[dropcap]నా[/dropcap]ణానికి అటు వైపు
ప్లాస్టిక్ పువ్వులు
లిప్స్టిక్కు నవ్వులు
ఫేస్‌బుక్ ఫేసులు
వాట్సప్ కబుర్లు
సాంకేతిక సంకెళ్లు
మద్య ప్రవాహాలు
జూద వినోదాలు
అంతర్జాల మోహ జాలాలు
‘సిఫిలిస్’ సంస్కృతి
స్వార్థ సర్పాలు
విషం చిమ్మిన ఆనవాళ్లు
ఆశల ఉరి తాళ్లకు వేలాడే దేహాలు!
ఇటు వైపు
పుడమి పుత్రుడి పాద ముద్రలు,
మందాకినీ సలిలాలు,
మంజీరా నాదాలు,
వెన్నెల జలపాతాలు
హరిత వనాలలో
కోయిల కవనాలు
పారిజాత పుప్పొడుల ఎత్తి పోతలు
గాలుల గంధర్వ గానాలు,
సాగర తీరాలలో సైకత సౌధాలు,
నిశాంత నారి నృత్యాలు,
పురాతన ప్రేమ ప్రవచనాలు,
విశ్వంతరాళంలో
నక్షత్రాల ముషాయిరా!
ప్రాచీన రాగాల జుగల్బందీలో
రహస్యాలుగా రాలిపోతున్న
రాత్రి
స్వరం సవరించుకుంటున్న
రహస్త్రంత్రి!