మరుగునపడ్డ మాణిక్యాలు – 11: లక్ బై చాన్స్

0
3

[dropcap]సి[/dropcap]నిమారంగం గురించి సినిమాలు తరచూ వస్తూనే ఉంటాయి. అయితే ఆ సినిమాలు ఒక పాత్ర చుట్టూనే ఎక్కువ తిరుగుతాయి. అందుకు భిన్నంగా ‘అద్దాల మేడ’ సినిమాలో ఆ రంగంలోని మంచిచెడులు ప్రస్తావించారు. కానీ సినిమారంగం చెడ్డది కాదు అని సంజాయిషీ ఇచ్చుకున్నట్టు ఉంటుంది. ‘లక్ బై చాన్స్’ (2009) సినిమారంగంలోని మనుషుల అంతరంగాలను ఆవిష్కరిస్తుంది. ముఖ్యపాత్రలన్నిటికీ వారి భావోద్వేగాలను పంచుకునే అవకాశమిచ్చిన చిత్రమిది. జోయా అఖ్తర్ తొలిసారి స్క్రీన్ ప్లే వ్రాసి, దర్శకత్వం వహించిన చిత్రమిది. తొలి చిత్రమనే అభిప్రాయం కలగకుండా రూపొందించింది. ఆమె తమ్ముడు ఫర్హాన్ అఖ్తర్ ‘దిల్ చాహతా హై’ చిత్రంతో దర్శకుడిగా అప్పటికే తన సత్తా చాటుకున్నాడు. ఫర్హాన్‌ని హీరోగా పెట్టి జోయా ‘లక్ బై చాన్స్’ తీసింది. కొంకణా సేన్ శర్మ హీరోయిన్ గా నటించింది. అప్పటికే జాతీయ అవార్డు అందుకున్న కొంకణా అద్భుతంగా నటించిందని వేరే చెప్పక్కరలేదు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లోనూ, అమెజాన్ ప్రైమ్ లోనూ అందుబాటులో ఉంది.

సోనా (కొంకణా) అనే అమ్మాయి సినిమాలలో చాన్సుల కోసం ప్రయత్నిస్తుంటుంది. ఒక యువ నిర్మాతని ఆశ్రయిస్తుంది. అతను ఆమెకి ఆశలు చూపించి ఆమెని ముగ్గులోకి దింపుతాడు. సోనా అమాయకురాలు కాదు. పైకి రావాలంటే కొన్ని విషయాల్లో రాజీపడకతప్పదని ఆమె అభిప్రాయం. ఆ నిర్మాత సలహా మేరకు చిన్న చిన్న పాత్రలు వేస్తుంటుంది. ఎప్పటికైనా పెద్ద అవకాశం ఇస్తాడని ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెకి నటుడు కావాలని ప్రయత్నిస్తున్న విక్రమ్ (ఫర్హాన్) పరిచయమౌతాడు. పరిచయం ప్రేమగా మరుతుంది. ఆమె అతణ్ణి ప్రోత్సహిస్తుంది. ఇదిలా ఉండగా రోమీ (రిషి కపూర్) అనే నిర్మాత జఫర్ (అతిథి పాత్రలో హృతిక్ రోషన్) అనే హీరోతో కొత్త సినిమా మొదలుపెడతాడు. నీనా (డింపుల్ కపాడియా) అనే పాత హీరోయిన్ కూతురు నిక్కీ (ఈషా శర్వానీ) అందులో హీరోయిన్. జఫర్‌ని పరిచయం చేసింది రోమీయే. జఫర్ ఇప్పుడు పెద్ద స్టార్. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని ఉంటాడు. ఈ పాత్ర నెగిటివ్ పాత్ర. ‘బాజీగర్’లో షారుఖ్ ఖాన్ వేసిన పాత్ర లాంటి పాత్ర (అసలు ఆ సినిమా కథని దృష్టిలో పెట్టుకునే ఈ ఉపకథ అల్లారేమో అని నాకనిపించింది.) జఫర్ మొహమాటానికి ఆ పాత్ర ఒప్పుకున్నా ముందువెనకలాడుతుంటాడు. చివరికి ఆ సినిమా నుంచి తప్పుకుంటాడు.

