[dropcap]మే[/dropcap]ము టెన్త్ పాసయి కాలేజీ కొచ్చేసరికి కాలేజీ, రైల్వేగేటు దగ్గరున్న తన సొంత భవనంలోకి మారింది, ‘యార్లగడ్డ అన్నపూర్ణంబ గవర్నమెంట్ కాలేజీ’గా పేరు మార్చుకుని మరీ. అంతకు ముందు పాత కాలేజి మా కస్తూర్బా గాంధీ మున్సిపల్ హైస్కూలు ప్రక్కనున్న అద్దె షెడ్లలో సాగేది. కొత్త భవనంలోని కాలేజీలో ఇంటర్‌మీడియట్ మాదే మొదటి బ్యాచ్. చెట్టు కథలు అంటే కాలేజీ గురించి చెప్తుందేమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నానండీ కాకపోతే కొంచం నేపథ్యం చెప్పాలి కదా! కాలేజీ కొత్త బిల్డింగ్ కాబట్టి చెట్లేమీ లేవు. కాలేజీ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం ఎన్.ఎస్.ఎస్. వాళ్ళకు అప్ప చెప్పారు. నేను కూడా ఎన్.ఎస్.ఎస్.లో ఉన్నాను. కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో ఓరోజు “ఎన్ఎస్ఎస్‍౬లో ఉన్న వారందరూ లాన్ దగ్గరకు రండి” అని పిలుపోచ్చింది. అందరం పరుగెత్తుకుంటూ లాన్ దగ్గరకు వెళ్ళాం.
అక్కడ ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అయిన మా బాటని మేడమ్ అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి నాటమన్నారు. ఎవరికి ఎలాట్ చేసిన ప్లేస్‍లో వాళ్ళు మొక్కను నాటాం. మొక్కను నాటిన తరువాత మాకు ఒక గుండ్రటి అల్యూమినియం రేకును దానికి గుచ్చి ఒక తాడు ఇచ్చారు. ఆ అల్యూమినియం రేకు మీద మొక్క నాటిన వారి పేరు, క్లాసు, సంవత్సరం మేకుతో చెక్కి ఈ రేకు బిళ్ళను మనం నాటిన చెట్టుకు కట్టాలి. ఇది అందరికీ చాలా సరదా కలిగించింది. ఆ రేకును చెట్టుకు కడుతూ ‘మేం ఈ చెట్టుకు తాళిబొట్టు కడుతున్నాం’ అంటూ మా ఆడపిల్లలందరూ ఒకటే అల్లరి చేశారు. ఇంతకీ ఆ చెట్లేమిటనుకున్నారు! యూకలిప్టస్ చెట్లు. రోజూ కాలేజీలో అడుగు పెట్టగానే ఓసారి చెట్టు దగ్గర కెళ్ళి పలకరించి మా పేర్లున్న రేకు బిళ్ళలు ఉన్నాయో లేదో చూసుకొని తృప్తిపడేవాళ్లం.
నేను కాలేజీలో చేరిన కొద్ది రోజులకు అంతకు ముందున్న ఇల్లు మారి కాలేజీ దగ్గరున్న ఇంట్లోకి వచ్చాం. ఈ కొత్త ఇంట్లో ఉత్తరం వైపున ఉన్న ఖాళీ స్థలంలో నాలుగైదు యూకలిప్టస్ మొక్కలున్నాయి. అప్పుడే కొత్తగా నాటారు. ఇలా నన్ను ఇంట్లోనూ ఈ చెట్లు పలకరించాయి. అప్పట్లో యూకలిప్టస్ గురించి అందరికీ ఎక్కువగా తెలీదు. నేను చదివేది సైన్స్ గ్రూప్ కావడంతో ఆ చెట్ల పేరు యూకలిప్టస్ అని, అది పేపర్ తయారీలో ఉపయోగపడుతుందనీ తెలుసు. మామూలుగా అందరూ వీటిని ‘జమాయిల్ చెట్లు’ అనేవారు. ఆ చెట్లు ఎక్కడ నాటితే ఆ చుట్టు ప్రక్కల బావుల్లో నీళ్ళు లోపలికి పోతాయని అందరూ అనుకునేవారు. మావూరు సముద్ర బావుల్లో నీళ్ళు లోపలికి పోతాయని అందరూ అనుకునేవారు. మావూరు సముద్ర తీర ప్రాంతం కాబట్టి నీళ్ళకు మాత్రం ఏ కొదవలేదు. లేత పచ్చగా పొడవాటి ఆకులతో చిన్న పొదలాగా ఉండేవి చెట్లు. ఆ చెట్లు దగ్గరకు వెళ్ళగానే అమృతాంజన్ వాసన వస్తుండేది. మా ఇంటి చుట్టూ ప్రక్కల ఇళ్ళలో ఎవరికి జలుబు చేసిన ఈ ఆకులు కోసుకెళ్లి నలిపి ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తే శ్వాస సరిగా ఆడేది. అంటే ఇది ఇన్‌హేలర్‌గా పనిచేసేదన్నమాట. తలనొప్పి వచ్చిన వాళ్ళు ఆకులను మడిచి కణతల దగ్గర రుద్దుకునేవాళ్ళు. లేత ఆకులయితే కణతలకు అలా అతికించి ఉంచుకునే పనులు చేసుకునేవాళ్ళు.
