబ్దాల తరబడి చదివినా జాతి మననం చేసుకోదగినంత సృజనాత్మక సాహిత్యాన్ని నిర్మించిన ప్రతిభామూర్తి విశ్వనాథ.

కమ్మని తెలుగు నుడికారానికి, ప్రౌఢ సంస్కృత సమాస సంగ్రథనానికీ ఆయన పెట్టింది పేరు. పద్యంలో సైతం వ్యావహారిక భాషా ప్రయోగాన్ని సజీవంగా చేసి చూపించిన సాహితీమూర్తి. ఉపన్యసించటంలో, పద్యం చదవటంలో, వాక్య విన్యాసంలో, వ్యక్తిత్వావిష్కారంలో తనదైన బాణీని కల్పించుకోవటమే కాకుండా, సమకాలీనులైన పండితులతోనే కాక, సామాన్య ప్రజానీకంతో ఆత్మీయమైన సంబంధాలు పెట్టుకొని తన కథలను గాథలను జాతికి మిగిలించిన సజీవ చారిత్రక సాహిత్య సమ్రాట్టు విశ్వనాథ!

తెలుగు సాహిత్య వికాస చరిత్రలో 1935 తరువాత వెలువడిన అభ్యుదయ విప్లవధోరణులకు ప్రతిగా జాతీయ చైతన్యంతో నవ్య సంప్రదాయోద్యమాన్ని శాంతియుతంగా సాగించిన సాహిత్యోద్యమ నాయకుడు విశ్వనాథ!

ఒక్కమాటలో చెప్పాలంటే నవ్య సంప్రదాయోద్యమం గాంధీ మహాత్ముని సత్యాగ్రహోద్యమం వంటిది. ఈ దేశంలోని మట్టిలోని గట్టిదనం ప్రదర్శించి ప్రపంచానికే శాంతిమార్గాన్ని చూపించిన ఉద్యమం సత్యాగ్రహోద్యమం. అటువంటిదే నవ్య సంప్రదాయోద్యమం!

డా. జి. వి. సుబ్రహ్మణ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here