“నన్ను పరిచయం చేసినంత మాత్రాన ఏ పాత్ర ఇచ్చినా చేయాలా?” అని జఫర్ ప్రశ్న. అతని అభిప్రాయాలు అతనికుంటాయి కదా. అయితే ముందే చెప్పకుండా తర్వాత తప్పుకోవటం – అతని మంచితనమా లేక స్వార్థమా? మాట ఇచ్చాను కాబట్టి నిలబెట్టుకోవాలి అని ఆలోచించేవారు ఎంతమంది ఉంటారు ఈ కాలంలో? అయితే ఒక సన్నివేశంలో జఫర్‌లో అభద్రతాభావం ఎందుకు కలిగింది అనేది మనసుకు హత్తుకునేలా చూపించారు. జఫర్ కారులో వెళుతూ ఉండగా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగుతుంది. కొందరు వీధిభాలలు కాస్త దూరంలో ఆడుకుంటూ ఉంటారు. జఫర్ ని చూసి పరుగెత్తుకుని వస్తారు. కారు అద్దం వేసి ఉంటుంది. పిల్లలు అద్దం దగ్గర నిలబడి ఇంతింత మొహాలు చేసుకుని జఫర్‌ని చూస్తుంటారు. జఫర్ చిలిపి చేష్టలు చేసి వారిని అనందింపజేస్తాడు. చిన్నపిల్లలు తనని ఇంతగా ప్రేమిస్తుంటే తాను నెగిటివ్ పాత్ర చేస్తే వారు తనను ద్వేషించరా అని జఫర్‌కి అనిపిస్తుంది. సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ పుంజుకోవటానికి ఎంతకాలం పడుతుందో? ప్రతి సినిమాకీ జాతకం మారిపోయే సినిమారంగంలో ఎవరి స్వార్థం వారిది. ఒక యువకథానాయకుడి అంతరంగాన్ని అలా హృద్యంగా చూపించారు. వీధిబాలల్ని విసుక్కోకుండా నవ్వించటం మనసుకి హత్తుకుంటుంది. ఇలాంటి అతిథి పాత్ర చేసినందుకు హృతిక్ రోషన్‌ని మెచ్చుకోవాల్సిందే.

జఫర్ తటపటాయిస్తూ తప్పించుకు తిరుగుతుంటే రోమీ తన భార్యతో చెప్పుకుని బాధపడతాడు. “నా పిల్లల వయసున్న వారి వెనక ఇలా పరుగులు పెట్టడం ఏం బావుంది?” అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. “ఒకప్పుడు సినిమా తీయాలంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఆ ఆనందం లేదు. నాకు గౌరవం లేదు” అని వాపోతాడు. అతన్ని చూసి జాలి వేస్తుంది. ఎంతమంది నిర్మాతలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో! కథ కన్నా హీరోకి ప్రాధాన్యం పెరిగిపోతే ఇలాగే ఉంటుంది. జోయా ఇలాంటి సన్నివేశాన్ని సినిమాలో పెట్టడం ఆమె పరిణతికి నిదర్శనం. రిషి కపూర్ ఈ సన్నివేశంలో అద్భుతంగా నటించాడు. ఈ సన్నివేశంలోనే కాదు, మొత్తం సినిమాలో అతని నటన అమోఘం. ఈ పాత్రకున్న రేంజ్ చాలా బావుంటుంది. బయటివారి దగ్గర లౌక్యం ప్రదర్శిస్తూ భార్య దగ్గర తన గోడు చెప్పుకునే పాత్ర. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఒక హాలీవుడ్ సినిమా ఆధారంగా తన సినిమా స్క్రీన్ ప్లే తయారు చేయించాడు రోమీ. ఆ రచయిత పాత్రలో నేటి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటించాడు. జఫర్ కోసం కథలో మార్పులు చేస్తానంటాడు అతను. అతన్ని చీవాట్లు వేస్తాడు రోమీ. రచయితకి గౌరవం తగ్గిపోయిందని వ్యంగ్యంగా చూపించారు.

జఫర్ తప్పుకున్నాక పెట్టుబడిదారులు కూడా తప్పుకుంటారు. రోమీ హీరోయిన్ తల్లి నీనాతో మంతనాలు జరుపుతాడు. “కథ అంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. నాకు ప్రాధాన్యం లేదు” అని జఫర్ అన్నాడని “కథ మార్చను. ఇష్టం లేకపోతే తప్పుకో” అని తాను అన్నానని బొంకుతాడు. అతని లౌక్యం ఇక్కడ బయటపడుతుంది. నీనా తన ‘శ్రేయోభిలాషి’ చేత పెట్టుబడి పెట్టిస్తుంది. పెత్తనం మొదలుపెడుతుంది. రోమీ పెద్ద హీరోలందరినీ హీరో పాత్ర చేయమని అడుగుతాడు. వాళ్లందరూ ఏవో సాకులు చెప్పి తప్పుకుంటారు. రోమీ తెలివిగా “ఈ కథకు కొత్త హీరో అవసరం” అని హీరో వేట మొదలుపెడతాడు. మనం ఇంతవరకు ముఖ్యకథలోకి రాలేదంటే జోయా ఎంత చక్కగా ఇతర పాత్రలని మలచిందో అర్థమౌతుంది.

