[dropcap]ఆ[/dropcap]షాఢం వెళ్ళిపోయింది. శ్రావణం కూడా చివరికొచ్చింది. వానలు వెనకపట్టాయి గాని అప్పుడప్పుడూ మేమున్నామంటూ మబ్బులు నాలుగు చినుకులను రాల్చిపోతూనే ఉన్నాయి.
ప్రస్రవణగిరి మీద అప్పుడే కొంచెం వాన కురిసి వెలిసింది. మబ్బులన్నీ వట్టి పోయి సన్నగా వీచిన గాలికి తేలుకుంటూ దూరంగా వెళ్ళిపోయాయి. ఆకాశం నిర్మేఘంగా, నిశ్చలంగా ఉంది. రాబోయే శరత్తును సూచిస్తూ చంద్రుడు కొంచెం వెలుగులు వెలారిస్తున్నాడు.
కొండ మీద ఒక గుహలో బస. అన్నగారి కోసం ఒక నునుపైన వెడల్పాటి బండను – కింద రాళ్ళ మోపు పెట్టి పానుపుగా చేసేందుకు సిద్ధం చేసి వుంచాడు లక్ష్మణుడు. మరీ కఠినంగా ఉండకుండా ఉండేందుకు జింక చర్మం పరిచాడు. నాలుగైదు నారగుడ్డలు మడత పెట్టి తలగడగా ఉంచాడు.
లక్ష్మణుడు తెచ్చిన రెండు ఎర్ర ముల్లంగి గడ్దలూ, రెండు బొంతరటి పళ్ళు, చేరెడు కలివె పండ్లూ, కాసిని ఇరికి పండ్లూ నమిలి ఆ పూటకు భోజనమైందనిపించాడు అన్నగారు.
“ఎంతసేపు నా సంగతే చూస్తావు గాని, ఇంతకూ నువ్వేమైనా తిన్నావా లేదా లక్ష్మణా?” అన్నాడు శ్రీరామచంద్రమూర్తి, తమ్ముణ్ణి.
“ఇదుగో, ఇక తింటానన్నా” అన్నాడు లక్ష్మణుడు. అన్నగారి శయ్యను సవరిస్తూ రోజూ కంటతడి పెడుతూనే ఉంటాడు లక్ష్మణుడు. సరస రాజాన్నభోజనం, షడ్రుచులతో, పంచభక్ష్య పాయసాలతో తింటూ, పరిచారకుల సేవలందుకుంటూ, హంసతూలికా తల్పాల మీద శయనించవలసిన ఈ సార్వభౌముడు, ఇలా రుచీ పచీ లేని దుంపలు తింటూ, బండరాళ్ళ మీద పడుకుంటూ, ఈ కొండల్లో, ఈ అడవుల్లో, ఈ క్రూర జంతువుల మధ్య, ఎప్పుడొచ్చి మీద పడతారో తెలియని రాక్షసుల మధ్య – బాధలు పడటం ఏమిటా అని కుమిలిపోతూనే ఉంటాడు. కానీ అన్నగారికి ఆ దిగులే లేదు. సుఖమూ, దుఃఖమూ అన్నీ ఒకటే ఆయనకు. ఇక తను కూడా మహారాజ కుమారుడినేననీ – ఆ బాధలన్నీ తను కూడా పడుతున్నాననీ ఎప్పుడూ మనసులో అనిపించదు ఆ తమ్ముడికి.
“పడుకోన్నా, పొద్దుపోయింది” అన్నాడు లక్ష్మణుడు. “అలాగే, నీవు కూడా కాస్త ఏదన్నా తిని – ఇక పడుకో” అన్నాడు శ్రీరాముడు.
“కొంచెం సేపు కాళ్ళొత్తి వెళతానన్నా” అని లక్ష్మణుడు నేలపై అన్న కాళ్ళ దగ్గర కూచుని ఆయన జంఘాలూ, పాదాలు నెమ్మదిగా ఒత్తసాగాడు. శ్రీరాముడు ఆలోచించుకుంటూ పడుకున్నాడు.
ఇంకేమి ఆలోచనుంది రాముడికి. సీత ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో, ఎన్ని ఇడుములు పడుతున్నదో అనేది తప్ప. ఈ వర్షాకాలం ఐపోగానే ఇక వెదకడమే. అగ్నిసాక్షిగా మైత్రి నెరిపి, ‘నీకు నేను సాయపడతాను’ అని మాట ఇచ్చిన వానరరాజు సుగ్రీవుడు శ్రద్ధ తీసుకొంటాడో లేదో! తనకు రాజ్యం వచ్చి తన పని అయింది కాబట్టి అంత ఆసక్తి చూపడో అనుకుంటూ, పడుకున్నాడు.
లక్ష్మణుడు కాళ్ళొత్తుతున్నాడు. పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ఉన్నట్టుండి దగ్గర్లోనే ఏదో మెదిలిన చప్పుడు వినిపించింది.
“ఏమిటో చూడు లక్ష్మణా” అన్న్నాడు రాముడు.