నేను ఇంటర్ పూర్తయి డిగ్రీ కొచ్చేసరికి చెట్లు చాలా పొడవు పెరిగాయి. మా డాబాను దాటి కూడా చాలా ఎత్తుకు ఎదిగాయి. ఇవి చూడటానికి అశోక చెట్లలాగానే ఉంటాయి. ఆకులు కూడా అలాగే సన్నగా పొడవుగా ఉంటాయి. కాకపోతే లేత రంగులో పల్చగ ఉంటాయి. మా ఇంటికి ఎవరొచ్చినా ఈ చెట్లను చూపిస్తుండే వాళ్ళం. ఎవరికి ఈ చెట్ల గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ వింతగా చూస్తుండే వాళ్ళు. వాళ్ళాలా ఆశ్చర్యంగా చూస్తుండటం నాకు కొంచెం గొప్పగా ఉండేది. సాయంత్రం ఆరుబయట పడుకున్నపుడు అవి తలలూపుతూ చల్లని గాలి నిచ్చేవి. వేసవి కాలంలో బయట పాడుకుంటే కమ్మని గాలికి తెల్లారాక కూడా లేవాలన్పించేది కాదు.
ఈ చెట్ల మీద బోలెడు పేరు తెలియని పక్షులు వాలుతుందేవి. వాటన్నిటి కన్నా ఉడతలు చాలా వచ్చేవి. మేము ఇంట్లోకి వెళ్ళగానే ఉడతలు గబగబా కిందకు దిగి మా ఉత్తరపు వాకిలి ముందున్న బందల మీదకు వచ్చి కూర్చునేవి. మన అలికిడి కాగానే మరలా గబగబా చెట్లెక్కి పారిపోయేవి. ఎంత ఫాస్ట్‌గా ఎక్కుతూ వాటిని చూస్తుంటే లాడర్ అండ్ స్లైడు గుర్తొస్తుంది నాకు. మనం జారుడు బండకు మెట్లెక్కి జరజరా జారినట్లు అవి కూడా ఈ చెట్లమీద అలా ఆడుకుంటున్నాయేమో అనిపించింది. మా ఇంటికి ఎవరొచ్చిన ఈ చెట్లను చూసి ఊరుకోకుండా ఆకులను కోసి, గిల్లీ వాసన చూస్తుండే వాళ్ళు. అలా ఆ లేత ఆకుల్ని కోసి గిల్లుతూ ఉంటే నాకు చాలా బాధనిపించేది. లేత లేత ఆకులు ముద్దు ముద్దుగా చిగురించిన ఆకులను ఎవరన్నా గిల్లేస్తూ ఉంటే నన్నే గిచ్చుతున్నంతగా ఫీలయ్యేదాన్ని. దాని కాండం బాగా లావయ్యాక అమ్మేస్తారట. ఆ మాట వినగానే ‘అయ్యో ఈ చెట్లు చచ్చిపోతాయా’ దిగులుతో నిద్రపట్టలేదు ఆ రాత్రి. నేను ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు వేస్తుంటే తల వంచి ఏం ముగ్గు వేస్తుందో అని తొంగి చూసేవి ఆ చెట్లు.
ఆ ఇంట్లో ఉండగానే నా పెళ్లవటం, సీమంతాలు, పిల్లలిద్దరూ పుట్టడం జరిగింది. ఇంట్లో కరెంట్ పోయినా, జనం ఎక్కువైనా మంచాలు చెట్ల కిందకు వెళ్లిపోయేవి. నన్ను పెళ్లికూతుర్ని చేసి కళ్యాణ మండపానికి తీసుకెళుతున్నపుడు దిగులుగా టాటా చెపుతున్నట్లనిపించింది. నా సీమంతం మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో షామియానా వేసి చేశారు. ముత్తయిదువలు అంతా వచ్చి గాజులు వేసి స్వీటు తినిపించి సీమంతం పాటలు పాడుతుంటే యూకలిప్టస్ ఆకులు గలగల సవ్వడి చేస్తూ, కొమ్మలు ఊపి బాకాలూదుతూ, చేతులూ కాళ్ళు కడుపుతూ డాన్స్ చేస్తున్నట్లుగా కదిలాడుతూ చాలా సందడి చేశాయి. బాబు పుట్టినాక హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక వాకిట్లోనే యూకలిప్టస్ చెట్లు నా బుజ్జికన్నకు స్వాగతం పలికాయి. ఉదయమే బాబు కాళ్ళు తెరవగానే ఉత్తరపు వాకిలి మెట్ల మీద బాబునొళ్ళో పడుకోబెట్టుకొని కూర్చునే దాన్ని గంట రెండు గంటల సేపు చల్లని గాలి పక్షులు కువకువలు బాగుంటుందని. ఆ చెట్లు నా బుజ్జికన్నను ముద్దాడేందుకు ముందుకు వంగాలని అనుకునేవి కానీ అవి నిటారుగా పెరిగే చెట్లు కదా! వీలు పడక ఊరుకునేవి. నా పిల్లలు కొంచెం పెద్దయి బుడిబుడి అడుగులతో ఆ చెట్ల కిందికి వెళ్ళగానే పై నుంచి ఆకులు రాల్చి ఆశీర్వదించేవి. చెట్ల పైకి ఎగబాకే ఉడతల కోసం మా పిల్లలు మాటిమాటికి చెట్ల దగ్గరకు పరిగెత్తేవాళ్ళు. అలా ఎన్నో ఫోటోలు నా పిల్లలతో పాటు చెట్లవి. నా సీమంత వేడుకల్లోనూ, ఇంటి ముందున్న బావిలో బాలింతగా చేద తోడినప్పుడూ, పిల్లల ఆటల్లోనూ అన్నీ ఫోటోలలో మౌన జ్ఞాపకాలుగా ఆ చెట్లున్నాయి.