సోనాకి సెకండ్ హీరోయిన్ అవకాశం ఇస్తానని ఆమె అశ్రయించిన నిర్మాత అంటాడు. అయితే చివరికి ఆమె చిన్న చిన్న పాత్రలు వేసి పాతబడిపోయిందని చెప్పి ఆమెకి అవకాశం ఇవ్వటానికి దర్శకుడు ఒప్పుకోవట్లేదని అంటాడు. ఆమె ఆశలన్నీ అడియాసలు కావటంతో ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో ఆ నిర్మాత భార్య అక్కడికి వస్తుంది. తనతో తెచ్చిన విక్రమ్ ఫొటోలని ఆ నిర్మాతకి ఇచ్చేసి సోనా బయటపడుతుంది. ఈ నిర్మాత భార్య రోమీ భార్యకి చెల్లెలి వరస. విక్రమ్ ఫోటోలు రోమీకి అందుతాయి.

విక్రమ్ అప్పటికే ఒక పార్టీలో నీనాని కలుస్తాడు. తన తండ్రికి ఆమె అంటే చాలా ఇష్టమని, ఒకసారి ఆమెని ఒక పార్టీలో చూసి ఆమె అక్కడున్నవారిలో అందరికన్నా అందంగా ఉందని అన్నాడని చెబుతాడు. ఆమె ఇప్పటికీ అందరికన్నా అందంగా ఉందని తన తండ్రికి ఫోన్ చేసి చెబుతానని అంటాడు. నీనా చాలా గడుసుది. అయినా అతని పొగడ్తలకి కరిగిపోతుంది. హీరో పాత్ర కోసం విక్రమ్ స్క్రీన్ టెస్ట్ ఇస్తాడు. ఆ టెస్ట్ చూసి నీనా అతన్ని గుర్తుపట్టి అతన్నే ఎంపిక చేస్తుంది. అదృష్టం ఎలా ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. విక్రమ్ స్నేహితుడు ఎంతో ప్రతిభ ఉన్న నటుడు. శిక్షణ పొందినవాడు. అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా రావు. అతను విక్రమ్‌ని “నీకు అవకాశం రావటం కల్ల” అంటాడు నిస్పృహతో. “నాకే రానప్పుడు నీకెలా వస్తుంది” అని అతని భావన. కానీ విక్రమ్ తన ప్రతిభని మాత్రమే నమ్ముకోలేదు, పరిచయాలు కూడా పెంచుకున్నాడు. ప్రేక్షకులకి వినోదం కావాలి. కళ ద్వారా సమాజాన్ని మార్చాలనుకునేవారికి ఇవి రోజులు కావు. అదృష్టం కలిసొచ్చి విక్రమ్ హీరో అయిపోతాడు. కానీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పోతే ఆ పరుగుకి అంతమెక్కడ? సంతృప్తి లేకపోతే సంతోషం ఉంటుందా? ఇదే విషయాన్ని గీత రచయిత జావెద్ అఖ్తర్ ‘సప్నోం సే భరే నైనా’ పాటలో చెబుతారు. ఈ పాట స్క్రీన్ టెస్ట్ కోసం వచ్చిన యువకులందరి మధ్యలో విక్రమ్ ఉన్నపుడు నేపథ్యగీతంగా వస్తుంది.

పల్లవి:

సప్నోం సే భరే నైనా

తో నీంద్ హై న చైనా

అనువాదం:

కళ్ళలో కలలే నిండిపోతే

నిదుర ఉండదు కుదురు ఉండదు

పెద్ద పెద్ద ఆశలతో పరుగులు తీస్తూ ఉంటే మనశ్శాంతి ఎక్కడుంటుంది? ఆశలు కేవలం డబ్బు కోసమేనా లేక ఏదైనా మంచి చేయాలనా అనేది కూడా ముఖ్యమే.

