[dropcap]ఆ[/dropcap]మె ఎదురు చూపులు
ఎన్నని చెప్పను
కొన్ని గుమ్మానికి
తోరణాలు కట్టింది
మరి కొన్ని ఏ మూల మలుపులోకో
విసిరింది
ఇంకొన్ని ఆకాశంలోకి ఎగిరేసింది.
మరేం చెయ్యమంటావ్
ఆమెని
కాలం వేటగాడు బంధాల్ని
బంధుత్వాల్ని బల్లెంతో గుచ్చి
తీసుకెళ్ళాడు.
ఒంటరి గువ్వలా
బుడ్డి దీపం వెలిగించి
ఎవరు లేని, రాని ఇంట్లో ఒక్కతే ఉంటుంది
ఎవరైనా కాస్తా
మాట సాయం చేస్తారేమోనని
వీధి నిండా కళ్ళు చేసుకొని చూస్తోంది
మరి అంతకంటే ఏం చెయ్యాలో తెలియదు.
ఆమెను అనాథగా దురదృష్టానికి
అమ్మేసి వెళ్లిన జీవితాన్ని నిందిస్తూ..
వొలికిన కంటి పాత్రల్ని తుడుచుకుంటూ
రాత్రులను నానబెట్టుకుంటుంది
పగల్లను ఆరబెట్టుకుంటుంది.
మానవత్వం నీడలు లేని రోజులవి
మాటలు కూడా ఖర్చవుతాయి అనుకుంటారు
అలాంటప్పుడు ఆమెకు మాటల ప్రసాదం
ఎవరిస్తారు..?
ఎదురు చూపులను మెత్తగా ఎవరు తడుముతారు?
మనుషుల ఎవరు రారు కనీసం
కాలం వేటగాడు వస్తాడేమో అని ఎదురుచూస్తుంది
ఆమె ఇప్పుడు.
చివరగా ఎదురుచూస్తుంది ఇప్పుడు.