“నేనేలే స్వామీ” – అంటూ ముందుకు వచ్చి రాముడి కాళ్ళ దగ్గర కూలబడ్డాడు హనుమ. తనూ మరో కాలు ఒత్తసాగాడు.
“నువ్విప్పుడు ఇక్కడేంటి హనుమా. హాయిగా కిష్కింధలో సుఖంగా ఉండకుండా, ఈ కొండ మీదకి ఇప్పుడెందుకు వచ్చావయ్యా!” అన్నాడు రాముడు.
“నా సుఖం నీ కాళ్ళ దగ్గర గాక మరెక్కడా ఉండదు స్వామీ! ఐనా కోతికి కొండలూ చెట్లూ గాక పట్టణాలు పడవులే రామయ్యా” అన్నాడు హనుమ.
“భలేవాడివే హనుమా. వాలీ, సుగ్రీవుడూ, జాంబవంతుడూ – అందరూ పెళ్ళి చేసుకుని భార్యలతో కాపురం చేస్తూ సుఖంగా ఉన్నారు గదా, నువ్వెందుకు పెళ్ళి చేసుకోలేదు” అడిగాడు రాముడు.
“ఏం లేదు స్వామీ. భార్యను అనుక్షణమూ జాగర్తగా కాపాడుకుంటుండాల. ఎప్పుడు ఏ రాక్షసుడు వచ్చి తీసుకుపోతాడోనని కాచుకుంటుండాల. ఎందుకొచ్చిందదంతా” అన్నాడు హనుమ.
లక్ష్మణుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. పరిచయమై ఒక నెలైనా ఐందో లేదో – రామయ్య దగ్గర హనుమ కుండే చనువు ఆయన తమ్ముళ్ళకు కూడా లేదు. అదేమి అనుబంధమో అనుకున్నాడు. శ్రీరాముడు ఒక నిట్టూర్పు విడిచాడు.
“సుగ్రీవుడు రాజైంతర్వాత ఒక్కసారి కూడా కనిపించలేదు. నాకు నిజంగానే సాయం చేస్తాడంటావా ఆంజనేయా?” అన్నాడు రాముడు.
“సుగ్రీవుడు పరమ ధర్మమూర్తి స్వామీ. మీరేమీ అనుమానించకండి. కాకపోతే చాలా రోజులు ఇబ్బందులు పడి, భార్యకు దూరమై – ఇప్పుడే కదా కొంచెం ఊపిరి పీల్చుకున్నది. పైగా మేం కోతులం. కొంచెం చపలత్వం ఉంటుంది గదా” అన్నాడు హనుమ.
“నువ్వే ఏదైనా చేయాలి హనుమా. సీత లేకపోతే” అంటుండంగా రాముడి కళ్ళలో తడి. లక్ష్మణుడూ, ఆంజనేయుడూ చలించిపోయినారు ఆయన్ను చూసి. సీతమ్మ కనిపించిందాకా ఈయన మామూలు మనిషి కాలేదు. అంత మహా వీరుడు ఇంత బేలగా పరితపించడం ఆశ్చర్యంగా ఉంది.
“ఊరుకో స్వామీ. ఇకెన్ని రోజులు. వానలు తగ్గిపోయినాయి. సుగ్రీవుడు లోకంలో ఉండే సర్వ వానరులకూ, భల్లూక వీరులకూ కబురుపెట్టాడు. ఇవ్వాళ్ళో రేపో అందరూ వస్తారు. నేనెంత వాడిని స్వామీ. వానరుల్లో మహా వీరులున్నారు. గజుడూ, గవయుడూ, గవాక్షుడూ, నీలుడూ, నలుడూ, పనసుడూ, మైందుడూ, ద్వివిదుడూ, అంగదుడూ, శతపలీ, సుషేణుడూ ఒక్కొక్కరూ లోకాల్ను అల్లాడించగల వీరులు. ఆ పెద్దాయన జాంబవంతుడున్నాడు. ఆయన సాక్షాత్తూ శివుడితో సమానమైన పరాక్రమశాలి. మీరేమీ దిగులు పడకండి. అమ్మను వెదికి తెచ్చే పూచీ నాది. మీరు నిశ్చింతగా ఉండండి” అన్నాడు హనుమ.
ఆంజనేయుడి మాటలతో కొంత స్తిమితపడ్డాడు రామయ్య.
కొంచెం సేపయిం తర్వాత మామూలు ముచ్చట్లలో పడి “హనుమా, నీ దవడ అందరి లాగా లేదే. దెబ్బేమైనా తగిలిందా చిన్నప్పుడు” అని అడిగాడు రాముడు.
దవడ తడుముకుంటూ అన్నాడు ఆంజనేయుడు “కోతిని గదా స్వామీ. చిన్నప్పుడు కోతి పని చేశాను. దవడ పగిలింది. అంతే” ఆన్నాడు హనుమ.