చరణం 2:

దూర్ హి సే సాగర్ జిసే హర్ కోయి మానే

పానీ హై వో యా రేత్ హై యే కౌన్ జానే

జైసే కె దిన్ సే రైన్ అలగ్ హై

సుఖ్ హై అలగ్ ఔర్ చైన్ అలగ్ హై

పర్ జో యే దేఖే వో నైన్ అలగ్ హై

చైన్ తో హై అప్నా సుఖ్ హై పరాయే

అనువాదం:

దూరాన ఉన్నది కడలియని అనిపించినా

అది సలిలమో ఎండమావియో తెలుసునా

పగలు వేరని రేయి వేరని

సుఖము వేరని శాంతి వేరని

చూసే కనులే కనులు

శాంతి స్వీయం, సుఖం అన్యం

శాంతి సముద్రం లాంటిది. సుఖం ఎండమావి లాంటిది. శాంతి మనసులోనే పుడుతుంది. సుఖం ఇంద్రియాల ద్వారా బయటి నుంచి వస్తుంది. ఎండమావిని చూసి సముద్రం అనుకుంటే భంగపాటు తప్పదు. అలాగే సుఖాల ద్వారా శాంతి వస్తుందంటే నిరాశ తప్పదు. సంతృప్తి ఉంటేనే శాంతి. ఉన్నది వదులుకుని ఏదో కోరుకుంటే ఉన్నది కూడా చేజారుతుంది.

ఈ సందర్భానికి ఇలాంటి పాట వ్రాసిన జావెద్ సాబ్‌ని అభినందించకుండా ఉండలేం. జోయా, ఫర్హాన్ ఆయన బిడ్డలే కావటంతో వారి చిత్రాలకు ఆయనే పాటలు వ్రాస్తారు. ఈ పాట వింటే “శాంతము లేక సౌఖ్యము లేదు” అనే త్యాగరాజ కీర్తన గుర్తు వస్తుంది. సినిమా పాటకి ఇంత స్థాయి కలిగించిన జావెద్ అఖ్తర్ ధన్యులు.

విక్రమ్‌కి అవకాశం వచ్చాక సోనా ఏం చేస్తుంది? విక్రమ్ తన ప్రేమని కాపాడుకుంటాడా? ఇదే మిగతా కథ. విక్రమ్ స్నేహితుడి పాత్ర చిన్నదే అయినా ఎందరో ఆశావహులైన నటులకి ప్రతినిధిగా నిలబడతాడు. ఈ పాత్రలో అర్జున్ మాథుర్ గుర్తుండిపోయే నటన ప్రదర్శించాడు. అలాగే రోమీ భార్య పాత్రని ఒకప్పటి టాప్ హీరోయిన్ అయిన జూహీ చావ్లా చక్కగా పోషించింది. తన చలాకీతనాన్ని చూపిస్తూ భర్తకి తోడుగా నిలుస్తుంది. ఆమెని చూస్తే ‘తోడొకరుండిన అదే భాగ్యము’ అనిపిస్తుంది. భాష కూడా సరిగా రాని హీరోయిన్ నిక్కీగా ఈషా శర్వానీ అకట్టుకుంటుంది. ఆమె ఐస్ క్రీం తింటుంటే “నీ నడుము మీద బోల్డంత పెట్టుబడి ఉంది” అని నీనా మందలిస్తుంది. ఇవన్నీ కఠోర సత్యాలు. అనంతర కాలంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న షీబా చడ్డా యువనిర్మాత భార్యగా నటించింది. తన భర్త దగ్గర ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటే భర్త చెప్పే కట్టుకథలు నమ్మేసే అమాయకురాలు. సినిమా ప్రపంచంలో ఇమిడిపోవాలని తహతహలాడుతూ ఉంటుంది. యువనిర్మాతగా అలీ ఖాన్ నటించాడు. ఇలాంటి గోముఖవ్యాఘ్రాలు కూడా సినీరంగంలో ఉంటాయి. వీటిని తప్పించుకు పోవాలి.  ఇన్ని పాత్రలను సమన్వయం చేసుకుంటూ జోయా ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు అద్భుతమని చెప్పాలి.

