[dropcap]సం[/dropcap]స్కృతంలో ‘దండి’ అన్న మహాకవి ఉన్నాడు. ఆయన రాసిన ‘దశకుమార చరిత్రమ్’ సంస్కృతంలోకి ప్రసిద్ధ కావ్యాలలో ఒకటి. ‘దండినః పదతాలిత్యం’ అని పేరు. దానిని తెలుగులోకి అనువదించి తన గురువైన తిక్కనకు అంకితమిచ్చాడు కేతన. ‘ఆంధ్ర భాషా భూషణము’ అనే వ్యాకరణ గ్రంథాన్ని వ్రాసినాడు. తెలుగు వ్యాకరణ శాస్త్రాల్లో అదే మొదటిది. ‘విజ్ఞానేశ్వరము’ అనే గ్రంథంలో హిందూ ధర్మ శాస్త్రాన్ని, యాజ్ఞవల్క్యస్మృతిని అనువాదముగా తెలుగువారి కందించినాడు.
‘దశకుమార చరిత్రము’ కథా కావ్యం. అనేక పాత్రలు ఇందులో కేతన చిత్రీకరించినాడు. ఇందులో పది మంది నాయకులుంటారు. వాళ్ళంతా అగ్రజాతులకు చెందినవారే. కానీ కథలో వారికి సాయం చేసే వారిలో అన్ని కులాల వాళ్ళుంటారు. వారు సద్గుణ సంపన్నులు. అట్లా సమాజంలోని సమతౌల్యతను పాటించినాడు కేతన. భరతుని నాట్యశాస్త్రమును బట్టి, అద్భుతరసమును, దాని స్థాయీ భావమైన విస్మయమును చక్కగా పండించినాడు. కావ్యములో అద్భుతజనకాలకైన అలౌకిక సన్నివేశాలున్నా, పాఠకునికి అపనమ్మకాన్ని కల్గించవు (suspension of reader’s disbelief).
కేతన వర్ణనలు మనోహరంగా ఉంటాయి. అపహరవర్మ కథలో సూర్యోదయాన్ని “ప్రాచీన శైలాగ్ర భాగస్థమగు నశోకంబున జిగురు జొంపమనగ” అని వర్ణిస్తాడు. మంత్రగుప్తుని కథలో జైన సన్యాసి దీనావస్థను “తెల్లని వాలుగడ్డమును దీర్ఘ జటాళియు..” అని, బ్రహ్మ రాక్షసుని వర్ణిస్తూ, “పేరిన కోర వెంట్రుకలు.. మీసల నూనిన రక్త పంకముల్” అంటాడు. రాక్షసుల నెప్పుడూ మనం చూడకపోయినా, మనకొక రూపం కళ్ళ ముందుకొస్తుంది. అయినా మన సమాజంలో కూడా రాక్షసులు లేరా ఏమిటి? అయితే ‘డీసెంట్’గా ఉంటారు!
ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ మూడూ కావ్యహేతువులని ముమ్ముటుడన్నాడు. కానీ జగన్నాధ పండితులు ప్రతిభ ఒక్కటి చాలన్నారు. కేతనలో ప్రతిభ అని భావుకతలో, ఉదాత్తతలో కనిపిస్తుంది. రాజవాహనుడు, అవంతీసుందరీల సమాగమను.. “లోలతా డోలమాన విలోచనులును/మన్మథాదీన పరతంత్ర మానసులును/నగుచు నే కాసనాసీను లైరి తగవ/ధూవరులు సౌఖ్య రసము దోయి వలె” ఆయన కవితాశక్తికి గీటురాయి. తిక్కనను గురించి “సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వడనిన వీ/డను నాలుకకు దొడవైనవాడు” అంటాడు. “దీన జనతానిధానంబు తిక్కశౌరి” అని వర్ణిస్తాడు.
సంభాషణా చతురరకు ఈ పద్యం మచ్చు తునక. “మీరరుగుడు మీరేగుడు/మీరు చనుడు మీరు పొండు మీ మీ పనులొ/ప్పారగ సలుపుడు నావుడు/బోరన నయ్యింద్రజాలపుంబ్రజవోయెన్.” అలా తన కావ్యాన్ని సుసంపన్నం చేసిన కేతన ధన్యుడు. వీలు చేసుకొని ‘దశకుమార చరిత్ర’ చదవండి మరి!
డా. హరిశివకుమార్ గారికి కృతజ్ఞతలతో..