“నేను చెపుతా అన్నా. నాకు సుగ్రీవుడు చెప్పాడులే. ఈ హనుమ అట్టా ఉన్నాడు గాని సామాన్యుడు కాదు. పుట్టీ పుట్టగానే తూర్పున సూర్యుడు ఉదయిస్తుంటే చూచి, అదేదో పండు అనుకొని ఎగిరి మింగుదామని సూర్యుడికి దగ్గరి దగ్గరికి పోయాట్ట. ఎవర్రా ఇతనూ అనుకొని ఇంద్రుడు వజ్రాయుధంతో ఒక్కటిచ్చాట్ట. అదీ ఆ దెబ్బ. అంత వజ్రాయుధమూ ఈయన్నేమీ చేయలేకపోయింది. దవడ కొంచెం కదిలింది అంతే. తన కొడుక్కు జర్రిగిన కష్టం చూసి వాయుదేవుడు సత్యాగ్రహం చేసి సహాయ నిరాకరణ చేసేసరికి బ్రహ్మ, శివుడూ ఇంద్రుడూ ఇంకా అందరు దేవతలూ వచ్చి ఎన్నో వరాలు ఇచ్చారు ఈయనకు. ఈ లోకంలో ఏ ఆయుధమూ హనుమను ఏమీ చేయలేదట” అని వివరించాడు లక్ష్మణుడు,
శ్రీరాముడు శయ్య మీంచి లేచి కూచుని, ఆశ్చర్యంతో “ఏందీ, నువ్వు సూర్యుణ్ణి మింగబోయావా?” అంటూ అడిగాడు.
“ఏందోలే స్వామీ. చిన్ననాటి చిలిపి పనులను కూడా గొప్పగా చెపుతాడు ఈ లక్ష్మణయ్య. అంతా మా తండ్రి దయ” అన్నాడు హనుమ.
మళ్ళీ పడుకున్న శ్రీరాముడు కొంచెం సేపాగి, “హనుమా ఎంతో తెలివిగా మాట్లాడుతావు. నీ నోట భాష స్వచ్ఛంగా ఉంటుంది. నిన్ను చూస్తుంటే వేద వేదాంగాలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడిలాగా అనిపిస్తావు. వ్యాకరణం మూర్తీభవించినట్లుంటావు. ఏ గురువు దగ్గర చదువుకున్నావు?” అని అడిగాడు.
“నేను పండు అనుకొని సూర్య భగవానుడిని మ్రింగబోయిన సందర్భంలోనే – మా నాయన నన్ను సూర్యుడి వద్ద విద్య నేర్చుకోమని చెప్పాడు. నేను ఆయనను ప్రార్థించాను. ముందు ఆయన ఒప్పుకోలేదు. ‘నేను ఒక్క క్షణం ఎక్కడా నిలవడానికి వీల్లేదు. నా రథం మహావేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మాండంలోని అన్ని గ్రహాలు, నన్ను అనుసరించే పరిభ్రమిస్తుంటాయి. నిలకడ లేని నాతో నీకు కుదరదులే’ అన్నాడు”
“మరి ఎట్లా చేశావు హనుమా” అడిగాడు స్వామి.
“దాందేముందిలే రామయ్యా! ఆ మహానుభావుడు ఎంత వేగంతో వెళతాడో అంత వేగంతో నేనూ ఆయన వెంట పోయేవాణ్ణి. ఆయన చెప్పడమూ, నేను వినడమూ. అలా ఆ పరమాత్ముని దయతో ఓ అక్షరమ్ముక్క వంట బట్టింది” అని ఆకాశం వైపు చూసి సూర్యుణ్ణి తలచుకొని నమస్కరించాడు హనుమ.
“మేమేదో బుద్ధిగా బాసిం పట్టు వేసుకొని వశిష్ఠ మహాముని పాదాల దగ్గర కూచుని చదువుకున్నాం నలుగురు అన్నదమ్ములమూనూ. నువ్వు పరిగెత్తుతూ నేర్చుకున్నావన్న మాట. భలే” అన్నాడు రాముడు.
“మా గురువు వశిష్ఠ మహాముని తన చేతి బ్రహ్మదండంతో పధ్నాలుగు లోకాలను నియంత్రించగల మహానుభావుడు. ఇక ఆ తల్లి, మా గురుపత్ని ఆ అరుంధతీ దేవి – ఆమె మహత్య్మం ఇదీ అని ఎవరూ చెప్పలేరు హనుమా” అన్నాడు లక్ష్మణుడు గురువునూ, గురుపత్నినీ పారవశ్యంతో తలచుకుంటూ.
“ఇంక నిద్రపో స్వామీ. రాత్రి దగ్గర దగ్గర సగం బడ గడిచింది. నేనూ లక్ష్మణయ్యా ఆ పక్కన కూచుంటాము” అని హనుమ లేచాడు. లక్ష్మణుడూ లేచాడు.
“జాగర్త లక్ష్మణా, పురుగూ పుట్రా ఉంటాయి” అని జాగ్రత్త చెప్పాడు అన్నగారు. తమ్ముడు నవ్వుకున్నాడు.