హాస్యం కూడా బాగా పండింది. విక్రమ్‌కి ఇచ్చే పారితోషికం విషయంలో రోమీ జిత్తులమారిగా వ్యవహరిస్తాడు. జఫర్‌కి యాభై వేలు ఇచ్చానని, ఐదు తన లక్కీ నంబరని, ఈ పారితోషికంతో అతని కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెబుతాడు. ఈ విషయం తెలిసి నీనా నవ్వుతుంది. “ఆయనకి కుదిరితే తన లక్కీ నంబర్ సున్నా అని కూడా చెప్పగలడు” అని అంటుంది. రోమీని ఒప్పించి ఐదు లక్షలు ఇప్పిస్తుంది. సినీరంగంలో అందరూ గోముఖవ్యాఘ్రాలే ఉండరు మరి. ముఖ్యకథ ఎలా ఉన్నా విక్రమ్‌కి, నిక్కీకి ప్రేమాయణం జరుగుతోందని వార్తలు వస్తాయి. విక్రమ్, సోనాల అనుబంధం గురించి కూడా ఒక పత్రికలో రాస్తారు. నీనా ఈ వార్తలు చదివి నిక్కీని విక్రమ్‌కి దూరంగా ఉండమని చెబుతుంది. సినిమా విడుదలై హిట్టయిన వెంటనే నిక్కీని విక్రమ్‌కి ఫోన్ చేయమంటుంది. “అప్పుడేమో దూరంగా ఉండమన్నావు. ఇప్పుడు ఇలా అంటావేంటి?” అని నిక్కీ అడిగితే “ఇప్పుడు మీరిద్దరూ హిట్ జంట. నిర్మాతలు మీ ఇద్దరినీ పెట్టి సినిమాలు తీయాలనుకుంటారు” అంటుంది. “నువ్వెలాంటి మనిషివో నాకు అర్థం కావట్లేదు” అని నిక్కీ అంటే “నీకెలా అర్థమౌతుంది? నా తల్లి నన్ను పదహారేళ్ళ వయసులో నిర్మాతల దగ్గరకి పంపించేది. దానితో పోలిస్తే ఇదెంత? నోరు మూసుకో” అంటుంది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ. నిట్టూర్చటం మన వంతు అవుతుంది.

జోయాకి ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా అయాన్ ముఖర్జీ (‘వేక్ అప్ సిడ్’) తో పాటు సంయుక్తంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. రిషి కపూర్, డింపుల్ కపాడియాలకి ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సహాయనటి విభాగాల్లో నామినేషన్లు వచ్చాయి. ‘బాబీ’ సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరినీ ఈ చిత్రంలో చూసి పెదాల మీద చిరునవ్వు వస్తుంది. అప్పుడు రిషి కపూర్ రాజ్ కపూర్ కొడుకుగా అవకాశం అందుకున్నాడు. డింపుల్ కపాడియా బయటి నుంచి వచ్చి స్టార్ అయింది. ఈ చిత్రం ఒక సందర్భంలో రోమీ నీనా గురించి “షిఫాన్ చీరలో ఉన్న మొసలి” అంటాడు. తాను జిత్తులమారి నక్క అని ఆమెకి తెలుసని అతనికీ తెలుసే ఉంటుంది. ఆత్మస్తుతి, పరనింద లోనే వీళ్ళంతా కాలం వెళ్ళదీస్తూ ఉంటారు.

ఈ చిత్రం ముగింపు చాలా బావుంటుంది. దాని గురించి మాట్లాడాలంటే మిగతా కథ చెప్పాలి. మిగతా కథ తెలుసుకోవద్దనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత చదవవచ్చు.

తన అవకాశం పోయినా విక్రమ్‌కి అవకాశం వచ్చినందుకు సోనా ఎంతో సంతోషిస్తుంది. పాత్రికేయుడైన ఆమె మిత్రుడు “నీకేం, నువ్వు హీరో భార్యవి అవుతావు” అని అంటాడు. ఆమె విక్రమ్ సంతోషంలోనే తన సంతోషం ఉందని భావిస్తుంది. సినిమా ఔట్ డోర్ షూటింగ్‌లో నిక్కీ విక్రమ్ వెంటపడుతుంది. “నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?” అని అడుగుతుంది. “లేదు” అని అబద్ధం చెబుతాడు. ఇద్దరి ఎఫెయిర్ మొదలవుతుంది. ఈ విషయం చూచాయగా సోనాకి తెలిసినా ఆమె నమ్మదు. విక్రమ్‌ని కలుసుకుందామని ఔట్‌డోర్ షూటింగ్ జరుగుతున్న ఊరికి వెళుతుంది. విక్రమ్ ఆమెని చూసి ఖంగు తింటాడు. తనతో పాటు హోటల్‌లో ఉంటే ఎబ్బెట్టుగా ఉంటుందని అంటాడు. సోనా విస్తుపోతుంది. ఆమె స్నేహితురాలు “లోకం తీరే అంత. అతన్ని మర్చిపో” అని ఆమెకి సర్దిచెబుతుంది.

సోనా మిత్రుడైన పాత్రికేయుడు ఎడిటర్ చెప్పటంతో విక్రమ్ నిక్కీల ప్రేమాయణం గురించి రాస్తాడు. విక్రమ్ సోనాని ప్రేమించేవాడని కూడా రాస్తాడు. ఈ విషయం సోనాకి తెలియదు. అది చదివి నిక్కీ విక్రమ్‌తో తెగతెంపులు చేసుకుంటుంది. విక్రమ్ సోనా దగ్గరకి వచ్చి “నువ్వే ఇదంతా రాయించావు కదా! అంతగా వార్తల్లోకి ఎక్కాలనుంటే సొంతంగా ఏమైనా సాధించి చూపించు. నా మీద బురద చల్లకు” అంటాడు. సోనా అవాక్కయి ఉండిపోతుంది. పాత్రికేయుడి దగ్గరకి వెళ్ళి “నా గురించి ఎవరు రాయమన్నారు?” అని అతణ్ణి కొడుతుంది. అతను అపరాధభావంతో విక్రమ్ ఎదురుపడినపుడు అతనికి నిజం చెబుతాడు, సోనాకి తాను రాసిన వార్త గురించి తెలియదని. అప్పటికే సినిమా విడుదలై హిట్టవుతుంది. అదే రోజు విక్రమ్‌కి షారుఖ్ ఖాన్ ఎదురుపడతాడు. “స్టార్డమ్ ఒక మత్తు లాంటిది. గతంలో నీ పక్కన ఉన్నవారే నీ నిజమైన శ్రేయోభిలాషులు. వారిని మర్చిపోకు” అని చెబుతాడు.

విక్రమ్ సోనాని కలుసుకుంటాడు. తనని క్షమించమని అంటాడు. తనకి తోడుగా ఉండమని అడుగుతాడు. “నువ్వు ఎంత స్వార్థపరుడివో తెలుస్తోంది. నీకు తోడుగా ఉండమంటున్నావు కానీ నా ఆశలు, ఆశయాలు అడిగావా? ఈరోజు అపరాధభావంతో నా దగ్గరకు తిరిగి వచ్చావు. రేపు ఇంకో కొత్త అనుభవం కోసం నన్ను వదిలిపోతావు. నీ తప్పు కాదు. కొందరి స్వభావాలే అంత” అంటుంది. ఎంతో పరిణతి ఉన్న మాటలివి. ఆమె అతని స్వభావాన్ని అర్థం చేసుకుంది. తన సంతోషం అతని సంతోషంలో కాదని, తన సంతోషం తన చేతుల్లో ఉందని తెలుసుకుంటుంది. అతని మీద కోపం ఉందా? లేదు. అతని స్వభావమే అంత అయినపుడు అతను కూడా అశక్తుడే కదా! అతను మారాడని నమ్మకం ఎలా ఉంటుంది? పైగా ఒక నిర్మాతని నమ్మి మోసపోయింది. విక్రమ్ నిక్కీ తన వెంటపడగానే ఆమెకి వశుడైపోతాడు. చపలచిత్తం. చేసింది చాలక సోనాని నిందిస్తాడు. ఇలాంటివారిని డబ్బు కోసం ‘ప్రేమించేవాళ్ళు’, క్షమించేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. సోనాకి ఆ అవసరం లేదు.

చివరికి సోనా “చిన్న చిన్న వేషాలు వేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నాకిష్టమైన పని చేస్తున్నాను. ఇంతకన్నా ఏం కావాలి? పెద్ద స్టార్ ని కాలేదని కుంగిపోవటం కంటే నటినైనందుకు అనందిస్తున్నాను. ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మన విజయం మన చేతుల్లోనే ఉందనే మాట నాకిప్పుడు అర్థమైంది” అంటుంది. సంతృప్తే అసలైన విజయమనే సందేశం ఇందులో ఉంది. పైన పాటలో చెప్పినట్టు శాంతి బయటి నుంచి రాదు. మనసులో పుట్టాలి. ఎవరి శాంతిని వారే సృష్టించుకోవాలి. ఎంత దగ్గరి వారైనా ఎవరి మీదా అధారపడకూడదు. నమ్మకస్తులైతే తోడుగా ఉండొచ్చు. కానీ ఒకరు లేకపోతే ఉండలేననే భావన రాకూడదు. సంతోషం సగం బలమైతే శాంతి పరిపూర్ణమైన శక్తి.

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here