“నేనుండగా తమ్ముడి మీద ఈగ వాలనిస్తానా స్వామీ. నా ప్రాణం అడ్డం వేయ్యనూ ఆయన ప్రాణానికి” అన్నాడు హనుమ.
“అంత పని చేయగలవాడివే” అన్నాడు లక్ష్మణుడు.
***
ఒక పది రోజులు గడిచిపోయాయి. శరత్తు ప్రవేశించింది. దిక్కులన్నీ తేటపడ్డాయి. సుగ్రీవుడింకా రాలేదేమా అని ఆదుర్దా పడుతూ రాముడు, తమ్ముణ్ణి కిష్కింధకు పంపి గుర్తు చేసిన తరువాత – అంగదాది మహావీరులతో కలిసి సుగ్రీవుడు రాముడి దగ్గరకి – ప్రస్రవణగిరికి వచ్చాడు. గుండెల్లో మైత్రీ భావం పొంగుతుండగా ప్రేమగా పలకరించుకున్నారు.
“స్వామీ, మీ బాధలో మీరుండి నేనేమీ చేయడం లేదే అనుకున్నారేమో గాని, సహాయం పొంది మరచిపోయే కృతఘ్నుడిని కాదు రామా నేను. జరగాల్సిన పని జరిగిపోతూనే ఉన్నది. సర్వభూమండలంలో ఉండే మహావీరులైన వానరులందరినీ రప్పించాను. వారంతా కిష్కింధలోనూ, ఋష్యమూకం మీదా, ఈ చుట్టూ ఉండే కొండల మీదా, చెట్ల మీదా బస చేసి ఉన్నారు. మీరు ఊ అనడమే ఆలస్యం, అమ్మను వెదకడానికి బయలుదేరుతారు” అన్నాడు సుగ్రీవుడు.
స్వామి ముఖం వికసించింది. “ఇంక ఆలస్యమెందుకు? బయల్దేరదియ్యి” అని అనుమతి ఇచ్చాడు శ్రీరాముడు. రామలక్ష్మణుల సమక్షంలో వానర ముఖ్యులని పిలిచాడు సుగ్రీవుడు. మహావీరుడైన వినతుణ్ణి పిలిచి “వినతా, నీకిష్టమైన వీరులను తోడు తీసుకుని నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళు. అక్కడి పురాలనూ, గ్రామాలనూ, కొండలనూ, కోనలనూ అంగుళమంగుళం గాలించు. సముద్రం మధ్యలో వందలాది ద్వీపాలుంటాయి. రాక్షసుడు సీతామాతను అక్కడ దాచాడేమో చూడు. ఏ మాత్రము అలసత్వం లేకుండా నీ అన్వేషణ సాగించు” అని ఆజ్ఞ ఇచ్చాడు.
ఆ తర్వాత సుషేణుణ్ణి పిలిచాడు. “స్వామీ, ఈయన మా మామగారు. తారా మహాదేవికి తండ్రి. ఈయన శౌర్య పరాక్రమాలు చూసి తీరవలసిందే గాని చెప్పనలవి గాదు” అని ఆయన్ను రామలక్ష్మణులకు పరిచయం చేసి, “మామా నీవు పడమటి దిక్కుకు వెళ్ళు. రెండు లక్షల మంది వానర వీరులను వెంటబెట్టుకొనిపో! సీతమ్మ తల్లి జాడను గాలించు. నీకు వివరించి చెప్పాల్సిందేముంది? ఇది స్వామి కార్యము. ఏ మాత్రం అశ్రద్ధ లేకుండా వెదుకు” అని ఆదేశించాడు.
ఆ పిమ్మట శతవలి అనే కపిరాజును పిలిచి, “శతవలీ! నీవు ఉత్తర దిక్కుకుపో! ఉత్తర దిక్కుకు తలమానికమైన హిమాలయాల్లో అణువణువునా గాలించు. అడవులూ, కొండలూ, కోనలూ, ఊళ్ళూ, బీళ్ళూ అంతా వెతుకు. ధృవ ప్రాంతం దాకా వెళ్ళు. సీతమ్మ ఆచూకీ ఎలాగైనా కనుక్కొని రావాలి” అని అతనికి తగిన సూచనలు ఇచ్చాడు.
“శ్రీరామచంద్రా! జటాయువు – రావణాసురుడు సీతమ్మను తీసుకొని దక్షిణి దిక్కు వైపు పోయాడని చెప్పాడన్నారు గదా! ఆ రాక్షసుడు దక్షిణాన ఎక్కడో ఉంటాడు. ఆ దిక్కునే జాగ్రత్తగా గాలించాలి. యువరాజు అంగదుని నాయకత్వంలో మహా వీరులని దక్షిణానికి పంపుదాం. నా సేనాధిపతి నీలూడూ, శరారీ, శరగుల్ముడూ, గజుడూ, గవయుడూ, గవాక్షుదూ, ఋషభుడూ, మైంద ద్వివిదులూ, గంధమానుడూ, మహాత్ముడు జాంబవంతుడూ – వీరంతా దక్షిణ దిక్కుకు వెళతారు. వీరితో హనుమంతుడు కూడా వెళతాడు” అన్నాడు సుగ్రీవుడు.
“హనుమా” అని ఆంజనేయుణ్ణి దగ్గరకి పిలిచాడు స్వామి. అతని కళ్ళల్లోకి అలాగే రెండు నిముషాలు దీర్ఘంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ చూపుల్లో అర్థమేమిటో వారిద్దరికే తెలియాలి. రాముడి కళ్ళల్లో తడిని చూసి చలించిపోయాడు హనుమ. రాముడు మాట్లాడకుండా, నెమ్మదిగా తన చేతి రత్నాంగుళీయకాన్ని తీసి హనుమ చేతుల్లో ఉంచాడు. మౌనంగా దాన్ని స్వీకరించి రామునికి ఆశ్వాసం కలిగిస్తున్నటు చూసి – అంగదాదుల వెనుక నడిచాడు హనుమంతుడు.
“మనకిక సమయం తక్కువగా ఉంది. మీరందరూ సరిగ్గా నెల రోజుల్లోగా తిరిగి రావాలి. ఎవరు నాకు, సీతమ్మ తల్లికి సంబంధించిన వార్త తెస్తారో, వారికి నా ప్రాణమైనా, నా సర్వ రాజ్యమైనా సరే ఇస్తాను. ఎవరైనా ఆలస్యం చేస్తే మాత్రం ఊరుకోను. తెలుసు గదా” అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవాజ్ఞ అంటే ఏమిటో అక్కడ అందరికీ తెలుసు.
ఎవరికి అప్పగించిన దిక్కుకు వారు కదలిపోయారు వానరులు. అంగదాదులు పోతున్న దిక్కుకు కొద్ది దూరం వెంబడించారు రామలక్ష్మణులూ, సుగ్రీవుడూ. వారు కనుమరుగయ్యేంత దాకా హనుమంతుణ్ణే చూస్తూనే ఉన్నాడు రాముడు. ఆర్తి నిండి కళ్ళతో అన్ననే చూస్తున్నాడు లక్ష్మణుడు. వాళ్ళిద్దర్నీ చూస్తూ అలానే ఉండిపోయాడు సుగ్రీవుడు.
నెల రోజుల గడువు ఇక రెండు మూడు రోజులలో ముగిసిపోతుందనగా వెనకా ముందుగా వినతుడూ, శతవలీ, సుషేణుడు వచ్చేశారు. సీతమ్మ జాడ వాళ్ళకు తెలియలేదు. “మేము చూడని చోటు లేదు మహారాజా. చాలా శ్రద్ధగా అన్ని చోట్లా గాలించాము. జల్లెడ పట్టినట్లు వెదికాము. ప్రయోజనం కనిపించలేదు” అన్నారు వారు.
దక్షిణానికి పోయిన వాళ్ళ సంగతే ఏమీ తెలియలేదు. నెల గడువు గడిచి మూడు రోజులయింది. బాగా డీలా పడిపోయాడు రాముడు. నిరుత్సాహంతో ఉన్న అన్నను గమనించుకుంటూ, చెట్ల వెనుక నక్కుతూ కాలు గాలిన పిల్లిగా తిరుగుతున్నాడు లక్ష్మణుడు. సుగ్రీవునికి నిస్సత్తువ ఆవరించింది. ‘ఏమైనారు వీళ్ళు. ఇంకా ఎందుకు రాలేదు. సీతమ్మ ఆచూకీ తెలియలేదని చెపితే చంపేస్తాననుకొని వారే ప్రాణాలు తీసుకున్నారా? అలా జరగడానికి వీళ్ళేదే. పోయిన వారెవరూ సామాన్యులు కాదే! ఒక్కొక్కడూ భూమ్యాకాశాలను తల్లక్రిందులు చేయగలిగినవాడే’ అనుకుంటూ – ఆ మాటా ఈ మాటా చెపుతూ లక్ష్మణుడి పక్కన కూచున్న సుగ్రీవుడికి ఆకాశం మీద నాలుగైదు చుక్కల్లాంటివి కనిపించాయి. దూరాన పక్షులేమో ఎగురుతున్నాయి అనుకొన్నాడు. క్షణంలో అవి పక్షులు కాదు ఇంకా పెద్దవైనవేమో అనుకుంటుండగా ఏడెనిమిది వానరాలు ఆకాశమార్గాన వస్తున్నట్టు కనిపించింది. మరొక్క నిముషంలో ఆ కోతులు వచ్చి సుగ్రీవుడి కాళ్ళ దగ్గర దిగాయి. గుర్తుపట్టాడు సుగ్రీవుడు. ఆ వచ్చింది తన మేనమామ అయిన దధిముఖుడూ, అతని అనుచరులూ. దధిముఖుడు తన ఉద్యానవనమైన మధువనం రక్షణను నిర్వహించే అధికారి. ఏందో భయం భయంగా ఉన్నాడు. ఒంటి నిండా దెబ్బల గాయాలు. ఆయన్ను కొట్టగల ధైర్యమెవరికుంది? అసలేం జరిగింది అని అడగబోతుండగానే దధిముఖుడు మొదలుపెట్టాడు.
“ఇంక నా చేతగాదు మహారాజా! మహానుభావుడైన మీ తండ్రిగారు ఋక్షరజసుని కాలంలో నిశ్చింతగా పని చేశాను. మీ అన్నగారు వాలి మహారాజు తరంలో ఎంతో బాగా పని చేస్తున్నానని మెచ్చుకునేవాడు. ఇంక నా చేత గాదండయ్యా! నన్నీ పని నుంచి తప్పించండి. ఏ చెట్లల్లోనో, పుట్టల్లోనో నా బతుకేదో నేను బతుకుతాను” అన్నాడు మహా వీరుడైన దధిముఖుడు.
సుగ్రీవునికేమీ అర్థం కాలేదు. “అసలేం జరిగింది మామా?” అన్నాడు.
“మహారాజా! ఏమి చెప్పమంటారు. అందరూ పెద్దవాళ్ళే. అందరూ గొప్పవాళ్ళే. యువరాజు అంగదుడూ, మైందద్వివిదులూ, గజ, గవయ, గవాక్షులూ – ఆఖరికి ఆ పెద్దాయన జాంబవంతుడూ, హనుమంతుడూ – ఎవరు తక్కువ్వాళ్ళు. వాళ్ళిట్టా చేస్తారని నేను అనుకోలేదు మహారాజా! అందరూ వనం మీద పడ్డారు. కొమ్మలు విరిచారు. పళ్ళు ఇష్టం వచ్చినట్టు కోసుకు తిన్నారు. పూలు చిదిమారు. కసుగాయలను కూడా పెరికి నలిపేశారు. తేనెతుట్టలన్నీ చిదిమి తేనె అంతా తాగేశారు. తాగినంత పారబోశారు. అడ్డంపోతే నన్ను చితక్కొట్టారు మహారాజా – ఇక…”
దధిముఖుడి మాట పూర్తి కానే లేదు. సుగ్రీవుడు పెద్ద కేక పెట్టుకుంటూ పైకెగిరి, కిందకి దూకాడు. తోకను టపాటపా నేలకేసి కొట్టాడు. పరమానందంగా “లక్ష్మణయ్యా” అని కేకేశాడు. ఆశ్చర్యంగా చూస్తున్న లక్ష్మణుడితో “స్వామీ! మనం శుభవార్త వినబోతున్నామయ్యా! వాళ్ళొచ్చేశారు. పని సాధించుకొని వచ్చారు. సందేహం లేదు. మామా! వెంటనే వెళ్ళి వాళ్ళను పంపించు. వనాన్ని గూర్చి చింతించకు. మొన్నటి దాకా వానలు కురుస్తూనే ఉన్నాయి గదా! నేలంతా తడిగానే ఉంది. విరిగిన చెట్లన్నీ నాల్గు రోజుల్లో చిగుర్లు తొడగవూ – పో పో! ముందు వాళ్లను పంపించు” అని దధిముఖుణ్ణి పంపించి, లక్ష్మణుడితో కలసి అల్లంత దూరంలో కూచుని ఉన్న రాముడి దగ్గరకి పోయాడు. ఆయన రెండు చేతులూ పట్టుకుని ఊపుతూ “స్వామీ! మనం మంచి వార్త వినబోతున్నాం. దక్షిణానికి పోయిన మన వాళ్ళందరూ వచ్చేశారు. పని సఫలం అయిందనుకో! ఆ ఆనందంతోనే వాళ్ళు వనం మీద పడి సంబరాలు చేసుకున్నారు. లేకపోతే నాకు అత్యంత ప్రియమైన ఆ తోటను అట్లా పాడు చెయ్యరు. తప్పకుండా సీతమ్మ తల్లి కనిపించి ఉంటుంది. అమ్మతో మాట్లాడి ఉంటారు. అదీ ఎవరో కాదు, హనుమంతుడే చేసి ఉంటాడు ఆ పని! ఆంజనేయుడు సామాన్యుడు కాదు స్వామీ! కారణజన్ముడు. కార్యదీక్షా, నేర్పూ, శౌర్యమూ, ధీశక్తీ, ఉచితానుచిత వివేచనా, కార్యనిర్వహణ సామర్థ్యమ్మూ – అన్నీ మూర్తీభవించిన వాడు ఆ మహనీయుడు. మా తండ్రి సూర్యదేవునికి తేజస్సు ఎంత సహజమో – హనుమంతుడికి ఆ గుణాలన్నీ అంత సహజమైనవి. ఆయనకు చేతగానిది ముజ్జగాల్లోనూ లేదు. ఇక నీవు దిగులు మానుకో స్వామీ! ఇక విల్లూ బాణమూ బయటకు తీసే సమయం వచ్చింది” అన్నాడు సుగ్రీవుడు.
“అదుగో వస్తున్నారు మనవాళ్ళు ఆకాశ మార్గాన. వాళ్ళ చప్పట్లూ, కేరింతలూ, కేకలూ ఇక్కడి దాకా వినబడుతున్నాయి. వారి సంబరం చూడు స్వామీ!” అని సుగ్రీవుడు అంటుండగానే అంగదుణ్ణి ముందుంచుకుని అందరు వానరులు నేలపైకి దూకారు.
దిగీ దిగగానే ఆంజనేయుడు వేరెవరి వంకా చూడలేదు. పరుగు పరుగున రాముడి దగ్గరకు పోయి, తన రెండు చేతులతో ఆయన పాదాలను పట్టుకుని, తలను ఆయన పాదాలకు తాకించి స్పష్టంగా “చూశాను స్వామీ! నిర్మల చరిత్రా సుకుశలీ ఐన సీతమ్మ తల్లిని చూశాను స్వామీ” అన్నాడు.
కళ్ళనిండా నీళ్ళు నిండి ఉండగా, ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి హనుమనే చూస్తూ ఉండిపోయాడు స్వామి. దాదాపు పది నెలల తర్వాత సీతమ్మను గురించిన తొలి వార్త!
‘ఎంత అద్భుతంగా చెప్పాడు హనుమ!’ అనుకున్నారు సుగ్రీవుడూ, జాంబవంతుడూ.
కనిపించిందా లేదా, ఏం చెపుతాడో అనే ఆత్రుత అన్నింటికన్నా ముందుంటుంది. చూశాను అనే మాట వినగానే సగం ఆరాటం తీరిపోతుంది. అందుకనే ముందుగా చూశాను స్వామీ అన్నాడు. ఆ వెనువెంటనే పరాయి వాడింట ఉన్న ఆడమనిషి ఎలా ఉందో అనే అనుమానాన్ని పటాపంచలు చేస్తూ నిర్మల చరిత్రను అనీ, ఆమె క్షేమ సమాచారం తెలుపుతూ సుకుశలీ అని చెప్పాడు. సీతమ్మ తల్లిని అనే మాట ఆఖర్న చెప్పాడు. ఆమె కోసమే పోయాడు, ఆమె వార్త కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎవరిని అనే విషయం ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. అందుకని సీతమ్మ తల్లిని అని ఆఖర్న చెప్పాడు. ‘వాక్యమ్ముల పద్ధతి నెరిగినవాడు మా మారుతి’ అని అనుకున్నారు ఆ పెద్దలిద్దరూ!
“నీవిచ్చిన ముద్రికను అమ్మకు ఇచ్చాను స్వామీ! ఆ తల్లి నీకిమ్మని ఇచ్చిన చూడామణి ఇదుగో” అంటూ మణిని రామయ్యకు ఇచ్చాడు హనుమంతుడు.
కళ్ళనిండా బాష్పాలతో దానిని తీసుకుని గుండెకు హత్తుకున్నాడు రాముడు. ఆనందంగా చూస్తున్న వానర వీరులతో “మా మామగారు జనక మహారాజు గారు యజ్ఞం చేస్తున్నప్పుడు స్వయంగా దేవేంద్రుడు మిథిలకు వచ్చాడు. పాల సముద్రంలో పుట్టిన ఈ చూడామణిని మా మామగారికి కానుకగా ఇచ్చాడు. మా తండ్రిగారు చూస్తూ ఉండగా, ఆయన అనుమతితో, మా మామగారూ అత్తగారూ కలసి మా పెండ్లిలో దీనిని సీత శిరస్సున అలంకరించారు. దీని నిప్పుడు చూడగానే మా తండ్రిగారినీ, అత్తమామలను చూసినట్లనిపించింది” అన్నాడు శ్రీరాముడు.
“సుగ్రీవా! మన సేన సన్నద్ధంగా ఉంది గదా!” అన్నాడు.
“మేము ఎప్పుడూ సన్నద్ధమే స్వామీ! దంష్ట్రాలూ, గోళ్ళూ, రాళ్ళూ, చెట్లూ ఇవే మా ఆయుధాలు. వీటి ముందు ఏ అస్త్రశస్త్రాలైనా దిగదుడుపే! మీరు ఆదేశిస్తే ఇక బయల్దేరడమే!” అన్నాడు సుగ్రీవుడు.
“సరే, రేపుదయమే, సూర్యోపాసనా, ప్రాతస్సంధ్యాది కార్యక్రమాలు కాగానే బయల్దేరుదాం” అన్నాడు రామయ్య.
***
ఆ సాయంత్రం రాముడూ, లక్ష్మణుడూ, హనుమా ఒంటరిగా కూర్చొని ఉన్నారు. వెలిగిపోతున్న కళ్ళతో ఏకాగ్రంగా రామచంద్రమూర్తినే చూస్తున్నాడు హనుమ.
“ఏంది హనుమా! కొత్తవాణ్ణి చూస్తున్నట్టు చూస్తున్నావు నన్ను” అన్నాడు రామయ్య.
“అవును స్వామీ! మీరు కొత్తగానే కనిపిస్తున్నారు. లంకకు పోకముందు ఎన్నిసార్లు చూడలేదు మిమ్మల్ని? అప్పుడేమీ అనిపించలేదు. అమ్మ దర్శనం చేసుకొన్న కళ్ళతో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా కన్పిస్తున్నారు. అసలు మీ ఇద్దర్నీ విడివిడిగా భావించడమే సాధ్యం కాదు సీతారామా!” అన్నాడు హనుమ. లక్ష్మణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు హనుమంతుడు చెపుతున్న ఈ అనుభూతి తనకు రోజూ అనుభవమయ్యేదే! ఏ మహాత్మునికి తాను తమ్మునిగా పుట్టాడో అ మహనీయుడు తన మీదనే నిత్యమూ శయనిస్తూ ఉంటునట్లు ఏదో పురాస్ఫూరణ లక్ష్మణుడికి!
“సీత ఎట్లా ఉన్నది హనుమా?” ఆర్తిగా అడిగాడు స్వామి!
“ఆమెకేమి స్వామీ! ఆమె మహాయోగిని. తపస్సు మూర్తీభవించిన తల్లి. ముందు లంకంతా తిరిగి చూసినా అమ్మ కనిపించలేదు. జగన్మాత దర్శనం కోసం జీవితకాలపు సాధన చేసినంత కఠోర ఏకాగ్ర దీక్షతో వెదకి చివరకు అశోక వాటిక దగ్గరికి చేరాను. ప్రాకారం మీదకి ఎక్కి చూస్తే దూరంగా ఒక పెద్ద ఇరుగుడు చెట్టు క్రింద ఒక జ్వాజ్వల్యమానమైన వెలుగు, కనులు మిరుమిట్లు కొలిపేటట్లు కనిపించింది. ఆ వెలుగుకు అలవాటు పడ్డాకా ఒక స్త్రీమూర్తి, మహా తపస్సులో కూర్చుని ఉన్న ఒక పరమ యోగిని, నిమీలిత నేత్రాలతో కన్పించింది. తల్లితో అది నా తొలి దర్శనం. నా జన్మ ధన్యమైంది అనుకున్నాను స్వామీ! చుట్టూ రాక్షసులున్నారని గానీ, తాను లంకలో ఉన్నానని గానీ ఆమెకు తెలివిడి లేదు. ఆ తపస్సుకు గమ్యమూ, లక్ష్యమూ, రూపమూ – అన్నీ నీవే స్వామీ! ఎంత మహాదృష్టం కల్పించావు తండ్రీ ఈ కోతికి!” అన్నాడు హనుమ.
“ఇంతకీ రావణుడు ఆమెను బాధించడం లేదు గదా!” అన్నాడు రాముడు.
పెద్దగా నవ్వాడు మారుతి. “వాడేం చేయగలడు స్వామీ ఆ తల్లిని. అమె కన్నెర్ర చేస్తే రావణుడూ, లంకా క్షణంలో మసై పోరూ. పరమ దయార్ద్రమైన మనసు సీతమ్మది. ఆ పని ఆమె చేయదు” అన్నాడు హనుమ.
“ఎందుకని?” అని బుస కొడుతున్నట్లు అడిగాడు లక్ష్మణుడు. ఆ ప్రశ్న నిండా రావణుడి మీద కసి.
“ఎందుకంటే, ఆ శ్రేయము తన భర్తకు దక్కాలి కాబట్టి” అన్నాడు హనుమ. మంత్రానికి పాము పడగ దించుకున్నట్లు చల్లబడ్డాడు లక్ష్మణస్వామి!
“హనుమా! నా ప్రాణమూ, సీత ప్రాణమూ కాపాడావయ్యా నువ్వు! నువ్వు నాకు ప్రాణబంధుడివి! ఈ జన్మకు ఆ బ్రహ్మదేవుడు నిన్ను కేవలం నా కోసమే సృష్టించి పంపాడు. నీకు నేనేమి ప్రత్యుపకారం చేయగలను. నీ ఋణం ఎట్లా తీర్చుకోగలను. ఇట్లారా! ఒక్కసారి గాఢంగా నిన్ను కౌగిలిచుకోనియ్యి!” అని హనుమను దగ్గరకి తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు రాముడు. పరవశంతో ఆ కౌగిట్లో కరిగిపోయాడు హనుమ.
చంద్రుడు మరింత కాంతితో వెన్నెల కురిపించాడు ఆ రాత్రి! ఆకాశచరులైన దేవతలూ, సిద్ధమునులూ ఆ దృశ్యం చూస్తూ తమ మోదాశ్రువులూ సేసలూ చల్లారు వారి మీద. చెట్లు జలజలా పూలు రాల్చాయి. మందంగా హాయిగా వీచాడు వాయువు. లోకాలన్నీ రసాంబితమై పరవశించాయి వారి ఆత్మీయమైన కౌగిలిని చూస్తూ!